రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రజల మనస్సును గెలిచిన ప్రజా నాయకుడని కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ అన్నారు. ఆయన చేసిన సేవలు శ్లాఘనీయమని పేర్కొన్నారు. ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన దామోదరం సంజీవయ్య శత జయంతి ఉత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు సభ మౌనం పాటించింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సంజీవయ్య జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఆయన ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర మంత్రి వర్గాల్లో కీలక పాత్ర పోషించారని, దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆయన కష్టపడే మనస్తతత్వమే ఆయన్ని కీర్తి శిఖరాలకు చేర్చిందని పేర్కొన్నారు. ఉద్యోగ జీవితం నుంచి మొదలైన ఆయన ప్రస్థానం రాజకీయ రంగంలో ఓ ఘనుడిగా ఇనుమడించిందని అన్నారు. ఆనాడు ఉన్న క్లిష్టమైన రాజకీయ పరిస్థితులను దాటి, ఓ బలమైన వర్గాన్ని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎదగటం సాధారణ విషయం కాదన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సంజీవయ్య పార్కు ఆయన కీర్తి చిహ్నానికి చక్కని చిరునామాగా అభివర్ణించారు. ఆయన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దళిత జాతికి ఆయన ఒక వెలుగు జ్యోతి అని కీర్తించారు. దళితులు చైతన్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి పిల్లవాడికీ సంజీవయ్య జీవిత చరిత్ర గురించి చెప్పాలని, తద్వారా ఒక స్ఫూర్తిదాయకమైన సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. సంయుక్త కలెక్టర్ జి.సి. కిశోర్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డి.డి. సునీల్ రాజ్ కుమార్, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ జగన్నాధం మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆశయాలను బ్రతికించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డీఆర్వో ఎం. గణపతిరావు, పశుసంవర్ధక శాఖ జేడీ ఏవీ నర్శింహులు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 17వ తేదీన రంపచోడవరం, ఎటపాక డివిజన్ల పరిధిలో గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు రవాణా, ఆహారం, వసతి పరమైన సమగ్రమైన ఏర్పాట్లతో ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి డివిజనల్, మండల అధికారులను ఆదేశించారు. ఆదివారం మద్యాహ్నం కలెక్టరేట్ కోర్టు హాలు నుండి జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి ఐటిడిఏ పిఓలు, డివిజనల్, మండల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మూడవ దశ గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఆదేశాలు జారీచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి రెండు దశల ఎన్నికల సందర్భంగా పోలింగ్ అధికారులు, సిబ్బంది తక్కవ సంఖ్యలో హాజరు కావడం, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు ఆలస్యంగా రావడం వంటి అంశాలను గమనించామని, ఏజెన్సీ మండలాల్లో జరుగుతున్న మూడవ దశ ఎన్నికల సందర్భంగా ఇటువంటి లోపాలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ఎన్నికల సిబ్బంది సుదూర మండలాల్లో విధులకు సకాలంలో చేరుకోవలసి ఉన్నందున, వారందరూ 15వ తేదీ సాయంత్రానికే ఆయా మండలాలకు చేరేందకు వీలుగా మైదాన మండలాల్లోని 13 ప్రదేశాల నుండి 15వ తేదీ ఉదయం 8-00 గం.లకు బయలుదేరేట్లు 106 ఆర్టిసి బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. మైదాన మండలాల నుండి మూడవ దశ ఎన్నికల విధులు కేటాయించిన సుమారు 5,300 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మైక్రో అబ్జర్వర్లు 15వ తేదీ ఉదయం 7-30 గంటల లోపు ఆయా బస్టాండులకు చేరుకుని సంబంధిత మండల విద్యాశాఖాధికారికి రిపోర్టు చేయాలని తెలిపారు. 13 ప్రాంతాల నుండి బయలు దేరిన ఉద్యోగులను తొలుత రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజి వద్ద ఏకత్రం చేసి, మద్యాహ్న భోజన అనంతరం వారి వారి రూట్లలో ఏర్పాటు చేసిన బస్సులలో విధులు నిర్వహించాల్సిన మండలాలకు తీసుకువెళ్లాలని, అక్కడి హాస్టళ్లలో రాత్రి బస, మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలని అధికారులకు సూచించారు. 16వ తేదీ ఉదయం అల్పాహారం అనంతరం పోలింగ్ సామాగ్రితో ఉద్యోగులను డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి వారి వారి పోలింగ్ కేంద్రాలకు తరింలించాలన్నారు. 17వ తేదీన పోలింగ్ ప్రక్రియను కచ్చితంగా మద్యాహ్నం 1-30 గం.లకు ముగించాలని, 2 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభించి సాయంత్రం 6-30 గం.లలోపు పూర్తి చేయాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను తప్పని సరిగా వెబ్ కాస్టింగ్, అది వీలు కాని చోట్ల వీడియో కెమేరాల పర్యవేక్షణలో జరపాలని ఆదేశించారు. ఎన్నికల విధులు పూర్తయిన అనంతరం భోజనం, రవాణా సౌకర్యాలతో ఉద్యోగులు తిరిగి వారి వారి ప్రాంతాలకు వెళ్లే ఏర్పాట్లు చేపట్టాలని, ఎటువంటి అసౌకర్యానికి లోను కుండా చూడాలని డివిజనల్, మండల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి.రాజకుమారి, డిపిఓ ఎస్.వి.నాగేశ్వరనాయక్, జడ్పి సిఈఓ ఎన్ వివి సత్యన్నారాయణ, డిఈఓ ఎస్ అబ్రహాం, డిటిసి ప్రతాప్, ఆర్టిసి ఆర్ఎ పాల్గొని ఆయా అంశాల ఏర్పాట్లను డివిజన్, మండల అధికారులకు వివరించారు.
ఎన్నికల విధుల ఉద్యోగుల రవాణా నిమిత్తం 15వ తేదీ ఉదయం 8 గం.లకు ఏర్పాటు చేసిన బస్సులు ఈ ప్రదేశాలల్లోని బస్టాండుల నుండి బయలు దేరతాయిః
1. అమలాపురం బస్ డిపో ( 11 బస్సులు – ఐనవిల్లి, అల్లవరం, అమలాపురం, అంబాజీపేట, మామడికుదురు, పి.గన్నవరం, ఉప్పలగుప్తం మండలాల ఉద్యోగుల కొరకు)
2. కాకినాడ బస్ డిపో (19 బస్సులు – కాకినాడ అర్బన్, రూరల్, ఐ.పోలవరం, కాజులూరు, కరప, పెదపూడి, తాళ్లరేవు మండలాల ఉద్యోగులు)
3. మండపేట బస్ స్టాండ్ (4 బస్సులు - మండపేట, కపిలేశ్వరపురం మండలాల ఉద్యోగులు)
4. ముమ్మిడివరం యండిఓ ఆఫీసు (2 బస్సులు – ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల ఉద్యోగులు)
5. పెద్దాపురం బస్టాండ్ (9 బస్సులు – పెద్దాపురం, గండేపల్లి, జగ్గంపేట, పెద్దాపురం, రంగంపేట, సామర్లకోట మండలాల ఉద్యోగులు)
6. పిఠాపురం బస్టాండ్ (7 బస్సులు - పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాల ఉద్యోగులు)
7. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజి (19 బస్సులు - రాజమండ్రి అర్బన్, రూరల్, గోకవరం, కడియం, కోరుకొండ, రాజానగరం, సీతానగరం మండలాల ఉద్యోగులు)
8. రామచంద్రపురం బస్ డిపో (5 బస్సులు – రామచంద్రపురం, కె.గంగవరం మండలాల ఉద్యోగులు)
9. అనపర్తి బస్ స్టాండ్ (5 బస్సులు – అనపర్తి, రాయవరం, బిక్కవోలు మండలాల ఉద్యోగులు)
10. రావులపాలెం బస్ స్టాండ్ ( 6 బస్సులు – రావులపాలెం, ఆలమూరు, ఆత్రేయపురం, కొత్తపేట మండలాల ఉద్యోగులు)
11. రాజోలు బస్ స్టాండ్ (4 బస్సులు – రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల మండలాల ఉద్యోగులు)
12. తుని బస్టాండ్ (9 బస్సులు – తుని, కోటనందూరు, రౌతులపూడి, శంఖవరం, తొండంగి మండలాల ఉద్యోగులు)
13. ఏలేశ్వరం బస్ స్టాండ్ (6 బస్సులు – ఏలేశ్వరం, కిర్లంపూడి, ప్రత్తిపాడు మండలాల ఉద్యోగులు)
ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత దామోదరం సంజీవయ్యకు జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ ఘనంగా నివాళులు అర్పించారు. దామోదరం సంజీవయ్య జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలక్టరు ఎం. వేణుగోపాల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు డివి రమణమూర్తి, తదితర అధికారులు పాల్గొన్నారు.
మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో 5వ జోన్ లో బాల చెరువు రోడ్డు మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసేందుకు జివిఎంసి కమిషనర్ వి.కోటేశ్వరరావు ఆదేశాల మేరకు ఆదివారం వివిధ ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించారు. గాంధీ జంక్షన్ నుంచి గంగవరం పోర్టు జంక్షన్ వరకు గల మార్గాన్ని రెవెన్యూ శాఖ, ఐలా ప్రతినిధులు, స్టీల్ ప్లాంట్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్, సర్వేయర్ గంగవరం పోర్ట్ అధికారులతో కలిసి జాయింట్ సర్వే ఈ నెల 11వ తేదీన నిర్వహించి మాస్టర్ ప్లాన్ రోడ్డు ఏర్పాటు కు కావలసిన ప్రాంతము కొంతవరకూ ఉన్న ఆక్రమణలు పూర్తిగా జెసిబీలతో తొలగించారు. ముఖ్యంగా గంగవరం పోర్టు ప్రహరీ గోడ కూడా ఆ క్రమంలో నిర్మించినట్లు అధికారులు గుర్తించి, గోడ తో పాటు ఉన్న అన్ని ఆక్రమణలను 5వ జోన్ లోని పట్టణ ప్రణాళిక అధికారులు తొలగించారు. ఇదివరకే ఆ ప్రాంతంలో గల ఐలా ప్రతినిధులు, పెదగంట్యాడ పారిశ్రామిక సంఘం వారు మాస్టర్ ప్లాన్ పరంగా రోడ్డు వెడల్పు, సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు గాను నిరసనలు తెలుపుతూ ఈ రోడ్డు అభివృద్ధి వలన ట్రాఫిక్ నియంత్రణ జరిగి, ఆయా ప్రాంతాల్లో పారిశ్రామిక పెట్టుబడులు అభివృద్ధి చెందుతాయని పలుమార్లు ఆందోళన చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకుని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి తో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ వ్యాపారస్తులకు న్యాయం చేస్తామని చెప్పిన దరిమిలా, వివిధ శాఖలకు చెందిన అధికారులు స్పందించి, ఆక్రమణలు తొలగించుటకు తగు చర్యలు చేపట్టినందుకు అక్కడగల పారిశ్రామిక ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ రోడ్ అభివృద్ధి వలన ట్రాఫిక్ నియంత్రణ తో పాటు, పారిశ్రామిక ప్రాంతానికి గాని, గంగవరం పోర్ట్ కు వెళ్లడానికి సమయాభావం తగ్గుతుందని, ఉపాధి అవకాశాలు పెరిగి పారిశ్రామిక వాడలో పెట్టుబడులకు అవకాశం ఉంటుందని ఆ ప్రాంతానికి చెందిన ఇండిస్టియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో నిర్వహించే రథసప్తమి వేడుకలకు వి.ఐ.పి పాస్ లను జారీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు ఆది వారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఈ నెల 19వ తేదీన రథసప్తమి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 18వ తేదీ రాత్రి 12 గంటల నుండి వేడుకలు ప్రారంభం అవుతాయని చెప్పారు. 18వ తేదీ రాత్రి 2 గంటల నుండి వి.ఐ.పి దర్శనం ప్రారంభం అవుతుందని కలెక్టర్ పేర్కొంటూ వి.ఐ.పి దర్శనానికి వచ్చే వారి వివరాలను ముందుగా రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.ఓ)కు అందించి పాస్ లు పొందాలని విజ్ఞప్తి చేసారు. రథ సప్తమి వేడుకలలో సాధారణ భక్తులు సైతం ప్రశాంత వాతావరణంలో స్వామి వారిని దర్శించుకోవాలని అన్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. వి.ఐ.పి క్యూ లైన్ లో అనేక మంది రావడంతో నిజమైన వి.ఐ.పిలకు, డోనర్లకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఈ నేపధ్యంలో వి.ఐ.పి పాస్ లను ప్రవేశపెట్టడం జరిగిందని స్పష్టం చేసారు. స్వామి వారి దర్శనం ఆనంద అనుభూతులు నింపాలని ఆయన అన్నారు. రథ సప్తమికి అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీల రెండు విడతల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. సంజీవయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆది వారం నగరంలోని పాలకొండ రోడ్ లో ఉన్న సంజీవయ్య పార్కులో దామోదర సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెండు విడతలు ప్రశాంతంగా, సజావుగా పూర్తి అయ్యిందన్నారు. మూడు, నాలుగవ విడతలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలింగు సిబ్బంది శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. మొదటి విడతలో 75.77 శాతం పోలింగు జరిగిందని, రెండవ విడత 72.87 శాతం పోలింగు జరిగిందని పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన 236 గ్రామ పంచాయతీల ఫలితాలు వెల్లడించామని అన్నారు. మూడవ విడతలో 293, నాలుగవ విడతలో 274 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. వ్యవసాయ సీజన్, వలసలు వెళ్ళడం వలన పోలింగు శాతం తగ్గిందని బావిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మూడు, నాలుగవ విడతల ఎన్నికల్లో ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు ఓటు అన్నారు. అటువంటి విలువైన ఓటు హక్కును వృధా చేయరాదని కలెక్టర్ విజ్ఞప్తి చేసారు. పోలింగు ఉదయం 6.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం 1.30 నాటికి ముగుస్తుందన చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర సంజీవయ్య నేటి యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. సంజీవయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నగరంలోని పాలకొండ రోడ్ లో ఉన్న సంజీవయ్య పార్కులో దామోదర సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంజీవయ్య నిరాడంబరుడని, రాజనీతిజ్ఞతకు మారుపేరుగా నిలిచారని ఆయన అన్నారు. సంజీవయ్య ఉమ్మడి రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించి ఆదర్శప్రాయమైన రాజకీయాలు అందించారని పేర్కొన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు, నాయకులు సంజీవయ్య ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. దామోదరం సంజీవయ్య ఒకప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అని, విలువలకు కట్టుబడి బతికిన అతి కొద్దిమంది రాజకీయనాయకుల్లో ఒకరని నేటితరానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎన్నో పదవులు నిర్వహించిన సంజీవయ్యకు చనిపోయే నాటికి ఆస్తిపాస్తులు లేవంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదన్నారు. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని స్వప్రయోజనాలకు వాడుకోకూడదన్న నియమానికి కట్టుబడ్డ నేత సంజీవయ్య అని పేర్కొన్నారు. కనీసం సొంత ఇల్లు కూడా లేదంటే ఆయన నిజాయితీని అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. నిస్వార్ధ రాజకీయ జీవితాన్ని అనుభవించిన వ్యక్తి అని అన్నారు. బహుబాషలలో ప్రావీణ్యము కలిగిన వ్యక్తి అన్నారు. సంజీవయ్య పేరున విశాఖపట్నంలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నెలకొల్పడం జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ కు, సంజీవయ్య పార్కు అభివృద్ధిలో శ్రద్ద వహించిన నగర పాలక సంస్ధ కమీషనర్ నల్లనయ్యకు అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్ధ కమీషనర్ పల్లి నల్లనయ్య, అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా కన్వీనర్ తైక్వాండో శ్రీను, విశ్రాంత డిప్యూటి కలెక్టర్ పి.ఎం.జె బాబు, వివిధ సంఘాల నాయకులు పి.చంద్రపతి రావు, బోసు మన్మధరావు, పొన్నాడ రుషి, కంఠ వేణు, డా.జామి భీమ శంకర రావు, ఎస్.వి.రమణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపు కొత్తూరు, మందస, రాజాం, సంతకవిటి, వంగర మండలాల్లో శనివారం జరిగిన రెండవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ జె.నివాస్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్ధార్తో కలిసి గ్రామ పంచాయతీ ఎన్నికలను స్వయంగా పరిశీలించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ పోలింగ్ అధికారులకు పలు సూచనలు చేసారు. అనంతరం పలాస మండలం పెదంచల , వజ్రపు కొత్తూరు మండలం గోవిందపురం, కవిటి మండలం మాణిక్యపురం గ్రామాలతో పాటు పలు మండలాలను ఎస్.పి అమిత్ బర్ధార్ తో కలిసి క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 236 గ్రామ పంచాయితీలకు, 2,448 వార్డులకు ఎన్నికలు జరిగాయని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి తమ ఓటును వినియోగించుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పలాస మండలం బొడ్డపాడులో నూతన దంపతులైన తామాడ రమేష్, సింధు తమ ఓటును వేసి ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల యువతకు ఆదర్శప్రాయంగా నిలిచారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని, ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు ధర్మల్ చెకప్ తో పాటు చేతులకి శానిటైజర్ చేయడం జరిగిందని అన్నారు. తొలి విడత మాదిరిగానే రెండవ విడతలో కూడా జిల్లా అధికారులను, పోలీసు సిబ్బందిని ఎక్కడికక్కడ అప్రమత్తం చేయడంతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు. మధ్యాహ్నం 3.30గం.ల వరకు జరిగిన పోలింగులో 72.87 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు.
విజయనగరం జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను తప్పకుండా రికార్డు చేయించాలని ఆయా మండలాల పరిధిలో ఉన్న ఆర్వోలను కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ ఆదేశించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వివిధ ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ శనివారం జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి కలెక్టర్ ఆర్వోలకు ఆదేశాలు జారీ చేశారు. డీపీవో సునీల్ రాజ్ కుమార్ ద్వారా అందరికీ ఫోన్‌లు చేయించి తక్షణమే అన్ని పోలింగ్ కేంద్రాల్లో కెమెరాలు, వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలను ఉపయోగించి రికార్డు చేయాలని చెప్పించారు. సంబంధిత కేంద్రాల్లో కెమెరాలు అందుబాటులో లేనట్లయితే మొబైల్‌ల ద్వారా అయినా ఓట్ల లెక్కింపు ప్రక్రియను రికార్డు చేయించాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియను, సజావుగా పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు.
విజయనగరం జిల్లాలో తొలివిడత పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ తెలిపారు. ఎన్నికల్లో ఓటేసేందుకు జిల్లా ప్రజలు ఎంతో ఉత్సాహాన్ని చూపారని, ఉదయం 6.30 గంటలకే పోలింగ్ బూత్‌లవద్ద పెద్ద సంఖ్యలో జనం క్యూలైన్లలో ఉండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. పార్వతీపురం డివిజన్ పరిధిలోని 15 మండలాల్లో జరిగిన తొలివిడత ఎన్నికల్లో సగటున 82శాతం ఓటింగ్ నమోదయ్యిందని తెలిపారు. నాలుగు నియోజకవర్గాల పరిధిలోని 355 గ్రామ పంచాయితీల్లో జరిగిన ఈ ఎన్నికల్లో, మొత్తం 5,67,589 ఓట్లకు గానూ, 4,65,631 ఓట్లు పోలయ్యాయని తెలిపారు. అత్యధికంగా రామభద్రాపురం మండలంలో 86.3 శాతం, అత్యల్పంగా గుమ్మలక్ష్మీపురంలో 73శాతం ఓటింగ్ నమోదయ్యిందని వివరించారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించిన అధికార యంత్రాంగానికి, పోలీసులకు, సహకరించిన జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
విజయనగరం జిల్లా లోని మావోయిస్టు ప్రభావిత గ్రామంగా గుర్తించిన సాలూరు మండలం కొండ శిఖర గ్రామమైన సంపంగి పాడు గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ దళాయి వలస జి.పి.ఎస్. స్కూల్ లో నిర్వచించారు. 485 ఓట్లు గల ఈ గ్రామ పంచాయతీ లో మధ్యాహ్నం 1-30 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 297 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా యంత్రాంగం చేసిన పటిష్ట మైన ఏర్పాట్లతో ఈ గ్రామంలో పోలింగ్ ప్రశాంతంగా సాఫీగా జరిగింది. కొండల పై వున్న సంపంగి పాడు, దిగువ రూఢ, కాగ రూఢ, గాడివలస, కొత్త మామిడి, గాలిపాడు తదితర గ్రామాల ప్రజలు దాదాపు 8 కిలోమీటర్ల దూరం రెండు గంటల పాటు నడిచి కొండలు దాటూకొంటూ కిందికి వచ్చి దళాయివలసలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఎన్నికల పట్ల తమకు గల నమ్మకాన్ని, ఓటుకు తాము ఎంతో విలువ ఇస్తామని తెలియజెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సగానికి పైగా జనం దైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవడం ఓటరు చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
విజయనగరం జిల్లా సాలూరు మండలం ఒడిస్సా సరిహద్దు గ్రామ పంచాయతీ సంపంగి పాడు ఎన్నికల పోలింగ్ లో పాల్గొన్న గిరిశిఖర గ్రామ ఓటర్లు. ఈ పంచాయతీ లో దిగువ రూడ, కాగరూడ, గాడివలస, కొంక మామిడి, గాలిపాడు గిరి శిఖర గ్రామాల నుంచి కొండలు, గుట్టలు, వాగులు దాటుకుంటూ కాలి నడక సుమారు 8 కిలో మీటర్ల దూరంను 2.30 గంటల పాటు ప్రయాణించి దళాయి వలసలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ బూత్ లో మధ్యాహ్నం ఒంటి గంటన్నరకి 485 ఓట్లకు గాను 61 శాతంతో 297 పోలయ్యాయి. సంపంగి పాడు గ్రామం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని గిరి శిఖర గ్రామాల నుంచి ఓటర్లు దళా అయితే ఎత్తైన కొండల పై నుంచి కాలి నడకన గిరిజన ఓటర్లు కిందికి దిగి వచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడంలో పలువురికి ఆదర్శంగా నిలిచారని చెప్పవచ్చు.
కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరంచేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డివైఎఫ్ఐ నగర అధ్యక్షులు కె.మహేష్ అన్నారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనకు డివైఎఫ్ఐ కూడా తన మద్దతు ప్రకటించింది. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యువత మానవహారం నిర్వహించారు. ఎన్నో ఉద్యమాలు, ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చిన విశాఖ సెంటిమెంటు నవరత్న కర్మాగారాన్ని ప్రభుత్వం ప్రైవేటు పరం చేసే యోచర విరమించుకోకపోతే ప్రజాగ్రహం తప్పదన్నారు. అనంతరం స్టీల్ కార్మికులు చేస్తున్న దీక్షలకు మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి వై ఎఫ్ ఐ నగర నాయకులు షణ్ముఖ, ప్రసన్న, రాజేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అముల్ సంస్ధ అనుసంధానంతో రాష్ట్రంలో పాల సేకరణ చేపట్టడం జరుగుతోందని రాష్ట్ర డైరి అభివృద్ధి సహకార సమాఖ్య మేనేజింగ్ డైరక్టర్ ఏ.బాబు తెలిపారు. శుక్ర వారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి ప్రాజెక్టు వివరాలను తెలియజేసారు. అముల్ సంస్ధ ప్రపంచంలోనే ఖ్యాతి గన్న సంస్ధ అన్నారు. మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న సంస్ధ అని పేర్కొంటూ ఒక ఉత్పత్తికి బ్రాండ్ ఇమేజ్ ఉన్నప్పుడు విలువ ఆధారిత ధర పెరుగుతుందన్నారు. అముల్ సంస్ధ పాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ఆధారంగా రాష్ట్రంలో ఒక చక్కటి సహకార విధానం రానుందని పేర్కొన్నారు. మహిళా సంఘాలు సహకార వ్యవస్ధలో భాగస్వామ్యం కానున్నారని చెప్పారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధ మెరుగుపరచుటకు ఇది బాగా దోహదపడుతుందని తెలిపారు. అముల్ సంస్ధ ఉత్తమ ధరను అన్ని సీజన్లలోనూ చెల్లిస్తుందని బాబు చెప్పారు. కరోనా సమయంలోనూ అముల్ సంస్ధ పాల సేకరణ నిలుపుదల చేయలేదని ఆయన పేర్కొన్నారు. అముల్ అనేది రైతులు ఏర్పాటు చేసుకున్న సంస్ధ అని రైతులే యజమానులని వివరించారు. అముల్ రైతులు ఆంధ్ర ప్రదేశ్ రైతుల సహకారం తీసుకొనుటకు ముందుకు వచ్చారని చెప్పారు. అముల్ లో అత్యధికంగా మహిళలు భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ తో ఒప్పందం మూలంగా రాష్ట్రం నుండి 2.37 మిలియన్ మహిళలు ఈ ఉద్యమంలో చేరుతున్నారని చెప్పారు. పాలను సేకరించి ప్రతి 10 రోజులకు చెల్లింపు చేస్తున్న సంస్ధ అముల్ అని అన్నారు. 10 రోజులకు రూ.21 వేలు ఆర్జిస్తున్న మహిళలు గుజరాత్ లో ఉన్నారని తెలిపారు. అముల్ కు వచ్చే ఆదాయంలో 85 శాతం రైతులకు చెల్లించడం జరుగుతోందని ఆయన వివరించారు. కొన్ని గ్రామాల్లో 65 వేల లీటర్ల సేకరణ జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఏడాదికి కోటి రూపాయలను ఆదాయంగా పొందుతున్న మహిళలు ఉన్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పాలలో 75 శాతం అసంఘటిత రంగం (అన్ ఆర్గనైజ్డు) ద్వారా కొనుగోళు జరుగుతుందని చెప్పారు. కేవలం 25 శాతం మాత్రమే సంఘటిత రంగంలో సేకరణ జరుగుతోందని వివరించారు. వీటన్నింటి దృష్ట్యా యంత్రాంగం చిత్తశుద్ధితో, టీమ్ స్పిరిట్ తో పనిచేయడం ద్వారా రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. బ్యాంకర్లు సైతం పాడి ఆవులకు, గేదెలకు సరళంగా రుణాలు మంజూరు చేయడం ద్వారా లబ్దిపొందుతారని సూచించారు. బ్యాంకులకు ఇది మంచి వ్యాపార ప్రణాళిక అవుతుందని చెప్పారు. బహుళ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం వలన అత్యుత్తమ ప్రాజెక్టుగా రూపొందగలదని అన్నారు. శ్రీకాకుళం జిల్లా గణాంకాలు పరిశీలిస్తే ప్రాజెక్టు విజయవంతం చేయుటకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో అమలులో ఉందని, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో త్వరలో ప్రారంభించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో 2,774 బల్క్ మిల్క్ చిల్లింగు కేంద్రాలు (బి.యం.సి.యు) మొదటి దశలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, రెండవ దశలో 7,125, మూడవ దశలో 9,899 ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. మొదటి దశలో ఆటోమేటిక్ మిల్క్ కూలింగ్ యూనిట్ కేంద్రాలు (ఏ.యం.యు.సి) 2,123, రెండవ దశలో 8,051 ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో సైతం ప్రయోగాత్మకంగా అమలు చేయుటకు నిర్ణయించడం జరిగిందని, మార్చి నాటికి వంద గ్రామాల్లో సేకరణకు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. 2022 మార్చి నాటికి అన్ని గ్రామాల్లో పాల సేకరణ కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. గ్రామాల్లో పాడి పశువులు కలిగిన ప్రతి కుటుంబ మహిళ మహిళా డైరీ సహకార సంఘం (యం.డి.ఎస్.ఎస్) సభ్యులుగా ఉంటారని వీరిని మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పారు. యం.డి.ఎస్.ఎస్ లో సభ్యులుగా ఉంటూ నిత్యం పాలు పోసే వారిని మేనేజింగ్ కమిటిలో సభ్యులుగా చేర్చడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వీటి నిర్వహణకు ప్రామాణిక నిబంధనలు ఉంటాయని చెప్పారు. నాలుగు ఏ.యం.యు.సిలు ఒక యం.డి.ఎస్.ఎస్ ఉంటాయని చెప్పారు. దీనిపై పాడి పశువులు ఉన్న కుటుంబాల్లో మంచి అవగాహన కలిగించాలని, పేరణ ఇవ్వాలని సహకార శాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో 5.72 లక్షల పశువులు, 48 వేల గేదెలు, 7.39 లక్షల గొర్రెల సంపద ఉందన్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన పాలసేకరణకు ప్రణాళికలు తయారు చేసామని అన్నారు. రోజుకు 18,518 లీటర్ల పాలు సేకరించగలమని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. అముల్ సంస్దకు చెందిన జి.సి.ఎం.ఎం జనరల్ మేనేజర్ హిమాంశు రాథోడ్ మాట్లాడుతూ అముల్ సంస్ధ 1946లో స్ధాపించడం జరిగిందన్నారు. రూ.24 వేల కోట్ల టర్నోవర్ తో నడుస్తుందని, 26 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. 250 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతోందని వివరించారు. ప్రతి రోజు రూ.110 కోట్ల విలువ మేర చెల్లింపులు జరుగుతాయని ఆయన చెప్పారు. రైతుల ఆర్ధిక, సామాజిక స్ధితిగతులు మెరుగుపడుట ధ్యేయంగా అముల్ సంస్ధ పనిచేస్తుందని ఆయన వివరించారు. పూర్తి పారదర్శకంగా నడిచే సంస్ధ అన్నారు.
అముల్ సంస్ద బనాస్ కట్టా ప్రాంత పాల సేకరణ అధిపతి డా.ప్రఫుల్ భన్వదియ మాట్లాడుతూ గుజరాత్ లో బనాస్ కట్టా ప్రాంతం ఆసియాలో అత్యధిక పాలసేకరణ ప్రాంతంగా గుర్తింపు పొందిందన్నారు. కోటి రూపాయలు ఆదాయం పొందుతున్న రైతులు సైతం ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సి.హెచ్.శ్రీధర్, సహాయకలెక్టర్ ఎం.నవీన్, ఆర్.డి.ఓ ఐ.కిశోర్, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలుకలు డా.ఏ.ఈశ్వర రావు, సహాయ సంచాలకులు డా.మాదిన ప్రసాద్, డా.నారాయణ రావు., జిల్లా సహకార అధికారి కె.మురళీ కృష్ణ మూర్తి, డివిజనల్ అధికారులు బి.నగేష్, రమణమూర్తి, లీడ్ బ్యాంకు మేనేజర్ జి.వి.బి.డి హరి ప్రసాద్, డిసిసిబి సిఇఓ దత్తి సత్యనారాయణ, రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్) అగ్రికల్చర్ కన్సల్టెంట్ పి.వెంకటేశ్వర రావు, పంచాయతీ రాజ్ పర్యవేక్షక ఇంజనీరు భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ఎదురుగా నూతనంగా నిర్మించిన సెక్యూరిటీ గార్డుల గదులను ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం సెక్యూరిటీ గదులను పరిశీలించారు. విశ్వవిద్యాలయంలో బధ్రత చర్యలు పటిష్టం చేస్తున్న నేపధ్యంలో పరిపాలనా భవనం ఎదురుగా నూతనంగా రెండు సెక్యూరిటీ గార్డుల గదులను నిర్మించారు. వీటిని నేడు ప్రారంభించారు. కార్యక్రమంలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మహ్మద్ ఖాన్, వర్సిటీ ఇంజనీర్ ఆర్.శంకర రావు తదితరులు పాల్గొన్నారు.