వై.ఎస్.ఆర్.జగనన్న కాలనీలలో రోడ్లు, త్రాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీ, తదితర మౌలిక సదుపాయలన్నింటిని కల్పిస్తామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు తెలిపారు. బుధవారం ఆయన జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలసి వి.ఎమ్.ఆర్.డి.ఎ. సమావేశ మందిరములో జిల్లాలో నవరత్నాలు –పేదలందరికి ఇళ్లు కార్యక్రమం అమలు పై అధికారుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా మంత్రి మాట్లాడుతూ ఇళ్ళ నిర్మాణంలో విశాఖ జిల్లాలో మొదటి విడత స్పెషల్ డ్రైవ్ లో 5వేల ఇళ్లు ప్రారంభించాలని లక్ష్యం నిర్ణయించగా 5019 ఇళ్లను ప్రారంభించినందుకు జిల్లా కలెక్టరును, అధికారులను ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలందరికి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తున్నారని తెలిపారు. అధికారులు, సిబ్బంది లబ్దిదారులకు అందుబాటులో ఉంటూ వారికి గృహాల నిర్మాణంలో పూర్తి సహకారం అందించాలన్నారు. జిల్లాలో వై.ఎస్.ఆర్.జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలకు ఇసుక సమస్య లేకుండా ప్రతి కాలనీకి దగ్గరలో ఒక ఇసుక స్టాకు పాయింట్ ఏర్పాటుకు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంగా భావించి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. జగనన్న ఇళ్ల కోసం పెద్ద ఎత్తున భూసేకరణ చేయడం జరిగిందన్నారు. జగనన్న కాలనీలలో లబ్దిదారుల సంతృప్తి ముఖ్యమని వారితో అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. తదుపరి మంత్రి నియోజక వర్గాల వారిగా ఈ కార్యక్రమ ప్రగతి, సమస్యలపై ప్రజా ప్రతినిధులతో చర్చించారు. వారు లేవనెత్తిన పలు సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఏజెన్సీలలో గిరిజనులు మోసానికి గురవుతున్నారని పాడేరు ఎం.ఎల్.ఎ. కె.భాగ్యలక్ష్మి మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. దీనికి మంత్రి స్పందిస్తూ ఈ విషయం పై ఆర్.డి.ఓ. స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.
పర్యాటక శాఖ మాత్యులు ముత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ వై.ఎస్.ఆర్ పేదలందరికి ఇళ్లు పథకం కింద ఊళ్లే నిర్మించ బడుతున్నా యన్నారు. పేదవారికి సహాయం చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. ఇళ్ల నిర్మణాలు అత్యంత నాణ్యతతో నిర్మించాలని అధికారులకు సూచించారు. ఇళ్ల నిర్మాణానికి నిర్దిష్టంగా కాలపరిమితి పెట్టుకొని ఆ గడువులోగా పూర్తి గావించాలన్నారు.
అంతకు ముందు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ వై.ఎస్.ఆర్.జగనన్న కాలనీలలో గృహ నిర్మాణ పురోగతిని మంత్రికి వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని, ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో 5వేల ఫ్లాట్ లు గ్రౌండింగ్ చేయడం జరిగిందని, ప్రతి లబ్దిదారుని సంసిద్దం చేస్తున్నామని తెలిపారు. లే ఔట్ లలో ఉన్న సమస్యలు దశల వారిగా పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, మేయర్ జి. వెంకట హరి కుమారి, అరకు ఎం.పి జి.మాధవి, హౌసింగ్ ఎం.డి భరత్ నారాయణ గుప్తా, జివియంసి కమిషనర్ డా.జి.సృజన, వి.ఎమ్.ఆర్.డి.ఎ. కమిషనర్ పి.కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్లు యం.వేణుగోపాల్ రెడ్డి, పి.అరుణ్ బాబు, కల్పనా కుమారి శాసన సభ్యులు యు.వి.రమణమూర్తిరాజు, పెట్ల ఉమా శంకర గణేష్, జి.అమర్ నాథ్, కె.భాగ్యలక్ష్మి, కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.