రాష్ట్రంలో రైతులు విక్రయించే ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఇది నూటికి నూరు శాతం రైతు పక్షపాత ప్రభుత్వమని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) అన్నారు. గురువారం ఉదయం ఆయన మచిలీపట్నం మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ , రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, నేరుగా ఆయన వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కోవిద్ నిబంధనలు పాటిస్తూ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కృష్ణాజిల్లాలో 801 రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో 338 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేసిందన్నారు. కంప్యూటర్లు, తేమ శాతాన్ని నిర్ధారించే యంత్రాలు, స్కానర్లు, నాణ్యత కిట్లు, పొట్టు తీసే పరికరాలు కొనుగోలు కేంద్రాల్లో ఉంటాయని తెలిపారు. రైతుల కళ్లాల వద్దకు టెక్నికల్ సిబ్బంది వెళ్లాలని సూచించారు. నాణ్యత పరీక్షలు టెక్నికల్ అసిస్టెంట్లు ట్యాబ్‌ల ద్వారా నిర్వహించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ఆకస్మిక తనిఖీ చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ, సివిల్ సప్లైల సహకారంతో కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. రైతులను ఆదుకోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మెన్ తోట సత్యనారాయణ, బందరు ఆర్డివో ఎన్.ఎస్.కె. ఖాజావలి, తాసిల్దార్ సునీల్ బాబు , వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు మోహనరావు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు పెట్టే మధ్యాహ్నం భోజనం ఎలా వుందో తెలుసుకోవాలంటే స్వయంగా అక్కడ పెడుతున్న భోజనం రుచిచూస్తేనే వాస్తవం తెలుస్తుంది...అచ్చం అలానే చేశారు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. గురువారం బుక్కరాయ సముద్రం పాఠశాలను సందర్శించిన ఆయన స్వయంగా విద్యార్ధులతోపాటు లైన్లో నిలబడే కంచం తెచ్చుకొని మరీ వారితో కలిసి మధ్యాహ్నాం భోజనాన్ని రుచిచూశారు. విద్యార్ధులతో కలిసి బెంచిపై కూర్చొని భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో మాట్లాడుతూ, ప్రతీరోజు అన్నం ఎలా పెడుతున్నారని, కూరలు ఎలా వుంటున్నాయని, మంచినీరు స్వచ్ఛంగా వుంటుందా లేదా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ తమతో కలిసి భోజనం చేయడంతో విద్యార్ధులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా విద్యార్ధులంతా బాగా చదువుకోవాలని సూచించిన కలెక్టర్, ఆదిశగా విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఫలితాలు వచ్చేవిధంగా తయారు చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
విజయనగరం జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ కోరారు. విజయనగరం పూల్‌బాగ్ కాలనీ బిట్-1లోని వాడవీధి మున్సిపల్ పార్కులో మొక్కలను నాటే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు. పార్కులో ముందుగానే చెత్తాచెదారాలను తొలగించడంతో, సుమారు 150 మొక్కలను నాటి, అహ్లాదంగా తీర్చిదిద్దే పనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంచడం ద్వారా అందరమైన పరిశరాలతోపాటుగా, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అన్నారు. పట్టణంలోని పార్కులను అందంగా, అహ్లాదకరంగా తీర్చిదిద్దడంతోపాటు, ప్రజలకు ఉపయోగపడే సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా అక్కడి పార్కులో షటిల్ కోర్టును, వాలీబాల్ కోర్టును, వాకింగ్ ట్రాక్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పార్కుచుట్టూ ప్రహరీగోడ నిర్మాణం దాదాపు పూర్తి అయ్యిందని, వెంటనే సున్నం వేసి, ఈ నెల 25లోపల పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, డిఎఫ్ఓ ఎస్.జానకిరామ్, హరిత విజయనగరం కో-ఆర్డినేటర్ ఎం.రామ్మోహన్, డాక్టర్ వెంకటేశ్వర్రావు తదితర ప్రముఖులు, వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉపాధ్యాయుడిగా మారిపోయారు...బోర్డుపై లెటర్లు రాస్తూ పిల్లలకు వివరించారు...ఏం రాశారో వాటిని తెలియజేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. గురువారం జిల్లాలోని బుక్కరాయ సముద్రంలోని పాఠశాలను సందర్శించిన కలెక్టర్ కరోనా వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బోర్డుపై రాసి పిల్లలకు వివరించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ తమ పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిగా మారి మరీ కరోనా కోసం జాగ్రత్తలు వివరించడం, అధికారులను, విద్యార్ధులను ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ, కరోనా వలన చాలా కాలం పాఠశాలలకు దూరంగా ఉన్న మీరు పాఠశాలలు తెరిచిన తరువాత కూడా సామాజిక దూరం పాటించడం అలవాటు చేసుకోవాలన్నారు. కరోనా వైరస్ రెండవ దశ మొదలైన సందర్భంగా పిల్లలను మరింత జాగ్రత్త చూడాలని పాఠశాల ఉపాధ్యాయులను కూడా ఆదేశించారు. ఏమాత్రం వైరస్ లక్షణాలు కనిపించినా దగ్గర్లోని పీహెచ్సీకి తీసుకెళ్లి కరోనా పరీక్షలు చేయించాలని కూడా ఆదేశించారు. అనంతరం పాఠశాలను మొత్తం తనికీ చేసి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు జిల్లా కలెక్టర్...
జననేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్ర కు మూడేళ్లు గడిచిన సందర్భంగా ప్రజలలో నాడు..ప్రజల కోసం నేడు అనే నినాదంతో దక్షిణ నియోజకవర్గ పరిధిలోని అన్ని వార్డులలో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే వాసులపల్లి గణేష్ కుమార్ చెప్పారు. గురువారం ఆశీలుమెట్టలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం నుంచి 10రోజుల పాటు జరుగుబోయే కార్యక్రమంలో వైస్సార్సీపీ రాష్గ్ర బిసి కార్పొరేషన్ డైరెక్టర్స్, వార్డ్ ప్రెసిడెంట్స్, కార్పొరేటర్ అభ్యర్థులు, నాయకులతో ఈ యాత్ర సాగుతుందన్నారు. వార్డ్ పర్యటన ఈ క్రింది తేదీలలో ప్రతీ రోజు సాయంత్రం 4గంటల నుండి 8గంటల వరకు సాగుతుందని తెలియజేసిన వాసుల్లి పదిరోజుల షెడ్యులును విడుదల చేశారు. 06-11-2020 - 26/35వార్డ్ , 07-11-2020 - 25/39వార్డ్, 08-11-2020 - 20/29వార్డ్, 09-11-2020 - 21&22/30&27వార్డ్స్, 10-11-2020 - 23&24/36&38వార్డ్స్, 11-11-2020 - 27/31వార్డ్, 12-11-2020 - 30&28/32&33వార్డ్స్, 13-11-2020 - 31&15/42&27వార్డ్, 14-11-2020 దీపావళి సెలవు, 15-11-2020 - 29/34వార్డ్, 16-11-2020 - 44/41వార్డ్ లలో ఈ పర్యటన సాగుతుందని వివరించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో గురువారం అగ్ని ప్రమాదం. ప్లాంట్ ప్రాససింగ్ యూనిట్ లో టర్బన్ ఆయిల్ లీక్ కావడంతో స్టీల్‌ప్లాంట్ టీపీపీ-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్లాంట్‌లోని 1.2 మెగావాట్ల విద్యుత్ మోటర్లు దగ్ధం కావడంతో సుమారు రూ.2కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై యాజమాన్యం ఎలాంటి ప్రకటనా చేయలేదు. నిపుణుల కమిటీ వచ్చి జరిగిన నష్టాన్ని అంచనా వేసిన తరువాత యాజమాన్యం ప్రమాద వివరాలు తెలిపే అవకాశాలున్నాయి. స్టీల్ ప్లాంట్ లో ప్రమాదాలు జరగడం కొత్తేంకాదు. గతంలో కూడా చాలా ప్రమాదాలే జరిగాయి. అయితే అదే సమయంలో జరిగిన ప్రమాదాల నుంచి తక్కువ సమయంలో మళ్లీ కోవడంలోనూ వైజాగ్ స్టీల్ దిట్ట. గతంలో స్టీలు ప్లాంట్ లో ప్రమాదాలు జరిగిన సమయంలో సేఫ్టీ విషయంలో ఇండస్ట్రియల్ శాఖ సూచించిన మార్గదర్శకాలు సక్రమంగా పాటించనందునే మళ్లీ ఈ ప్రమాదం జరిగింది. దానికితోడు సేఫ్టీ విషయంలో ప్లాంటులో ఏ స్థాయిలో రక్షణ చర్యలు తీసుకున్నారో నేటికీ పరిశ్రమల శాఖ అధికారులకు కూడా స్టీలు ప్లాంటు యాజమాన్యం తెలియజేయలేదని సమాచారం..
ఆంధ్రప్రదేశ్ లో నవంబరు నెల పెన్షలు నేటికీ పించను దారుల అకౌంట్లలో పడలేదు. ప్రతీనెలా టంచనుగా 1వ తేదీనే పడిపోయే పెన్షన్లు ఈనెల 5వ తేదీ వచ్చినా నేటికీ పించన్లు పడలేదు. దీనితో పెన్షను దారులు ఖజానాశాఖకు ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారు. అందులోనూ చాలా మందికి ఆ పెన్షన్లమీదే ఆధారపడి జీవిస్తుండటం, కరోనా సమయంలో బయటకు వెళ్లే పరిస్థితిల లేకపోడంతో పెన్షను దారు స్థితి మరింత జటిలంగా మారింది. అయితే పెన్షను దారులకు ఎందుకు పించన్లు ఆలస్యమయ్యాయనే విషయంలో ఖజానా శాఖ అధికారులు గానీ, ప్రభుత్వం గానీ క్లారిటీ ఇవ్వలేదు. ఎపుడైనా జీతాలుగానీ, పెన్షన్లుగానీ ఆలస్యమైతే ప్రభుత్వం ముందుగా సమాచారం అందించేది. ఈ నెల పెన్షను దారులకు సమాచారం ఇవ్వకపోవడంతోపాటు, పెన్షన్లు కూడా 5వ తేది వచ్చినా నేటికి వారి బ్యాంకు ఖాతాలకు జమకాలేదు. దీనితో పెన్షను దారులు ప్రతీనెలా చెల్లించుకోవాల్సిన చెల్లింపులు, ఇంటి పనులు నిలిచిపోయాయి..ఈ విషయమై ఖజానాశాఖ డెప్యూటీ డైరెక్టర్ ను ఈఎన్ఎస్ సంప్రదించే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులో లేరు..
రాష్ట్రప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేస్తే విశాఖజిల్లాను నాలుగు జిల్లాలుగా చేస్తుందానే అనే అంశంపై చురుకుగా చర్చ జరుగుతోంది. విశాఖ జీవిఎంసి పరిధి మొత్తం ఒక జిల్లా, ఏజెన్సీ 11 మండలాలు మరో జిల్లా, రూరల్ మైదాన మండలాలు మొత్తం ఒక జిల్లా, అరకు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు విజయనగరంలోని కొన్ని మండలాలతో మరోజిల్లా ఏర్పాటు కానుందని తెలుస్తుంది. అలా కాకుండా ప్రభుత్వ పాలసీ ప్రకారం అయితే అనకాపల్లి, విశాఖపట్నం, అరకు పార్లమెంటు నియోజవర్గాల పరిధిలను మూడు జిల్లాలుగా చేయాలి. అందులోనూ అనకాపల్లిని కాకుండా, నర్సీపట్నం ప్రాంతాన్ని జిల్లాగ ప్రకటించి, దానికి విన్యం వీరుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలనేది ఈ ప్రాంతీయుల చిరకాల వాంచ. పైగా క్రిష్ణదేవిపేట ప్రాంతంలో ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు కాకముందే సుమారు 5ఏళ్లు పైగా కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాలన సాగింది. అదీ అల్లూరి సీతారామరాజును పట్టుకోవడానికే ఈ ప్రాంతంలో ఆయనను అప్పటి మద్రాసు ప్రావిన్సు ప్రభుత్వం నియమించింది. దానికి తోడు అల్లూరి సీతారామరాజు బ్రిటీషు సేనలకు ధీటుగా నడిపిన సమాంతర పాలన రచ్చబండ అదే భారతదేశంలో కాలక్రమంలో పంచాయతీలుగా రూపాంతరం చెందింది. అంతేకాదు అల్లూరి బ్రిటీషు సేనలను ఎదుర్కోవడానికి నడిపిన మన్యం పితూరి ఉద్యమం కూడా క్రిష్ణదేవి పేట ప్రాంతం నుంచే ప్రారంభం అయ్యింది. అంతటి విశిష్ట చరిత్ర ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా అధికారులు జిల్లాగా చేయాలని భావించినా..ఇక్క ప్రభుత్వ భవనాలు పూర్తిస్థాయిలో లేవనే ఒకే ఒక్క కారణంతో నర్సీపట్నం వేదికగా జిల్లా ప్రకటించాలనేదికూడా ఈ ప్రాంతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ప్రస్తుతం వున్న విశాఖజిల్లా మూడు, లేదా నాలుగు జిల్లాలుగా మారే అవకాశాలు పూర్తిస్థాయిలో కనిపిస్తున్నాయి...అయితే ప్రభుత్వ తీసుకునే నిర్ణయంపైనే ఎన్ని జిల్లాలుగా విశాఖజిల్లా మారబోతుందనేది ఆధారపడి వుంది..
ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం (PMAGY) ద్వారా గ్రామ అభివృద్ధి కమిటీలో గుర్తించిన పనులను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ (MSJE) జాయింట్ సెక్రెటరీ కళ్యాణి చదా (KALAYANI CHADHA)సూచించారు. బుధవారం సాయంత్రం న్యూ డిల్లీ నుండి ఎం. ఎస్. జె. ఈ. జాయింట్ సెక్రెటరీ దేశంలోని అన్ని రాష్ట్రాల జిల్లాల కలెక్టర్లతో వీడియో కన్ఫెరెన్స్ నిర్వహించగా తిరుపతి నగరపాలక సంస్థ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త పాల్గొన్నారు. జాయింట్ సెక్రెటరీ వివరిస్తూ ఎం. ఎస్. జె. ఈ. గ్రాంట్స్ ను త్వరగా ఖర్చు చేసి వెనుకబడిన గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకురావాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి కమిటీ గుర్తించిన గ్రామాల అభివృద్ధికి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నదని వాటికి మొదటి, రెండు దశల్లో గుర్తించిన పనులు పూర్తి చేయాలని సూచించారు.షెడ్యూల్ కులాలు 50 శాతం కన్నా ఎక్కువ జనాభా వున్న గ్రామాల్లో రోడ్లు, విద్యుత్,పరిశుభ్రత, ఆరోగ్య , సామాజిక భద్రత, విద్య, య్వతకు స్కిల్ డెవెలప్ మెంట్ కార్యక్రమాలు చేపట్టవచ్చని వివరించారు.
జిల్లా కలెక్టర్ వివరిస్తూ చిత్తూరు జిల్లాకి మొదటి దశలో 37, రెండవ దశలో 39 గ్రామాలను మంజూరు కాగా వాటిలో 50 శాతం కన్నా ఎస్.సి. జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలను గుర్తించామని తెలిపారు. జిల్లా అభివృద్ధి కమిటీలో 37 గ్రామాలలో 328 పనులు గుర్తించిన పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని, రెండవ దశకు సంబంధించి గ్రామాల జాబితా జిల్లా అభివృద్ధి కమిటీలో ఆమోదం పొందాల్సి ఉందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో డి. డి. సోషల్ వెల్ఫర్ ప్రసాద్ రావు, ఎ.ఎస్.ఓ చిరంజీవులునాయిడు, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాల పునర్విభజన చర్యల్లో భాగంగా క్రిష్ణా జిల్లా, డివిజినల్ కార్యాలయాల పరిధిలో ఉన్న భవనాలు, వాటికి అనుసంధానంగా ఉన్న ఖాళీ స్ధలాలు, తదితర భూముల వివరాలను వెంటనే ప్రభుత్వ అధికారిక యుఆర్‌యల్ లింక్ ద్వారా అప్‌లోడ్ చేయాలని జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ స్పష్టం చేసారు. బుధవారం సాయంత్రం జిల్లాల పునర్విభజన చర్యల్లో భాగంగా జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన డివిజినల్ స్ధాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న స్ధలాల వివరాలను జిల్లాల పునర్విభజన చర్యల్లో భాగంగా సేకరించాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగానే వివిధ శాఖల పరిధిలో పనిచేసే డివిజినల్ స్ధాయి అధికారులు క్షేత్రస్ధాయి పరిశీలన చేసి వాటి వివరాలను అధికారికంగా రూపొందించిన యుఆర్‌యల్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయవలసిందిగా ఇప్పటికే ఆదేశించడం జరిగిందన్నారు. సులభతర విధానంలో రూపొందించిన వెబ్‌సైట్‌లో వెంటనే ఆయా డివిజన్ స్ధాయి అధికారులు వారికి అందుబాటులో ఉన్న సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకుని ఖాళీస్ధలాల వివరాలు, భూముల వివరాలు, భవనాల వివరాల నివేదికలను రూపొందించాలన్నారు. రెవెన్యూ, వ్యవసాయ, అటవీ, వైద్య, ఆరోగ్యశాఖ, పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధి, తదితర శాఖల ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న స్ధలాల వివరాలను సేకరించి వాటిని సంబంధిత డివిజన్ పరిధిలోని సబ్ కలెక్టర్లు, ఆర్ డివోలతో ధృవీకరించుకుని అప్‌లోడ్ చేయాలని కలెక్టరు ఇంతియాజ్ తెలిపారు. ఖాళీ స్ధలాలను ధృవీకరించాల్సిన బాధ్యత ఆయా సబ్ కలెక్టర్లు, ఆర్‌డివోలు చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఉన్న ఖాళీస్ధలాల వివరాల డేటా రూపొందించడంలో కేవలం గుడివాడ డివిజన్ పరిధిలోనే కొంతమేర పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టరు డా. కె. మాధవిలత మాట్లాడుతూ ప్రభుత్వం ఎ ంతో సులభతరంగా రూపొందించిన యుఆర్‌యల్ లింక్‌లో డేటా వివరాలను నమోదు చేయడం సాధ్యం అవుతున్నదని ఆమె తెలిపారు. డివిజన్ పరిధిలోని ఆయా శాఖల నుండి వివరాలు సేకరించేందుకు కలెక్టరేట్ పరిధిలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటుచేసి డేటా సేకరణకు కలెక్టరు ఆదేశాలు మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. ఈసమావేశంలో డిఆర్ఓ యం. వెంకటేశ్వర్లు, వివిధ శాఖల డివిజన్ స్ధాయి అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
భూమిలో కుళ్లిపోయే వ్యర్థ పదార్థాల నుండి ఎరువును తయారు చేస్తున్నామన్నారు టిటిడి ఈవో డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి. ఈ సందర్భంగా ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ, ఈ రకంగా తయారైన ఆరు వేల టన్నుల ఎరువును టిటిడి వేలం ద్వారా విక్రయించడానికి అవసరమైన లైసెన్స్ బుధవారం (ఈ రోజు) మంజూరు అయిందన్నారు. భూమిలో కుళ్ళని వ్యర్థ పదార్థాలను విభజించి ప్యాకింగ్‌తో తిరుపతికి తరలించే ఏర్పాట్లు చేశామన్నారు. వీటిపై మరింత మంది నిపుణుల నుండి సలహాలు తీసుకుంటామన్నారు. మురుగు నీటిని శుభ్రపరిచి ఉద్యానవనాలకు ఉపయోగిస్తున్నారని, ఈ నీటిని మరుగుదొడ్ల అవసరాలకు కూడా వాడే అవకాశాన్ని పరిశీలించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. దీని వల్ల తిరుమలలో నీటి వినియోగాన్ని కొంత మేరకు తగ్గించవచ్చని ఈవో వివరించారు. కార్యక్రమంలో సివిఎస్వో గోపినాథ్ జెట్టి, సిఇ రమేష్‌రెడ్డి, ఎస్ ఇ -2 నాగేశ్వరరావు, ఆరోగ్య అధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి, విజివో మనోహర్, సిఎంవో డా.నర్మద ఈ పర్యటనలో పాల్గొన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం కామర్స్‌మేనేజ్‌మెంట్ విభాగ ఆచార్యునిగా ఆచార్య వి.క్రిష్ణమోహన్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో, ఇంచార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి.వి రవీంధ్రనాథ్ బాబు నుంచి ఉత్తర్వులను స్వీకరించారు. అనంతరం విభాగంలో ఆచార్యునిగా బాధ్యతలు స్వీకరించారు. తనను ఆచార్యునిగా పునర్నియామకం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆచార్యునిగా తనకు అప్పగించిన బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వహిస్తానన్నారు. ఆచార్య వి.క్రిష్ణమోహన్ నియామకాన్ని విభాగ ఆచార్యులు స్వాగతించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆచార్య క్రిష్ణమోహన్‌ను కామర్స్‌మేనేజ్‌మెంట్ విభాగాధిపతి ఆచార్య సి.వి కన్నాజిరావు, విభాగ ఆచార్యులు బి.మోహన వెంకట రామ్, ఆచార్య జాలాది రవి, ఏయూఇయూ అద్యక్షులు డాక్టర్ జి.రవికుమార్, గెస్ట్‌హౌస్ డీన్ ఆచార్య టి.షారోన్ రాజు తదితరులు ఆచార్య క్రిష్ణమోహన్‌ను అభినందించారు.
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించి, వారికి లబ్ది చేకూర్చాలని సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించి, అవి వారికి చేరేందుకు కృషి చేయాల్సిన బాధ్యతకూడా సిబ్బందిపైనే ఉందని స్పష్టం చేశారు. నెల్లిమర్ల మండలం కొండగుంపాం గ్రామంలోని సచివాలయాన్ని కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. అక్కడి రికార్డులను, హాజరు పట్టీని, ఇ-రిక్వెస్టులను, ప్రజలకు అందించిన పథకాల వివరాలను, పెండింగ్ జాబితాలను పరిశీలించారు. అమ్మ ఒడి, జగన్నన్న చేయూత, జగనన్న తోడు, రైతు భరోసా, జలకళ తదితర పథకాలపై ఆరా తీశారు. పెండింగ్‌కు ఉన్నకారణాలపై ఆరా తీశారు. సచివాలయ సిబ్బంది సమస్యలను సైతం అడిగి తెలుసుకున్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్‌బికెలు, వెల్‌నెస్ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణంపై వాకబు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ పేదవాడికీ లబ్ది చేకూర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, దానిని సాధించే బాధ్యత సచివాలయ సిబ్బందిపైనే ఉందన్నారు. ప్రస్తుతం ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, వాటిపై ప్రజల్లో అవగాహన కల్పంచి, ఆయా పథకాలు అందేలా సహకరించాలని సూచించారు. రైతు భరోసా రాకపోవడానికి కారణాలను తెలుసుకొని, రెవెన్యూ పరమైన సమస్యలేమైనా ఉంటే, వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ప్రస్తుతం గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైతే సిమ్మెంటును స్థానికంగానే కొనుగోలు చేసుకోవాలన్నారు. ఇ-రిక్వెస్టులు నిర్ణీత కాలవ్యవధిలోగానే పరిష్కరించాలని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ జలకళ పథకం రైతుల జీవితాల్లో గొప్ప మార్పును తీసుకువస్తుందని కలెక్టర్ అన్నారు. రైతుకు నీటివసతిని కల్గిస్తే, ఏడాదికి మూడు పంటలు పండి, ఆ కుటుంబం సుభిక్షంగా ఉంటుందని, అందువల్ల వీలైనంత ఎక్కువమందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చాలని కోరారు. ఒక్కో సచివాలయం పరిధిలో వంద బోర్లు తవ్వించేలా ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ఇప్పుడు ఎన్నో సౌకర్యాలు, ఆధునిక సాంకేతిక పద్దతులు అందుబాటులో ఉన్నాయని, వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ సిబ్బంది సైతం సచివాలయాల్లో సిద్దంగా ఉన్నారని చెప్పారు. వీరందరి లక్ష్యం ప్రజలకు మేలు చేయడం, సకాలంలో సేవలను అందించడమేనని స్పష్టం చేశారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు క్రమశిక్షణతో, నిజాయితీతో పనిచేయాలని కలెక్టర్ కోరారు. ఈ పర్యటనలో ఎంపిడిఓ రాజ్‌కుమార్, స్థానిక నాయకుడు సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.