శ్రీకాకుళం జిల్లాలో మూడవ దశ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎన్నికల పరిశీలకులు సిహెచ్.శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆమదాలవలస మండలం తొగరాంలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు స్వయంగా పర్యవేక్షించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడవ విడతలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్నికల ఏర్పాట్లను పక్కాగా చేశారని కితాబు ఇచ్చారు. పోలింగ్ అయిన వెంటనే వీలైనంత త్వరగా కౌంటింగ్ జరగాలని, పోలింగ్ అయిన రోజు రాత్రికే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేలా అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు. ప్రజలు, అధికారుల సమన్వయంతో ఓటింగ్ శాతం పెరిగిందని వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారని తెలిపారు. గడచిన రెండు దశల్లో 85 శాతం ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారని, మూడవ దశలో కూదా అంతే స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్-19 టీకా పంపిణీ కార్యక్రమంపై జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, ఉన్నత వైద్యాధికారులతో కలిసి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి.. మంగళవారం ఉదయం రంపచోడవరం నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలివిడతలో హెల్త్ కేర్ వర్కర్లు, రెండో విడతలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, మునిసిపల్, పారిశుద్ధ్య సిబ్బందికి సంబంధించి టీకాల పంపిణీపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. టీకా పూర్తిస్థాయిలో సురక్షితమైనందున లబ్ధిదారులు టీకాలు వేసుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. మూడో దశ కార్యక్రమం కోసం సచివాలయాల వారీగా 50 ఏళ్లకు పైబడిన పబ్లిక్, 50 ఏళ్ల లోపు కోమార్బిడిటీస్‌లకు సంబంధించిన జాబితాలను వెంటనే సిద్ధం చేయాలన్నారు. మండల స్థాయిలో తుది జాబితాల రూపకల్పన కోసం ఎప్పటికప్పుడు మండల టాస్క్‌ఫోర్స్ సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఏడు పురపాలక సంఘాలు, మూడు నగర పంచాయతీల్లో మార్చి 10వ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ఎన్నికలు జరగనున్నందున పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై రంపచోడవరం నుంచి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సన్నద్ధత పరంగా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏడు పురపాలక సంఘాలతో పాటు ముమ్మిడివరం, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. గతేడాది మార్చిలో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ మళ్లీ ఈ ఏడాది మార్చి 2న నామినేషన్ల ఉపసంహరణ ఘట్టంతో మొదలుకానుందని వివరించారు. మార్చి 3వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు. మార్చి 10న పోలింగ్, మార్చి 14న కౌంటింగ్ ఉంటుందన్నారు. గతంలో దాఖలైన నామినేషన్ల నివేదికలను క్షుణ్నంగా పరిశీలించాలని.. ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించి లోటుపాట్లు ఏవైనా ఉంటే సరిదిద్ది ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలను కల్పించాలన్నారు. అవసరం మేరకు పోలింగ్ కేంద్రాల మార్పుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ పరంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని, పూర్తిచేయాలన్నారు. గతంలో నియమించిన ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారి, అదనపు ఎన్నికల అధికారి వంటి ప్రత్యేక ఎన్నికల అధికారుల వివరాలను ప్రస్తుతం మరోసారి సరిచూసుకొని.. ఎవరైనా రిటైర్/బదిలీ అయితే వారి స్థానాల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించాలని.. గతంలో గుర్తించిన రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్లను మరోసారి క్షుణ్నగా పరిశీలించాలని సూచించారు. గతంలో తెలంగాణ రాష్ట్రం నుంచి బ్యాలెట్ పెట్టెలు తీసుకోవాల్సి వచ్చిందని.. ఈసారి ఆ అవసరం లేదని, జెడ్‌పీ కార్యాలయం నుంచి బ్యాలెట్ పెట్టెలు అందుబాటులో ఉంటాయన్నారు. అవసరమైన 448 పెద్ద బ్యాలెట్ పెట్టెలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సమావేశానికి తూర్పుగోదావరి మునిసిపల్ ఎన్నికల నోడల్ అధికారి, కాకినాడ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, మెప్మా పీడీ కె.శ్రీరమణి, ఎన్ఐసీ అధికారి సుబ్బారావు, పదిమంది కమిషనర్లు తదితరులు హాజరయ్యారు.
అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 19 మండలాల్లో ఈనెల 17వ తేదీన బుధవారం నిర్వహించే మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఉదయం అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎంపీడీవోలు, తహశీల్దార్ లు, ఎన్నికల సిబ్బందితో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మూడో విడత ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ను ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన మెన్ అండ్ మెటీరియల్ సిద్ధం చేయాలని, మెటీరియల్ ను అందరికీ త్వరితగతిన అందజేయాలన్నారు. ఎన్నికల సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ముందుగానే చూసుకోవాలన్నారు. ఎన్నికల సిబ్బందికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వారు త్వరగా చేరుకునేలా చూడాలని, ఎన్నికల సిబ్బందికి, మెటీరియల్ తరలింపునకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బందికి భోజనం, వసతి ఏర్పాట్లు చేయాలన్నారు. బుధవారం ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ కూడా సజావుగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థకు మార్చి, 14వ తేదిన జరగబోయే ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించుటకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నదని జివిఎంసి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పర్యవేక్షించే నోడల్ అధికారి మరియు ముఖ్య పట్టణ ప్రణాళికా అధికారి ఆర్. జె. విద్యుల్లత తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షించుటకు గాను, జోనల్ స్థాయిలో అధికారులను ఏర్పాటు చేయడమైనదని తెలిపారు. ముఖ్యంగా పోటీదారులు, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు, వ్యక్తులు, సంస్థలు మొదలగువారు ప్రవర్తనా నియమావళి నిబందనలను తు.చ. తప్పకుండా పాటించాలని కోరారు. ఏమైనా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరిగినచో ఆయా జోనల్ పరిధిలో గల ప్రవర్తనా నియమావళి టీం సభ్యులుకు గాని, సంబందిత రిటర్నింగు అధికారులకు గాని, జివిఎంసి ప్రధాన కార్యాలయపు ఫిర్యాదుల ఫోన్ నెంబర్లకు గాని తెలియ పరచవలసినదిగా పత్రికా ప్రకటన ద్వారా ముఖ్య పట్టణ ప్రణాళికా అధికారి మరియు జివిఎంసి ఎన్నికల ప్రవర్తనా నియమావళి నోడల్ అధికారి వారు కోరారు.
శ్రీకాకుళం జిల్లాలోని మహిళల సమస్యల పరిష్కారం కోసమే సఖీ ( వన్ స్టాప్ సెంటర్ ) కేంద్రం కొనసాగుతుందని వన్ స్టాప్ సెంటర్ కార్యకర్త బి.కవిత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక హడ్కోకాలనీలోని నగరపాలక ప్రాథమిక పాఠశాలలో సఖీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల సమస్యలకు పరిష్కారాన్ని చూపేందుకు జిల్లాలో వన్ స్టాప్ సెంటర్ ఉందని, కావున మహిళలకు ఎక్కడైనా సమస్యలు తలెత్తితే 100, 181, 1098 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆమె సూచించారు. ముఖ్యంగా పోలీసు, వైద్య, న్యాయ, మహిళా శిశు సంక్షేమ విభాగాలతో పాటు ఇతర స్వచ్చంధ సంస్థలతో అనుసంధానమై 181 కాల్ సెంటర్ పనిచేస్తుందని, అలాగే బాలల రక్షణ కోసం 1098 పనిచేస్తుందని తెలిపారు. కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆమె చెప్పారు. మహిళల లైంగిక వేధింపులు, గృహహింస, బాల్యవివాహాలు, వరకట్న వేదింపులు, అక్రమ సంబంధాలు, ఈవ్ టీజింగ్, బెదిరింపులు, మహిళల అక్రమ రవాణా, సెల్ ఫోన్ ద్వారా జరిపే నేరాలు,మాదక ద్రవ్యాలకు లోనై హింసించడం, ఇంటి నుండి గెంటేయడం, పనిచేసే ప్రదేశంలో మహిళలపై వేధింపులు, తల్లితండ్రుల నిర్లక్ష్యానికి గురైనవారు 181 నెంబరుకు నిర్భయంగా కాల్ చేయవచ్చని ఆమె చెప్పారు. ఫిర్యాదు తీవ్రతను బట్టి సఖీ కేంద్రంలో సోషల్ మరియు లీగల్ కౌన్సిలర్ల ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని ఆమె చెప్పారు. అవసరమైతే పోలీసుల సహాయం కూడా తీసుకోవడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ కన్వీనర్ హిమబిందు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
రెండో విడత పంచాయితీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును సాయంత్రం 4 గంటలకు మొదలు పెట్టి, రాత్రి 10 గంటల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. దీనికి తగ్గ ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. బుధవారం జరగనున్నఎన్నికల ఏర్పాట్లపై, జిల్లా పరిషత్‌లోని కమాండ్ కంట్రోల్ రూము నుంచి పర్యవేక్షించారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరినదీ లేనిదీ, పోలింగ్ సామగ్రి అందినదీ లేనిదీ, మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కంట్రోల్ రూము సిబ్బందినుద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తి అయ్యేలా టేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఉదయం 6 గంటలు నుంచి కమాండ్ కంట్రోల్ రూములో పర్యవేక్షణ మొదలుపెట్టాలన్నారు. నిర్ణీత సమయం ఉదయం 6.30కి పోలింగ్ ప్రారంభించేలా చూడటం, 7.30 నుంచి గంటగంటకూ పోలింగ్ శాతాన్ని సేకరించి, నివేదికలు తయారు చేయాలన్నారు. అలాగే మధ్యాహ్నం 3.30 గంటలకు పోలింగ్ ముగించి, 4 గంటలకల్లా ఓట్ల లెక్కింపు ప్రారంభించేలా సిబ్బందిని సమాయత్తపరచాలన్నారు. ఉప సర్పంచ్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీచేసి, వెంటనే ఎన్నికను నిర్వహింపజేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సిహెచ్ కిశోర్ కుమార్, డిపిఓ కె.సునీల్ రాజ్‌కుమార్, డిడిఓ కె.రామచంద్రరావు తదితరులు కూడా సమీక్షలో పాల్గొన్నారు.
ఒమ్మి 4వ వార్డు ఎన్నిక వాయిదా
నెల్లిమర్ల మండలం ఒమ్మి గ్రామంలోని 4వ వార్డు ఎన్నికను వాయిదా వేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. పేర్లు తారుమారు అయి, పోటీ చేస్తున్న అభ్యర్థుల తుది జాబితాలో ఉండాల్సిన పేరు ఉప సంహరణ జాబితాలో పొరపాటుగా నమోదు కావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ కు నివేదించడం జరిగిందన్నారు. ఈ వార్డులో సర్పంచ్ కు సంబంధించిన పోలింగ్ మాత్రం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
విద్యకు సాంకేతికతను జోడించి, బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. విఎస్‌ఇజెడ్‌లోని హోబెల్ బిల్లోస్ కంపెనీ నిర్వాహకులు, ఏయూపాలక మండలి సభ్యులు వి.ఎస్ ఆంజనేయ వర్మ డిజిటల్ క్లాస్‌రూమ్‌కు అవసరమైన స్క్రీన్, ప్రొజెక్టర్‌లను మంగళవారం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి ద్వారా వడ్లపూడి ప్రాధమిక పాఠశాల ప్రతినధులకు బహూకరించారు. 15 డిజిటల్ క్లాస్‌రూమ్‌లకు అవసరమైన ఉపకరణాలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి మెరుగైన బోధనతో విద్యార్థుల్లో సమగ్ర అవగాహన కల్పించడం సాధ్యపడుతుందన్నారు. సంస్థ ప్రతినిధులను అభినందించారు.
విశాఖ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు బుధవారం జరగనున్న మూడవ దశ పోలింగుకు సంబంధించి పాడేరు డివిజన్లో సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. ఎన్నికలు జరగనున్న అనంతగిరి, అరకులోయ, పెదబయలు, ముంచంగిపుట్టు, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీ.కే.వీధి, కొయ్యూరు మండల కేంద్రాలలో జాయింట్ కలెక్టర్ లు ఎమ్. వేణుగోపాలరావు, పి.అరుణ్ బాబు, ఆర్.గోవిందరావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎస్.వెంకటేశ్వర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య పర్యవేక్షణలో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రశాంతంగా జరిగిందన్నారు. మండల కేంద్రాలలో ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారని చెప్పారు. సంయుక్త కలెక్టర్ ఎం.వేణుగోపాలరావు పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట మండలాలు, పి.అరుణ్ బాబు అరకు, అనంతగిరి, డుంబ్రిగుడ, ఐటీడీఏ పీవో ఎస్.వెంకటేశ్వర్ ముంచంగిపుట్టు, పెదబయలు మండలాలు, సంయుక్త కలెక్టర్ ఆర్.గోవిందరావు చింతపల్లి, జీకే వీధి మండలాల్లో, నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్య కొయ్యూరు మండలాలను పర్యటించారని, ఎన్నికలు జరగాల్సిన అన్ని మండలాలకు సామాగ్రి చేరుకుందని చెప్పారు. విధులకు హాజరు కావలసిన పోలింగు సిబ్బందికి మంగళవారం ఉదయం 4.00 గంటల నుండి ఆర్.టి.సి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి వారికి సంబంధిత మండలాలకు పంపించామన్నారు. అంతేకాకుండా జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసామన్నారు. మద్యం దుకాణాలను కౌంటింగు ప్రక్రియ పూర్తి అయ్యే వరకు మూసి వేస్తూ ఆదేశాలు జారీ చేయడం, అభ్యర్ధులు ప్రచార కార్యక్రమాలను 44 గంటలు ముందుగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసామని తెలిపారు. ఏజెన్సీ లో సమస్యాత్మక ప్రాంతాల్లో వ్యూహం తో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.
రథ సప్తమి వేడుకలు సందర్బంగా ఈ నెల 18వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ ను మళ్ళించడం జరుగుతుందని డిప్యూటి సూపరింటిండెంట్ ఆఫ్ పోలీసు ఎం.మహేంద్ర తెలిపారు. వన్ టౌన్ సర్కిల్ కార్యాలయంలో మంగళ వారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో డి.ఎస్.పి మాట్లాడుతూ 18వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి 20వ తేదీ ఉదయం 6 గంటల వరుకు ట్రాఫిక్ మళ్ళింపుపై ఆంక్షలు ఉంటాయన్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1. శ్రీకాకుళం టౌన్ నుండి గార, కళింగపట్నం వైపు వెళ్ళు ప్రయాణీకులు పి.ఎస్.ఎన్.మిల్లు జంక్షన్ నుండి 80 అడుగల రహదారి లేదా జిల్లా పరిషత్ రోడ్డు నుండి కలెక్టర్ ఆఫీస్ రోడ్, కొత్తపేట, కునుకుపేట జంక్షన్, కాజీపేట మీదుగా వాడాడ జంక్షన్ దిశగా మళ్ళించడం జరిగిందన్నారు.
2. కళింగపట్నం, గరా వైపు నుండి శ్రీకాకుళం టౌన్ వైపు వచ్చు ప్రయాణీకులు వాడాడ జంక్షన్ మీదుగా కాజీపేట, కునుకుపేట జంక్షన్, కొత్తపేట, కలెక్టర్ ఆఫీస్, 80 అడుగుల రహదారి లేదా జిల్లా పరిషత్ రోడ్ మీదుగా మళ్ళించడం జరిగిందన్నారు.
3. బందరువానిపేట, కళింగపట్నం, గార, బూరవల్లి వైపు నుండి శ్రీకాకుళం టౌన్ వచ్చే వాహనాలు సింగుపురం మీదుగా ఎన్.హెచ్ 16 మీదుగా మళ్ళించడం జరిగింది.
4. శ్రీకాకుళం టౌన్ నుండి గార, కళింగపట్నం, బందరువానిపైట వైపు వెళ్ళు వాహనాలు, శ్రీకాకుళం కాంప్లెక్సు నుండి బలగ, కొత్త రోడ్డు, ఎన్.హెచ్ 16 మీదుగా సింగుపురం దిశగా మళ్ళించడం జరిగింది.
5. శ్రీకాకుళుం టౌన్ నుండి అంపోలు, చల్లపేట జంక్షన్, శ్రీకూర్మం వైపు వెళ్ళు వాహనాలు శ్రీకాకుళం కాంప్లెక్సు నుండి బలగ, కొత్తరోడ్డు, ఎన్.హెచ్ 16 మీదుగా జైలు రోడ్డు దిశగా మళ్ళించడం జరిగింది.
6. శ్రీకూర్మం, చల్లపేట జంక్షన్, అంపోలు వైపు నుండి శ్రీకాకుళం టౌన్ వైపు వచ్చు వాహనాలు జైలు రోడ్డు, కొత్త రోడ్డు జంక్షన్, బలగ మీదుగా ఆర్.టి.సి కాంప్లెక్సు దిశగా మళ్ళించడం జరిగింది.
7. శ్రీకాకుళం వైపు నుండి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం నిమిత్తం ఆటోలు, కార్లలో వచ్చు భక్తులు తమ వాహనాలను 80 ఫీట్ రోడ్డులో ఎడమ వైపున, ద్విచక్ర వాహనంపై వచ్చే భక్తులు 80 ఫీట్ రోడ్డులో కుడి వైపున ఏర్పాటు చేసిన స్ధలంలో పార్కింగు చేయుటకు ఏర్పాట్లు చేయడం జరిగింది.
8. కళింగపట్నం,గార వైపు నుండి వచ్చు భక్తులు తమ వాహనాలను వాడాడ జంక్షన్ దాటిన తరువాత కుడి వైపున గల పార్కింగు స్దలంలో పార్కింగు చేయాలని డి.ఎస్.పి చెప్పారు. భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకొనుటకు ప్రతి ఒక్కరూ పూర్తి సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాలని కోరారు.
అరసవల్లి ఆలయ కార్యనిర్వాహక అధికారి వి.హరి సూర్యప్రకాష్ మాట్లాడుతూ 18వ తేదీ 12 గంట్ల నుండి రథసప్తమి వేడుకలు ప్రారంభం అవుతాయన్నారు. అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పారు. 18వ తేదీ రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు స్వామి వారికి క్షీరాభిషేకం జరుగుతుందన్నారు. అనంతరం నిజ రూప దర్శనం కలుగుతుందని పేర్కొన్నారు. ఉచిత దర్శనం, వంద రూపాయల టికెట్ దర్శనం ఇంద్ర పుష్కరిణి మీదుగా క్యూలైన్ వస్తుందన్నారు. విరాళాలు ఇచ్చిన దాతలకు ప్రత్యేక క్యూ లైన్ ఉంటుందని, ఉదయం 10 గంటల వరకు విరాళ దాతలకు అవకాశం ఉంటుందని చెప్పారు. వి.వి.ఐ.పిలకు, వి.ఐ.పిలకు పాస్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వి.ఐ.పి పాస్ లకు వేడుకల ప్రత్యేక అధికారి మరియు రెవిన్యూ డివిజనల్ అధికారికి వివరాలు సమర్పించాలని పేర్కొన్నారు.
ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో పోలీసు ఇన్ స్పెక్టర్లు సి.హెచ్.అంబేద్కర్, పి.వి.రమణ, సబ్ ఇన్ స్పెక్టర్ విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో బుధవారం జరగనున్న మూడవ దశ పంచాయతీ ఎన్నికలలో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. మూడవ దశ ఎన్నికలు జిల్లాలోని ఆమదాలవలస, పాలకొండ మరియు రాజాం నియోజకవర్గాలలో గల ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి, భామిని, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని, రేగిడి మండలాల్లోని 293 పంచాయతీలు, 2,648 వార్డులలో ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. ఈ విడతలో 3లక్షల 77వేల 867 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని జిల్లా కలెక్టర్ చెప్పారు. వీరంతా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటు వేసేందుకు అర్హులని, తమ పంచాయతీ జాబితాలో ఉన్న వారందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఒక మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందన్న సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు. గ్రామ పంచాయతీలో జరిగే ఈ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం కలుగుతుందన్న విషయాన్ని ప్రతీ ఓటరూ గుర్తించి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు బుధవారం జరగనున్న మూడవ దశ పోలింగుకు సంబంధించి ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. మూడవ దశ ఎన్నికలు జరగనున్న ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి, భామిని, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, రేగిడి మండలాల ప్రధాన కేంద్రాలలో మండల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం నుండి ప్రారంభించారు. మూడవ దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం బూర్జతో పాటు పలు ప్రాంతాలను సందర్శించి పంచాయతీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అలాగే సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ ఆమదాలవలసలతో పాటు పలు ప్రాంతాలను, ఆర్.శ్రీరాములు నాయుడు పాలకొండలోని పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడవ దశ పోలింగుకు సంబంధించిన పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా పూర్తయిందని తెలిపారు. ఎన్నికలు జరగాల్సిన 9 మండలాలకు సామాగ్రి చేరుకుందని చెప్పారు. విధులకు హాజరు కావలసిన 9 మండలాల పోలింగు సిబ్బందికి మంగళవారం ఉదయం 5.00 గంటల నుండి ఆర్.టి.సి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని కలెక్టర్ తెలిపారు. ఇదేకాకుండా జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసామన్నారు. ఏకగ్రీవాలు మినహా మిగిలిన అన్ని గ్రామ పంచాయతీలలో పోలింగు జరుగుతుందని ఆయన చెప్పారు. మద్యం దుకాణాలను కౌంటింగు ప్రక్రియ పూర్తి అయ్యే వరకు మూసి వేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. అభ్యర్ధులు ప్రచార కార్యక్రమాలను 44 గంటలు ముందుగా నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసామని, పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 18 న తిరుపతి ప్రత్యేక పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం ఈ నెల 18 న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో అందుకు సంబందించిన ఏర్పాట్ల లో భాగంగా రేణిగుంట పాత విమానాశ్రయం లో జిల్లా కలెక్టర్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ గిరీషా లతో కలసి ఏ.ఎస్.ఎల్, సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత రేణిగుంట పాత విమానాశ్రయంలో ముఖ్యమంత్రి పర్యటన కు సంబందించి భద్రతా ఏర్పాట్లు ఇతర సంబందిత అంశాలపై ఇంటెలిజెన్స్ ఎస్పీ సుబ్రమణ్యస్వామి, తిరుపతి ఆర్డిఓ కనకనరసారెడ్డి, ఎయిర్పోర్టు డైరెక్టర్ సురేష్, సి.ఐ.ఎస్.ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ డి.సి.శుక్ల, ఆర్ అండ్ బీ ఇ.ఇ సుధాకర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బాలరాజు, తహశీల్దార్ శివప్రసాద్ ఇతర సంబందిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటన చేయు ప్రాంతాలలో ఏ.ఎస్.ఎల్ నిర్వహించారు. ఇందులో భాగంగా రేణిగుంట విమానాశ్రయం నుండి ముఖ్యమంత్రి ప్రయాణించు మార్గాన్ని మరియు చెన్నా రెడ్డి కాలనీలో రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్ నివాస గృహం ( వైట్ హౌస్) వద్ద భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. 1971 లో భారత్ - పాకిస్తాన్ కు జరిగిన యుద్ధం లో మహావీర చక్ర అవార్డు పొందిన రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్ (95 సంవత్సరాలు) పి వి ఎస్ ఎం , ఎం వి సి వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు రిటైర్డ్ మేజర్ జనరల్ కు సన్మాన కార్యక్రమం ఉన్నందున వారి నివాస గృహం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పోలీసు పేరేడ్ గ్రౌండ్ నందు ఈ నెల 18 న సాయంత్రం జరుగు మెగా ఈవెంట్ కార్యక్రమంలో గౌ.ముఖ్యమంత్రి పాల్గొననున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసు పేరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాట్లను పరిశీలించుటలో తిరుపతి అడిషనల్ కమీషర్ హరిత, బ్రిగేడియర్ జె.ఎస్. బ్రిన్డర్, కల్నల్ లు రాహుల్ షరీన్, సుమిత్ చద్దా , గంగా సతీష్ , స్మార్ట్ సిటీ జి.ఎం చంద్ర మౌళి ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొవిడ్ నియమ నిబంధనలను అనుసరిస్తూ జిల్లాలో ఈ నెల 17 న మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మదనపల్లె డివిజన్ కు చెందిన 14 మండలాల్లో 270 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడవ విడతలో 270 గ్రామ పంచాయతీలకు గాను వివిధ కారణాల రీత్యా 6 పంచాయతీలు మినహా 264 పంచాయతీలకు, 2,784 వార్డులలో 58 వార్డుల మినహా 2,726 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ విడదల చేయడం జరిగిందని తెలిపారు. అందులో 91 గ్రామ పంచాయతీలు, 1585 వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నిక అయినందున మరియు 25 వార్డు మెంబర్లకు నామినేషన్లు ధాఖలు కానందున మిగిలిన 173 సర్పంచ్ లకు మరియు 1,116 వార్డు మెంబర్లకు బుధవారo నాడు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో 2,76,207 మంది పురుషులు, 2,74,306 మంది స్త్రీలు మరియు 26 మంది ఇతరులు మొత్తం 5,50,539 మంది ఓటర్లు పాల్గొననున్నారని తెలిపారు. ఈ విడతలో 173 సర్పంచ్ స్థానాలకు గాను 1217 మంది, 1116 వార్డ్ మెంబర్ల స్థానాలకు గాను 2907 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 1483 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో 54 అత్యంత సమస్యాత్మక మరియు 59 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ పోలింగ్ కు సంబంధించి 88 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందని మరియు ఈ పోలింగ్ కేంద్రాలకు అవసరమైన స్థాయిలో పోలీసు బందోబస్త్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి 3200 పెద్దవి, 898 చిన్న బ్యాలెట్ బాక్స్ లను సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తరలించామని తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 87 మంది స్టేజ్ – 1 మరియు 308 మంది స్టేజ్ – 2 ఆర్ఓ లను, 1791 మంది పోలింగ్ అధికారులు(పి ఓ లు ), 173 మంది ఏఆర్ఓ లను, 34 మంది జోనల్ ఆఫీసర్లను, 65 మంది రూట్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సిబ్బంది మరియు సామగ్రి తరలింపుకు అవసరమైన 174 బస్సుల ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకొంటున్నారని తెలిపారు. ఎన్నికల సామగ్రి తరలింపుకు 14 సామాగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, కొవిడ్ దృష్ట్యా ఎన్నికల సిబ్బందికి 7124 మాస్కులు, 1490 లీటర్ల హ్యాండ్ స్యానిటైజర్లు, 7124 హ్యాండ్ గ్లౌజ్ లు అందజేయడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు, కవర్లు, బుక్లెట్లు, రబ్బరు స్టాంప్ లు వంటి ఇతర సామగ్రిని ఎంపిడిఓ లకు సమకూర్చడం జరిగిందన్నారు.
మూడవ విడత పోలింగ్ ఉదయం 6.30 గం.ల నుండి మ.3.30 గం.ల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఆ వెంటనే ఓట్ల లెక్కింపునకు సంబంధించి 692 మంది సూపర్ వైజర్లు, 2076 మంది కౌంటింగ్ స్టాఫ్ ను నియమించడం జరిగిందన్నారు.
విజయనగరం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను మార్చి 10 వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ చెప్పారు. ఈ నెల 17న జిల్లాలో జరిగే రెండోవిడత పంచాయితీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామన్నారు. జిల్లా ఎస్‌పి బి.రాజకుమారితో కలిసి మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాల్టీలు, నెల్లిమర్ల నగర పంచాయితీకి మార్చి 10న ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. 13న రీపోలింగ్ నిర్వహిస్తామని, 14న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. విజయనగరం కార్పొరేషన్‌లో 50 డివిజన్లు, బొబ్బిలిలో 31 వార్డులు, పార్వతీపురంలో 30, సాలూరులో 29, నెల్లిమర్లలో 20 వార్డులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. విజయనగరంలో 336, బొబ్బిలిలో 165, పార్వతీపురంలో 176, సాలూరులో 182, నెల్లిమర్లలో 108 నామినేషన్లు అర్హత పొందాయని, ఉప సంహరణకు మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలు వరకూ గడువు ఉందని చెప్పారు. ఈ ఎన్నికలకు విజయనగరంలో 196, బొబ్బిలిలో 62, పార్వతీపురంలో 49, సాలూరులో 49, నెల్లిమర్లలో 20, మొత్తం 376 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికకు 465 బ్యాలెట్ బాక్సులు, 81 మంది ఆర్ఓలు, ఓఆర్ఓలు, 441 మంది పిఓలు, 441 మంది ఏపిఓలు, 1393 మంది ఓపిఓలను వినియోగించనున్నట్లు చెప్పారు. ఛైర్‌పర్సన్, మేయర్ పదవులకు సంబంధించి విజయనగరం బిసి మహిళకు, బొబ్బిలి బిసీలకు, పార్వతీపురం బిసి మహిళకు, సాలూరు ఓసి మహిళకు, నెల్లిమర్ల ఎస్‌సి మహిళకు రిజర్వు అయినట్లు తెలిపారు. టార్గెట్-90 పేరుతో మున్సిపాల్టీల్లో అత్యధిక ఓటింగ్ జరిగేందుకు కృషి చేస్తామని కలెక్టర్ చెప్పారు.
ఫేజ్-3లో భాగంగా బుధవారం జరగనున్న రెండో విడత పంచాయితీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ విడతలో మొత్తం 248 గ్రామ పంచాయితీలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, కోర్టు ఆదేశాల ప్రకారం 4 పంచాతీలను మినహాయించి, 244 పంచాయితీలకు, 2330 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలను నిర్వహిస్తుండగా, వీటిలో 37 సర్పంచ్ పదవులు, 610 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. ఇవి పోగా 207 సర్పంచ్ పదవులు, 1720 వార్డులకు 17న ఎన్నికలు జరుగుతాయని, మొత్తం 3,60,181 మంది తమ ఓటుహక్కును వినియోగించనున్నారని తెలిపారు. సర్పంచ్ స్థానాలకు 642 మంది, వార్డు మెంబరు పదవులకు 3791 మంది పోటీ పడుతున్నారని చెప్పారు. వీరికోసం 2,030 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. తొలివిడత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఈ సారి కౌంటింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. కౌంటింగ్‌ను సకాలంలో ప్రారంభించి, రాత్రి 10 గంటలకల్లా పూర్తి చేసేందుకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు.
ఎస్‌పి బి.రాజకుమారి మాట్లాడుతూ రెండోవిడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 207 పంచాయితీల్లో 62 సమస్యాత్మక ప్రాంతాలు, 46 అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సాయుధ దళాలను వినియోగించనున్నట్లు చెప్పారు. అలాగే 82 రూట్ మొబైల్ టీమ్స్, 80 స్ట్రైకింగ్ ఫోర్సెస్, మరో 80 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లోని 17,046 మందిని ఇప్పటివరకు బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 7వేల లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. 88వేల సారాయి ఊటలకు ద్వంసం చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజు శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక దళాలను వినియోగించనున్నట్లు ఎస్‌పి తెలిపారు.
విలేకర్ల సమావేశంలో జాయింట్ కలెక్టర్(అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, డిపిఓ కె.సునీల్ రాజ్‌కుమార్, సిపిఓ జె.విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్లు ఎస్ఎస్ వర్మ, ఎం.మల్లయ్యనాయుడు, కె.కనకమహాలక్ష్మి, కెవి రమణమూర్తి, పి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.