1 ENS Live Breaking News

వచ్చే బ్రహ్మోత్సవాలనికి అనువాదం పూర్తిచేయాలి..

తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో పురాణ ఇతిహాస ప్రాజెక్టు నేతృత్వంలో జరుగుతున్న అష్టాదశ పురాణాల అనువాద కార్యక్రమం వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి చేయాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి పండిత మండలిని ఆదేశించారు.   శ్వేత భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన పండిత మండలితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  ఈవో మాట్లాడుతూ, అష్టాదశ పురాణాల్లో ఇప్పటిదాకా నాలుగు పురాణాల అనువాదం పూర్తయిందని,  మిగిలిన 14 పురాణాల అనువాద కార్యక్రమం వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిచేయాలని చెప్పారు. ఇందుకోసం అవసరమైతే మరింతమంది పండితుల సేవలను ఉపయోగించుకోవాలని చెప్పారు.  పండిత మండలి సభ్యులు  ప్రస్తుతం నెలకు వారం రోజులు ఈ కార్యక్రమం మీద పనిచేస్తున్నారని చెప్పారు.  ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 10వ  తేదీ దాకా పండితులను పిలిపించి పురాణాల అనువాద కార్యక్రమం వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పురాణ అనువాద కార్యక్రమం కోసం తిరుపతికి వచ్చే పండితుల తో పాటు,  వారి భార్యకు కూడా ఉచిత వసతి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.  శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రస్తుతం ప్రసారమవుతున్న గరుడ పురాణం పారాయణానికి విశేష స్పందన వస్తోందని ఈవో చెప్పారు. కోవిడ్  మొదటి  ప్రారంభమైనప్పటి నుంచి తిరుమలలో నిర్వహించిన సుందరకాండ, భగవద్గీత, విరాటపర్వం  పారాయణాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆయన మండలికి చెప్పారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా పద్దెనిమిది పురాణాలను  ప్రసారం  చేస్తామన్నారు. పండిత మండలి సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యే రీతిలో పురాణాల అనువాదం చేయాలన్నారు.  నేటి తరానికి పురాణ,  ఇతిహాసాల గురించి తెలియజేసి వారిని సరైన మార్గంలో పయనించేలా ప్రయత్నం చేయడం టిటిడికే సాధ్యమవుతుందని ఈవో జవహర్ రెడ్డి వివరించారు. సనాతన ధర్మ ప్రచారం కోసం పండిత మండలి పురాణ అనువాద కార్యక్రమాన్ని నిర్దేశిత సమయం లోపు పూర్తిచేయాలని ఆయన చెప్పారు.  పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ,  శ్వేత డైరెక్టర్ డాక్టర్ రామాంజులు రెడ్డి,  పండిత పరిషత్ సభ్యులు శ్రీ సముద్రాల లక్ష్మణయ్య,  శ్రీపాద సత్యనారాయణ మూర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఈవో పండిత మండలి సభ్యులకు శ్రీవారి ప్రసాదాలను అందించారు.

Tirumala

2021-09-24 13:09:08

ట్రస్ట్ బోర్డు స‌భ్య‌కార్య‌ద‌ర్శిగా టిటిడి ఈఓ..

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్య‌కార్య‌ద‌ర్శిగా డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి శుక్ర‌వారం తిరుమల శ్రీ‌వారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద ఉద‌యం 10.05 గంట‌ల‌కు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో బోర్డు స‌భ్యుల‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అద‌న‌పు ఈఓ అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి జెఈవో  స‌దా భార్గ‌వి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, డెప్యూటీ ఈవోలు రమేష్ బాబు,  సుధారాణి, లోక‌నాథం, పేష్కార్  శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-09-24 12:23:44

సిటిజన్ ఔట్ రీచ్ ను పరిశీలించిన కమిషనర్..

ప్రభుత్వ సేవలు ప్రజలకు తెలిసేలా సిటిజన్ ఔట్ రీచ్ కార్యక్రమం చేపట్టాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్  దినకర్ పుండ్కర్ సచివాలయ సిబ్బంది ఆదేశించారు. శుక్రవారం కాకినాడలోని 20వ వార్డులో ఈ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయం ద్వారా సేవలను మరింత ప్రభావవంతంగా ప్రజలకు చేరవేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ సేవలను మరింత ప్రభావవంతంగా ప్రజలకు చేరవేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగరపాలక సంస్థ అదనపు కమిషనర్  సి.హెచ్. నాగ నరసింహారావు    మాట్లాడుతూ  సచివాలయం ద్వారా అందిస్తున్న పథకాలను ,సేవలను పొందుతున్న విధానాన్ని గురించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని స్వయంగా  విచారించారు. సచివాలయ సిబ్బంది తాలూకు ఫోన్ నెంబర్లను ప్రతి ఇంటికి అందాయో లేదో వాకబు చేశారు. ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్  సత్యనారాయణ గారు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2021-09-24 10:12:01

మాట నిలబెట్టుకు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి..

కురుపాం నియోజకవర్గంలోని నాగావళి నదిపై కొమరాడ మండలంలో నిర్మిస్తున్న పూర్ణపాడు –లాబేసు వంతెన నిర్మాణానికి అవసరమైన అదనపు నిధులను మంజూరు చేయిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న ఈ వంతెన నిర్మాణానికి పుష్ప శ్రీవాణి చొరవతో ప్రభుత్వం రూ.14 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కొమరాడ మండలంలోని పూర్ణపాడు-లాబేసు గ్రామాల మధ్యన అసంపూర్తిగా ఉన్న వంతెనను గత ఏడాదిలో అధికారులతో కలిసి పుష్ప శ్రీవాణి సందర్శించి నిలిచిపోయిన పనులను పరిశీలించిన విషయం  తెలిసిందే. కొమరాడ మండలంలో మొత్తం 31 పంచాయితీలు ఉండగా వాటిలో 22 పంచాయితీలు నాగావళి నదికి ఒకవైపున ఉన్నాయని, మరో 9 పంచాయతీలు మరోవైపున ఉన్నాయి. అయితే నాగావళి  నదిపై వంతెన లేనికారణంగా 9 పంచాయతీలకు చెందిన ప్రజలు మండల కేంద్రమైన కొమరాడ కు రావాలన్నా, 22 పంచాయతీలకు చెందిన గ్రామస్తులు నియోజకవర్గకేంద్రమైన కురుపాం కు చేరుకోవాలన్నా చుట్టూతిరిగి రావాల్సి ఉంటుంది. ఈ గ్రామాల ప్రజలు పార్వతీపురం మీదుగా చుట్టుతిరిగి రావడానికి 50-60 కిలోమీటర్ల దాకా వెళ్లాల్సివస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగావళి నదిపై పూర్ణపాడు-లాబేసు గ్రామాలమధ్యన నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణం పూర్తయితే కొమరాడ మండలానికి చెందిన అన్ని పంచాయితీల ప్రజలు ఆరు, ఏడు కిలోమీటర్ల ప్రయాణంతోనే అటు కొమరాడకు, ఇటు కురుపాంకు చేరుకుంటారని, ఎన్నోఏళ్లుగా ఈ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు కూడా తీరి పోతాయని కొమరాడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే ఇంత ప్రాధాన్యత కలిగిన వంతెన నిర్మాణాన్ని గత టిడిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, మంజూరు చేసిన నిధులు కూడా రాకపోవడంతో ఈ వంతెన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. ఈ కారణంగా నిర్మాణంలో జరిగిన ఆలస్యం తో రూ. 10 కోట్ల అంచనాతో మొదలైన ఈ వంతెన నిర్మాణ వ్యయం రూ. 14 కోట్లకు చేరిందని, దీనికి అవసరమైన అదనపు నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఈ సందర్భంగానే అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. అయితే నిధుల మంజూరులో జాప్యం కారణంగా వంతెన నిర్మాణంలో ఆలస్యం జరగడానికి వీల్లేదని స్పష్టం చేసిన పుష్ప శ్రీవాణి ఎక్కువగా గిరిజన ప్రాంతాల ప్రజలకు మేలుచేసే ఈ వంతెన నిర్మాణానికి ట్రైబల్ సబ్ ప్లాన్ నుంచి నిధులు కేటాయిస్తామని, రాబోయే నోడల్ ఏజెన్సీ సమావేశంలోనే దీనికి అనుమతిని తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రకారంగా ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుంచి ఈ వంతెన నిర్మాణానికి రూ.7 కోట్లను కేటాయించారు. ఇది కాకుండా పంచాయితీ రాజ్ శాఖ ద్వారా మరో రూ.7 కోట్లను కూడా కలుపుకొని మొత్తం రూ.14 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్.500 ను జారీ చేసింది. ఈ నిధుల మంజూరుతో పూర్ణపాడు –లాబేసు వంతెన నిర్మాణానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. దీంతో నాగావళి నదిపై వంతెన నిర్మాణం కోసం కొమరాడ ప్రజలు కంటున్న కల కూడా నెరవేరనుంది.

Kurupam

2021-09-24 09:51:20

సత్యదేవుని బంగీ ప్రసాదం రేట్లు పెంపు..

అన్నవరం రత్నగిరి శ్రీశ్రీశ్రీ వీరవెంకట సత్యన్నారాయణ స్వామివారి ప్రసాదం ఇక ప్రయం అయ్యింది. స్వామివారి బంగీప్రసాదం రూ.15 నుంచి 20కి పెంచుతూ పాలకవర్గం ఆమోదం తెలిపిందని ఈఓ వేండ్ర త్రినాధ్ తెలియజేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెంచిన రేట్లు ఈరోజు నుంచే అమల్లోకి వస్తాయని ఈఓ ప్రకటించారు. ఈ మేరకు అన్ని కౌంటర్ల పెంచిన రేట్లను ప్రదర్శిస్తున్నట్టు ఆయన వివరించారు.భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ముడి సరుకు ధరలు పెరిగిన కారణంగా రాష్ట్ర అధికారుల సూచనల మేరకు పెంచి ట్రస్టుబోర్డులో తీర్మానించినట్టు  ఈఓ మీడియాకి వివరించారు.

Annavaram

2021-09-24 09:14:19

జర్నలిస్టుల సంక్షేమ బాధ్యత ప్రభుత్వాలదే..

జర్నలిస్టుల సంక్షేమ బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలదేనని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సామాజిక ఉద్యమ కారులు బొలిశెట్టి సత్యనారాయణ(సత్య) అన్నారు. శుక్రవారం ఇక్కడి పోర్టు స్డేడియంలో వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్‌, విస్జా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నీ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈసందర్భంగా బోలిశెట్టి మాట్లాడుతూ మూడు దశాబ్ధాలకుపైగా జర్నలిస్టుల సంక్షేమానికి వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం కృషి చేస్తుందన్నారు.క్రమం తప్పకుండా ఇంటర్‌ మీడియాతో పాటు రాష్ట్రస్దాయి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కరోనా విపత్తు సమయంలో జర్నలిస్టులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత సంబంధిత ప్రభుత్వాలపై ఉందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన  విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రాంబాబు మాట్లాడుతూ విమ్స్‌లో జర్నలిస్టులకు ప్రత్యేకంగా వైద్యసేవలందించడంతో పాటు, వెయ్యి రూపాయాల వరకూ అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తామన్నారు. కొవిడ్‌ సమయంలో కూడా అధిక సంఖ్యలో జర్నలిస్టులకు స్పెషల్‌ కేర్‌ తీసుకుని వైద్యం అందించామని, ప్రస్తుతం విమ్స్‌లో ఆధునాతన వైద్యసేవలందిస్తున్నామన్నారు. పేదల వైద్యులు, లక్ష్మీగాయిత్రి అధినేత డాక్టర్‌ కాండ్రేగుల రామ్‌కుమార్‌ మాట్లాడుతూ జర్నలిస్టులకు తమ వంతు సహయ,సహకారాలు ఎప్పుడూ అందిస్తామన్నారు.విజెఎఫ్‌ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజెఎఫ్‌ అధ్యక్ష,కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్‌, దుర్గారావులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తామ పాలకవర్గం పనిచేస్తుందన్నారు. విద్య, వైద్యంతో పాటు క్రమం తప్పకుండా రాష్ట్ర, జిల్లా స్థాయి ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ మీట్‌లు నిర్వహించిన ఘనత  విజెఎఫ్‌కే దక్కుతుందన్నారు. దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమ సంఘాలకు ఆదర్శవంతంగా విజెఎఫ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.  విజెఎఫ్‌ ఉపాధ్యక్షులు ఆర్‌.నాగరాజు పట్నాయక్‌ స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌, స్పోర్ట్స్‌ జర్నలిస్టుల అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉమాశంకర్‌బాబు,నాగబొయిన నాగేశ్వరరావు,పైల భాస్కరరావు సభ్యులు దొండా గిరిబాబు, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, ఇరోతి ఈశ్వరరావు, ,పైలా దివాకర్‌, శేఖర్‌ మంత్రి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-09-24 07:51:55

ఉత్పత్తుల ఎగుమతులకు సబ్ కమిటీలు..

సీఫుడ్స్, మెరైన్ ఉత్పత్తులు, ఫార్మా, కాయర్ మొదలైన రకాలను  అభివృద్ది చేసి ఎగుమతులను చేపట్టడానికి  సబ్ కమిటీల ఏర్పాటు కు చర్యలు చేపట్టాలని జిల్లా పరిశ్రమలు, మరియు ఎగుమతుల ప్రోత్సాహక  కమిటి (డిఐఇపిసి) చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున సంబందిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో డిఐఇపిసి సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ఫార్మా , బల్క్ డ్రగ్స్ ఎగుమతులకు సంబందించి ప్రతి 10 రోజులకు  సబ్ కమిటీలు సమావేశాలను నిర్వహించాలన్నారు.  వీటికి సంబందించి కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్  రామలింగరాజు మాట్లాడుతూ  జిల్లాలో ఫార్మాకంపెనీలు 120 యూనిట్లు ఫార్మా హబ్ గా ఏర్పాటయ్యాయని,  మరో 50 ప్రతిపాదనలు  వివిద దశలలో  ఉన్నాయన్నారు. అచ్చుతాపురం ఎస్.ఇ.జెడ్ లో 27 కంపెనీలు నిర్మాణపు పనులలో  ఉన్నాయని, ఏడు  కంపెనీలు ప్రోడక్షన్ కు సిద్దంగా ఉన్నాయన్నారు. సీఫుడ్, మెరైన్ ప్రోడక్ష్స్ సబ్ కమిటి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2,16,457 మెట్రిక్ టన్నుల  సీఫుడ్ ను వైజాగ్ పోర్టు ద్వారా ఎగుమతి చేయడం జరిగిందన్నారు. సింగిల్ డస్క్ పోర్టల్ లో 26.8.2021 నుండి 22.09.2021 నాటికి 90 దరఖాస్తులు వచ్చాయని  56 దరఖాస్తులను ఆమోదించగా మిగిలినవి పెండింగ్ లో ఉన్నాయన్నారు.  2010-15 & 2015-20 సంవత్సరాలలో  ఎం .ఎస్.ఎం .ఇ ఆన్ లైన్ క్లెయింలు 21-9-2021 నాటికి 82 క్లెయింలు రాగా 70 క్లెయింలకు రూ.4,83,46,867/-లకు  ఆమోదించడం జరిగిందని, 12క్లెయింలు  రిజక్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలోఎ.పి.ఐ.ఐ.సి, జి.వి.ఎం.సి., వి.ఎం.ఆర్.డి.ఎ.,    ట్రాన్స్ కో, ప్యాక్టరీలు, పొల్యూషన్, ఫైర్, తదితర శాఖల అధికారులు, కమిటీ మెంబర్లు హాజరైయారు .

Visakhapatnam

2021-09-23 13:38:03

డ్రైనేజీల్లో బాటిల్స్, చెత్త వేస్తే కఠిన చర్యలు..

సింహగిరిపైనున్న డ్రైనేజీల్లో వాటర్ బాటిల్స్, చెత్త చెదారం, ప్లాస్టిక్ వేస్తే కఠన చర్యలు తీసుకుంటామని షాపులనిర్వాహకులు ఈఓ ఎంవీ సూర్యకళ హెచ్చరించారు. గురువారం సింహరిపై డ్రేనేజీలు పరిశుభ్రతను ఆమె పరిశీలించారు.  కొన్ని షాపుల వద్ద చెత్తను ఉండటాన్ని ఆమె గమనించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, షాపుల నిర్వహాకులు చెత్త డంప్ చేస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు. షాపు నుంచి వచ్చిన చెత్తా చెదారాన్ని డస్టు బిన్స్ ఏర్పాటుచేసుకుని వారే కిందకి తీసుకెళ్లాలని చెప్పారు. డ్రైనేజీల్లో కవర్లు, ప్లాస్టిక్ , చెత్త ఉండటాన్ని ఆమె చూశారు. కొంతమంది బల్క్ గా చెత్త డప్ చేస్తున్నారన్న నిర్దారణకు వచ్చారు. షాపులవారితోనూ మాట్లాడారు. ఇకపై సీసీ కెమెరాలు చూసి మరీ చర్యలు తీసుకుంటానన్నారు. ఆలయ పరిసరాల్లో, కొండపైన శుచి శుభ్రత పాటించాలని..ఈ సందర్భంగా శుభ్రత, పరిశుభ్రత విషయంలో గాంధీ మహాత్ముని సూక్తిని అందరికీ గుర్తు చేశారు.

Simhachalam

2021-09-23 08:24:18

బహిరంగ మద్య సేవనం పై ఉక్కుపాదం..

ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ మద్య సేవనం పై ఉక్కుపాదం మోపి తద్వారా మహిళలపై అత్యాచారాలు,హత్యలు, దొంగతనాలు,దోపిడీలు,ఘర్షణలను నివారించడానికి ప్రత్యేక కృషి చేస్తామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. తాడేపల్లిలోని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ లో బహిరంగ మద్య సేవనం గణనీయంగా పెరిగిందని దీనిని నిర్మూలించడానికి ప్రత్యేక కృషి జరగాలని కోరారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు లాంటి దుర్ఘటనలు, ఘర్షణలకు బహిరంగ మద్య సేవనం ప్రధాన కారణమని వివరించారు. చట్టాలలో మార్పు తెచ్చి బహిరంగ మద్య సేవనం పై కఠిన చర్యలు చేపట్టే విధంగా కృషి చేయాలని కోరారు.స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ను మరింత పటిష్టం చేయడం ద్వారా నాటుసారా,అక్రమ మద్యం, గంజాయి లాంటి మత్తు పానీయాలను నివారించగలమని వివరించారు.గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవసరమైన చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా బహిరంగ మద్య సేవనాన్ని నివారించగలమని తెలిపారు.గ్రామ/ వార్డు సచివాలయలలో పనిచేస్తున్న మహిళ పోలీసులకు యూనిఫామ్ అందించి వారి ఉద్యోగ  నియమావళిలో బహిరంగ మద్య సేవనాన్ని  నిర్ములంచడం ఒక బాధ్యతగా పేర్కొనాలని తెలిపారు.రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ  ప్రభుత్వ ధ్యేయమైనా మద్య రహిత సమాజం లో భాగంగా మద్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడతామని హామీ ఇచ్చారు.

Tadepalli

2021-09-23 06:17:13

తిరుమల శ్రీవారి అభిషేకానికి జిసిసి తేనె..

తిరుమల శ్రీవారి అభిషేకానికి విశాఖ జిసిసి తేనె వినియోగిస్తామని టిటిడిచైర్మన్ ప్రకటించారని జిసిసి చైర్మన్ శోభ స్వాతిరాణి చెప్పారు. విశాఖలో గురువారం మీడియాతో మాట్లాడారు. ఆ దేవదేవుడు తిరుమల వేంకట్వరశ్వరస్వామికి  జిసిసి తేనె అభిషేకానికి వినియోగిస్తామని ప్రకటన రావడం చాలా అభినందనీయమన్నారు. టిటిడి నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తేనె సేకరించి జిసిసి అమ్మెవారికి ఎంతో ఉపాది లభిస్తుందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే 1800 కేజీల తేనె టిటిడి నుంచి ఆర్డర్ వచ్చిందని కూడా ఆమె తెలియజేశారు. టిటిడి ఉప ఆలయాలకు కూడా జిసిసి తేనె వినియోగించాలని టిటిడి ఆదేశాలివ్వడం తాను మరిచిపోలేనని చెప్పుకొచ్చారు.

Visakhapatnam

2021-09-23 05:12:10

2రోజులుషెడ్యూల్డ్ కులాల సంక్షేమ క‌మిటీ పర్యటన..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో షెడ్యూల్డ్ కులాల సంక్షేమ క‌మిటీ ఈ నెల 28 నుంచి 30వ తేదీ వ‌ర‌కూ జిల్లాలో ప‌ర్య‌టిస్తుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి  తెలిపారు. ఈ క‌మిటీ ప‌ర్య‌ట‌న‌కు సాంఘిక సంక్షేమ‌శాఖ డిప్యుటీ డైరెక్ట‌ర్ కె.సునీల్‌రాజ్‌కుమార్ ని నోడ‌ల్ ఆఫీస‌ర్‌గా నియ‌మించారు.  28వ తేదీ ఉద‌యం 4.40 గంట‌ల‌కి క‌మిటీ స‌భ్యులు జిల్లాకు చేరుకొని, 10 గంట‌ల‌కు నిర్వ‌హించే స‌మావేశంలో రోస్ట‌ర్ పాయింట్లు, రిజిష్ట‌ర్లు త‌నిఖీ చేస్తారు. 29వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌జ‌ల‌వ‌ద్ద‌నుంచి, వివిధ సంఘాల నుంచి విన‌తుల‌ను స్వీక‌రిస్తారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌నుంచి సాంఘిక సంక్షేమ వ‌స‌తి గృహాల‌ను సంద‌ర్శిస్తారు. 30వ తేదీ 10.30 గంట‌ల‌కు శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌య కార్య‌నిర్వ‌హ‌ణాధికారితో స‌మావేశం నిర్వ‌హించి, దేవ‌స్థానం ఉద్యోగ నియామ‌కాల్లో ఎస్‌సి రిజ‌ర్వేష‌న్లు పాటించిందీ లేనిదీ ప‌రిశీలిస్తారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు క‌లెక్ట‌రాఫీసులో, జిల్లా క‌లెక్ట‌ర్‌, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హిస్తారు. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఎస్‌సిల రిజ‌ర్వేష‌న్లు అమ‌లు, సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లుపై స‌మీక్షిస్తారు. రాత్రి సుమారు 9.20 గంట‌ల‌కి జిల్లా నుంచి బ‌య‌లుదేరి, విజ‌య‌వాడ వెళ్తారని వివరించారు.

విజయనగరం

2021-09-22 13:10:39

25నాటికి హౌసింగ్ బేస్ మెంట్ పూర్తిచేయాలి..

నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు  కార్యక్రమంలో భాగంగా జగనన్న ఇళ్ళ  నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పోలీస్ అధికారులతో రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.  ఈ సందర్భంగా జగనన్న కాలనీలు ,అర్హులైన వారికి 90 రోజుల్లో ఇళ్లస్థలాలుమంజూరు ,వన్టైమ్ సెటిల్మెంట్, జగనన్న స్మార్ట్ టౌన్షిప్ , ఇళ్ల పట్టాల పంపిణీ, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పనులు, లేబర్ బడ్జెట్, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, బల్క్ మిల్క్ సెంటర్స్, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్,అర్బన్ హెల్త్ క్లినిక్స్, దిశా యాప్ డౌన్లోడ్ కార్యక్రమం, వ్యవసాయం, covid 19,సీజనల్ వ్యాధులు, అక్టోబర్ మాసంలో ప్రారంభించే పథకాలు తదితర అంశాలపై సవివరంగా మాట్లాడారు.  ప్రతి సంవత్సరం డిసెంబర్ -జూన్ మాసాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకానికి సంబంధించి వెరిఫికేషన్ చేయడంతోపాటు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ మాసంలో "జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం" ప్రారంభించడం జరుగుతుందన్నారు.  అక్టోబర్ 25 వ తేదీ నాటికల్లా గృహ నిర్మాణాలకు సంబంధించి బేస్మెంట్ లెవెల్ లను పూర్తి చేయాలన్నారు. నిర్మాణాల వద్ద  బోర్ వెల్స్ వేసి నీటి అవసరం కల్పించాలన్నారు. బిల్డింగ్ మెటీరియల్ ను నిల్వ చేయడానికి టెంపరరీ గోడౌన్ ల నిర్మాణాలను చేపట్టాలన్నారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ప్రతివారం లే అవుట్ల  పనుల పురోగతిని  పరిశీలన  చేయాలన్నారు. డిసెంబర్ 31 నాటికి డిజిటల్ లైబ్రరీ ల నిర్మాణాలకు లొకేషన్లను గుర్తించి గ్రౌండింగ్ మొదలుపెట్టాలన్నారు. వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి శతశాతం పూర్తి చేయాలన్నారు.సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ముందస్తు  జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి జిల్లాస్థాయి వ్యవసాయ అడ్వైజరీ కమిటీ సమావేశాలను నిర్వహించాలన్నారు.    వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డా ఏ మల్లిఖార్జున, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ,నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా , ఎస్ పి బి .కృష్ణా రావు, జీవీఎంసీ కమిషనర్ జి సృజన, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులు హాజరయ్యారు.

Visakhapatnam

2021-09-22 12:45:39

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే మైనార్టీల అభివ్రుద్ధి..

వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలోనే మైనార్టీల అభిరుద్ది సాధ్యంమవుతోందని అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగర పాలక సంస్థ లోని మేయర్ కార్యాలయంలో బుధవారం కార్పొరేటర్లతో కలసి మేయర్  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ నంద్యాల సంఘటనను టీడీపి నేతలు రాజకీయ అవసరాలకు వాడుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.వైసీపీలో ముస్లిం లకు అన్యాయం జరుగుతోందని టీడీపీ నేతల ఆరోపణలు సరి కావన్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా వైకాపా లో రాజకీయ ప్రాధాన్యత ముస్లిం మైనారిటీలకు దక్కుతోందన్నారు.రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అనంతపురం నగరంలోని ముస్లిం మైనారిటీలకు రాజకీయ పదవులలో ప్రాధాన్యత దక్కుతోందని,నాలుగు కీలక పదవులు ఒకేసారి ముస్లిం మైనారిటీలకు అనంతపురం నగరంలో దక్కడం జిల్లా చరిత్రలోనే ఇదే  తొలిసారి అన్నారు.అలాంటి అవకాశం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యమైందని గుర్తు చేశారు.ముస్లింలకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 4 శాతం రిజర్వేషన్లు కల్పించి విద్యా, ఉద్యోగ రంగాలలో ప్రాధాన్యత కల్పించారని,గతంలో ఎప్పుడూ లేని విధంగా మైనార్టీ సబ్ ప్లాన్ ను అమలు చేస్తూ సి ఎం జగనన్న తీసుకున్న నిర్ణయం మైనార్టీల కుటుంబాల్లో వెలుగులు నింపనుందని ఆయన తెలిపారు.ముస్లింల అభిరుద్దీ ని కోరుతున్నది వై ఎస్ కుటుంబం  మాత్రమేనని,ఆ మహానేత తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రాధాన్యత ముస్లింలకు కల్పిస్తూ ముస్లిం మైనారిటీల పట్ల తమ కుటుంబానికి ఉన్న ప్రేమ,ఆప్యాయతను చూపిస్తూన్నారని కొనియాడారు.ముస్లిం మైనారిటీలకు ఇస్తున్న గుర్తింపును ముస్లిం మైనారిటీలు మారువరనన్నారు.ఇప్పటికైనా టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని ఆయన సూచించారు.కార్పొరేటర్ సైఫుల్లా భేగ్ మాట్లాడుతూ మైనార్టీల గురించి మాట్లాడే ఆర్వ్హత టీడీపీ నేతలకు లేదన్నారు.ఐదేళ్ళ టీడీపీ పాలనలో నాలుగున్నర సంవత్సరాలు క్యాబినేట్ లో మైనార్టీ వ్యక్తి కి ప్రాతినిధ్యం లేకుండా పాలన కొనసాగించిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు.మంత్రి పదవి ఆశ చూపి పార్టీలో చేర్చుకుని అత్తారు చాంద్ బాషా,జలీల్ ఖాన్  ను వంచించినప్పుడు టీడీపీ మైనార్టీ నేతలు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.నేడు డిప్యూటీ సీఎం పదవి తోపాటు ఎమ్మెల్సీలు మేయర్లు నామినేటెడ్ చైర్మన్లు వంటి అనేక పదవుల్లో మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతోందన్నారు. అంతేకాకుండా ముస్లింల అభ్యున్నతి కోసం సబ్ ప్లాన్ అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు.తెలుగుదేశం పార్టీలో, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఎక్కువ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చారో టీడీపీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.నేడు నంద్యాల ఘటన గురించి మాట్లాడుతున్న టీడీపీ నేతలు అదే నంద్యాలలో ముస్లిం యువకులపై అక్రమ కేసులు నమోదు చేసినప్పుడు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.ఎవరి హయాంలో ముస్లిం మైనారిటీలకు న్యాయం జరుగుతోందో గుర్తుంచుకోవాలన్నారు.ఇకనైనా దిగజారుడు రాజకీయాలు మనుకోవాల్సిన అవసరం టీడీపీ నేతలకు ఎంతైనా ఉందన్నారు.ఈ సమావేశంలో కార్పొరేటర్లు రహంతుల్లా,ఇషాక్, హసీనా బేగం,లాలూ,నాయకులు దాదు,దాదా ఖలందర్ తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-09-22 12:04:30

బ్ర‌హ్మోత్స‌వాల్లో గోమందిరం ప్రారంభానికి ఏర్పాట్లు..

తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద దాత  శేఖ‌ర్‌రెడ్డి రూ.15 కోట్ల విరాళంతో నిర్మిస్తున్న గోమందిరాన్ని శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో ముఖ్య‌మంత్రి  వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని గోమందిరం, పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుప‌త్రి, డిపిడ‌బ్ల్యు స్టోర్స్‌లో పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీ కేంద్రంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను బుధ‌వారం ఈవో ప‌రిశీలించారు.  ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ గోమందిరంలో గోప్ర‌ద‌క్షిణ‌, గోతులాభారం, గోవు ప్రాశ‌స్త్యాన్ని భ‌క్తుల‌కు తెలియ‌జేసేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు. బ‌ర్డ్ ఆసుప‌త్రి ఆవ‌ర‌ణంలో పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుప‌త్రి నిర్మాణానికి సంబంధించిన సివిల్ ప‌నులు పూర్త‌య్యాయ‌ని, వైద్య ప‌రిక‌రాలు స‌మ‌కూర్చుకుని, వైద్యుల నియామ‌కం కోసం నోటిఫికేష‌న్ జారీ చేశామ‌ని చెప్పారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఈ ఆసుప‌త్రిని ప్రారంభించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌న్నారు. అదేవిధంగా, పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల త‌యారీకి తిరుప‌తిలోని డిపిడ‌బ్ల్యు స్టోర్స్‌లో ఇంజినీరింగ్ అధికారులు చేస్తున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈవో వెంట టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వ‌ర‌రావు, బ‌ర్డ్ సిఎస్ ఆర్ఎంవో శేష‌శైలేంద్ర‌, ప్ర‌త్యేకాధికారి డాక్ట‌ర్ రెడ్డెప్ప‌రెడ్డి, సిఎంవో డాక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌, గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రినాథ‌రెడ్డి, ఎస్ఇలు  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి,  వెంక‌టేశ్వ‌ర్లు, విజివో మ‌నోహ‌ర్ ఉన్నారు.

Tirupati

2021-09-22 10:55:36