గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విశాఖజిల్లా ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ కుమార్ నర్సీపట్నం డివిజన్ లోని నక్కపల్లి , ఎస్ రాయవరం మండలాలలో పర్యటించి పోలింగు, నామినేషన్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. పోలింగ్ సిబ్బంది తో ఎన్నికల ఏర్పాట్లపై తగు సూచనలను జారీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల విధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అధికారులంతా ఖచ్చితంగా ఎన్నికల నియమావళిని పాటించాలన్నారు. నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్ధుల నామినేషన్ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలన చేసిన తరువాత మాత్రే స్వీకరించాలని చెప్పారు. ఏ కేంద్రం నుంచి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ పర్యటనలో నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, మండల తాసిల్దార్ లు ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఎన్నికల సామగ్రిని ఆయా పంచాయతీ పోలింగ్ కేంద్రాలకు చేరవేత కు సంబంధించి బుధవారం మధ్యాహ్నం స్థానిక జడ్పీ కార్యాలయంలోని ప్రాంగణంలో వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ట్రయిల్ రన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్ మరియు కౌంటింగ్ ప్రక్రియకు అవసరమైన సామాగ్రిని తరలింపు దిశగా వాహనాల ద్వారా చేరుకున్న ఎన్నికల నిర్వహణ సిబ్బందికి పోలింగ్ మరియు కౌంటింగ్ నిర్వహణ ఏర్పాట్లపై అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో వివిధ వాహనాల్లో సామాగ్రితో పాటు ఎంతమంది సిబ్బంది ప్రయాణించగలరు అనే దానిపై అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం 10 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సిబ్బందిని ఎంపిక చేసుకొని ఆయా పంచాయతీల వాహనాల అంచనాల కేటాయింపునకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పంచాయతీ ఎన్నికల మాస్టర్ ట్రైనింగ్ నోడల్ అధికారి నరసింహారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఒక ప్రైవేటు బస్సు, మినీ బస్సు, టాటా సుమో వాహనాలలో ఎన్నికల సిబ్బంది సామాగ్రిని తీసుకొని వెళ్లే విధంగా వీలుగా తర్ఫీదు పొందారు. ఈ కార్యక్రమంలో జడ్పీ శ్రీనివాసులు, ఆర్టీసీ లా అధికారి చంద్రశేఖర్, డిటిసి నిరంజన్ రెడ్డి, డివిజనల్ పంచాయతీ అధికారులు విజయ్ కుమార్ రెడ్డి, రమణ, ఆర్టిసి డిపో మేనేజర్ పిచ్చయ్య, ఎంవీఐ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ లో భాగంగా నర్సీపట్నం డివిజన్ పరిధిలో రెండవ దశ నోటిఫికేషన్ ఫిబ్రవరి 2 వ తేదీ నుండి 4వ తేదీ వరకు నామినేషన్లు జరగనున్న నేపథ్యంలో నర్సీపట్నం సబ్ కలెక్టరు ఎన్ మౌర్య మాకవరపాలెం మండలం వజ్రగడ పంచాయతీ ను సందర్శించారు. పోలింగ్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ మైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా పోలీస్ అధికారులకు సూచనలు జారీ చేశారు. అదే విధంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి సక్రమంగా అమలు జరిగే విధంగా (ఏం సీ సీ)మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ /సర్వెలేన్స్ టీమ్స్ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు . ఆనంతరం సబ్ కలెక్టర్ రాచపల్లి పోలీస్ చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టరు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసే అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద నివృత్తి చేసుకోవచ్చన్నారు. అదే విధంగా ఎన్నికల కు సంభందించి ఏమైనా సమస్యలు ఉంటే సబ్ కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ఫోన్ నంబర్లకు (7731803255, 8465013255)ఫిర్యాదు చేయవచ్చునన్నారు.
గ్రామ పంచాయితీ ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డా.ఎన్.రమేష్ కుమార్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ డా.ఎం. హరి జవహర్ లాల్ జిల్లాలో ఎన్నికల సన్నద్దతపై ఎన్నికల కమిషనర్ కు వివరించారు. శాంతి భద్రతలు, బందోబస్తు అంశాలపై జిల్లా ఎస్.పి. బి.రాజకుమారి వివరించారు. విజయనగరం ఆర్.డి.ఓ. భవానీ శంకర్, డి.ఎస్.పి. అనీల్, పార్వతీపురం సబ్ కలెక్టర్ విధేఖరే డి.ఎస్.పి. మోహనరావు ఎన్నికల ఏర్పాట్లపై, పోలింగ్ స్టేషన్లు, ఓటర్లు, మేన్ పవర్ ,రూట్లు, జోన్లు, శిక్షణలు, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు, మోడల్ కోడ్ అమలు తదితర అంశాలను పవర్ పాయింట్ ద్వారా ఎన్నికల కమిషనర్ కు వివరించారు. కోవిడ్ నిబంధనలు పాటించేలా అవసరమైన మాస్కులను, శానిటైజర్లను పోలింగ్ బూత్ ల వద్ద సిద్దంగా వుంచామని డిఎం అండ్ హెచ్ ఓ డా. రమణ కుమారి వివరించారు. అదనపు ఎస్.పి. శ్రీదేవి రావు మాట్లాడుతూ అక్రమ మధ్యం సరఫరాను అరికట్టడానికి గట్టి నిఘా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.
అనంతరం ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ విజయనగరం జిల్లా ప్రశాంతమైన జిల్లా అని, ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయనే నమ్మకం వుందన్నారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు అధికారులకు పరీక్ష వంటివని, సక్రమంగా నిర్వహిస్తే రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజలు పెద్దఎత్తున ఓటింగులో పాల్గొనేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో శాంతియుతంగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లు పట్ల జిల్లా కలెక్టర్ ను, జిల్లా ఎస్.పి. అధికారులను అభినందించారు. కోవిడ్ సేవల్లో బాగంగా జిల్లా ఎస్.పి.రాజకుమారి జాతీయ స్థాయి అవార్డును అందుకోవడం పట్ల పత్యేకంగా అభినందించారు.
ఈ సమావేశంలో అదనపు డి.జి. ఎన్. సంజయ్, డిఐజి ఆఫ్ పోలీస్ కె.రంగారావు, ఎన్నికల పరిశీలకులు ఎస్.నాగలక్ష్మీ, సంయుక్త కలెక్టర్లు డా.జి.సి. కిషోర్ కుమార్, డా.మహేష్ కుమార్, ఐటిడిఎ పిఓ ఆర్.కూర్మనాద్, సహాయ కలెక్టర్ సింహాచలం, డిఆర్ఓ గణపతిరావు, డిపిఓ సునీల్ రాజ్ కుమార్, నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
పార్వతీపురం డివిజన్ లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని ఐటిడిఏ పీఓ, ఎన్నికల ప్రత్యేక అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ సోమవారం బలిజి పేట, సీతానగరం మండలాల్లో బొబ్బిలి డి.ఎస్.పి మోహన రావు, సి. ఐ, ఎం.పి.డి. ఓ లు, తహశీల్దార్లుతో కలసి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు, ముందుగా బలిజీ పేట మండలం అజ్జడ గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు, ఆనంతరం సీతానగరం మండలం నిడగల్లు, పేదబోగిలి, బుర్జ గ్రామాలను పర్యటించారు. నేటికీ చేపడుతున్న పనుల పై ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను ఆన్ని దశల్లోనూ తూచా తప్పక అమలు చేయాలని స్పష్టం చేశారు. అలాగే ఆన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు, ఏదైనా పోలింగ్ కేంద్రం మార్పు చేయాల్సిన అవసరం ఉంటే ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ రోజు జిల్లాలో పర్యటించనున్నారని, ప్రతి వారు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని, బ్యాలెట్ బాక్స్ లను ముందుగా పరిశీలించు కావాలని సూచించారు. ప్రస్తుతం ఆర్.ఓ., ఎ.ఆర్.ఓ లకు శిక్షణా కార్యక్రమం జరుగుతోందని, త్వరలో పి.ఓలు, ఎ.పి.ఓ.లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. డి.ఎస్.పి.తో మాట్లాడుతూ సమస్యాత్మక గ్రామాలు గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ పర్యటనలో ప్రాజెక్ట్ అధికారి పర్యటించిన గ్రామాలలో గ్రామ పెద్దలు, ప్రజలతో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎన్నికల ప్రవర్తనా నియావళిని ప్రకారం గ్రామంలో ప్రజలు, పోటీ చేసే అభ్యర్థులు నడుచుకోవాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఉపెక్షించేది లేదన్నారు.
ఈ సమీక్షా సమావేశానికి బొబ్బిలి డి.ఎస్.పి. మోహన రావు, సి.ఐ., బలిజిపేట, సీతానగరం మండలాల తహశీల్దార్లు, ఎం.పి.డి. ఓ లు, ఎస్.హెచ్. ఓ లు, వి.ఆర్. ఓ లు, పంచాయతీ సెక్రటరీలు హాజరయ్యారు.
విశాఖజిల్లా పాడేరు మండలం రాములుపుట్టు జిపిఎస్ ట్రైబల్ పాఠశాలలో విద్యార్ధినీ విద్యార్ధులకు సోమవారం ప్రభుత్వం మంజూరు చేసిన బ్యాగులు, పుస్తకాలను పాఠశాల ఉపాధ్యాయిని రాధ అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయిని రాధ మాట్లాడుతూ పాఠశాల రీఓపెన్ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే అందరు పిల్లలకు ఎడ్యుకేషన్ కిట్ కింద ఒక బ్యాగు, బట్టలు, పుస్తకాలు, నోట్సులు, బూట్లు అందరికీ ఇచ్చామన్నారు. అదేవిధంగా తనవంతుగా సాయంగా పిల్లలందరికీ పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు ఇచ్చినట్టు టీచర్ చెప్పారు. ఇంకా బడికి రానివారికోసం గ్రామంలో చాటింపు వేయించామని, ప్రతీ తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కబుర్లుకూడా పంపించామన్నారు. మిగిలిన విద్యార్ధులకు కూడా ప్రభుత్వం అందించిన కిట్ లను అందజేయనున్నట్టు చెప్పారు. మధ్యాహాన్న భోజనం కూడా విద్యార్ధులకు టీచర్ రాధ దగ్గరుండి వడ్డించి, వారితో పాటు కలిసి భోజనం చేశారు. అనంతరం కొత్తగా నాడు-నేడులో పాఠశాలలు ఏ విధంగా అభివ్రుద్ధి చేశారో పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పిల్లందరికీ పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
గౌరీపరమేశ్వరుల దయతో కరోనా అంతరించిపోవాలేని ఎంపీ డాక్టర్ బి.సత్యవతి అన్నారు. శనివారం అనకాపల్లిలోని గవరపాలెంలోని శ్రీ గౌరీ పరమేశ్వరుల ఉత్సవాల సందర్భంగా ఉత్సవ మూర్తులను ఎంపీ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీరాక సందర్భంగా నిర్వహాకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, అనకాపల్లిలో గౌరీపరమేశ్వరుల సంబరాలు రాష్ట్రంలోనే పేరుగడించాయని, అలాంటి సంబరాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించి ఈ ప్రాంతానికి మరింత పేరు తేవాలని కోరారు. కరోనా నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎంపీ పరిశీలించాలరు. ఈ కార్యక్రమంలో డా.విష్ణుముర్తి తదితరులు పాల్గొన్నారు.
ఎటువంటి ఘర్షణలకు పాల్పడకుండా, ప్రశాంతమైన వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు జరగాలని నందిగామ డి.ఎస్.పి నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. క్రిష్ణాజిల్లా కంచికచర్ల మండలం లోని బుధవారం రాత్రి నందిగామ, మొగులూరు, చెవిటికల్లు, గని అత్కూరు, పరిటాల, గొట్టుముక్కల గ్రామాల్లో ఫ్లాగ్ సేర్చ్ (పోలీస్ కవాతు) నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే నెలలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున, గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టామన్నారు. ఎటువంటి ఘర్షణలకు పాల్పడవద్దని, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో వెనక నుండి ప్రజలను ప్రోత్సహిస్తూ ఘర్షణలకు పాల్పడే వ్యక్తులు ఉంటారని హెచ్చరించారు. అల్లర్లు చేయాలనుకునేవారిపై కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రత్యేకమైన దృష్టి పెట్టారన్న ఆయన అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రశాంతమైన వాతావరణంలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగాలని, పోలీసు వారికి సహకరించాలని, సమస్యాత్మక మైన గ్రామాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మండలంలోని పరిటాల గ్రామానికి ప్రత్యేకంగా ఒక ఎస్సైని కేటాయించామని వివరించారు. ఈ కార్యక్రమంలో నందిగామ రూరల్ సీఐ సతీష్, కంచికచర్ల ఎస్సై రంగనాథ్, ఎస్ ఐ 2 లక్ష్మి, ఎస్ఐ ఏసుబాబు, చందర్లపాడు ఎస్ ఐ ఏసోబు, వీరులపాడు ఎస్ ఐ మణికుమార్, మొబైల్ పార్టీ ఎస్ఐ కోటేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
విశాఖజిల్లా ఎస్.రాయవరం మండంలోని దేవాదాయశాఖకు చెందిన భూములను కాజేయాలని చేస్తున్న ప్రయత్నంపై దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు కాలుపెట్టి తప్పుడు ధ్రువపత్రాలతో ఏకంగా 9.20 ఎకరాలు కొట్టేద్దామని చేసిన ప్రయత్నానికి విచారణ అనే అడ్డుకట్ట వేశారు. వివరాలు తెలుసుకుంటే ఎస్.రాయవరం మండంలోని లింగరాజుపాలెం రెవిన్యూ సర్వే నెంబరు 238లో 9.20 ఎకరాల భూమి ఇనాం మెట్టు లోకల్ ఫండ్ ఛౌల్ట్రీ(దేవాదాయశాఖ)కె చెందిన భూమిగా ఫైనల్ గెజిట్2015(22ఏ) కూడా ఇనాం మెట్టు భూమిగానే రెవిన్యూ రికార్డులు చూపిస్తున్నాయి. కానీ రెవిన్యూ రికార్డులు అడంగల్ 1బి ప్రకారం ఈ భూమి సర్వే నెంబరు 238లో ఆ మొత్తం భూమి జిరాయితీ మాగాణిగా ఖాతా నెంబరు7777గా పట్టాదారు క్రయంగా చూపిస్తోంది. దీనిపై యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ కన్వీనర్ రెవిన్యూ అధికారులకు, దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా దీనిపై సమాచార హక్కుచట్టం క్రింద కూడా దరఖాస్తు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. దీంతో వెంటనే రికార్డులతో సహా రంగంలోకి దిగిన దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు తమ భూమికి పట్టాదారు పాసుపుస్తకం కావాలని రెవిన్యు అధికారులను ఆదేశించారు. దీంతో డొంక మొత్తం కదిలింది. ప్రభుత్వ లెక్కలు, దేవాదాయశాఖ అధికారుల రికార్డుల ప్రకారం అంతా సక్రమంగానే ఉన్నా, మండలంలోని రెవిన్యూ రికార్డులు మాత్రం పూర్తిగా తేడాగా ఉన్నాయి. వాస్తవానికి ఏ భూమికైనా సబ్ డివిజన్ చేసి, భూమి యొక్క హక్కు దారులుగానీ, భూమిని అనుభవిస్తున్నవారు సొంత రికార్డులతో బదలాయించినపుడు మాత్రమే క్రయం రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు అవుతాయి. అలాకాకుండా ఏకంగా సుమారుగా పది ఎకరాల భూమిని కొట్టేయడానికి వేసిన మాస్టర్ ప్లాన్ కి కాస్తా అధికారులు ఏకంగా బౌండరీలు వేయడానికి సిద్దం చేయడం ఇపుడు ఆశక్తిగా మారింది. ఇదిలా ఉండగా ఈ భూమిపక్కనే ఉన్న భూమి 1.78 ఎకరాల భూమిని సేకరించిన విషయానికి సంబంధించి ఇప్పటికే పేదల ఇంటి స్థలాల కోసం రూ.38 లక్షలు చెల్లించినట్టుగా ప్రచారం జరుగుతుంది. రెవిన్యూ, దేవాదాయశాఖలోని వారు కలిసే ఈ భూ మాయ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో సుమారు రూ.కోటి రూపాయలు చేతులు మారినట్టు సమాచారం అందుతుంది. ఈ తంతుపై దేవాదాయశాఖ భూమికి సంబంధించి తక్షణమే పాసుపుస్తకం ఇవ్వాలని, మండల రెవిన్యూ అధికారులకు దేవాదాశాఖ నుంచి ఆదేశాలు రావడంతో తప్పుడు రికార్డుల విషయంలో ఎవరి సీటు గల్లంతు అవుతుందోనని రెవిన్యూ వర్గాల్లో ఆందోలన మొదలైంది. దేవాదాయశాఖకు చెందిన భూమి కొలతలు వేసే సమయంలో అసలు విషయం బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిన్నాయి. క్రయం జరిగినట్టుగా ఉన్న రికార్డుల్లోని వ్యక్తి భూమిని కొలిచే సమయంలో ఆ స్థలంలోకి వస్తే ఆ సమయంలో రెవిన్యూ అధికారులు, దేవాదాయశాఖ అధికారులు కలిసి చేసిన ఈ భూమాయ అసలు విషయాలు ఆధారాలతో సహా బయటకు వచ్చే అవకాశం వుంది. దానికి కారణం దేవాదాయశాఖ వద్ద పూర్తిస్ధాయి ఆధారాలుండటమే. దీనితో ఎస్.రాయవరం మండలంలో జరుగుతున్న భూమాయపై ఇటు జిల్లా కలెక్టర్ కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 9.20 ఎకరాల భూమాయ విషయం కొలతల్లో తేలితే భూమి మొత్తం దేవాదాయశాఖదని తేలితే ఎస్.రాయవరం మండంలోని ఏ తహశీల్దార్ ఉన్నపుడు రికార్డులు తారుమారు అయ్యాయో కూడా బయటకు వస్తుంది. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు కోరినట్టుగా అసలు మండల రెవిన్యూ అధికారులు ఆ భూమిని కొలుస్తారా, రికార్డులు బటకు తీస్తారా, ఏ ప్రైవేటు వ్యక్తికి క్రయం అయినట్టు రికార్డులు తయారు చేశారో అవి బయటకు వస్తాయా? మరో వైపు రిజిస్ట్రార్ కార్యాలయంలో సంపాదించిన ఆర్టీఐ సమాచారం ఆధారంగా ఎవరిపై చర్యలు తీసుకుంటారనేది ఇపుడు ఉత్కంఠగా మారింది. ప్రస్తుతానికి తమశాఖకు చెందిన భూమిని ఆధారాలతో సహా తాము స్వాధీనం చేసుకోవడంతోపాటు, ప్రభుత్వ భూమి రికార్డులను టేంపరింగ్ చేసి, అడంగల్ లో పేర్లు మార్పుచేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలకు కూడా ఉపక్రమించి కేసులు నమోదు చేస్తామని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ భూమాయపై ఏంజరుతుందనేది వేచిచూడాలి..!
గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం గణతంత్ర వేడుకలకు వీక్షించడానికి వచ్చిన స్వాతంత్ర్య సమరయోధులు 99 ఏళ్ల కన్నెగంటి సీతారామయ్యకి ఫిట్స్ వచ్చి స్పృహ తప్పి పడిపోయారు. ఈ విషయాన్ని వెంటనే గమనించిన ఎమ్మెల్యే డాక్టర్ వుండవల్లి శ్రీదేవి హుటాహుటిన అంబులెన్సులో తానే స్వయంగా ఎక్కించి గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో స్వాతంత్ర్య సమరయోధుడు కన్నెగంటి సీతారామయ్యగారికు తానే వైద్యం కూడా అందించారు. సకాలంలో వైద్యం అందించడంతో సీతారామయ్య ప్రాణపాయం నుంచి బయటపడ్డారు. ఎమ్మెల్యేగానే కాకుండా డాక్టర్‌గా వెంటనే స్పందించి ఓ నిండు ప్రాణాన్ని కాపడటంతో ఎమ్మెల్యే శ్రీదేవికి అభినందనలు వెల్లువెత్తాయి. ఒక వైద్యురాలు ప్రజాప్రతినిధిగా ఉంటూ ఒక నిండు ప్రాణం, అందునా గణతంత్ర దినోత్సవం రోజున స్వాతంత్ర్య సమరయోధుని ప్రాణం నలబెట్టిన నిజమైన భారతీయురాలిగా కీర్తి గడించారు ఎమ్మెల్యే శ్రీదేవి.
తరతరాలుగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న అణిచివేత, వివక్ష లను రూపుమాపు తూ పౌరులంతా సమానంగా ఎదిగే ప్రత్యేక అవకాశాలను కల్పిస్తూ భారత రాజ్యాంగాన్ని రూపొందించిన పెద్దలను గుర్తుచేసుకుంటూ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య తెలిపారు. మంగళవారం 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేసి, పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టరు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితం వారు మనకు కల్పించిన ప్రాథమిక హక్కులు సమానత్వం, లౌకికతత్వం ,ఐకమత్యంలకు కృతజ్ఞతలు తెలియ చేసుకోవాలన్నారు. భారతదేశం సర్వసత్తాక , సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య , గణతంత్ర రాజ్యంగా 1950 జనవరి 26న అవతరించిందన్నారు. ఈ రోజున భారత ప్రజలు అందరూ సంపూర్ణ స్వేచ్ఛ, న్యాయాన్ని పూర్తి స్ధాయిలో ఒక హక్కు గా పొందడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నానన్నారు.
.....
ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాల అందజేత.
నర్సీపట్నం డివిజన్ పరిధిలో గల పది మండల కార్యాలయాల లో పనిచేస్తున్న 12 మంది సిబ్బంది ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రాలను సబ్ కలెక్టర్ మౌర్య అందించారు. జిల్లా స్ధాయిలో 4గురు సిబ్బంది విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా స్వీకరించనున్నారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలలో నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి ప్రసాద్, కార్యాలయ సిబ్బంది, నర్సీపట్నం పోలీస్ కార్యాలయపు సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది, మండల తాసిల్దార్ జయ, ఇతర అధికారులు సిబ్బంది పాఠశాలల విద్యార్థినులు హాజరయ్యారు.
గ్రామాల్లో ఇంటింటికి సరఫరా చేసే నిత్యావసర సరుకులు డీలర్ నుంచి వ్యాన్ ద్వారా తరలించి తెల్లకార్డు లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయాలని డివిజనల్ సివిల్ సప్లయ్ అధికారి పి.శ్రీనివాసరావు వాలంటీర్లు, డిఆర్‌డిపో డీలర్లను ఆదేశించారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో సివిల్ సప్లయ్ డిటి ఆధ్వర్యంలో డీలర్లు,వాలంటీర్లకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెల్లరేషన్‌కార్డు నెంబర్,డిపో నెంబర్ ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ మిషన్‌లో ఏ విధంగా నమోదు చేయాలి,వేలి ముద్రల స్వీకరణ తదితర అంశాలపై వారికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన డీలర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి వాలంటీర్ 50 కార్డులకు ఈ నిత్యవసర సరుకులు అందించే బాధ్యత తీసుకోవాలన్నారు. మండలంలో ఉన్న 56డిపోలకు 11 మినిసప్లయ్ వ్యాన్లు ద్వారా సరుకులు పంపిణీ చేయాలన్నారు.గ్రామాల్లో కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ నిత్యవసర సరుకులు అందేలా డీలర్లు,వాలంటీర్లు పనిచేయాలన్నారు. ఎటువంటి ఫిర్యాదులోచ్చినా, అవకతవకలకు పాల్పడినా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం తప్పదని సివిల్ సప్లయ్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.
విశాఖ జిల్లాలో అరకు డివిజన్‌కు సంబంధించి అసిస్టెంట్ ఎలక్రోరోల్ రిజిస్ట్రేషన్ అధికారిగా కొయ్యూరు మండల తహాశీల్దార్ సిహెచ్.తిరుమలరావు ఎంపికైయ్యారు.దీనిలో భాగంగా విశాఖ నగరంలోని సిరిపురం విఎంఆర్‌డిఎ చిల్ర్డన్ థియేటర్‌లో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి,జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన చేతుల మీదుగా తిరుమలరావు అవార్డ్ అందుకున్నారు. 2020 ఓటర్ జాబితాల సవరణ లో మెరుగ్గా సేవలను నిర్వహించి నందుకు అవార్డ్ దక్కింది. అయితే మండల తహశీల్దార్‌కు లభించిన ఈ అవార్డ్ పట్ల మండలంలోని రెవెన్యూ సిబ్బంది, గ్రామ విఆర్‌వోలు,ఇతరులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
విశాఖలోని శ్రీ శారద పీరాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు త్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈమేరకు పెందుర్తిలోని శారదా పీఠానికి వెళ్లి అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసి ఆయన ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పీఠంలో కుటుంబ సమేతంగా కలిసి వెళ్లి పూజలు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు పీఠాధిపతి స్వామి . ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి జ్ఞానేశ్వరి, కుమారుడు శివ నందీశ్, కుమారై లక్ష్మీ ప్రియాంక, అల్లుడు శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పీఠంలోని సిబ్బంది మంత్రి పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
విశాఖలోని దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జివిఎంసీ కమిషనర్ ను కోరారు. శనివారం ఈ మేరకు కమిషనర్ ను కలిసి రూ.700 కోట్లతో ప్రతిపాదనలను కమిషనర్ ను కలసి ఆమె చాంబర్ లో అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దక్షిణ నియోజిక వర్గం అభివృద్ది కొరకు సదరు ప్రతిపాదనలను పరిశీలించి వీలైనంతవరకు మంజూరు చేస్తానని ఎం.ఎల్.ఎకు కమిషనర్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా పాడైన రోడ్లు, కాలువలు, గెడ్డల మరమత్తులు, కమ్యునిటీ హాలు నిర్మాణం, మంచినీటి వ్యవస్థ నిర్వహణ, ప్రహరీ గోడలు నిర్మాణం మొదలైన పనుల ప్రతిపాదనలు పరిశీలించి, తగు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పాత నగరం, కె.జి.హెచ్., రంగి రీజు వీధి, రెల్లి వీధి, కొబ్బరితోట తదితర ప్రాంతాల్లో ప్రతీ రోజూ రోడ్లు, కాలువలు శుభ్రం చేయాలని చీఫ్ మెడికల్ ఆఫీసరును ఆదేశించారు. దక్షిణ నియోజిక వర్గంలో వివిధ ప్రాంతాలో ఉన్న స్మశాన వాటికలు, దోభీఖానాలు నిర్మాణం, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, నెహ్రూ బజార్ ఆధునీకరణ పనులు, జగదాంబ నుండి పాత పోస్టాఫీసు వరకు 60 అడుగుల రోడ్డును విస్తరించే పనులు, హ్యాకర్స్ జోన్స్ ఏర్పాటుకు పెట్టిన ప్రతిపాదనలు అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజినీరు ఎం. వెంకటేశ్వర రావు, సి.సి.పి. విద్యుల్లత, యు.సి.డి.(పి.డి) వై. శ్రీనివాస రావు, పర్యవేక్షక ఇంజినీరు శ్యామ్సన్ రాజు, మూడవ జోనల్ కమిషనర్ ఫణిరాం, రెండవ జోనల్ కమిషనర్ శ్రీనివాసరావు, నాల్గవ జోనల్ కమిషనర్ సింహాచలం, ఏ.సి.పి. అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.