1 ENS Live Breaking News

మహిళా శిశు ఆరోగ్యానికి దోహదం పడాలి..

మహిళా, శిశు ఆరోగ్యానికి అంగన్వాడీ కేంద్రాలు దోహదం చేయాలని జిల్లా కలెక్టరు శ్రీకేష్ లాఠకర్ స్పష్టం చేశారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళ వారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం మంచి పౌష్ఠికాహారం అందిస్తుందని, దానిని సకాలంలో పంపిణీ చేసి ఆరోగ్య జిల్లాగా రూపొందించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో 1.90 లక్షల మంది తల్లులు, పిల్లలు ఈ పథకం క్రింద ప్రయోజనం పొందుతున్నారని ఆయన అన్నారు. వీరందరికీ సక్రమంగా పౌష్ఠికాహాం పంపిణీ చేయడం వలన చిన్నారులు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారని కలెక్టరు పేర్కొన్నారు. తల్లులు, పిల్లలపై దృష్టి సారించాలని, ఎక్కడా నిర్లక్ష్యం వద్దని సూచించారు. తల్లులు, పిల్లల ఆరోగ్యంపై  నిర్లక్ష్యం వహించామంటే అంతకంటే ఘోరం ఉండదని, వారిని మోసం చేసినట్లు  గుర్తించాలని ఆయన అన్నారు. అక్రమాలు, నిర్లక్ష్యంపై ఆరోపణలు అందితే కటిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. తల్లీబిడ్డల మరణాల రేటు తగ్గడంలో ఐ.సి.డి.ఎస్ కీలక పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు. ఆహార పదార్థాల పంపిణీలో ఎక్కడా అక్రమాలు జరగరాదని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ స్పష్టం చేశారు. వీరఘట్టంలో జరిగిన సంఘటన వలన ఐ.సి.డి.ఎస్ పై చర్యలు మొట్ట మొదటిగా  తీసుకున్నామని ఆయన చెప్పారు. సరుకుల రవాణాలో జాప్యం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయని, వాటిని నివారించాలని ఆయన ఆదేశించారు. చిన్నారుల పెరుగుదల పర్యవేక్షణ (గ్రోత్ మానిటరింగ్) చేయాలని కలెక్టర్ సూచించారు. క్షేత్ర స్థాయి తనిఖీలు పెంచాలని, అంగన్వాడీ కేంద్రాలను ఎక్కువగా సందర్శించాలని ఆయన చెప్పారు. పాతపట్నం, మెలీయాపుట్టి, సీతంపేట ప్రాంతంలో మరింత దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 

వీరఘట్టం ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆయన తెలిపారు. రేషన్ పంపిణీ సమయంలో మహిళా పోలీసు సేవలు వినియోగించు కోవాలని ఆయన చెప్పారు. గర్భిణీ లకు కరోనా వాక్సినేషన్ తక్కువగా ఉందని, వాక్సినేషన్ పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గర్భిణీలకు వాక్సినేషన్ తక్కువగా ఉందని ఆయన అన్నారు. అవగాహన కలిగించడం ద్వారా ఎక్కువ మందికి పూర్తి చేయాలని ఆయన అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు డైరక్టర్ జి. జయ దేవి మాట్లాడుతూ జిల్లాలో 18 ప్రాజెక్టులు, 4192 అంగన్వాడి కేంద్రాలు అందులో 3403 ప్రధాన కేంద్రాలు ఉన్నాయన్నారు. పౌష్ఠిాహారం అందిస్తున్నామని,వై.యస్.ఆర్ సంపూర్ణ పోషణ క్రింద ఇంటికి ఆహార సామగ్రి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి నెల 5వ తేదీ లోగా అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు అందాలని, అయితే వివిధ కారణాల వలన కొద్ది రోజులు జాప్యం జరుగుతోందని ఆమె వివరించారు. పాలు పరిమాణం తక్కువగా వస్తుందని ఆమె చెప్పారు. సీతంపేట ప్రాంతంలో ఇంటెర్నెట్ సౌకర్యం పూర్తి స్థాయిలో లేదని, ఆఫ్ లైన్ లో అనుమతించాలని ప్రతిపాదనలు సమర్పించామని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా కె.శ్రీనివాసులు, పంచాయతీ రాజ్ ఎస్ఇ జి.బ్రహ్మయ్య, ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-24 14:22:24

నాడు నేడు నిర్మాణాలు వేగం పెంచాలి..

విశాఖ జిల్లాలో నాడు నేడు క్రింద నిర్మాణపు పనులను, నిర్వహణ పనులు సత్వరమే పూర్తి గావించాలని  జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున  సంబంధిత అధికారులను ఆదేశించారు.  సోమవారం సాయంత్రం కలెక్టరు నాడు – నేడు క్రింద వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్ లు, వై.ఎస్.ఆర్. విలేజ్ క్లినిక్ లు, వైద్యకళాశాలలు, ఆసుపత్రులు మొదలగు వాటి  భవనాల మరమ్మత్తులు, నిర్మాణపు పనులు, నిర్వహణ  పనులపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో  సమీక్ష నిర్వహించారు.  ఆయా పనులకు  సంబంధించిన వివరాలు,  సాధించవలసిన లక్ష్యాలు,  ఇప్పటి వరకు పూర్తయినవి,  పెండింగు పనులు,  తదితర వివరాలపై ఇంజనీరింగు మరియు ఎం.పి.డి.ఓ.లతో చర్చించారు. కొన్ని మండలాలలో  వెనుకబడి ఉండటము పై ఆగ్రహం వక్తం చేశారు.  నాడు–నేడు క్రింద పూర్తి చేసిన పాఠశాలలు  హెచ్.ఎంలకు, ఆసుపత్రులను వైద్యాధికారులకు అప్పగించాలన్నారు..  9 పి.హెచ్.సి ల పనులను త్వరగా పూర్తి చేయాలని  ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.  జి.వి.ఎం.సి మరియు మునిసిపాలిటీలలోని  వై.ఎస్.ఆర్  అర్బన్ క్లినిక్ ల పనులను త్వరగా  పూర్తి చేయాలని సంబంధిత మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. 

వైద్య కళాశాలలకు సంబంధించిన పనులను మరియు కె.జి.హెచ్, విమ్స్ లకు సంబంధించిన పనులను త్వరగా చేపట్టి పూర్తి గావించాలని  ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఎ.పి.ఎస్.ఎం.ఐ.డి.సి ను ఆదేశించారు. పాడేరు వైద్య కళాశాల పనులు పురోగతి లో ఉన్నాయని, కె.జి.హెచ్, విమ్స్ లో  ఆయా విబాగాలను మార్చిన తదుపరి పనులు చేపట్టడం జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు తెలిపారు. గ్రామ సచివాలయ భవనాల నిర్మాణపు పనులను త్వరగా పూర్తి గావించి ఫొటోలను  అప్ లోడ్ చేయాలన్నారు.  ఎం.పి.డి.వో. లు సచివాలయ భవనాల పనులను పర్యవేక్షించాలని, పి.ఆర్ ఇంజనీర్లు కూడా బాధ్యత వహించి త్వరగా పూర్తి చేయాలన్నారు. అదే విధంగా డిజిటల్ లైబ్రరీలు, బి.ఎం .సి.సి లు, అంగన్ వాడీ భవనాలు నిర్మాణపు పనులను కలెక్టర్ సమీక్షించారు. పాఠశాలలో కోవిడ్ ప్రోటో కాల్ పాటించాలని పిల్లలు ఎవరైనా అనారోగ్యంగా కనిపిస్తే  సి.హెచ్.సి లేదా పి.హెచ్ సి లకు పంపి పరీక్షలు చేయించి చికిత్స అందించాలన్నారు.   తరువాత ఉపాధి హామీ పనులను సమీక్షించారు. ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, పంచాయితీ రాజ్ ఎస్.ఈ. సుధాకర్ రెడ్డి, డ్వామా పి.డి. సందీప్ పాల్గొన్నారు.  వీడియో కాన్పరెన్స్ ద్వారా  జి.వి.ఎం .సి కమిషనర్  జి.సృజన, ఎం.పి. డి. ఓ .లు, మున్సిపల్ కమిషనర్లు సమావేశంలో పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-08-23 14:47:57

అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు..

శ్రీకాకుళం జిల్లాలో అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ ఎరువుల షాపుల యాజమాన్యాలను హెచ్చరించారు. ఎరువుల షాపుల యాజమానులతో ఎరువుల ధరలపై  జిల్లా లోని హోల్ సేల్ డీలర్లు, కంపెనీ తయారీ దారులు, రిటైల్ డీలర్లుతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎరువులు సరసమైన ధరలకే విక్రయించాలని పేర్కొన్నారు. ఎరువులు తప్పని సరిగా ఎంఆర్ పి రేట్లకే అమ్మాలని, ఎరువులను తప్పని సరిగా బయోమెట్రిక్ విధానంలో రైతులకు మాత్రమే అమ్మకాలు జరగాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిగకూడదని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిగినట్లైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షాపుల యజమానుల సమస్యలను జెసి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో జెడి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-23 14:40:34

స్పందన అర్జీలపై తక్షణమే స్పందించండి..

విశాఖ జిల్లాలో వివిధ కార్యాలయాలలో పెండింగులో ఉన్న గ్రీవెన్స్ పిటిషన్లను  వెంటనే పరిష్కరించి నివేదికలను పంపాలని  జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం  ఉదయం కలెక్టరు  ‘స్పందన’ లో వచ్చిన పిటిషన్లు,  పెండెన్సీ పై  అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ  వివిధ శాఖల  జిల్లా అధికారులు, శుక్రవారం  నాడు వారి శాఖలో  పెండింగులో ఉన్న పిటిషన్ల ను  పరిశీలించి వాటిని పరిష్కరించి   నివేదికలను  పంపాలన్నారు. ఎస్.ఎల్.ఎ పరిధి దాటి పెండింగులో ఉండటంపై, సంబందిత శాఖల అధికారులతో  సమీక్షిస్తూ, దానికి  కారణాలు ఏమిటని ప్రశ్నించారు. వెంటనే వాటని పరిష్కరించాలన్నారు.  ఇతర శాఖల  ఫిటిషన్లు వస్తే  వెంటనే  డి.ఐ.ఓ కు  తెలియజేసి, వాటిని పంపివేయాలన్నారు.  గ్రామ, వార్డు సచివాలయాలలో  వివిధ శాఖలకు  సిబ్బంది  ఉన్నారని,  అక్కడి సమస్యలను ఎప్పటి కప్పుడు పరిష్కరించేలా అధికారులు తగు చర్యలు  తీసుకోవాలన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలక్టరు ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. వాటిని పరిశిలించి సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు.  వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. 
సోమవారం నాడు "స్పందన" లో   214  పిటిషన్లు అందాయి. వివిధ మండలాలలో అధికారులు, సిబ్బంది ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి  ఉదయం గం.9-30 కల్లా హాజరు కావాలని  ఆదేశించారు.  వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మండల  కార్యాలయంలో , స్పందన కార్యక్రమానికి  పలువురు హాజరు  కాక పోవడం పై  కలెక్టర్  ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలాలలో అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరిస్తే జిల్లా వరకు రారన్నారు.  రెవెన్యూ డివిజనల్ అధికారులు, , డి.ఎల్.డి.ఓ.లు , తాహసీల్దారులు,  ఎం.పి.డి.ఓ. లు, ఈ విషయం పై శ్రద్ద వహించాలన్నారు.  ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్లు, ఎం.వేణుగోపాలరెడ్డి, పి.అరుణ్ బాబు, ఎ.సి.పి.  శిరీష,  రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిషోర్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2021-08-23 13:46:48

ఆ గ్రామస్తులకు ఆధార్ కార్డులు ఇవ్వండి..

విశాఖ జిల్లా జి.మాడుగుల–రావికమతం మండలాల సరిహద్దులో  ఉన్న నేరేడుబంద గ్రామస్తులను ఆధార్ కార్డులను ఇప్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పాడేరు ఐటీడీఏ పిఓ ను ఆదేశించారు. నేరేడుబంద గ్రామంలో పాతికలోపు కుటుంబాలు ఉండగా మారుమూలన ఉండే ఈ గ్రామం ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాకపోవడం, ఆ గ్రామంలో జన్మించిన 18 మంది పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం, వారు ఆస్పత్రిలో కాకుండా ఇంటి వద్దనే జన్మించడం, ఆరోగ్య సిబ్బంది రికార్డుల్లో కూడా వీరి గురించి నమోదు కాకపోవడంతో వీరికి బర్త్‌ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోవడంతో  ఆ గ్రామానికి చెందిన వారికి ఆధార్‌ కార్డులు జారీ చేయడ మారిన విషయం విదితమే. గడుతూరు పంచాయతీ కేంద్రానికి, రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కేంద్రానికి వెళ్లి జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే నేరేడుబంద గ్రామం తమ జాబితాలో లేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారని, తల్లిదండ్రులకు కూడా ఆధార్‌ కార్డులు లేని కారణంగా విద్యతోపాటు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నామని వారు ఆవేదన చెందుతున్న విషయం ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి దృష్టికి రావడంతో ఈ విషయంగా స్పందించారు.ఈ నేపథ్యంలో సోమవారం పాడేరు ఐటీడీఏ పిఓ రోణంకి గోపాలక్రిష్ణతో ఫోన్ లో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలన్నింటికీ ఆధార్ తో లంకె ఉండటంతో ఆధార్ లేని కారణంగా నేరేడుబంద గ్రామానికి ఏ పథకం కూడా వర్తించని పరిస్థితి ఏర్పడటం, ఆ గ్రామంలో ఉన్న 18 మంది పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం కావడాన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరారు. పాతిక కుటుంబాలు ఉన్న గిరిజన గ్రామం ఏ పంచాయితీ పరిధిలోనూ గుర్తించకపోవడం సబబు కాదన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ గ్రామం ఏ మండలం పరిధిలోకి వస్తుందనే విషయాన్ని నిర్ధారించడంతో పాటుగా ఆ గ్రామస్తులకు, అక్కడున్న పిల్లలకు తక్షణమే ఆధార్ కార్డులు ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంగా రెండు రోజుల్లో చర్యలు తీసుకోవాలని, నేరేడుబంద గ్రామంలో ఉన్న వారికి ప్రభుత్వ పథకాలలో లబ్దిదారులుగా చేర్చాలని పుష్ప శ్రీవాణి ఆదేశించారు.

Paderu

2021-08-23 13:41:11

రహీమున్నీసాకు మరో అరుదైన అవకాశం..

విశాఖకి చెందిన ప్రముఖ సామాజిక వేత్త, న్యాయవాధి రహీమున్నీసాకు మరో అరుదైన ఆహ్వానం లభించింది. కేంద్ర ప్రభుత్వ విభాగంలో నడుస్తున్న ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) సంస్థ ఈ నెల 25న ఇంటర్నిషిప్ డే పేరిట ఒక ఆన్ లైన్ కార్యక్రమం నిర్వస్తోంది..ఈ సందర్భంగా జరగనున్న ప్రత్యేక వెబినార్ లో ఆమె పాల్గొనాలని ఆహ్వానం  పంపింది. సుమారు ఆరు లక్షల మందికి పైగా ఇంటర్న్ షిప్ కలిగి ఉన్న సాంకేతిక విద్యా విభాగానికి సంబంధించి పలు కీలక అంశాలపై ఆన్ లైన్ లో చర్చించాలని కోరింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గా నియమితులైన బుద్ధ చంద్రశేఖర్ సలహా..సూచనల మేరకు ఆమె కూడా ఆ వెబినార్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  ఏఐసీటీఈ  నిర్వహించే ఇంటర్న్ షిప్ డే లో పాల్గొనే అవకాశం వచ్చినందుకు తాను గర్వపడుతున్నానని రహీమున్నీసా మీడియాకి తెలియజేశారు. అతికొద్ది మందికి వచ్చే ఈ అవకాశం విశాఖజిల్లా న్యాయవాదికి దక్కడం పట్ల సహచర న్యయవాదులు, సామాజిక వేత్త హర్షం వ్యక్తం చేశారు. 

Visakhapatnam

2021-08-23 13:25:56

కొటియాలో అభివ్రుద్ధి కార్యక్రమాలు జరగాలి..

ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైన కొటియా గ్రామం లో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్యకుమారి తెలిపారు.  సోమవారం స్పందన అనంతరం ఆమె అధికారులతో మాట్లాడుతూ  సంయుక్త కలెక్టర్ రెవిన్యూ వారు త్వరలో కొటియా పై పార్వతి పురం  లో డివిజినల్, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహిస్తారని, అన్ని శాఖల అధికారులు హాజరై  కోటియా అభివృద్ధి కి చేయవలసిన పనుల పై సమీక్షించుకోవాలని అన్నారు.   ముఖ్యంగా ఆరోగ్యం పై, సీజనల్ వ్యాధుల పై,  వాక్సినేషన్ ,  తదితర అంశాల పై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.   అటవీ శాఖ ఆధ్వర్యం లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలన్నిటిని చేయాలనీ సూచించారు. 

Vizianagaram

2021-08-23 11:35:39

సాధికారత సాధించే దిశగా శ్రమించాలి..

రాష్ట్రం లో మహిళా సాధికారత సాధించేందుకు అమలు చేస్తున్న విధానాలను మహిళా లోకం అందిపుచ్చుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. విశాఖపట్నం రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆమె ఏ.యూ. ప్లాటినమ్ జూబ్లీ వసతి గృహంలో  విలేకరులతో మాట్లాడారు. “ఆమె” అంటే అర్ధ భాగం, హక్కుల్లో కూడా సగభాగం అని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డే నని తెలిపారు. మహిళల్లో చైతన్యం కలిగించి మహిళా సాధికారికతను సాధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల మహిళా ప్రముఖులతో సదస్సులు చర్చా గోష్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం  లా కాలేజీ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఐఏఎస్, మహిళా అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, మహిళా ఎమ్మెల్యేలు, ఎం.పిలు, వివిధ రంగాల ప్రముఖులతో  మహిళా సాధికారత పై చర్చా గోష్టి జరుగుతుందని పద్మ తెలిపారు. మహిళల రక్షణ కు ఒక పటిష్ట యంత్రాంగంను ఏర్పాటు చేసి మహిళల చేతుల్లో పెట్టారని అన్నరు."దిశ" యాప్, పోలీస్ స్టేషన్లు, గ్రామ సచివాలయ మహిళా  పోలీసు, వాలంటీర్ల నెట్వర్క్ ను పటిష్టం చేయుటకు మహిళా కమిషన్ ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 26 నెలల్లో దాదాపు  రూ.లక్ష కోట్లను మహిళలకు వివిధ పధకాల ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేసారని గుర్తు చేశారు. బాలికల నుండి వృద్దురాలి వరకు స్వీయ రక్షణ, సాధికారత పొందుటకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని తెలిపారు. మహిళలకు అన్నిట్లో సగభాగం హక్కుగా ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారని మహిళా సాధికారతకు ఏపీ ప్రభుత్వం విప్లవాత్మక అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. 
నామినేటెడ్ పదవుల్లో 50 శాతంతో పాటు రాజకీయ రంగం లో మహిళల భాగస్వామ్యం సగానికి పెంచుతున్నారని వెల్లడించారు-దురదృష్టవశాత్తు జరుగుతున్న కొన్ని అఘాయిత్య సంఘటనలను రాజకీయం చేయటం తగదని హితవు పలికారు. గతంలో ఒక ముఖ్యమంత్రి యాసిడ్ బాధితురాలు అనురాధ కు చికిత్స కు నష్ట పరిహారం ఇవ్వటానికి నిరాకరిస్తే హై కోర్ట్, సుప్రీం కోర్ట్ చివాట్లు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ గుర్తు చేశారు.అలాంటి వారు మహిళల కోసం అంటూ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. వాసిరెడ్డి పద్మ తో మహిళా కమిషన్ మెంబెర్ జయలక్ష్మి,  డైరక్టర్ సూయజ్, ఐసీడీఎస్ పీడీ సీతామహాలక్ష్మీ,  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-23 11:34:13

స్పంద‌న అర్జీల‌ను గ‌డువులోగా ప‌రిష్క‌రించాలి..

స్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వస్తున్న అర్జీల‌ను గ‌డువులోగా ప‌రిష్క‌రించా ల‌ని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం స్పందన హాలులో జరిగిన స్పందన కార్యక్రమంలో క‌లెక్ట‌ర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్లు డా. జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి, ఎ.భార్గవ్ తేజ; డీఆర్వో సీహెచ్ సత్తిబాబు పొల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతుల‌ను స్వీకరించారు. తొలుత ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వ‌ద్ద కలెక్టర్ హరికిరణ్, ఐసీడీఎస్ పీడీ జి.సత్యవాణి; ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ఈడీలు జీఎస్ సునీత, ఎస్‌వీఎస్ సుబ్బలక్ష్మి; హౌసింగ్ పీడీ జి.వీరేశ్వర ప్రసాద్, ఇతర అధికారులు నివాళులర్పించారు. అనంతరం ఇప్పటి వరకు స్పందన ద్వారా వచ్చిన అర్జీలు, వాటి ప‌రిష్కారంలో పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి సంబంధించి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. స్పందన ద్వారా అందిన ప్రతి అర్జీదారునికి సంతృప్తికరమైన, నాణ్యతతో కూడిన సేవలు అందించాలన్నారు. అదేవిధంగా గత సోమవారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా వచ్చిన అర్జీలను ఈ నెల 25 నాటికి పరిష్కరించాలని ఆదేశించారు. మ‌న‌బ‌డి నాడు-నేడు రెండో ద‌శ పనులకు సంబంధించి భాగస్వాములైన వివిధ శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులు పూర్తిచేయాలన్నారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా ప్రభుత్వ నిబంధనలను అనుస‌రించాల‌ని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్పందన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు ఇళ్ల స్థలాల పట్టాలు, గృహాల మంజూరు, ఉపాధి కల్పన, ఫించన్లు, ఉపకార వేతనం, భూ వివాదాలు, వైఎస్సార్ బీమా, ఆరోగ్య శ్రీ, బియ్యం కార్డు మంజూరు తదితరాలకు సంబంధించి దాదాపు 355 అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, అర్జీల ప‌రిష్కారం కొత్త ఫార్మాట్‌లో జ‌రిగేలా చూడాల‌ని అధికారుల‌ను క‌లెక్టర్ హరికిరణ్ ఆదేశించారు. ఈ స్పందన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Kakinada

2021-08-23 11:25:13

ఆదర్శమూర్తి ఆంధ్రకేసరి టంగుటూరి..

బారిస్టర్ చదువును అభ్యసించిన  అత్యంత మేధావి ఆంధ్ర కేసరి  టంగుటూరి  ప్రకాశం పంతులని,  నైతిక విలువలను ప్రాణంగా భావించే ఆయన జీవితం ఎందరికో ఆదర్శమని విజయనగరం జిల్లా కలెక్టర్  ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు.  ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు  జయంతి సందర్భంగా సోమవారం కలక్టరేట్  ఆడిటోరియం లో ఆయన చిత్ర పటానికి పూల మాలలను  వేసి ఘనంగా నివాళు లర్పించారు.  అనంతరం కలెక్టర్  మాట్లాడుతూ  ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్య  మంత్రిగా టంగుటూరి చరిత్ర లో నిలిచారని,  టంగుటూరి అత్మాభిమానం కలవారని, అవిశ్వాస తీర్మాణానికి నైతిక బాధ్యత వచించి పదవీ  త్యాగం చేసిన  గొప్ప వ్యక్తని పేర్కొన్నారు. నమ్మిన దానిని ఆచరించడం లో, నైతికంగా వ్యవహరించడం లో ఆయనకు  ఆయనే చాటియని అన్నారు. వారి   బాటలో  అందరం నడవాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమం లో  సంయుక్త కలెక్టర్లు డా. జి.సి.కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్, జే. వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-08-23 11:09:38

ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించాలి..

పెండింగ్ లో ఉన్న స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు.  జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొన్నారు.  ఆయనతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, డ్వామా, డిఆర్డిఎ పిడి లు హెచ్. కూర్మారావు, శాంతి శ్రీ అర్జీలను స్వీకరించారు.పోలాకి మండలానికి చెందిన సుశీల భూ సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు తన అర్జీ  అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులకు వచ్చే అర్జీలు మీ మీ స్థాయిలో పరిష్కారం అయ్యే అర్జీలను పరిష్కరించాలని, పరిధి లో లేనివి సంబంధిత మండలాలకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.  శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న అర్జీల సంఖ్య ను తెలియజేయాలన్నారు. ఏ వారం వచ్చిన అర్జీలను ఆ వారమే పరిష్కారానికి అవకాశం ఉన్న మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 266 అర్జీలు స్వీకరించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-08-23 09:20:40

టంగుటూరి భారత దేశానికే ఆదర్శం..

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు దైర్యసాహసాలు, త్యాగనిరతి నేటి తరానికి స్పూర్తిదాయకని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కొనియాడారు. సోమవారం ఉదయం  ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని రాష్ట్ర వేడుకగా స్థానిక జడ్పి ఆఫీసు కూడలి వద్ద నున్న అమరజవాన్ ట్రయాంగిల్ లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి జిలా కలెక్టరు సి.హరికిరణ్, నగర మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ ముఖ్య అతిధులుగాను, జాయింట్ కలెక్టర్లు డా.జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, ఎ.భార్గవ్ తేజ, జి.రాజకుమారి విశిష్ట అతిధులుగాను హాజరై ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు అలంకరించి, నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ ఎందరో మహనీయులు, దేశ భక్తులు తమ నిస్వార్థ త్యాగాలతో  స్వేఛ్చా, స్వాతంత్య్రాలను మనకు అందించారని, వారి జీవితాలు, ఆశయాలు తరతరాలకు స్పూర్తి నిస్తాయని, అందుకే వారి జయంతి, వర్థంతులను ప్రభుత్వ కార్యక్రమాలుగా కృతజ్ఞతాపూర్వకంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతోందన్నారు.  టంగుటూరి ప్రకాశం పంతులు దేశ స్వాతంత్ర్యం పోరాటంలో ప్రాణాలు సైతం లెక్కచేయక చూపిన తెగువ, ప్రజా సేవలో తన సర్వస్వం అర్పించిన త్యాగనిరతి సమున్నత ఆదర్శాలుగా ఎప్పటికీ నిలిచి ఉంటాయని, ఆయన జీవిత విశేషాలను నేటి తరం తప్పక తెలుసుకోవాలని కొరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, జడ్పి సిఈఓ ఎన్.వి.వి.సత్యన్నారాయణ, సోషల్ వెల్పేర్ జెడి జె.రంగలక్ష్మీ దేవి, హౌసింగ్ పిడి జి.వి.ప్రసాద్, డ్వామా పిడి ఎ.వెంకటలక్ష్మి,  కాకినాడ ఆర్డిఓ ఎ.జి.చిన్నికృష్ణ, స్థానిక కార్పొరేటర్ ఎస్.లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. 

Kakinada

2021-08-23 07:41:40

ఆంధ్రకేసరి అందరికీ ఆదర్శ ప్రాయులు..

సుప్రసిద్ధ స్వాతంత్య్ర సమర యోధుడు, ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి మద్రాసులో సైమన్ కమిషన్  వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు టంగుటూరి ప్రకాశం పంతులు అని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. ఆగష్టు 23న కీ.శే.టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి పురష్కరించుకొని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రకాశం పంతులు జయంతి వేడుకలు జరిగాయి.   ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్  హాజరై  ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు అని గుర్తుచేసారు. 1940 – 50 దశకంలో ఆంధ్ర రాజకీయాల్లో క్రియశీలక పాత్రను పోషించడమే కాకుండా ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకరని అన్నారు. నిరుపేద కుటుంబంలో  పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి కావడం గొప్ప చారిత్రాత్మకమని కొనియాడారు. సైమన్ కమీషను వెళ్లినచోటల్లా నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు స్వాగతం పలికారన్నారు. 1928 మార్చి 2న కమీషన్ బొంబాయిలో అడుగుపెట్టినపుడు పోలీసులు మద్రాసు వంటి సున్నిత ప్రదేశాలలో నిరసన ప్రదర్శనలను అనుమతించలేదని,  ప్యారీస్ కార్నర్ వద్ద మద్రాసు హైకోర్టు సమీపములో జరిగిన పోలీసులు కాల్పుల్లో కోపోద్రిక్తుడైన ప్రకాశం తన చొక్కా చించి ధైర్యంగా ముందుకు వెళ్లాడన్నారు. ఆయన ధైర్ఘ్య సాహసాలకు గుర్తుగా ఆంధ్రకేసరిగా పేరు పొందారని అన్నారు.  అలాగే  1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, జైలుకు వెళ్లి విడుదలైన తదుపరి ప్రజలకు మరింత చేరువకావటానికి దక్షిణ భారతదేశమంతా పర్యటించిన ధీరోదాత్తుడు ప్రకాశం పంతులు అని తెలిపారు. ఆయన ఇచ్చిన స్పూర్తి , ఆశయసాధన అందరికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్లు సుమిత్ కుమార్, డా. కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములునాయుడు, హిమాంశు కౌశిక్, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మారావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-23 07:10:00

అప్పన్నకు అదనపు డీజీపీ పూజలు..

సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ(సింహాద్రి అప్పన్న)స్వామిని అడిషనల్ డీజీపీ అశోక్ కుమార్ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి స్వామివారికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం  అడిషనల్ డీజీపీ అప్పన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. వారికి దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, అధికారులు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Simhachalam

2021-08-23 06:29:43

గోశాలను సందర్శించిన డిఆర్ డిఓ చైర్మన్..

తిరుమలలోని టీటీడీ గోశాలను డిఆర్ డిఓ చైర్మన్  సతీష్ రెడ్డి ఆదివారం ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి తో కలిసి సందర్శించారు.  గోశాలకు ఇటీవల దానంగా వచ్చిన గిర్ ఆవులు, దూడలను ఆయన చూశారు. వాటి పోషణ, పాల దిగుబడి వివరాలను టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు  శివకుమార్ వివరించారు. ఈవో మాట్లాడుతూ ఆగస్టు 30వ తేదీ నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నవనీత సేవ ప్రవేశపెడుతున్నామని వివరించారు. దేశవాళీ ఆవుల నుంచి ఉత్పత్తి చేసిన పాలను పెరుగుగా మార్చి, దాని నుంచి వెన్న తీసి స్వామివారి నిత్య కైం కర్యాలకు ఉపయోగిస్తామన్నారు. వెన్నను గోశాల నుంచి శ్రీవారి సేవకులు ప్రదర్శనగా ఆలయం వద్దకు తీసుకుని వెళ్ళి అర్చకులకు అందిస్తారని ఈవో తెలిపారు. తిరుమలకు వచ్చే యాత్రికులు గోసేవ చేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయబోతున్నామని చెప్పారు. గోశాలలో నూతనంగా నిర్మిస్తున్న పొయ్యిలు, పాలు కాచి పెరుగు, దాని నుంచి వెన్న తీసే విధానాన్ని ఆయన తెలియజేశారు.  శ్రీవారి కైంకర్యాలకు అవసరమయ్యే నూనె కూడా తయారు చేసేందుకు గానుగ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సివిఎస్వో  గోపీనాథ్ జెట్టి, గోసంరక్షణ శాల అధికారి డాక్టర్ నాగరాజు, డిప్యూటి ఈవో  లోకనాథం, విజివో  బాలిరెడ్డి పాల్గొన్నారు.

Tirumala

2021-08-22 15:56:05