చట్టప్రకారం అర్హులైన వారికే నష్ట పరిహారం అందేలా అధికారులు పద్ధతి ప్రకారం పారదర్శకతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. నీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం, రామాయపట్నం పోర్టుల భూ సేకరణలపై సంబంధిత అధికారులతో బుధవారం స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో ఆయన సమీక్షించారు. రెవిన్యూ వ్యవస్థ జిల్లాలో సరిగా లేకపోవడంతో పలు రకాల భూ సమస్యలు ఎదురవుతున్నాయని కలెక్టర్ అసహనం వ్యక్తంచేశారు. కొన్ని మండలాల్లో రెవిన్యూ దస్త్రాలు ట్యాంపరింగ్, వెబ్ ల్యాండింగ్ లో అక్రమాలు జరిగాయన్నారు. రెవిన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన ఘాటుగా హెచ్చరించారు. ముఖ్యంగా సగదు అనుసంధానంతో చేపట్టే భూ సేకరణ ప్రక్రియలో అధికారులు పారదర్శకంగా నిజాయితితో పనిచేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని శాస్త్రీయ బద్ధంగా విధులు నిర్వర్తించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. రెవిన్యూ వ్యవస్థను సరిచేయాల్సిన బాధ్యత జిల్లా సంయుక్త కలెక్టర్ పై ఉందని, ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ ఆయన మార్గనిర్దేశం చేశారు.
కృష్ణా జలాలు 2022వ సంవత్సరంలో టన్నెల్ ద్వారా ప్రకాశంలోకి తరలించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియ అత్యంత వేగంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. భూములు కోల్పోతున్న వారికి నష్ట పరిహారం నగదు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్టేజ్-1 కింద ప్యాకేజి ఒకటి నుంచి ఐదు వరకు నిర్దేశించిన గ్రామాలలో భూసేకరణ అత్యవసరంగా చేపట్టాలన్నారు. ప్రతినెల లక్ష్యాలను నిర్దేశించుకుంటూనే 824 ఎకరాలు భూసేకరణ త్వరలో పూర్తి చేయాలన్నారు. నిర్వాసితులైన 7,262 మందిలో ఆర్. అండ్. " ఆర్. ప్యాకేజి కింద 2,411 మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేయగా, మిగిలిన 761 మందికి తక్షణమే ప్లాట్లు ఇవ్వాలన్నారు. ప్యాకేజి ప్రక్రియలో అనర్హులను పూర్తిగా తొలగించాలన్నారు. అసైన్డ్ భూములు, ఆక్రమిత భూముల నిర్ధారణలో స్పష్టత ఉండాలన్నారు.
రామాయపట్నం పోర్టుకోసం ప్రతిపాధించిన భూములను వేగంగా సేకరించాలని కలెక్టర్ చెప్పారు. రావూరు, చేవూరు గ్రామాలలో ప్రభుత్వ, చుక్కల భూమి పట్టా భూముల వివరాలపై సమీక్షించారు. జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియ పక్కాగా నిర్వహించాలన్నారు. భూముల లెక్కింపు జరుగుతోందని. 32 గ్రామాలలో డ్రోన్ కెమేరాలతో భూముల స్థితిగతులను చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు. మొదటి విడతలో మరో ఏడు గ్రామాలను అదనంగా చేర్చినట్లు ఆయన వివరించారు. సంబంధిత ఏడు గ్రామాలలో 4,549.47 ఎకరాలలలో సర్వే చేయాలన్నారు. ఆ ప్రాంతాలలోని 2,234 మంది రైతులకు నోటీసులు జారీ చేయాలన్నారు.
వై.పాలెం-పామూరు జాతీయ రహదారికి 104 ఎకరాల భూ సేకరణ వేగంగా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. వై.పాలెం-పామూరు 565 జాతీయ రహదారికి మిగిలిన 164 ఎకరాలు వేగంగా సేకరించాలన్నారు. యడ్లపల్లి గ్రామంలో అటవి భూములను పరిశీలించాలని, ఆ భూముల దస్త్రాలు నిశితంగా పరిశీలించాలన్నారు. చీరాల ఒంగోలు జాతీయ రహదారి నిర్మాణం పూర్తయినప్పటికి 6.63 ఎకరాలకు భూ సేకరణ సమస్య ఉందని, తక్షణమే పరిష్కరించాలన్నారు. సి.ఎస్.పురం కందుకూరు జాతీయ రహదారి నిర్మాణానికి 89 ఎకరాల భూ సేకరణలో జాప్యంపై ఆయన ఆరాతీశారు. పర్చూరు. పెదజాగర్లమూడి రాష్ట్రీయ రహదారికి భూసేకరణ పూర్తి చేయాలన్నారు. గుంటూరు-గుంతకల్లు రైల్వేలైన్ నిర్మాణానికి 56 ఎకరాల భూసేకరణ పెండింగ్ లో ఉండటంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గూడూరు-విజయవాడ మూడవ రైల్వేలైన్ విస్తరణకు, నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైన్ నిర్మాణానికి 153 ఎకరాల భూమి వేగంగా సేకరించాలన్నారు.
సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (ఆర్.బి. ఆండ్, ఆర్.) జె. వెంకట మురళి, డి.ఆర్.ఓ. ఎస్. సరళా వందనం, మార్కాపురం ఆర్.డి.ఓ. లక్ష్మీ శివజ్యోతి, ప్రత్యేక ఉప కలెక్టర్లు గ్లోరియా, వసంతబాబు, శ్రీదేవి, నారదముని, సర్వే ల్యాండ్స్ ఏ.డి. రామకృష్ణారెడ్డి, వివిధ శాఖల అధి కారులు పాల్గొన్నారు.