సచివాలయాలనికి వచ్చే సర్వీసులకు సంబంధించి ఎప్పటికప్పుడు సకాలంలో పరిష్కారం చూపించాలని, ఎలాంటి ఆలస్యం చేయరాదని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. సోమవారం బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామంలో ఉన్న బత్తలపల్లి-3 గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను ఇంటివద్దనే అందించేందుకు సచివాలయ వ్యవస్థ అనేది చాలా కీలకమన్నారు. సచివాలయానికి వచ్చే అర్జీదారులను గౌరవించాలని, వచ్చిన సర్వీసులకు పరిష్కారం చూపేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ ఉద్యోగులు అంతా సక్రమంగా విధులు నిర్వహించాలని, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మూమెంట్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. రిజిస్టర్ లను జాగ్రత్తగా మెయింటెన్ చేయాలని, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా సచివాలయం లో వచ్చిన 850 సర్వీసులకు సంబంధించి పూర్తిగా అన్ని సర్వీసులకు పరిష్కారం చూపించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇకపై కూడా ఇలాగే సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉద్యోగుల హాజరు పట్టికను, ఉద్యోగుల మూమెంట్ రిజిస్టర్ను పరిశీలించారు. ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో భార్గవ్ సాయి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సాయినికిత, వాలంటీర్లు పాల్గొన్నారు.
కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం ఉదయం విఐపి బ్రేక్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి ఈవో(ఎఫ్ఏసి) ఎవి.ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషికి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం నాదనీరాజనం వేదికపై జరిగిన సుందరకాండ పారాయణంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. సోమవారం నాటికి సుందరకాండ పారాయణం 117వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు మాజీ సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
రైతులకు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేసేందుకే మీటర్లు బిగించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ అన్నారు. వీటివల్ల రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పై ఎపిఇపిడిసిఎల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం అవగాహనా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కరపత్రాలను, పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సదస్సులో కలెక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. రైతుకు క్షేత్రస్థాయిలోనే ప్రభుత్వ సేవలను అందించేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా 9 గంటల పాటు ఇవ్వడానికే, పంపుసెట్లకు మీటర్లను బిగించాలని నిర్ణయించిందన్నారు. దీనివల్ల విద్యుత్ ఎంత వినియోగం అవుతుంది, ఎంతమేరకు వృథా అవుతోంది, ఎన్ని గంటలు సరఫరా అవుతుంది లాంటి వివరాలు తెలుస్తాయన్నారు. వినియోగించిన విద్యుత్‌కు రైతు ఎటువంటి ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నెలవారీ బిల్లులను ప్రభుత్వమే రైతు ఖాతాలో జమచేస్తుందని చెప్పారు. అమల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి, సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కోరారు.
ఎపిఇపిడిసిఎల్ డైరెక్టర్ బి.రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ మీటర్లు అమర్చడం ద్వారా నాణ్యమైన విద్యుత్ ఎన్నిగంటలు సరఫరా అవుతోంది, ఎంత వినియోగం అవుతోంది, సర్వర్లపై ఎంత భారం పడుతోంది తదితర వివరాలన్నీ నమోదవుతాయన్నారు. దీనివల్ల సరఫరాలో నాణ్యతను మరింతగా పెంచవచ్చని చెప్పారు. అలాగే సరఫరా చేసిన విద్యుత్‌కు తగిన ఛార్జీలను ప్రభుత్వం నుంచి తీసుకొనేందుకు సంస్థకు వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహించాలని, రైతులనుంచి ధరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. ఎపిఇపిడిసిఎల్ సూపరింటిండెంట్ ఇంజనీర్ వై.విష్ణు మాట్లాడుతూ జిల్లాలో సుమారుగా 43వేల విద్యుత్ కనక్షన్లు ఉన్నాయన్నారు. మీటర్లు బిగించడం వల్ల రైతుకు ఎటువంటి నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అమలు తీరును వివరించారు. వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.ఆశాదేవి మాట్లాడుతూ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం రైతుకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. గ్రామ వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు ఒక కమిటీగా ఏర్పడి, క్షేత్రస్థాయిలో ఈ పథకంపై రైతులకు అవగాహణ కల్పిస్తారని చెప్పారు. అవగాహనా సదస్సులో ఎడిఇలు, డిఇలు, విద్యుత్‌శాఖ ఉద్యోగులు, రైతులు పాల్గొన్నారు.
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయని దేవస్థాన అధికారులు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఇన్నాళ్లు స్వామివారి పూజలకు భక్తులను అధికారులు అనుమతించలేదు. నేటి నుంచి ఆర్జిత సేవలు మళ్లీ ప్రారంభించారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో జరిగే పూజల్లో భక్తులు నేరుగా పాల్గొనేందుకు అనుమతిస్తున్నారు. నేడు ముత్తంగి అలంకారంలో భక్తులకు సీతారాములవారు దర్శనమివ్వనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆర్జిత సేవలు కొనసాగిస్తామని ఆలయ ఈవో శివాజీ వివరించారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా అన్ని రకాల ప్రసాదాలు కూడా అందుబాటులో ఉంచుతున్నామని ఈవో చెప్పారు. ప్రతి ఆదివారం స్వామివారికి చేసే అభిషేకంలో పాల్గొనేందుకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తామన్నారు.`ఈ విషయాన్ని భక్తులు గమనించాలని ఈఓకోరారు.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకి భారతరత్న ప్రకటించాలని డా.ఎన్టీఆర్ కళారాధన పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ఎల్ఎన్ స్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ అభిమానుల ఐక్యవేదిక ఏర్పాటు చేసి ప్రభుత్వానికి కోటి ఉత్తరాల ఉద్యమం చేపట్టామన్నారు. ఎన్టీఆర్ అభిమాని ప్రతీఒక్కరూ ఆయనకు భారత రత్నఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ కళారాధన పీఠం ద్వారా 25 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ, అభిమానులకు ఆయన సినిమాలు, కళారంగం యొక్క విశిష్టతను తెలియజేస్తూ వస్తున్నామని వివరించారు. అంతేకాకుండా విశాఖలో ఎన్టీఆర్ శ్రీక్రిష్ణుడి విగ్రహం కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తెలుగువారు వారు మాత్రమే కాకుండా ప్రపంచంలోని అందరు కళాకారులు అభిమానించే ఏకైకన నటుడు స్వర్గీయ ఎన్టీఆర్ మాత్రమేనన్నారు. అలాంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వం నేటికి భారత రత్న ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఈ విషయాన్ని కేంద్రానికి గుర్తు చేస్తూ పోస్టుకార్డు ఉద్యమంలో అభిమానులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాసరావు, ఆంధ్రప్రదేశ్ సినీగోయర్స్ అధ్యక్షుడు శంకర్రావు, రామక్రిష్ణ, గంగరాజు, శాంభశివరావు తదితరులు పాల్గొన్నారు.
ద్రోణంరాజు శ్రీనివాస్ లేని లోటు వైఎస్సార్సీపీకి ఇక తీరదని రాష్ట్రపర్యాటక శాఖ మంత్రిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ద్రోణంరాజు శ్రీనివాస్ పార్ధీవ శరీరానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విశాఖ అధ్యక్షలు వంశీక్రిష్ణశ్రీనివాస్, ఎమ్మెల్యే అమర్నాద్, అదీప్ రాజ్, నార్త్ ఇన్చార్జి కెకెరాజు ఇతర పార్టీ నాయకులతో కలిసి మౌనం పాటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖలో తన తండ్రి తరువాత నిత్యం ప్రజల్లో వుంటూ సేవలు అందించిన శ్రీనివాస్ లేరనే విషయం చాలా బాధను కలిగిస్తోందన్నారు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడే ఒకే ఒక్క వ్యక్తి ద్రోణంరాజు శ్రీనివాస్ మాత్రమేనన్నారు. అలాంటి వ్యక్తి ఇపుడు మన మధ్య లేకపోవడం చాలా విచారంగా వుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మొల్లి అప్పారావు, పీతల గోవింద్,పల్లా దుర్గారావు, శీలం లక్ష్మణ్ , ట్రేడ్ యూనియన్ బాబా , పైడి శ్రీనివాస్, అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
విశాఖ మాజీ ఎమ్మెల్యే, వి.ఎం.అర్.డి.ఎ పూర్వపు చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి ఉత్తరాంధ్ర కు తీరని లోటు గా జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అభివర్ణించారు. సోమవారం ద్రోణంరాజు పార్థివ దేహేన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, సింహాచలం ప్రాంతం కు చెందిన ద్రోణంరాజు శ్రీనివాస్ తండ్రి బాటలో ముందుకు సాగేవారన్నారు. రాజకీయాలకు,పార్టీలకు అతీతంగా అందరితో కలిసి మెలిసి ప్రజలకు సేవచేసే ద్రోణంరాజు మృతి ఎంతో మందిని కలచి వేసిందన్నారు. విశాఖ ప్రజా సమస్యలు పరిస్కారమే లక్ష్యం గా ముందుకు సాగే మహోన్నత వ్యక్తి ని కోల్పోవడం చాలా విచారకరమన్నారు. ప్రధానంగా జర్నలిస్ట్ లు అంటే ఆయన కు ఎంతో మక్కువ అన్నారు. ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా ముందు ద్రోణంరాజు వచ్చి ఆ కార్యక్రమం నడిపించే వారని గుర్తుచేశారు. ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేసారు.భవిష్యత్తు లో వారి కుటుంబం కి ఆ సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఉండాలని తాను కోరుకుంటున్నట్టు గంట్ల చెప్పారు.
తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో మృతుని కుటుంబానికి రూ.10లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షలు ఆర్ధిక సహాయం ప్రభుత్వం తరపున అందచేస్తామని ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆళ్ల మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో తక్షణమే మృతి చెందిన కుటుంబాన్ని, గాయపడిన కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారని చెప్పారు. అంతేకాకుండా ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించిమాని, APHMIDC ఎండీ చంద్ర శేఖర్ రెడ్డిని త్వరలోనే నివేదిక ఇస్తారని అన్నారు. అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావ్రుతం కాకుండా చూడాలని స్విమ్స్ డైరెక్టర్ ను ఆదేశించిన ఆళ్ల.. ఈ ప్రమాదంలో ఉద్యోగిని మ్రుతిచెందడం పట్ల తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఆసుపత్రి భవనాలు పరిస్తితి ఎలావుందో అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయించి, తాజానివిదికు ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు.
ఉత్తరాంధ్రాలో ప్రభుత్వ అధికారులను ఆత్మీయులుగా స్వయంగా పేరుపెట్టి పిలిచే ఏకైక నాయకుడు ద్రోణంరాజుశ్రీనివాస్ మాత్రమేనని విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రభుత్వ ఉద్యోగల ఫెడరేషన్ కన్వీనర్ పోలాకి శ్రీనివాసరావు అన్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్ అకాల మరణం తమను ఎంతగానో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనే మంచి నాయకులు ఇక లేరనే విషయం విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని అన్ని రాజకీయపార్టీలు, ప్రభుత్వ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. ఆయనతో తనకు చాలా సన్నిహిత సంబంధం వందని ఈ సందర్భంగా పోలాకి గుర్తు చేసుకున్నారు. తండ్రిబాటలోనే ప్రజలకోసం సేవచేసిన మహా మనిషి అని కొనియాడారు. ఆయన కుటుంబానికి తనతోపాటు విద్యుత్ ఉద్యోగుల తరపున కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని పోలాకి శ్రీనివారసరావు తెలియజేశారు.
చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద అర్హులైన నిర్వాసితులకు పరిహారం చెల్లింపు కు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఆదివారం ధర్మవరం తహశీల్దార్ కార్యాలయంలోని ఎపి.ఎన్.జిఓ భవనంలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ క్రింద ముంపునకు గురయ్యే గ్రామాల పరిహారంనకు సంబంధించి అధికారులు చేపట్టిన ప్రక్రియను మరియు అందుకు సంబంధించిన రికార్డులను ధర్మవరం ఆర్ డి ఓ మధుసూదన్ తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సీబీఆర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించడం కోసం రూ. 240.53 కోట్లను మంజూరు చేసిందన్నారు. తాడిమర్రి ,ముదిగుబ్బ మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులతో పరిహారం చెల్లించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. .చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న తాడిమర్రి మండలం సిసి రేవు, మర్రిమాకులపల్లి గ్రామాలకు, ముదిగుబ్బ మండలం పిసీరేవు, రాఘవపల్లి గ్రామాలకు చెందిన 1729 మంది నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేస్తున్నామన్నారు.
నిర్వాసితులకు వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చెల్లించడం జరుగుతుందన్నారు. పరిహారం చెల్లింపులో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా అర్హులైన లబ్ధిదారులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లులను అప్లోడ్ చేస్తున్నామని, రెండు రోజుల్లో నిర్వాసితులకు పరిహారం పంపిణీ ప్రక్రియని పూర్తి చేస్తామన్నారు. పరిహారం అందజేసిన వెంటనే ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో 10 టీఎంసీల నీరు నింపే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.ప్రస్తుతం ధర్మవరం ఆర్డీవో మధుసూదన్ నేతృత్వంలోని అధికారుల బృందం రాత్రింబవళ్ళు టీం వర్క్ తో పనిచేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం జిల్లాలో పాల్గొనాల్సి వున్న కార్యక్రమాలన్నీ రద్దయినట్లు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. భోగాపురం, గజపతినగరం, కొత్తవలస మండలాల్లో మంత్రి పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నీ రద్దయినట్లు పేర్కొన్నారు. వి.ఎం.ఆర్.డి.ఏ. ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మృతికి సంతాప సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో భీమసింగి చక్కెర కర్మాగారాన్ని సందర్శించాల్సి వున్న మంత్రుల బృందం పర్యటన కూడా వాయిదా పడిందని వెల్లడించారు. అయితే మధ్యాహ్నం 3-00 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో గ్రామాల్లో నిర్మాణంలో వున్న సచివాలయ భవనాలు, రైతుభరోసా కేంద్రం, ఆరోగ్యకేంద్రాల భవన నిర్మాణాల ప్రగతిపై సమీక్షించేందుకు కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో మంత్రి ఒక సమీక్ష సమావేశంలో పాల్గొంటారని వెల్లడించారు. జిల్లాకు చెందిన శాసనసభ్యులు, ఆయా ఇంజనీరింగ్ శాఖల ఎస్.ఇ., ఇ.ఇ., డి.ఇ., ఏ.ఇ.లంతా ఈ సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు.
అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్ రేటు తగ్గుతోందని, 97 శాతంపైగా రికవరీ రేటు నమోదు అయిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ధర్మవరం ఆర్డీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం రాష్ట్రంలోనే అన్ని జిల్లాల కంటే అతి తక్కువగా 1362 పాజిటివ్ కేసులు మాత్రమే యాక్టివ్ లో ఉన్నాయని, అన్ని జిల్లాల కంటే జిల్లాలో యాక్టివ్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ఓవరాల్ గా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నా రికవర్ రేటు అత్యధికంగా ఉండడంతో యాక్టివ్ కేసులు అతి తక్కువగా ఉన్న జిల్లా మనదన్నారు. జిల్లాలో 97 శాతంపైగా రికవరీ రేటు నమోదు కాగా, కేవలం 2 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఎంతమందికి టెస్టులు చేస్తే ఎంతమందికి కరోనా పాజిటివ్ వచ్చింది అనే దానిపై కూడా పరిశీలన చేయడం జరిగిందన్నారు. అన్ని పట్టణ ప్రాంతాలలో కలిపి ఇప్పటివరకు దాదాపుగా 16 శాతం పాజిటివిటి వచ్చిందని, గ్రామీణ ప్రాంతాలలో 9 శాతం పాజిటివిటి వచ్చిందని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రెండూ కలుపుకుంటే 12 శాతం పాజిటివిటి జిల్లాలో నమోదైందన్నారు. ఇది మార్చి నుంచి ఇప్పటి వరకూ ఓవరాల్ గా నమోదయిన పాజిటివిటి శాతం అని, ఆగస్టు నెలలో 19 శాతానికి పైగా పాజిటివ్ నమోదుకాగా, గడిచిన ఒక నెల పాజిటివిటి తీసుకుంటే సెప్టెంబర్ నెలలో 10 లోపలే పాజిటివిటి వచ్చిందన్నారు. అక్టోబర్ మొదటి నుంచి తీసుకుంటే 5, 6 శాతం లోపలే పాజిటివిటి ఉందన్నారు. జిల్లాలో కరోనా కేసులు చాలామటుకు తగ్గుతున్నాయన్నారు. రాష్ట్రం యావరేజి కన్నా జిల్లాలో మరణాల శాతం కూడా 1 శాతంకన్నా తక్కువగా ఉందన్నారు. అలాగే ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం జిల్లాలో పాఠశాలలను ప్రారంభం చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
యూపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 4 సెంటర్లను ఏర్పాటు చేయగా, అందులో అనంతపురం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన వెన్యూ కేంద్రాలకు అత్యధికంగా అభ్యర్థులు హాజరైనట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. యూపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులు కోసం కడప, కర్నూలు జిల్లాల నుంచి అనంతపురం పరీక్ష కేంద్రానికి ప్రత్యేక ట్రైన్ లు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతోనే అభ్యర్థుల హాజరు శాతం పెరిగిందని తెలిపారు. ఆదివారం యూపీఎస్సీ పరీక్షలు నిర్వహించగా, రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా అనంతపురం జిల్లాకు 3311 మంది అభ్యర్థులను కేటాయించగా, ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు అనంతపురం జిల్లా కేంద్రంలోని 8 వెన్యూ కేంద్రాలలో జరిగిన యూపీఎస్సీ పరీక్షలకు 1807 మంది అభ్యర్థులు హాజరు కాగా, మరో 1504 మంది అభ్యర్థులు పరీక్ష కు గైర్హాజరయ్యారని, 54.57 శాతం హాజరు నమోదైందన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1795 మంది అభ్యర్థులు హాజరు కాగా, మరో 1516 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని, 54.21 శాతం హాజరు నమోదైందన్నారు. రాష్ట్రంలోని తిరుపతి కేంద్రంలోని 14 వెన్యూ కేంద్రాలలో జరిగిన యూపీఎస్సీ పరీక్షలకు 6790 మంది అభ్యర్థులను కేటాయించగా, ఉదయం పరీక్ష కు 3234 మంది అభ్యర్థులు హాజరు కాగా, 47.63 శాతం హాజరు నమోదైందన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 3207 మంది అభ్యర్థులు హాజరు కాగా, 47.23 శాతం హాజరు నమోదైందన్నారు.
రాష్ట్రంలోని విజయవాడ కేంద్రంలోని 27 వెన్యూ కేంద్రాలలో జరిగిన యూపీఎస్సీ పరీక్షలకు 12, 533 మంది అభ్యర్థులను కేటాయించగా, ఉదయం పరీక్షకు 5,421 మంది అభ్యర్థులు హాజరు కాగా, 7,091 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని, 43.33 శాతం హాజరు నమోదైందన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 5,376 మంది అభ్యర్థులు హాజరు కాగా, 7,136 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని, 42.97 శాతం హాజరు నమోదైందన్నారు. అలాగే విశాఖపట్నం కేంద్రంలోని వెన్యూ కేంద్రాలలో జరిగిన యూపీఎస్సీ పరీక్షలకు 10, 779 మంది అభ్యర్థులను కేటాయించగా, ఉదయం పరీక్షకు 4,863 మంది అభ్యర్థులు హాజరు కాగా, 5,916 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని, 45.12 శాతం హాజరు నమోదైందన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 4,811 మంది అభ్యర్థులు హాజరు కాగా, 5,968 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని, 44.63 శాతం హాజరు నమోదైందన్నారు.
దేశవ్యాప్తంగా నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షలకు సంబంధించి అనంతపురం జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలకు హాజరయ్యేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అభ్యర్థులకు ప్రత్యేక ట్రైన్ లు, బస్సులను ఏర్పాటు చేశామని, అందువల్ల అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకోగలిగారని జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లా కేంద్రంలో పరీక్షలకు అభ్యర్థులు అత్యధిక శాతం హాజరయ్యారన్నారు. ప్రశాంత వాతావరణంలో కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించామని, కోవిడ్ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో యూపీఎస్సీ కమిషన్ నియమ నిబంధనలు పాటిస్తూ అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని వసతులను కల్పించి ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించామని జిల్లా కలెక్టర్ తెలిపారు.