ఆయనపేరు యలమంచిలి రఘురామ్..పేరు ఎంత సాంప్రదాయంగా ఉందో..అంతకంటే ఎక్కువగా సాంప్రదాయాలకు విలువనిస్తారు..సాంప్రదాయ కళలను, క్రీడలను ప్రోత్సహిస్తారు.. కోలాటం, తాళాల రామభజన, డప్పు దరువులు, తప్పెటగుళ్లు, సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందు నుంచి గ్రామంలో చేసే మేలుకొలుపులు, ఇలా ఒకటి కాదు రెండు కాదు. సాంప్రదాయాలన్నింటికీ గ్రామాన్నే చిరునామాగా చేస్తారు. శ్రీరాముల వారిని పల్లకీలో ఊరేగిస్తూ స్వయంగా ఆయనే కార్యక్రమంలో పాల్గొంటారు. అందరి దృష్టిని ఆకర్షించడానికి మేలుకొలుపు చేసే బృందానికి డ్రెస్ కోడ్ పెట్టి గ్రామంలోని పెద్దలందరూ పాత తరాన్ని గుర్తుచేసుకునే విధంగా అన్నికార్యక్రమాలను ఎంతో చక్కగా నిర్వహిస్తుంటారు. కోలాటానికి చేయూతనిస్తూ.. కళాకారులతో సరిసమానంగా నాట్యమాడతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మరుగున పడిపోతున్న సాంప్రదాయాలన్నింటినీ మళ్లీ అందరికీ పరిచియంచేస్తూ.. వాటి ఉనికి మరుగున పడిపోకుండా తనవంతుగా చేయూత నందిస్తున్నారు. ఎక్కడైనా సంక్రాంతి సమయంలో
గ్రామాల్లో రికార్డింగ్ డాన్సులు, డాన్స్ బేబీ డాన్సులు పెడితే ఈయన మాత్రం కోలాట కళాకారులను ప్రోత్సహించడానికి కోలాటాన్ని ఏర్పాటు చేస్తారు.
ఈయన చేసే కార్యక్రమాలకు యువత, గ్రామ పెద్దలు కూడా ఆవిధంగానే సహకరిస్తారు. గొలుగొండ మండలంలో సిహెచ్.నాగాపురం గ్రామ పంచాయతీ అంటే చాలా చిన్నదే అయినా ఇక్కడ సర్పంచ్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలు ఎంతో చక్కగా ఉండటంతో ఈ గ్రామం పేరు అన్ని ప్రధాన రోజుల్లో మీడియాలో ఎప్పుడూ నానుతూ ఉంటుంది. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించడం దగ్గర నుంచి పంచాయతీ పరిపాలన ప్రజలందరికీ చేరువచేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. ఎక్కడైనా గ్రామ
సర్పంచ్ అంటే రాజకీయంగా కాస్త బిల్డప్ ఉంటుంది. పనిగట్టుకొని వెళ్లి సమస్య విన్నవించుకున్నా..అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తారు. కానీ నాగాపురం గ్రామంలో మాత్రం అంతా చాలా సింపుల్ గా ఉంటుంది. సమస్యను ఈయనదగ్గరకి వెళ్లి చెప్పుకునే అవకాశం ఇవ్వకుండానే, అన్నింటినీ ముందుగానే తెలుసుకొని ప్రజలు సమస్యలు పరిష్కరిస్తారు. తమకు సహాయం చేయాలని వెళ్లి ఎవరికైనా తనవంతుగా సాయహాపడతారు. ఎవరైనా సమస్య అంటూ వస్తే..దానిని పరిష్కరించే వరకూ ఆయన స్వయంగా ఆ పనిపై నిమగ్నమైపోతారు.
ముక్కనుమరోజు ఈ గ్రామంలో జరిగే తీర్ధ మహోత్సవాలకు కూడా చుట్టుప్రక్కల గ్రామపంచాయతీల సర్పంచ్ లను, ఆయా గ్రామాల తోడపెద్దులను గ్రామంలోకి ఆహ్వానించి పూజా కార్యక్రమాలను నిర్వహించి, పక్కగ్రామాల పెద్దలను గౌరవంగా చూస్తారు. సంక్రాంతి సందర్భంగా ముక్కనుమరోజు గ్రామంలో జరిగే తీర్థం సందర్భంగా కొయ్యూరు కోలాట బృందం వారితో చేపట్టిన కళా నృత్య కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కూడా సర్పంచ్ రఘురామ్ ఆధ్యర్యంలో ఎంతో ఉత్సాహంగా చేపట్టింది టీమ్ రఘురామ్ బృందం. ఈ కార్యక్రమంలో యలమంచిలి పెదబాబులు, యర్రాశ్రీనివాసరావు, యర్రా నాగేశ్వర్రావు, యర్రా బాబులు, గంట్ల బుచ్చియ్య, అప్పన దివానం, అప్పర సురేష్, అప్పన క్రిష్ణ, లంక లోవ, లంకశివ, అప్పన చిన్ని, అప్పన రమణ తదితరులు పాల్గొన్నారు.