ఆర్టీసీలో పనిచేస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని, వారి పట్ల పూర్తి సానుభూతితో ప్రభుత్వం సైతం ఉందనీ, ఆర్టీసీలో ఆర్ధిక ఒడిదుడికలు సర్దుబాటు కాగానే మరో కొద్ది నెలల్లో కారుణ్య నియామకాలను తప్పక చేపడతామని రాష్ట్ర రవాణా, సమాచార. పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు. సోమవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. తొలుత విజయవాడ, పామర్రు , మచిలీపట్నం తదితర ప్రాంతాలకు చెందిన పలువురు ఆర్టీసీ కారుణ్య నియామక అభ్యర్థులు మంత్రిని కలిసి తమ కష్టాలను ఏకరువు పెట్టారు. తమ తండ్రులు, భర్తలు ఆర్టీసీలో పనిచేస్తూ విధి నిర్వహణలో అకాల మత్యువు పాలయ్యారని, గత కొంత కాలంగా కారుణ్య నియామకాలు లేకపోవటంతో తాము ఎంతో ఇబ్బందులకు గురవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా కొన్నేళ్లుగా ఈ నియామకాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కృష్ణాజిల్లాలో 78 మంది, రాష్ట్రంలో 910 మంది కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని మంత్రికి తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ త్వరలోనే వీటి భర్తీ ఉంటుందని వారికి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2016 నుంచి 2020 వరకు కారుణ్య నియామకాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు తిప్పే పరిస్థితి లేదని వివరించారు. అయినా ఉద్యోగుల కుటుంబాల పట్ల సానుభూతితో జగనన్న ప్రభుత్వం త్వరలో కారుణ్య నియామకాలు చేపడతుందన్నారు. సర్వీస్ రూల్స్ పై తుది నిర్ణయానికి పలువురు ఐఏఎస్ అధికారులు ఏకాభిప్రాయానికి గత వారమే వచ్చారన్నారు. ఆర్టీసీ ఎండి, ప్రిన్సిపల్ సెక్రటరీతో తనకు తదుపరి సమావేశం ఉందన్నారు. అనంతరం ఆర్టీసీ త్వరలోనే కారుణ్య నియామకాలను చేపడతామని మంత్రి ఇచ్చిన హామీపై వారు సంతోషం వ్యక్తం చేశారు.
స్థానిక నిజాంపేటకు చెందిన మహంకాళి వీర మల్లమ్మ మంత్రిని కలిసి తన కష్టాన్ని చెప్పుకొంది. తాను చీటీపాటల నిర్వహకురాలినని 20 మందితో లక్ష రూపాయల చీటీ నడుపుతూ ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా ఆయా చీటీపాటలను గత కొన్ని ఏళ్లుగా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నానని, అయితే ఇటీవల కుంచం ఏసు అనే వ్యక్తి 2019 లో ఆరు చీటీలు కట్టకుండా ఆపేడని, అలాగే 2021 లో మరో మూడు చీటీలతో కలిపి మొత్తం 9 కట్టకుండా ఆపేడని తెలిపింది. అదేమని తాను ప్రశ్నిస్త, ఇక కట్టను పొమ్మని నీకు నాకు ఎటువంటి బాకీ లేదని 40 వేల రూపాయలు ఎగవేసే దురుద్దేశంతో మాట్లాడుతున్నాడని , తమ పెద్ద్దలు ఆ వ్యక్తిని పిలిస్తే, తాను 10 వేల రూపాయలకు మించి చెల్లించనని దబాయిస్తున్నాడని మీరే నాకు న్యాయం చేయాలని వీర మల్లమ్మ మంత్రి పేర్ని నానిను అభ్యర్ధించింది.
స్థానిక చిన కరగ్రహారం పల్లెపాలెంలో మోకా బాలచంద్రరావు పంచాయితీలో తీర్మానం లేకుండా అనధికర తాగునీళ్ల కుళాయి ఏర్పాటుచేసుకుని తన దొడ్లోకి పైప్ లైన్ పశువుల కొట్టేం వరకు పొదిగించుకుని తాగునీటిని వృధా చేస్తున్నాడని , ఇటీవల సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ కు సైతం దొరికిపోయాడని కొందరు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక విశ్వబ్రాహ్మణ కాలనీలో అద్దెకుండే మిరియాల కళ్యాణి అనే ఒక మహిళ మంత్రిని కలిసి తన కష్టాన్ని చెప్పింది. తాను ఒక బిర్యాని పాయింట్ సెంటర్లో పని చేసే కార్మికురాలినని కరోనా వ్యాప్తి నేపథ్యంలో చేస్తున్న పని కాస్త పోయిందని, తాను అద్దెకి నివసించే ఇంటి యజమాని అద్దె బకాయి చెల్లించామని తీవ్ర వత్తిడి తీస్తున్నాడని ఇంతటి గడ్డు పరిస్థితులలో 20 వేల రూపాయలు చెల్లించలేనని, నెమ్మదిగా చెల్లిస్తానని ఇంటి యజమానికి మీరు ఒక మాట సహాయం చేయాలని తనకు ఎక్కడైనా హోటల్ లో పని ఇప్పించాలని ఆ మహిళ మంత్రిని కోరింది.