పిల్లల్లో నులిపురుగులను నిర్మూలించేందుకు, ఆల్‌బెండజోల్ మాత్రలను వారిచేత మ్రింగించాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ కోరారు. జాతీయ నులిపురుగుల నివారణా దినోత్సవం సందర్భంగా, పట్టణంలోని కణపాక మున్సిపల్ ప్రాధమిక పాఠశాలలో, అంగన్‌వాడీ కేంద్రంలో ఆల్‌బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత ఏర్పడుతుందని, వీటిని నిర్మూలించేందుకు 1-19 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితంగా ఆల్‌బెండజోల్ మాత్రలను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఈ మాత్రలను మ్రింగేలా చూడాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమ జిల్లా సమన్వయకర్త డాక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ, నులిపురుగుల నివారణా కార్యక్రమం ఆరునెలలకొకసారి చొప్పున, ప్రతీఏటా రెండుసార్లు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం క్రింద ఏడాది నుంచి 19 ఏళ్లు వయసున్న సుమారు 4.5 లక్షల మందికి ఈ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటిఐలు, పాలిటెక్నిక్‌లు, అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు, ఇంటివద్ద ఉండిపోయిన పిల్లలను కూడా గుర్తించి, మాత్రలను పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు వీరివద్దకు వెళ్లి, మధ్యాహ్నం భోజనం తరువాత మాత్రలను మ్రింగిస్తారని చెప్పారు. ఈ మాత్రలు ఎంతో సురక్షితమైనవని, ఎటువంటి దుష్పరిణామాలు కలగవని ఆయన స్పష్టం చేశారు. ఏడాది నుంచి 2 ఏళ్లు వయసున్న పిల్లలకు 200 మిల్లీగ్రాముల మాత్ర, 2 ఏళ్లు పైబడినవారికి 400 ఎంజి మాత్రను సింగిల్ డోసుగా ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతీఒక్కరూ వినియోగించుకొని, నులిపురుగుల నిర్మూలనకు సహకరించాలని గోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.రాజేశ్వరి, సిడిపిఓ జి.వెంకటేశ్వరి, కెఎల్‌పురం అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ ఉషారాణి, ఆర్‌బిఎస్‌కె జిల్లా మేనేజర్ పి.లోక్‌నాథ్ ప్రశాంత్, పాఠశాల హెచ్ఎం కృష్ణవేణి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ శ్రీవిద్య, అండన్‌వాడీ వర్కర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.