సచివాలయాల ద్వారా అందే సేవల్లో జాప్యానికి తావుండకూడదని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ స్పష్టంచేశారు. ఏ దరఖాస్తు ప్రజల నుండి అందినా వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాల్సిందేనని చెప్పారు. గ్రామ సచివాలయాల్లో ఇ-దరఖాస్తుల పరిష్కారంపై మండలస్థాయి అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. డెంకాడ మండలం చింతలవలస గ్రామ సచివాలయాన్ని మంగళవారం కలెక్టర్ తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు, బియ్యం కార్డుల మంజూరు, చేయూత, చేదోడు పథకాలు, ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల పంపిణీ తదితర అంశాలపై సచివాలయం ద్వారా అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. గ్రామ సచివాలయానికి అందిన దరఖాస్తుల్లో పరిష్కరించినవి ఎన్ని, ఇంకా పరిష్కారం కానివి ఎన్ని తదితర వివరాలపై సచివాలయ సిబ్బందిని ప్రశ్నించారు. సచివాలయ ఇ-రిక్వెస్టు యాప్ ద్వారా ఎనిమిది వినతులు గడువు ముగిసినా వాటి పరిష్కారంపై ఎలాంటి చర్య తీసుకోకపోవడంపై ప్రశ్నించారు. వేగవంతమైన సేవలు అందించే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించారని, ఆ లక్ష్యాన్ని నీరుగార్చవద్దని సచివాలయ సిబ్బందికి హితవు చెప్పారు. సచివాలయంలో పంపిణీ కాకుండా వున్న ఆరోగ్యశ్రీ కార్డులను పరిశీలించి కార్డుకు దరఖాస్తు చేసుకొన్న గ్రామానికి చెందిన గిరిబాబు అనే వ్యక్తికి ఫోన్ చేశారు. కార్డు మంజూరైనప్పటికీ ఎందుకు తీసుకువెళ్లలేదని ఫోన్‌లోనే ఆయన్ను ప్రశ్నించారు. తగిన సమాచారం లేక రాలేకపోయానని ఆయన బదులివ్వడంతో కార్డు సిద్ధంగా ఉందని, సచివాలయానికి వస్తే అందజేస్తామని చెప్పడంతో గిరిబాబు వెంటనే సచివాలయానికి చేరుకొని కలెక్టర్ చేతుల మీదుగా ఆరోగ్యశ్రీ కార్డు అందుకున్నాడు. సచివాయలంలో సిబ్బంది అందరూ తమ గుర్తింపుకార్డులను తప్పనిసరిగా ధరించాలని కలెక్టర్ చెప్పారు. సచివాలయంలో తగినంత ఫర్నిచర్ అందుబాటులో ఉన్నదీ లేనిదీ తెలుసుకున్నారు. సచివాలయంలో ఫర్నిచర్ అవసరం మేరకు సరఫరా చేసిందీ లేనిదీ తెలుసుకన్నారు. డిజిటల్ అసిస్టెంట్ పనివిధానం గురించి ఆరా తీశారు. అంతకుముందు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సచివాలయ భవన నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 4 లక్షల ఇ-సర్వీసు రిక్వెస్టులు వచ్చాయని, వీటిలో 3.40 లక్షలు నిర్ణీత గడువులోగా పరిష్కరించారని, మరో 60వేలు గడువు దాటాక పరిష్కరించమన్నారు. ఎంపిడిఓ స్వరూపరాణి, తహశీల్దార్ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
స్వచ్చ సర్వేక్షణ్ లో మెరుగైన ర్యాంకు కొరకు ప్రజా ఆరోగ్య అధికారులు కృషిచేయాలని జీవిఎంసి కమిషనర్ డా.స్రిజన అధికారులను ఆదేశించారు. మంగళవారం వార్డు సచివాలయ శానిటరీ సెక్రటరీలతో వి ఎం ఆర్ డి ఏ చిల్ద్రెన్ థియేటర్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, 2021లో విశాఖపట్నంను స్వచ్చ సర్వేక్షణ్ లో మొదటిస్థానంలో నిలబెట్టడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఒక విప్లవాత్మకమైన మార్పుకోసం వార్డు సెక్రటరేట్ వ్యవస్థను స్థాపించారని, దాని లక్ష్య సాధనకోసం మనం అందరం క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. ప్రతీ వార్డు సచివాలయ ఉద్యోగి వద్ద తప్పని సరిగా వార్డు యొక్క వివరాలు ఉండాలన్నారు. ప్రతి వార్డు సెక్రటరి సచివాలయం లేదా వార్డు పరిధిలో తప్పని సరిగా నివాసముండాలన్నారు. ప్రతీ రోజూ ఉదయం 10.00 గం. ల లోపు కాలువలు రోడ్డు క్లీనింగ్ అవ్వాలని, డస్ట్ బిన్స్ 10.30గం. ల లోపు క్లీన్ అవ్వాలన్నారు. ప్రతీ రోజూ ఎదో ఒక అధికారి సచివాలయాలను సందర్శిస్థారని, మీ యొక్క హాజరు, మూమెంట్ రిజిస్టర్ ను విధిగా చూపాలన్నారు. మీరు సెలవు పెట్టదలచిన యెడల మీ సెలవు చీటీను శానిటరి ఇన్స్పెక్టర్ నకు ఇవ్వాలన్నారు. మీ వార్డు పరిధిలో ప్రతి ఇంటినుండి డోర్ టు డోర్ తడి చెత్త – పొడి చెత్త ను వేరుచేసి తీసుకోవాలన్నారు. ప్రతీ వాణిజ్య దుకాణాలకు ట్రేడ్ లైసెన్సులు వసూలు చేయాలన్నారు. అలాగే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ లతో కలసి మీరు పనిచేయాలన్నారు. రోడ్డుపై చెత్త, బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ వెస్తే వారికి జరిమానా విధించాలన్నారు. ప్రతి వార్డు సెక్రటరీలు అడిగిన తమ సందేహాలను కమిషనర్ నివృత్తి చేసారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున, ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులు ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు మాట్లాడుతూ విశాఖపట్నంను స్వచ్చ సర్వేక్షణ్ లో ఉన్నత ర్యాంకుకు కావలసిన కార్యచరణ ప్రణాళికను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమీషనరు డా. వి.సన్యాసి రావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఏ.ఎం.ఓ.హెచ్. లు, శానిటరీ సూపెర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు ప్రత్యేక అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ రెండు, నాలుగు సెమిస్టర్లు మరియు పీజీ రెండవ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ ను వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు మంగళవారం విడుదల చేసారు. ఉభయగోదావరి జిల్లాల్లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 20వ తేది నుండి నవంబర్ 3వ తేది వరకు ఉదయం సైన్స్ విద్యార్థులకు, మధ్యాహ్నం ఆర్ట్స్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయని అన్నారు. అలాగే డిగ్రీ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు నంబర్ 4 నుండి 17వ తేది వరకు ఉదయం సైన్స్ విద్యార్థులకు మధ్యాహ్నం ఆర్ట్స్ విద్యార్థులకు జరుగుతాయని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని 114 పరీక్షా కేంద్రాలలో 69159 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాస్తారని తెలిపారు. పీజీ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు ఆర్ట్స్ విద్యార్థులకు ఈ నెల 26 నుండి నవంబర్ 3వ తేది వరకు జరుగుతాయని, సైన్స్ విద్యార్థులకు నవంబర్ 5 నుండి 10 వరకు జరుగుతాయని, ఎంసిఎ ఫోర్త్ సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 11 నుండి 17 వరకు జరుగుతాయని అన్నారు. 24 పరీక్షా కేంద్రాలలో 6170 మంది విద్యార్థులు ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. బిఈడీ, బి.పి.ఈడీ, డిపిఈడీ పరీక్షలు ఈ నెల 20వ తేది నుండి 23వ తేది వరకు 14 పరీక్ష కేంద్రాలలో జరుగుతాయని చెప్పారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీన్ ఎగ్జామ్నెషన్ డా.ఎ.మట్టారెడ్డి, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్నెషన్ ఎస్.లింగారెడ్డి కి సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడుస్తుందని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం చిన్నలంకాం, మామిడి వలస గ్రామాల్లో పర్యటించిన శాసన సభాపతి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేసారు. చిన్న లంకాం గ్రామంలో సుమారు రూ. 17.50 లక్షల నిధులతో నిర్మించే వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం, మామిడి వలస గ్రామంలో రూ. 21.88 లక్షల నిధులతో నిర్మించే రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేసారు. అనంతరం మామిడివలస గ్రామంలో కొత్తగా నిర్మించిన సిసి రోడ్లును ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం పేదల పక్షపాతి అన్నారు. రైతు భరోసా కేంద్రాలు, వై.యస్.ఆర్ హెల్త్ క్లినిక్ లు తదితర కేంద్రాలను ప్రారంభించి ప్రజలకు చేరువలో సేవలను తీసుకువస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా, పోలాకి మండలం మబగంలో రైతులకు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, టాటా ర్యాలీస్ ఉత్పత్తి చేసిన క్రిమినాశిని మందులను ఉచితంగా రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు క్రిమినాశిని మందులను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా కోరమండల్ ఉత్పాదకాలైన వాడా మైనను, టాటా ర్యాలీ ఉత్పాదకాలు బెఫ్రిప్యూజన్ మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జెడి కె శ్రీధర్, ఉపసంచాలకులు రాబర్ట్ పాల్, ఏడి కె రవీంద్ర భారతి, ఏడి (సెరికల్చర్) పి.బాలకృష్ణారావు, మండల వ్యవసాయాధికారి కెసిహెచ్ వెంకటరావు, కోరమండల్ జిల్లా ప్రతినిధి కిషోర్ వర్మ, ప్రతినిధులు మోహన్, సత్యనారాయణ, టాటా ర్యాలీస్ ప్రతినిధి కృష్ణప్రసాద్, విఏఏ బి రోజారత్నం తదితరులు పాల్గొన్నారు.
నాడు నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా, గార మండలం వాడాడ, సతివాడ, గారలలో మంగళ వారం నాడు-నేడు పనులను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో డిజిటల్ అసిస్టెంట్లతో పనులు ప్రగతిపై సమీక్షించారు. నవంబర్ 2 నుండి పాఠశాలలు తెరువనున్న నేపథ్యంలో అక్టోబరు నెలాఖరు నాటికి నిర్మాణ పనులు పూర్తి కావాలన్నారు. నాడు-నేడు, రైతు భరోసా, హెల్త్ కేర్ కేంద్రాల పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మరుగు దొడ్ల నిర్మాణ పనులు సక్రమంగా ఉండాలని, నిరంతర నీటి సరఫరాలో లోపాలు ఉండరాదని ఆయన స్పష్టం చేసారు. పనులకు సంబంధించి బిల్లులు ఈ నెల 15 నాటికి చెల్లింపులు జరుపుటకు చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ వివరించారు. నాడు నేడు పనులతో పాఠశాలలు ఆహ్లాదకరంగా మారుతాయని, చిన్నారులు ఆసక్తితో బడికి రావాలని పేర్కొన్నారు. మన బడి అని గర్వంగా భావించాలని అన్నారు. ఆధనీకరణ పనుల్లో నాణ్యతలో ఎట్టి పరిస్ధితుల్లో రాజీ లేకుండా పనిచేయాలని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంల సహాయ కలెక్టర్ ఎం.నవీన్, మండల ప్రత్యేక అధికారి జి.రాజారావు, మండలస్థాయి అధికారులు ఉన్నారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త తన దాత్రుత్వాన్ని చాటుకున్నారు. నగరంలోని 50వార్డు సాయిరామ్ నగర్ లో కొండ చరియలు విరిగి మీద పడడంతో 3సంవత్సరాలు బాలిక (గంగోత్రి) మృతి చెందింది. మంగళవారం ఈ విషయం తేలిసిన కె.కె రాజు గారు సంఘటన స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. తక్షణ సహాయం క్రింద కుటుంబానికి రూ.20వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కెకె.రాజు మాట్లాడుతూ, కొండచరియలు విరిగిపడి బాలిక మ్రుతిచెందడం చాలా బాధాకరమని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా తాను ముందుండి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. అంతేకాకుండా కొండ ప్రాంతాల్లో నివాసం ఉండేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలన్నారు. వర్షాలు పడుతున్నందున ప్రమాదాలు జరిగే అవకాశం వుందని ఈ ప్రాంతీయులకు జాగ్రత్తలు చెప్పారు. ఈ కార్యక్రమంలో 50వార్డు అభ్యర్థి వి.ప్రసాద్,అనిల్ కుమార్ రాజు,అల్లు శంకరావు,నీలి రవి, షేక్ జుబైర్,సబృవరపు శ్రీను,మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం కరోనా వ్యాధిగ్రస్థులు వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, ప్రభుత్వ విధి విధానాలు అనుసరించి మాత్రమే ఫీజులు వసూలు చేయాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు అన్నారు. ఏ హాస్పిటల్ ఎంత వసూలు చేస్తున్నారో వాటి వివరాలు కొంత మేర ఉన్నాయని పేర్కొంటూ ఇకముందు ప్రభుత్వ విధి విధానాలను అనుసరించి వైద్యం చెయ్యాలని ఏమైనా ఇబ్బందులుంటే సరి చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో యూనిక్ హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ చింతాడ భాస్కరరావు మాట్లాడుతూ కొన్నిసార్లు కోవిడ్ వ్యాధిగ్రస్తులు జాయిన్ అయినపుడు ఎంత ఖర్చు అయినా పర్వలేదు ,ఏ టెస్టులు చేసినా పర్వలేదు అని జాయిన్ అయ్యి బిల్లు చెల్లింపు సమయంలో రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వివిధ వర్గాల జ్యోక్యం కూడా జరుగుతుందని, మేము వీటన్నిటి వలన ఇబ్బందులు పడుతున్నామని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం తరపున అన్నారు. ఈ సమావేశంలో డి ఎం హెచ్ ఓ చంద్రానాయక్, ఆడిషనల్ డి ఎం హెచ్ ఓ బగాది జగన్నాథ రావు, డాక్టర్ కొయ్యాన అప్పారావు, ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
కరోనా వైరస్ విషయంలో జర్నలిస్టులు మరో నెల రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కోరారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)చేసిన హెచ్చరికల నేపథ్యంలో జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తొలుతు 45 రోజుల్లో కరోనా వైరస్ నీరసిస్తుందని భావించినా దాని ప్రభావం ఇపుడే అధికంగా కనిపిస్తుందని వైద్యులు, పాజిటివ్ కేసులు హెచ్చరిస్తున్న తరుణంలో జర్నలిస్టులు జాగ్రత్తలు వహించాలన్నారు. విధినిర్వహణలో బయటకు వెళ్లే ప్రతీ జర్నలిస్టూ విధిగా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ లాక్ 5.0 నిబంధనలు సులభరతరం చేసినా, వార్తా సేకరణలో మాత్రం జర్నలిస్టులు మరో నెల రోజులు ముఖ్యమైన వాటికి మాత్రమే బయటకు రావాలన్నారు. మీమీద ఆధారపడి కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వానికి జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని పలు దఫాలుగా వినతులు సమర్పించిన విషయాన్ని గంట్ల గుర్తు చేశారు.
గాజువాక నియోజకవర్గ పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న రోడ్లు,కాలువలు,కల్వర్టులను పునర్నిర్మిస్తున్నట్టు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలిపారు. జీవీఎంసీ 65 వ వార్డు కాకతీయ ఆర్చి నుంచి కొండపైకి 18.55 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డు నరసింహ పాత్రుడు(కేబుల్ మూర్తి) అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాగిరెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు.గత ప్రభుత్వంలో అంతా హామీలకే ప్రాధాన్యత తప్ప పనులకు లేదని ఎద్దేవా చేశారు.అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేశామని నిజమైన పారదర్శక పాలనకు ఈ పనులే నిదర్శనమని చెప్పారు.కొండవాలు ప్రాంతాలతో ముడిపడి ఉన్న ఈ వార్డుని అభివృద్ధి లో ముందుకు తీసుకు వెళతామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీధర్,వార్డు నాయకులు మద్దాల అప్పారావు,నాగిశెట్టి శ్రీనివాస్,ఇరోతి గణేష్,జుత్తు లక్ష్మీ, మంగునాయుడు,లోకనాధం,రమణ,మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని పదవ తరగతి నుండి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన మైనారిటీ విద్యార్ధినీ విద్యార్ధులకు ఐఎఎస్/ఐపియస్ పై అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ, వక్ఫ్ బోర్డు అదనపు శాఖాధికారి యం.అన్నపూర్ణమ్మ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు. జిల్లాలోని మైనారిటీ విద్యార్ధులకు ఐ.ఎ.ఎస్ మరియు ఐ.పి.ఎస్ లపై అవగాహన సదస్సులను ప్రతీ ఆదివారం నిర్వహించడం జరుగుతుందని, ఈ అవగాహన సదస్సులకు హాజరగు ఆసక్తి గల విద్యార్ధులు https://forms.gle/Ex1 hhtrRFYMUKnig8 నకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సదస్సులకు పాల్గొనదలచిన అభ్యర్ధులు తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ తీసుకురావాలని, ఎంపికైన 100 మంది విద్యార్ధులకు ఒక్కొక్క బ్యాచ్ ద్వారా ప్రతీ ఆదివారం వెబినార్ ద్వారా అవగాహన సదస్సులను నిర్వహించడం జరుగుతుందని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశం ఆసక్తి గల విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఇతర వివరాల కొరకు షేక్ నాసిర్, 94900 44933 లేదా రియాజ్, 99890 84099 సెల్ నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆమె ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.
ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సమీక్షా సమావేశం అనంతరం ఆయన, ఎంఎల్ఏలతో కలిసి మీడియాతో మాట్లాడారు. దీనిలో భాగంగా జిల్లాలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ది పనులపై సమీక్ష చేయడం జరిగిందన్నారు. మార్చి నాటికి సుమారు రూ.400 కోట్ల ఉపాధిహామీ కన్వర్జెన్జీ నిధులను వినియోగించి పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే చేపట్టిన రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ భవనాలు, నాడూ-నేడు పనులను పూర్తి చేయడంతోపాటుగా, రహదారులు, కాలువల నిర్మాణానికి కూడా ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. షెడ్యూల్ ప్రాంతాలతోపాటుగా, నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లోని మారుమూల, గిరిజన ప్రాంతాల అభివృద్దిపైనా దృష్టి పెడతామని స్పష్టం చేశారు. జిల్లాలో కోవిడ్ మహమ్మారి నియంత్రణలోకి వచ్చిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం సగటున రోజుకు సుమారు 5వేల వరకూ నిర్ధారణా పరీక్షలను నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదట్లో పాజిటివ్ కేసుల సంఖ్య సుమారుగా 18 శాతం వరకూ ఉండేదని, ప్రస్తుతం ఇది 5 శాతానికి తగ్గిందని తెలిపారు. పాఠశాలల పునః ప్రారంభంపై అన్ని అంశాలనూ దృష్టిలో పెట్టుకొని తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థులు కరోనా బారిన పడ్డ సంఘటన జిల్లాలో ఇటీవల చోటుచేసుకుందని, తక్షణమే తగిన చర్యలను చేపట్టామని తెలిపారు. ఎంఆర్ కళాశాల ప్రయివేటీకరణ అంశంపై మంత్రి స్పందిస్తూ, ఆ ప్రతిపాదన అశోక్‌గజపతి హయాంలోనే మొదలయ్యిందని ప్రస్తుత ఛైర్మన్ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. మాన్సాస్ ట్రస్టు విషయంలో తానుగానీ, ప్రభుత్వం గానీ ఇంతవరకు జోక్యం చేసుకోలేదని, అశోక్‌గజపతిరాజు ఈ అంశంలో ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని అన్నారు. ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగే పక్షంలో తమ జోక్యం ఉంటుందని స్పష్టం చేశారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు, స్థానిక నాయకులందరితో కలిసి చర్చించిన తరువాతే తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి సత్యనారాయణ అన్నారు.
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులను ముమ్మరం చేయాలని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ కన్వర్జెన్సీ పనులపై కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులు, ఇంజనీర్లతో సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ, జిల్లాలో కన్వర్జెన్సీ పనుల ప్రగతిని వివరించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణం ప్రస్తుతం గ్రామాల్లో భారీ ఎత్తున జరుగుతోందన్నారు. అన్ని భవనాలకు అవసరమైన స్థలాలను ఇప్పటికే కేటాయించడం జరిగిందన్నారు. ఇవి కాకుండా రోడ్లు, కాలువల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. నియోజకవర్గాల వారీగా, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి బొత్స సత్యానారాయణ సమీక్షించారు. ఆయా పనుల పరిస్థితిని, ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రతీ నియోజకవర్గం నుంచి రూ.10కోట్లుకు తక్కువ కాకుండా వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. దీనికోసం ఇంజనీర్లు ఆయా నియోజకవర్గ ఎంఎల్ఏలతో కూర్చొని, మంగళవారం సాయంత్రం లోగా ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. జిల్లాలో మార్చిలోగా సుమారు రూ.400 కోట్లు విలువైన పనులను పూర్తి చేయాలని, దానికి తగ్గ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. దీనిలో భాగంగా ఈ డిసెంబరు నాటికి సుమారు రూ.200కోట్లు విలువైన పనులు చేయాలని స్పష్టం చేశారు. ఐటిడిఏ మండలాల్లోని పనులన్నీ ఐటిడిఏ పీఓ పర్యవేక్షించాలని ఆదేశించారు. మిగిలిన పనులకు పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. బిల్లులు సకాలంలో చెల్లించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తామన్నారు.
ఈ ఏడాది రాష్ట్రంలో సంతృప్తికరంగా వర్షాలు కురిసినప్పటికీ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదయ్యిందని చెప్పారు. కరువు పరిస్థితులు ఉత్పన్నం కావడంతో, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉపాధి పనులను ఉధృతం చేయాలని సూచించారు. అలాగే కరువు మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు అవసరమైన విత్తనాలను కూడా సిద్దం చేశామన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న సచివాలయాలు, ఆర్‌బికెలు, వెల్‌నెస్ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, నాడూ-నేడు పనులు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. వీటికి సంబంధించిన బిల్లులు కూడా రెండుమూడు రోజుల్లో మంజూరవుతాయని తెలిపారు. పెండింగ్ ఉన్నచోట వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. ఇసుక, సిమ్మెంటుకు సమస్య రాకుండా చూడాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో శాసన సభ్యులు శంబంగి వెంకట చినప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, పీడిక రాజన్నదొర, అలజంగి జోగారావు, కడుబండి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, ఐటిడిఏ పిఓ ఆర్.కూర్మనాధ్, డిఆర్ఓ ఎం.గణపతిరావు, డ్వామా పిడి ఏ.నాగేశ్వర్రావు, పిఆర్ ఎస్ఇ గుప్త, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ పప్పు రవి, ఇతర శాఖల అధికారులు, ఇఇలు, డిఇలు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరవు పరిస్థితులు ఉన్న మండలాల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు వీలుగా అవసరమైన విత్తనాలు అందుబాటులో సిద్ధంగా ఉంచాలని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవసాయ శాఖ జె.డి.ని ఆదేశించారు. జిల్లా ఎమ్మెల్యేలతో కలసి మంత్రి సోమవారం కలెక్టర్ ఛాంబరులో పంటల పరిస్థితిపై సమీక్షించారు. వ్యవసాయ శాఖ జె.డి. ఆశాదేవి మాట్లాడుతూ స్వల్పకాలిక వరి రకాలను, అపరాల విత్తనాలను రాయితీపై అందించేందుకు సిద్ధంగా ఉంచామని, రైతులు అపరాల పంటల విత్తనాలపైనే ఆసక్తి చూపుతున్నారని వివరించారు. దీనిపై రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. జిల్లాలోని గరివిడిలో ఏర్పాటు చేసిన పశువైద్య కళాశాల తరగతులు ప్రారంభించేందుకు అన్ని అనుమతులూ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చాయని వచ్చే నెల నుండి కళాశాల ప్రవేశాలు కూడా చేపడుతున్నట్టు కళాశాల అసోసియేట్ డీన్ డా.వెంకటనాయుడు మంత్రికి వివరించారు. కళాశాల భవనాల నిర్మాణం పూర్తయ్యాయని ప్రారంభానికి సిద్దంగా ఉన్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రితో ప్రారంభించేందుకు ప్రయత్నిస్తానని, వీలు కాకపోతే తాను ప్రారంభానికి వస్తానని మంత్రి బొత్స తెలిపారు.
నగరంలోని జె.ఎన్.టి.యు.ను పూర్తిస్థాయి యూనివర్శిటీగా ఏర్పాటు చేస్తూ జె.ఎన్.టి.యు.-విజయనగరం పేరుతో ఏర్పాటు చేయనున్నారని, ఇందుకు మరికొంత స్థలం సమకూర్చాల్సి వుందని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో, జె.ఎన్.టి.యు. పరిసరాల్లో ప్రభుత్వ భూమి లభ్యతపై జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్, ఆర్.డి.ఓ. భవానీ శంకర్, తహశీల్దార్ లు మంత్రికి వివరించారు. నగరంలో నూతనంగా నిర్మించిన ఇండియన్ రెడ్ క్రాస్ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉందని వీలు చూసుకొని ప్రారంభించాలని ఛైర్మన్ కె.ఆర్.డి. ప్రసాదరావు జిల్లా కలెక్టర్ ద్వారా మంత్రిని కోరారు. త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. సమావేశంలో శాసనసభ్యులు శంబంగి చినప్పల నాయుడు, అలజంగి జోగారావు, పీడిక రాజన్నదొర, బొత్స అప్పలనరసయ్య, కడుబండి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్లు జి.సి.కిషోర్ కుమార్, జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.