1 ENS Live Breaking News

ప్రజాసమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్టు రాజమహేంద్రవరం మున్సిపల్ కమీషనర్ కె.దినేష్ కుమార్ అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజలు హాజరైన కమిషనర్ కు పలువురు వినతులు అందచేశారు. మంచినీరు, పారిశుద్యం, ఇంటిపన్ను మార్పు వంటి  తదితర అంశాలపై 16 మంది అర్జీలరు అందచేశారు. ఇంటి పన్ను వెయ్యడం లేదని సింహాచల్ నగర్ కి చెందిన ఏ స్వప్న,  ఏవి అప్పారావు రోడ్ నందు బాబానగర్ 6వ వీధి నివాసులు స్పిరిట్ హౌస్ కిచెన్ గది నుంచి కాలుష్యం,  డి జే శబ్ద కాలుష్యం పై పరిష్కారం కోసం ఐ. కిషోర్ కుమార్ తదితరులు, గాదాలమ్మ నగర్ వాసులు డ్రైనేజ్ సమస్య పరిష్కారం కోసం, భారీ వాహనాలు వలన ఇబ్బందుల పై పలువురు అపార్ట్మెంట్ వాసులు అర్జి అందచేశారు. ఈ కార్యక్రమంలో  అదనపు కమీషనర్ పియం సత్యవేణి, సిటీ ప్లానర్ జె. సూరజ్ కుమార్, ఇతర మునిసిపల్ అధికారులు  పాల్గొన్నారు.

Rajamahendravaram

2023-06-12 12:13:22

GVMCలో డయల్ యువర్ మేయర్, జగనన్నకు చెబుదాం

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థలో ప్రతీ సోమవారం డయల్ యువర్ మేయర్ కార్యక్రమం ఉదయం 10 నుంచి 11 గంటలకు వరకూ, జనగన్నకు చెబుదాం కార్యక్రమం 11 నుంచి ఒంటి గంటవరకూ నిర్వహిస్తారని  మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా నగర ప్రజలు వారి సమస్యలను నేరుగా ఫోను ద్వారా ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవచ్చునన్నారు. అదేవిధంగా జనగన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా జివిఎంసీ కమిషనర్ కి ఫోన్ చేసి ఫిర్యాదులు, సమస్యలు తెలియజేయవచ్చునన్నారు. ప్రజల సౌకర్యార్ధం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా నగరంలోని అన్నివార్డుల్లోని సచివాలయాల్లోనూ జగనన్నకు చెబుదాం కార్యక్రమాల నిర్వహణ జరుగుతుందని పేర్కొన్నారు. ఫోను కలవలేని వారు సచివాలయాలకు వెళ్లి తమ సమస్యలు అర్జీలు సమర్పించి పరిష్కరించుకోవాలని సూచించారు.

Visakhapatnam

2023-06-11 13:45:54

స్వచ్ఛ సర్వేక్షణ్-2023 లో ప్రథమ స్థానమే లక్ష్యం

స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో ప్రథమ స్థానమే లక్ష్యంగా నగర ప్రజల సహకారంతో సాధిస్తామని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. ఆదివారం ఆమె ఆర్కే బీచ్ కాళీమాత గుడి నుండి సబ్మేరియన్ వరకు  1కె వాక్ జివిఎంసి కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, డిప్యూటీ మేయర్ జయ్యాని శ్రీధర్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో దేశములోనే విశాఖ నాలుగవ స్థానం సాధించిందని, అలాగే ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చి విశాఖ నగరాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం అడిగిన ప్రశ్నలకు ప్రజలు ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే నగర స్వచ్ఛతకు జివిఎంసి యంత్రాంగం ఎంతో కృషి చేస్తుందని అలాగే స్వచ్ఛ భారత్ అంబాసిడర్లు, స్వచ్ఛంద సంస్థలు, నగర ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ్లో మంచి ర్యాంకకు కృషి చేయాలన్నారు. విశాఖ నగరాన్ని పరిశుభ్రత నగరంగా తీర్చిదిద్దేందుకు “ఇకో-వైజాగ్” కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ప్రజల అవగాహన కొరకు 1కె వాక్ ప్రారంభించడం జరిగిందన్నారు. 

ముఖ్యంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను నగరంలో పూర్తిగా నిషేధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి ప్లాస్టిక్ నిషేధంపై ఆదేశాలిచ్చారని, ప్లాస్టిక్ వలన కలిగే అనర్ధాలు ప్రజలందరికీ వివరించి ప్లాస్టిక్ బదులు ప్రత్యామ్నాయ వస్తువులైన క్లాత్ బ్యాగులను ఉపయోగించే విధంగా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. విశాఖ నగరంలో ఇప్పటికే నిషేధిత ప్లాస్టిక్ నిర్మూలన అమల్లో ఉందని అయినప్పటికీ కొంతమంది వ్యాపారస్తులు తక్కువ ధరకే దొరుకుతుందన్న నిషేధత ప్లాస్టిక్ ని వినియోగిస్తున్నారని వారి కొరకు ప్రత్యేక స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేశామని ప్లాస్టిక్ కలిగి ఉన్న దుకాణదారుల నుండి భారీ స్థాయిలో అపరాధ రుసుం  వసూలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 

  అనంతరం జివిఎంసి కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో విశాఖ నగరానికి మొదటి ర్యాంకే లక్ష్యంగా అందరి సహకారంతో సాధిద్దామని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో “ఇకో-వైజాగ్” అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యంగా ప్లాస్టిక్ను నిర్మూలించవలసి ఉందని, వ్యాపారస్తులు ప్లాస్టిక్ నిర్మూలనకు సహకరించాలని, పచ్చదనం పెంపొందించడం, పారిశుద్ధ్యం, భూగర్భ మురుగనీరు, సేంద్రియ ఎరువు, పొల్యూషన్ వీటన్నిటిపై జివిఎంసి దృష్టి సారించి దేశంలోనే విశాఖ నగరాన్ని మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో బృందం అడిగిన ప్రశ్నలకు ప్రజలు మంచి ఫీడ్ బ్యాక్  ఇవ్వాలన్నారు. విశాఖ నగరానికి ఎంతోమంది దేశ విదేశీయులు పర్యాటకులు, సందర్శకులు వస్తారని వారందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ప్లాస్టిక్ మరియు  పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు. విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు స్వచ్ఛభారత్ అంబాసిడర్లు, ఎన్జీవోస్,  స్వచ్ఛంద సంస్థలు, ఆర్డబ్ల్యూఎస్, నగర పౌరులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

 ముఖ్యంగా విశాఖ నగరానికి ఎంతో సువిశాలమైన తీర ప్రాంతం ఉందని ఎంతోమంది పర్యాటకులు వస్తారని అందుకు విశాఖ నగర తీరంలో ప్లాస్టిక్ నిర్మూలనకు ఎంతో కృషి చేయడం జరుగుతుందని, సముద్ర జలాలలో ప్లాస్టిక్ కలవకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. 1 కె వాక్ ద్వారా స్వచ్ఛత,  పారిశుధ్యం, ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనకు నగరంలోని ప్రతి జోన్ పరిధిలో ప్రత్యేక  స్క్వాడ్ ఏర్పాటు  చేసామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జయ్యాని శ్రీధర్, జివిఎంసి అదనపు కమిషనర్ డాక్టర్ వి సన్యాసిరావు, డి సి ఆర్ పణిరామ్, కార్యదర్శి  నల్లనయ్య,  జోనల్ కమిషనర్లు, ఏఎంఓహెచ్, స్వచ్ఛ భారత్ అంబాసిడర్లు, స్వచ్ఛంద సంస్థలు నగర పౌరులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-11 09:56:10

సింహాద్రి అప్పన్నను దర్శించుకన్న తెలంగాణ గవర్నర్

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారిని శనివారం తెలంగాణ గవర్నర్  తమిళసై సౌందర్య రాజన్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి నరసింహారాజు స్వాగతం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా గవర్నర్ కప్పస్తంభం అలింగణం చేసుకున్నారు. అనంతరం స్వామివా రి ఆరాధన సేవలో పాల్గొని అనంతరాలయ దర్శనం చేసుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనాలను అందజేశారు. ఆలయ సిబ్బంది స్వామివారి ప్రసాదాలను అందించారు. గవర్నర్ తో పాటు  రాజ్ భవన్ ఎడిసి అక్షసయ్య యాదవ్,  ఆర్డీవో భాస్కర్ రెడ్డి, పెదగంట్యాడ తాసిల్దార్ రమాదేవి, చిన్న వదిలి ఆర్ ఐ మల్లేశ్వరరావు, గోపాలపట్నం సిఐ మరియు ఎస్ఐలు, పర్యవేక్షకులు కనకరాజు, పీఆర్వో నాయుడు, ధర్మకర్త మండలి సభ్యురాలు రాజేశ్వరి లు పాల్గొన్నారు.

Simhachalam

2023-06-10 16:15:11

కేంద్ర మంత్రుల సభకు 950 మందితో భారీ బందోబస్తు

విశాఖలో ఈనెల11న కేంద్ర హోం మంత్రి అమిత్ షా  విశాఖ పర్యటన, బహిరంగ సభ సందర్బంగా నలుగురు డిసిపీలు, రెండు ఏ.పి.ఎస్.పి ప్లటూన్లు,04 స్పెషల్ పార్టీ లతో మొత్తముగా 950 సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ డా.త్రివిక్రమవర్మ తెలియజేశారు. ఈ మేరకు శనివారం సిపి కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియతో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి  పర్యటించే ప్రాంతాలైన ఐ.ఎన్.ఎస్ డేగ,ఎయిర్పోర్ట్, వాల్తేరు రైల్వే గ్రౌండ్స్ బస చేయు పోర్టు గెస్ట్ హౌస్, సాగర్ మాల కన్విక్షన్ సెంటర్ తో పాటూ కేంద్ర హోం మంత్రి పర్యటించనున్న ప్రతీ ప్రాంతంలో పటిష్ట బందొబస్తు ఏర్పాటు చేశామన్నారు. రైల్వే ఫుట్ బాల్ గ్రౌండ్స్ లో సాయంకాలము బహిరంగ సభ ఏర్పాటు, సభకు ప్రజలు హాజరు, ప్రముఖుల పర్యటన సందర్బముగా  ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు 10వ తేది మద్యాహ్నము 02 గంటలనుండి రాత్రి 09 గంటల వరకు ఈ క్రింది తెలిపిన మార్గముల ద్వారా వాహనములు ప్రయాణించుటకు అనుమతి లేనందున ప్రత్యామ్న్యాయ మర్గాములలో ప్రయాణించి  ట్రాఫిక్ పోలీస్ కి సహకరించ వలసినిదిగా విజ్ఞప్తి చేశారు.

వాహనాల దారి మళ్లింపు ఇలా..
1)బహిరంగ సభకు వచ్చే బస్సులు TC పాలెం/28 బస్ స్టాప్ వద్ద, సదరు బస్సులు ఆశీర్వాద కళ్యాణ మండపము వైపు వున్న రోడ్ మార్జిన్ లో మరియు 
DLB గ్రౌండ్స్ లో, విశాఖ  పోర్ట్ హాస్పిటల్ వద్ద వున్న Inarbit మాల్ గ్రౌండ్స్ లో తమ తమ వాహనములలోని ప్రజలని దించిఅక్కడే పార్కు చేసుకొనవలెను. 2)బహిరంగ సభకు వచ్చే ద్విచక్ర వాహనములు  TC పాలెం/28 బస్ స్టాప్ వద్దా పార్కింగ్ చేసుకోవలెను అదే విధముగా ఆటోలు  కేంద్రీయ విద్యాలయం వరకు గల 80 ఫీట్ రోడ్ మార్జిన్ లో పార్కింగ్ చేసుకోవలెను. 3)కంచరపాలెం మెట్టు నుండి అక్కయ్యపాలెం 80 feet రోడ్ లో వున్న  మహారాణి పార్లర్ వరకు మరియు TC పాలెం నుండి DLO జంక్షన్ వరకు ఎటువంటి వాహనములు కు అనుమతి లేదు కావునా ప్రత్యామ్నాయ మర్గాలలో ప్రయాణించాల్సి వుంటుంది.  పలు ప్రాంతాల నుండి బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా.. నగర పర్యటన సజావుగా సాగేలా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-10 15:55:35

నిత్యం సమాజ శ్రేయస్సుకోసం శ్రమించేది పాత్రికేయులే

సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే పాత్రికేయుల పాత్ర సమాజంలో కీలకమైనదని జిల్లా ఇంచార్జి మరియు   రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు . శనివారం ఉదయం జగదాంబ జంక్షన్ దగ్గర డాల్ఫిన్ డయోగ్నస్టిక్ సెంటర్లో అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య శిభిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున , ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ  ఎన్ని కష్టాలు ఉన్నా జర్నలిస్టులు విలువల కోసం పని చేస్తారని, వారి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని అక్రిడేటెడ్ జర్నలిస్టులందరికీ డాల్ఫిన్ డయోగ్నస్టిక్ సెంటర్లో రూ.10,000 పైబడి ఖరీదు చేసే 56 రకాల అన్ని వైద్య పరీక్షలను ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా వైద్యపరీక్షల అనంతరం అవసరమయ్యే అత్యవసర చికిత్సను కూడా ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. త్వరలో మరిన్ని నగరాల్లో జర్నలిస్టుల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ  ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టు పాత్రను కొనియాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 495 మంది జర్నలిస్టులకు అక్రిడియేషన్ కార్డులను రెండు విడతలగా మంజూరు చేసినట్లు తెలిపారు. జర్నలిస్టుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని అక్రిడిటేషన్  కలిగిన 495  జర్నలిస్టులకు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేసుకొనుటకు డాల్ఫిన్ డయాగ్నస్టిక్స్ సంస్థ ఆధ్వర్యంలో వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోజుకి సుమారు 30 మందికి సేవలు అందించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మంజూరు కాబడిన అక్రిడిటేషన్ కార్డుదారులందరూ ఈ హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన జర్నలిస్టులకు వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్  స్కీమ్ కు సంబంధించి ఆరోగ్య భీమా మొత్తాన్ని సిఎస్ఆర్ నిధులనుంచి చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. 

  భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైద్య, విద్య రంగాలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు సమాజ చైతన్యం కోసం నిత్యం పనిచేస్తూ అనేక ఒత్తిడులు ఎదుర్కొంటారని అన్నారు.   జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులకు ప్రభుత్వ తరుపున  ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం 2023-24 సంవత్సరానికి నూతనంగా మంజూరు కాబడిన అక్రిడిటేషన్ కార్డులను అక్రిడిటెడ్  జర్నలిస్టులకు మంత్రి అందజేశారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన 300 మంది "వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్" సంబంధించి బీమా మొత్తం రూ.3,75,000/-   విలువగల చెక్కును జర్నలిస్టులకు అందజేసారు. జర్నలిస్టు హెల్త్  కార్డులను జర్నలిస్టులకు అందజేసారు.  అక్రిడిటేడ్   వర్కింగ్ జర్నలిస్టులకు రూ.10,000 పైబడి ఖరీదు చేసే 56 రకాల  వైద్య పరీక్షలను ఉచితంగా  అందిస్తున్న డాల్ఫిన్ డయాగ్నసిస్ సెంటర్ డా.వి.సురేష్, డా.లక్ష్మీ ప్రసూనలను ఈ సందర్భంగా  రాష్ట్రమంత్రి విడదల రజిని మరియు జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం హెల్త్ చెకప్ కి సంబంధించి టెస్టుల వివరాల కరపత్రాన్ని మంత్రి జిల్లా కలెక్టర్ , ప్రజా ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎం.పి ఎంవివి సత్యనారాయణ, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, విఎమ్ఆర్డిఏ చైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల, నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె.రాజు,ఆర్డీవో  హుస్సేన్ సాహెబ్, సమాచార శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వి మణిరామ్ , కార్పొరేటర్లు , వైద్య సిబ్బంది, ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2023-06-10 14:35:12

విశాఖలో కేంద్ర మంత్రులతో 11న బహిరంగ సభ

విశాఖలో ఇద్దరు కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి లతో భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. 11వ తేదీన కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా విశాఖ పర్య టన షెడ్యూల్ ఖారారైంది. దేశ ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంటరీ నియోజక వర్గ కేంద్రాల్లో విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్న బీజేపీ ఒఢిశా బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదంతో కాస్త తగ్గింది. దీంతో మళ్లీ బహిరంగ సభలను ఏర్పాటు చేయనున్నారు. అయితే గతంలో కన్నా ఈ సారి కాస్త తక్కువ మందితోనే ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. విశాఖలో నిర్వహించనున్న మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 11న ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. పార్టీ కార్యకర్తలు ఆయనకు ర్యాలీగా వెళ్లి ఎయిర్ పోర్టులో సాదర స్వాగతం పలుకుతారు. అనంతరం రాత్రి 7గంటలకు నగరంలోని తాటిచెట్లపాలెం రైల్వే గ్రౌండ్స్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో పోర్ట్ సాగరిక కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా సమావేశమవుతారు. పోర్ట్ గెస్ట్ హౌస్ లో ఆరోజు రాత్రి బస చేస్తారు. సోమవారం ఉదయం వివిధ ఆలయాల సందర్శన అనంతరం ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని స్థానిక బీజేపీ నేతలు తెలిపారు. అమిత్ షా వెంట కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డితో పాటు వివిధ విభాగాల ఇన్ఛార్జిలు మురళీధర్, దేవధర్ సహా పలువురు ఎంపీలు హాజరు కానున్నారు.

Visakhapatnam

2023-06-08 15:13:15

గంగవరం పోర్టు ఉద్యోగులకు విద్యార్హతలను బట్టే జీతాలు

గంగవరం పోర్టులో పని చేస్తున్న కార్మికులందరికీ వారి విద్యార్హతలను బట్టి సమానపనికి సమాన వేతనం చొప్పున ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లిఖార్జున అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజా ప్రతినిధులు,  గంగవరం పోర్టు కార్మికులు,  కార్మిక సంఘాలు, పోర్టు యాజమాన్యంతో జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయి. గంగవరం పోర్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి అందరూ సహకరించాలని ముందుగా ఆయన పిలుపునిచ్చారు. కార్మికులు, కార్మిక సంఘాలు లేవనెత్తిన అంశాలపై పోర్టు యాజమాన్య ప్రతినిధుల నుండి వివరణ తీసుకున్నారు. కార్మికుల సమస్యలపై యాజమాన్య ప్రతినిధులు ఇచ్చిన  వివరణ ప్రకారం కార్మికులు అందరూ శాశ్వత ఉద్యోగులేనని, గంగవరం పోర్టు లిమిటెడ్ మరియు గంగవరం పోర్ట్ సర్వీసెస్ ఉద్యోగులకు ఒకే   విధంగా పరిగణిస్తామని తెలిపారు.  కార్మికులకు అందిస్తున్న  ప్రత్యేక అలవెన్స్  రెట్టింపు చేయాలని,  కార్మికుల విద్యార్హతలను పరిగణనలోనికి తీసుకొని  సాంకేతిక విద్యార్హతలు గల కార్మికులకు  స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించి  వారికి అదనంగా 2 ఇంక్రిమెంట్లు ఇవ్వాలని  పోర్టు  యాజమాన్యాన్ని కలెక్టర్ ఆదేశించారు. 


 తొలగించిన కార్మికులను వారి నుండి వివరణ  తీసుకొని తిరిగి నియామకం  చేయాలన్నారు. బేసిక్ పే పెంపు అంశం ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని దాని గూర్చి ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు.  కార్మికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించుటకు  ఈఎస్ఐ ఆసుపత్రుల్లోనే కాకుండా, ఇతర ఆసుపత్రుల్లో కూడా చికిత్స అందించుటకు  చర్యలు తీసుకోవాల్సిందిగా  పోర్టు యాజమాన్యానికి తెలిపారు. పోర్టు యాజమాన్యం సామాజిక బాధ్యతగా  పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచుటకు కృషి చేయాలన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ అనంతరం వచ్చే గ్రాట్యూటి వీలైనంత ఎక్కువ అందించేందుకు గల అవకాశాలను పరిశీలించాలన్నారు.  కార్మికుల యూనియన్ బిల్డింగు  పోర్టు ఆవరణ బయట  నిర్మించుకొనుటకు నిధులు అందజేస్తామన్నారు. కార్మికులకు రుణాలు మంజూరు విషయమై  బ్యాంకులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. పోర్ట్  యాజమాన్యం కార్మిక సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలపై తీసుకున్న చర్యలను  వారం రోజుల్లో  నివేదిక  సమర్పించాలన్నారు.

   కార్మికులకు సమస్యలు ఉంటే  నేరుగా కలెక్టరుకు  తెలియజేయవచ్చునని, పోర్టు సాధారణ  కార్యకలాపాలకు  కార్మికులు అంతరాయం కలిగించకూడదని,  యాజమాన్యంతో చర్చించి  మెరుగైన ఫలితాలను పొందాలని సూచించారు.   గాజువాక శాసనసభ్యులు  తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ  గంగవరం పోర్టు లిమిటెడ్  మరియు గంగవరం పోర్టు సర్వీసెస్  ఉద్యోగులను  ఒకే విధంగా పరిగణించాలన్నారు. 
కార్మికుల తరఫున  నొల్లి  తాతారావు, మాత అప్పారావు మాట్లాడుతూ   కనీస వేతనం అమలు, బేసిక్ పే పెంపు, జిపిఎస్, గ్రాట్యూటీ, డస్ట్ అలవెన్స్, కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, కార్మికులకు వైద్య సదుపాయం తదితర 11 అంశాల సమస్యలను తెలుపగా,  కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ కార్మికులపై కక్ష సాధింపు చర్యలు నిలుపుదల చేయాలని,  పునరావాస  ప్యాకేజీ లో నియమితులైన  ఉద్యోగులు  శాశ్వతమా,  తాత్కాలికమా  వివరణ కావాలని, గంగవరం పోర్టు లిమిటెడ్ మరియు  గంగవరం పోర్టు సర్వీసెస్  సంస్థల ఉద్యోగులను ఒకే విధంగా పరిగణించాలని  కోరగా   ఆయా అంశాలపై   సుధీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.జె.  రావు , సీనియర్  అడ్వైసర్ సాంబశివరావు , సిఈఓ బి.జి  గాంధీ, మాజి శాసనసభ్యులు పల్లా శ్రీనివాస రావు ,ఆర్డిఓ హుస్సేన్ సాహెబ్, జనరల్ మేనేజర్ డిఐసి సిహెచ్  గణపతి,  లేబర్ డిప్యూటీ కమిషనర్ సునీత, డిసిపి ఆనంద్ రెడ్డి,  ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘ నాయకులు,  తదితరులు పాల్గొన్నారు .

Visakhapatnam

2023-06-08 13:09:24

వైభవంగా శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి చక్రస్నానం

 అప్పలాయగుంట  శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకి  ఉత్సవం నిర్వహించారు. ఉదయం 8.45 నుండి 10.15 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు న‌వ‌సంధి, మాడ‌వీధి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం జరుగనుంది. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో ఏఈవో రమేష్, సూపరింటెండెంట్‌  వాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌  శివ కుమార్ పాల్గొన్నారు.

Appalayagunta

2023-06-08 12:59:02

శ్రీ నూకాంబిక దేవాలయ పునః నిర్మాణ శంకుస్థాపన

ఉత్తరాంధ్ర ఇలవేల్పు, పుణ్యక్షేత్రం,అనకాపల్లి గవరపాలెం లో వెలసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయ పునః నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. జగద్గురు శంకరాచార్య సంప్రదాయ విశాఖ శ్రీ శారదా పీఠాధిశ్వురులు శ్రీ సరూపనందేంద్ర సరస్వతి మహాస్వామి ,తత్కరకమల సంజాతులు శ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి మహా స్వామి లచే శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్,బూడి ముత్యాలనాయుడు, ఎంపీ డాక్టర్ బి.వి.సత్యవతి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, దాడి రత్నాకర్, దాడి జయవీర్, ప్రభుత్వ విఫ్ కరణం  ధర్మశ్రీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని దేవస్థాన కార్యనిర్వహణాధికారి బండారు ప్రసాద్ తెలిపారు . అలాగే ముఖ్య అతిథులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి అధికసంఖ్యలో అందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Anakapalle

2023-06-07 13:25:23

అల్లుడి సుద్దులు పుస్తకంలో మా అల్లుడి వేషాలు..

మా అల్లుడు చంద్రబాబునాయుడు కోసం అల్లుడి సుద్దులు పేరిట ఓ పుస్తకం రాశానని అది త్వరలోనే విడుదల చేస్తానని ఏపీ  తెలుగు సంస్కృతి అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. ఆ పుస్తకంలో మా అల్లుడు, ఆయన కుమారుడు లోకేష్ చెబుతున్న నీతులన్నీ ఉంటాయని  తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సమాధి కట్టేయడం ఖాయమంటూ వ్యాఖ్యలు చేశారు. బుధవారం విశాఖలోని ప్రభుత్వ అతిధి గ్రుహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఓటమి తర్వాత చంద్రబాబు, ఆయన కుమారుడు ప్రవాసీలుగా మిగిలిపోతారని.. ఇప్పటికే వాళ్ళు తెలంగాణ నుంచి వచ్చి వెళుతున్నారన్నారు. చంద్రబాబు సిగ్నల్ ఇచ్చిన తర్వాతే వారాహి రోడ్డెక్కుతోందని తెలిపారు. టీడీపీతో కలయిక రాజకీయ నాయకుడుగా పవన్ కళ్యాణ్‌కు తీవ్ర నష్టం కలిగిందని అన్నారు. ఓట్లు చీల్చడం అంత ఈజీ కాదని.. నాయకుడి విధానాలు అర్ధం కాక జనసేన కార్యకర్తలు అయోమయంలో ఉన్నారన్నారు. లోకేష్ చదువు సంధ్య లేని మూర్ఖుడంటూ వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పాదయాత్రలో ముఖ్యమంత్రిపై చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు. వ్యక్తిగత విమర్శలు చేసే కుసంస్కారం లోకేష్ దని అన్నారు. రోజూ సాయంత్రం 5 గంటల నుంచి చేస్తే అది ఈవెనింగ్ వాక్ అంటారే గానీ పాదయాత్ర ఎలా అవుతుందంటూ ఎద్దేవా చేశారు.

ఇటీవల రాజమండ్రిలో విడుదల చేసిన టీడీపీ మానిఫెస్టో ఆత్మవంచన అని తెలిపారు. మహిళలు, రైతులను మోసం చేయడమే చంద్రబాబు ఉద్దేశమన్నారు. కేసుల మాఫీ కోసం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుకు తొలి ప్రయత్నం విఫలమైందన్నారు. పొత్తుల కోసం బీజేపీ పెద్దలను ఆశ్రయించాలనే చంద్రబాబు ఆలోచనలకు బ్రేకులు పడ్డాయన్నారు. కాలం మళ్లీ వెనక్కి తిరిగిందని అన్నారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును ముంచేసిన ఘనుడు చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు అవినీతి కోసం పోలవరంలో ప్రజాధనం దోపిడీకి గురైందని ఆరోపించారు. పొత్తుల కోసం చంద్రబాబు ఎటువంటి ఉపాయాలైన వేస్తారన్నారు. రాజకీయ ప్రయోజనాలు తప్ప శాశ్వత శత్రుత్వాలు పార్టీల మధ్య ఉండవన్నారు. చంద్రబాబును బీజేపీ నమ్మదని... వెంకయ్యనాయుడు చెప్పారనే చంద్రబాబుతో మీటింగ్‌కు అమిత్ షా ఒప్పుకున్నారని తెలిపారు. మరోసారి షా, బాబు భేటీ జరిగితే అప్పుడు ఏదో జరుగుతుందని భావించొచ్చని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో అక్రమ నిర్మాణాల్లో నివాసం ఏర్పరుచుకోవడం సిగ్గులేనితనమంటూ లక్ష్మీపార్వతి విరుచుకుపడ్డారు.

Visakhapatnam

2023-06-07 13:19:33

2023 నైరుతి-పశ్చిమ రుతుపవనాలపై ముందస్తు చర్యలు

రాబోయే రుతుపవనాల సందర్భంలో వరద నిర్వహణ కోసం అన్ని లోతట్టు ప్రాంతాలు మరియు ముంపు ప్రాంతాలను ముందుగా గుర్తించాలని రెవిన్యూ డివిజినల్ అధికా రి హుస్సేన్ సాహెబ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తమ ఛాంబర్లో 2023 నైరుతి-పశ్చిమ రుతుపవనాల కోసం తీసుకోవలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల తహిల్దార్లచే మండల స్థాయిలో  ఎంపిడిఓలు, ఎలక్ట్రికల్, మెడికల్, మున్సిపల్, వ్యవసాయం, పశుసంవర్ధక, అగ్నిమాపక మరియు టెలికమ్యూనికేషన్స్ తదితర శాఖల సమన్వయంతో సమావేశం నిర్వహించాలన్నారు. తుపాను షెల్టర్‌ల పరిస్థితిని పరిశీలించి మరమ్మతులు ఉంటే వెంటనే సరిచేయాలని మండల తహశీల్దార్‌లను ఆదేశించారు. జిల్లాలో సంబంధిత ప్రదేశాలలో అవసరమైన మందులు  తగినంత నిల్వలు అందు బాటులో ఉండేలా చూడాలని వైద్య శాఖ అధికారులకు తెలిపారు. మండల స్థాయిలో రెవెన్యూ, పోలీసు, వైద్య, అగ్నిమాపక, రోడ్లు మరియు భవనాలు మరియు ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయంతో మాక్ డ్రిల్ వ్యాయామాలు నిర్వహించాలన్నారు. జివిఎంసి పరిధిలో శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి,  తగు చర్యలు చేపట్టాలసిందిగా  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కార్యాలయ ఏఓ మనోరంజిని, మెడికల్, జివిఎంసి, పోలీస్, తహసీల్దారులు, తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2023-06-06 14:32:09

సముద్ర తాబేళ్లు రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు.. కలెక్టర్

విశాఖజిల్లాలో అటవీ భూముల ఆక్రమణ దారులపై కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. మంగళవారం  కలెక్టరేటు లోని తన ఛాంబర్ లో జిల్లాస్థాయి ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. అటవీ భూముల రక్షణ , సర్వే , జిల్లాలో హరిత వనాల  పెంపకం , సముద్ర తీర ప్రాంత సంరక్షణ తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ భూముల ఆక్రమణలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అటవీ అధికారులను ఆదేశించారు. అటవీ రక్షణలో భాగంగా అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా, అక్రమ రవాణాలను అరికట్టేందుకు జిల్లాలో నిఘా చేపట్టాలని తెలిపారు. హరిత వనాల పెంపకంలో భాగంగా జూలై నెలలో 15000 మొక్కలు జియో టాగింగ్ చేసి,  పూర్తి సంరక్షణ చర్యలతో నాటుటకు సిద్ధంగా ఉంచాలని ఫారెస్ట్ , జివిఎంసి అధికారులను ఆదేశించారు. పరవాడ మండలం, ఇస్లాంపేట గ్రామంలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి సర్వే చేయాలని విఎమ్ఆర్డిఏ అధికారులను ఆదేశించారు. 

 విశాఖ ఆర్కే బీచ్ లో గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి పనులు చేయడం ద్వారా బీచ్ ప్రాంతం మొత్తం అదనపు లైట్లు మరియు ఆర్టిఫిషియల్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీని వలన సముద్ర తాబేళ్లు  గుడ్ల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయిందని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ టర్టిల్ ఫ్రెండ్లీ బీచ్ ఏర్పాటుకు నో లైట్ జోన్లు ఏర్పాటు చేయాలని జివిఎంసి అధికారులను ఆదేశించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 181 కేసులు బుక్ చేయడం జరిగిందని దీని ద్వారా 14.26 లక్షలు వసూలు చేశామని డి ఎఫ్ ఓ అన్నారు.నాలుగు వన్యమృగాల కేసులు వివిధ దశలలో కోర్టులలో పెండింగ్ లో  ఉన్నాయని తెలిపారు. జిల్లాలో గంజా పెంపకం , అక్రమ రవాణా లేకుండా చూడాలని , అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు . కొన్ని ప్రాంతాల్లో అక్రమ ఇసుక  మైనింగ్ జరుగుతుందని, అరికట్టాలని అధికారులను ఆదేశించారు.  అటవీ అధికారులు రెవెన్యూ, సర్వే ల్యాండ్ అధికారులతో జాయింట్ సర్వే చేసి అటవీ భూముల సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ , జిల్లా ఫారెస్ట్ అధికారి అనంత్ శంకర్ , జూ క్యురేటర్ నందిని సలారియా, జివిఎంసి జోనల్ కమీషనర్ శ్రీనివాస్ , ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-06-06 13:57:20

ఓపిఎస్ మాత్రమే ఉద్యోగులకు ఆమోదయోగ్యం

ఏపీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు అందరికీ ఓపిఎస్ అమలుచేయాలని ఎపిసిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ చైర్మన్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండారెడ్డి, ఖాదర్ బాషాలు డిమాండ్ చేశారు. ఈమేరకు డా.వైఎస్సార్ కడపలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఓ పిఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉద్యోగులు దేన్నీ ఒప్పుకోరని..ఉద్యోగుల భద్రత ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఉద్యో గుల హక్కు లను హరించివేకూడదని వారికి అందవలసిన వేతన బత్యాలు సకాలంలో అందచేయాలని కోరారు. ఉద్యోగులు స్వేచ్ఛగా పనిచేసుకునే వెసులుబాటు కలిగించాలని, జీవి తం మొత్తం ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి పదవీవిరమణ పొందిన ఉద్యోగికి చివరి కాలంలో ఆసరాగా నిలిచేది పెన్షన్ మాత్రమేనని పేర్కొన్నారు. ఉద్యోగులకు అందరికీ పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Kadapa

2023-06-06 08:10:36

వైద్యఆరోగ్యశాఖలో అడ్డదారి నియామకాల విచారణ ఇప్పట్లో తేలదట

విశాఖజిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అడ్డగోలుగా జరిగిన నియామకాలపై డిఎంహెచ్ఓ డా.పి. జగదీశ్వర్రావు కొత్త రాగం అందుకున్నారు. ఈ విచారణ ఇప్పట్లో తేలేదని, ఈ నోటిఫికేషన్ లో చాలా మంది, విభాగాలు ముడిపడి ఉన్నాయని అంటున్నారు. సా..గుతున్న విచారణపై ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఈ వ్యవహారంలో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. వాస్తవానికి అడ్డదాన జరిగిన ఈ నియామకాలు, చెల్లిస్తున్న జీతాలపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఈవిషయంపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వరకూ ఫిర్యాదులు వెళ్లదడంతో జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున విచారణకు ఆదేశించారు. అయితే ఈ నియామకం తన హాయంలో జరగలేదని, అసలు ఎప్పుడు జరిగిందో తెలీదనీ, ఏ నోటిఫికేషన్ ద్వారా కూడా జరిగిందో తెలుసుకునే పని ప్రారంభించామని డిఎంహెచ్ఓ తీరిగ్గా సమాధానం ఇచ్చారు. మరోపక్క దొడ్డిదారిన నియామకాలు చేపట్టిన విషయంలో ఎవరో ఒక సిబ్బందిని బలిపశువుని చేసి విషయాన్ని మమ అనిపించే ప్రయత్నాలు ముమ్మరం చేశారని కూడా ఇదేశాఖలోని సిబ్బంది చెబుతున్నారు. 

విశాఖజిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అధికారులు, సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోవడం వలనే తెరవెనుక చల్లగా జరిగిన ఈ వ్యవహారం మీడియా ముందుకి.. ఆపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వరకూ వెళ్లింది. కాగా ఈ విషయంలో తాజా సమాచారాన్ని అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు చేరవేసే క్రమంలో ఈ అడ్డగోలు నియామకాలు, వ్యవహారం, విచారణపై వివరణ కోరిన ఈఎన్ఎస్ ప్రతినిధికి డిఎంహెచ్ఓ నుంచి వచ్చిన వింతైన సమాధానం ఆశ్చర్యాన్ని..అంతకంటె ఎక్కవ అనుమానాన్ని కలిగించింది. ఒక జిల్లాశాఖ అధికారి కాంట్రాక్టు ఉద్యోగాల నియమకాలు, నోటిఫికేషన్ విషయంలో జరిగిన అవకతవకలపై చిటికేస్తే సమాచారం టేబుల్ పైకి వచ్చి చేరుతుంది. అలాంటిది అసలు ఆ పారామెడికల్ ఉద్యోగ నియామకాలు ఏ నోటిఫికేషన్ ద్వారా జరిగాయో తెలీదని చెప్పడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక వివాదం వార్తల్లో ఉండే విశాఖజిల్లా వైద్యఆరోగ్యశాఖ దొడ్డిదారిన అనధికారికంగా పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిన వ్యవహరంలో జరిగిన నియామకాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. 

ఈ నోటిఫికేషన్ సమయంలో ఎవరెవరు(మినిస్టీరియల్ సిబ్బంది) సదరు సీట్లు చూస్తున్నారు..నియామక ప్రకటన ఏంటి.. ఆ సమయంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిగా ఉన్నదెవరు, ఈ నోటిఫికేషన్ లో వున్న విభాగాల అధికారులు, సిబ్బంది ఎవరు, ఒక్కో పోస్టుకి రూ.2.50 లక్షల నుంచి రూ.3లక్షల వరకూ చేతులు ఎవరి ద్వారా మారాయి, ఇందులో ఎవరి వాటా ఎంత, ఎవరి ద్వారా ఈ విషయం బయటకు వచ్చి మీడియాలో రచ్చ రచ్చ జరుగుతుంది, ఎవరిని కాపాడేందుకు విచారణ కాలయాపన చేస్తున్నారు, మరెవరిని బలిచేసేందుకు కార్యాచరణ సిద్దమైందనే విషయాలను కూడా ఈఎన్ఎస్ నేషన్ న్యూస్ ఏన్సీ ద్వారా త్వరలోనే బయటపెట్టేందుకు ఈఎన్ఎస్ నెట్వర్క్ టీమ్ రంగంలోకి దిగింది. అదే సమయంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి ఈ విచారణ ఇప్పుడప్పుడే తేలేది కాదన్న మాట వెనుక ఏం జరుగుతుంద నే విషయాన్ని కూడా కూపీలాగనున్నది. పెద్ద మొత్తంలో చేతులు మారిన విషయంలో ఇప్పటికే ప్రాధమిక సమాచారం అందుబాటులోకి వచ్చింది..దానిపై మరింత లోతుగా పరిశీలన చేస్తే అసలు విషయం కూడా వెలుగు చూసే అవకాశం ఉందని రెండు వర్గాల్లో ఒకటైన సిబ్బంది మీడియాకి లీకులివ్వడం కొసమెరుపు..!

Visakhapatnam

2023-05-28 05:04:37