విశాఖ జిల్లా, పద్మనాభం మండలం వెంకటాపురం పంచాయితీ లో నిర్వహించిన కరోన వాక్సిన్ పంపిణీ కేంద్రాన్నిరాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో జరుగుతున్న వేక్సినేషన్ తీరును ఇక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న అంగన్వాడీ, ఏ ఎన్ ఎం, ఆశ కార్యకర్తలతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పద్మనాభం మండలంలో పని చేసే దాదాపుగా 200 మంది ఆశ వర్కర్స్, ఏఎన్ఎం , అంగన్వాడీ కార్యకర్తలకు, కరోన వాక్సిన్ పంపిణీ పూర్తిచేశామన్నారు. టీకా వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని టీకా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రేవిడి పిహెచ్ సిని అన్ని రకాలుగా అభివ్రుద్ధి చేయడంతోపాటు పూర్తిస్థాయి వైద్యం అందించేలా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రిలకు దీటుగా సదుపాయాలను కల్పిస్తున్నామని మంత్రి వివరించారు..
ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ నిరుపేదకు సొంతిల్లు ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ అన్నారు. బుధవారం అనకాపల్లి మండలంలో 11 గ్రామాలకు చెందిన 2016 మంది లబ్ది దారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హులైన ప్రతీ ఒక్కరూ గ్రామ, వార్డు సచివాలయం ద్వారా ఇంటికోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. మండల పార్టీ అధ్యక్షులు గొర్లి సూరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దంతులూరు దిలీప్ కుమార్, మండల నాయకులు జోగా నాగేశ్వర్రావు, పలకా సత్యనారాయణ, మల్లేష్, పల్ల శ్రీను, నంబారి రమణ, యాకోబు, ఆడారి సూరిబాబు, రాపేటి వెంకటేష్, పిడి గాంధీ, పడాల గణపతి, ఆడారి సూరిబాబు, రామ్ కుమార్, చదరం చిన్న, పెద్దాడ రామ్ శంకర్, కర్రీ అప్పారావు, కరణం నాగేశ్వరరావు, మిద్దె రామచందర్ రావు, మజ్జి వెంకట అప్పారావు , సకల సంతోష్, లబ్ధిదారులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
కరోనా వేక్సిన్ వేయించుకున్న అంగన్ వాడీ కార్యకర్తలంతా ప్రభుత్వం నిర్ధేశించిన ఆరోగ్యసూత్రాలను పాటించాలని పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవీ సత్యన్నారాయణ అన్నారు. శంఖవరంలోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రెండో దఫాగా మంగళవారం కూడా కరోనా నివారణ టీకాలను వేసారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల మేరకు తొలి ప్రాధాన్యత కలిగిన ఉద్యోగులకు వేక్సిన్ అందిస్తున్నట్టు వివరించారు. సమగ్ర శిశు, మహిళా అభివృద్ధి సంస్థ పరిధిలోని శంఖవరం, రౌతులపూడి మండలాలకు చెందిన 60 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు నేడు ఈ టీకాలను వేశామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు బాలాజీ, సూర్యారావు, ఫార్మసిస్ట్ రమణకుమారి, స్టాఫ్ నర్సులు దాసరి ప్రశాంత కుమారి, దుర్గాదేవి, సీహెచ్ఓ.కృష్ణకుమారి, హెచ్వీ. వీరలక్ష్మి, ఏఎన్ఎం. అనురాధ, సూర్యకుమారి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు జక్కల సూర్యకాంతం, విజయ, ఇంకా పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
భూ కబ్జాదారులను వెనుకేసుకు వస్తూ భూ హక్కుదారుల భూముల దారాదత్తం చేసిన గత తహశీల్దార్ వేణుగోపాల్ పై సిట్ విచారణ చేసి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు సోమవారం ఎస్.రాయవరం తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. భూ కబ్జా దారులకు విలువైన భూములు ధారాదత్తం చేస్తూ,తప్పుడు పాస్ బుక్ లు మంజూరు చేసిన తహశీల్దార్ వేణుగోపాల్ పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బాధితులు యజమానులు డిమాండ్ చేశారు. మండలంలో 8గ్రామాలకు చెందిన బాధితులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోలన నిర్వహించి ప్రస్తుత తహశీల్దార్ సత్యన్నారాయణకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా బాధితుల్లో ఒకరైన యూ.ఎఫ్.ఆర్.టి.ఐ మండల కన్వీనర్ సోమిరెడ్డి రాజు మీడియాతో మాట్లాడారు.
8 గ్రామాలకు చెందిన రైతుల భూములు మార్చేచిన ఘనుడు తహశీల్దార్ వేణుగోపాల్ అని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ప్రయివేటు భూములుగా మార్చడం లో ఆయన దిట్ట అని తద్వారా ఎందరో భూ హక్కుదారులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామస్తుల సొంత స్థలాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మించడంతోపాటు హక్కుదారులను ఎంతగానో వేధించారన్నారు. ఎస్.రాయవరం చెరుకు కాట వద్ద నున్న భూమిని స్థానిక నాయకులు బొలిశెట్టి గోవిందరావు బినామీ గా ఉన్న మాజీ సర్పంచి గా ఉన్న లక్కొజు ఆదిమూర్తి పేరున పాస్ బుక్ మంజూరు చేశారన్నారు. ప్రభుత్వ స్థలాల్లో కాకుండా నిబంధనలు అతిక్రమించి చెరువు గర్భం లో రూ.75 లక్షలతో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం గత తహశీల్దార్ పనితనానికి నిదర్శనమన్నారు. చెరువు గర్భాల్లో ప్రభుత్వ భవనాలు కట్టడాలు, భూ పట్టాలు ఇవ్వకూడదనే కోర్టు ఉత్తర్వులు ఉన్నా దానిపై నిబందనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికే స్థానిక కోర్టు ని,హై కోర్టు ని ఆశ్రయించినట్టు చెప్పారు. పనులు నిలిపి వేయాలంటూ హై కోర్టు ఉత్తర్వులు జారీచేసినా సదరు తహశీల్దారుపై జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టలేదన్నారు. ఇన్ని రకాలుగా ప్రైవేటు వ్యక్తుల స్థలాలను మరొకరి పేరుతో దారాదత్తం చేసిన తహశీల్దార్ వేణుగోపాల్, రెవిన్యూ సిబ్బంది తో పాటు అతనికి సహకరించిన అప్పటి ఎస్.ఐ దనంజయ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూ బాధితుల కు న్యాయం చేయాలన్నారు. లేదంటే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఈ సమస్యలు ఏవీ నా దృష్టికి రాలేదన్నారు. ఇప్పుడు మీ సమస్యలపై చర్చించి మా సిబ్బంది అప్పటి తహశీల్దార్ వేణుగోపాల్ పై విచారణ జరిపి ఆయన తప్పు చేసినట్లు రుజువైతే ఉన్నతాధికారులు కు నివేదిస్తాన ఈ సందర్భంగా బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 8 గ్రామాలకు చెందిన భూ బాదిత రైతులు, భూ హక్కుదారులు పాల్గొన్నారు.
రాజకీయాలు, కులమతాలకతీతంగా అర్హులైన ప్రతీ నిరుపేదకు ఇంటిస్థలాన్ని ఇవ్వడం, అంతేకాకుండా ఇంటినిర్మాణాలను సైతం కట్టించి ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. సోమవారం నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, అర్బన్ హౌస్ సైట్స్ పంపిణీ కార్యక్రమం లో భాగంగా పెదబొడ్డేపల్లి జోగినాదునిపాెలెం, బలిఘట్టం లలో సుమారు 734మంది అర్హులకు ఇంటి స్థల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్ర లో ప్రజల కష్టాలను కళ్ళారా చూసి మానిఫెస్టో లో పొందుపర్చిన హామీ లను తూ చ తప్పకుండా పాటిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతీ నిరుపేద కుటుంబం సొంత ఇంటి కల సాకారం అయ్యే విధంగా ఇళ్ళ స్థలాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రతీఒక్కరికీ పలు సంక్షేమ పథకాలను అందజేస్తూ ఆర్థిక చేయూత ఇస్తున్నారన్నారు. ప్రజల క్షేమం కోసం అహర్నిశలూ పాటు పడుతున్న మన ముఖ్యమంత్రి దేశంలో నే మూడవ స్థానం లో నిలిచారని ఇందుకు మనమందరం గర్వపడాలన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ పి కనకారావు, తహసిల్దార్ జయ ,రెవిన్యూ,మునిసిపల్ అధికారులు సిబ్బంది హాజరయ్యారు.
రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. 32వ జాతీయ భద్రతా మాసోత్సవాలను జిల్లా తరఫున కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ తో కలసి మంత్రి సోమవారం ప్రారంభించారు. గతంలో ఒక వారం రోజుల పాటు రోడ్డు భద్రతా వారోత్సవాలను చేసేవారని, ప్రస్తుతం రోడ్డు భద్రతా మాసోత్సవాలను జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే ప్రమాదాలు నివారణకు అవకాశం ఉంటుందన్నారు. స్కూల్ లు, కళాశాలల ప్రిన్సిపాల్ లతో అధికారులు ఒక సమావేశం ఏర్పాటుచేసి వారిలో అవగాహన కల్పించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా చూడాలని, హెల్మెట్ లను విధిగా ధరించాలని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్.జి.ఓ.లు మాసోత్సవాల్లో పాల్గొన్నాలన్నారు. వేగం కంటే ప్రాణం మిన్నా, ప్రతి ఒక్కరూ పాటించాలని పేర్కొన్నారు. రహదారుల భద్రతా మాసోత్సవాలలో అందరూ పెద్ద ఎత్తున భాగస్వాములవ్వాలన్నారు. అందరూ అవగాహన పెంచుకొని ప్రమాదాల నివారణకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ లు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలపై బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాజాం నియోజక వర్గం శాసన సభ్యులు కంబాల జోగులు, ఉప రవాణా కమీషనర్ రాజరత్నం, ట్రాఫిక్ ఎసిపి బాపూజి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
విశాఖజిల్లా ఎస్.రాయవరం మండలంలో రెవిన్యూ అధికారుల చేతివాటం ప్రదర్శించి తమ భూములు కోల్పోయిన విషయాన్ని మీడియా ముఖంగా పంచాయతీని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు దగ్గరకు తీసుకెళ్లారు బాధితులు. తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ తమకు ఎంత మేర నష్టం వాటిల్లిందనే విషయాన్ని ఎమ్మెల్యే ముందు గొల్లుమన్నారు. బాధితులు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ప్రజలెవరూ నష్టపోకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యే సావధానంగా విన్నారు. ఎస్.రాయవరం మండలంలో రెవెన్యూ అధికార యంత్రాంగం చేసిన అవినీతికి బాధితులైన వారు మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలోని తమ భూములను కోల్పోయిన 10 కుటుంబాల రైతులూ సామూహికంగా ఐక్యతతో వెళ్ళి కోరుప్రోలులోని ఎమ్మెల్యే స్వగృహంలో కలిసి జరిగిన నష్టాన్ని వివరించారు. తమ భూములను నిజమైన యజమానులు తామే అయినప్పటికీ, అన్ని యాజమాన్య హక్కు పత్రాలు తమ్ముడూ పేరునే ఉన్నప్పటికీ, అక్రమార్కులతో రెవిన్యూ అధికారులు కుమ్మకై తప్పుడు పత్రాలను సృష్టించి లక్షలాది రూపాయల విలువైన తమ భూములను అక్రమార్కుల పేరున రెవిన్యూ రికార్డులలో నమోదు చేసి, పాస్ బుక్స్ మంజూరు చేసి లక్షల రూపాయల విలువైన తమ భూములను పరాయి వారికి దారాదత్తం చేయడానికి రెవిన్యూ అధికారులు ప్రయత్నం చేస్తున్నారని ఈ దారుణాన్ని అడ్డుకోవాలని ఎమ్మెల్యేని బాధితులంతా కోరారు. అన్యాయమై పోయిన తాము తమ రికార్డులను పట్టుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ సంవత్సరాల తరబడి ఎస్.రాయవరం, తాహశీల్దార్, నర్సీపట్నం సబ్ కలెక్టర్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమకు అన్యాయం జరిగిందని వేడుకున్నా తమకు న్యాయం జరగ లేదని ఎమ్మెల్యేకి వివరించారు. ప్రతీ కుటుంబం తమకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా 3 రోజుల అనంతరం వ్రాత పూర్వకంగా తనకు సమర్పిస్తే దానిని స్వయంగా జిల్లా కలెక్టర్ తో మాట్లాడతానని వారికి అభయమిచ్చారు. అంతేకాకుండా బాధితులందరినీ కలెక్టర్ వద్దకు తీసుకొని వెళ్లి న్యాయం జరిగేలా చేస్తానన్నారు.
కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తో ప్రపంచ మానవాళికి ఆత్మవిశ్వాసం, ఆరోగ్యంపై భద్రత పెరుగుతుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. పేర్కొన్నారు. శనివారం శంఖవరం మండంలోని పీహెచ్సీలో తహశీల్దార్, సుభ్రమణ్యం, ఎంపీడీఓ జె.రాంబాబు, పీహెచ్సీ వైద్యులు డా.సత్యన్నారాయణలతో కలిసి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకొని ఈ కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు చెందాల్సిన పనిలేదన్నారు. కరోనా వ్యాక్సిన్ వేయడం అనేది చాలా పెద్ద ప్రక్రియ అని, ఇది దేశవ్యాప్తంగా జరుగుతోందన్నారు. కరోనా వల్ల మంది మృత్యువాత పడ్డారని, కరానా లాంటి కష్ట సమయంలో వైద్య సిబ్బంది తమ ప్రాణాలను, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సేవలు అందించారన్నారు. అందుకోసం మొదటిగా హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ వేయడం జరుగుతోందని, రెండో విడతలో పోలీసు, రెవెన్యూ సిబ్బందికి, మూడవ విడతలో ప్రజలకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్ రావడం అనేది కరోనాపై మానవాళి విజయం అన్నారు. ప్రపంచంలోనే మానవాళికి వ్యాక్సిన్ అనేది ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి దోహదం చేస్తుందన్నారు. మొదటిసారి వ్యాక్సిన్ వేసుకున్న వారు 25 రోజుల తర్వాత రెండవ డోసు కూడా ప్రతి ఒక్కరు వేసుకోవాలన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న 42 రోజుల వరకు ప్రతి ఒక్కరూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదన్నారు. మండంలో సుమారు 100 మంది పేర్లు రిజిస్టర్ చేయగా 75 మందికి వేక్సిన్ అంచినట్టు డాక్టర్ సత్యన్నారాయణ తెలియజేశారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
విశాఖ జిల్లా, ఎస్.రాయవరం గ్రామంలో వెలసిన గౌరీపరమేశ్వరుల అనుపు కార్యక్రమం శనివారం శ్రీ గౌరి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి సారి కార్యక్రమం ఈ ఏడాది ప్రత్యేకంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం విశేషం. ఎస్.రాయవరం గ్రామం లో అమ్మవారికి గుడి నిర్మించడటంతో పాటు ఈ ఏడాది రంగులు వేయించి మరింత సుందరంగా తయారు చేసారు. సాయంత్రం అనుపు మహోత్సవం మేలతాలాలతో, స్వామివార్లను ఘనంగా అనును చేశారు. ఈ సందర్భగా గ్రామంలో పలు సాంస్క్రుతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ సంఘ సభ్యులు ఆడారి శ్రీను, భీమరశెట్టి శ్రీనివాసరావు, గ్రామంలోని పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పంచాయతీరాజ్ శాఖలోని ఉద్యోగం చేస్తున్నారా అయితే మీరు అడ్డగోలుగా దోచేసుకోవచ్చు.. ఒక వేళ మీ ఉద్యోగం ఏ గ్రామసచివాలయానికో కార్యదర్శో, ఈఓపీఆర్డీ అయితే మరీ మంచిది.. సచివాలయంలో ప్రజల సేవల పేరుతో చేసిన ఖర్చును అక్రమంగా మీ కుటుంబ సభ్యుల ఖాతాలకు దారి మళ్లించేయొచ్చు.. ఏంటీ విచిత్రంగా ఉందే అనుకుంటున్నారా.. అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.. అవును మీరు చదువుతున్నది అక్షర సత్యం.. విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలంలోని గ్రామసచివాలయాల్లో జరిగిన లక్షల రూపాయల అవినీతి బాగోతాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక యాప్ ఈఎన్ఎ లైవ్ ద్వారా ఆధారాలతో సహా ప్రత్యేక కధనాలతో బయట పెట్టింది. ఇక్కడ ఈఓపీఆర్డీగా పనిచేన యడ్లపల్లి త్రిమూర్తులు, మరో ఇద్దరు గ్రామసచివాలయ కార్యదర్శిలు.. సచివాలయాలకు చెందిన సుమారు పది లక్షల రూపాయలును వారి కుటుంబ సభ్యుల ఖాతాలోకి దారిమళ్లించుకున్నారు.. వాటిని ఆధారాలు, బ్యాంకు ఖాతాలతో సహా బయటపెట్టడంతో.. ఈఎన్ఎస్ వార్తా కధనాలతో సహా వీరిపై గొలుగొండ మండలం క్రిష్ణదేవిపేటకు చెందిన ఒక వ్యక్తి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు చేసేంత వరకూ పంచాయతీరాజ్ శాఖలోని ఏ ఒక్క అధికారి ఈ అడ్డగోలుగా మేసేసిన నిధుల వ్యవహారం పై పర్యవేక్షణ చేయలేదు సరికదా..విషయం తెలిసినా మిన్నకుండిపోయారు.. ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో వరసు కధనాలు రావడంతో జిల్లా పంచాయతీ అధికారి క్రిష్ణకుమారి నర్సీపట్నం డిఎల్పీఓను విచారణ అధికారిగా నియమించారు. ఆతరువాత ఆమె జరిపిన విచారణలో ఈఎన్ఎస్ లైవ్ యాప్ రాసిన కధనాలన్నీ అవినీతి ఈఓపీఆర్డీ త్రిమూర్తులు , కార్యదర్శిలు దోచేసిన నిధులు లెక్కలతో సహా రుజువయ్యాయి. అంతవరకూ బాగానే వున్నా అక్కడి నుంచే అధికారులు, అక్రమార్కుల ఎత్తుగడలు పనిచేయడం మొదలుపెట్టాయి. ఎలాగైనా ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించాలని ప్రయత్నించే కొద్దీ ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా కధనాలు అందిస్తూనే వచ్చాం. దీంతో ఎట్టకేలకు సదరు అక్రమార్కులు బొక్కేసిన నిధుల వ్యవహారంపై జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆదేశాలతో వారిపై కమిషనర్ కు విచారణ నివేదికను పంపించారు విశాఖ జిల్లా అధికారులు. నివేదిక పంపిన రెండు నెలలకు గానీ కమిషనర్ కార్యాలయం నుంచి తిరుగు టపా రాలేదు. తీరా వచ్చిన తరువాత మళ్లీ అక్రమార్కుల యడ్లపల్లి త్రిమూర్తులు, మరో కార్యదర్శిపై ఛార్జిషీటు ఫైలు చేయడానికి మళ్లీ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ కు ఫైలు పెట్టారు జిల్లా పంచాయతీ అధికారిణి క్రిష్ణకుమారి. ఇలాంటి తేడా వ్యహారాల్లో ముక్కుసూటిగా ఉంటే జిల్లా కలెక్టర్ తక్షణమే ప్రభుత్వ నిధులు కాజేసిన వారిపై ఛార్జిషీటు ఫైలు చేయాలని ఆదేశించడంతో ఇద్దరు కార్యదర్శిలపై ఛార్చిషీటు ఫైలు చేశారు జిల్లా పంచాయతీ అధికారులు. పెద్దమొత్తంలో నిధులు బొక్కిన ఈఓపీఆర్డీ యడ్లపల్లి త్రిమూర్తులుపై చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ కు అధికారాలు లేకపోవడంతో కమిషనర్ కు మరోసారి ఫైలు పెట్టారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి క్రిష్ణకుమారి ఈఎన్ఎస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. తమ విచారణలో తేలిన ఆధారాలతో ఇద్దరు కార్యదర్శిలపై ఛార్జిషీటు ఫైలు చేస్తున్నామని, మింగిన నిధులను రికవరీ చేయడంతో సస్పెండ్ కు సిఫారసు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ నిధులు ఎవరు పక్కదారిపట్టించినా, మింగినా కఠిన చర్యలు తప్పవని చెప్పారు. కరోనా రావడం, అదే సమయంలో అనుమతి కోసం కమిషనరేట్ కి ఫైలు పంపడంతో సమయపాలన జరిగిందని చెప్పుకొచ్చారు. ఎప్పటిలోగా అక్రమార్కులపై వేటుపడుతందని ప్రశ్నించగా...తాము విచారణ చేసి నివేదిక సమర్పించడంతో తమ పని అయిపోయిందని, ఆపై కమిషనర్ తమకు ఇచ్చే సూచనల ఆధారంగా చర్యలు ఉంటాయని వివరించారు. ఈ లెక్కంతా జరిగడానికి మరో మూడు నెలలు సమయం పట్టేటట్టు కనిపిస్తోంది. అందులోనూ సచివాలయ నిధులు అడ్డంగా మేసేసిన మూర్తికి ఉద్యోగ విరమణ దగ్గర పడటంతో ఏదైనా మతలబులు చేస్తారేమోననే ప్రచారం కూడా గుప్పుమంటుంది. చూశారు కదా పంచాయతీరాజ్ శాఖలో అధికారులు, సిబ్బంది వారికి దొరికిన కాడికి నొక్కేసిన నిధులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పా మీరు పెట్టిన ఖర్చులకో జిల్లా అధికారులు ముట్టుకోరని తేటతెల్లమైపోయింది. గ్రామాల్లో చల్లని బ్లీచింగ్ కు కోసం, వాసన రాని ఫినాయిల్ కోసం లక్షలకు లక్షలు బిల్లులు పెట్టి స్వాహా చేసేయొచ్చుని రుజువైపోయింది.. మీరు దోచుకున్న విషయం ఆధారాలతో సహా రుజువైనా మీపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్రస్థాయి అధికారులు మీన మేషాలు లెక్కిస్తారనే ఎస్.రాయవరం మండలంలో జరిగిన నిధుల దోపిడీయే ఒక ప్రధాన ఉదాహరణగా మిగిలిపోయింది.. ఇదంతా చదివిన తరువాత గ్రామసచివాలయ స్థాయిలో చేసే అవినీతి ఆధారాలతో సహా మీడియాలో వస్తే అధికారులు చలించరని రూఢీ అయిన క్రమంలో ఏం చేస్తే బాగుంటుందో సిబ్బంది కూడా ఒక అంచనాకు వచ్చేస్తారేమో..అంతేగా..అంతేగా..!
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక ఏర్పాటు చేసిన గ్రామసచివాలయాల ద్వారా అధికారులు, సిబ్బంది ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగి వెలగా కొండబాబు కోరారు. ఆదివారం ఎస్.రాయవరంలో వీరి షష్టిపూర్తి సందర్భంగా గ్రామసచివాలయంలోని పంచాయతీ కార్మికులకు, రిక్షా కార్మికులు, నాయా బ్రాహ్మణులకు ఆమె కుమార్తె సాయిసౌజన్య ద్వారా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి సహకారం లేని వారికి తమవంతు సాయంగా ఈ చిన్ని దుస్తులు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కర్రి వెంకటేశ్వరరావు మాస్టారు, సుబ్బరాజు,వెలగా గోపాలకృష్ణ, కుటుంబసభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం సభ్యుడు కొండబాబు కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు.
విశాఖలోని సింహాచలం శ్రీవరాహాలక్ష్మీనృసింహస్వామివారికి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి , వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు, అప్పన్న చందనోత్సవ కమిటీ మాజీ సభ్యులు గంట్ల శ్రీనుబాబు దంపతులు అపురూపమైన కవచాన్ని విరాళంగా అందజేశారు. దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 27 కేజీల ఇత్తడి కవచం ఆలయ వర్గాలకు అందజేశారు . ఈ కవచం సింహాద్రినాధుడి స్వర్ణకవచం అలంకరణకు వినియోగించనున్నారు. ఈ సందర్భంగా దాత గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, సింహాచలం ప్రాంతంలో జన్మించడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు. గతంలో కూడా అప్పన్న నిత్యన్నధాన పథకానికి తాను రూ .3 లక్షలు విరాళంగా అందజేయడంతో పాటు తమ కుటుంబ సభ్యులు మరికొంత మొత్తాన్ని అందజేశారని తెలిపారు. అంతే కాకుండా స్వర్ణ పుష్పాలు, స్వర్ణ తులసీదళాలు కూడా తాము విరాళంగా అందజేశామన్నారు. తాజాగా స్వర్ణ కవచ అలంకరణకు అవసరమైన ఇత్తడి కవచం అందజేసే అదృష్టం లభించిందన్నారు. ఆలయ ఏఇఓ రాఘవకుమార్ కు ఈ కానుకను శ్రీనిబాబు దంపతులు అందజేశారు. తొలుత ఇత్తడి కవచంకు ఆలయ అర్చకలు సింహాచల ఆచార్యులు , పెద్దిరాజు తదితరులంతా స్వామివారి పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ కార్యక్రమంలో శిల్పి పండూరి అయ్యప్ప , పండూరి సాంబ , నాయుడు పాల్గొన్నారు. అంతకు ముందు దాత కుటుంబ సభ్యులు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న "నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు " కింద లబ్ధిదారులకు నిర్ధేశిత సమయంలోగా ఇంటి పట్టాలను వేగవంతంగా పూర్తి స్థాయిలో అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వివరించారు. విజయవాడ నుంచి మంగళవారం ఇంటి పట్టాల పంపిణీ, ఎన్ఆర్ఈజిఎస్, నాడు - నేడు పనులు, అమ్మఒడి, వివిధ రహదారులకు సంబంధించి భూమి సేకరణ, ఇంటింటికి బియ్యం సరఫరా తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ లోని ఎన్ఐసి భవనం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ "నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు " కింద జిల్లాలో పూర్తి స్థాయిలో త్వరితగతిన ఇంటి పట్టాలను పంపిణీ చేస్తామని తెలిపారు. జిల్లాలో గత నెల డిసెంబర్ 25వ తేదీన లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేయడం మొదలుపెట్టామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2.19 లక్షల మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేస్తున్నామని, లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలోనే వారికి ఇంటి పట్టాలను అందజేస్తున్నామన్నారు. సొంత స్థలాలలోనే లబ్ధిదారుల వద్దకు వెళ్లి ఇంటి పట్టాలను పంపిణీ చేస్తున్నామని, ఇంటి పట్టాలను అందుకున్న మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఇంటి పట్టాల పంపిణీ చేస్తున్నామని, నిర్దేశిత సమయంలోగా ఇంటి పట్టాలను పంపిణీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కి జిల్లా కలెక్టర్ వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిపిఓ ప్రేమచంద్ర, డీఈవో శామ్యూల్, ఎపిఈడబ్ల్యూసి అండ్ ఎస్ఎస్ఏ ఈఈ శివకుమార్, ఐసిడి ఎస్ పిడి విజయలక్ష్మి, డిఎం హెచ్ ఓ కామేశ్వర ప్రసాద్, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, డిప్యూటీ కలెక్టర్ వరప్రసాద్, హౌసింగ్ పిడి చంద్రమౌళి రెడ్డి, డి ఎస్ ఓ రఘురాం రెడ్డి, ట్రాన్స్ కో ఎస్ ఈ రాజశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, అధికారులు పాల్గొన్నారు.
సంబర పోలమాంబ జాతరలో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని పార్వతీపురం సబ్ కలెక్టర్ విధేఖర్ ఆదేశించారు. మంగళవారం శంబర గ్రామాన్ని ఐ టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి. కూర్మనాధ్ తో కలసి సబ్ కలెక్టర్ విధేఖర్ సందర్శించారు. ముందుగా చదురు గుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి బి.ఎల్.నగేష్ కండువాలతో ఇద్దరు అధికారులను సత్కరించారు. అనంతరం చదురు గుడిలో భక్తులరాకపోకలను అడిగి తెలుసుకున్నారు. జాతరలో క్యూలైన్లు ఏర్పాటు, టికెట్ కౌంటర్ ఏర్పాటు, ప్రసాదాల కౌంటర్ ఏర్పాటు వివరాలను ఆలయ ఈ వో ని అడిగితెలుసుకున్నారు. చదువు గుడి వెనుక అమ్మవారి గుడిని అనుసరించి వున్న ఖాళీ స్థలాన్ని జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తాత్కాలికంగా తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం నీలాటిరేవుని పరిశీలించారు. నీలాటిరేవు ప్రాంతమంతా తీవ్రదుర్గంధం వెదజల్లుతూ , పారిశుద్ద్యం పేరుకుపోవడంతో సబ్ కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. పక్కనే వున్న గ్రామ కార్యదర్శిని పిలిచి తక్షణమే పారిశుద్ద్య పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎంతో పెద్ద జాతర జరుగుతున్న గ్రామంలో పారిశుద్ద్యం అధ్వానంగా ఉండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి అమ్మవారి చదురు గుడి వెనుక గల జాతర స్తలాన్ని పరిశీలించారు. జాతరలో క్యూలైన్లు ఏర్పాటు, ఉచిత దర్శనాన్ని పరిశీలించారు. జాతరలో క్యూలైన్లు ఏర్పాటు, ఉచిత దర్శనం వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతమున్న మరుగుదొడ్ల పనితీరుపై, కేశఖండన ప్రదేశానికి సంబందించిన వివరాల పై ఆరా తీశారు.. జాతరలో భక్తులకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీలాటిరేవు మరమ్మత్తులు చేపట్టాలని పంచాయితీరాజ్ శాఖని ఆదేశించారు. తదుపరి వనం గుడి ప్రదేశాన్ని పరిశీలించారు. జాతర సందర్భంగా సిరుమాను తిరిగే ప్రదేశాలను, తిరిగే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో సబ్ కలెక్టర్ విధేఖర్, ఐటిడిఎ పి.ఓ. కూర్మనాధ్ వెంట ఆలయఈవో బిఎల్ నగేష్, తహశీల్దారు డి.వీరభద్రరావు, మండల పరిషత్ అభివృద్ది అధికారి సిహెచ్ సూర్యనారాయణ, ట్రాన్సుకో అసిస్టెంట్ ఇంజనీరు శివశంకర్ లతో పాటు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
విశాఖజిల్లా, ఎస్.రాయవరం మండలంలో సచివాలయ నిధులు రూ.10 లక్షల ను వారి కుటుంబ సభ్యుల ఖాతాలకు అడ్డగోలుగా దారి మళ్లించుకున్న ఈఓపీఆర్డీ మరో ఇద్దరు సచివాలయ కార్యదర్శిలపై వేటు వేయడానికి జిల్లా పంచాయతీ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈఓపీఆర్డీ త్రిమూర్తులు స్పెషల్ ఆఫీసర్ గా పనిచేసిన చోట జరిగిన చేసిన అవినీతి వ్యవహారాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా బాహ్య ప్రపంచానికి ఆధారాలతో సహా తెలియజేసింది. దీనితో ఈఎన్ఎస్ లైవ్ కథనాల ఆధారంగా ఏ.ఎల్ పురం, ఎస్.రాయవరం మండలంలోని పలు సచివాలయాల్లో పనిచేసిన కాలంలో కూడా త్రిమూర్తులు అవినీతికి పాల్పినట్టు ఇటు కలెక్టర్ కు, డిపీఓ, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కు సుమారు 50 ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై స్పందించిన విశాఖజిల్లా పంచాయతీ అధికారి క్రిష్ణకుమారి త్రిమూర్తులు మరో ఇద్దరు సచివాలయ కార్యదర్శిల అవినీతి పై విచారణకు ఆదేశించారు. వెంటనే వీరి అవినీతిపై నర్సీపట్నం డిఎల్పీఓ శిరిషారాణి విచారణ చేపట్టి నివేదికు డిపీఓకు అందించారు. ఆపై దానిని కమిషనర్ కు డిపిఓ నివేదించడం, అవినీతి జరిగినట్టు రుజువు కావడంలో సదరు సచివాలయ సిబ్బందిపై వేటు వేయడానికి చార్జిషీటు వేయాల్సిందిగా కమిషనరేట్ నుంచి డిపిఓకు ఉత్తర్వులు అందాయి. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ కుడా పచ్చజెండా ఊపడంతో అక్రమార్కులపై వేటువేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు డిపీఓ క్రిష్ణకుమారి ఈఎన్ఎస్ కు ప్రత్యేకంగా తెలియజేశారు. వాస్తవంగా ఈఓపీఆర్డీ స్థాయి అధికారిని సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్ కు లేదు. దీనితో అతను చేసిన అవినీతిపై చార్జిషీట్ ద్వారా కేసు ఫైల్ చేశారు. ఈఓపీఆర్డీ చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవాలని ఎంత ప్రయత్నించినా, విచారణ నివేదికను పక్కదారి పట్టించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్రమార్కుల పాచికలు పారలేదు. ఎట్టకేలకు పంచాయతీరాజ్ కమిషనర్ చర్యలకు ఉపక్రమించడంతో వారిపై వేటు అనివార్యమైంది. పంచాయతీ నిధులు కాజేసిన ఈఓపీఆర్డీ త్రిమూర్తులు పాయకరావుపేట నియోజకవర్గంలో యాక్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఒక చోటా నేతతో అధికారుల ద్వారా తనపై వేటు తప్పించుకోవాలని చూస్తున్నట్టుగా నియోజవకర్గంలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి తేడా వ్యవహరాలు చేస్తున్నందుకు ఇప్పటికే ఎమ్మెల్యే అతనిని దూరంగా పెట్టారు కూడా అయినా తన మాటకు విలువ వుందంటూ సదరు యాక్టింగ్ ఎమ్మెల్యే తన హవాని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని విజయవాడ కమిషనరేట్ స్థాయిలో పైరవీలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే నిధుల దుర్వినియోగం విషయంలో పక్కాగా ఆధారాలు ఉండటంతో అవినీతి ఈఓపీఆర్డీ, మరో ఇద్దరు సిబ్బందిపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.