1 ENS Live Breaking News

సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలి..

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.  భీమిలి నియోజక వర్గంలోని జివిఎంసి పరిధి జోన్-1లో రూ.181.16 లక్షలతో పలు అభివృద్థి పనులకు శనివారం ఆయన శంఖుస్థాపన చేశారు. కళానగర్ లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.  కళానగర్ లో తాగునీరు సరిగా రావడం లేదని పలువురు మహిళలు మంత్రి దృష్టికి తీసుకురాగా తాగునీటికి సమస్య లేకుండా చూడాలని జివియంసి అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో అందరూ సామాజిక దూరం పాటించి మాస్క్ లు తప్పనిసరిగా వినియోగించాలని కోరారు.  అంతకు ముందు ఆయన జివియంసి పరిధి 7వ వార్డు కళానగర్ లోని బి.టి.రోడ్డుకు రూ.9 లక్షలు, సచివాలయం వెనుక సి.సి.రోడ్డు, కాలువ పనులకు రూ.19.20 లక్షలు, సి.సి. కాలువ నుండి మల్లయ్యపాలెం ముత్యాలమ్మ టెంపుల్ వరకు బి.టి. రోడ్డుకు 15 లక్షల రూపాయల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.  6వ వార్డులోని ప్రశాంతి నగర్ నుండి కొమ్మాది వరకు వంద అడుగుల రోడ్డు  కల్వర్టు వరకు 199.16 లక్షల రూపాయల పనులకు, 5వ వార్డులోని  డ్రైవర్స్  కాలని,  సాయిరాం కాలనీలలో సి.సి.రోడ్డు, కాలువ నిర్మాణంనకు,  సాయిరాం కాలనీ మొదటి దశ లోని బి.టి. రోడ్డు తోపాటు సి.సి. కాలువ నిర్మాణంనకు 19.40 లక్షల రూపాయలు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.  ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్ రాము, తహసీల్థార్  నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

విశాఖ సిటీ

2020-10-03 19:41:10

ఉన్నత విద్యకు ఉదారంగా రుణాలు..

ఉన్నత విద్యకు ఉదారంగా రుణాలు అందిస్తామని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్.బి.ఐ) విశాఖపట్నం మాడ్యూల్ డిప్యూటి జనరల్ మేనేజర్ (డిజిఎం) కె.రంగనాథ్ తెలిపారు. నీట్, జెఇఇ, ఐఐటి, ఐఐఎం వంటి ఉన్నత విద్యా సంస్ధలలో అర్హత సాధించి ఆర్థిక స్థోమత కారణంగా ఎవరూ చేరకుండా ఉండి పోవలసిన అవసరం లేదని అన్నారు. అర్థిక స్ధోమత తక్కువగా ఉన్న అర్హత సాధించిన విద్యార్ధులకు ఉదారంగా విద్యా రుణాలు అందించుటకు ఎస్.బి.ఐ సిద్ధంగా ఉందన్నారు. విద్యా రుణాలలో 99 శాతం మేర ఎస్.బి.ఐ అందిస్తుందని ఆయన చెప్పారు. శ్రీకాకుళం పర్యటనకు శని వారం విచ్చేసిన డిజిఎం పలు శాఖలను తనిఖీ చేసారు. జిల్లా పరిషత్ ఎస్.బి.ఐ శాఖను తనిఖీ చేసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శ్రీకాకుళం రీజియన్ నుండి విశాఖపట్నం ఎస్.బి.ఐ మాడ్యూల్ కు 35 శాతం వ్యాపారం జరుగుతోందని రంగనాథ్ తెలిపారు. విశాఖపట్టణం మాడ్యూల్ లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ వరకు 8 రీజియన్లు, 250 శాఖలు పనిచేస్తున్నాయని వివరించారు. దేశంలో120 మాడ్యూల్స్ ఉండగా విశాఖపట్నం మాడ్యూల్ ఉత్తమ ప్రతిభ కనబరుస్తోందని చెప్పారు. డిజిటలైజేషన్, ఎన్.పి.ఏ పెండెన్సి, అడ్వాన్సులు మంజూరు తదితర విభాగాలలో ముందువరసలో ఉందని తెలిపారు. విశాఖ మాడ్యూల్ లో రూ.30 వేల కోట్ల అడ్వాన్సులు ఉండగా శ్రీకాకుళం రీజియన్ లో రూ.10 వేల కోట్లు ఉన్నాయని, డిపాజిట్లలో రూ.55 వేల కోట్లు ఉండగా శ్రీకాకుళం రీజియన్ నుండి రూ.21 కోట్లు ఉన్నాయని తెలిపారు. విశాఖ మాడ్యూల్ కు శ్రీకాకుళం వెన్నుదన్నుగా నిలుస్తోందని పేర్కొంటూ మొత్తం వ్యాపారంలో 35 శాతం శ్రీకాకుళం రీజియన్ నుండి వస్తోందని వివరించారు. సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఎస్.బి.ఐలో డిపాజిట్ చేస్తున్నారని, ఎస్.బి.ఐ మ్యూచువల్ ఫండ్, ఎస్.బి.ఐ లైఫ్, హెల్త్ ఇన్సూరెన్సు రంగాలు మంచి ప్రగతిలో ఉన్నాయని చెప్పారు. కోవిడ్ దృష్ట్యా ప్రకటించిన మారటోరియం కాలంలో వడ్డీ వెసులుబాటు కల్పించుటకు ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. కోవిడ్ సమయంలో ఎస్.బి.ఐ ఖాతాదారులు చక్కటి సహకారం అందించారని కొనియాడారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం క్రింద ఖాతాదారులకు 20 శాతం మేర గ్యారంటీడ్ లోన్ కల్పించామని చెప్పారు. ప్రభుత్వ పథకాలకు ఎస్.బి.ఐ చక్కటి సహకారం అందించిందని చెప్పారు. విశాఖ కెజిహెచ్ కు కోవిడ్ సమయంలో 4 వెంటిలేటర్లు పంపిణీ చేసామని, సింహాచలం ఆలయానికి భక్తుల సేవలకు గాను ఒక బస్సును అందించామని చెప్పారు. శ్రీకాకుళంలోగల బెహరా మనోవికాస కేంద్రానికి రెండు ఫిట్ నెస్ సైకిళ్ళను అందించామని, మిని బస్సు అందించాలని కోరారని అందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. కోవిడ్ నివారణకు శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం కలెక్టర్ జె నివాస్ ఆధ్వర్యంలో చక్కగా పనిచేసిందని ఆయన అభిందించారు. మంచి చర్యలు చేపట్టడం వలన కోవిడ్ నియంత్రణకు అడ్డుకట్ట వేసారని చెప్పారు. బ్యాంకులను కూడా మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే అనుమతించడం వలన కోవిడ్ వ్యాప్తి నివారణకు సహకరించారని చెప్పారు. ఖాతాదారులు వెయ్యి రూపాయల వరకు నాణేలను బ్యాంకులో డిపాజిట్ చేయవచ్చని, చిరిగిన నోట్లను మార్పు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేసారు. ప్రధాన బ్రాంచిలో అధిక రద్దీ తగ్గించుటకు, సీనియర్ సిటిజన్లకు త్వరితగతిన సేవలను అందించుటకు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఏ.వి.ఎస్.ఎస్.ప్రసాద్, ఎం.బదరీనాథ్, వెంకట రమణ, కిరణ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2020-10-03 19:38:42

మార్చి31 నాటికి సచివాలయాలు పూర్తికావాలి..

 నిర్మాణంలో ఉన్నరైతు భరోసా కేంద్రాలు, గ్రామ ఆరోగ్ర కేంద్రాలు, గ్రామ సచివాలయాలు మార్చి 31 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు  వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.  శనివారం  కశింకోట మండలం కొత్తపల్లి గ్రామ సచివాలయాన్ని పరిశీలించారు.  ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ  సచివాలయ వ్యవస్థ ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సంధర్బంగా  సచివాలయాల పనితీరుపై  విశ్లేషణ చేస్తున్నట్లు తెలిపారు.  ప్రజలకు మెరుగైన సేవలు అందించుటకు తీసుకోవలసిన చర్యలు పై సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ప్రతి సచివాలయంనకు 2 కంప్యూటర్లు, ప్రింటరు, లామినేషను మిషను, కుర్చీలు, అల్మారాలు సరఫరా  చేయడమైనదని తెలిపారు. సచివాలయాలలో కల్పిస్తున్న మౌళిక సదుపాయాలను పరిశీలించుటకు ప్రతివారం ఒక మండలం తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.   సచివాలయాల ద్వారా 543 సేవలు  అందిస్తున్నామని, సచివాలయ ఉద్యోగులంతా చురుకుగా పనిచేసి ప్రజలకు మంచి సేవలందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.   సచివాలయాల ద్వారా అందించే ప్రతి పని  నిర్ణీత సమయంలో  పూర్తిచేయాలన్నారు.  సచివాలయంలో అందించే సేవలలో  రేషనుకార్డు, ఫించన్లు, ఆరోగ్యశ్రీ, ఇళ్ల స్థల పట్టాలకు సంబంధించిన సమస్యలను అధిక ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని తెలిపారు.    జిల్లాలో  గ్రామీణంలో 739, అర్బన్ లో 602  మొత్తం 1341  సచివాలయాలు ఉన్నాయని తెలిపారు. 350 కోట్ల రూపాయలతో 558 గ్రామ ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.   జిల్లాలో 702 రైతు భరోసా కేంద్రాలు, 712 సచివాలయాలు, 558 గ్రామ ఆరోగ్య కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయని  వాటిని మార్చి 31 నాటికి పూర్తిచేయనున్నట్లు తెలిపారు.   సచివాలయాలలో  మొదటి విడతలో నియామకాల తరువాత ఖాళీగా గల ఉద్యోగాలకు రెండవ విడత నియామక పరీక్షలు నిర్వహించడం జరిగిందని త్వరలోనే వాటి ఫలితాలు వెలువడుతాయన్నారు.   కోవిడ్-19 వ్యాధి జిల్లాలో తగ్గు ముఖం పట్టిందని ప్రస్తుతం 6 లేక 7 శాతం కేసులు మాత్రమే నమోదవుతున్నాయని తెలిపారు.  గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో వ్యాధి వ్యాప్తి చెందుతున్నదని ప్రజలు తప్పని సరిగా  మాస్కు ధరించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

కొత్తపల్లి

2020-10-03 19:36:21

కేంద్ర జలశక్తి మంత్రికి సాదర వీడ్కోలు..

తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని, శ్రీకాళహస్తి స్వామి, అమ్మవార్లను దర్షించుకుని శనివారం సాయంత్రం 4 .15 గంటలకు  గంటలకు తిరుగు ప్రయాణం అయిన కేంద్ర జలశక్తి (జలవనరుల శాఖ) మంత్రి గజేంద్ర సింఘ్ షెకావత్ కి రేణిగుంట విమానాశ్రయంలో  సాదర వీడ్కోలు లభించింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.పి.అనిల్ కుమార్,జిల్లా ఇంచార్జి మంత్రి గౌతమ్ రెడ్డి,  శ్రీకాళహస్తి శాసన సభ్యులు బియ్యపు మధుసూదన రెడ్డి,  నగరి శాసన సభ్యురాలు అర్. కె.రోజా, తిరుపతి ఆర్డీఓ కనక నరసా రెడ్డి,  సిఐ ఎస్ ఎఫ్  డిప్యూటి కమాండెంట్ శుక్లా , రేణిగుంట తహసిల్దార్ శివ ప్రసాద్, భానుప్రకాష్ రెడ్డి, కోడూరు బాలసుబ్రమణ్యం, డిఎస్పీ చంద్రశేఖర్,  బిజెపి కార్యకర్తలు,  వీడ్కోలు తెలిపిన వారిలో వున్నారు. 

Renigunta

2020-10-03 19:27:47

సివిల్స్ పరీక్షలు ప్రతిష్టాత్మకంగా తీసుకోండి..

తిరుపతిలో ఈ నెల  4న ఆదివారం యూనియన్ పబ్లిక్ సెర్వీస్ కమీషన్ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు తిరుపతి నందు 14 పరీక్షా కేంద్రాలలో 6802 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని  కోవిడ్ నిబంధనలు, యు. పి. ఎస్. సి. గైడ్ లైన్స్ లను అభ్యర్థులు, రూట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు  తు.చా తప్పకుండా పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి  సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం   మధ్యాహ్నం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో యు.పి.ఎస్. సి   పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో, పరీక్షా కేంద్రాల సూపర్వైజర్లతో డిఆర్ఓ, యూపీఎస్సీ ఇంస్పెక్టింగ్ అధికారి ఉమేష్ పాల్ సింగ్. ఆర్డిఓ కనక నరసా రెడ్డి తో కలసి మరోమారు సమీక్ష నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి  మాట్లాడుతూ ఇప్పటికే మూడుసార్లు సమావేశం నిర్వహణ జరిపామని, ఆదివారం తిరుపతి కేంద్రంగా 14 పరీక్షా కేంద్రాలలో 6802  మంది అభ్యర్థులు సివిల్స్ ప్రిలిమ్స్ కు హాజరు కానున్నారని, అన్ని  పరీక్షా కేంద్రాల్లో  ప్రత్యేక సానిటేషన్ పూర్తి అయిందని, మాస్కూలు అందుబాటులో ఉంచడం,  వైద్య శిబిరాల ఏర్పాటు వంటివి సంబందిత వైద్య అధికారులు చేపట్టాలని సూచించారు. పరీక్షల నిర్వహణ  అబ్జర్వర్ గా కె.వి.రమణ ఐ.ఎ.ఎస్.,  7 పరీక్షా కేంద్రాలకు కేంద్రాలకు  మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి ఐ.ఎ.ఎస్., మరో 7 కేంద్రాలకు అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఐ.ఎ.ఎస్.,ల   ప్రత్యేక పర్యవేక్షణ  ఉంటుందని అన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు, ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి వెంట పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని,  ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రాలలోకి అనుమతి లేదని తెలిపారు. పరీక్షల నిర్వహణ సమయం ఉదయం  9:30 - 11:30 , మద్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల మధ్య రెండు పేపర్ లు వ్రాయనున్నారని, అర్థ గంట ముందుగా పరీక్షా కేంద్రాల మెయిన్  గేట్ మూసివేస్తారని, 10 నిమిషాలు ముందుగానే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలలోకి వెళ్లాలని ఆ పై అనుమతి ఉండదని తెలిపారు. ఇన్విజిలేటర్లకు కూడా పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ అనుమతి వుండదని తెలిపారు. 

Tirupati

2020-10-03 19:22:33

సివిల్స్ పరీక్షలకు ప్రత్యేక అధికారులు

యూపీఎస్సీ పరీక్షల కోసం లైజన్ ఆఫీసర్లను నియమించినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడారు. సివిల్స్ పరీక్షల కోసం 10 మంది లోకల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ లను, 10 మంది రూట్ ఆఫీసర్స్ కమ్ సిట్టింగ్ స్క్వాడ్ లను, 10 మంది అసిస్టెంట్ సూపర్వైజర్ లను, 10 మంది . అలాగే 320 మంది ఇన్విజిలేటర్ లను నియమించినట్లు తెలిపారు. అనంతపురం కేంద్రంలోని అన్ని వెన్యూ పరీక్ష కేంద్రాలలో ఇన్విజిలేటర్ల కు ఇన్విజిలేషన్ డ్యూటీ లపై వెన్యూ సూపర్వైజర్లు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. యూపీఎస్సీ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన వెన్యూ పరీక్ష కేంద్రాలలో ఎలాంటి ఫోన్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయకుండా జామర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. యూపీఎస్సీ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన వెన్యూ పరీక్ష కేంద్రాలలో   ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయాలని, శానిటైజర్లు, మాస్కులు,గ్లోవ్స్ సిద్ధంగా ఉంచాలని, అదనపు గదులను శుభ్రపరచి, శానిటైజేషన్ చేసి అవసరమైన ఫర్నిచర్ ను ఏర్పాటు చేయాలన్నారు. గోడలపై ఉన్న రాతలు తొలగించాలని,  గదులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఆయా గదుల్లో గాలి, వెలుతురు ఉండేలా చూడాలన్నారు. అభ్యర్థుల కోసం తాగునీటి సౌకర్యాలను కల్పించాలన్నారు. వైద్య బృందాలను తగినన్ని మందులను కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలన్నారు..  పరీక్షా కేంద్రాల వద్ద ఒక వైపుగా స్నాక్స్, బిస్కట్ లాంటి ఆహార  పదార్థాలను అభ్యర్థులకు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ సూచించారు.. యూపీఎస్సీ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం యూపీఎస్సీ పరీక్షలను ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు, లైజన్ ఆఫీసర్లను  జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Anantapur

2020-10-03 18:54:29

అధిక ఛార్జీలు వసూలు చేయకూడదు..

యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, అభ్యర్థులతో ఎక్కువ చార్జీలను వసూలు చేయరాదని అసిస్టెంట్ కలెక్టర్ జి. సూర్య సూచించారు. శనివారం నగరంలోని ఆర్టీవో కార్యాలయంలో యూపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు రవాణా సౌకర్యం కల్పించే విషయంపై ఆటో యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు యూపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో ఆటో యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించామన్నారు. పరీక్షలకు వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఆటోలలో ఇద్దరు లేదా మరీ అత్యవసర పరిస్థితిలో తప్ప ముగ్గరి కంటే ఎక్కువ మందిని ఎక్కించ రాదని సూచించారు. కరోనా నేపథ్యంలో నియమ నిబంధనలు పాటిస్తూ అభ్యర్థులను సకాలములో పరీక్ష కేంద్రాలకు చేర్చాలని ఆదేశించారు. అభ్యర్థులతో ఎక్కువ ఛార్జీలను వసూలు చేయరాదన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమీషనర్ పి వి వి ఎస్ మూర్తి, ఆర్టీఓ నిరంజన్ రెడ్డి, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. 

Anantapur

2020-10-03 18:52:05

సివిల్స్ పరీక్షకు సర్వసిద్ధం..

దేశవ్యాప్తంగా నిర్వహించనున్న యూపీఎస్సీ పరీక్షలకు అనంతపురం సెంటర్ లోని వెన్యులలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఈనెల 4వ తేదీన ఆదివారం రెండు సెషన్లలో యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందులో ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3312 మంది అభ్యర్థులు పరీక్ష లకు హాజరవుతున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 4 సెంటర్లను ఏర్పాటు చేయగా, అందులో అనంతపురం సెంటర్ ఒకటని,  జిల్లా కేంద్రంలోని 8 వెన్యూ కేంద్రాలలో పరీక్షలను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అందులో అనంతపురం శారదానగర్ లోని జెఎన్టీయూఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏ, బి సెంటర్లలో, భైరవనగర్ జేఎన్టీయూ రోడ్డులోని కేఎస్ఎన్ గవర్నమెంట్ యూజీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ లో, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు లోని జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్ఎస్ బిఎన్ డిగ్రీ కాలేజ్ ( అటానమస్)లో, టవర్ క్లాక్ వద్దనున్న గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్ ( అటానమస్)లో, జీసస్ నగర్లోని మోర్ సూపర్ మార్కెట్ దగ్గర ఉన్న ఎస్వీ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ లో, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఎస్కే యూనివర్సిటీ లో, దృష్టి లోపం ఉన్న అభ్యర్థుల కోసం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులో జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్ఎస్ బిఎన్ జూనియర్ కళాశాలలో వెన్యూ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

Anantapur

2020-10-03 18:50:00

తిరుపతి అభివ్రుద్ధికి సహకరించండి..

తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా కోరారు. కొర్లగుంట గురవారెడ్డి సమాధులు నుండి రేణిగుంట రోడ్డులోని హీరో హొండా షో రూమ్ వరకు నిర్మిస్తున్న డి.బి.ఆర్. రోడ్డు పనులను కమిషనర్ శనివారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి ఇరువైపులా కొంత మంది అభ్యంతరం చేస్తున్న వారితో చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణానికి 60 అడుగులు మాత్రమే కావాలన్నారు. అందులో భాగంగానే ఎవరికి ఇబ్బంది లేకుండా సర్వే చేస్తున్నామన్నారు. రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోయిన వారికి టి.డి.ఆర్. బాండ్లు ఇస్తున్నామన్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా న్యాయం చేస్తున్నామన్నారు. గెస్ట్ లైన్ డేస్ నుండి సుబ్బారెడ్డి నగర్ మీదుగా డి.బి.ఆర్. రోడ్డు కు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. ఈ రోడ్డు వేయడం వలన నగరంలో ట్రాఫిక్ పూర్తిగా తగ్గుతుందన్నారు. అలాగే ఈ రోడ్డు వెంబడి భూములకు అధిక ధరలు వస్తాయన్నారు.   నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ హరిత, ఎస్ఈ చంద్రశేఖర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ షణ్ముగం, సర్వేయర్లు ప్రసాద్, దేవానంద్, తదితరులు ఉన్నారు.

Tirupati

2020-10-03 18:45:25

5న చక్కెర ఖర్మాగాల సందర్శన..

‌రాష్ట్రంలోని స‌హ‌కార చ‌క్కెర క‌ర్మాగారాల పున‌రుద్ద‌ర‌ణ‌పై ఏర్పాటైన మంత్రుల బృందం ఈనెల 5న విజయనగరం జిల్లా భీమ‌సింగిలోని విజ‌మ‌రామ గ‌జ‌ప‌తి స‌హ‌కార చ‌క్కెర క‌ర్మాగారాన్ని సంద‌ర్శించ‌నున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర పురపాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు, ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులు, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి శాఖ‌ల మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డిల‌తో కూడిన బృందం 5వ తేదీ మ‌ధ్యాహ్నం 2 నుండి 3 గంట‌ల వ‌ర‌కు భీమ‌సింగి చ‌క్కెర క‌ర్మాగారాన్ని సంద‌ర్శిస్తుంద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. అనంత‌రం విశాఖ జిల్లా చోడ‌వ‌రం స‌హ‌కార చ‌క్కెర క‌ర్మాగారం సంద‌ర్శ‌న‌కు బ‌య‌లుదేరి వెళ‌తార‌ని తెలిపారు. మంత్రుల కమిటి చక్కెర ఖర్మాగారాలను సందర్శించి అక్కడ వాస్తవ పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తుందని అన్నారు. మంత్రుల రాక సందర్భంగా అధికారికంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ వివరించారు.

కలెక్టరేట్

2020-10-03 18:42:21

చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు..

చిరు వ్యాపారులకు, సాంప్రదాయ వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న తోడు పధకం ఎంతో లాభదాయకమని జిల్లా కలెక్టర్ డా.ఎం. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు.  వ్యాపారాలకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసుకోడానికి  వడ్డీ లేకుండా  రూ. 10 వేల బ్యాంకు  రుణం అందించడం  జరుగుతుందన్నారు.   నెలసరి వాయిదాలను క్రమం తప్పకుండ కట్టే లబ్ది దారులకు ప్రభుత్వం వడ్డీ మొతాన్ని వారి బ్యాంకు ఖాతా లో జమ చేస్తుందని తెలిపారు.  రుణాన్ని ఒక సం. లో తిరిగి చెల్లించిన వారికీ మరల 10 వేల రూపాయలను ఋణం అందించడం జరుగుతుందని తెలిపారు.   కల్లెక్టరేట్ ఆడిటోరియం లో శనివారం జగనన్న తోడు, వై.ఎస్.ఆర్. బీమా , వై.ఎస్.ఆర్  చేయూత   పథకాల పై  బ్యాంకర్లు, గ్రామీణాబివృద్ధి , మెప్మా , టి.పి ఎం.యు కు చెందిన క్షేత్ర స్థాయి సిబ్బందితో  కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసారు.     ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  స్పందన లో ,  పించన్ల పంపిణి లో, ఈ- సర్వీసెస్ లో, జగనన్న పచ్చ తోరణం లో మన జిల్లా మొదటి స్థానం లో ఉందని, జగనన్న తోడు పథకం లో కూడా మొదటి స్థానంలో నిలపాలని కోరారు.   అందుకు బ్యాంకు అధికారుల సహకారం ఎంతైనా అవసరం ఉందన్నారు. వారం లో రెండు రోజులు బ్యాంకు లు రుణాల కోసమే ప్రత్యేకంగా కేటాయించాలని కలెక్టర్ కోరారు.  ప్రస్తుతం లబ్ది దారుల గుర్తింపు లో ముందున్నామని, ఇప్పటికే లక్ష 50 వేల మందిని గుర్తించడం జరిగిందని,  గ్రౌండింగ్స్ లో కూడా అదే వేగాన్ని చూపించి ముందుండే లా  కృషి చేయాలని అన్నారు.  ఈ పథకం పై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.  సంయుక్త కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ మాట్లాడుతూ జగనన్న తోడు పథకానికి సంబంధించి  లబ్ది దారుల గ్రౌండింగ్స్  కోసం  పట్టణ  ప్రాంతాల్లో వార్డ్ వారీగా లక్ష్యాలను కేటాయిస్తున్నామని, వాలంటీర్ల సహకారం తో వేగంగా జరిగేలా చూడాలని అన్నారు. సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం ఒక నోడల్ అధికారిని కూడా  నియమించారని వారికి ఫోన్ ద్వారా సంప్రదించి పరిష్కరించుకోవాలని అన్నారు. వై.ఎస్.ఆర్. బీమా కోసం ఇంకనూ  జన్ ధన్ ఖాతాలు తెరవని వారు వెంటనే ఖాతాలు తెరిచేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. వాలంటీర్ ఏప్ ద్వారా  నమోదు చేసిన వారిలో ఇంకను 25 వేల మందికి  ఖాతాలు తెరవ వలిసి ఉందని,  ఈ ఖాతాల కోసం బ్యాంకు లకు అందిన దరఖాస్తులకు వెంటనే ఖాతాలను ఓపెన్ చేయాలని అన్నారు.  ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ (ఆసరా) జే. వెంకట రావు, డి.ఆర్.డి.ఎ పి.డి  సుబ్బారావు, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ వెంకటేశ్వర రావు, , మెప్మా పి.డి సుగుణాకర రావు, మున్సిపల్ కమీషనర్ లు,  లీడ్ జిల్లా మేనేజర్ , పలు బ్యాంకు అధికారులు హాజరైనారు.

Vizianagaram

2020-10-03 18:40:42

బాలాజి రిజర్వాయ‌ర్ నిర్మాణానికి స‌హ‌కరిస్తాం..

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌స్తున్న భ‌క్తుల సంఖ్య పెరుగుతోంద‌ని, భ‌క్తుల‌కు నీటి అవ‌స‌రాల కోసం బాలాజి రిజర్వాయ‌ర్ నిర్మించేందుకు కేంద్రం త‌ర‌ఫున స‌హ‌కారం అందిస్తామ‌ని కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి  గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ తెలిపారు. తిరుమ‌ల‌లోని పాప‌వినాశ‌నం డ్యామ్‌ను శనివారం కేంద్రమంత్రివ‌ర్యులు ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా  గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ మీడియాతో మాట్లాడుతూ బాలాజి రిజర్వాయ‌ర్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం నివేదిక పంపితే ప‌రిశీలించి త‌గిన చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా చేప‌ట్టిన ప్రతి ఇంటికీ తాగునీరు అందించే ప్రాజెక్టు కింద నిధులు అందించేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు. రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి  అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తిరుమలలో తాగునీటి స‌మ‌స్య‌ను శాశ్వత‌ ప్రాతిపాదికన పరిష్కరించేందుకు రాష్ట్ర‌ ప్రభుత్వం, టిటిడి సంయుక్తంగా బాలాజి రిజర్వాయర్ నిర్మాణం చేప‌డుతున్న‌ట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక పంపితే కేంద్రం త‌ర‌ఫున సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చార‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి మాజీ బోర్డు స‌భ్యులు  భానుప్ర‌కాష్‌రెడ్డి, శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే  బియ్య‌పు మ‌ధుసూద‌న‌రెడ్డి, ఎస్ఇ-2  నాగేశ్వ‌ర‌రావు, వాట‌ర్ వ‌ర్క్స్ ఇఇ  శ్రీ‌హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2020-10-03 18:26:37

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి

కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి  గ‌జేంద్ర సింగ్  షెకావ‌త్ శ‌నివారం విఐపి బ్రేక్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో ‌ ఎవి.ధ‌ర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా  గ‌జేంద్ర సింగ్  షెకావ‌త్‌కు  శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అంద‌జేశారు. అనంతరం కేంద్రం మంత్రి మాట్లాడుతూ, ఏడుకొండల స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా వుందని అన్నారు. అదేవిధంగా భక్తుల కోసం టిటిడి చేపడుతున్న కార్యక్రమాలు కూడా చాలా బాగుతున్నాయని కూడా మంత్రి కితాబునిచ్చారు. కోరనా సమయంలో తీసుకుంటున్న చర్యల కారణంగా వైరస్ వ్యాప్త ఆలయ పరిధిలో తక్కువగా వుంటుందని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, టిటిడి సివిఎస్‌వో  గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్  జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2020-10-03 18:24:31

రూర్భన్ పనులు త్వరగా పూర్తిచేయండి..

రూర్బన్‌ ‌మిషన్‌ ‌క్రింద చేపట్టిన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా కలెక్టర్‌ ‌రేవు ముత్యాలరాజు సంబందిత అధికారులను ఆధేశించారు. కలెక్టర్‌ ‌క్యాంపు కార్యాలయంలో పథకం అమలుపై సంబందిత శాఖల అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణ సౌకర్యాలను కల్పించి గ్రామీణ ప్రాంతాల నుండి వలసలను నివారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నెషనల్‌ ‌రూర్బన్‌ ‌పథకం అమలుకు 100 కోట్ల రూపాయిల విలుగల కార్యాచరణ రూపొందిచడం జరిగిందన్నారు.  2017-18 ఫెజ్‌-3‌లో పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు రూర్బన్‌ ‌క్లస్టర్‌ ‌క్రింద ఎంపికకావడంతో  ఏలూరు పరిదిలోని  15 గ్రామ పంచాయితీలను క్లస్టర్‌ ‌క్రింద తీసుకోవడం జరిగిందన్నారు.  మలకాపురం, సిరిపురం, కలకుర్రు, కోమటిలంక, గుడివాకలంక, ప్రత్తికోళ్లలంక, పైడిచింతలపాడు, మెండికోడు, కొక్కిరిలంక, కె.దుర్గాపురం, చాటపర్రు, పెదయాగానమిల్లి, జాలిపూడి, కాట్లంపూడి, మాదేపల్లి క్లస్టర్‌లో వున్నాయన్నారు.  ఈ పధకం అమలుకు 30 శాతం కేంద్ర నిధులతోపాటు సంబందిత శాఖల పనులకు కన్వర్జెన్సీ క్రింద 70 శాతం ఫండింగ్‌ ‌వుంటుందన్నారు. ఆయా గ్రామాలలో నిరంతర నీటి సరఫరా, విద్యుత్‌, ‌సోషల్‌ ఇన్ఫస్ట్రక్చర్‌, ‌గ్రామీణ రోడ్లుకు అనుసంధానంగా డ్రైన్స్ ‌నిర్మాణం, నైపుణ్యాభివృద్ధి, ఆర్ధికవ్యవహారాలపై ప్రత్యేక శిక్షణ, సాలిడ్‌ ‌లిక్విడ్‌ ‌వెస్టు మేనేజ్‌మెంట్‌, ‌పౌర సేవలకోసం ఎలక్ట్రానిక్‌ ఆధారిత పౌర సేవా కేంద్రాలు ఏర్పాటు, వైద్యం, గ్రామీణ వ్యవసాయాన్ని ప్రొత్సహించేందుకు ఆగోప్రాసెసింగ్‌, ‌స్టోరేజ్‌, ‌వేర్‌హౌసింగ్‌ ‌వంటి సదుపాయాలు, పర్యాటకం, పారిశుద్ధ్యం వంటి 13 ఆంశాల ఏర్పాటుకు గుర్తించి కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు.  పనులు ఆమోదం, చేపట్టడంలో సంబందిత అధికారుల అలసత్వం కనిపిస్తుందని పని తీరుమార్చుకోవాలని తెలిపారు.  ఈ సమావేశంలో  అసిస్టెంట్‌ ‌ట్రైనీ కలెక్టర్‌ ‌చహట్‌ ‌బాజ్‌పేయి, జిల్లా పరిషత్‌ ఇన్‌ఛార్జి సిఇఓ,ఇన్‌ఛార్జి డ్వామా పిడి వై.పరదేశీ కుమార్‌,  ఇన్‌ఛార్జి డిపిఓ జె.ఉదయ భాస్కర్‌, ఎస్‌.ఇ ‌పంచాయితీరాజ్‌  ‌జి.చంద్రభాస్కరరెడ్డి, ఎస్‌.ఇ ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎ.‌వి.రాఘవులు, ఏలూరు ఎంపిడిఓ జి.ఆర్‌.‌మనోజ్‌, ‌తదితరులు పాల్గోన్నారు.  

Eluru

2020-10-03 15:48:07

నిర్వాసితులకు 2రోజుల్లో నష్టపరిహారం..

అనంతపురం జిల్లా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద అర్హులైన నిర్వాసితులకు పరిహారం  రెండు రోజుల్లోపు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వాయర్ లో 10 టీఎంసీల నీటి నిల్వ కు చర్యలు తీసుకుం టామన్న ఆయన  సీబీఆర్ రిజర్వాయర్ కింద 10 టీఎంసీ నీటిని నిల్వచేయడానికి అవసరమైన భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అమలు కు ప్రభుత్వం రూ. 240.53 కోట్ల ను మంజూరు చేసిందని కలెక్టర్ తెలిపారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న తాడిమర్రి మండలం సిసి రేవు, మర్రిమాకులపల్లి గ్రామాలకు, ముదిగుబ్బ మండలం పిసీరేవు, రాఘవపల్లి గ్రామాలకు చెందిన 1729 మంది నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేస్తున్నామన్నారు.  నిర్వాసితుల కు వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చెల్లించడం జరుగుతోందన్నారు.ఇందుకు సంబంధించిన బిల్లులను అప్లోడ్ చేస్తున్నామని, రెండు రోజుల్లో నిర్వాసితులకు పరిహారం పంపిణీ ప్రక్రియని పూర్తి చేస్తామన్నారు.  అర్హులైన లబ్ధిదారులకు  పరిహారం  అందించేలా చర్యలు  తీసుకుంటున్నామన్నారు. పరిహారం అందజేసిన వెంటనే ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో 10 టీఎంసీల నీరు నింపే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు.

కలెక్టరేట్

2020-10-03 15:39:31