డీజీపీకే గౌతం సవాంగ్ కు ప‌్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు లేఖలు రాస్తున్నారని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అవాస్తవాలతో లేఖలు రాస్తున్నారని, వాస్తవాలు తెలుసుకోకుండా బాబు లేఖలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇటీవల చంద్రబాబు ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని భూతద్దంలో చూపిస్తూ..డీజీపీకి, సీఎస్‌లకు లేఖ రాస్తున్నారని తప్పుపట్టారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా, ఓ ఇన్‌స్పెక్టర్‌ను అరెస్టు కూడా చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారం తప్ప మరోక ఆలోచన ఉండదన్నారు. ఆయనకు స్వార్థం తప్ప..జనం కష్టాలు తెలీవని మండిపడ్డారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో టీడీపీ విఫలమైందని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాస్తున్న లేఖల్లో వాస్తవాలు లేవన్నారు. చంద్రబాబు లేఖలు రాసే ముందు లెక్కలు సరిచూసుకోవడం లేదన్నారు. రెండు రోజులు ఆగి వాస్తవాలతో లేఖలు రాస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. చిత్తూరులో 490, విశాఖలో 250, ఒకేసారి 1600 కేసులు నమోదు అవుతున్నాయంటే ఎవరికైనా అనుమానం రాదా అని నిలదీశారు. చంద్రబాబుకు అంత అనుభవం ఉండి కూడా ఎందుకు ఇలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఆయనంటే వయసు మీద పడింది కాబట్టి తెలియకపోవచ్చు..ఆయనకు సలహాలు ఇచ్చే వారు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.ఇది టీడీపీ పాలన కాదని, మా పాలనలో ఎన్ని కేసులు పెడితే..అన్ని కేసుల్లో నిందితులను అరెస్టు చేశామని చెప్పారు.చంద్రబాబు నేరాల విషయంలో అబద్ధాలు చెబుతున్నారని, రాష్ట్రంలో ఏం జరిగినా దానికి వైయస్ఆర్‌సీపీతో ముడి పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం తప్ప మరో ఆలోచన లేదన్నారు. 6నెలల పాటు హైదరాబాద్‌లో దాక్కున్న చంద్రబాబు, ఆయన కుమారుడు ఇప్పుడు మేల్కొన్నారని, కోవిడ్‌పై తమకు సమాచారం ఇవ్వాలని ఓ వెబ్‌సైట్ ఓపెన్ చేయడాన్ని ఏమనాలన్నారు.. చంద్రబాబు తీరు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. ఓ జోకర్ మాదిరిగా ప్రవర్తిస్తున్నారని, గత ఆరు నెలలుగా ప్రభుత్వ యంత్రాంగం కరోనా నియంత్రణకు శాయశక్తులా కృషి చేస్తుందని, దేశంలోనే ఏపీలో కరోనా నియంత్రణ చర్యలు బాగున్నాయని ప్రపంచమంతా చెప్పుకుంటోందన్నారు. చంద్రబాబుకు ఇవేవి కనిపించవా సజ్జల ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళిత మహిళ మనీషా పై అత్యాచారం చేసి ఆమె మృతికి కారకులైన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళంలో అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఆద్వర్యంలో సోమవారం కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా తైక్వాండో శ్రీను మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ గ్రామములో దళిత కుటుంబానికి చెందిన 19 యేళ్ళ మనీషా పై అత్యాచారం చేసిన యువకులను ఉరితీయాలని యూపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.15 రోజుల క్రిందట మనీషాపై పాశవికంగా దుర్మార్గులు అత్యాచారాని పాల్పడగా సరైన వైద్య సదుపాయం అందని కారణంగా ఆమె మృతి చెందిన తీరు విచారకమరన్నారు. బాధితురాలి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్ప చెప్పకుండా అర్థరాత్రి ఊరి చివరన దహన క్రియలు నిర్వహించారన్నారు. ఇది పోలీసులకు ప్రభుత్వానికి మాయని మచ్చ అన్నారు. దళితులపై ఇటీవల కాలంలో అత్యాచారాలు,దాడులు పెరిగిపోతున్నాయని వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దళితులపై దాడులు ఆగాలంటే దళితులకే రాజ్యాధికారం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐమ్ జోనల్ ఇన్ చార్జి మాతా శామ్యూల్ సుధాకర్ ,జిల్లా కార్యదర్శి తాళాడ రవీంద్ర,యువసైనిక్ కన్వీనర్ కళ్లేపల్లి హరికృష్ణ,కార్యదర్శి పెయ్యల చంటి, శ్రీకాకుళం నియోజకవర్గం ఇన్ చార్జి సత్తిబాబు,టౌన్ యువ సైనిక్ అధ్యక్షులు పాగోటి ప్రసాద్ ,శ్రీకాకుళం డివిజన్ ఇన్ చార్జి దువ్వాన అప్పలసూరి ,ఎఐమ్ నాయకులు ప్రదీప్ ,శంకర్ ,చిరంజీవి,మజ్జి గౌతమ్ ,పంకు మురళీ,పంకు మహేష్ ,మణి,పండు ,విజయ్ కృష్ణ,భాగ్యరాజ్ ,గణేష్ ,సాయి తదితరులు పాల్గొన్నారు.
జివిఎంసీ అధికారులు స్పందన దరఖాస్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కమిషనర్ డా.స్రిజన ఆదేశించారు. సోమవారం జివింఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ-స్పందనపై దరఖాస్తుల నుంచి తీసుకున్న అర్జీలపై పలు విభాగాల అధికారులకు కమిషనర్ దిశా నిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా 28 ఫిర్యాదులు రాగా, అందులో 01 ఎలెక్ట్రికల్ విభాగానికి సంబందించినవి, 06 ఇంజినీరింగ్ పబ్లిక్ వర్క్స్ విభాగానికి సంబందించినవి, 01 యు.జి.డి విభాగానికి సంబందించినవి, 04 నీటి సరఫరా విభాగానికి సంబందించినవి, 05 ప్రజారోగ్య వెటర్నరీ విభాగానికి సంబందించినవి, 04 ప్రజారోగ్య శానిటేషన్ విభాగానికి సంబందించినవి, 07 పట్టణ ప్రణాళికా విభాగానికి సంబందించినవి సంబందించినవి స్వీకరించుట జరిగినదని కమిషనర్ తెలిపారు. అనంతరం, కమిషనర్ వీడియో కన్ఫెరెన్సు ద్వారా జోనల్ కమిషనర్లు, ఇతర జోనల్ స్థాయి అధికార్లుతో మాట్లాడుతూ, స్పందన ద్వారా, ఇ.ఆర్.పి. విధానం, డయల్ యువర్ కమిషనర్ ద్వారా స్వీకరించిన ఫిర్యాదులు, సచివాలయాల ద్వారా స్వీకరించిన ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలని, నిర్ణీత సమయం దాటిన తర్వాత పరిష్కారం చేసే పద్దతి మారాలని, సచివాలయం స్థాయి కార్యదర్సులు మొదలుకొని జోనల్ స్థాయి అధికారులు, ప్రధాన కార్యాలయపు ఉన్నతాధికారుల ఫిర్యాదులు, సేవల దరఖాస్తులపై ప్రతీ రోజూ దృష్టి పెట్టి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ఇ-స్పందన కార్యక్రమంలో అదనపు కమీషనర్లు ఆర్. సోమన్నారాయణ, ఏ. వి. రమణి, వి. సన్యాసి రావు, జాయింట్ డైరెక్టర్(అమృత్) విజయ భారతి, సి.సి.పి. విద్యుల్లత, డి.సి.ఆర్. ఫణిరాం, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, అసిస్టెంట్ డైరెక్టర్ (ఉద్యాన శాఖ) ఎం. దామోదర రావు, జోనల్ కమిషనర్లు, జోనల్ ష్టాయి ఉన్నతాధికారులు, వార్డు ప్రత్యేక అధికార్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను త్వరితగతిన గుర్తించి లక్ష్యాలను శత శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 2020-21 సంవత్సరానికి వార్షిక ఋణ ప్రణాళికలోని జూన్ వరకు సాధించిన ప్రగతిపై జిల్లా అధికారులు, బ్యాంకర్లతో సోమవారం ఆయన సమీక్షించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు విక్రయించడం జరుగుతుందనారు. వచ్చే రబీ సీజన్ కు సంబంధించి ప్రణాళికను పక్కాగా తయారు చేయాలని జెడిని ఆదేశించారు. పంటలకే కాకుండా పశు సంవర్థక శాఖ, మత్య్సశాఖ, తదితర శాఖలకు ఋణాలు మంజూరు చేయాలన్నారు. ప్రాధాన్యత గల వ్యవసాయం, ఎంఎస్ఎంఇల పురోగతిని బ్యాంకు అధికారులతో సమీక్షించారు. జగనన్నతోడు, వై.యస్.ఆర్.భీమా, వై.యస్.ఆర్. చేయూత, వై.యస్.ఆర్. ఆసరా, తదితర వాటిపై సమీక్షించారు. సచివాలయాల ద్వారా అర్హత గల లబ్దిదారులను గుర్తించి లక్ష్యాలను శత శాతం పూర్తిచేయాలన్నారు. మెప్మా, యుసిడి ప్రాజెక్టు అధికారులు వార్డులలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి అర్హులైన లబ్దిదారులను గుర్తించాలని ఆదేశించారు. ఎస్.సి., బి.సి., మైనారిటీ కార్పొరేషన్ ల ప్రగతిపైన సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పి.యం. స్వనిధి, ముద్ర, పియంఇజిపి, తదితర పథకాల పురోగతిపై ఆయన సమీక్షించారు. ఇండస్ట్రియల్ కు సంబంధించి జిల్లా మేనేజర్ రామలింగరాజు కలెక్టర్ కు వివరించగా లక్ష్యాలను తరితగతిన పూర్తి చేయాలన్నారు. ముందుగా ఆమోదించబడిన వార్షిక ఋణ ప్రణాళిక, నాబార్డు వారి వ్యవసాయానికి సంబంధించి యూనిట్ కాస్ట్ పుస్తకాలను ఆవిష్కరించారు. శాసన మండలి సభ్యులు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు-1,2,3 ఎం. వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, గోవిందరావు, డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, వ్యవసాయ శాఖ జెడి లీలావతి, ఎస్.సి., బి.సి. కార్పొరేషన్ ఇడిలు ఎం.ఎస్. సోభారాణి, పెంటోజిరావు, మైనార్టీ కార్పొరేషన్ ఇడి, ఎల్డిఎం శ్రీనాధ్, ఎఎల్డిఎం మూర్తి, నాబార్డు ఎజిఎం శ్రీనివాసరావు, యుసిడి పిడి శ్రీనివాసరావు, మెప్మా పిడి సరోజని, ఆయా బ్యాంకు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళంజిల్లాలో నాడు నేడు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు అన్నారు. పొందూరు మండలం ఖాజీపేట, తోలాపి గ్రామాల్లో నాడు నేడు పనులను సోమ వారం పరిశీలించిన జాయింట్ కలెక్టర్ పొందూరు మండల పరిషత్ కార్యాలయంలో సంబంధిత అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. నాడు నేడు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేసారు. పనుల నాణ్యత పక్కాగా ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టి పాఠశాలల ఆధునీకరణ చేస్తుందని, కార్పొరేట్ స్ధాయి హంగులు కల్పిస్తుందని చెప్పారు. విద్యార్ధులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించి పాఠశాలకు హుషారుగా, ఆసక్తిగా రావాలనే ఉద్దేశ్యంతో అన్ని హంగులు చేపట్టడం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం నాడు నేడులో చేపట్టిన పనుల వలన బడులు అందగా ఉండటమే కాకుండా విద్యుత్ దీపాలు, ప్యాన్ లు, మంచి నల్లబల్లలు, ఇంగ్లీషు లాబ్ లు ఏర్పడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 4వేల మందికి వీధి విక్రయ దారులను ఎంపిక చేయాలని కమిషనర్ గిరీష అధికారులకు లక్ష్యాలను నిర్ధేశించారు. సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయం వై.ఎస్.ఆర్ సమావేశం మందిరం నందు పీఎం స్వనిధి మరియు జగనన్న తోడు పై మెప్మా సిబ్బందితో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకూ 3460 మంది వీధి విక్రయం దారులను ఎంపిక కి చేసి ఆన్ లైన్ లో నమోదు చేశారని, మిగిలినవి ఈ వారం లోపల పూర్తిచేయాలని ఆదేశించారు. వివిధ పథకాలకు ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారని అడిగి తెలుసుకున్నారు, బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు అర్హత కల్పించాలని ఆదేశించారు. ప్రతి ఒక్క వీధి వ్యాపారులకు చేయూత అందించాలని ప్రభుత్వ లక్ష్యమని, తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో వీధి వ్యాపారాలకు తోపుడు బండ్లు, బట్టలు బుట్ట తో వ్యాపారం చేసే జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలన్నారు. ప్రతి వ్యాపారికి పది వేల రూపాయల రుణాలు బ్యాంకు ద్వారా అందించాలన్నారు. ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని, ఇంకా ఎవరైనా వీధి వ్యాపారులు ఉంటే వారికి కూడా రిజిస్ట్రేషన్ చేయించాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో కమిషనర్ వారితోపాటు ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, సిటీ మిషన్ మేనేజర్ వెంకటరమణ, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలంలో నాడు నేడు పనులను జిల్లా కలెక్టర్ జె నివాస్ సోమ వారం తనిఖీ చేసారు. లింగాలవలస, అచ్యుతాపురం, శ్రీముఖలింగం పాఠశాలలో నాడు నేడు పనుల నాణ్యతను పరిశీలించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు పక్కాగా ఉండాలన్నారు. భవిష్యత్తులో నిరంతర నీటి సరఫరా, ఇతర నిర్వహణ పనులకు ఎటువంటి సమస్య లేకుండా ముందుగానే పక్కా ప్రణాళికలతో పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలకు గ్రానైట్ ను ఫ్లోరింగు కోసం వినియోగించాలని సూచిస్తూ పనుల సమయంలో గ్రానైట్ ఫ్లోరింగుపై ఎటువంటి సున్నపు మరకలు లేదా ఇతర మరకలు పడకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలల తలుపులు, గడియలను స్వయంగా పరిశీలించి వాటి నాణ్యతపై నిర్ధారణకు వచ్చారు. నాడు నేడు పనులతో పాఠశాలలు ఆహ్లాదకరంగా మారుతున్నాయని పేర్కొంటూ ప్రతి పాఠశాలపై చిన్నారులకు ఆకట్టుకునే విధంగా, సృజనాత్మక ఆలోచనలు రేకెత్తించే విధంగా చిత్రాలు ఉండాలని సూచించారు. ప్రతి చిత్రం వారిలో నిఘూడంగా ఉన్న సృజనాత్మక శక్తి వెలికితీయుటకు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. పనుల నాణ్యతలో ఎటువంటి రాజీ లేదని ఆయన స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్రకళ, సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి పి.వి.రమణ, కార్యనిర్వాహక ఇంజనీరు వి.వెంకట కృష్ణయ్య, మండల విద్యా శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతిగా ఆచార్య డి.వి.ఆర్ మూర్తి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం విభాగంలో ఆయన నూతన విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆచార్య డి.వి.ఆర్ మూర్తిని విభాగ ఆచార్యులు చల్లా రామక్రిష్ణ, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు అభినందించారు. ప్రస్తుతం ఆచార్య డి.వి.ఆర్ మూర్తి యూజీ పరీక్షల డీన్‌గా, విదేశీ భాషల అధ్యయన కేంద్రం సంచాలకునిగా, సేవలు అందిస్తున్నారు. ఆచార్య మూర్తి జర్నలిజం విభాగాధిపతిగా,మీడియా రిలేషన్స్ డీన్‌గా పనిచేశారు. మళ్లీ ఆయనే జర్నలిజం విభాగ అధిపతిగా రావడం పట్ల విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత మంది జర్నలిజంలో పరిశోధనకు మార్గం సుగమం అవుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఆయన ఏయూ విసి ప్రసాదరెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరిగ్ కళాశాల(అటానమస్) పూర్వ విద్యార్థిని అనిత(బోయపాటి) గొల్లమూడికి ప్రతిష్టాత్మక ది సిబెల్ స్కాలర్స్ ఫౌండేషన్ అవార్డు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా వంద మంది ప్రతిభావంతులను ఎంపిక చేసి ఈ పురస్కారాన్ని సిబెల్ స్కాలర్స్ ఫౌండేషన్ అందజేస్తుంది. ఈ సందర్భంగా అనితను ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాస రావు అభినందించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అనిత ఏయూలో కంప్యూటస్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తిచేసారన్నారు. స్వశక్తితో ఉన్నతంగా ఎదిగారన్నారు. ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో అనిత పిహెచ్‌ని చేస్తున్నారన్నారు. సమాచార గోప్యతపై ఆమె చేస్తున్న పరిశోధన నవ్యతను కలిగి ఉందన్నారు. సిబెల్ ఫౌండేషన్ మూడు దశల్లో అనిత చేస్తున్న పరిశోధనను పరిశీలించి ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థిని అనిత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి చేయడం ఎంతో గర్వకారణమన్నారు. వర్సిటీ విద్యార్థులు అనితను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో పిహెచ్‌డి చేసే దిశగా నడవాలన్నారు. సిబెల్ ఫౌండేషన్ ప్రతీ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ విశ్వవిద్యాలయాల పరిశోధకులకు ఈ అవార్డులను అందిస్తుంది. అవార్డుతో పాటు రూ 35 వేల డాలర్లు, భారతీయ కరెన్సీలో సుమారు రూ 25 లక్షలు అందిస్తుంది. ఈ నిధులు ఆమె భవిష్యత్ పరిశోధనలు ఎంతో ఉపకరిస్తాయన్నారు. ఇటువంటి ప్రతిష్టాత్మక అవార్డులు సాధించే దిశగా ఏయూ పరిశోధకులు పనిచేయాలన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా ఉందని, ఇటువంటి పరిస్థితిల్లో కార్మిక రంగం చేసే రక్తదానమే కీలకమని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అభిప్రాయపడ్డారు. సోమ వారం ఉదయం స్థానిక సి.ఐ.టి.యు కార్యాలయంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅ తిథిగా పాల్గొని రక్తదాతలకు ధృవీకరణ పత్రాలు, రక్తదానంలో విశేష సేవలు అందించిన దాతలకు పతకాలను బహూకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన కార్మికులను ఆయన అభినందించారు. పారిశ్రామిక రంగం అన్నింటా కీలకమైందని, అటువంటి పారిశ్రామిక రంగ కార్మికులు రక్తదానం చేస్తే జిల్లాలో రక్త నిల్వలు పూర్తిగా నిండిపోతాయని చెప్పారు. కాని ఎందుకో కార్మికులు చొరవ తీసుకోవడం లేదని, ఆ దిశలో ఇదొక మార్పుగా తాను భావిస్తున్నానని కలెక్టర్ తెలిపారు. ప్రమాదాలు, విపత్తులు జరిగే సమయంలో రక్తం చాలా అత్యవసరమని, దాతలు అందించే రక్తమే వారి ప్రాణాలను నిలుపుతోందని పేర్కొన్నారు. శ్రీకాకుళం వెనుకబడిన జిల్లా అయినప్పటికీ ఇక్కడి ప్రజలు అందించే సహకారం మరువలేనిదని కొనియాడారు. కరోనా నేపధ్యంలో జిల్లా యంత్రాంగం చేసే నిర్ణయాలకు ప్రజలు పూర్తి మద్ధతును ఇస్తూ తమ సహాయ సహకారాలను పూర్తిస్థాయిలో అందించి దేశంలోనే క్రమశిక్షణగా నిలిచారని కితాబిచ్చారు. కరోనా నివారణకై 67లక్షల రూపాయలను కరోనా నిధికి జిల్లావాసులు అందించారని, ఇది గర్వకారణమని తెలిపారు. అలాగే కరోనా తీవ్రస్థాయిలో ఉన్నవారి కోసం ప్లాస్మా థెరఫీ అవసరమని పిలుపునివ్వగా సుమారు 200 మంది ముందుకు వచ్చి ప్లాస్మాను అందించిన సంగతిని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తుచేసారు. తద్వారా కరోనాతో ఐసియులో ప్రతీ పేషెంటుకు ఒక్క రూపాయి ఖర్చులేకుండా ప్లాస్మాను అందించడం జరిగిందని చెప్పారు. ఇన్ని కార్యక్రమాలు జిల్లాలో జరిగేందుకు ప్రజల క్రమశిక్షణే ఇందుకు కారణమని కలెక్టర్ అభివర్ణించారు. కరోనాను నివారించేందుకు చాలా చర్యలు చేపడుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాస్కులను ధరించకపోవడం వలన కరోనాకు గురవుతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతీ ఒక్కరూ మాస్కులను ధరించాలని, విధిగా శానిటైజేషన్ చేసుకోవాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ మరోమారు పిలుపునిచ్చారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ కరోనా నేపధ్యంలో జిల్లా కలెక్టర్ ప్రజలతో మమేకమై పటిష్ఠమైన చర్యలు తీసుకోవడం వలనే కరోనాను నియంత్రించగలిగారని చెప్పారు. సిఐటియు తరపున మేడే రోజున 700 యూనిట్ల వరకు రక్తదానం చేస్తున్న సందర్భంగా ప్రతీ ఏటా రాష్ట్ర గవర్నర్ నుండి అవార్డులను స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ కు తెలిపారు. జిల్లాలో రక్తం కొరతను దృష్టిలో ఉంచుకొని రక్తదానం చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా మరిన్ని రక్తదాన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కరోనా పేషెంట్లకు అవసరమైతే ప్లాస్మాను దానం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. 365 రోజులు రక్తదానం చేసేందుకు సిఐటియు అన్నివిధాల కృషి చేస్తుందని కలెక్టర్ కు వివరించారు. తొలుత రక్తదానం చేసేందుకు విశేష కృషి చేసినందుకు గాను జిల్లా కలెక్టర్ నుండి రెడ్ క్రాస్ పతకాన్ని ఆయన అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అధ్యక్షులు డి.గోవిందరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.సురేష్ బాబు, పి.తేజేశ్వరరావు, ట్రెజరర్ ఎ.సత్యనారాయణ, యన్.వి.రమణ, వై.చలపతిరావు, సిహెచ్.అమ్మన్నాయుడు, ఎ.మహాలక్ష్మీ, కె.గురునాయుడు, సిహెచ్.రమణమూర్తి , రెడ్ క్రాస్ సభ్యులు పెంకి చైతన్యకుమార్, యస్.జోగినాయుడు , రెడ్ క్రాస్ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సచివాలయాలనికి వచ్చే సర్వీసులకు సంబంధించి ఎప్పటికప్పుడు సకాలంలో పరిష్కారం చూపించాలని, ఎలాంటి ఆలస్యం చేయరాదని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. సోమవారం బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామంలో ఉన్న బత్తలపల్లి-3 గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను ఇంటివద్దనే అందించేందుకు సచివాలయ వ్యవస్థ అనేది చాలా కీలకమన్నారు. సచివాలయానికి వచ్చే అర్జీదారులను గౌరవించాలని, వచ్చిన సర్వీసులకు పరిష్కారం చూపేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ ఉద్యోగులు అంతా సక్రమంగా విధులు నిర్వహించాలని, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మూమెంట్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. రిజిస్టర్ లను జాగ్రత్తగా మెయింటెన్ చేయాలని, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా సచివాలయం లో వచ్చిన 850 సర్వీసులకు సంబంధించి పూర్తిగా అన్ని సర్వీసులకు పరిష్కారం చూపించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇకపై కూడా ఇలాగే సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉద్యోగుల హాజరు పట్టికను, ఉద్యోగుల మూమెంట్ రిజిస్టర్ను పరిశీలించారు. ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో భార్గవ్ సాయి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సాయినికిత, వాలంటీర్లు పాల్గొన్నారు.
కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం ఉదయం విఐపి బ్రేక్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి ఈవో(ఎఫ్ఏసి) ఎవి.ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషికి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం నాదనీరాజనం వేదికపై జరిగిన సుందరకాండ పారాయణంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. సోమవారం నాటికి సుందరకాండ పారాయణం 117వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు మాజీ సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
రైతులకు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేసేందుకే మీటర్లు బిగించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ అన్నారు. వీటివల్ల రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పై ఎపిఇపిడిసిఎల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం అవగాహనా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కరపత్రాలను, పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సదస్సులో కలెక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. రైతుకు క్షేత్రస్థాయిలోనే ప్రభుత్వ సేవలను అందించేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా 9 గంటల పాటు ఇవ్వడానికే, పంపుసెట్లకు మీటర్లను బిగించాలని నిర్ణయించిందన్నారు. దీనివల్ల విద్యుత్ ఎంత వినియోగం అవుతుంది, ఎంతమేరకు వృథా అవుతోంది, ఎన్ని గంటలు సరఫరా అవుతుంది లాంటి వివరాలు తెలుస్తాయన్నారు. వినియోగించిన విద్యుత్‌కు రైతు ఎటువంటి ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నెలవారీ బిల్లులను ప్రభుత్వమే రైతు ఖాతాలో జమచేస్తుందని చెప్పారు. అమల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి, సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కోరారు.
ఎపిఇపిడిసిఎల్ డైరెక్టర్ బి.రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ మీటర్లు అమర్చడం ద్వారా నాణ్యమైన విద్యుత్ ఎన్నిగంటలు సరఫరా అవుతోంది, ఎంత వినియోగం అవుతోంది, సర్వర్లపై ఎంత భారం పడుతోంది తదితర వివరాలన్నీ నమోదవుతాయన్నారు. దీనివల్ల సరఫరాలో నాణ్యతను మరింతగా పెంచవచ్చని చెప్పారు. అలాగే సరఫరా చేసిన విద్యుత్‌కు తగిన ఛార్జీలను ప్రభుత్వం నుంచి తీసుకొనేందుకు సంస్థకు వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహించాలని, రైతులనుంచి ధరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. ఎపిఇపిడిసిఎల్ సూపరింటిండెంట్ ఇంజనీర్ వై.విష్ణు మాట్లాడుతూ జిల్లాలో సుమారుగా 43వేల విద్యుత్ కనక్షన్లు ఉన్నాయన్నారు. మీటర్లు బిగించడం వల్ల రైతుకు ఎటువంటి నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అమలు తీరును వివరించారు. వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.ఆశాదేవి మాట్లాడుతూ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం రైతుకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. గ్రామ వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు ఒక కమిటీగా ఏర్పడి, క్షేత్రస్థాయిలో ఈ పథకంపై రైతులకు అవగాహణ కల్పిస్తారని చెప్పారు. అవగాహనా సదస్సులో ఎడిఇలు, డిఇలు, విద్యుత్‌శాఖ ఉద్యోగులు, రైతులు పాల్గొన్నారు.
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయని దేవస్థాన అధికారులు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఇన్నాళ్లు స్వామివారి పూజలకు భక్తులను అధికారులు అనుమతించలేదు. నేటి నుంచి ఆర్జిత సేవలు మళ్లీ ప్రారంభించారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో జరిగే పూజల్లో భక్తులు నేరుగా పాల్గొనేందుకు అనుమతిస్తున్నారు. నేడు ముత్తంగి అలంకారంలో భక్తులకు సీతారాములవారు దర్శనమివ్వనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆర్జిత సేవలు కొనసాగిస్తామని ఆలయ ఈవో శివాజీ వివరించారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా అన్ని రకాల ప్రసాదాలు కూడా అందుబాటులో ఉంచుతున్నామని ఈవో చెప్పారు. ప్రతి ఆదివారం స్వామివారికి చేసే అభిషేకంలో పాల్గొనేందుకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తామన్నారు.`ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఈఓకోరారు.