జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని రాష్ట్ర అధికార ప్రతినిధి యలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ సుందరపు విజయ్ కుమార్ అన్నారు. మంగళవారం హరిపురంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వారాహి 3వ విడత యాత్ర ఈ నెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగుతుందన్నారు. 10వ తేదీన విశాఖపట్నంలో ప్రారంభమై అదే రోజు సాయంత్రం జగదాంబ జంక్షన్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. దానితో పాటుగా జనవాణి కార్యక్రమం కూడా జరుగుతుందన్నారు. అధికార వైసీపీ పార్టీ అవినీతి, భూకబ్జాలు ఎక్కడ బయటపడతాయనో భయంతో గతంలో జనవాణి కార్యక్రమం జరగకుండా అడ్డుకున్నారని ఇలాంటి ఎన్ని కుయుక్తులు పన్నినా ఈసారి మటుకు ఖచ్చితంగా జనవాణి కార్యక్రమం కూడా జరగడంతో పాటుగా కొంతమంది అధికార పార్టీ నేతల కనుసన్నలలో అక్రమాలు జరిగిన విస్సన్నపేట భూములను కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం ఉందన్నారు. డేటా చోరీతో పాటుగా వాలంటీర్ల శ్రమను దోచుకుంటుందని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తే నియోజకవర్గ శాసనసభ్యులు యువి రమణమూర్తి రాజుతో పాటుగా మరో ప్రజాప్రతినిధి కూడా పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేశారని మరి అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం గ్రామ సచివాలయంలో వాలంటీర్ ద్వారా జరిగిన అక్రమాన్ని గురించి ఎమ్మెల్యే ఎందుకు నోరు మెదపడం లేదని విమర్శలు గుప్పించారు.
ఇప్పటికీ కూడా యలమంచిలి నియోజకవర్గములో అధికార పార్టీ నేతలలో వర్గ పోరు నడుస్తుందని ప్రస్తుత ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అభివృద్ధి ఎక్కడా కనిపించని దుస్థితి ఏర్పడిందని ఘాటుగా విమర్శించారు. తాను ఇన్నాళ్లు అధికారంలో లేకపోయినా ప్రజలకోసం నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో ప్రజలకి తోడుగా ఉన్నానన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చుతాపురం మండల మాజీ జడ్పిటిసి సభ్యులు జనపరెడ్డి శ్రీనివాసరావు, యలమంచిలి మున్సిపాలిటీతో పాటుగా మండలాల అధ్యక్షులు బైలపూడి శ్రీరామదాసు, పప్పల నూకన్న దొర, టెక్కలి పరశురాం, బొద్దపు శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకులు గుర్రాల శేఖర్, ఇతర నాయకులు లాలం సోము నాయుడు, కార్యదర్శులు చోడపల్లి ప్రసాద్, నాని, బుల్లిబాబు, చొప్ప శ్రీను, కొలగాని భాస్కర్, వీర మహిళ సుందరపు సత్యవతి, జనసైనికులు పాల్గొన్నారు.