1 ENS Live Breaking News

తిరుమల శ్రీవారికి స్వర్ణకఠారి విరాళం..

తిరుమల శ్రీవారికి సోమవారం స్వర్ణకఠారి విరాళంగా అందింది. హైదరాబాదుకు చెందిన దాత  ఎం.ఎస్.ప్రసాద్ ఈ మేరకు స్వర్ణకఠారిని ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి అదనపు ఈఓ  ఎవి.ధర్మారెడ్డికి అందించారు.  ఈ స్వర్ణకఠారిని 2 కిలోల బంగారు, 3 కిలోల వెండితో తయారు చేశారని, దీని విలువ ఒక కోటి రూపాయలకు పైగా ఉండొచ్చని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, తను శ్రీవారికి స్వర్ణకఠారిని ఇస్తానని మొక్కుకున్నానని ఇప్పటి స్వామివారి మొక్కు తీరిందని అన్నారు. స్వామి దయతో కరోనా వైరస్ పూర్తిగా నశించి జనజీవనం సాధారణ స్తితికి రావాలని కోరుకుటున్నానని అన్నారు. కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-19 14:53:41

తిరుమ‌ల‌కు ప్లాస్టిక్ బాటిళ్లు తేవద్దు..

తిరుమల ప‌విత్ర‌త‌ను, స్వ‌చ్ఛ‌త‌ను కాపాడేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామ‌ని, భ‌క్తులు ఈ విష‌యాన్ని గుర్తించి ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్లు తీసుకురావ‌ద్ద‌ని టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం వివిధ విభాగాల అధికారుల‌తో అద‌న‌పు ఈవో స‌మావేశం నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌కు ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్లు చేర‌కుండా అలిపిరి చెక్‌పాయింట్ వ‌ద్ద త‌నిఖీలు చేసి వాటిని తొల‌గిస్తామ‌న్నారు. తిరుమ‌ల‌లోని దుకాణాల్లో ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్ల‌ను విక్ర‌యించ‌కూడ‌ద‌న్నారు. వీటికి ప్ర‌త్యామ్నాయంగా గాజు, కాప‌ర్‌, స్టీల్ వాట‌ర్ బాటిళ్లు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచాల‌ని కోరారు. 2 నెల‌ల్లో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధానికి తిరుమ‌ల స్థానికులు, వ్యాపారులు స‌హ‌క‌రించాల‌న్నారు. భ‌క్తుల అవ‌స‌రాల కోసం అన్ని కాటేజీల్లో జ‌ల‌ప్ర‌సాదం తాగునీరు, జ‌గ్గులు, గ్లాసులు ఏర్పాటు చేశామ‌న్నారు. స‌ద‌రు జ‌గ్గులు, గ్లాసుల‌ను ప్ర‌తిరోజూ శుభ్రం చేస్తున్న‌ట్టు చెప్పారు.   ఈ స‌మావేశంలో టిటిడి ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ సునీల్‌, డెప్యూటీ ఈవోలు  విజ‌య‌సార‌థి,  హ‌రీంద్ర‌నాథ్‌,  లోక‌నాథం,  భాస్క‌ర్‌, ఇఇలు  శ్రీ‌హ‌రి,  మ‌ల్లికార్జున‌ప్ర‌సాద్‌, డిఇ  స‌ర‌స్వ‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-19 13:46:38

శ్రీవారి రూ.300 దర్శన టిక్కెట్లు విడుదల..

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం ఆగస్టు నెల కోటా రూ.300 టిక్కెట్లు రేపు(మంగళవారం) ఉదయం 9గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. భక్తుల సౌకర్యార్ధం 5వేల టిక్కెట్లను రేపు ఉదయం ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నామన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు వీటిని ఆన్ లైన్ లో ముందస్తుగా బుక్ చేసుకోవాలని టిటిడి అధికారులు కోరతున్నారు. ప్రతీరోజూ 5వేట టిక్కెట్లను భక్తుల కోసం ఆన్ లైన్ లో ఉంచతున్నట్టు ప్రకటించిన టిటిడి ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది.

Tirumala

2021-07-19 13:18:19

రాష్ట్రాలకు కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు..

 కొవిడ్‌-19 థ‌ర్డ్ వేవ్ ముంచుకొస్తుంద‌న్న ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో రాష్ట్రాల‌కు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీల‌క సూచ‌న‌లుచేసింది. ఆరోగ్య మౌలిక స‌దుపాయాల‌ను మెరుగుపెర‌చాల‌ని, పిల్ల‌ల కోసం స‌రిప‌డా ప‌డ‌క‌ల‌ను అందుబాటులో ఉంచ‌డంతో పాటు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాల‌పై దృష్టి సారించాల‌ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల‌ను కోరింది. రూ 23,123 కోట్ల‌తో ఇటీవ‌ల ప్ర‌క‌టించిన భార‌త కొవిడ్‌-19 అత్య‌వ‌స‌ర స్పంద‌న, ఆరోగ్య వ్య‌వ‌స్ధ‌ల స‌న్న‌ద్ధ‌త ప్యాకేజ్ కింద చేసిన ఏర్పాట్ల‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం స‌మీక్షించింది. ఈ సంద‌ర్భంగా ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శులు అన్ని రాష్ట్రాల వైద్యాధికారుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపింది. కొవిడ్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం, కాంటాక్టుల‌ను గుర్తించి చికిత్స చేయ‌డం, ఐసోలేట్ చేయ‌డం వంటి చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేయాల‌ని కోరింది. కీల‌క ఔష‌ధాలు, టెస్టింగ్ కిట్స్‌, పీపీఈ కిట్ల ల‌భ్య‌తను పెంపొందించుకోవాల‌ని కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల‌ను కోరింది.

New Delhi

2021-07-15 16:00:03

తిరుమలలో అత్యుత్తమ సాంకేతిక భద్రత..

ప్రపంచప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ భద్రతా వ్యవస్థను రూపొందించిన‌ట్లు టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుమలలోని పిఏసి-4లో గ‌ల కామన్‌ కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్‌ను మంగ‌ళ‌వారం ఉద‌యం ఈవో, అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లో భ‌ద్ర‌తా మ‌రియు నిఘా వ్య‌వ‌స్థలు చాల బాగుంద‌న్నారు. కామన్‌ కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్‌ను శాశ్వ‌త‌ భ‌వ‌నంగా పిఏసి-4లో ఏర్పాటు చేసేందుకు అవ‌స‌మైన చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. ఇజ్రాయ‌ల్ టెక్నాల‌జీతో కూడిన భ‌ద్రాత వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసేందుకు గ‌ల అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తామ‌ని చెప్పారు. తిరుమ‌ల‌ను నేర ర‌హిత పుణ్య‌క్షేత్రంగా తీర్చిదిద్ధేందుకు టిటిడి భ‌ద్రాత సిబ్బంది అంకిత భావంతో ప‌నిచేస్తున్నార‌ని అభినందించారు. త్వ‌ర‌లో మ‌రిన్ని సిసి కెమెరాలు ఏర్పాటు చేసి కామన్‌ కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాల‌న్నారు. త‌ద్వారా మ‌రింత ప‌టిష్ఠ‌మైన‌ భద్రత వ్య‌వ‌స్థ‌ను తిరుమ‌ల‌లో ఏర్పాటు చేయాల‌ని సివిఎస్వోను కోరారు.  

       అంత‌కుముందు సివిఎస్వో  గోసినాథ్‌జెట్టి మాట్లాడుతూ ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో అన్ని ప్రాంతాల‌లోని 1654 సిసి కెమ‌రాలు ఉన్నాయ‌ని, వీటిలో 1530 సిసిటివిల‌ను కామన్‌ కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్‌కు అనుసంధానించిన‌ట్లు తెలిపారు. ఇందులో ఎక్క‌డ క్రైమ్ జ‌రిగిన వెంట‌నే ద‌గ్గ‌ర‌లోని మొబైల్ భ‌ద్ర‌తా సిబ్బంది ట్యాబ్‌కు మేసేజ్ వెళ్లుతుంద‌ని, త‌ద్వార త‌క్కువ స‌మ‌యంలో అక్క‌డ‌కు చేరుకుని నేరాల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని చెప్పారు. భ‌క్తుల ర‌ద్ధీ ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో సిసి కెమ‌రాల ప‌నితీరును, శేషాచ‌ల అడ‌వుల్లోని వ‌న్య‌మృగాల సంచారం, అవి రోడ్ల‌పైకి, జ‌న సంచారం ఉన్న ప్రాంతాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు సిసిటివిలో రికార్డు అయిన వేంట‌నే, అటోమేటిక్‌గా ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన సైర‌న్‌లు మ్రోగి జంతువులు అడ‌విలోకి వెళ్లిపోయే విధానాని, తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నం, వ‌స‌తి మ‌రియు ల‌డ్డూల ద‌ళారుల‌ను, దొంగ‌ల‌ను ప‌ట్టుకోవ‌డం, త‌ప్పిపోయిన వారి ఆచూకీ క‌నుగొని వారి బంధువుల‌కు అప్ప‌గించుటకు సంబంధించిన‌ వీడియో క్లిపింగ్‌ల‌తో వివ‌రించారు.

        అనంత‌రం ఈవో విధి నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌త్యేక ప్ర‌తిభ క‌న‌ప‌ర‌చిన 29 మంది పురుషులు, ఒక మ‌హిళ మొత్తం 30 మంది టిటిడి నిఘా మ‌రియు భ‌ద్ర‌తా సిబ్బందిని అభినందించి, న‌గ‌దు బ‌హుమ‌తిని అందించారు. త‌రువాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని సిసిటివిల‌ ప‌నితీరును కూడా ప‌రిశీలించి, ప‌లు సూచ‌న‌లు చేశారు.  తిరుమ‌ల న‌డ‌క‌దారిలోని ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యం నుండి ఏడ‌వ మైలు వ‌ద్ద ఉన్న శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామివారి విగ్ర‌హం వ‌ర‌కు మెట్ల మార్గంలో ఈవో న‌డిచి వెళ్ళి అక్క‌డ జ‌రుగుతున్న‌ ప‌నుల‌ను ప‌రిశీలించారు. అభివృద్ధి ప‌నుల‌ను మ‌రింత నాణ్య‌త ప్ర‌మాణాల‌తో, వేగంగా పూర్తి చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. అదేవిధంగా అలిపిరి పాదాల మండ‌పం పైభాగంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప‌రిశీలించారు. ఈ ఏడాది అక్టోబ‌ర్ నెలలో శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు ఉన్నందున సెప్టెంబ‌ర్‌ నాటికి  ప‌నులు పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

       టిటిడి అట‌వీ విభాగం ఆధ్వ‌ర్యంలో ఏడ‌వ మైలు వ‌ద్ద శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామివారి విగ్ర‌హం వ‌ద్ద ఏర్పాటు చేస్తున్న ఉద్యాన‌వ‌నాల‌ను ఈవో ప‌రిశీలించి, ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా డిఎఫ్‌వో  చంద్ర‌శేఖ‌ర్ పెంచుతున్న మొక్క‌ల‌ను గురించి ఈవోకు వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో సిఈ  నాగేశ్వ‌ర‌రావు, విజివో బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-13 10:54:37

13న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం..

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 16వ తేదీన సాల‌క‌ట్ల ఆణివార ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని జూలై 13న‌ మంగళవారం  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఈ సంద‌ర్భంగా ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం భ‌క్తుల‌ను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

Tirumala

2021-07-09 12:37:09

అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం..

తిరుమలలోని శ్రీవారి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకి హైదరాబాద్‌కు చెందిన‌ భవ్యా గ్రూప్ చైర్మన్  ఆనంద్ ప్రసాద్ రూ. కోటి రూపాయ‌లు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళంగా అందించారు. బుధవారం ఈ మేరకు దాత ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో  అదనపు ఈవో  ఎ.వి. ధర్మారెడ్డికి దాత డిడిని అందజేశారు. తమవంతుగా శ్రీవారి భక్తులకు అన్నదానం చేయాలని దాతలు కోరారు. సాధారణ భక్తులకు శ్రీవారి సేవలను, దర్శనాలను మరింత చేరువ చేయాలని దాతలు ఈఓని కోరారు. కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-07 13:29:30

New Delhi

2021-07-06 16:55:06

రావ‌ణ సంహారం స‌ర్గ‌ల పారాయ‌ణం..

కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని వ‌సంత మండపంలో రామాయ‌ణంలోని యుద్ధ‌కాండ పారాయ‌ణంలో భాగంగా జూలై 6వ తేదీన‌ రావ‌ణ సంహారం స‌ర్గ‌ల పారాయ‌ణం చేయ‌నున్న‌ట్లు టిటిడి అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మ‌రెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో శ‌నివారం ఉద‌యం ఆయ‌న అధికారులు, పండితుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ వ‌సంత మండ‌పంలో జూన్ 11న ప్రారంభ‌మైన రామాయ‌ణంలోని యుద్ధ‌కాండ పారాయ‌ణంకు ప్ర‌పంచ వ్యాప్తంగా భ‌క్తుల నుండి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తొంద‌న్నారు. ఇందులో భాగంగా జూలై 6న రావ‌ణ సంహారం స‌ర్గ‌ల పారాయ‌ణం సంద‌ర్భంగా ఎస్వీబీసీ ప్ర‌సారంలో ప్ర‌త్యేక గ్రాఫిక్స్, వ‌సంత మండ‌పంలో అశోక‌వ‌నంను త‌ల‌పించే సెట్టింగ్‌లు ఏర్పాటు చేయాల‌న్నారు. యుద్ధ‌కాండ‌ 109 నుండి 114 వ‌ర‌కు ఉన్న 270 శ్లోకాల‌ను పారాయ‌ణం చేస్తార‌ని చెప్పారు. ఇందులో 111వ స‌ర్గ 14వ శ్లోకంలో శ్రీ రామ‌చంద్ర‌మూర్తి రావ‌ణునిపై బాణం ఎక్కు పెట్ట‌డంతో ప్రారంభ‌మై, 19వ శ్లోకంలో వ‌ధించ‌డంతో పూర్త‌వుతుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక హార‌తి కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయాల‌ని చెప్పారు.

        రామ‌ణ సంహారంపై శ్రీ తాళ్ళ‌పాక అన్న‌మాచార్యుల‌వారు ర‌చించిన కీర్త‌న‌ల‌ను అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు ఆల‌పిస్తార‌ని వివ‌రించారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్నిఉద‌యం 8.30 గంట‌ల నుండి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంద‌ని తెలిపారు. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని హార‌తులు ఇచ్చి స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసీ సిఈవో  సురేష్‌కుమార్, ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్  కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని, ఎస్వీ ఉన్న‌త వేద అధ్య‌య‌న‌ సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, వేద పండితులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-03 11:08:09

శ్రీ‌వారి ద‌ర్శ‌నం వాయిదా వేసుకోవ‌చ్చు..

తిరుమ‌ల శ్రీ‌వారి అర్జిత సేవా (వర్చువల్) టికెట్లు క‌లిగిన గృహ‌స్తులు శ్రీ‌వారి  దర్శనం వాయిదా వేసుకునే అవ‌కాశం టిటిడి క‌ల్పించింది. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 21 నుండి జూన్ 30వ తేదీల మ‌ధ్య  వ‌ర‌కు వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లు పొందిన భ‌క్తులు బుకింగ్ తేదీ నుండి సంవత్సరంలోపు శ్రీ‌వారి దర్శనం చేసుకోవ‌చ్చు. భక్తులు ఈ మార్పును గమనించి, ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని టిటిడి కోరుతుంది.

తిరుమల

2021-07-02 15:46:41

వైద్య రంగానికి అధికంగా నిధులు..

 కొవిడ్‌-19 విపత్తు వేళ దేశ వ్యాప్తంగా నిశ్వార్ధంగా సేవలందించిన వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రధాని  ప్రసంగించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు రాత్రింబవళ్లు శ్రమించారని..దానిని జాతి గుర్తుంచుకుంటుందన్నారు. దేశవ్యాప్తంగా  ఆరోగ్య రంగానికి బడ్జెట్‌ కేటాయింపులను రెట్టింపు చేశామని చెప్పిన మోడీ ఆరోగ్య మౌలిక సౌకర్యాల కల్పనకు కేంద్రం తోడ్పాటు ఇస్తుందని వివరించారు. ఆరోగ్య మౌలిక సౌకర్యాలకు రూ.50వేల కోట్ల రుణ హామీ పథకం తెచ్చినట్లు తెలిపారు. వైద్యులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇతర దేశాలతో పోలిస్తే వైద్యరంగంలో భారత్‌ మెరుగ్గానే ఉందని ప్రధాని స్పష్టం చేశారు.

New Delhi

2021-07-01 15:12:56

శ్రీ‌వారి భ‌క్తుల‌కు పారదర్శక సేవ‌లు..

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు మ‌రింత పారదర్శక సేవలు అందించేందుకు టిటిడి కౌంట‌ర్ల‌ను మ‌రింత నైపుణ్యంతో నిర్వ‌హించ‌నున్న‌ట్లు అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. ఇందుకుగాను వృత్తి నిపుణ‌త క‌లిగిన ఏజెన్సీల ద్వారా నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు. ఇందులో భాగంగా గురువారంనాడు తిరుమ‌ల‌లోని ల‌డ్డూ కౌంట‌ర్లలో ఆయ‌న పూజ‌లు నిర్వ‌హించి ఏజెన్సీ సిబ్బందితో ల‌డ్డూ కౌంట‌ర్లలో సేవ‌ల‌ను ప్రారంభించారు.  అనంత‌రం ఆయన మీడియాతో మాట్లాడుతూ టిటిడిలో భ‌క్తుల‌కు విశేష సేవ‌లందిస్తున్న ప‌లు  కౌంట‌ర్ల‌ను మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా, వృత్తి నిపుణ‌త‌తో నిర్వ‌హించే ఏజెన్సీల‌ను అహ్వానించామ‌న్నారు. ఇందులో బెంగుళూరుకు చెందిన‌ కెవిఎం ఎన్‌ఫో అతి తక్కువ ధరకు టెండ‌రు వేసింద‌న్నారు. ఇకపై తిరుమ‌లలోని ల‌డ్డూ కౌంట‌ర్లు, క‌ల్యాణ క‌ట్ట త‌ల‌నీలాలు స‌మ‌ర్పిచే భ‌క్తులకు టోకెన్లు ఇచ్చే కౌంట‌ర్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ద‌ర్శ‌నం టికెట్లు స్కానింగ్ కౌంట‌ర్లు, తిరుప‌తిలోని ఎస్‌ఎస్‌డి కౌంట‌ర్లు, అలిపిరి టోల్‌గేట్ వ‌ద్ద ఉన్న కౌంట‌ర్లు ఈ ఏజెన్సీ చేత నిర్వహించబడతాయ‌న్నారు.

       తిరుమల, తిరుప‌తిల‌లో యాత్రికులకు సేవ‌లందించే 164 కౌంటర్ల‌లో మూడు షిఫ్టులలో నడపడానికి 430 మంది సిబ్బంది అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. కౌంట‌ర్ల‌లో విధులు నిర్వ‌హించే సిబ్బందికి ఒక వారం పాటు శిక్షణ ఇచ్చామ‌న్నారు. వారి వేతనాలు ప్రభుత్వ కనీస వేతన నిబంధనల ప్రకారం ఉంటాయ‌ని, ఇపిఎఫ్, ఇఎస్ఐ ప్రయోజనాలు క‌ల్పిస్తామ‌ని చెప్పారు. కౌంట‌ర్ల‌లో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు రోటేష‌న్ ప‌ద్ధ‌తిలో వారం వారం ఈ సిబ్బందిని మార్చ‌నున్న‌ట్లు వివ‌రించారు. అనంత‌రం ఆయ‌న ల‌డ్డూ కౌంట‌ర్ల‌లో ల‌డ్డూల పంపీణిని ప‌రిశీలించారు. అనంత‌రం బూంది పోటును ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాధ్‌, పోటు పేష్కార్  శ్రీ‌నివాసులు, విజివో  బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-01 12:00:18

శ్రీ‌వారికి రూ.కోటి ప‌దార్థాల విరాళం..

తిరుమ‌ల శ్రీ‌వారికి గో వ్య‌వ‌సాయ ఆధారిత వంట ప‌దార్థాల‌తో సంపూర్ణ నైవేద్యం స‌మ‌ర్పించేందుకు వీలుగా దాదాపు ఒక కోటి రూపాయ‌లు విలువైన వంట దినుసులు బుధ‌వారం విరాళంగా అందాయి. టిటిడి మాజీ బోర్డు స‌భ్యులు, మై హోమ్ గ్రూపు అధినేత  జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు ఈ మేర‌కు హైద‌రాబాద్‌లోని త్రిదండి చిన్న‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మం నుంచి ఈ వంట‌ప‌దార్థాల‌ను పంపారు. టిటిడి మాజీ బోర్డు స‌భ్యులు  శివ‌కుమార్ ఈ వ‌స్తువుల‌ను తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం ఎదుట ఆల‌య అధికారుల‌కు అంద‌జేశారు. వీటిలో 6200 కిలోల బియ్యం, 1500 కిలోల దేశీ ఆవునెయ్యి, 600 కిలోల బెల్లం, 17 కిలోల బాదాం, 315 కిలోల జీడిప‌ప్పు, 21 కిలోల కిస్‌మిస్‌, 85 కిలోల ఆవాలు, 18 కిలోల మెంతులు, 20 కిలోల ప‌సుపు, 25కిలోల ఇంగువ‌, 380 కిలోల పెస‌ర‌ప‌ప్పు, 200 కిలోల శ‌న‌గ ప‌ప్పు, 265 కిలోల మినుములు, 350 కిలోల చింత‌పండు, 50 కిలోల రాక్ సాల్ట్‌, 375 కిలోల నువ్వుల నూనె, 7 కిలోల నువ్వులు, 10 కిలోల శొంఠి ఉన్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి పోటు పేష్కార్ శ్రీ‌నివాసులు, ఆల‌య ఓఎస్‌డి పాల శేషాద్రి, ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతు విజ‌య‌రామ్‌, వేద పాఠ‌శాల ప్రిన్సిపాల్ కెఎస్ఎస్‌.అవ‌ధాని, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2021-06-30 13:45:55

పీవీ జాతి గర్వించదగ్గ రాజనీతిజ్ఞుడు..

పాములపర్తి వెంకట నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదుడు అని  ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శతజయంతి సందర్భంగా విశాఖలోని సర్క్యూట్ హౌస్ వద్ద ఆయన విగ్రహానికి రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకత్వం వహించిన క్రాంతదర్శిగా  పీవీని అభివర్ణించారు. ఆయన నాయకత్వం , దూరదృష్టి ద్వారా ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని అభివృద్ధి పథంలోకి మరలించారని తెలిపారు. పీవీ మాటల్లో చమత్కారం, చేతల్లో నిర్వహణా సామర్థ్యం మరువలేనివని తెలిపారు. దేశంలో లైసెన్స్ రాజ్ ను రద్దు చేసిన ఘనత  పీవీ నరసింహారావుదన్న ఉపరాష్ట్రపతి, భారత ఆర్థిక సరళీకరణల నిర్మాతగా అభివర్ణించారు. ముఖ్యంగా, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.వో)లోకి  భారతదేశ ప్రవేశానికి వీలు కల్పించినది ఆయనేనని అన్నారు.  ప్రపంచ యవనికపై దేశ ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించిన  పీవీ, ఎంతో క్లిష్టమైన సమయంలో దేశ పాలనా పగ్గాలను చేపట్టి, వ్యూహాత్మకంగా దేశాభివృద్ధిని గాడిలో పెట్టారని తెలిపారు.  పీవీ భాషాభిమానాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, శ్రీ విశ్వనాథ వారి ‘వేయిపడగలు’ నవలను ‘సహస్రఫాణ్’ గా హిందీలోకి అనువదించిన విషయాన్ని ప్రస్తావించారు. అంతేగాక ప్రసిద్ధ మరాఠీ నవల ‘పాన్ లక్షత్ కోన్ ఘేతో’ని ‘అబల జీవితం’ పేరిట తెలుగులోకి అనువదించారని తెలిపారు. బహుభాషా కోవిదుడైన  పీవీ మాతృభాషలో ప్రాథమిక విద్య సాగాలని ఆకాంక్షించారన్న ఉపరాష్ట్రపతి, హైస్కూల్ స్థాయి వరకూ బోధనా మాధ్యమం మాతృభాషగా ఉండాలన్న తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

‘రాజకీయ వ్యవస్థ కంటే దేశమే ఉన్నతమైనదని నమ్మిన దేశభక్తుడైన రాజనీతిజ్ఞుడు’అంటూ  పీవీ గురించి మాజీ రాష్ట్రపతి  కలాం పలుకులను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ఆయన ఈ నేలపై ఘనమైన వారసత్వాన్ని విడిచి వెళ్ళారని, యువతరం వారి నుంచి ప్రేరణ పొంది, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.  పీవీ నరసింహారావు లాంటి గొప్ప నాయకుడి సేవలకు తగిన గుర్తింపు, గౌరవం లభించలేదన్న ఉపరాష్ట్రపతి, ఆయన శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, దేశనిర్మాణంలో  పీవీ కృషిని ముందు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏ దేశం కూడా తన సంస్కృతి, వారసత్వం మరియు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుల అపారమైన సేవలను మరచి ముందుకు సాగలేదన్న ఆయన,  నరసింహారావు లాంటి మహనీయుల జీవితాలను, బోధనలను యువతరానికి తెలియజేయాలని పేర్కొన్నారు.

Visakhapatnam

2021-06-28 09:11:13

తెలుగుభాష పరిరక్షణ ఉద్యమంలా సాగాలి..

తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సమావేశంలో ఆదివారం విశాఖ నుంచి ముఖ్యఅతిధిగా అంతర్జాల వేదిక ద్వారా ప్రసంగించిన ఆయన తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను సగర్వంగా చాటుకునేందుకు తెలుగు వారంతా సంఘటితం కావలసిన అవసరం ఉందని తెలిపారు. అన్ని రకాల తెలుగు సంస్థలను ఏక తాటి మీదకు తీసుకు రావాలన్న రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆశయాన్ని అభినందించారు. మనుషులనే గాక తరాలను సైతం కలిపి ఉంచే గొప్ప శక్తి భాష, సంస్కృతులకు ఉందన్న ఉపరాష్ట్రపతి, మనల్ని సంఘటితంగా కట్టి ఉంచే మొదటి గొలుసు మాతృభూమి అయితే, రెండో గొలుసు భాష-సంస్కృతులని తెలిపారు. తెలుగు రాష్ట్రాల వెలుపల ఉన్న తెలుగు వారు తమ సంస్కతి, సంప్రదాయాలను ముందు తరాలకు అందించేందుకు నడుం బిగించాల్సిన అవసరం ఉందన్న ఆయన,  మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు లాంటి సంప్రదాయాలను పునరుజ్జీవింపచేసుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మనం మన భాషను విస్మరిస్తే మన సంస్కృతి, సాహిత్యం, ఆహార వ్యవహారాలు, అలవాట్లు, కట్టుబాట్లు అన్ని మన ముందు తరాలకు దూరమయ్యే ప్రమాదం ఉందన్న ఉపరాష్ట్రపతి, ఇందు కోసం తెలుగు వారందరూ తెలుగు భాషా పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. మన మాతృభాష, సంస్కృతులను సగర్వంగా ప్రోత్సహించుకోవడమే గాక, ఇతరుల భాషా సంస్కృతులను తప్పని సరిగా గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రాథమిక విద్య మాతృభాషలో సాగడం వల్ల విద్యార్థులు నేర్చుకోవడం సులభతరం అవుతుందన్న ఆయన, నూతన విద్యా విధానం మాతృభాషకు పెద్ద పీటల వేయడం ఆనందించదగిన అంశమని తెలిపారు. మాతృభాషలో చదివితే జీవితంలో ఎదగలేమనే తప్పుడు అపోహ సమాజంలో నాటుకుపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, ప్రస్తుత భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇలా అందరూ మాతృభాషలో విద్యను అభ్యసించి ఎదిగిన వారేనని గుర్తు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల వెలుపల సుమారు వెయ్యికి పైగా సంస్థలు భాష, సంస్కృతుల పరిరక్షణకు పాటు పడుతున్నాయన్న ఉపరాష్ట్రపతి, ఈ సంస్థలన్నీ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ద్వారా ఏకతాటి మీదకు వచ్చి అనేక సంగీత, సాహిత్య, భాషాభివృద్ధి కార్యక్రమాలతో, తెలుగు సమాజ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తున్న వారి చొరవను అభినందించారు. తెలుగు రాష్ట్రాల వెలుపల తెలుగు సంస్కృతిని తమ నివాస ప్రాంతాల్లో విస్తరించేందుకు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య చేస్తున్న కృషి గురించి తెలుసుకుని ఆనందించానన్న ఆయన,  వివిధ రాష్ట్రాల్లో తెలుగు భాషను ఐచ్చిక విషయంగా ప్రోత్సహించడం కోసం వారు చేస్తున్న కృషి ఉన్నతమైనదని తెలిపారు.

భాషాభివృద్ధి కోసం ప్రభుత్వాలు చేస్తున్న కృషి మాత్రమే చాలదన్న ఉపరాష్ట్రపతి, భాషా పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. స్వచ్ఛభారత్ మొదలుకుని వ్యాక్సిన్ వరకూ ప్రజా ఉద్యమంగా మారి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయన్న ఆయన, తెలుగు భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపు దాల్చకపోతే సంరక్షించుకోవడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఇందు కోసం పరభాషా వ్యామోహం నుంచి బయట పడడంతో పాటు తెలుగు వారందరూ తెలుగులోనే మాట్లాడం, ప్రభుత్వాలు మాతృభాషను ప్రోత్సహించేలా ఒత్తిడి తీసుకురావడం అవసరమని తెలిపారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు వెలుపల ఉన్న తెలుగు వారు తమ తమ రాష్ట్రాల్లో భాష-సంస్కృతుల గొప్పతనాన్ని చాటుకునే దిశగా ఆయా రాష్ట్రాల భాషల్లోకి తెలుగు సాహిత్య అనువాదం కోసం చొరవ తీసుకోవాలని సూచించారు. ఇతర భాషా సాహిత్యాలు మన తెలుగులోకి అనువాదమైనంతగా, తెలుగు సాహిత్యం అనువాదం కావడం లేదని, ఇందు కోసం ప్రభుత్వాలతో పాటు తెలుగు సంస్థలు కూడా చొరవ తీసుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య సహా పలు తెలుగు సంస్థలు తమ సమావేశాలను అంతర్జాల వేదిక ద్వారా నిర్వహిస్తుండడం అభినందనీయమన్న ఉపరాష్ట్రపతి, ఇదే స్ఫూర్తితో భాషను, సాంకేతికతతో అనుసంధానించే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్  బండారు దత్తాత్రేయ, బెంగాల్ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. శశి పంజా, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి డా. మండలి బుద్ధ ప్రసాద్, ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ అధ్యక్షులు డా. సి.ఎం.కె.రెడ్డి, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సుందరరావు, కార్యదర్శి  పి.వి.పి.సి ప్రసాద్ తదితరులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-27 06:53:07