ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అణచివేయాలని చూస్తే భయపడేది లేదని అంగన్వాడీలు హెచ్చరించారు. జనవరి 5 లోగా విధుల్లోకి చేరకపోతే అంగన్వాడీలపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఇచ్చిన నోటీసులను వీరు దగ్ధం చేశారు. మంగళవారం జివిఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమ్మె దీక్షా శిబిరం వద్ద ప్రభుత్వం జారీచేసిన ప్రతులను వీరు దగ్దం చేసి నిరసన తెలియజేశారు. ఈసందర్భంగా సిఐటియు, ఏఐటియుసి, ఇస్ట్ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, అంగన్వాడి యూనియ న్ల ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె నేటికి 22 రోజులకు చేరుకుందని..అయినా ప్రభుత్వం స్పందించకపోగా బెదిరింపులకు దిగడం బావ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వేతనాలు పెంపు, గ్రాట్యూటీ సమస్య మీద స్పందించకపోగా జనవరి 5 లోపల సెంటర్లకు గాని తిరిగి రాకపోతే, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇచ్చిందన్నారు. ఈ రకమైన బెదిరింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల పౌష్టికాహారం గురించి ఆలోచించే ప్రభుత్వం, అంగన్వాడీల బ్రతుకుల గురించి ఆలోచించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో పోల్చుకుంటే రూ.11500 వేతనం ఏమాత్రం సరిపోతుందని ప్రశ్నించారు. ఈ విషయమే గడచిన 4 సంవత్సరాల 8 నెలలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మేము అనేక ప్రయత్నాలు చేశామని అన్నారు. ప్రభుత్వం స్పందించనందునే.. తప్పనిసరి పరిస్థితుల్లో మేము సమ్మె చేస్తున్నామని చెప్పారు. తమ సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న వీరు.. వేతనాలు పెంచే వరకు, గ్రాట్యూటీ ఇచ్చేవరకు ఈ సమ్మె ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఇఫ్ట్ మూడు యూనియన్ల నాయకులు పి. మణి, వై.తులసి, శోభారాణి, వెంకటలక్ష్మి, పాపవేణి, శాంతి, శ్యామల, రామలక్ష్మి , లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.