తూర్పుగోదావరి జిల్లాలో 2021, సెప్టెంబర్‌లో సంభవించిన గులాబ్ తుపాను వల్ల 2,168.07 హెక్టార్లలో పంట నష్టపోయిన 3,100 మంది రైతులకు రూ.3.24 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అందుతున్నట్లు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ వెల్లడించారు. గులాబ్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించే కార్యక్రమాన్ని మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సి.హరికిరణ్ హాజరై జిల్లాలో తుపాను వల్ల నష్టపోయిన రైతులు, దెబ్బతిన్న పంటలు, ఇన్‌పుట్ సబ్సిడీ వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. 2,150.89 హెక్టార్లలో వరి పంట నష్టపోయిన 3,078 మంది రైతులు, 2.10 హెక్టార్లలో పత్తిని నష్టపోయిన అయిదుగురు రైతులు, 15.08 హెక్టార్లలో మినుము పంటను నష్టపోయిన 17 మంది రైతులకు పరిహారం అందినట్లు వెల్లడించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీటమునిగిన పంటకు సంబంధించి క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాల సేకరణ ప్రారంభమైందని తెలిపారు. అదే విధంగా జిల్లాలోని 1,018 రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) ద్వారా ఖరీఫ్-2021 సీజన్ ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇందుకోసం ఆర్‌బీకేల పరిధిలో గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచడం, రవాణా ఏర్పాట్లు వంటివి చేస్తున్నట్లు కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఎన్.విజయ్‌కుమార్, డీడీ (ఏ) ఎస్.మాధవరావు, జేడీ (ఫిషరీస్) శ్రీనివాసరావు, డీడీ (హెచ్) ఎస్.రాంమోహన్, వివిధ ప్రాంతాల రైతులు, అధికారులు పాల్గొన్నారు.
ముఖ్యాంశాలు:
- కాకినాడ, సామర్లకోట, పెదపూడి, కరప, కాజులూరు, కోరుకొండ, గోకవరం, సీతానగరం, యు.కొత్తపల్లి, వీఆర్ పురం
మండలాల్లోని 72 గ్రామాల పరిధిలో వరి పంట నష్టం వాటిల్లిన రైతులకు మంగళవారం ఇన్‌పుట్ సబ్సిడీ అందింది.
- గులాబ్ తుపాను కారణంగా సీతానగరం మండలంలోని ఒక గ్రామం పరిధిలో పత్తికి, అదే విధంగా వీఆర్ పురం మండలంలోని ఓ గ్రామం పరిధిలో మినప పంటకు నష్టం వాటిల్లింది.
- వరి, పత్తి పంట నష్టానికి హెక్టారుకు రూ.15,000 చొప్పున పరిహారం అందగా, మినప పంటకు రూ.10,000 పరిహారం అందింది.
అనపర్తి నియోజకవర్గం పెదపూడికి చెందిన రైతు కోరా వీర్రాజు ..
గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు మాకు దేవాలయాల మాదిరి ఉన్నాయి. మేము అయిదెకరాల సొంత భూమి, మరో అయిదు ఎకరాలను కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నాం. గులాబ్ తుపాను కారణంగా నష్టపోయిన పంటకు మా కుటుంబానికి రూ.90,000 వరకు పరిహారం అందింది. పంట నష్టం జరిగిన 45 రోజుల్లోపే ఇన్‌పుట్ సబ్సిడీ అందుకోవడం సంతోషం కలిగిస్తోంది. ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ-క్రాప్ విధానం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ వంటివి సకాలంలో అందేందుకు ఈ విధానం ఉపయోగపడుతోంది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అందిన ఇన్‌పుట్ సబ్సిడీని రబీ సీజన్‌లో సాగుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంటున్నాయి.