తుఫాను వల్ల దెబ్బతిన్న విద్యుత్ సరఫరా వ్యవస్థ పునరుద్దరణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. విద్యుత్ సరఫరాతోనే అన్ని రకాల సహాయక కార్యక్రమాలు ముడిపడి వుంటాయని అందువల్ల విద్యుత్ సరఫరాను యుద్దప్రాతిపదికన పునరుద్దరించాలని చీఫ్ సెక్రటరీ విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్.ఇ.ని ఆదేశించారు. జిల్లాలో గులాబ్ తుఫాను అనంతర పరిస్థితులు, ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన సహాయక చర్యలపై పరిశీలన నిమిత్తం సోమవారం జిల్లాకు వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో తుఫాను కారణంగా విద్యుత్ సరఫరా వ్యవస్థకు జరిగిన నష్టాలు, పునరుద్దరణ పనులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇ.పి.డి.సి.ఎల్. పర్యవేక్షక ఇంజనీర్ మసిలామణి వివరించారు. జిల్లాలో 33/11 కె.వి. విద్యుత్ సబ్‌స్టేషన్లు 110 పునరుద్దరించామని, 34 పునరుద్దరించాల్సి వుందని, 11 కె.వి. సబ్‌స్టేషన్‌లు 423లో 135 మాత్రమే పునరుద్దరించాల్సి వుందని, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌లు ఇంకో 50 వరకు ఏర్పాటు చేయాల్సి వుందని వివరించారు. ఈరోజు రాత్రికే సరఫరా పునరుద్దరించేలా చర్యలు చేపట్టాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
తాగునీటి సరఫరా పరిస్థితిపై సమీక్షిస్తూ రక్షిత నీటిపథకాల ద్వారా నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను తెలుసుకున్నారు. అన్ని పథకాలకు ప్రత్యామ్నాయ సోర్స్‌లు వున్నాయని, వాటి ద్వారా ఎలాంటి సరఫరా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్.ఇ. శివానందప్రసాద్ వివరించారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా కూడా తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు.
భారీవర్షాలకు సాలూరు మండలం మామిడిపల్లి గ్రామం నీట మునిగిందని, అక్కడ పి.హెచ్.సి. కూడా పూర్తిగా నీటిలో మునిగి వుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. అయితే గ్రామ ప్రజలకు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామని, ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు.
ముఖ్యంగా రహదారులపై వున్న కాజ్‌వేల పైనుంచి నీరు ప్రవహించే చోట రాకపోకలకు అవకాశం లేకుండా అక్కడ కాపలా ఏర్పాటు చేయాలని చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. నీటి ప్రవాహం దాటుకొని వెళ్లే ప్రయత్నం చేయడంవల్ల కొట్టుకొనిపోయే ప్రమాదం వుంటుందని అందువల్ల పోలీసు శాఖ రోడ్లు భవనాల శాఖతో కలసి ఆయా ప్రదేశాల్లో కాపలాదారులను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో రోడ్లు తెగిపోవడం వల్ల బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన గ్రామాలు ఏవైనా వున్నదీ లేనిదీ సి.ఎస్.ఆరా తీశారు. అటువంటి గ్రామాలు ఏమీ లేవని అధికారులు వివరించారు.
జిల్లాలో రిజర్వాయర్ల పరిస్థితిని జలవనరులశాఖ ఉత్తరాంధ్ర చీఫ్ ఇంజనీర్ సుగుణాకరరావు వివరించారు. ప్రాజెక్టుల ద్వారా నీటిని కిందికి విడుదల చేస్తున్నామని, ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఎలాంటి వరదముప్పు లేదని తెలిపారు. విశాఖలో మేఘాద్రిగెడ్డ జలాశయం నుంచి నీటి విడుదల కారణంగా విశాఖ ఎయిర్ పోర్టు ముంపునకు గురయ్యే అంశంపై కూడా చీఫ్ సెక్రటరీ చర్చించారు. మేఘాద్రిగెడ్డ జలాశయం పూర్తిగా నిండిందని జలాశయం నుంచి నీటివిడుదల తప్పదని తెలిపారు. జిల్లాలో చిన్ననీటి చెరువులు పూర్తిగా నిండి వున్నందున వాటికి గండ్లు పడే ముప్పు వుందని తెలిపారు.
వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తతపై కూడా సి.ఎస్. సమీక్షించారు. జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లన్నింటికీ డీజిల్ జనరేటర్లు వున్నాయని జె.సి. డా.మహేష్ కుమార్ తెలిపారు. పి.హెచ్.సిలకు కూడా జనరేటర్లు వున్నాయని విద్యుత్ సరఫరా లేనప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వున్నట్టు చెప్పారు. అన్ని పి.హెచ్.సి.ల పరిధిలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.రమణ కుమారి వివరించారు.
తుఫాను సందర్భంగా నిత్యావసర సరుకులన్నీ డిపోల పరిధిలో అందుబాటులో వుంచామని జె.సి. డా.కిషోర్ కుమార్ వివరించారు. 357 తుఫాను ముప్పు వుండే రేషన్ షాపులను గుర్తించామని, ఈ షాపుల్లో తగినన్ని నిత్యావసర సరుకుల నిల్వలు సిద్ధంచేసి వుంచామన్నారు.
తుఫాను సందర్భంగా పోలీసు యంత్రాంగం ద్వారా కూడా సహాయక చర్యలు చేపట్టాలని డి.ఐ.జి. కాళిదాస్ వెంకట రంగారావు, ఎస్.పి. ఎం.దీపికలకు సూచించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డి.ఆర్.ఓ. ఎం.గణపతిరావు, డిపిఓ సుభాషిణి, వ్యవసాయ శాఖ డి.డి. నంద్, ఉద్యానశాఖ డి.డి. శ్రీనివాసరావు, తోటపల్లి ప్రాజెక్టు ఇ.ఇ. రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.