పేదలందరికీ ఇళ్ల పధకంలోని గృహాల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, ఇనుము అందుబాటులో వుంచి నిర్మాణాలు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు లో జగనన్న పేదలందరికీ ఇళ్ల పధకం లే అవుట్ లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. లే అవుట్ 7.39
ఎకరాలలో 285 ప్లాట్లు ఏర్పాటు చేసారని, వీటిలో 257 ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసారని, బిలో బేస్మెంట్ లెవల్ లో 108 ఇల్లు, బేస్మెంట్ లెవల్ లో 74 ఇల్లు, రూఫ్ లెవల్ లో 19 ఇల్లు, రూఫ్ పూర్తి అయినవి 45 ఇల్లు ఉన్నాయని హౌసింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ కు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లబ్దిదారులు అందరికి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్, దశల వారీగా బిల్లులు
మంజూరు అయ్యేలా హౌసింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందించిన ఇంటి నిర్మాణాల పురోగతి తెలిపే పాస్ పుస్తకాలను లబ్దిదారులకు అందించి, ఎప్పటికప్పుడు నిర్మాణ వివరాలు, బిల్లుల చెల్లింపు వివరాలు, సప్లయ్ మెటీరియల్ వివరాలు అధికారులు నమోదు చేసి సంతకాలు చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలను అధికారులు తనిఖీ చేసే సమయంలో పాస్ పుస్తకాల లోని వివరాలను
సరి చూసుకోవడానికి వీలుగా వుంటుందన్నారు. లే అవుట్ లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్దిదారు రేష్మ భర్త మక్బుల్ తో జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడి ఇంటి నిర్మాణానికి అధికారులు అందించిన సహకారం, మెటీరియల్, జమ చేసిన నగదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణానికి అధికారులు పూర్తి స్థాయిలో సహకారం అందించారని, ప్రతి దశలోనూ దగ్గరుండి అవసరమైన
మెటీరియల్ సకాలంలో అందించారని లబ్దిదారు సంతృప్తి వ్యక్తం చేసారు. లే అవుట్ లోని కొంతమంది లబ్దిదారులు అంతర్గత రహదారులు, కల్వర్ట్, విద్యుత్ స్తంభాలు, పూర్తి స్థాయిలో నీటి సరఫరా అందించాలని జిల్లా కలెక్టర్ ను కోరగా, అంతర్గత రహదారులు చదును చేయాలని, విద్యుత్ స్తంభాలు లేని ప్రాంతాలలో వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కల్వర్ట్ నిర్మాణానికి, మంచినీటి సరఫరా పనులకు
టెండర్లు జరుగుతున్నాయని, పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. డ్వాక్రా మహిళలకు ఇంటి నిర్మాణానికి బ్యాంకర్ల ద్వారా అందించిన రుణాల చెక్కులను జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి లబ్దిదారులకు పంపిణీ చేసారు. ఇళ్ల నిర్మాణానికి బ్యాంకుల ద్వారా అందిస్తున్న పైకాన్ని సద్వినియోగం చేసుకొని ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ప్రభాకర రెడ్డి, హౌసింగ్ పీడీ సాయి నాథ్, వట్టిచెరుకూరు తహశీల్దారు ఫణేంద్ర బాబు, యంపీడీఓ ఉషా రాణి, జెడ్పీటీసీ వెంకట లక్ష్మీ, హౌసింగ్, పంచాయితీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్,
సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.