భారత దేశంలో మరెక్కడా లేని విధంగా గ్రామ సచివాలయం వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకువచ్చి సుపరిపాలన అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదని రాష్ట్ర ఉపము ఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. అవినీతికి, వివక్షతకు తావులేకుండా పరిపాలన ప్రజలకు మరింత చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన సంగతిని ఆయన గుర్తుచేశారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇంటి పట్టాలు మంజూరు, తాగునీటి సరఫరా సమస్యకు పరిష్కారం, వైద్యం , భూముల సర్వే తదితర సమస్యలు ఏదైనా ఆర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే గ్రామ సచివాలయాల్లో పరిష్కరించడం జరుగు తుందని అన్నారు. బుధవారం నరసన్నపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపముఖ్యమంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. తొలుత గోపాలపెంట గ్రామంలో రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, రూ. 17.50 లక్షలతో నిర్మించిన డాక్టర్ వై.ఎస్.ఆర్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ అర్హత ఉన్న ఏ ఒక్కరూ తమకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందలేదని బాధపడే సమస్య ఉండదని, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రామ సచివాలయాలు ప్రజలు బాగా సద్వినియోగం చేసుకోవాలని కృష్ణదాస్ కోరారు. అనంతరం నర్సింగ రాయుడు పేట గ్రామంలో రూ. రెండు కోట్ల నిధులతో లుకలాం నుంచి కొమనాపల్లి వరకు నిర్మించనున్న ఆర్ అండ్ బి రహదారికి ఉపముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. తర్వాత నరసన్నపేట మండలం కామేశ్వరిపేటలో ఎల్.కె. రోడ్డు నుండి ఎల్.కె. రోడ్డు వరకు (వయా కొబగాం,వెంకటాపురం) రూ.1.50 కోట్లతో ప్రత్యేక మరామ్మతుల పనులకు శంకుస్థాపన చేశారు. కామేశ్వరి పేట గ్రామ పంచాయతిలో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం, రూ. 21.50 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనాన్ని ప్రారంభించారు. ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి ఆరంగి మురళీధర్, జడ్. పి.టి.సీ చింతు అన్నపూర్ణ రామారావు, వైఎస్ ఎం.పి.పి చింతల సత్యవతి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లుకలాపు రంజిత్ కుమార్, వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పొట్నూరు సాయిప్రసాద్, గోపాలపెంట, పోతయ్యవలస సర్పంచులు ఎండ కృష్ణవేణి, కనపల సత్యప్రియ, కొత్తపాలవలస సర్పంచ్ వెంకట శ్యామ కుమార్, కామేశ్వరిపేట సర్పంచ్ రాములు రాధిక చక్రధరరావు, రాష్ట్ర కళల కార్పొరేషన్ డైరెక్టర్ బొబ్బరి ఈశ్వరరావు, పి.ఏ.సి. ఎస్ అధ్యక్షుడు సురంగి నర్సింగరావు, కనపల శేఖర్ రావు, సబ్బ రాము తదితరులు పాల్గొన్నారు.