సమాజానికి దిశ నిర్దేశ చేసేది పాత్రికేయులేనని, ప్రజా సమస్యల పరిష్కారంలో వారి కృషి ప్రశంసనీయమని విశాఖ మేయర్ గొలగాని హారి వెంకట కుమారి అన్నారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆదివారం ఆంధ్రాయూనివర్సిటీ వైవీఎస్ మూర్తి ఆడిటోరియం ప్రాంగణంలో నిర్వహించిన మీడియా అవార్డుల ప్రధానోత్సవం, జర్నలిస్టుల పిల్లల ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిరంతరం సమాజానికి సేవలందించే జర్నలిస్టులను ప్రతిభకు ప్రోత్సాహం పేరిట గౌరవించుకోవడం అభినందనీయమన్నారు. దీని వల్ల జర్నలిస్టుల్లో మరింత ఉత్సాహం పెరిగి బాధ్యతా యుతంగా పనిచేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా వైజాగ్ జర్నలిస్టుల ఫోరం తమ సభ్యుల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న విఎంఆర్డిఏ చైర్ పర్సన్ విజయ నిర్మల, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పి వి జి డి ప్రసాద్ రెడ్డిలు మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర అభినందనీయమన్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను గుర్తించి వారు తెలియజేయడం వల్ల అనేక సమస్యలను సకాలంలో పరిష్కరించడంతో పాటు ప్రజలకు కావాల్సిన మౌళిక సదుపాయాలు కలుగజేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఇటీవలే ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించిన వీజెఎఫ్ ఆ తరువాత దీపావళి, ఇప్పుడు ప్రతిభకు ప్రోత్సాహం పేరిట అవార్డులు ప్రధానం చేయడం, జర్నలిస్టుల పిల్లలకు ఉపకార వేతనాలు అందించడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆదర్శనీయంగా నిలుస్తుందన్నారు. గౌరవ అతిధిగా హాజరైన మారిటైమ్ బోర్డ్ చైర్మన్, కాయల వెంకట రెడ్డి మాట్లాడుతూ, నగరాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదన్నారు. సమాజంలో జర్నలిస్టులు చేస్తున్న కృషి వల్ల ప్రజలకు అనేక మంచి పనులు చేయగలుగుతున్నామన్నారు. జీవీఎంసీ పరంగా తాము చేయాల్సిన పనులను ఎప్పటికప్పుడు గుర్తు చేసి ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు నడిపిస్తున్న పాత్రికేయుల సేవలను ఈ సందర్భంగా మేయర్ అభినందించారు. పోరం అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్.దుర్గారావులు మాట్లాడుతూ ప్రతీ ఏటా క్రమం తప్పకుండా ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అవార్డుల ప్రధానోత్సవం, ఉపకార వేతనాలకు సంబంధించి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి అందరికి సమన్యాయం చేస్తున్నామన్నారు. సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, విద్య, వైద్యంతో పాటు క్రీడలకు, పండుగల నిర్వహణ చేపడుతున్నామన్నారు. జర్నలిస్టుల సంక్షేమమే వైజాగ్ జర్నలిస్టుల ఫోరం లక్ష్యమని త్వరలోనే నార్లభవన్ ఆధునీకరించి లిఫ్ట్ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జి ఎస్ ఎన్ రాజు, అవార్డుల కమిటీ చైర్మన్ అర్.నాగరాజుపట్నాయక్ అధ్వర్యంలో బీసీ కమిషన్ సభ్యులు పక్కి దివాకర్, ధ్యక్షులు టి. నానాజీ, జాయింట్ సెక్రటరీ డాడి రవికుమార్, కోశాధికారి పి.ఎస్.మూర్తి, పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఘనంగా మీడియా అవార్డుల ప్రధానోత్సవం..
కపిలగోపాలరావు అవార్డుతో పాటు వివిధ కేటగిరిల్లో విశేష ప్రతిభ కనబర్చిన 31 మంది పాత్రికేయులకు అతిధులు చేతులు మీదుగా ఘనంగా అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు అవార్డు గ్రహీతలు వారి కుటుంబ సభ్యులతో హాజరై అవార్డులను స్వీకరించారు. మీడియా అవార్డుల కమిటీ చైర్మన్ అర్. నాగరాజుపట్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది.
ఉపకార వేతనాలు పంపిణీ ..
జర్నలిస్టుల పిల్లలు విద్యలోనూ ఉన్నతంగా ఉన్నతంగా రాణించి అనేక మందికి ఆదర్శనీయంగా నిలిచారు. దీంతో ప్రతిఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా జర్నలిస్టుల పిల్లలకు సంబంధించి సుమారు 120 మందికి ఉపకార వేతనాలను అతిధులు చేతులు మీదుగా పంపిణీ చేశారు. ఎల్.కె.జీ నుంచి బీటెక్ వరకు ఈ ఏడాది ఉపకార వేతనాలు అందజేశారు. ప్రతిభను గుర్తించాలన్నదే తమ లక్ష్యమని ఫోరం అధ్యక్షులు, స్కాలర్షిప్ కమిటీ చైర్మన్ గంట్ల శ్రీనుబాబు తెలిపారు.
అలరించిన విదేశీయ సాంస్కృతిక కార్యక్రమాలు..
ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమంలో ఈ ఏడాది విదేశీయ కళాకారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. శ్రీలంక నుంచి విచ్చేసిన ప్రత్యేక బృందం ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అదే విధంగా మహారాష్ట్ర, రాజస్థాన్తో పాటు ఒడిషా కళాకారులు, స్థానిక కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రశంసనీయంగా సాగాయి.