1 ENS Live Breaking News

రోడ్ల మరమ్మతులు త్వరగా పూర్తిచేయండి..

అనంతపురం నగరంలో రోడ్ల మరమ్మతులు వేగవంతంగా పూర్తి చేస్తామని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగరంలోని సప్తగిరి సర్కిల్ లో జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు పనులను శనివారం  నగర కమిషనర్ పివివిఎస్ మూర్తి తో కలసి మేయర్  పరిశీలించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలో దెబ్బతిన్న రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రస్తుతం  సప్తగిరి సర్కిల్ ,హాస్పిటల్ రోడ్డు, యస్ యస్ ప్యారడైస్ ముందు, ఆర్ట్స్ కాలేజీ వద్ద ,ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర, వేమన టెలిఫోన్ భవన్ వద్ద తదితర ప్రాంతాల్లో ప్యాచ్ వర్క్ పనులు జరుగుతున్నట్లు అధికారులు మేయర్ కు వివరించారు. నాణ్యత తో పనులు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బాలాంజినేయులు, డిఈ కృష్ణారావు, ఏఈ శంకర్,  సెక్రెటరీ కే తేజస్విని తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-09-18 12:12:29

వైఎస్సార్ కంటివెలుగు నిరుపేదలకు వరం..

వైఎస్ఆర్ కంటివెలుగు కార్యక్రమం పేదలకు  వరమని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. అనంతపురం 21 డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ మహాత్మాగాంధీ స్కూల్ లో వైయస్సార్ ఇంటింటా కంటి వెలుగు ఉచిత కంటి పరీక్ష 3వ దశ  కార్యక్రమం ను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్  పాల్గొని చికిత్స లు అందిస్తున్న తీరును పరిశీలించారు. అన్ని అవయవాలు కళ్ళు ఎంతో ముఖ్యమైనవని కంటిచూపు విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. వృద్దులే కాకుండా ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.వై ఎస్ ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ, ఆపరేషన్ లు ఉచితంగా చేస్తారని వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ సూచించారు. కార్యక్రమంలో  కార్పొరేటర్లు చంద్రలేఖ, కమల్ భూషణ్,బాలాంజినేయులు,స్థానిక వైకాపా నాయకులు కుల్లాయి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-09-18 10:17:54

కోవిడ్ 3వ దశను దైర్యంగా ఎదుర్కోవాలి..

కోవిడ్ - 19 మూడవ దశను ఎదుర్కొనుటకు అంతా సిద్ధంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుండి కోవిడ్ - 19 వ్యాక్సినేషన్ పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యదర్శి రాజీవ్ గౌబ ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ నిల్వలు చూసుకోవాలని సూచించారు.   వైద్యులు, సిబ్బంది, మెడిషన్, తదితర వాటిని సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ కార్యక్రమం పక్కాగా జరగాలని, రెండవ డోసు ఖచ్చితంగా వేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. డెంగ్యూ కేసు బలగలో నమోదు అయ్యిందని, కమీషనర్లు శానిటేషన్ జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. జిల్లా నుండి వీడియో కాన్పరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులుతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రనాయక్, మున్సిపల్ కమిషనర్లు శ్రీకాకుళం ఓబులేసు, రాజాం ఆమదాలవలస, పలాస - కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్లు రమేష్, సుధాకర్, రాజగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-18 10:08:31

అప్పన్న ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఈమేరకు సింహాచలం ట్రస్టుబోర్డు ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్లశ్రీనుబాబు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవిత్రోత్సవాల సమయంలో స్వామిని దర్శించుకుంటే తెలిసీ, తెలియక చేసిన తప్పులను స్వామి క్షమిస్తారని నమ్మిక ఉందన్నారు. కరోనా పూర్తిస్థాయిలో సమసిపోయి జనజీవనం సాధారణ మార్గంలోకి రావాలని స్వామిని కోరుకున్నట్టు గంట్ల చెప్పారు. అనంతరం తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

Simhachalam

2021-09-18 08:36:57

బంగారు రథాన్ని పరిశీలించిన చైర్మన్ వైవీ..

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేయించిన బంగారు రథాన్ని చైర్మన్  వైవి సుబ్బారెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీ వినాయక స్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషకరమన్నారు. కాణిపాకం ఆలయం బంగారు రథం నిర్మాణానికి టీటీడీ కి రూ 6 కోట్లు చెల్లించిందని చెప్పారు. ప్రభుత్వ అనుమతితో టీటీడీ తన వద్ద ఉన్న బంగారం ఉపయోగించి రథం నిర్మాణం పూర్తి చేసిందని చెప్పారు. కోవిడ్ కారణంగా రథం నిర్మాణం పనులు ఆలస్యం అయ్యాయని సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా వైరస్ నుంచి ప్రపంచం పూర్తిగా బయట పడాలని స్వామి వారిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు.ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ సారి కూడా ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వారం, పది రోజుల్లో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు పాలక మండళ్ళు నియమించే అవకాశం ఉందని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. న్యాయ పరమైన ఇబ్బందుల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోందన్నారు. టీటీడీ 
ఈఈ  శివరామ కృష్ణ, ఎఈవో  మురళి, స్ధపతి మునిస్వామి రెడ్డి,  కాణిపాకం ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

Kanipakam

2021-09-18 08:28:14

కౌంటింగ్ కేంద్రాలో పూర్తి వసతులుండాలి..

విజయనగరం జిల్లాలో ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద తగినంత గాలి, వెళుతురు , తాగు నీరు ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్  ఏ.సూర్య కుమారి ఆదేశించారు.  చీపురుపల్లి నియోజక వర్గం కు సంబంధించిన చీపురుపల్లి, గుర్ల, మేరకముడిదాం, గరివిడి మండలాల  కౌంటింగ్  ను  ఏర్పాటు చేసిన గరివిడి ఎస్.డి.ఎస్  కళాశాలలో ఏర్పాట్లను  శనివారం కలెక్టర్ తనిఖీ చేశారు.  అక్కడ జరిగుతున్న కౌంటింగ్ శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. సిబ్బంది  అటెండన్స్ , వాక్సినేషన్ వేసుకుంది లేనిదీ అడిగారు. అనంతరం  స్ట్రాంగ్ రూమ్ లను సందర్శించారు. మెరకముడిదాం  జెడ్ పి టి సి ఏకగ్రీవం కాగా మిగిలిన మూడు జెడ్ పి టి సి లు,  ఎం.పి.టి సి  ల కౌంటింగ్ కోసం 10 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి రూమ్ ను తనిఖీ చేసిన కలెక్టర్ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరాన్ని పాటించేలా సీటింగ్ ఏర్పాటు గావించాలన్నారు.   ఎన్నికల ఫలితాలను గేట్ ముందు ప్రకటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు.  ఫలితాల కోసం లోపలకి వచ్చేవారిని  అనుమంతించ వద్దన్నారు.  కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ ప్రతి  పని లో జాగ్రత్త వహించాలన్నారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పని చేయాలన్నారు.  ఈ కార్యక్రమం లో ప్రత్యేక అధికారి, ఫిషరీష్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారి. ఎం.పి.డి.ఓ లు , తహశీల్దార్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-18 08:24:41

సంస్కరణలను కఠినంగా అమలు చేయాలి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో  నూతనంగా తీసుకొచ్చిన సంస్కరణలను కఠినంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శాఖాపరమైన సమీక్షల కోసం శనివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటనకు వచ్చిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజి) ఎంవి శేషగిరిబాబు, డిప్యూటీ సీఎం, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ను వారి నివాసంలో శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శేషగిరిబాబుతో మొక్కను నాటించారు. అనంతరం జరిగిన సమీక్షలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ  నకిలీ చలానాల కేసుల తాజా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యాలయాలను తనిఖీ చేసి భవిష్యత్తులో పొరపాట్లకు అవకాశం లేని విధంగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లాతో పర్యటనను ప్రారంభించడం సంతోషకరమని చెప్పారు. నకిలీ చలానాల రికవరీ వేగిరం చేయాలని, దర్యాప్తును సత్వరమే పూర్తి చేసి నివేదిక అందజేయాలని కోరారు. శనివారం నుంచి పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ఐజి సందర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిజిస్ట్రార్ అర్.సత్య నారాయణ, నరసన్నపేట సబ్ రిజిస్ట్రార్ బీఎస్ఎన్.రమణారావు, సిబ్బంది బాలన్న తదితరులు ఉన్నారు.

Srikakulam

2021-09-18 07:37:54

కాణిపాకం వినాయకుడికి టిటిడి పట్టు వస్త్రాలు..

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి దంపతులు టీటీడీ తరపున శనివారం పట్టువస్త్రాలు సమర్పించారు. కాణిపాకం అతిథి గృహం వద్దకు చేరుకున్న సుబ్బారెడ్డి కి డిప్యూటీ సిఎం  నారాయణ స్వామి, శాసన సభ్యులు ఎం ఎస్ బాబు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ శ్రీ విజయానంద రెడ్డి, కాణిపాకం ఆలయ ఈవో శ్రీ వెంకటేసు స్వాగతం పలికారు.  అనంతరం ఆలయ అర్చకులు టీటీడీ చైర్మన్ తో పాటు డిప్యూటి సిఎం, ఎమ్మెల్యే, ఆర్టీసీ రీజనల్ చైర్మన్, ఆలయ ఈవో కు సాంప్రదాయ బద్దంగా పరివట్టం కట్టి తలమీద పట్టు వస్త్రాలు, పూలమాలలు ఉంచారు. అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య వీరు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని శ్రీ వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు అతిథులకు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో వెంకటేసు టీటీడీ చైర్మన్ దంపతులతో పాటు మిగిలిన అతిథులకు   స్వామి వారి ప్రసాదాలు, చిత్రపటం అందించారు. వకాశం ఉందని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. న్యాయ పరమైన ఇబ్బందుల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోందన్నారు. టీటీడీ ఈఈ  శివరామ కృష్ణ, ఎఈవో  మురళి, స్ధపతి మునిస్వామి రెడ్డి,  కాణిపాకం ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

Kanipakam

2021-09-18 07:30:31

కౌంటింగ్ అయ్యేవరకూ మద్యం బంద్..

విశాఖ జిల్లాలో ఈ నెల 19న ఆధివారం  ఎం .పి.టి.సి., జెడ్.పి.టి.సి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతం మైన వాతావరణంలో సజావుగా నిర్వహణకు  అన్ని రకాల ఏర్పాట్లతో  సిద్దంగా  ఉండాలని అధికారులను  జిల్లా కలెక్టర్  డా. ఎ.మల్లిఖార్జున  ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు.  రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు  ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేవరకు  జిల్లా వ్యాప్తంగా అన్ని మద్యం  దుకాణాలు, బార్ లు, టి.సి.ఎస్ షాపులు, క్లబ్స్, క్యాంటీన్స్, టూరిజం బార్ లు , ఎ.పి.ఎస్.బి.సి.ఎల్ డపాట్స్ మూసివేసి సంపూర్ణ డ్రైడె  పాటించాలని కలెక్టర్  ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా,మద్యం  అమ్మకాలు జరగకుండా పూర్తి నిఘా ఏర్పాటు చేయాల్సిందిగా ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఏ ప్రాంతంలో నైనా నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం అమ్మకాలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే చట్ట ప్రకారం సంబందిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ ప్రకటనలో స్పష్టం చేసారు. 

Visakhapatnam

2021-09-18 05:44:35

స్వాతంత్య్ర స్ఫూర్తి భావిత‌రాల‌కు అందించాలి..

స్వాతంత్య్ర స్ఫూర్తిని భావిత‌రాల‌ను అందించాల‌ని ప‌లువురు వ‌క్త‌లు పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్లు కావ‌స్తున్న త‌రుణంలో దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న‌ అజాదీ కా అమృత్ మ‌హోత్స‌వం, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వ‌ర్యంలో శ‌నివారం విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలో ఘ‌నంగా జ‌రిగింది. ముందుగా స్థానిక మూడులాంత‌ర్లు జంక్ష‌న్ నుంచి ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియం వ‌ర‌కూ ఫిట్ ఇండియా ఫ్రీడం ర‌న్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా 150 అడుగుల భారీ జాతీయ ప‌తాకంతో ప్ర‌ద‌ర్శ‌న చేశారు. ర్యాలీలో చేసిన దేశ‌భ‌క్తి నినాదాల‌తో ప‌ట్ట‌ణం మారుమ్రోగింది. ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియంలో తెలుగుత‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం జ‌రిగిన అమృతోత్స‌వ‌ స‌భ‌కు జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ సందర్భంగా ఆమె అధ్య‌క్షోప‌న్యాసం చేస్తూ, స్వాతంత్య్ర స్ఫూర్తిని పునఃశ్చ‌ర‌ణ చేసుకొని, దేశ‌ప్ర‌జ‌లు పున‌రంకితం అయ్యేందుకు ఈ ఉత్స‌వాలు దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని అన్నారు. అప్ప‌టి త‌రం స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారితో  పోరాడార‌ని, నేటి త‌రం త‌మ‌లో తాము అంతర్యుద్దం చేయాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌ని అన్నారు. మ‌న‌లో మ‌నకి ఉన్న విబేధాలు, అహంకారాన్ని ప్ర‌క్క‌న‌పెట్టి, అంతా క‌లిసి ఐక్యంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచించారు. కుల‌మ‌త‌, ఆడ‌, మ‌గా అన్న తేడాలు లేకుండా, మ‌న‌మంతా భార‌తీయుల‌మ‌న్న భావ‌న ప్ర‌తీఒక్క‌రిలో బ‌ల‌ప‌డాల‌ని, అప్పుడే దేశం అభివృద్ది ప‌థాన ముందుకు వెళ్తుంద‌న్నారు. భార‌తీయ‌త ఒక‌ ఆభ‌ర‌ణ‌మ‌ని, మ‌న భార‌తీయ సంప్ర‌దాయం మ‌హోన్న‌త‌మైన‌ద‌ని, దానిని ప్ర‌తీఒక్క‌రూ గౌర‌వించాల‌ని కోరారు.  స్వేచ్ఛ‌, స్వాతంత్య్ర ఫ‌లాలను నేటి త‌రానికి అందించాల‌ని సూచించారు. సోష‌ల్ మీడియాలో క‌నిపించేవ‌న్నీ నిజాలు కావ‌ని, అందువ‌ల్ల యువ‌త‌రం స్వీయ నియంత్ర‌ణ‌, క్ర‌మ‌శిక్ష‌ణ పాటించాల‌ని, గుర‌జాడ స్ఫూర్తితో పొరుగువాడికి సాయ‌ప‌డే త‌త్వాన్ని అల‌వ‌ర్చుకోవాల‌ని క‌లెక్ట‌ర్‌ పిలుపునిచ్చారు.

            కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌రైన విజ‌య‌న‌గ‌రం శాస‌న స‌భ్యులు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి మాట్లాడుతూ, అజాదీ కా అమృతోత్స‌వం ప్ర‌తీభార‌తీయుడు గ‌ర్వంగా జ‌రుపుకొనే కార్య‌క్ర‌మంగా పేర్కొన్నారు. ఈ ఉత్స‌వాల స్ఫూర్తితో దేశాభివృద్దిలో ప్ర‌తీఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని కోరారు. నేటి యువ‌త‌పైనే మ‌న దేశ పునాదులు ఆధార‌ప‌డి ఉన్నాయ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. బాధ్యాతాయుతంగా మెల‌గ‌డం ద్వారా, ఆద‌ర్శ‌వంత‌మైన స‌మాజాన్ని సృష్టించుకోవ‌చ్చున‌ని, త‌ద్వారా గ‌ణ‌నీయ‌మైన పురోభివృద్దిని సాధించ‌వ‌చ్చ‌ని సూచించారు. నాటి నుంచి నేటి వ‌ర‌కూ, ప్ర‌ధాన మంత్రులు, ముఖ్య‌మంత్రులు అభివృద్ది కోసం కృషి చేస్తున్నార‌ని చెప్పారు. గౌర‌వ‌ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి, విద్య‌, వైద్యానికి పెద్ద‌పీట వేస్తూ, సంక్షేమ‌, అభివృద్ది ఫ‌లాల‌ను రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌కు అందించేందుకు నిరంత‌రం కృషి చేస్తున్నార‌ని కోల‌గ‌ట్ల‌ కొనియాడారు.

             ఉపాధ్యాయ ఎంఎల్‌సి పాల‌క‌పాటి ర‌ఘువ‌ర్మ మాట్లాడుతూ, మ‌న దేశంలో  పాటించే విలువ‌లు, స్త్రీశ‌క్తికి ఇచ్చే గౌర‌వం, మ‌న‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. విభిన్న సంస్కృతులు, కులాలు, మ‌తాలు, ప్రాంతాలతో అల‌రారే భార‌త‌దేశం ఒక చిన్న ప్ర‌పంచం లాంటిద‌ని పేర్కొన్నారు.  75 ఏళ్ల క్రితం మ‌న పెద్ద‌లు స్వాతంత్య్రం అనే మ‌హా వృక్షాన్ని నాటార‌ని, వాటి ఫ‌లాల‌ను మ‌నం ఇప్పుడు అనుభ‌విస్తున్నామ‌ని అన్నారు. స్వావ‌లంబ‌న‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌, ప‌ర‌స్ప‌ర తోడ్పాటు ద్వారా మ‌నం అభివృద్దిని సాధించ‌వ‌చ్చ‌ని సూచించారు. న‌గ‌ర మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి మాట్లాడుతూ, స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి త‌రానికి అందించ‌డానికే ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని అన్నారు. రోట‌రీక్ల‌బ్ ప్రెసిడెంట్ డాక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్రావు, కాపుగంటి ప్ర‌కాష్ త‌దిత‌ర ప్ర‌ముఖులు మాట్లాడారు.

            కార్య‌క్ర‌మంలో డిప్యుటీ మేయ‌ర్ ఇస‌ర‌పు రేవ‌తీదేవి, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా, సంక్షేమం) జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఎస్ ఎస్ వ‌ర్మ‌, ఎన్‌వైకె యూత్ కో-ఆర్డినేట‌ర్ విక్ర‌మాధిత్య‌, సెట్విజ్ సిఇఓ వి.విజ‌య‌కుమార్‌, డిఆర్‌డిఏ పిడి అశోక్‌, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వ‌రి, డిపిఓ సుభాషిణి, మెప్మా పిడి సుధాక‌ర‌రావు, డిఎస్‌డిఓ వెంక‌టేశ్వ‌ర్రావు, ఇత‌ర అధికారులు, ప‌లువురు కార్పొరేట‌ర్లు, ఎన్‌సిసి కేడెట్స్‌, రోట‌రీ ప్ర‌తినిధులు, వివిధ స్వ‌చ్ఛంద సంస్థ‌లు, యువ‌జ‌న సంఘాల‌ ప్ర‌తినిధులు, పెద్ద సంఖ్య‌లో విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-18 05:33:59

శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాల‌కు అంకురార్ప‌ణ‌..

డా.వైఎస్‌ఆర్‌ జిల్లా దేవుని కడప శ్రీలక్ష్మీ  వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప‌విత్రోత్స‌ వాల‌కు శుక్ర‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ఫ‌ణ నిర్వ‌హించారు. ఇందుకోసం సాయంత్రం 6 గంట‌ల‌కు విష్వక్సేనపూజ, పుణ్యాహ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, మృత్సం గ్రాహ‌ణం, అంకురార్పణ జ‌రిగింది.సెప్టెంబరు 18వ తేదీ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చ‌తుష్ఠార్చ‌న‌, యాగశాలపూజ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు నిత్య హోమం నిర్వహిస్తారు. సెప్టెంబరు 19వ తేదీ ఉదయం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 6 గంటలకు పవిత్ర హోమం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 20న ఉదయం 6 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ త‌దిత‌ర కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఆల‌యంలో స్వామి, అమ్మవార్లను ఊరేగించ‌నున్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో ఏఈవో మురళీధర్ , టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Devuni kadapa temple

2021-09-17 14:30:40

శ్రీకాకుళం జిల్లాలో కౌంటింగుకు సర్వం సిద్ధం..

శ్రీకాకుళంజిల్లాలో ఈ నెల 19వ తేదిన జరగనున్న జెడ్.పి.టి.సి, యం.పి.టి.సి  ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో  శుక్రవారం జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పదిచోట్ల ఓట్ల లెక్కింపు జరగబోతుందని, అన్ని లెక్కింపు కేంద్రాలకు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. లెక్కింపు గదుల్లో బారికేడింగ్, స్ట్రాంగ్ రూం నుండి లెక్కింపు గదుల వరకు బారికేడింగ్, బందోబస్తు, సిబ్బంది తదితర ఏర్పాట్లను ఇప్పటికే సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. 19వ తేదీ ఉదయం 8.00 గం.లకు ఓట్లలెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. కావున సిబ్బంది, ఏజెంట్లు ఉదయం 6.00 గం.ల నాటికి సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీచేయడం జరిగిందని చెప్పారు. ప్రతి కౌంటింగ్ హాల్ లో వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డింగ్, జనరేటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, సిసి టి.విలు ఇప్పటికే పనిచేస్తున్నాయని, అవి కొనసాగుతాయని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ నేపధ్యంలో కోవిడ్ నియమ నిబంధనలు పక్కాగా పాటించాలని స్పష్టం చేసినట్లు కలెక్టర్ చెప్పారు. ప్రతి టేబుల్ కు ఒక పర్యవేక్షక అధికారి, ముగ్గురు సిబ్బంది ఉంటారని, వీరితో పాటు రిజర్వ్ సిబ్బందిని కూడా సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో 38 మండలాలకు గాను జెడ్.పి.టి.సి అభ్యర్ధి మరణించడంతో ఒక జెడ్.పి.టి.సి స్థానానికి ఎన్నిక జరగనందున 37 మండలాల జెడ్.పి.టి.సిలకు గాను 37 టేబుళ్లను ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా 667 ఎం.పి.టి.సి స్థానాలకు గాను 66 మంది ఏకగ్రీవం కాగా , మరో 11 చోట్ల ఎం.పి.టి.సి అభ్యర్ధులు మరణించడంతో మిగిలిన 590 స్థానాలకు గాను 590 టేబుళ్లను ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ స్పష్టం చేసారు. జిల్లావ్యాప్తంగా 68 కౌంటింగ్ హాళ్లను , 612 కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం 854 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లను, 863అసిస్టెంట్ సూపర్ వైజర్లను, 2,584 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను  వెరశి 4,301 మంది సిబ్బందిని కౌంటింగ్ ప్రక్రియకు నియమించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు, సిబ్బందికి వేక్సినేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. శనివారం ఉదయం 7.00 గం.లకు కౌంటింగ్ కేంద్రాల వద్దకు కౌంటింగ్ సిబ్బంది హాజరవుతారని, వారికి కౌంటింగ్ ప్రక్రియపై పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు.  పోటీచేసిన అభ్యర్థుల నుండి ఏజెంట్ల వివరాలు తీసుకోవాలని, పోలీస్ శాఖతో సమన్వయం చేస్తూ అర్హులకు పాసులు జారీచేసే విధంగా ఆదేశాలు జారీచేయడం జరిగిందని అన్నారు. ప్రతీ కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 50 మీటర్లు, వంద మీటర్ల చొప్పన రెండంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ చెప్పారు. కౌంటింగునకు సంబంధించి జిల్లా స్థాయి కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. లెక్కింపు అనంతరం గెలుపొందిన అభ్యర్థులు ఎటువంటి ఊరేగింపులు, ఉత్సవాలు నిర్వహించుటకు అనుమతి లేదని, మైక్ లను వినియోగించరాదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పాత్రికేయుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-09-17 13:58:33

డెంగ్యూ జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి..

మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజలు డెంగ్యూ, మలేరియా వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జివిఎంసి అదనపు కమిషనర్ డాక్టర్ వి.సన్యాసిరావు విజ్ఞప్తి చేసారు. శుక్రవారం “డ్రై డే” సందర్భంగా ఆయన 2వ జోన్ 10వ వార్డు పరిధిలో ఐ.ఎస్.జి. నగర్, పాండురంగాపురం, ఆరిలోవ ఎఫ్.ఆర్.యు. సెంటర్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పాండురంగాపురంలోని డెంగ్యూ వ్యాధి సోకిన ఐ. చాణక్య ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డెంగ్యూపై తీసుకోవలసిన జాగ్రత్తలను కుటంబ సభ్యులకు వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాండురంగాపురం పరిసరాలలో ఫాగింగ్, స్ప్రేయింగ్ చేయాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని, ప్రతి ఇంటికి వెళ్లి జ్వర బాధితులను గుర్తించాలని, ప్రతి ఇంటికి అతికించిన స్టిక్కర్ పై సంతకం చేయాలని మలేరియా సిబ్బందిని, వార్డు సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. “డ్రై డే” సందర్భంగా అవగాహనా ర్యాలీలు జరిగే విధానాన్ని పరిశీలించారు. అనంతరం, ఆరిలోవ ఎఫ్.ఆర్.యు. సెంటర్ ను సందర్శించి, వ్యాక్సినేషన్ వేయు ప్రక్రియను పరిశీలించారు. 18 సం. లు పై బడిన, అర్హత గల ప్రతీ ఒక్కరికి మొదటి, రెండవ డోస్ వేయాలని, సిబ్బందిని ఆదేశించారు. ఎఫ్.ఆర్.యు. సెంటర్ పరిసరాలలో మరుగుదొడ్లు, శుభ్రంగా ఉంచాలని శానిటరీ సిబ్బందిని ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, శానిటరీ సూపర్వైజర్ రమణ, శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు, మలేరియా సిబ్బంది, వార్డు సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.  

విశాఖసిటీ

2021-09-17 13:45:36

కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే కౌంటింగ్..

కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ ఓట్ల లెక్కింపు నిర్వ‌హించడం జరుగుతుందని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీమతి ఎ. సూర్య‌కుమారి తెలిపారు.  కౌంటింగ్ సమయం లో  ప్రజలు గుమిగూడి ఉండకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో  పరిషత్తు ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని తెలిపారు. కౌంటింగ్  అనంతరం కూడా విజేతలు రాలీలను చేయకూడదని స్పష్టం చేసారు.   ఈనెల 19న నిర్వహించనున్న జడ్పి టిసి,ఎంపిటిసి ఓట్ల లెక్కింపుపై శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఎస్.పి దీపిక ఎం.పాటిల్  తో కలసి పాత్రికేయుల సమావేశం లో మాట్లాడారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ   జిల్లాలో 549 ఎం.పి.టి.సి స్థానాలకు గాను 55 స్థానాల్లో ఏకగ్రీవం అయినాయని, 34  జెడ్.పి.టి.సి  లకు గాను 3 ఏకగ్రీవం అయినాయని తెలిపారు.  34 మండలాలకు గాను 31 చోట్ల  కౌంటింగ్  ప్రక్రియ  జరుగుతోందన్నారు.  కౌంటింగ్ కోసం 83 హాల్స్ నందు 820  టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు.  ఇందు కోసం 34 మంది ఆర్.ఓ లు, 88 మంది ఎ.ఆర్.ఓ లు, 956 మంది కౌంటింగ్ పర్యవేక్షకులు, 1872 మంది కౌంటింగ్ అసిస్టెంట్ లు, 75 మంది స్ట్రాంగ్  రూం ఇంచార్జ్ లను నియమించడం జరిగిందన్నారు. .  కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించుకొని ఉండాలన్నారు.  ఇప్ప‌టికే వివిధ ద‌శ‌ల్లో సిబ్బందికి శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రిగింద‌ని, శుక్ర‌, శ‌నివారాల్లో తుదివిడ‌త శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన  మూడంచెల బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్.పి దీపిక పాటిల్ తెలిపారు. ర్యాలీల కోసం అనుమతి లేదని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. కౌంటింగ్ వద్ద   సిసి కెమెరాలు, డ్రోన్స్, వీడియో గ్రఫీ ద్వారా పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. అవసరమైన చోట రోప్ పార్టీ లను ఏర్పాటు చేస్తామన్నారు. రెండు డివిజిన్లలో  ఇద్దరు అదనపు ఎస్.పి లను ఇంచార్జ్ లుగా పర్యవేక్షిస్తారని అన్నారు.  కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్ కుమార్‌, జె.వెంక‌ట‌రావు, జెడ్‌పి సిఇఓ టి.వెంక‌టేశ్వ‌ర్రావు పాల్గొన్నారు.

Vizianagaram

2021-09-17 13:41:18