అనంతపురం జిల్లాలో రైతుల పొలాల్లో పంట పరిస్థితిని పరిశీలించి, గుంతకల్లు రైల్వే గెస్ట్ హౌజుకు చేరుకున్న కేంద్ర బృందాన్ని మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ కలిసారు. శివమాలలో కనిపించిన మంత్రి... అధిక వర్షాల వల్ల జిల్లా రైతులు చాలా నష్టపోయారని, నిత్యం కరువు కోరల కింద నలిగిపోతున్న రైతన్నలు ఆదుకోవాలని, పరిహారం అందించడంలో కేంద్రం భోళా శంకరుడిని తలపించాలని కోరారు. మరికొన్ని గ్రామాల్లో తానూ పర్యటించాలని మంత్రి నిర్ణయించుకున్నప్పటికీ... అప్పటికే సమయం మించిపోయినందున కేంద్ర బృందం తిరుగు ప్రయాణం కట్టడంతో కేంద్ర బృందంతో కలిసి పంటలను పరిశీలించలేక పోయారు..అధిక వర్షాల కారణంగా పంట నష్టం అంచనా వేసేందుకు జిల్లాకు వచ్చిన కేంద్ర బృందాన్ని కలిసి ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామి రెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డిలు జిల్లాలో ఈ యేడు జిల్లాలో వచ్చిన పచ్చి కరువును గురించి వివరించారు..
అనంతపురం జిల్లాలో అధిక వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంపై కేంద్ర బృందం సానుకూలంగా స్పందించిందని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. సోమవారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో రూ.1200 కోట్ల పంట నష్టం జరిగిందనీ.. ఉద్యాన పంటలు, రోడ్లు మరియు ఇతర నష్టం మరో రూ.150 కోట్లుగా ఉందని కేంద్ర బృందానికి వివరించామన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రమే కేంద్ర బృందం పర్యటించాల్సి ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లాలోని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనంతలోనూ బృందం పర్యటించేలా కృషిచేశారన్నారు. ప్రత్యేక చొరవ తీసుకున్న ముఖ్యమంత్రికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో 4 లక్షల 76 వేల హెక్టార్లలో వేరుశనగ పంట నష్టం వాటిల్లిందన్నారు. మొత్తం ఆధారాలతో కేంద్ర బ్రుందానికి వివరించామని చెప్పిన కలెక్టర్ అధికారులు కూడా రైతుల కష్టాలను, నష్టాలను స్వయంగా తెలుసుకున్నారని వివరించారు.
విశాఖ జిల్లాలో ఈ నెల 10వ తేదీన జరుగనున్న జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం ఏర్పాట్లను జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్ పరిశీలించారు. జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం ఏర్పాట్లను బీచ్ రోడ్డులో ని ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ ను సోమవారం ఆయన పరిశీలించారు. వేదికపై ఏర్పాట్లు, ముఖ్య అతిథులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గోనున్నందున ఏర్పాట్లను ఆయన పరిశీలించి ప్రజా ప్రతినిధులు, అధికారులకు సీట్లు కేటాయింపుకు సంబంధించి చూసుకోవాలని పట్టణ తహసీల్దార్ ఎ. జ్ఞనవేణి ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి రామ్మోహన్ రావు, పట్టణ తహసీల్దార్ ఎ. జ్ఞనవేణి, ఆర్.ఐ.లు రవికృష్ణ, చైతన్య, తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో వై.యస్.ఆర్.కాపునేస్తం క్రింద మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15,000/-లు జమచేసినట్లు బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. జిల్లాలోని 45 సం.ల నుండి 60సం.ల మధ్య వయస్సు గల కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల్లోని మహిళలందరూ వై.యస్.ఆర్.కాపునేస్తం పథకానికి అర్హులేనని అన్నారు. వై.యస్.ఆర్. కాపు నేస్తం క్రింద తొలి విడతగా జూన్ 24న జిల్లాలోని 4,239 మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో 6.36 కోట్లు జమచేసిన సంగతి అందిరికీ విదితమే. నవంబర్ 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా వై.యస్.ఆర్. కాపునేస్తం రెండవ విడత క్రింద ఒక్కో మహిళకు రూ.15,000/-లు వంతున జిల్లాలోని 1,547 మంది మహిళలకు 2.32 కోట్ల రూపాయలు జమచేయడం జరిగిందని ఆయన వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆమదాలవలస మండలం సంకిలి జెడ్పి ఉన్నత పాఠశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. 9,10 తరగతులకు జరుగుతున్న విద్యా బోధన పరిశీలించారు. కోవిడ్ నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నది పరిశీలించారు. విద్యార్ధులకు ఇప్పటి వరకు పూర్తి చేసిన సిలబస్ వివరాలు పరిశీలించారు. విద్యార్ధుల నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు తనిఖీ చేసారు. బోధన చేస్తున్న విధానాన్ని ఉపాధ్యాయులకు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల అంటే పవిత్రమైన స్థలం అని పేర్కొంటూ అందరూ సమానమేనని గుర్తించాలని, ఆ విధంగా విద్యార్ధులను తీర్చిదిద్దాలని ఉద్భోదించారు. జగనన్న విద్యా కానుకలో పంపిణీ చేసిన బ్యాగ్ లు, పుస్తకాలు, బూట్లను పరిశీలించిన ప్రవీణ ప్రకాష్ విద్యార్థులు బూట్లు వేసుకోకపోవడం పట్ల అధికారులు, ఉపాద్యాయులను ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు కావాలని ఆదేశాలు జారీ చేసారు. అధికారులు ముఖ్యంగా ఐ.ఏ.ఎస్ అధికారులు పథకాల అమలులో ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. ఐ.ఏ.ఎస్ అధికారులు అంటే ఆఫీస్ ఆన్ వీల్స్ అని ప్రతి కార్యక్రమం అమలులో ప్రత్యేక ముద్ర వేయాలని అన్నారు. దేశంలో క్రమశిక్షణ గల రాష్ట్రాలుగా ఆంధ్ర, తమిళనాడు కు పేరుందని దానిని నిలబెట్టాలని సూచించారు. గత నెల 6వ తేదీన విద్యా కానుక పంపిణీ చేయగా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడాన్ని ప్రశ్నిస్తూ తక్షణమే అమలుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుత వసతుల పట్ల ప్రతి ఒక్కరికీ తెలియాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ గల ఉపాద్యాయులు ఉన్నారని, ఐ.ఏ.ఎస్, ఇంజినీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు తదితరులను ఉపాధ్యాయులే తయారు చేస్తారని పేర్కొన్నారు. సమాజంలో గొప్ప ఉపాద్యాయులు ఉన్నారని పేర్కొంటూ విలువలుగల సమాజాన్ని తయారు చేయడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని చెప్పారు. చిన్నప్పటి నుండి ఉత్తమ బోధనను అందించి ఉన్నతులుగా తయారు చేయాలని అన్నారు.
జిల్లా పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ సీతంపేటలో ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు మర్యాద పూర్వకంగా కలిశారు. ముఖ్య కార్యదర్శికి వీరఘట్టాం మండలం వండువ గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పాలకొండ శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి తన స్వగ్రామైన వండువలో ముఖ్య కార్యదర్శికి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్లు డా.కె.శ్రీనివాసులు, సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, ఐటిడిఏ పిఓ సి.హెచ్.శ్రీధర్, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, పాలకొండ ఆర్.డి.ఓ టివిఎస్ జి కుమార్, పీఆర్ ఎస్ఇ ఎస్.రామ్మోహన్, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, గిరిజన సంక్షేమ శాఖ డిడి ఎం. కమల, ఇఇ జి.మురళి, గురుకులం ప్రిన్సిపాల్ సురేష్ కుమార్, సంబంధిత మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పక్కాగా అమలు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నాడు నేడు పనులు, గ్రామ సచివాలయాల పనితీరు, భవనాల నిర్మాణాల ప్రగతిని పరిశీలించుటకు సోమ వారం ముఖ్య కార్యదర్శి జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా సీతంపేటలో గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, వీరఘట్టాం మండలం వండువ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాడు - నేడు పనులు., సీతంపేట మండలం పెద్దూరు, వండువలో సచివాలయ భవనం, హైల్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. నాడు – నేడు క్రింద చేపట్టిన మరుగుదొడ్ల ఆధునీకరణ పనులు పరిశీలించారు. ఆధునీకరణకు ముందు ఉన్న స్ధితి ఫోటోలు ఉండాలని ఆయన చెప్పారు. మరుగుదొడ్లలో ఉపయోగించిన పరికరాలు, నీటి సరఫరాను పరిశీలించారు. ట్యాప్ నుండి వస్తున్న నీటి ఫోర్సును పరిశీలించగా నెమ్మదిగా సరఫరా కావడంపై సంబంధిత ఇంజనీర్లను ప్రశ్నించారు. నీరు ఫోర్సుగా రావాలని ఆదేశించారు. ఆది వారం నాడు పనులు ముగించామని, టెస్టింగు చేయాల్సి ఉందని ఇంజనీర్లు తెలియజేయగా నవంబరు 3వ తేదీన పాఠశాలలు ప్రారంభం కావలసి ఉందని, ప్రారంభం అయి ఉంటే పరిస్ధితి ఏమిటని ప్రశ్నించారు. పై అధికారులు వచ్చి తనిఖీ చేస్తారని పనులు చేపట్టడం కాదని పనిలో నిమగ్నత ముఖ్యమని వృత్తి నిపుణత పాటించాలని పేర్కొన్నారు. ప్రజలు చెల్లించిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని దానిని పూర్తి స్ధాయిలో సద్వినియోగం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేసారు. నాడు – నేడు కార్యక్రమం ప్రాధాన్యతను గుర్తించాలని, ముఖ్య మంత్రి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని ఆయన అన్నారు. నాడు – నేడు కార్యక్రమంలో నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్ల కల్పన, తాగు నీరు, పాఠశాల మరమ్మతులు, విద్యుదీకరణ – ఫ్యాన్ లు, విద్యుద్దీపాల కల్పన, ఫర్నీచరు, గ్రీన్ బోర్డు, పాఠశాలలకు ఆహ్లాదకర రంగులు, ఇంగ్లీషు లాబ్ లు, ప్రహారీగోడల నిర్మాణం పనులు చేపట్టాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. పనులు చేపట్టిన అనంతరం నిర్వహణ పక్కాగా ఉండాలని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలల కంటే అధిక స్థాయిలో ఉన్నామని పిల్లల్లో భావన కలగాలని అన్నారు. అధికారులు అభివృద్ది కార్యక్రమాలలో ఏ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశాన్ని గుర్తించాలని ఆయన స్పష్టం చేసారు. అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన రంగాల్లో ప్రారంభం కావాలని సూచించారు. పెద్దూరులో గ్రామ సచివాలయం, వై.యస్.ఆర్ హెల్త్ క్లినిక్, వై.యస్.ఆర్ రైతు భరోసా కేంద్రం పనులు పరిశీలించుటకు విచ్చేసిన ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు గ్రామ ప్రజలు సవర నృత్యంతో ఘన స్వాగతం పలికారు. నృత్య బృందంలోని గిరిజన మహిళలకు ఆసరా, చేయూత తదితర పథకాల క్రింద అందిన ఆర్ధిక సహాయంపై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అమలు పట్ల ప్రజల్లో అవగాహన ఉండాలని అన్నారు. తదుపరి విడతల్లో అందే మొత్తాలను గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఏ పథకం క్రింద ఎంత మొత్తం అందుతుందో ప్రతి ఒక్కరికి విధిగా తెలిసి ఉండాలని ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. పెద్దూరులో గ్రామ సచివాలయంను రూ.40 లక్షలు, వై.యస్.ఆర్ హెల్త్ క్లినిక్ ను రూ.17.50 లక్షలు, వై.యస్.ఆర్ రైతు భరోసా కేంద్రం ను రూ.21.80 లక్షలతో నిర్మాణం పనులు చేపడుతున్నారు. మండలంలో ప్రారంభమైన సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ ల పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. వండువ గ్రామ సచివాలయంను తనిఖీ చేసిన ముఖ్య కార్యదర్శి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఎం.పి.డి.ఓ ను ప్రశ్నించారు. రెండవ విడతలో పంపిణీ చేస్తున్న చేదోడు, వాహన మిత్ర,, చేయూత తదితర కార్యక్రమాల లబ్దిదారుల వివరాలు ఎందుకు ప్రదర్శించ లేదని ప్రశ్నించారు. సచివాలయం గోడపై పథకాలకి స్థలాన్ని కేటాయిస్తూ వాటి వివరాలు పెట్టాలని ఆదేశించారు. ప్రతి కార్యక్రమం వివరాలు అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేసారు. సచివాలయంలో ప్రతి ఉద్యోగి సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో ప్రతి సచివాలయ ఉద్యోగి భాగస్వామ్యం కావాలని అన్నారు. ఇది నా బాధ్యత కాదు అనే భావన ఉండరాదని స్పష్టం చేసారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందాలనే ఆశయంతో ముఖ్యమంత్రి సచివాలయాలను ఏర్పాటు చేశారని గుర్తించాలని చెప్పారు. ఆ ఆశయాలు గ్రామ సచివాలయం ద్వారా నెరవేరాలని, స్ఫూర్తి దాయక పనితీరు కనపడాలని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ జాయింట్ కలెక్టర్ తనిఖీలు నిర్వహిస్తూ వ్యవస్థ సక్రమంగా పనిచేసేటట్లు కృషి చేయాలని ఆదేశించారు. సచివాలయం చక్కని పనితీరుకు జాయింట్ కలెక్టర్ మార్గదర్శనం చేయాలని అన్నారు. అనంతరం నిర్మాణం లో ఉన్న సచివాలయ భవనాన్ని పరిశీలించారు.
డయల్ యువర్ కమిషన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను అధికారులు శాఖల వారీగా పరిష్కరించాలని జివిఎంసి కమిషనర్ డా.స్రిజన అధికారులను ఆదేశించారు. సోమవారం జివిఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ, ఏ లక్ష్యంతో అయితే డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామో దానిని అధికారులు బాధ్యతగా స్వీకరించాలన్నారు. అదే సమయంలో ఫిర్యాదులపై స్పందించని అధికారులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఈరోజు ఒకటవ జోనుకు 03, రెండవ జోనుకు 05, మూడవ జోనుకు 06, నాల్గవ జోనుకు 06, అయిదవ జోనుకు 03, ఆరవ జోనుకు 07, ఏడవ(అనకాపల్లి) జోనుకు 01, మొత్తము 31 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ డా. జి. సృజన ప్రధాన కార్యాలయ విభాగపు ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు ఆషాజ్యోతి, రమణి, సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వరరావు, డి.సి.(ఆర్) ఎ. రమేష్ కుమార్, పి.డి.(యు.సి.డి) వై. శ్రీనివాసరావు, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ వై. మంగపతిరావు, సి.ఎం.ఓ.హెచ్ డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జె.డి.(అమృత్) విజయ భారతి, ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ, ఏ.డి.హెచ్ దామోదర రావు, డి.ఇ.ఓ. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సింహాచలం ట్రస్టు బోర్డు, మన్సాస్ ట్రస్టు బోర్డు చైర్మన్ సంచయిత గజపతిరాజు టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై గట్టిగా ఫైర్ అయ్యారు. ఆయన అక్రమాలు బయట పడుతున్నాయి కాబట్టే ఉద్యమాల పేరిట రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 150 ఏళ్ల చారిత్రక మోతీమహల్‌ను కూల్చినపుడు ఉద్యమం ఎందుకు చేయలేదని అశోక్ సోమవారం గజపతిరాజును ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఈ మేరకు.. ‘‘8 వేల ఎకరాల మన్సాస్ భూములను ఎకరా 5 వందల రూపాయలకు మీ అనునాయులకు లీజుకి కట్టబెట్టినపుడు నిజానికి సేవ్ మన్సాస్ ఉద్యమాన్ని చేయాల్సింది కదా... అసలు మార్కెట్ ధరకు మీరిచ్చిన లీజులకు ఏమైనా సంబంధం ఉందా? అంటూ ప్రశ్నించారు. కనీసం లాయర్‌ను పెట్టుకోవడం కూడా చేతకాక రూ. 13 కోట్ల నష్టాన్ని కలిగించే విధంగా, మన్సాస్ భూములు ఎక్స్‌పార్టీ డిక్రీ ద్వారా అన్యాక్రాంతమైనపుడు మీరు ఉద్యమం చేసి ఉంటే బాగుండు నేమో 2016-2020 మధ్య కాలంలో మీరు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో మన్సాస్ విద్యాసంస్థలకు 6 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. దీనికేం సమాధానం చెబుతారంటూ మండిపడ్డారు. మీరు చైర్మన్‌గా ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నుంచి అవసరమైన అనుమతులు తెచ్చుకోకపోవడంతో 170 మందికి ఇచ్చిన డిగ్రీలు చెల్లుబాటుకాకుండా పోయాయి గుర్తుందా... అప్పుడు ‘‘సేవ్ మన్సాస్’’ ఉద్యమం చేయాల్సింది అంటూ చురకలంటించారు... సరైన ఆడిటింగ్ నిర్వహించక, మాన్యువల్‌గా తప్పుడుతడకలుగా ఆడిటింగ్ చేయించినపుడు ఉద్యమం ప్రారంభిస్తే అసలు రంగు బయటపడేది. అన్నీచేసి ఇపుడు ఏడిస్తే సుఖమేంటని, టీడీపీ ప్రభుత్వ హయాంలో మన్సాస్‌కు రావాల్సిన 30 కోట్ల రూపాయల నిధులు రాబట్టుకోవడం చేత కాలేదా అని ప్రశ్నించారు.. అప్పుడు సేవ్ మన్సాస్ అంటే కొంతైనా ప్రయోజనం ఉండేది.. కొద్దిగైనా పోయిన డబ్బులు తిరిగి వచ్చేవి కదా అని నిలదీశారు.. అశోక్ గారూ.. మీరు ఎంఆర్ కాలేజీపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చారు. మీరు చైర్మన్‌గా ఉన్నపుడే ఇది ఒక ప్రైవేట్ కాలేజీ, ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని(గవర్నమెంటు ఎయిడ్) మీరే తీసేశారు. ఆ విధానమే ఇప్పుడు కొనసాగుతోంది’’ అంటూ అశోక్ గజపతిరాజు తీరును ఎండగట్టారు సంచయిత. వాస్తవానికి తానే సేవ్ మన్సాస్ ఉద్యమం నడుపుతున్నానని, ట్రస్టు పూర్వవైభవాన్ని పునురుద్ధరిస్తానన్న సంచయిత.. మీరు మీ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోండి అంటూ అశోక్ గజపతిరాజుకు హితవు పలికారు. సేవ్ మన్సాస్ పేరుతో చేస్తున్నది ‘‘సేవ్ అశోక్’’ క్యాంపెయిన్ మాత్రమేనంటూ చురకలు అంటించారు. దీంతో సంచయిత ట్వీట్లు..తెలియజేసిన వాస్తవాలతో సేవ్ మాన్సాస్ ఉద్యమం వెనుక ఏం జరుగుతుందనేది ప్రజలకు తెలియజేయడం హాట్ టాపిక్ గా మారింది..
స్పందన దరఖాస్తులపై ఆయాశాఖల అధికారులు తక్షణమే స్పందించాలని జివిఎంసి కమిషనర్ డాక్టరు జి. సృజన అధికారులను ఆదేశించారు. సోమవాంర కమిషనర్ తన చాంబర్లో కార్పోరేషన్ ఉన్నతాధికార్లతో అర్జీ దారులు స్పందనలో సమర్పించిన ఆర్జీల పరిష్కార వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన కార్యాలయ స్థాయి, జోనల్ స్థాయిలో గల పెండింగ్ ఫైల్స్ పరిష్కారానికి తగు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ఫైల్స్ లను ఇ-ఆఫీసు విధానం ద్వారా తనకు ఆమోదం నిమిత్తం సమర్పించాలని ఆదేశించారు. అ విధంగా సిబ్బంది చేస్తున్నారో లేదో ఐ.టి. విభాగం వారు ఒక యాప్ ద్వారా పరిశీలించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ప్రతీ విభాగంలోనూ పెండింగ్ లో ఉన్న కరెంట్ ఫైల్స్ వివరాలను గురువారం నాటికి సమర్పించాలని అదనపు కమిషనర్లకు సూచించారు. వార్డు సచివాలయాల నుండి ప్రధాన ఆఫీసరు వరకు కూడ ప్రజా విన్నపములు పౌర నియమావళి అనుగుణంగా నిర్ణీత సమయాలలోనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. న్యాయస్థానంలో గల వ్యాజ్యాములపై పూర్తిస్తాయి వివరాలు తనకు సమపర్పించాలని ఆదేశించారు. వార్డు సచివాలయం లను తనిఖీ చేయని ప్రత్యేక అధికారులకు షోకాజ్ నోటీసులు అందించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు గుర్తించిన 165 నీటి వనరులలో కలుపు మొక్కలను, మట్టిని తీయడానికి కావాల్సిన అంచనాలను తయారు చేయాలని ప్రధాన ఇంజినీరును ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు ఆషాజ్యోతి, రమణి, సన్యాసి రావు, ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వరరావు, డి.సి.(ఆర్) ఎ. రమేష్ కుమార్, పి.డి.(యు.సి.డి) వై. శ్రీనివాసరావు, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ వై. మంగపతిరావు, సి.ఎం.ఓ.హెచ్ డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జె.డి.(అమృత్) విజయ భారతి, ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ, ఏ.డి.హెచ్ దామోదర రావు, డి.ఇ.ఓ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న ద్రోహాన్ని వైసిపి, టిడిపి పార్టీలు రెండు ఎందుకు రాజీ పడుతున్నాయి అన్న అంశంపై సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ముద్రించిన ‘‘రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపితో వైసిపి, టిడిపి రాజీ ఎందుకు?’’ అన్న పుస్తకాన్ని ఈరోజు సిపిఎం నగర కార్యలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా నగర కార్యదర్శి డాక్టర్ బి.గంగారావ్ మాట్లాడుతూ 2014లో రాష్ట్ర విభజన సందర్భంలో కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఆనాడు బిజెపి ప్రకటించింది కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బిజెపి ఆరు సంవత్సరాల నుండి పరిపాలిస్తూ వాగ్దానం అమలు చేయాలేదని విమర్శించారు. ఆనాడు పార్లమెంటులో ఆమోదించిన విభజన చట్టంలో అనేక వాగ్ధానాలు చేసినా... రాజధాని నిర్మాణానికి ,వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తగినన్ని నిధులు ఇస్తామని, కడప స్టీల్ ప్లాంట్ కర్మాగారం, దుగ్గరాజుపట్నం ఓడరేవు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు వాగ్ధానాలు వెనక్కి పోయాయని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రానికి ఆర్ధిక పరిపుష్టిత కలిగించే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని రాష్ట్ర హక్కులను లాక్కుంటున్నారని ఇటువంటి తరుణంలో అధికారంలో ఉన్న వైసిపి పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి కనీసం స్పందించడం లేదని ఎందుకు కేంద్రంలో ఉన్న బిజెపితో రాజీ పడుతున్నారని ప్రశ్నించారు. ఈ సమస్యలపై వారం రోజుల పాటు నగర వ్యాప్తంగా పాదయాత్రలు, బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను చైతన్య పరుస్తామని వివరించారు. ఈ వారం రోజులు జరిగే ప్రచారానికి రెండులక్షల కరపత్రాలు 50 వేల పుస్తకాలను ముద్రించి ప్రజల్లో పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ పుస్తకావిష్కరణలో కార్యవర్గ సభ్యులు ఆర్‌కెయస్వీ కుమార్, నగర కమిటీ సభ్యులు పి.మణి, వి.కృష్ణారావు, మద్దిలపాలెం జోన్ కమిటీ సభ్యులు ఎ.అప్పారావు, పి.వెంకటరావు, కుమారి తదితరులు పాల్గొన్నారు.
సామాజిక రుగ్మలతను రూపుమాపడానికే చట్టాలను రూపొందించమిని జిల్లా జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జి.రామకృష్ణ తెలిపారు. సోమవారం, ప్రభుత్వ మహిళా కళాశాలలో జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా మైక్రో లెవెల్ లీగల్ అవేర్ నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ, పౌరులంతా చట్టాలను తెలుసుకోవలసి అవసరం ఎంతైనా వుందన్నారు. 1987 వ సం.లో న్యాయ సేవాధికార సంస్థ ఏర్పడిందని, 1995 నవంబరు 9 వ తేదీన అమలులోకి రావడం జరిగిందని తెలిపారు. కోర్టు ఫీజు చెల్లించుకోలేని నిరుపేదలకు ఉచితంగా న్యాయాన్ని అందించే లక్ష్యంతేనే న్యాయ సేవాధికార సంస్థ ఏర్పడిందని తెలిపారు. కోర్టు ఫీజుతో పాటు కేసులను వాదించడానికి ప్రభుత్వ ఖర్చుతోనే అడ్వోకేట్ ను కూడా నియమించడం జరుగుతుందన్నారు. అత్యంత ధనవంతుడు పొందగలిగే న్యాయాన్ని అత్యంత పేదవాడు ఉచితంగా పొందే అవకాశం న్యాయ సేవాధికార సంస్థ ద్వారా కలుగుతుందన్నారు. విద్యార్ధులు చట్టాలపై అవగాహన పొంది చైతన్యవంతులు కావాలన్నారు. మహిళలు ఆపదలో రక్షణకోసం 100 నెంబరుకు తక్షణమే ఫోన్ చేయాలన్నారు. స్వీయ రక్షణకు అవసరమైన కోర్సులను నేర్చుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా వుందన్నారు. ఎస్.సి, ఎస్.టి.లకు, మారు మూల ప్రాంత ప్రజలకు న్యాయంపై, అవగాహన కలిగించడం జరుగుతున్నదన్నారు. న్యాయ సేవాధికార సంస్థ సత్వర న్యాయాన్ని ఉచితంగా అందిస్తుందనే విషయాన్ని తమ బంధువులు, తల్లితండ్రులకు తెలియచేయాలన్నారు. జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి మాట్లాడుతూ, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, తద్వారా తమను తాము రక్షించుకునే అవకాశం కలుగుతుందన్నారు. హక్కుల ఉల్లంఘనపై ప్రశ్నించగలమన్నారు. బాలికల రక్షణకు అనేక చట్టాలు వున్నాయని, సమస్యలను ప్రారంభంలోనే తెలియచేసి సమస్య పెద్దది కాకుండా రక్షణ పొందాలని ఫామిలీ కోర్టు జడ్డి పి. అన్నపూర్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెకెండ్ అడిషినల్ డిస్ట్రిక్ట్ జడ్జి వెంకటేశ్వర్లు, లోక్ అదాలత్ శాశ్వత అధ్యక్షులు సి.బి. సత్యన్నారాయణ, గవర్నమెంట్ ప్లీడర్ పి.వి.రమణా రావు, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబరు వాసుదేవరావు, బార్ సెక్రటరీ కృష్ణప్రసాద్, జి.లెనిన్ బాబు, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి, డి.ఎస్.పి. డి.ఎన్.ఆర్ మూర్తి, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ (మహిళ) ప్రిన్సిపాల్ ఎం.కృష్ణవేణి, కళాశాల విద్యార్ధినులు, తదితరులు హాజరయ్యారు.
శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన వర్చువల్ లోక్ అదాలత్ ద్వారా 435 కేసులను పరిష్కరించినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా జడ్జి జి.రామకృష్ణ తెలిపారు. శనివారం, జిల్లాలోని అన్ని కోర్టులలోను వర్చువల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందు నిమిత్తం 15 బెంచీలను ఏర్పాటు చేయడం జరిగింది. రూ. 1,68,72,016 లతో 435 కేసులను పరిష్కరించగా, ఇందులో కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు 117, ఎక్సైజ్ కేసులు 229, మోటారు యాక్సిడెంట్ కేసులు 17, ఎస్.టి.సి.లు 09, అడ్మిషన్లు 34, సివిల్ కేసులు 29 వున్నట్లు తెలిపారు. కాగా మైక్రో లెవెల్ లీగల్ అవేర్ నెస్ కార్యక్రమాన్ని ఈ నెల 9 వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జి.రామకృష్ణ ప్రకటనలో తెలిపారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో ఉదయం 9 గం.లకు మైక్రో లెవెల్ లీగల్ అవేర్ నెస్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించని వారు ఎవరైనా ఉంటే వెంటనే సమర్పించాలని లేదంటే నవంబర్ మాసం పింఛను నిలుపదల చేయబడే అవకాశముందని జిల్లా ఖజానా శాఖ ఉప సంచాలకులు జి.నిర్మలమ్మ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసారు. 2020 వార్షిక సంవత్సరానికి జీవన ధృవపత్రాలు ( లైఫ్ సర్టిఫికేట్లు ) జనవరి 1 నుండి మార్చి 31లోగా వ్యక్తిగతంగా జీవన్ ప్రమాన్ లేదా సంబంధిత ఉప ఖజానా కార్యాలయాల్లో ఆన్ లైన్ లో సమర్పించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిదని అన్నారు. తదుపరి కరోనా దృష్ట్యా కాలపరిమితిని అక్టోబర్ 31 వరకు పెంచిన సంగతి అందరికీ విదితమే. అయినప్పటికీ ఇప్పటివరకు లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించని పింఛనుదారులు ఎవరైనా ఉంటే వ్యక్తిగతంగా సంబంధిత ఉప ఖజానా కార్యాలయాల్లో సమర్పించాలని ఆమె సూచించారు. లేనిఎడల నవంబర్ 2020 మాసపు పింఛను నిలుపుదలచేయబడే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేసారు. 2021 సంవత్సరానికి సంబంధించిన లైఫ్ సర్టిఫికేట్లను ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసిన తదుపరి స్వీకరించబడతాయని, కావున పింఛనుదారులు ఎటువంటి సందేహాలు పడవద్దని ఆమె వివరించారు.