1 ENS Live Breaking News

దేశంలోనే ఉత్త‌మంగా ఎస్వీ పాఠ‌శాల

శ్రీ‌వారి పాదాల చెంత గ‌ల ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌ను సింఘానియా ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్టు స‌హ‌కారంతో రాష్ట్రంలోనే గాక దేశంలోనే అత్యున్న‌త‌మైన విద్యాసంస్థ‌ల్లో ఒక‌టిగా తీర్చిదిద్దుతామ‌ని, గురుపూజ దినోత్స‌వం రోజు ఈ కార్య‌క్ర‌మానికి నాంది ప‌లక‌డం సంతోష‌క‌ర‌మ‌ని టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల ప్రాంగ‌ణంలో బుధ‌వారం ఉపాధ్యాయులు, విద్యార్థుల త‌ల్లిదండ్రుల స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమ‌లలోని ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌లో చ‌క్క‌టి మౌలిక స‌దుపాయాలు ఉన్నాయ‌ని, ఇక్క‌డ ఉన్న‌త‌మైన ప్రమాణాల‌తో కూడిన విద్య అందుతోంద‌ని, విద్యార్థులు మంచి ప్ర‌తిభ క‌న‌బరుస్తున్నార‌ని చెప్పారు. తిరుమ‌ల‌కు విచ్చేసే ప్ర‌ముఖులు శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి ముందుగానీ, త‌రువాత గానీ ఈ పాఠ‌శాల‌ను సంద‌ర్శించాల‌ని కోరారు. రేమాండ్స్ గ్రూపు ఆధ్వ‌ర్యంలో పేద విద్యార్థుల కోసం ప‌లు ప్రాంతాల్లో పాఠ‌శాల‌లు నిర్వ‌హిస్తున్నార‌ని, వీటిలో దేశంలోనే అత్యుత్త‌మ నాణ్య‌త ప్ర‌మాణాలను పాటిస్తున్నార‌ని చెప్పారు. ఇందుకోసం సింఘానియా పాఠ‌శాల ప్రిన్సిపాల్ శ్రీ‌మ‌తి రేవ‌తి శ్రీ‌నివాస‌న్ ప‌లు రాష్ట్ర‌ప‌తి అవార్డులు సైతం అందుకున్నార‌ని వెల్ల‌డించారు. తిరుమ‌ల‌లోని ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌ను అక‌డ‌మిక్స్ ప‌రంగా అభివృద్ధి చేయాల‌ని శ్రీ గౌత‌మ్ సింఘానియాను కోర‌గా స‌మ్మ‌తించార‌ని తెలిపారు. సింఘానియా ట్ర‌స్టు పాఠ‌శాల‌ ఉపాధ్యాయుల‌కు నైపుణ్య శిక్ష‌ణ అందిస్తుంద‌ని, విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌తో త‌ర‌చూ స‌మావేశాలు నిర్వ‌హించి విద్యార్థుల ప్ర‌గ‌తిని చ‌ర్చిస్తార‌ని చెప్పారు. పాఠ‌శాల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులను టిటిడి క‌ల్పిస్తుంద‌న్నారు. భ‌గ‌వంతుడు అంద‌రినీ ఒకేవిధంగా సృష్టించార‌ని, ఎవ‌రికైతే మంచి శిక్ష‌ణ అందుతుందో వారు రాణించ‌గ‌లుగుతార‌ని చెప్పారు.

            రేమండ్స్ గ్రూపు సిఎండి  గౌత‌మ్ సింఘానియా మాట్లాడుతూ ముంబ‌యిలో శ్రీ‌వారి ఆల‌యం నిర్మించే అపూర్వ‌మైన అవ‌కాశం త‌మకు ద‌క్కింద‌ని, ఈ అవ‌కాశం ఇచ్చిన టిటిడి బోర్డుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. 47 సంవ‌త్స‌రాలుగా తాను తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌స్తున్నాన‌ని, తిరుమ‌ల యాత్ర‌ త‌న జీవితంలో ఒక భాగంగా మారింద‌ని చెప్పారు. 52 ఏళ్ల క్రితం అప్ప‌టి రేమండ్ గ్రూప్ ఛైర్మ‌న్ స‌తీమ‌ణి  సులోచ‌నాదేవి సింఘానియా కెన‌డాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందార‌ని, ఆ స‌మ‌యంలో ప్ర‌మాద ఇన్సూరెన్స్ మొత్తం ఒక ల‌క్ష రూపాయ‌లు అందింద‌ని చెప్పారు. అయితే వారి కుటుంబ స‌భ్యులు ఈ మొత్తాన్ని ఏదైనా ఒక సామాజిక హిత కార్య‌క్ర‌మానికి ఖ‌ర్చు పెట్టాల‌ని కోరార‌న్నారు. ఈ విధంగా ఒక ల‌క్ష రూపాయ‌ల మూల‌ధ‌నంతో సులోచ‌నా దేవి సింఘానియా పాఠ‌శాల‌ స్థాప‌న ప్రారంభ‌మైంద‌న్నారు. సులోచ‌నా దేవి సింఘానియా ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో సుమారు 20 వేల మంది విద్యార్థులు చ‌దువుతున్నార‌ని, ప్రిన్సిపాల్  రేవ‌తి శ్రీ‌నివాస‌న్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ పాఠ‌శాల ప్ర‌గ‌తి ప‌థంలో న‌డుస్తోంద‌ని చెప్పారు.

              త‌మ గ్రూపున‌కు సంబంధించిన ఫ్యాక్ట‌రీలు ఉన్న ప్రాంతంలో కార్మికుల పిల్ల‌ల కోసం మొద‌ట‌గా ఈ పాఠ‌శాల‌ను ప్రారంభించిన‌ట్టు తెలిపారు. ఇక్క‌డ మంచి విద్య‌ను అందించి కార్మికుల పిల్ల‌లను ఉన్న‌తస్థానాల‌కు చేర్చుతున్న‌ట్టు చెప్పారు. ఏడాదికి ల‌క్ష మంది పిల్ల‌ల‌కు విద్య‌ను అందించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని, ఇందులో భాగంగా నెల రోజుల వ్య‌వ‌ధిలో ఈ పాఠ‌శాల‌తో క‌లిపి 5 పాఠ‌శాల‌ల్లోని సుమారు 20 వేల మందికి విద్య‌ను అందించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని అన్నారు. విద్య‌ద్వారా మంచి పౌరుల‌ను త‌యారుచేసి జాతి నిర్మాణంలో భాగ‌స్వాముల‌ను చేస్తామ‌న్నారు. గ‌డిచిన ఐదేళ్ల‌లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో కూడిన ఉత్త‌మ పాఠ‌శాల‌లుగా సింఘానియా పాఠ‌శాల‌ల‌కు గుర్తింపు ద‌క్కింద‌న్నారు. మొద‌ట‌గా ఎస్వీ ఉన్న‌త‌ పాఠ‌శాల‌ను విద్యప‌రంగా అభివృద్ధి చేస్తామ‌ని, ఆ త‌రువాత టిటిడిలోని ఇత‌ర పాఠ‌శాల‌ల‌ను కూడా అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు.

             శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు మాట్లాడుతూ తాను  ఈ పాఠ‌శాల విద్యార్థినేన‌ని చెప్పారు. విన‌యంతో కూడిన విద్య అవ‌స‌ర‌మ‌ని, స్వామివారి ఆశీస్సుల‌తో విద్యార్థులంద‌రూ వృద్ధి చెందాల‌ని కోరారు. ముందుగా ఈఓ  ఎవి.ధ‌ర్మారెడ్డి,  గౌతం సింఘానియా క‌లిసి పాఠ‌శాల‌లో పూజ‌లు నిర్వ‌హించి కంప్యూట‌ర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంత‌రం పాఠ‌శాల ప్రాంగ‌ణంలో సంపంగి మొక్క‌లు నాటారు. ఈ కార్య‌క్రమంలో టిటిడి జెఈవో(ఆరోగ్యం, విద్య‌)  స‌దా భార్గ‌వి, ఎస్ఇ-2  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి,  ద్యాశాఖాధికారి  గోవింద‌రాజ‌న్‌, డెప్యూటీ ఈవో  రామారావు, సింఘానియా ట్ర‌స్టు పాఠ‌శాల ప్రిన్సిపాల్  రేవ‌తి శ్రీ‌నివాస‌న్‌, విజివో  బాలిరెడ్డి, ప్ర‌ధానోపాధ్యాయులు  కృష్ణ‌మూర్తి, సింఘానియా ట్ర‌స్టు ప్ర‌తినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tirumala

2022-07-13 11:27:18

లేఅవుట్లలోని గృహాలు శతశాతం పూర్తికావాలి

శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో గల 14 లేఅవుట్లలో  చేపడుతున్న గృహ నిర్మాణాలన్నీ శత శాతం పూర్తికావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పట్టణ గృహ నిర్మాణాలపై ప్రత్యేక అధికారులు, నగరపాలక సంస్థ కమీషనర్, ఇంజినీరింగ్ అధికారులు, వార్డు సంక్షేమ కార్యదర్శులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రౌండ్ లెవెల్లో ఏర్పడిన సమస్యలు పరిష్కరించాలని, వచ్చే మాసానికి శతశాతం లక్ష్యాలు సాధించాలని అన్నారు. వారంలోగా లబ్ధిదారుల జాబితా కార్యదర్శులకు అందజేయాలని, మ్యాపింగ్ జరగని 4వేల గృహాలు తక్షణమే ప్రారంభంకావాలని కలెక్టర్ ఆదేశించారు.    అన్ని లేఅవుట్లలో పనులు ప్రారంభం కావాలని, వారంలో పురోగతి సాధించాలని సూచించారు. 14 లేఅవుట్లలో గల ఒక  లేఅవుట్ లో కార్పొరేషన్ నిధులతో  మోడల్ కాలనీని రూపొందించాలని కలెక్టర్ సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలో 14లేఅవుట్లలో 10,867 గృహాలు మంజూరు చేయడం జరిగిందని, అందులో 8,865 గృహాలు రిజిష్టర్ అయినప్పటికి ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడం పై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. మిగిలిన 2002 గృహ లబ్ధిదారులు వారి పేరున రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, ఒకవేళ లబ్దిదారులు ముందుకు రాకపోతే వారిని రద్దు చేసి కొత్త వారికి అవకాశం కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వార్డు సచివాలయాల్లో అతి పెద్ద వ్యవస్థ ఉందని, సుమారు వేయి మంది సిబ్బంది పనిచేస్తున్నారని, వారిని ఉపయోగించుకొని గృహనిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. 14 లేఅవుట్లకు చెందిన లబ్ధిదారులు జాబితాలను వార్డు సంక్షేమ కార్యదర్శులకు అందజేయాలని కమీషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. కార్యదర్శులు వారి పరిధిలో గల లబ్ధిదారుల జాబితాల ఆధారంగా లబ్ధిదారులను చైతన్యపరచి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ముందుకు వచ్చేలా చేయాలన్నారు. 

అలాగే రిజిస్ట్రేషన్ చేసుకొని పనులు ప్రారంభించని లబ్ధిదారులు తక్షణమే గృహానిర్మాణాలు ప్రారంభించుకునేలా చైతన్యపరచాలని ఆదేశించారు. గృహానిర్మాణాలకు అవసరమైన సిమెంట్,ఇసుక,ఐరన్,నీటి సరఫరా తదితర సమస్యలు ఉంటే వాటిని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు సమాచారాన్ని అందజేయాలని అన్నారు. నిర్మాణాల బిల్లులు ఎప్పటికపుడు మంజూరుచేయడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఈ కార్యక్రమానికి ఇస్తుందని, కావున దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి లే అవుట్లలో తాగునీరు, విద్యుత్, రహదారులు,కాలువలు, ప్లాంటేషన్ తదితర కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని సూచించారు. గృహ నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడుతుందని, ఇందుకు నిధుల కొరత లేదని, అవసరమైతే జిల్లా నిధుల నుండి మంజూరుచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. 14 లేఅవుట్లలో ఒక మోడల్ కాలనీని  నిర్మించి, లబ్ధిదారులకు చూపించడం ద్వారా వారు మరింత ముందుకు వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తారని కలెక్టర్ సూచించారు. లేఅవుట్ పూర్తయితే అక్కడ ఉండేవి గృహాలు కావని, ఊరుగా మారబోతుందనే విషయాన్ని లబ్ధిదారులు గుర్తించేలా అవగాహన కల్పించాలని చెప్పారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని, బాగా పనిచేసిన అధికారులను అభినందిస్తూనే, పనిచేయని అధికారులపై వేటు తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. విధులు నిర్వహణలో బాధ్యతా రాహిత్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. తొలుత లేఅవుట్ల వారీగా చేపట్టిన పనులపై ఆరాతీసిన కలెక్టర్ పురోగతిపై అసహనం వ్యక్తం చేశారు. 

ఇళ్లు కట్టడానికి ముందుకు రాని లబ్ధిదారుల నుండి తగు కారణాలను పూర్తి వివరాలతో వ్రాతపూర్వకంగా తీసుకోవాలన్నారు. వాటి స్థానంలో కొత్త లబ్ధిదారులకు మంజూరు చేయడానికి అవకాశం కల్పించాలన్నారు. గృహనిర్మాణలకు సంబందించి చాలా వెనుకబడి వున్నారని, ప్రభుత్వం నవరత్నాలలో  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి పేదవానికి ఇళ్లు కార్యక్రమంపై ఇంత నిర్లక్ష్యంగా పనులు చేయడం సరికాదన్నారు. డి-లింక్ అయి మూడు మాసాలైనా ఇంకా రిజిస్ట్రేషన్  కాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 4బి చేసి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదని, సెక్రటరీ పరిధిలో ఉన్న లబ్ధిదారుల జాబితా ఇచ్చి పనులు చేపట్టేలా చూడాలన్నారు. తగిన కారణం లేకుండా 372 గృహాలు రిజిస్ట్రేషన్ కాకపోవడంపై వార్డుల వారీగా సమీక్షించిన ఆయన వార్డుల వారీగా జాబితాలు తయారు చేసి వార్డు సెక్రటరీ లకు అందించి శత శాతం రిజిస్ట్రేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక అధికారులు చేసిన సమీక్షలు అర్థరహితమని, ఆన్ని పనులు గ్రూప్ లో సెండ్ చేస్తే జరగబోవని, సమావేశాలు నిర్వహిస్తూనే పనుల పురోగతిని ఎప్పటికపుడు సమీక్షిస్తూ ఉండాలన్నారు. లబ్ధిదారులు సమావేశానికి హాజరయ్యేలా చూదాలని, నిర్మాణాలకు సంబంధించిన పనులను పరిశీలించి అక్కడి అవసరాలు సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు సిబ్బంది ఉండి మంజూరైన 10,867 గృహాలకు సంబంధించి 820 గృహ నిర్మాణాలు వివిధ స్థాయిలో ఉండడం పై ఆరాతీసిన కలెక్టర్ నివేదికలు అన్ని వార్డు సెక్రటరీ ల పరిధిలో తయారు చేసుకోవాలని ఆదేశించారు. గృహ నిర్మాణానికి  1955 మంది లబ్ధిదారులకు మెప్మా ద్వారా రుణం మంజూరు అయినప్పటికీ 820 మంది మాత్రమే గృహ నిర్మాణాలు చేపట్టారని, మిగిలిన వారిపై చర్యలు తీసుకోవాలని మెప్మా పథక సంచాలకులను కలెక్టర్ ఆదేశించారు. వచ్చే మాసంలో మరలా గృహనిర్మాణాలపై సమీక్షిస్తామని, రోజు వారీ సాధించిన ప్రగతితో సిద్ధంగా ఉండాలని, లక్ష్యాలు సాధించని అధికారులపై వేటు తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. మ్యాపింగ్ జరగని 4వేల గృహాలకు తక్షణమే మ్యాపింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇది శాఖల వారీ కార్యక్రమం కాదని, ప్రభుత్వ కార్యక్రమమని, అందువలన అధికారులందరూ సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలని కోరారు. అనుకున్న సమయానికి అప్పగించిన లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు.     

ఈ సమావేశంలో రెవిన్యూ డివిజనల్ అధికారి బొడ్డేపల్లి శాంతి,నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేశు, ప్రత్యేక అధికారులు జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవి కుమార్, వికలాంగుల సంక్షేమ శాఖాధికారి ఎమ్.త్రినాథరావు, గృహనిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఎం.గణపతి రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, తహశీల్దార్ కె.వెంకటరావు, కార్య నిర్వాహక ఇంజినీర్ పి.సుగుణాకరరావు, వార్డు సచివాలయాల సంక్షేమ కార్యదర్శులు,ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-07-13 09:55:27

విజయనగరంలో 16న మోటార్ సైకిళ్లు వేలం

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వివిధ కేసుల్లో ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకున్న మూడు మోటార్ సైకిళ్ల‌ను ఈ నెల 16న‌ వేలం వేయ‌నున్న‌ట్లు,  స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, విజ‌య‌న‌గ‌రం-1 స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ ఒక ప్ర‌క‌ట‌లో తెలిపారు. స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూప‌రింటిండెంట్ డి.శైల‌జారాణి  ఆధ్వ‌ర్యంలో జ‌రిగే ఈ వేలం ప్ర‌క్రియ‌,  విజ‌య‌న‌గ‌రం, ఎస్ఇబి-1 స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌రుగుతుంద‌ని తెలిపారు. హీరో హెచ్ఎఫ్‌ డీల‌క్స్‌ (2017 మోడ‌ల్‌), హీరో గ్లామ‌ర్‌ (2018 మోడ‌ల్‌), హీరో హెచ్ఎఫ్‌ డీల‌క్స్‌ (2007 మోడ‌ల్‌) మోటార్ సైకిళ్ల వేల‌యం వేయ‌డం జ‌రుగుతుంద‌ని, ఆస‌క్తి ఉన్న‌వారు ఈ వేలంలో పాల్గొనాల‌ని కోరారు. 

Vizianagaram

2022-07-12 16:03:19

ప్రసాద వితరణ సేవలో ఎమ్మెల్సీ వంశీ

సింహగరి ప్రదక్షిణను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో 32 కిలోమీటర్ల నడిచి  దేవదేవుడు సింహాద్రి అప్పన్న  దర్శనం చేసుకుంటారని ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ అన్నారు. మంగళవారం గిరిప్రదక్షిణ సందర్భంగా విశాఖలోని హనుమంతువాక జంక్షన్ ,పందుల ఫామ్, పైనాపిల్ కాలనీ , దీన దయాళ్ పురం, స్కిల్ డెవలప్మెంట్, వెంకోజిపాలెం తదితర  ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, అప్పన్న స్వామి కొలువుతీరిన సింహగిరి చుట్టూ ప్రదర్శన చేస్తే  పుణ్యం సిద్ధిస్తుందన్నారు.  ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అప్పన్న స్వామి ఆశీస్సులతో మరింత ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండాలని స్వామిని కోరుకుంటున్నట్టు చెప్పారు. భక్తులకు అందించే ప్రసాదాన్ని పరిశీలించి, వారితో కాసేపు పనిచేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-07-12 15:47:30

సమ్మెవల్ల ఇబ్బందులు లేకుండా చర్యలు

పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమ్మె కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు చెప్పారు. మంగళవారం ఆయన రామకృష్ణారావుపేట, చిన్నమార్కెట్, మెయిన్‌రోడ్డు, కలెక్టరేట్, జీజీహెచ్, ఈట్‌స్ట్రీట్, రమణయ్యపేట ప్రాంతాల్లో పర్యటించి సమ్మె నేపద్యంలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతున్న తీరును పరిశీలించారు. అక్కడి శానిటరీ ఇన్స్‌పెక్టర్లకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఏడీసీ నాగనరసింహారావు మాట్లాడుతూ సమ్మె నేపద్యంలో చెత్త, కూరగాయల వ్యర్థాలతో చెత్త అధికంగా ఉత్పత్తి అవుతుందని, అక్కడి వ్యాపారులు సొంతంగా అదనపు కార్మికులను ఏర్పాటు చేసుకుని రోడ్డుపక్కన వేయకుండా సహకరించాలని కోరారు. మెయిన్‌రోడ్డులోని వ్యాపారులు కూడా ఇదే రీతిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. హూపర్‌టిప్పర్‌ వాహనాలు, కంపాక్టర్లు యధావిధిగా ఇళ్ళకు వస్తాయని, ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా వాహనాల వద్దకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. సమ్మెవల్ల చెత్త సేకరణకు అంతరాయం కలగకుండా ఇప్పటికే 80v మందిని అదనపు కార్మికులను ఏర్పాటు చేశామని, మరో 60 మందిని కూడా తీకుని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట కార్పొరేటర్రోకళ్ల సత్యనారాయణ, సానిటరీ ఇన్స్పెక్టర్లు జిలాని, రాజేంద్రప్రసాద్ ఉన్నారు.

Kakinada

2022-07-12 15:19:54

తాగునీటికి ఇబ్బంది రాకూడదు

గోదావరికి వరద, గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేని వానలు కారణం గా ప్రజలకు తాగు నీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక హెడ్ వాటర్ వర్క్స్,ధవళేశ్వరం లోని వాటర్ వర్క్స్ పనులను ఆయన పరిశీలించారు. రెగ్యులర్ గా చేసే క్లోరినేషన్ ప్రక్రియ,శుద్ధి చేస్తున్న ప్రక్రియ,  త్రాగునీరు సరఫరా చేసే దశలను క్షుణ్ణం గా పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు మంచి నీటి కొరత రాకూడదని అన్నారు. వాటర్ ట్యాంక్ ల స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. సిజనల్ వ్యాధుల వ్యాప్తి కి  త్రాగునీరు ఒక ప్రధాన కారణం అని, ఆ విషయం తెలుసుకునే అత్యంత నీటి సరఫరా విషయం లో జాగ్రత్తలు తీసుకోవసిందిగా ఆదేశించారు. కమిషనర్ వెంట ఎస్.ఈ. పాండు రంగారావు, ఈ ఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2022-07-12 14:38:33

13,14 తేదీల్లో నాక్ కమిటీ పర్యటన

తిరుప‌తి ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో జూలై 13,14 వ తేదీలలో నాక్ కమిటీ పర్యటిస్తుందని  టీటీడీ జెఈవో స‌దా భార్గ‌వి తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల‌లో జ‌రుగుతున్న ఏర్పాట్లను జెఈవో మంగళవారం అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. కళాశాల లోని  అన్ని ల్యాబ్ లు  తరగతి గదులు మైదానం పరిశీలించారు . న్యాక్ కమిటీకి వివరించే అంశాల గురించి అధ్యాపకులు ,విద్యార్థులతో  చర్చించి వారికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు . కళాశాల కు సంబంధించి రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ చూశారు. ఈ సంద‌ర్బంగా జెఈవో మాట్లాడుతూ, క‌ళాశాల‌లో జ‌రుగుతున్న మౌళిక వ‌స‌తుల‌ అభివృద్ధి ప‌నుల‌ను పూర్తి చేశారన్నారు. నాక్ కమిటీ సభ్యులకు ఆయా విభాగాల అధిపతులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారి విభాగానికి సంబంధించిన అంశాలు వివరిస్తారని తెలిపారు. అదేవిధంగా కళాశాలలోని హిస్టరీ విభాగం అద్భుతమైన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇప్ప‌టికే క‌ళాశాల‌కు ఏ గ్రేడ్ గుర్తింపు ఉంద‌ని, నాక్ ఏ ప్ల‌స్ గ్రేడ్ గుర్తింపున‌కు అధ్యాప‌కులు, విద్యార్థులు కృషి చేస్తున్నారని తెలిపారు. డిఈవో  గోవింద‌రాజ‌న్‌, క‌ళాశాల ప్రిన్సిపాల్ డా.నారాయ‌ణ‌మ్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirupati

2022-07-12 13:43:06

వాల్తేర్ రైల్వే లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవమే ఆజాదీకా ఆమ్రుత్ మహోత్సవ్ అని డీఆర్ఎం అనూప్ సత్పతి పేర్కొన్నారు. మంగళవారం విశాఖలోని వాల్తేరు రైల్వే డివిజన్ ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మహోత్సవాల్లో రైల్వే సాధించిన విజయాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. బైక్ ర్యాలీలో 75 మంది ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారని, మరో ఐదు బైక్‌లపై 10 మంది ఆర్‌పిఎఫ్ సిబ్బంది వివిధ రాష్ట్రాల మీదుగా ప్రయాణించి  ఆగస్టు 14న న్యూఢిల్లీకి చేరుకుంటారని తెలియజేశారు.  ప్రతీ భారతీయుడు స్వాతంత్ర్య సమరయోధులను అనునిత్యం మననం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా రైల్వే స్వచ్చతపైనా అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రైల్వే మ్యూజిక్ బ్యాండ్ తో దేశభక్తి గీతాలను ఆలపించారు.  ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం (ఆపరేషన్స్)  మనోజ్ కుమార్ సాహూ, సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్  సిహచ్.రఘువీర్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎకె త్రిపాఠి, సీనియర్ డివిజనల్ సిగ్నల్ & టెలికాం ఇంజనీర్ దీప్తాంశు శర్మ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-07-12 13:28:29

15న YSRవాహ‌న‌మిత్ర‌, జ‌గ‌నన్న తోడు

వైఎస్సార్ వాహ‌న‌మిత్ర‌, 26న జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కాల కింద ల‌బ్ధిదారుల‌కు ఆర్థిక స‌హాయాన్ని ఈ నెల 15న అందించే కార్య‌క్ర‌మాల‌ను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రారంభించ‌నున్న నేప‌థ్యంలో వీటికి సంబంధించి జిల్లాలో గ్రామ‌, వార్డు స్థాయిలో స‌న్న‌ద్ధ‌త ప‌నుల‌ను పూర్తిచేయాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్ నుంచి క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ త‌దిత‌రుల‌తో క‌లిసి వ‌ర్చువ‌ల్ విధానంలో జిల్లాస్థాయి అధికారులు, ఆర్‌డీవోలు, ఎంపీడీవోలు, త‌హ‌సీల్దార్లు త‌దిత‌రుల‌తో ప్ర‌భుత్వ ప్రాధాన్య కార్య‌క్ర‌మాల్లో పురోగ‌తిపై స‌మీక్ష నిర్వ‌హించారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు, ప్ర‌భుత్వ ప్రాధాన్య భ‌వ‌నాల నిర్మాణం, జ‌గ‌న‌న్న స్వ‌చ్ఛ సంక‌ల్పం, సీజ‌న‌ల్ వ్యాధులు త‌దిత‌ర అంశాల‌పై అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప‌రిధిలో వాలంటీర్ల ఖాళీల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు భ‌ర్తీ చేయాల‌ని.. ఇందుకు ప్ర‌తి నెలా నోటిఫికేష‌న్ జారీచేసి, వారం రోజుల్లో ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌ని స్ప‌ష్టం చేశారు. సంక్షేమ కార్య‌ద‌ర్శి/అసిస్టెంట్‌, ఏఎన్ఎం, మ‌హిళా పోలీస్‌, ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్‌లు ప్ర‌తి నెలా క‌నీసం ఒక‌సారి త‌మ ప‌రిధిలోని పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించి, వివిధ అంశాల‌ను త‌నిఖీ చేసి ప్ర‌త్యేక యాప్‌లో పొందుప‌రిచేలా చూడాల‌ని సూచించారు. 

న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం కింద ఇళ్ల నిర్మాణాల‌ను వేగ‌వంతం చేసేందుకు ఎస్‌హెచ్‌జీ మ‌హిళ‌ల‌కు రూ. 35,000 అద‌న‌పు రుణాల మంజూరు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌న్నారు. 90 రోజుల్లో ఇంటిప‌ట్టా జారీకి అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని సూచించారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు; రైతు భ‌రోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల భ‌వ‌నాల నిర్మాణాల‌ను పూర్తిచేయాల‌ని.. వీటికి సంబంధించిన బిల్లుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌లోడ్ చేయాల‌న్నారు. సీజ‌న‌ల్ వ్యాధుల క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాల‌ను ప‌టిష్టంగా నిర్వ‌హించాల‌ని, ఫ్రైడే-డ్రై డే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని సూచించారు. 15 రోజ‌ల‌కోసారి గ్రామ‌, వార్డు స‌చివాల‌య స్థాయిలో ఫీవ‌ర్ స‌ర్వే జ‌రిగేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా అధికారుల‌ను ఆదేశించారు. స‌మావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీర‌మ‌ణి, సీపీవో పి.త్రినాథ్‌, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర‌నాయ‌క్‌, మెప్మా పీడీ బి.ప్రియంవ‌ద‌, డ్వామా పీడీ ఎ.వెంక‌ట‌లక్ష్మి, ఇన్‌ఛార్జ్ డీఎంహెచ్‌వో డా. ఆర్‌.ర‌మేశ్‌, డీఈవో డి.సుభ‌ద్ర త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-07-12 13:10:21

నిబద్దతతో పనిచేసి పేరుతీసుకురావాలి

కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ప్రజాసేవ చేసే మంచి అవకాశం దొరికిందని, చిత్తశుద్ధి, నీతి నిజాయితీతో ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో పనిచేసి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని కాకినాడ జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా పేర్కొన్నారు. జిల్లాలో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తూ మరణించిన ‌ ఉద్యోగులకు సంబంధించి వారి సంబంధీకులకు మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టరు కృతికా శుక్లా 18 మంది అభ్యర్థులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృత్తికా శుక్లా మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల్లో ఖాళీలు ప్రకారం రిజర్వేషన్, రోస్టర్ ను అనుసరించి అభ్యర్థులకు ఉద్యోగాలను కేటాయించడం జరిగిందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ శాఖ-6,  శిశు మహిళా సంక్షేమం-2, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్-2, రెవిన్యూ, ఏపీఎస్పీ బెటాలియన్,  పశుసంవర్ధక, పంచాయతీ, వ్యవసాయ, సెరీకల్చర్, కార్మిక, రిజిస్ట్రేషన్ తదితర శాఖలలో ఒకొక్క పొస్టు చొప్పున మొత్తం 18 మంది అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందని కలెక్టరు తెలిపారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ప్రజాసేవ చేసే మంచి అవకాశం దొరికిందన్నారు. విధుల్లో చిత్తశుద్ధి, నీతి నిజాయితీతో ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో విధులు నిర్వర్తించి కాకినాడ జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్ అభ్యర్థులకు తెలిపారు.
కాకినాడ కొత్త జిల్లాగా ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా ఇంత మందికి ఒకేసారి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు అందించడం సంతోషంగా ఉందని, దీని వెనక కలెక్టరేట్ లోని వివిధ సెక్షన్ల అధికారులు, సిబ్బంది ముఖ్యంగా జిల్లా రెవెన్యూ అధికారి, కలెక్టరేట్ పరిపాలన అధికారి కృషి ఉందని కలెక్టరు ఈ సందర్భంగా కలెక్టరేట్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీధర్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి జి.ఎస్.ఎస్ శ్రీనివాసు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2022-07-12 13:00:52

గురు పూర్ణిమ అత్యంత ఉన్నతమైనది

అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 15వ తేదీన పుష్పయాగం వైభవంగా జరుగనుంది. జూలై 14వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు అంకురార్పణం నిర్వ‌హించ‌నున్నారు.  జూలై 15వ తేదీ ఉదయం 8.30 నుండి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. అనంతరం ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె,  పసుపు, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేస్తారు.  మధ్యాహ్నం 2.50 నుండి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం కన్నులపండువగా జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు పెద్దశేష వాహ‌నంపై స్వామి అమ్మ‌వార్లు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను అనుగ్ర‌హంచ‌నున్నారు.

       ఇటీవల శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

Visakhapatnam

2022-07-12 12:57:12

ప్రాణ నష్టం జరగకుండా చూడాలి

రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న‌ వర్షాలు, వరదల కార‌ణంగా ఎక్క‌డా ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకోవాల‌ని  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వివిధ‌ జిల్లాల‌ కలెక్టర్లతో మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌పై స‌మీక్షించారు. ఈ సందర్భంగా గోదావరి ఉధృతి, వరద సహాయక చర్యలపై సీఎం జగన్‌ దిశనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇత‌ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా సీఎం జగన్ మోహ‌న‌రెడ్డి మాట్లాడుతూ.. ముంద‌స్తు వ‌ర్షాల కార‌ణంగా జులైలోనే గోదావరికి  వరదలు వచ్చాయన్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈ నెల‌లోనే 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని, అయితే క‌ర్ణాట‌క‌లో వ‌ర్షాలు కురుస్తుండ‌టం వ‌ల్ల‌ బుధవారం ఉదయానికి వరద పెరిగి, 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చ‌రించారు. దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు స‌ర్వ‌ సిద్ధంగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకూడదని స్ప‌ష్టం చేశారు. 24 గంట‌లూ కంట్రోలు రూమ్స్ నిర్వ‌హించి, ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవాల‌న్నారు. వి.ఆర్‌.పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్దంగా ఉన్నాయ‌ని చెప్పారు.

         అవసరమైనచోట సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. ఈ సహాయ శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలని, మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని స్ప‌ష్టం చేశారు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాల‌ని, ఒక వ్య‌క్తికైతే వెయ్యి రూపాయ‌లు అంద‌జేయాల‌ని ఆదేశించారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలని, అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. గ‌ర్భిణుల‌ను అవ‌స‌ర‌మైన ప‌క్షంలో ముందుగానే ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించాల‌ని సూచించారు.  తాగునీటి పథకాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం వచ్చిన నేపథ్యంలో అత్యవసర సర్వీసులు నడిచేందుకు వీలుగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాల‌ని,   తాగునీటికోసం ట్యాంకర్లను సిద్ధంచేసుకోవాల‌ని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రతమత్తంగా ఉండాల‌ని, చెరువులు, ఇరిగేషన్‌కాల్వలు, రోడ్లు, క‌ల్వ‌ర్టులు ఎక్కడ బలహీనంగా ఉన్నాయో గుర్తించి, అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని సిఎం ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి, ఎస్‌పి ఎం.దీపిక‌, జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-12 11:43:15

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశించారు. ఫీవర్ సర్వే జరుపు తున్నప్పుడు  ఏ.ఎన్. ఎం లు ప్రాధమికంగా వాడే మందులను వెంట తీసుకొని వెళ్లాలని సూచించారు. వైద్య , స్త్రీ శిశు అభివృద్ధి శాఖల అధికారులతో  మంగళవారం  కలెక్టర్ టీం కాన్ఫరెన్స్  నిర్వహించి సీజనల్ వ్యాధులు, ఫీవర్ సర్వే,  నీతీ అయోగ్ సూచీ ల పై పలు సూచనలు చేశారు. ముఖ్య0గా  తల్లి పాలు, కుటుంభ నియంత్రణ, సిజేరియన్, సాలిడ్ ఫుడ్ అందించే అంశాల పై వైద్యులు, ఏ.ఎన్.ఎం లు, అంగన్వాడీ, వాలంటీర్ల సహకారం తో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గర్భిణీ ల నమోదు శత శాతం జరగాలని, వారికి ఐ.డి ల జారీ కూడా చేయాలని అన్నారు. అంగన్వాడీ సెంటర్స్ లొనే వండి పెట్టాలని, అప్పుడు మాత్రమే పౌష్టికాహారం తీసుకుంటున్నది లేనిది ప్రత్యక్షంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుందని,  ఇళ్లకు రేషన్ గానీ, బాక్స్ లు గాని పంపరాదని స్పష్టం చేశారు. హై రిస్క్ గర్భిణీ లను వైద్యులే అంగన్వాడీ కేంద్రాలకు రిఫర్ చేయాలని అన్నారు.  సామ్, మాం పిల్లలు ఎక్కువగా ఉన్నారని, వీరి పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు.  ప్రధానంగా పిల్లలకు 10 నెలలు వచ్చే వరకు ఘనాహారం ఇవ్వడం లేదని, దీనివలనే పిల్లల పెరుగుదల తక్కువగా ఉంటుందని అన్నారు. ఆరు నెలలకే అన్న ప్రాసన చేసి ఘనాహారం అందించాలని, దీని పై అవగాహన కలిగించాలని తెలిపారు.  చిన్న ప్రయత్నం తోనే  మంచి ఫలితాలు సాధించగలమని, ఆ దిశ గా ప్రతి ఒక్కరూ పని చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో  డి ఎం హెచ్ ఓ డా.రమణ కుమారి, ఐ.సి.డి.ఎస్ పిడి శాంత కుమారి, వైద్యులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-07-12 11:37:53

తుపానుపై అప్రమత్తంగా ఉండండి

అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో  అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా  అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్లతో వరదలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ఏ ఒక్కరూ చనిపోకూడదని, అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అందరు జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. వరదలకు సంబంధించి దెబ్బతిన్న పంటలు, చెరువులకు గండ్లు, విద్యుత్ సరఫరా ,రోడ్డు మరమ్మతులు తదితర పనులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. వీటికి సంబంధించిన నష్టాలను అంచనా వేసి నివేదికలను వేగవంతంగా పంపాలన్నారు. వరద బాధితుల పట్ల మానవతా దృక్పథాన్ని చూపించాలని, తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఉదారత చూపించాలని పేర్కొన్నారు. సచివాలయాల సిబ్బంది,  వాలంటీర్స్ సేవలను వినియోగించుకుని ప్రతి ఇంటికి సహాయం అందించాలని తెలిపారు. ఎవ్వరికి  అందలేదు అన్నమాట రాకూడదని, పునరావాస కేంద్రాలలొ ఉన్న వారికి మంచి వసతులు, సదుపాయాలు కల్పించాలని,వారికి అందించే సేవల్లో ఎక్కడ లోటు రానీయ కూడదని అధికారులను ఆదేశించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్లో  జిల్లా నుంచి కలెక్టర్ ఎ.మల్లిఖార్జున , జాయింట్ కలెక్టర్ కే .ఎస్.  విశ్వనాథన్ , జీవీఎంసీ కమీషనర్  జీ.లక్ష్మీషా, ఈపీడీసిఎల్ సిఎండి కే.సంతోష రావు, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస మూర్తి, జిల్లా అధికారులు తదితరులు  పాల్గొన్నారు. 

Visakhapatnam

2022-07-12 09:48:22

విజయనగరంజిల్లాలో కంట్రోల్ రూమ్లు

విజయనగరం జిల్లాలో అధిక వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా అంతటా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం మీడియాకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా జిల్లా కలక్టరు కార్యాలయములో  కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు 08922-236947, రెన్యూ డివిజినల్ అధికారి కార్యాలయం కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు08922-276888, ఆర్డీఓ చీపురుపల్లి  కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు9440717534, ఆర్డీ బొబ్బిలి కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు08944 - 247288, తీర ప్రాంత మండలాలు అయినభోగాపురం&పూసపాటిరేగ తహసీల్దార్   కార్యాలయములలో  కంట్రోల్ రూమ్ ఫోను నెంబరుభోగాపురం: 8074400947, పూసపాటిరేగ : 7036763036,  మత్స్యశాఖ, విజయనగరం  కార్యాలయములలో ఏర్పాటు చేయబడిన కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు 08922-273812, విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ ఫోను నెంబరు 9490610102 ఉన్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లైన్ డిపార్ట్ మెంట్ అధికారులు అందరికి ఈ విషయాన్ని తెలియచేసి ముందస్తు చర్యలు తీసుకొనవలసినదిగా జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో తెలియజేసింది. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రజలందరూ అప్రమత్తం గా వుంటూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం కోరింది.

Vizianagaram

2022-07-12 07:51:53