వాహన మిత్ర ద్వారా ఎందరో మోటారు డ్రైవర్లకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డితో వీడియో కాన్ఫరెన్సు అనంతరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్తో కలిసి వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా లబ్ధి పొందిన ఆటో డ్రైవర్లతో ఉప రవాణా కమీషనర్ మీరా ప్రసాద్ ఏర్పాటు చేసిన ఆటో ర్యాలీని కలెక్టరేట్ జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో ఆటో డ్రైవర్లు పడుతున్న కష్టాలను స్వయంగా చూసి వారికి ఆర్ధిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన ప్రకారం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ వాహనాలు స్వంతంగా నడుపుకుంటున్న డ్రైవర్లుకు రూ.10,000 ఆర్ధిక సహాయం అందించారన్నారు. జిల్లాలో అర్హత ఉన్న 22,527 మందికి వరుసుగా మూడో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా రూ.10,000 ఆర్ధిక సహాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేశారన్నారు. అర్హత ఉండి లబ్ధి పొందని వారు సైతం సచివాలయాలు ద్వారా దరఖాస్తు చేసుకోనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అవకాశం కల్పించారన్నారు. వాహన మిత్ర పథకం అందించిన ఆర్ధిక సహాయంతో వాహనాల ఇన్స్రెన్సు, రిపేర్లుతో పాటు ఫిట్నెస్ చేసుకునేందుకు వీలు పడుతుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా సూచించారని, దీని వలన రహదారి ప్రమాదాలు సాధ్యమైనంత వరకు తగ్గిపోతాయన్నారు. ఆటోలలో మహిళలు సురక్షితంగా ప్రయాణించటానికి అభయం యాప్ను అందుబాటులో తీసుకురావటం జరిగిందన్నారు. అభయం యాప్ ద్వారా ఆటోలలో ఒక పరికరాన్ని ఏర్పాటు చేస్తారని, ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలు ఇబ్బందులకు గురి అయితే గట్టిగా అరిచిన వెంటనే యాప్ యాక్టివ్ అయ్యి ఆటో ఆగిపోవటంతో పాటు, సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం అందుతుందన్నారు. అభయం యాప్ పైలట్ ప్రాజెక్టు క్రింద విశాఖపట్టణంలో ప్రారంభించటం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఆటోలకు అభయం యాప్ పరికరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. కరోనా కష్టకాలంలోను అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి గొప్పగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, లక్ష్మణరావు, కల్పలత, నగరపాలక సంస్థ మేయరు కావటి మనోహర్ నాయుడు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాళి గిరిధర్, పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మానాయుడు, సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శుభం బన్సాల్, జిల్లా రెవెన్యూ అధికారి పి కొండయ్య, జిల్లా ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్, లబ్ధిదారులు పాల్గొన్నారు.