గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టరు జిల్లా ఎన్నికల అధికారి వి.వినయ్ చంద్ పిలుపునిచ్చారు. గురువారం తన చాంబర్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజలకు దగ్గరగా ఉండి సేవలందించే ప్రజా ప్రతినిధి సర్పంచ్, వార్డు మెంబర్లేనని, కాలువలు పారిశుద్ద్యం చెరువులు ఇతర అభివృద్ధి పనులకు కీలకంగా ఉండి చర్యలు చేపట్టాల్సిన నాయకులు వారేనని గమనించాలన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించు కోవాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. నర్సీపట్నం డివిజన్ లో 10 మండలాలలో 239 గ్రామపంచాయతీలు 2584 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డివిజన్ లో మొత్తం ఓటర్లు 4 లక్షల 97 వేల 782 మంది కాగా వీరిలో పురుషులు 2 లక్షల 44 వేల 228, స్త్రీలు 2 లక్షల 53 వేల536, ఇతరులు 8 మంది ఉన్నారని, అయితే ఏకగ్రీవ ఎన్నికల అనంతరం ఓటు హక్కును వినియోగించుకునే వారు 4,69,583 మంది. వీరిలో పురుషులు 2,30,252 స్త్రీలు 2,39,313 ఇతరులు 18 మంది ఉన్నారని వివరించారు. 6470 మంది పోలింగ్ అధికారులు పాల్గొంటున్నారని వీరిలో 2653 మంది ప్రిసైడింగ్ అధికారులు కాగా ఏ. పీ.ఓ., ఓ.పి.ఓ.లు 3817 అని చెప్పారు. 10 మండలాలకు సంబంధించి 44 జోన్లు, 69 రూట్లు ఏర్పాటు చేశామన్నారు.261 గ్రామ సర్పంచు లకు గాను 22 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కాగా 239 గ్రామ సర్పంచు పోస్టులకు ఎన్నికలు జరుగుతున్నాయని, బరిలో 581 మంది అభ్యర్థులు ఉన్నారని వెల్లడించారు. 2584 వార్డు మెంబరు పదవులకు 400 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని మిగిలిన 2184 పదవులకు 4641 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని తెలియజేశారు.
జీవిఎంసీ పరిధిలో చేపట్టే ప్రతిపాది పనులపై అధికారులు తక్షణమే నివేదించాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ డా.జి.స్రిజన ఆదేశించారు. గురువారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆరవ జోన్ లో పలు ఇంజనీరింగ్ ప్రతిపాదనలను పరిశీలించారు. మొదటిగా, గోపాలపట్నం రైతుబజార్ లో ఏర్పాటు చేయదలచిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలను అక్కడ వారితో చర్చించి, వారికి అవసరమైన పనులను ప్రతిపాదించాలని ఆరవ జోనల్ స్థాయి అధికారులను ఆదేశించారు. తదుపరి, మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ లో ఏ.డి.బి. ఆర్థిక సహాయం క్రింద రూ.12.50కోట్లతో ఏర్పాటు చేయదలచిన మూడు మెగావాట్ల సోలార్ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ ను పనుల సన్నద్ధత గూర్చి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. సోమవారం నుండి చెప్పిన విధంగా పనులు ప్రారంభించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం, పట్టణ ప్రణాళికకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అసిస్టెంట్ సిటీ ప్లానర్ కు కొన్ని సూచనలు చేసి, వివరాలను తరువాత సమర్పించాలన్నారు. ఈ పర్యటనలో పర్యవేక్షక ఇంజినీర్లు కె.వి.ఎన్.రవి, శివ ప్రసాద రాజు, ఆరవ జోనల్ కమిషనర్ చక్రవర్తి, జోనల్ స్థాయి ఇంజనీరింగ్ మరియు పట్టణ ప్రణాళిక అధికారులు, సోలార్ రెన్యూ పవర్ లిమిటెడ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఎండలు పెరుగుతున్న దృష్ట్యా గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కును ఎండ తీవ్రత పెరగక ముందే ఉదయం వేళల్లో వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ను ఉదయం 6:30 గంటల నుంచి నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం ఎండ వేడిమి జరుగుతున్న దృష్ట్యా ఉదయం వేళల్లోనే ప్రజలంతా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు ఉదయమే వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎండ వేడిమి వల్ల ఎవరూ వడదెబ్బకు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఉదయం వేళల్లో ఓటు వేసేందుకు ప్రజలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కోరారు. జిల్లాలో నాలుగు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, ఇప్పటికే కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో మొదటి దశ పూర్తికాగా, మిగిలిన మూడు దశల్లో ధర్మవరం, కళ్యాణదుర్గం, అనంతపురం, పెనుకొండ రెవెన్యూ డివిజన్లలో ప్రజలు తమ ఓటు హక్కును ఉదయం వేళల్లో వినియోగించుకోవాలన్నారు.
మహా విశాఖ నగర పాలక సంస్థ బడ్జెట్ రూపకల్పనలో ప్రజలను భాగస్వామ్యం కావాలని జీవీఎంసీ కమిషనర్ డా. జి. సృజన ఒక ప్రకటనలో కోరారు. “జనాగ్రహ స్వచ్ఛంద సంస్థ” నిర్వహించే సర్వేకు ప్రజలందరూ కూడా సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. వార్డు కార్యదర్శులు, వాలంటీర్లు ద్వారానే కాకుండా, వెబ్ సైట్ i.e. www.janaagraha.org/vizag లేదా http://bit.ly/CitizenInputForm లింక్ ద్వారా తమ అభిప్రాయాలను, తేది.15-02-2021లోపు తెలుపవలసినది అని కమిషనర్ కోరారు. అత్యధిక శాతం ప్రజలు ఇచ్చిన సూచనలను స్వీకరించి జీవిఎంసీ వాటిని పొందుపరచడానికి ఆస్కారం వుంటుందని ఆమె ఆ ప్రకటనలో కోరారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కార్యాలయాన్ని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి గురువారం ఉదయం ప్రారంభించారు. వర్సిటీ పరిపాలనా భవనానికి ఎదురుగా ఉన్న భవనంలో సిఎస్‌ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ హాస్టల్స్ వద్ద పూర్తిస్థాయిలో బధ్రత చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. వర్సిటీ పరిసరాల్లో నిరంతర పర్యవేక్షణ, నిఘా పెంచాలన్నారు. పూర్తిస్తాయిలో రక్షణ చర్యలు చేపట్టాలని,దీనికి అవసరమైన సహకారాన్ని వర్సిటీ పరంగా అందిస్తామన్నారు.ఈ సందర్భంగా సిఎస్‌ఓ మహ్మద్ ఖాన్‌ను అభినందించారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, డీన్ ఆచార్య టి.షారోన్ రాజు, చీఫ్ ఇంజనీర్ ఆర్.శంకర రావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం, అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలల పరిధిలో ఇంజనీరింగ్ పరీక్షలను మార్చి 4వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.ఆదిలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. బిటెక్, బిఆర్క్, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ మూడో సంవత్సరం ప్రధమ సెమిష్టర్ పరీక్షలు మార్చి 4 నుంచి, రెండవ సంవత్సరం ప్రధమ సెమిష్టర్ పరీక్షలు మార్చి 15 నుంచి, నాల్గవ సంవత్సరం ప్రధమ సెమిష్టర్ పరీక్షలు, బిఆర్క్ ఐదవ సంవత్సరం ప్రధమ సెమిష్టర్ పరీక్షలు మార్చి 26 నుంచి, బిఆర్క్ నాల్గవ సంవత్సరం ప్రధమ సెమిష్టర్ పరీక్షలు మార్చి 30వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఎంటెక్ మూడో సెమిష్టర్ పరీక్షలు ఏప్రియల్ 7 నుంచి ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి.
ఆంధ్రవిశ్వవిద్యాలయం కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యులు సి.హెచ్ ఆశా ఇమ్మానియల్ రాజుకు గ్లోబల్ టీచర్ అవార్డు లభించింది. సమాజాన్ని ప్రభావితం చేసే ప్రభావవంతమైన అధ్యాపకులు, ఆచార్యులను గుర్తించి ప్రతీ సంవత్సరం ఏకెఎస్ ఎడ్యుకేషన్ అవార్డు సంస్థ గ్లోబల్ టీచర్ అవార్డులను ప్రధానం చేస్తోంది. ఈ సంవత్సరం ఆచార్య ఇమ్మానియల్ రాజుకు ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో రాజును అభినందించారు. అనంతరం విసి మాట్లాడుతూ, ఏయూకి మంచి అవార్డులు రావడం అంటే ఆచార్యుల పనితనానికి నిదర్శమని అన్నారు. రానున్న రాజుల్లో మరిన్ని అవార్డులు స్వీకరించి ఏయూకి, ఆచార్యులు మరింత పేరు తీసుకురావాలని కోరారు.
స్మార్ట్ సిటీ నిధులతో జరుగుచున్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జీవీఎంసీ కమిషనర్ డా. జి. సృజన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం, క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఆమె, ఎం.వి.పి.కాలనీ ఎ.ఎస్ రాజా కాలేజ్ గ్రౌండ్ లో నిర్మితమవుతున్న ఆధునిక స్పోర్ట్ ఎరీనా ఇండోర్ స్టేడియం పనులను పరిశీలించి మార్చి నెల ఆఖరికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం, వి.ఎం.ఆర్.డి.ఎ. వుడా పార్క్ ను సందర్శించి స్మార్ట్ సిటీ నిధులతో చేపడుతున్న పలు పనులను పరిశీలించారు. పార్కులో ఆకుపచ్చదనాన్ని మరింతగా పెంచాలని, లైటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసి అన్ని పనులు ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో ప్రధాన ఇంజనీర్ ఎం.వెంకటేశ్వరరావు, పర్యవేక్షక ఇంజనీరు వినయ కుమార్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, స్మార్ట్ సిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మహావిశాఖ నగర పరిధిలోని ప్రతి దుకాణం ముందు రెండు డస్ట్ బిన్ లు ఉండేలా చూడాలని శానిటరీ ఇన్ స్పెక్టర్లను జివిఎంసీ అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు ఆదేశించారు. బుధవారం క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా 2వ జోన్, 15వ వార్డ్ లోని డైమండ్ పార్క్, శ్రీ కన్య థియేటర్ తదితర ప్రాంతాలలో ఏడిసి పర్యటించి డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ ఏ విధంగా చేస్తున్నారో స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. శ్రీ కన్య ఫార్ట్యూన్ ఇన్ హోటల్లో వేస్ట్ కలెక్షన్ మిషన్ ఏ విధంగా పనిచేస్తున్నదని ఆరా తీశారు. అనంతరం నాల్గవ జోన్, 44వ వార్డు జ్ఞానాపురం లోని నికోలస్ వీధి తదితర ప్రాంతాలలో పర్యటించి రోడ్లు, కాలువలు లోని చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. తడి చెత్త-పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య కార్మికులుకు అందించాలని స్థానిక ప్రజలను కోరారు. ప్రతిరోజు కాలువలు, రోడ్లు శుభ్రం చేస్తున్నదీ లేనిదీ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో 15, 44 వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ లతోపాటు వార్డు శానిటరీ కార్యదర్శులు పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 19వ తేదీన నిర్వహించే రథ సప్తమి వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలన జిల్లా కలెక్ట్ జె నివాస్ ఆదేశించారు. రథ సప్తమి వేడుకల ఏర్పాట్లను పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ తో కలసి బుధ వారం సాయంత్రం పరిశీలించారు. రథ సప్తమి వేడుకలు 18వ తేది అర్థ రాత్రి ప్రారంభమై 19వ తేదీ అర్థ రాత్రి వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా సంబంధిత అథికారులతో సమీక్షిస్తూ నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని ఇపిడిసిఎల్ పర్యవేక్షక ఇంజనీరు ఎన్.రమేష్ ను కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా అవసరం మేరకు జనరేటర్లు సిద్ధం చేయాలని సూచించారు. ఆలయంలోపల, క్యూ లైన్లలో సైతం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆ మేరకు ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు. భక్తులకు అవసరం మేరకు వైద్య సేవలు అందించుటకు ఏర్పాట్లు చేయాలని అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావును ఆదేశించారు. ఐదు ప్రదేశాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో రానున్న దృష్ట్యా ఆలయం చుట్టు ప్రక్కల, రహదారులపైనా, నగరంలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నగర పాలక సంస్ధ కమీషనర్ పి.నల్లనయ్యను కలెక్టర్ ఆదేశించారు. తాగు నీటి ఏర్పాట్లను సైతం పర్యవేక్షించాలని అన్నారు.
వేడుకలకు ఇంద్ర పుష్కరిణి, క్యూ లైన్లు, ఆలయం చుట్టు ప్రక్కల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ నివాస్ మీడియాతో మాట్లాడుత సాధారణ భక్తులకు ప్రశాంతంగా దర్శనం కావడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కోవిడ్ దృష్ట్యా భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, కోవిడ్ లక్షణాలు ఉన్నవారు ఇంట్లో ఉండటం ఉత్తమమని సూచించారు. పెద్ద వారికి కోవిడ్ త్వరగా సోకే అవకాశం ఉందని పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు మాస్కులు విధిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శానిటైజ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసారు. వి.ఐ.పిలకు పాస్ ఏర్పాటు చేయుటకు యోచిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. వి.ఐ.పిల పేరుతో అధిక సంఖ్యలో వ్యక్తులు వస్తున్నట్లు గత వేడుకలలో కనిపించిందని అన్నారు. వారి వలన వి.ఐ.పిలకు సైతం ఇబ్బందులు ఎదురు అవుతుందని, ఆలయ అభివృద్ధికి విరాళాలు అందించిన వారికి కూడా దర్శనం ఇబ్బందిగా మారుతుందని పేర్కొన్నారు. పాస్ లు ఏర్పాటు వలన కేవలం వి.ఐ.పి కుటుంబాలు మాత్రమే దర్శనానికి రావడం వలన ఇబ్బంది లేకుండా దర్శనం కలుగుతుందని భావిస్తున్నామని చెప్పారు.
పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ భక్తులకు మంచి దర్శనం కలుగుటకు చర్యలు చేపడుతామన్నారు. ఎన్నికలలో పోలీసు బందోబస్తు ఉంది, రథ సప్తమికి కూడా తగిన బందోబస్తు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఆలయ కార్యనిర్వాహక అధికారి వి.హరిసూర్యప్రకాష్ మాట్లాడుతూ వేడుకలలో పలు స్వచ్చంద సంస్ధలు పాల్గొని సహాయ సహకారాలు అందిస్తాయన్నారు. జిల్లా సత్య సాయి సేవా సంస్ధ భక్తుల సామాన్లు, చెప్పులు భద్రపరచుట, మజ్జిగ, పులిహోరా, తాగు నీటి సరఫరా కార్యక్రమాన్ని చేపడుతుందని చెప్పారు. రథ సప్తమి వేడుకలకు తీసుకున్న చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిశోర్, డి.ఎస్.పిలు ఎం.మహేంద్ర, సి.హెచ్.జి.వి.ప్రసాద్, మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఏ.శ్రీనివాస రావు, జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు డి.శ్రీనివాసు, ఉప కార్యనిర్వాహక ఇంజనీరు గనిరాజు, నగర పాలక సంస్ధ ఇంజనీరు వెంకట్, జిల్ల అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనుబాబు, ఇపిడిసిఎల్ డివిజనల్ ఇంజనీరు పాత్రుడు, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, రోటరీ సభ్యలు మంత్రి వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగులు ఈ నెల 12వ తేదీ లోగా పోస్టల్ బ్యాలెట్ లను పొందాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ తెలిపారు. ఈ మేరకు బుధ వారం ఒక ప్రకటన జారీ చేస్తూ పంచాయతీ రెండవ దశ విధుల్ల ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చని చెప్పారు. విధుల్లో ఉన్న ఉద్యోగులు సంబంధిత రిటర్నింగు అధికారి లేదా మండల పరిషత్ అభివృద్ధి అధికారి నుండి పోస్టల్ బ్యాలెట్ ను తీసుకోవాలని ఆయన స్పష్టం చేసారు. నిర్ధేశిత నిబంధనల మేరకు పూర్తి చేసిన పోస్టల్ బ్యాలెట్ ను సంబంధిత మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులో రెండవ దశ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగు 13వ తేదీ మధ్యాహ్నం 4 గంటల నాటికి వేయాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించు కోవడం అత్యావశ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
శ్రీకాకుళం సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ కోవిడ్ వాక్సిన్ ను బుధవారం వేయించుకున్నారు. జిల్లాలో జనవరి 16వ తేదీన వైద్యులు, వైద్య సిబ్బందికి వాక్సిన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైన సంగతి అందరికి విదితమే. తొలుత ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా ఇచ్చే కార్యక్రమం జిల్లాలో ప్రారంభమై, దశల వారీగా టీకా అందరికి వేయడం జరుగుతుంది. అందులో భాగంగా శ్రీకాకుళం పట్టణంలోని బర్మా కాలనీలో గల అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యు.పి.హెచ్.పి)లో బుధవారం భారత్ బయోటెక్ తయారు చేసిన కో-వాక్సిన్ టీకాను జె.సి వేయించుకున్నారు. బర్మా కాలనీ యు.పి.హెచ్.పి ఎ.ఎన్.ఎం టి.శేషకుమారి ఈ టీకాను సంయుక్త కలెక్టర్ కు వేసారు. కో వాక్సిన్ టీకాను వేయడం జరిగిందని, 28 రోజుల తరువాత మరో డోస్ కో వాక్సిన్ టీకాను వేయించుకోవలసి ఉంటుందని టి.శేషకుమారి సంయుక్త కలెక్టర్ కు సూచించారు. టీకా తీసుకున్నప్పటికి మాస్కుధారణ, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, చేతులు తరచూ శుభ్రపరచుకోవాలని జె.సికు ఆమె సూచించారు. టీకా తీసుకొనుటకు యు.పి.హెచ్.పి కేంద్రానికి చేరుకున్న సంయుక్త కలెక్టర్ కు బర్మా కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యులు డా. నిర్మలా మల్లేశ్వరి, ప్రత్యేక అధికారి పి.వి.యస్.ప్రసాదరావు స్వాగతం పలికి టీకా ఇస్తున్న వివరాలను తెలిపారు. టీకా తీసుకున్న అనంతరం సంయుక్త కలెక్టర్ అబ్జర్వేషన్ రూమ్ లో 30 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎన్.ఎం కె.లలిత కుమారి, ఎ.నిర్మల, ఫార్మాసిస్ట్ ఎ.శాంతిశ్రీ, ల్యాబ్ టెక్నిషీయన్ జి.శ్రీరాములు, సచివాలయ సిబ్బంది పి.సూర్యకళ, ఆశా వర్కర్ కె.పావని తదితరులు పాల్గొన్నారు.
ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ బరిలో మాజీ సైనికుడు, ప్రభుత్వ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ పేరు ఉపాధ్యాయ వర్గాలలో బలంగా వినిపిస్తుంది. ఉభయగోదావరి జిల్లాలలో ఉపాధ్యాయ సంఘాలలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఒక సంఘం విశ్వనాథ్ పేరును ఖరారు చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న విశ్వనాథ్ ఎన్నికల బరిలో ఉంటే గెలుపు ఖాయమని ఇప్పటికే పలువురు ఉపాధ్యాయులు విశ్వనాథ్ ను కలిసి తమ మద్దతు కూడా ప్రకటిస్తున్నారు. వివరాలు తెలుసుకుంటే తూతిక శ్రీనివాస విశ్వనాథ్ 15 సంవత్సరాలు ఇండియన్ నేవీ మిలటరీలో దేశానికి సేవలందించారు. మాజీ సైనికుడైన విశ్వనాథ్ 2007 సంవత్సరం గ్రూప్ 1 అదికారిగా ఎంపికై మండల పరిషత్ అభివృద్ధి అదికారిగా ఉభయగోదావరి జిల్లాలలో అనేక మండలాలలో సేవలందించి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఉద్యోగభందుగా పేరున్న విశ్వనాథ్ ప్రజా సమస్యలు, ఉద్యోగ సమస్యలపై అనేక సంధర్భాలలో ఉద్యమాలు చేసి తన ప్రత్యేకత చాటుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను విశ్వనాథ్ అనేక సంధర్భాలలో ఎండగట్టి ఉద్యోగ ఉపాద్యాయ పక్షపాతిగా నిలిచారని చెపచ్చు. ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రభుత్వ కాంట్రిబ్యూటరీ పించన్ విదానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విశ్వనాథ్ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తనదైన శైలిలో ఉద్యమించిన తీరు అభినందనీయమని ఉద్యోగ ఉపాధ్యాయ సమాజం ఇప్పటికి గుర్తు చేసుకుంటుంటారు. బిజినెస్ మ్యానేజ్మెంటులో, న్యాయ శాస్త్రంలో మాస్టర్ పట్టా పొందిన విశ్వనాథ్ విద్యాదికుడిగా పేరుంది. తన సేవాకాలంలో చాలా మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక విషయాలలో సహకరించడం, సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం అందరికి తెలిసిందే. సమస్య ఏదైనా ఎవరిదైనా తన సొంత పనిగా భావించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలలో అభిప్రాయము ఉంది. గత మూడు దశాబ్దాలుగా సామాజిక ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన విశ్వనాథ్ ప్రస్తుతం అనేక సంఘాలలో యాక్టివ్ పాత్ర పోషిస్తు సంభందిత వర్గాలకు న్యాయం చేస్తున్నారు. యం.పి.డి.ఓ గ్రూప్1 అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ గా, తూర్పుగోదావరి జిల్లా బిసి ఉద్యోగుల సంఘం కార్యధర్శిగా, బిసి జనసభ రాష్ట్ర కార్యధర్శిగా, యస్సీ, యస్టీ, బీసి, మైనారిటీ ఉద్యోగ, ఉపాద్యాయ జెఏసి జిల్లా గౌరవ అద్యక్షుడిగా, మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అద్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర ప్రదాన కార్యధర్శిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ప్రైవేట్ రంగం రిజర్వేషన్ సాధన సమితి జిల్లా అద్యక్షుడిగా, ఇలా పలు ఉద్యోగ, ప్రజా సంఘాలలో సేవలందిస్తున్న విశ్వనాథ్ పేద, బడుగు బలహిన వర్గాల పక్షపాతిగా పేర్గాంచారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సహాయికుల సంక్షేమం కోసం, సాంకేత నిపుణులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల బద్రత కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వేలాది మంది ఉద్యోగులతో 'మహా నిరాహార దీక్ష' చేసి జిల్లా యంత్రాంగాన్ని, ప్రభత్వాన్ని కదిలించి ఉద్యోగాలు కోల్పోయిన 450 మందికి తిరిగి ఉద్యోగాలు ఇప్పించి ఉద్యోగుల మన్ననలు పొందారు. యస్సీ, యస్టీ వర్గాలు సామాజిక వివక్షను ఎదుర్కుంటున్నారని అంబేడ్కర్ ఆలోచన విదానం ఫౌండేషన్ తరుపున "ఉత్తరాల ఉద్యమానికి' శ్రీకారం చుట్టి రిజర్వేషన్లు అనుభవిస్తున్న యస్సీ యస్టీ యం.పిలు, యం.యల్.ఏలు పార్లమెంటులో, అసంబ్లీలో దళిత, గిరిజన సమస్యలపై తమ గళం విప్పాలని డిమాండ్ చేసారు. తూర్పుగోదావరి జిల్లాలో యస్సీ, యస్టీ ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు నాయకులు చేసిన సైకిల్ జాతకు సహకరించి ఆంధ్రప్రదేశ్ లో యస్సీ యస్టీ ఉప ప్రణాళిక చట్టం ఏర్పడడానికి విశ్వనాథ్ తనవంతు పాత్ర పోషించాడు. అగ్రవర్ణ పేదల ఉద్యోగ ఉపాది విషయాలలో ప్రభుత్వం రిజర్వేషన్లు వర్తింపు చేసి అమలు చేయాలని అలాగే ముస్లీంల సామాజిక ఆర్థిక జీవన విదానం మెరుగుపడాలంటే సచార్ కమిటీ సిఫార్స్ అమలు చేయాలని ప్రభుత్వంపై విశ్వనాథ్ తెచ్చిన ఒత్తిడి పలువురు ప్రశంసలు అందుకుంది. సామాజిక కార్యకర్తగా తనమన బేదం లేకుండా అన్ని వర్గాలకు విశ్వనాథ్ అందించిన సేవలను గుర్తించి ప్రజా సంఘాలు ప్రజాభందు పురష్కారంతో సత్కరించాయి. గత ప్రభుత్వంలో నిరుపేదలకు ఇచ్చే సామాజిక బద్రతా పించన్ పథకానికి యన్టీఆర్ భరోశా పేరు పెట్టి చరిత్రకెక్కిన విశ్వనాథ్ కరోనా మహమ్మారి నివారణకు క్షేత్రస్థాయిలో సూపర్ సానిటేషన్ పదాన్ని ఈ ప్రభుత్వంలో కోయిన్ చేసింది కూడా విశ్వనాథే. సమసమాజ స్థాపనకు ఫూలే, అంబేద్కర్ విదానాలు శరణ్యమని, నైతిక జీవనమార్గానికి గాందీవాదం ముఖ్యమని బలంగా నమ్మిన విశ్వనాథ్ తాను పనిచేసిన మండల ప్రజా పరిషత్ కార్యాలయాలలో ఫూలే , బాబాసాహెబ్, గాందీ, వివేకనంద, మదర్ థెరిసా ఇలా మహనీయుల విగ్రహాల ఏర్పాటు చేసిన ఘనత కూడా విశ్వనాథ్ కి దక్కుతుందని చెప్పచ్చు.
రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రజా క్షేత్రంలో ముందుకు నడిపించి కరడుగట్టిన ఉద్యమకారుడిగా తనకంటూ ప్రత్యేకత చాటుకున్న విశ్వనాథ్ గతమంతా ఉద్యమ చరిత్రే.. గత ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయ పనితీరు ఆదారంగా ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంతి సమాయాన్ని 50 సంవత్సరాలకు కుదించాలని రంగం సిద్దమైయ్యింది. అత్యంత గోప్యంగా ప్రభుత్వం ముసాయిదా కూడా తయారైయ్యింది. విషయాన్ని తెలుసుకున్న విశ్వనాథ్ 5 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల మెడపై కత్తి వేటు పడనుందని, ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంభాలు రోడ్డున పడనున్నాయని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను జాగృతి చేయడమే కాకుండా టెలివిజన్ చానెల్స్ లో ప్రభుత్వ తీరుని తీవ్రంగా వ్యతిరేకించడం అప్పట్లో పెను సంచలనం లేపింది. నాడు విశ్వనాథ్ ఉద్యమ పటిమకు తలొగ్గిన ప్రభుత్వం ఆ ముసాయిదాను వెనుక్కం తీసుకోవడంతో రాష్ట్రంలో 5 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు విశ్వనాథ్ ఉద్యమస్పూర్తిని ప్రశంసించారు.
రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యల నివారణకు, దళిత, గిరిజన, మైనార్టీ సమస్యల పరిష్కారానికి, పేదవర్గాల పక్షాన అందిస్తున్న నిస్వార్థ సేవలను గిర్తించి పలు సంధర్భాలలో విశ్వనాథ్ ను జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వారియర్ ఆఫ్ ది పూర్, డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రాష్ట్రపిత మహాత్మా జోతిరావ్ పూలే, సర్ ఆర్థర్ కాటన్ జాతీయ పురష్కారాలతో సత్కరించాయి. వివక్షతను ఎదుర్కుంటున్న వర్గాల తరుపున పోరుబాట పట్టినందుకు శ్రీసత్యసాయి సేవా పురష్కారం, ట్రూ ఇండియన్ అవార్డు కూడా విశ్వనాథ్ అందుకున్నారు. సమాజానికి, ప్రజలకు విశ్వనాథ్ అందిస్తున్న సేవలను గుర్తించి అమెరికా లోని ఆండ్రూస్ విశ్వ విద్యాలయం ప్రతినిధులు డిల్లీలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంభ నేపద్యం ఉన్న విశ్వనాథ్ కు అన్ని అంశాలపై విషయ పరిజ్ఞానం ఉండడం, సమాజిక స్పృహ ఉండడం వలన సమస్యలపై స్పందించే తీరు, వాగ్దాటితో శాస్త్రీయ దృక్పథంతో తన వాదననలతో ప్రత్యర్ధులను కడా మెప్పించి గల నైజం కలిగిన విశ్వనాథ్ ఉపాధ్యాయుల సంయుక్త గళంగా శాశనమండలిలో ప్రతినిదిగా ఉంటే ఉపాధ్యాయ వర్గం ఎదుర్కుంటున్న అనేక సమస్యలు ముఖ్యంగా ఓపియస్ సాదన, పీఆర్సీ అమలు, పెండింగ్ డిఏల సాదన, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ప్రైవేట్ కాలేజి లెక్చరర్, అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల ఉద్యోగ బద్రత, పాఠశాలలు, కాలేజీలలో మౌళిక సదుపాయాల కల్పన, విశ్రాంతి ఉపాధ్యాయుల సమస్యలు, పాఠశాలలో, కాలేజీలలో రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు ఇలా న్యాయ బద్దమైన డిమాండ్ల సాధనకు మార్గం సుముఖం అవుతుంది. కమ్యూనిష్ట్ భావజాలం ఉన్న విశ్వనాథ్ తన ఉద్యమస్పూర్తితో ఉపాధ్యాయ, ఉపాధ్యాయ కుటుంభ సంక్షేమానికి ఇతోదకంగా సహాయపడగలరనె నమ్మకం ఉపాధ్యాయ వర్గాలలో, ఆన్ని ఉపాధ్యాయ సంఘాలలో ఉంది. మానవతావాదిగా పేరున్న విశ్వనాథ్ ఉభయగోదావరి జిల్లాలలో అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ముఖ్యంగా ఉపాధ్యాయులతో ప్రత్యక్ష పరోక్ష సంభందాలున్నాయని అందరికి తెలిసిన విషయమే. అందరివాడుగా పేరున్న విశ్వనాథ్ మండలి ఎన్నికల బరిలో ఉంటే ఉభయగోదావరి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులందరు సహకరించి అత్యంత మెజార్టీతో గెలుపించుకోవడం ఖాయమని ఉపాధ్యాయ వర్గంలో అంతర్గత చర్చ నడుస్తుంది. ఉపాధ్యాయ సంఘాలు కోరిక మేరకు విశ్వనాథ్ యం.యల్.సి ఎన్నికల బరిలో ఉండడానికి 'యస్' చెప్తే ఉపాధ్యాయ వర్గం విశ్వనాథ్ ను తమ సొంత మనిషిగా భావించి గెలుపుకు పూర్తి సహకారం అందించి తమ అభిమానాన్ని చాటనున్నాయి. అయితే ఇంకా 10 సంవత్సరాలు ప్రభుత్వ సేవా కాలం ఉన్నందున్న ఉద్యోగానికి రాజీనామా చేసి విశ్వనాథ్ ఎన్నికల బరిలో ఉంటారా లేదా అన్నది తెలియరాలేదు. విశ్వనాథ్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.