సంస్కృతి సంప్రదాయాలకు పేరుగాంచిన భారత్ లో మహిళలపై అత్యాచారాలు, హత్యలు దురదృష్టకరమని జీవీఎంసీ 15వ వార్డు బీజేపి కార్పొరేటర్ అభ్యర్థి డా.మల్లీశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా రిప్ సొసైటీ పేరిట నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్భయ, దిశ లాంటి చట్టాలు వచ్చినప్పటికీ రోజు రోజు కి మహిళలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. ఇటీవల గాజువాకలో వరలక్ష్మి అనే అమ్మాయిని గొంతు కోసి కిరాతకంగా హత్య చేయడంతో నగరాల్లో అమ్మాయిలకు రక్షణలేకుండా పోతుందనే విషయం తేటతెల్లమవుతుందన్నారు. ప్రభుత్వం తక్షణమే ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడంతోపాటు భవిష్యత్తులో మహిళలపై దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం నాయకులు దిలీప్ రుద్రరాజు, ప్రసాద్, శ్రీధర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
డా..బి ఆర్.అంబేద్కర్ ఆశయాలను, గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం కోసం పాటుపడుతున్న ఏకైక జననేత సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని విశాఖ దక్షణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. సీఎం చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు 3ఏళ్ళు గడిచిన శుభ సందర్భంగా ప్రజలలో నాడు...ప్రజల కోసం నేడు"అనే నినాదంతో దక్షిణ నియోజకవర్గ పరిధిలో 25వార్డు/39వవార్డులో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేపట్టని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకొని వారికోసమే పరితపిస్తున్నారని కొనియాడారు. అంతకుముందు పాత పోస్ట్ ఆఫీస్ వద్ద దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ జంక్షన్ లో తూర్పు ముఖంగా కోటవీధి కదిరి దానప్ప వీధి-- ముఖ ద్వారం తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. అడుగడుగునా మహిళలు హారతులు పడుతూ ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఈ పాదయాత్ర లో వైస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, రాష్ట్ర బీసీ డైరెక్టర్స్ సబిరా బేగం, సిటీ మహిళా ప్రెసిడెంట్ గరికిన గౌరి, సౌత్ మహిళా ప్రెసిడెంట్ నీలాపు లక్ష్మీ, 39 వార్డ్ ప్రెసిడెంట్ సూరాడ తాతారావు, కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం, ముస్లిం మైనారిటీల నాయకులు సాధిక్, సౌత్ ముస్లిం నాయకులు ముజేబుఖాన్, యాసిన్, బాబ్జి, మసేను, వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కమిటీ, సిటీ కమిటీ, వార్డ్ ప్రెసిడెంట్స్, వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థులు, వార్డ్ కమిటీ, వార్డు అనుబంధ సంఘ ప్రెసిడెంట్ లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో ప్రత్తి కొనుగోలు సంబంధించి ప్రక్రియ మొదలయ్యింది. ఈ మేరకు సంయుక్త కలెక్టర్ జీసీ కిషోర్ కుమార్ మార్కెటింగ్, భారతీయ ప్రత్తి సంస్థ సభ్యులు, వ్యవసాయ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో పలు మార్గనిర్దేశకాలు జారీ చేశారు. రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రత్తి విక్రయించాలనుకొనే రైతులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా చేపట్టాలని చెప్పారు. కొనుగోలుకు సంబంధించి ప్రతీ అంశంపైనా రైతులకు స్పష్టంగా అవగాహన కల్పించాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్ చేసి.. ఏ రోజు కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్ళి విక్రయించుకోవచ్చనే విషయాన్ని ముందుగానే రైతుకు సంక్షిప్త సందేశాలు పంపించాలని చెప్పారు. ముందుగా అనుకున్న రోజున ప్రత్తి కేంద్రానికి తీసుకురాలేని పక్షంలో మరొక్క రోజు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందీ రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు కూడా నాణ్యమైన ప్రత్తి తీసుకురావాలని, అధికారులకు సహకరించాలని కోరారు. ఎలాంటి ఇబ్బందీ ఉన్న సిఎం ఆప్ లో నమోదు చేయవచ్చని సత్వరమే స్పందించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఏడాది మారిన నిబంధనల ప్రకారం ఏటా మాదిరిగా విజయనగరం మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదని జేసీ ప్రశ్నకు బదులుగా మార్కెటింగ్ ఏడీ వై.వి.శ్యామ్ కుమార్ స్పష్టం చేశారు. రామభద్రపురం పరిధి బూసయ్యవలస గ్రామంలో ఉన్న నంది జిన్నింగ్ మిల్లులో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. రైతులు రైతు భరోసా కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకొనే సమయంలో ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం నకలు సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. అలాగే తేమ 8 నుంచి 12 శాతం ఉంటేనే భారతీయ సంస్థ నిబంధనలకు లోబడి కొనుగోలు చేస్తామని భారతీయ ప్రత్తి సంస్థ సభ్యుడైన ప్రవీణ్ స్పష్టం చేశారు. మొదటి రకం ప్రత్తి క్వింటాకు రూ.5,825, ద్వితీయ రకం ప్రత్తికి రూ.5,515 కొనుగోలు ధర నిర్ణయించామని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని ప్రమాణాలు పాటించిన మీదటే ప్రత్తి కొనుగోలు చేస్తామని, దీనికి రైతులంతా సహకరించాలని కోరారు. సుమారు ఏడు మండలాల రైతులు ప్రత్తి ఎక్కువుగా పండిస్తారు కాబట్టి వారందరికీ కొనుగోలు కేంద్రం రామభద్రపురం సమీపంలో ఏర్పాటు చేసినట్టు సచివాలయాల ద్వారా, గ్రామీణ వ్యవసాయ అధికారుల ద్వారా విరివిరిగా ప్రచారం కల్పించాలని జేసీ సూచించారు. నంది జిన్నింగ్ మిల్లులో భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని జిల్లా అగ్నిమాపక అధికారి మోహనరావు కి చెప్పారు. ఏ ఒక్క రైతుకూ చిన్న ఇబ్బంది కూడా రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో బి.హెచ్. భవానీ శంకర్, జిన్నింగ్ మిల్లు మేనేజర్ ఎస్.ఖన్నన్, అసిస్టెంట్ కంట్రోలర్ రాధాకృష్ణ, సి.ఐ. చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి పాదయాత్రతోనే ప్రజల కష్టాలు చూసి ప్రజోపయోగ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని రాష్ట్ పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు అన్నారు. శనివారం విశాఖలోని ఉత్తర నియోజకవర్గ పరిధిలోని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు చేస్తున్న పాదయాత్ర 43, 44 వార్డుల్లో కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహానేత ఆశయసాధను పేదల అభివ్రుద్ధికి దేశంలోనే సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చేపడుతున్న కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోందిన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి 3 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ నెల 6 వ తేదీ నుండి 16 వ తేదీ వరకు 10 రోజులు పాటు నియోజకవర్గ పాదయాత్ర చేస్తున్న నేపధ్యంలో వార్డులో బానాల శ్రీనివాస్, పి.ఉషశ్రీ ఆధ్వర్యంలో దాడిరమణమూర్తి కళ్యాణమండపం, శ్రీనివాసనగర్,80ఫీట్ రోడ్డు, ఎంటీసీ పాలెం ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. అనంతరం సాది ఖాన కళ్యాణమండపంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కె.కె రాజు మాట్లాడుతూ, ఎన్నికలు ముందు మేనిపెస్టోలో పొందు పోరిచిన విదంగా 90% సంక్షేమ పథకాలు సంవత్సరం నర కాలంలో అమలుచేసి ఘనత ఒక్క వై.యస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే దక్కిందని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాధం గారు,పార్టీ సీనియర్ నాయకులు భరణికాన రామారావు గారు,మాజీ కార్పొరేటర్లు,వార్డు అభ్యర్థులు,వార్డు అధ్యక్షులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ మహానగరంలోని దక్షిణ నియోజకవర్గంలోని పాతపోస్టాఫీసు దగ్గర అభివ్రుద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యేవాసుపల్లి గణేష్ కుమార్ జివిఎంసి కమిషనర్ డా.జి.స్రిజనకు శనివారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ, 25/39వార్డ్ లో పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర డీన్ షాదీఖానా రెనోవేషన్, ఫెర్రీ రోడ్ లో ఉన్న బాబూలాల్ జిమ్ రిపేర్లు & 24/38వార్డ్ లో పెద్ద కాలువ దగ్గర ఉన్న ఖాళీ గా ఉన్న స్థలంలో యాసిన్ బాబా దర్గాహ్ ముస్లిం కొరకు కమ్యూనిటీ హాల్ & జిమ్ , మత్స్యకారుల కొరకు కమ్యూనిటీ హాల్ పనులు మంజూరు చేయాలని కమిషనర్ ను కోరినట్టు చెప్పారు. ఈ ప్రాంతాల్లో అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈ ప్రాంతీయుల సమస్యలు తీరుతాయని అన్నారు. అంతేకాకుండా తన ఎమ్మెల్యే గ్రాంటు నుంచి కూడా కొంత మొత్తాన్ని ఈ ప్రాంత అభివ్రుద్ధికి వెచ్చించనున్నట్టు ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో అన్నిప్రాంతాల్లో అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో విశాఖలోని దక్షిణ నియోజకవర్గంలో కూడా ప్రతిపాదిత పనులపై జివిఎంసి ద్రుష్టిసారించాలని కోరినట్టు చెప్పారు..
ప్రకృతి వనరులను సంరక్షించడం ప్రతీఒక్కరి బాధ్యత కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ పిలుపునిచ్చారు. జల సంరక్షణలో ఇటీవల జిల్లాకు జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు లభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ను, జిల్లా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో పలువురు పారిశ్రామిక వేత్తలు, పూల గుచ్ఛాలు, దుశ్శాలువలతో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ ప్రకృతి సంపదను సంరక్షించడమే తనకు అసలైన జ్ఞాపిక అని పేర్కొన్నారు. ప్రతీఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని, పరిశ్రమలు సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. గత రెండేళ్లతో పోలిస్తే, విజయనగరం జిల్లాలో పచ్చదనం పరంగా గణనీయమైన మార్పు చోటు చేసుకుందని చెప్పారు. జిల్లా కేంద్రంలో తాము చేపట్టిన కృషికి తగిన ఫలితాలు రావడం మొదలయ్యిందన్నారు. హరిత విజయనగరంగా మార్పు చేయడమే కాకుండా, అభివృద్దికి ఎన్నో ప్రణాళికలను అమలు చేసి, పట్టణ రూపురేఖలను మార్పు చేశామని చెప్పారు. విజయనగరం చారిత్రక నగరమని, కళలకు, సంస్కృతికి రాజధాని అని పేర్కొన్నారు. ఆ ఖ్యాతిని నిలబెట్టేటందుకు గాను పలు చోట్ల సైన్‌బోర్డులను ఏర్పాటు చేసి, ప్రజలకు తమ చరిత్రను, గొప్పదనాన్ని గుర్తు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు.
పరిశ్రలమశాఖ జిల్లా జనరల్ మేనేజర్ కె.ప్రసాదరావు మాట్లాడుతూ సాధారణంగా నీటిని పరిశ్రమలకే ఎక్కువగా వినియోగించడం జరుగుతోందని చెప్పారు. దీనికి విరుద్దంగా జిల్లాలోని పరిశ్రమల్లో మాత్రం అతి తక్కువ నీటిని వినియోగించడం ద్వారా అవార్డు సాధనలో తాము కూడా భాగస్వామ్యులం అయ్యామని అన్నారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన స్ఫూర్తితో, జిల్లాలోని పారిశ్రామిక వేత్తలంతా తమ పరిశ్రమల్లో పెద్ద ఎత్తున మొక్కలను పెంచడమే కాకుండా, ప్రకృతి వనరులను సంరక్షించే చర్యలను చేపట్టారని చెప్పారు. దీనిలో భాగంగా నీటి పునర్ వినియోగానికి అవసరమైన పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి, పారిశ్రామికంగా అతి తక్కువ నీటిని వినియోగించడం జరుగుతోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పరిశ్రమలశాఖ ఎడి ఐ.వెంకటరమణ, డెక్కన్ ఫెర్రో అల్లాయిస్ ఎండి పిఎస్ఆర్ రాజు, శారద మెటల్స్ అండ్ అల్లాయిస్ జిఎం ప్రభాత్ మోహన్, ఎజిఎం(హెచ్ ఆర్) హెచ్.సన్యాశిరావు, బెర్రీ అల్లాయిస్ ఎండి విజయశ్రీ తదితర పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.
విజయనగరం కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న బాలాజీ టెక్స్‌టైల్ మార్కెట్‌లో పారిశుద్ధ్య పరిస్థితిపై జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పచ్చదనంపై రోజువారీ తనిఖీల్లో భాగంగా కంటోన్మెంట్ ప్రాంతంలోని చెరువులు, పార్కులు, గతంలో మొక్కలు నాటిన ప్రదేశాలను కలెక్టర్ శనివారం హరిత విజయనగరం బృందం సభ్యులతో కలసి తనిఖీ చేశారు. దీనిలో భాగంగా ఆ ప్రాంతంలోని టెక్స్‌టైల్ మార్కెట్ పరిశీలనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ కలెక్టర్‌కు అపారిశుద్ద్య పరిస్థితులు కనిపించాయి. చెత్త చెదారం, దుర్గంధంతో కూడుకొని ఉన్న పరిసరాలను చూసి కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఉత్తరాంధ్రకే తలమానికంగా ఉండాల్సిన మార్కెట్ ఉండేది ఇలాగేనా? లాభాలే తప్ప వినియోగదారుల ఆరోగ్యం పట్టదా అంటూ మార్కెట్ కార్యవర్గ ప్రతినిధులను ప్రశ్నించారు. ఇక్కడికి వచ్చే వినియోగదారులు అనారోగ్యం పాలైతే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. తక్షణం పరిస్థితుల్లో మార్పు రావాలని లేనిపక్షంలో నగరపాలక సంస్థ ద్వారా తగిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. దీనిపై వర్తక సంఘం ప్రతినిధులు స్పందిస్తూ వారం పది రోజుల్లో మార్కెట్ లో పరిస్థితి మార్చేందుకు ప్రయత్నిస్తామని, పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరుస్తామని కలెక్టర్‌కు హామీ ఇచ్చారు. మార్కెట్‌లో నాటిన మొక్కల పరిస్థితిని కలెక్టర్ పరిశీలించారు. మొక్కల సంరక్షణపై సంతృప్తి వ్యక్తంచేశారు.
ఇదే ప్రాంతంలోని వినాయకనగర్ పార్కును కలెక్టర్ డా.హరిజవహర్ లాల్, హరిత విజయనగరం బృందం సభ్యులు పరిశీలించారు. ఇక్కడ నాటిన మొక్కలన్నీ సజీవంగా ఉండటంపై పార్కు నిర్వహణపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తంచేశారు. సెయింట్ జోసెఫ్ స్కూలు ఎదురుగా సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న రెండు ఆక్సిజన్ పార్కులను సందర్శించి అక్కడ మొక్కల పరిస్థితిపై కలెక్టర్ ఆరా తీశారు. మొక్కల సంరక్షణ పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు.
చెరువుల శుద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కె.ఎల్.పురంలోని చెరువును కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ చెరువును స్థానిక కాలనీ వాసులు నిర్వహిస్తున్న తీరును అభినందించారు. ఇక్కడ నాటిన మొక్కలు పెంచేందుకు తీసుకున్న శ్రద్ధ వహించడంపై సంతోషం వ్యక్తంచేస్తూ కాలనీ వాసుల కోరిన మేరకు చెరువు గట్టుపై లైటింగ్, కొన్ని బెంచీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కాలనీలోని రాధాకృష్ణ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. జిల్లా కలెక్టర్ చొరవతోనే తమ కాలనీలోని చెరువు అభివృద్ధి జరిగి ఆహ్లాదకర ప్రదేశంగా రూపుదిద్దుకుందని, ఈ చెరువు పరిసరాలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతామని వారు హామీ ఇచ్చారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మునిసిపల్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, పి.టి.సి. వైస్ ప్రిన్సిపల్ మెహెర్‌బాబా, మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ డా.సత్యనారాయణ, హరిత విజయనగరం కన్వీనర్ రామ్మోహన్, జర్నలిస్టు బోనం గణేష్ తదితరులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్ ద్వారా ఉచిత, సత్వర న్యాయం సాధ్యమౌతుందని జిల్లా జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జి.రామకృష్ణ తెలిపారు. శనివారం, జిల్లా కోర్టు ఆవరణలో మెగా వర్చువల్ లోక్ అదాలత్ కార్యక్రమం సందర్భంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్టానికి ఖచ్చితత్వం, నిష్పక్షపాతం వుంటాయన్నారు. నిరుపేదలకు ఉచిత న్యాయ సహాయం , కక్షిదారులకు సత్వర న్యాయాన్ని అందించడానికి లోక్ అదాలత్ ఏర్పడిందన్నారు. కాలం చాలా విలువైనదని, కక్షిదారులు ఇరువురికీ విజయం లోక్ అదాలత్ ద్వారా లభిస్తుందన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో 4 బెంచ్ లను ఏర్పాటు చేశామన్నారు. 1వ బెంచ్ : టి.వెంకటేశ్వర్లు, (సెకెండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్సు జడ్జి ఫర్ టారిఫ్ ఆఫ్ అఫెన్సు ఎగైనస్ట్ వుమెన్ ) మెంబర్లు జి.రాధారాణి, అడ్వోకేట్ మెంబర్లుగా, వై.ప్రసాద రావు సోషల్ వర్కర్ 2వ బెంచ్: కె.జయలక్ష్మి, సీనియర్ సివిల్ జడ్జి-కం-సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారటీ, అడ్వోకేట్ మెంబర్లుగా వి.హరిప్రియ, వి.జగన్నాధ రావు, 3వ బెంచ్: జి.కిశోర్ కుమార్, స్పెషల్ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ క్లాస్ 1, (పి అండ్ ఇ) కోర్టు అడ్వోకోట్ మెంబర్లుగా బి.అప్పలనాయుడు, డి.ఈశ్వర రావు, 4వ బెంచ్: జి.లెనిన్ బాబు, జుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ క్లాస్ 1 స్పెషల్ మొబైల్ కోర్టు, అడ్వోకేట్ మెంబర్లు గా ఎస్. విజయ లక్ష్మి, కె.అప్పారావు లను నియమించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా దూర ప్రాంతాల నుండి వచ్చిన కక్షిదారులకు అడ్వోకేట్ మామిడి శ్రీకాంత్ పులిహార పొట్లాలను అందించారన్నారు. ఈ సమావేశానికి జడ్జీలు టి.వెంకటేశ్వరరావు, అన్నపూర్ణమ్మ, శిష్టు రమేష్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, అడిషనల్ ఎస్.పి. టి.విఠలేశ్వర రావు, కక్షిదారులు హాజరైనారు.
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరిజిల్లాలో ప్రముఖదేవస్థానం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో అక్రమాలు, అవినీతిని ప్రక్షాళన చేయడానికి రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వం నడుంబిగించింది.. ఇప్పటివరకూ అసిస్టెంట్ కమిషనర్ హోదా కలిగిన అధికారులను ఈఓగా కొనసాగిస్తూ వచ్చిన ప్రభుత్వం కొత్తగా ఈ దేవస్ధానానికి ఐఏఎస్ అధికారిని ఈఓగా నియమించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. భారతదేశంలోనే అత్యధిక పురోహితులున్న అన్నవరం దేవస్థానం చరిత్రకెక్కినా, అదేస్థాయిలో అవినీతి వ్యవహారాలు కూడా పెరిగిపోతూ వస్తున్నాయి. అడ్డదారిలో సిబ్బంది నియామకాలు, ఇష్టం వచ్చినట్టుగా అధికారుల డిప్యూటేషన్లు, ఖర్చులకు తగ్గట్టుగా పనులు కనిపించకపోవడం, వీఐపీల ముసుగులో అధికారులు, సిబ్బంది తరించడం తదితర వ్యవహారాలను నిశితంగా గమనిస్తున్న ప్రభుత్వం వీటి నియంత్రణకు ఐఏఎస్ అధికారిని ఈఓగా తీసుకు వస్తే ఇక్కడ దేవస్థానంలో రాజకీయ ఉద్యోగాలకు అడ్డుకట్ట వేయాలని యోచిస్తుందని చెబుతున్నారు. నిన్న జరిగిన రాష్ట్ర క్యాబినెట్ లో ఈ అంశం చర్చకు రావాల్సి వుండగా ముఖ్యమైన అంశాలను మాత్రమే క్యాబినెట్ లో చర్చించారు. రెవిన్యూశాఖలోనూ, దేవదాయశాఖలోను కొందరు ఉద్యోగులు స్వామివారి పేరుతో ఉద్యోగాలు చేయకుండా ఏళ్లకు ఏళ్లు ఇక్కడే డిప్యూటేషన్లు వెలగబెట్టడంపై అత్యధికంగా ఫిర్యాదులు వెళ్లడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న అధికారులు ఈఓగా కొనసాగుతూ వస్తున్నారు. కరోనా వలన భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయినా, తిరుపతి తరువాత ఆ స్థాయిలో భక్తులు వచ్చే ఆలయంగా అన్నవరం శ్రీ సత్యదేవుని సన్నిది పేరుంది. ఆ స్థాయిని నిలబెట్టేందుకు కూడా ప్రభుత్వం ఈ దేవస్థానంలో ఐఏఎస్ అధికారిని నియమిస్తే ఆలయ అభివ్రుద్ధితోపాటు, మరింత గౌరవం దక్కి, భక్తు సంఖ్యకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో ఇక్కడ జరిగే గదుల కేటాయింపులు, పాటవిధానంలో ఇచ్చే పద్దతి, ప్రత్యేక దర్శనాలు, వ్రతాలు చేసే సమయంలో స్వామివారి వ్రతానికి సంబంధించి కాకుండా వారికిచ్చే కానుకల విషయంలోనే పురోహితులు అత్యధిక సమయం కేటాయించడం ఇలా అన్ని అంశాలను క్రోడీకరించి ప్రభుత్వం అన్నవరం దేవస్థానంపై ద్రుష్టిసారించిందని చెబుతున్నారు. అన్నీ అనుకూలిస్తే రాబోయే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల తరువాత అన్నవరం దేవస్థానానికి ఐఏఎస్ అధికారి నియామకం అయ్యేసూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే స్వామివారి ఆలయ ప్రతిష్ట పెరగడంతోపాటు, ఇక్కడ దొడ్డిదారిన జరిగే వ్యవహారాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట ఖచ్చితంగా పడుతుందని దేవాదాయశాఖ యోచిస్తుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి..!
విశాఖ ఉక్కు..ఆంధ్రుహక్కు నినాధంతో పోరాడి సాధించుకున్న విశాఖస్టీలుప్లాంటుకి భూములు ఇచ్చిన 2500 మంది ఆర్ కార్డు దారులు గాల్లో ఉన్నారు. ప్లాంటు నిర్మాణానికి అడిగిన వెంటనే భూములు ఇచ్చిన ఆర్ కార్డు దారులకు స్టీల్ యాజమాన్యం అన్యాయం చేస్తూనే వుంది. ఆర్ కార్డులున్నా చాలా మంది ఉద్యోగాలు రాక ఇప్పటికీ అలాగే వుండిపోయారు. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో భూములిచ్చిన రైతులు, వారి పేరు మీద ఉన్న ఆర్ కార్డులు బదిలీ చేసుకోవడానికి వీలులేకుండా పోయింది. దీనితో చాలా కాలంగా ఉద్యోగాలు తీస్తున్నప్పటికీ ఆర్ కార్ఢుదాలకు ఉద్యోగాలు దక్కడం లేదు. చాలా మంది ఆర్ కార్డుదారులు భూములు ఇచ్చిన పాపానికి ఉద్యోగాలు రాక ఆవేదనతో మ్రుత్యువాత పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్టీలు ప్లాంట్ ను విస్తరణ చేస్తున్న తరుణంలో ఆర్ కార్డుదారు బదిలీ ప్రక్రియకు ఇటు రాష్ట్రప్రభుత్వం, అటు కేంద్రం, మధ్యలో ఉన్న స్టీల్ యాజమాన్యం పచ్చజెండా ఊపితే తప్పా ఆర్ కార్డుదారులకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఈ విషయమై గాజువాక ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి ఈ విషయాన్ని జెసి వద్ద, స్టీలు ప్లాంట్ యాజమాన్యం వద్ద ప్రస్తావించినా సమస్య ఒక్క అడుగు కూడా ముందుకి కదల్లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనైనా ఆర్ కార్డుదారుల కష్టాలు తీరుతాయని చూసినా ఏడాదిన్న గడుస్తున్నా ఒక్క ఆర్ కార్డుదారుడి స్టీలుప్లాంట్ లో ఉద్యోగం లేకుండా పోయింది. ఈ విషయంలో ఎంపీలు, కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తే తప్పా న్యాయం జరిగే పరిస్థితి కనిపించడం లేదు.
ఆంధ్రప్రదేశ్ లో నవంబరు నెల పెన్షలు 7వ తేది వస్తే కానీ మోక్షం కలగలేదు.. గత ఐదు రోజులుగా పెన్షన్లు రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పెన్షను దార్లు ఖజానాశాఖ అధికారులకు పదే పదే ఫోన్లు చేయడంతో ఎట్టకేలకు ఆవరతేదిన పెన్షను మొత్తాన్ని పెన్షను దారుల ఖాతాలోకి మళ్లిస్తున్నట్టు ఖజానాశాఖ అధికారులు తెలియజేశారు. ప్రతీనెలా టంచనుగా 1వ తేదీనే పడిపోయే పెన్షన్లు ఈనెల 6వ తేదీ వచ్చినా నేటికీ పించన్లు పడలేదు. దీనితో పెన్షను దారులు ఖజానాశాఖకు ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారు. అందులోనూ చాలా మందికి ఆ పెన్షన్లమీదే ఆధారపడి జీవిస్తుండటంతో ఆ పరిస్థితి మరింత జటిలంగా మారింది. అయితే పెన్షను దారులకు ఎందుకు పించన్లు ఆలస్యమయ్యాయనే విషయంలో ఖజానా శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. సాంకేతిక పరమైన ఇబ్బంది రావడంతోనే పెన్షన్లు ఆలస్యం అయ్యాయని విశాఖలోని ఖజానాశాఖ డిప్యూటీ డైరెక్టర్ శివప్రసాద్ మీడియాకి వివరించారు. ఉదయం పదిగంటల నుంచి పెన్షనుదారుల ఖాతాలకు నగదు జమ అవుతున్నట్టు ఆయన వివరించారు. ఎపుడైనా జీతాలుగానీ, పెన్షన్లుగానీ ఆలస్యమైతే ప్రభుత్వం ముందుగా సమాచారం అందించేది. ఈ నెల పెన్షను దారులకు సమాచారం ఇవ్వకపోవడంతోపాటు ఒక్కసారిగా పెన్షనుదారుల్లో గందరగోళం నెలకొంది..
శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం హుండీలను ఈ నెల 9వ తేదీన తెరుస్తామని సహాయ కమీషనరు, ఆలయ ఈఓ వి.హరిసూర్య ప్రకాష్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో మీడియాతో మాట్లాడుతూ, 9వ తేదీ సోమవారం నాడు ఉదయం 9 గం.లకు 40 మంది సిబ్బందితో డిపార్ట్ మెంట్ వారి సమక్షంలో అనువంశిక ధర్మకర్త మరియు పాలక మండలి సభ్యుల సమక్షంలో అర్చకులు, భక్తులు, గ్రామ పెద్దల సమక్షంలో హుండీలను తెరవడం జరుగుతుందన్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ధేశించిన నియమ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేసినట్టు ఈఓ వివరించారు. సామాజిక దూరం, సిబ్బందికి తప్పనిసరిగా మాస్కులు, హేండ్ గ్లౌజులు ఇలా అన్నిరకాల ఏర్పాట్ల మధ్య స్వామివారి హుండీ లెక్కింపు జరుగుతుందన్నారు. లెక్కింపునకు సంబంధించిన సిబ్బందిని ఎంపిక చేయడంతోపాటు, వారికి లెక్కింపు సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా తెలియజేసినట్టు ఈఓ వివరించారు.
పేదల కష్టాలు, ఆకలిని తెలుసుకొని వారికి ఏం కావాలి అనేది ఆలోచించి ఆ విధంగా పాలన సాగిస్తున్న వైయస్ జగన్ సోషలిస్టు అని, అదే చంద్రబాబు నాయుడు అయితే పెట్టుబడి పెట్టి ఎవరు ఏమైపోయినా తనకు లాభాలు ఏ విధంగా రావాలో అని ఆలోచించే వ్యక్తి క్యాపిటలిస్టు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్ ఐక్యవేదిక సమన్వయకర్త పాక సత్యనారాయణ పేర్కొన్నారు. హోటల్ మేఘాలయ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ చక్కటి సోషలిస్టుగా పేరును పొందారన్నారు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ప్రజల కష్టనష్టాలను పక్కన పెట్టి కేవలం లాభార్జన ధ్యేయం గా పని చేసినందున ఆయన కాపిటలిస్ట్ వర్గానికి చెందుతారని ఆయన తెలిపారు. వైయస్ జగన్ తన మంత్రివర్గంలో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు క్యాబినెట్ మంత్రిలుగా నియమించారన్నారు. అదే చంద్రబాబు ఎంత మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ లను తన మంత్రివర్గంలో చోటిచ్చారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లో అసోషియేషన్ ప్రతినిధులు, అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు.