సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సతీస మేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ రమణకు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఇతర అర్చకులు ఎన్వీ రమణకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్ కు పండితులు వేద ఆశీర్వాదం చేశారు
చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి ఎన్వీ రమణకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటం అందజేశారు
శాసన సభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు భూమన కరుణాకర రెడ్డి, అదనపు ఈవో ఎవి ధర్మారెడ్డి, పాలక మండలి సభ్యులు డాక్టర్ నిశ్చిత, శివకుమార్, శ్రీ డిపి అనంత , పార్థ సారధి రెడ్డి,సివి ఎస్వో గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టారు.తరువాత శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వాదం అనంతరం శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ తో ఆయన మాట్లాడారు. తన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయన్నారు. న్యాయ వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్లడానికి పని చేస్తానని ఆయన తెలిపారు.