శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో గల 14 లేఅవుట్లలో చేపడుతున్న గృహ నిర్మాణాలన్నీ శత శాతం పూర్తికావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పట్టణ గృహ నిర్మాణాలపై ప్రత్యేక అధికారులు, నగరపాలక సంస్థ కమీషనర్, ఇంజినీరింగ్ అధికారులు, వార్డు సంక్షేమ కార్యదర్శులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రౌండ్ లెవెల్లో ఏర్పడిన సమస్యలు పరిష్కరించాలని, వచ్చే మాసానికి శతశాతం లక్ష్యాలు సాధించాలని అన్నారు. వారంలోగా లబ్ధిదారుల జాబితా కార్యదర్శులకు అందజేయాలని, మ్యాపింగ్ జరగని 4వేల గృహాలు తక్షణమే ప్రారంభంకావాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని లేఅవుట్లలో పనులు ప్రారంభం కావాలని, వారంలో పురోగతి సాధించాలని సూచించారు. 14 లేఅవుట్లలో గల ఒక లేఅవుట్ లో కార్పొరేషన్ నిధులతో మోడల్ కాలనీని రూపొందించాలని కలెక్టర్ సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలో 14లేఅవుట్లలో 10,867 గృహాలు మంజూరు చేయడం జరిగిందని, అందులో 8,865 గృహాలు రిజిష్టర్ అయినప్పటికి ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడం పై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. మిగిలిన 2002 గృహ లబ్ధిదారులు వారి పేరున రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, ఒకవేళ లబ్దిదారులు ముందుకు రాకపోతే వారిని రద్దు చేసి కొత్త వారికి అవకాశం కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వార్డు సచివాలయాల్లో అతి పెద్ద వ్యవస్థ ఉందని, సుమారు వేయి మంది సిబ్బంది పనిచేస్తున్నారని, వారిని ఉపయోగించుకొని గృహనిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. 14 లేఅవుట్లకు చెందిన లబ్ధిదారులు జాబితాలను వార్డు సంక్షేమ కార్యదర్శులకు అందజేయాలని కమీషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. కార్యదర్శులు వారి పరిధిలో గల లబ్ధిదారుల జాబితాల ఆధారంగా లబ్ధిదారులను చైతన్యపరచి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ముందుకు వచ్చేలా చేయాలన్నారు.
అలాగే రిజిస్ట్రేషన్ చేసుకొని పనులు ప్రారంభించని లబ్ధిదారులు తక్షణమే గృహానిర్మాణాలు ప్రారంభించుకునేలా చైతన్యపరచాలని ఆదేశించారు. గృహానిర్మాణాలకు అవసరమైన సిమెంట్,ఇసుక,ఐరన్,నీటి సరఫరా తదితర సమస్యలు ఉంటే వాటిని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు సమాచారాన్ని అందజేయాలని అన్నారు. నిర్మాణాల బిల్లులు ఎప్పటికపుడు మంజూరుచేయడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఈ కార్యక్రమానికి ఇస్తుందని, కావున దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి లే అవుట్లలో తాగునీరు, విద్యుత్, రహదారులు,కాలువలు, ప్లాంటేషన్ తదితర కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని సూచించారు. గృహ నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడుతుందని, ఇందుకు నిధుల కొరత లేదని, అవసరమైతే జిల్లా నిధుల నుండి మంజూరుచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. 14 లేఅవుట్లలో ఒక మోడల్ కాలనీని నిర్మించి, లబ్ధిదారులకు చూపించడం ద్వారా వారు మరింత ముందుకు వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తారని కలెక్టర్ సూచించారు. లేఅవుట్ పూర్తయితే అక్కడ ఉండేవి గృహాలు కావని, ఊరుగా మారబోతుందనే విషయాన్ని లబ్ధిదారులు గుర్తించేలా అవగాహన కల్పించాలని చెప్పారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని, బాగా పనిచేసిన అధికారులను అభినందిస్తూనే, పనిచేయని అధికారులపై వేటు తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. విధులు నిర్వహణలో బాధ్యతా రాహిత్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. తొలుత లేఅవుట్ల వారీగా చేపట్టిన పనులపై ఆరాతీసిన కలెక్టర్ పురోగతిపై అసహనం వ్యక్తం చేశారు.
ఇళ్లు కట్టడానికి ముందుకు రాని లబ్ధిదారుల నుండి తగు కారణాలను పూర్తి వివరాలతో వ్రాతపూర్వకంగా తీసుకోవాలన్నారు. వాటి స్థానంలో కొత్త లబ్ధిదారులకు మంజూరు చేయడానికి అవకాశం కల్పించాలన్నారు. గృహనిర్మాణలకు సంబందించి చాలా వెనుకబడి వున్నారని, ప్రభుత్వం నవరత్నాలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి పేదవానికి ఇళ్లు కార్యక్రమంపై ఇంత నిర్లక్ష్యంగా పనులు చేయడం సరికాదన్నారు. డి-లింక్ అయి మూడు మాసాలైనా ఇంకా రిజిస్ట్రేషన్ కాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 4బి చేసి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదని, సెక్రటరీ పరిధిలో ఉన్న లబ్ధిదారుల జాబితా ఇచ్చి పనులు చేపట్టేలా చూడాలన్నారు. తగిన కారణం లేకుండా 372 గృహాలు రిజిస్ట్రేషన్ కాకపోవడంపై వార్డుల వారీగా సమీక్షించిన ఆయన వార్డుల వారీగా జాబితాలు తయారు చేసి వార్డు సెక్రటరీ లకు అందించి శత శాతం రిజిస్ట్రేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక అధికారులు చేసిన సమీక్షలు అర్థరహితమని, ఆన్ని పనులు గ్రూప్ లో సెండ్ చేస్తే జరగబోవని, సమావేశాలు నిర్వహిస్తూనే పనుల పురోగతిని ఎప్పటికపుడు సమీక్షిస్తూ ఉండాలన్నారు. లబ్ధిదారులు సమావేశానికి హాజరయ్యేలా చూదాలని, నిర్మాణాలకు సంబంధించిన పనులను పరిశీలించి అక్కడి అవసరాలు సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు సిబ్బంది ఉండి మంజూరైన 10,867 గృహాలకు సంబంధించి 820 గృహ నిర్మాణాలు వివిధ స్థాయిలో ఉండడం పై ఆరాతీసిన కలెక్టర్ నివేదికలు అన్ని వార్డు సెక్రటరీ ల పరిధిలో తయారు చేసుకోవాలని ఆదేశించారు. గృహ నిర్మాణానికి 1955 మంది లబ్ధిదారులకు మెప్మా ద్వారా రుణం మంజూరు అయినప్పటికీ 820 మంది మాత్రమే గృహ నిర్మాణాలు చేపట్టారని, మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని మెప్మా పథక సంచాలకులను కలెక్టర్ ఆదేశించారు. వచ్చే మాసంలో మరలా గృహనిర్మాణాలపై సమీక్షిస్తామని, రోజు వారీ సాధించిన ప్రగతితో సిద్ధంగా ఉండాలని, లక్ష్యాలు సాధించని అధికారులపై వేటు తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. మ్యాపింగ్ జరగని 4వేల గృహాలకు తక్షణమే మ్యాపింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇది శాఖల వారీ కార్యక్రమం కాదని, ప్రభుత్వ కార్యక్రమమని, అందువలన అధికారులందరూ సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలని కోరారు. అనుకున్న సమయానికి అప్పగించిన లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో రెవిన్యూ డివిజనల్ అధికారి బొడ్డేపల్లి శాంతి,నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేశు, ప్రత్యేక అధికారులు జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవి కుమార్, వికలాంగుల సంక్షేమ శాఖాధికారి ఎమ్.త్రినాథరావు, గృహనిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఎం.గణపతి రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, తహశీల్దార్ కె.వెంకటరావు, కార్య నిర్వాహక ఇంజినీర్ పి.సుగుణాకరరావు, వార్డు సచివాలయాల సంక్షేమ కార్యదర్శులు,ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.