విద్యార్ధులు పాఠశాల స్థాయి నుంచే మాదక ద్రవ్యాలతో వచ్చే అనర్ధాలు, నష్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని ప్రత్తిపాడు సిఐ కిషోర్ బాబు సూచించారు. గురువారం శంఖవరం మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూలులో ఏర్పాటు చేసిన ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాదక ద్రవ్యాలు ఒక వ్యక్తిని ఏవిధంగా నాశనం చేస్తాయో, వాటి భారిన పడితే జీవితంలో ఎంత నష్టపోతామనే విషయాలను సిఐ విపులంగా తెలియజేశారు. ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ద్వారా గంజాయి, నాటుసారా రవాణాను నియంత్రిస్తున్నదన్నారు. గ్రామాల్లో ఇలాంటి మాదక ద్రవ్యాల వినియోగం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లేదంటే..14500కి ఫోన్ చేయాలన్నారు. ఎస్ఐ అజయ్ బాబు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
గంజాయి, కొకైన్, మత్తుఇంజక్షన్లు, బ్రౌన్ షుగర్ వంటి వాటిపైనా వాటి వలన జరిగే అనర్ధాలపైనా విద్యార్ధులు అవగాహన పెంచుకోవడం ద్వారా మరింత మందికి తెలియజేయడానికి అవకాశం వుంటుందన్నారు. అదేవిధంగా మత్తు పదార్ధాల వినియోగాన్ని నియంత్రించడానికి అవకాశం వుంటుందన్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష, పిఎస్ఎస్.కళాంజలి, గౌతమి, నాగమణిలు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల్లోని రాకాలను చిత్రాల ద్వారా వివరించి, వాటి వలన జరిగే నష్టాలతో తల్లిదండ్రులు ఏవిధంగా బాధపడతారనే అంశాలను తెలియజేశారు. ఇతర మహిళాపోలీసులు రమ్య, చిన్నారి, నీలిమ, స్వర్ణలత తదితరులు వివిధ మాదక ద్రవ్యాలు, వాటివలన కలిగే నష్టాలను, వాటికి సంబంధించిన గోడపత్రికలతో విద్యార్ధులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది కిరోన్, కోటేశ్వర్రావు, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.