సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన శానిటరీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె 2వ జోన్ 6వ వార్డు పరిధిలోని మధురవాడ, బక్కన్నపాలెం బి-2 హౌసింగ్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అల్పపీడనం కారణంగా వర్షాలు విస్తారంగా పడుతుండడంతో సీజనల్ వ్యాధులు లైన మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రిని ఆదేశించారు. వర్షపు నీరు నిల్వ లేకుండా చూడాలని, ఫ్రిడ్జ్ వెనుక భాగం ట్రేలో ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని, ఇంటి పరిసర ప్రాంతాలలో కొబ్బరి బొండాలు, ఖాళీ ప్లాస్టిక్ బాటిల్స్, పూల కుండీలులోని నీరు నిల్వ లేకుండా చూడాలని, ప్రతి శుక్రవారం “డ్రై డే” పాటించాలని, సచివాలయాల పరిధిలో మలేరియా పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సచివాలయాల పరిధిలో ఫీవర్ సర్వే ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలని ఆదేశించారు.
ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున గెడ్డ లోని పూడికలు తొలగించి, వర్షపు నీరు సాఫీగా వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయాలని, పారిశుధ్య కార్మీకులు ప్రతి ఇంటి నుండి తడి-పొడి చెత్తను సరిగా సేకరించడంలేదన్నారు.
తడి-పొడి చెత్తను వేరు వేరుగా ఇచ్చేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు. పిన్ పాయింట్ వారిగా పారిశుద్ధ్య కార్మికులను సర్దుబాటు చేసి ఎవరికి నిర్దేశించిన పనిని వారిచే చేయించాలని, చెత్త తరలించే వాహనాలు రోజుకు 3 ట్రిప్పులు వేయాలని, పుష్ కార్ట్ లోని చెత్త బయట వేయకుండా నేరుగా చెత్త తరలించే వాహనంలోనే వేయాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. మధురవాడ పరిసర ప్రాంతాలలో పందులు అధికంగా ఉన్నాయని వాటిని వెంటనే నిర్మూలించే చర్యలను చేపట్టాలని వెటర్నరీ అధికారులను ఆదేశించారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ ను వేసుకొనేలా సచివాలయాల పరిధిలో వాలంటరీలు ప్రతి ఇంటింటికి వెళ్లి 18 సంవత్సరాల వయసు పై బడిన వారందరికీ వ్యాక్సిన్ వేయించుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ ప్రధాన వైధ్యాధికారిని ఆదేశించారు.
ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, రెండవ జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, ఎఎంఒహెచ్ డా. కిషోర్, ఎసిపి భాస్కర బాబు, కార్యనిరాహక ఇంజినీరు (మెకానికల్) చిరంజీవి, అసిస్టెంట్ ఇంజినీర్లు శ్రీహరి, శ్రీనివాస్, మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.