పరిపాలనా రాజధానిగా మారబోతున్న విశాఖనగరాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు, మురికివాడ రహిత విశాఖ గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ, కోపరేటివ్, మార్కెటింగ్ శాఖ మాత్యులు మరియు జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు కురసాల కన్నబాబు అన్నారు. గురువారం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఆధ్వర్యంలో పర్యాటక, సాంస్కృతిక మరియు యువజన శాఖా మాత్యులు ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి, జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, డా. బి.వి.సత్యవతి, పెందుర్తి నియోజిక వర్గ శాసన సభ్యులు అదీప్ రాజ్, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ తో కలిసి జివిఎంసి చేపడుతున్నపలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ రూ.3వేల కోట్లతో జివిఎంసి అభివృద్ధి పనులను చేపట్టడమైనదని, వచ్చే మార్చి నాటికి ఇది పూర్తి కావాలని కమిషనర్ ను అదేశించారు. విశాఖపట్నం ఒక అంతర్జాతీయ నగరంగా రూపొందుతున్నందున నగర ప్రణాళిక ప్రకారం అన్ని వార్డులలో అభివృద్ధిని వేగవంతం చేయాలని కమిషనర్ ను ఆదేశించారు. 850 ఎకరాల ముడసర్లోవ లో రిజర్వాయరు ను, పార్కును ఆధునీకరించి, అభివృద్ధి పరిచేందుకు రూ.100కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ ప్రాజెక్టులో “థీం పార్కు” లో భాగంగా అన్ని సదుపాయాలతో వచ్చే ఏడాదినాటికి పూర్తి చేయాలని కమిషనర్ ను ఆదేశించారు. “అమృత్” కు సంబంధించిన ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు.
వార్డుల వారీగా ప్రణాలికలను సిద్ధం చేసి ఆయా వార్డులలో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, చేపడుతున్న ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలన్నారు. నగరంలో 11 వందలు ఖాళీ స్తాలాలను గుర్తించడమైనదని, వాటి ద్వారా జివిఎంసి కి రెవెన్యూ పెంచుకోవాలని, వచ్చిన ఆదాయంతో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. పట్టణ ప్రణాలికా విభాగం చాలా బాధ్యతతో వ్యవహరించాలని, ఆక్రమణలు, అనధికార కట్టడాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని కమిషనర్ కు సూచించారు. గుర్తించిన ఖాళీ స్థలాల్లో ముందుగా వాకింగ్ ట్రాక్ లు ఏర్పాట్లు చేయాలన్నారు. దీనివలన ఆక్రమణలు జరగకుండా ఉంటాయన్నారు. తరువాత రక్షణ గోడలు, గ్రీన్ ఫెన్సింగు ఏర్పాటు చేసుకొని, ఖాళీ స్థలాలను ఆక్రమణకు గురికాకుండా పటిష్ట పరుచుకోవాలని కమిషనర్ ను సూచించారు. “విశాఖ పచ్చ తోరణం” పధకంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. జోనల్ వ్యవస్థను పటిష్ట పరచాలన్నారు.
అనంతరం రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు విశాఖ నగరాన్ని మురికివాడ రహిత విశాఖగా తీర్చి దిద్దేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. విశాఖ నగరంలో 774 మురికివాడ రహిత ప్రాంతాలను గుర్తించడమైనదని అందులో, 156 ప్రైవేట్ స్థలాల్లో ఉండగా, మిగిలినవి ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయన్నారు. ఇక్కడ నివసిస్తున్న నివాసితులకు ఇళ్ళ పట్టాలను అందజేస్తామన్నారు. ఇందుకు సంబందించిన నివేదికను సిద్దం చేయవలసినదిగా జివిఎంసి కమిషనర్ ను రాజ్యసభ సభ్యులు ఆదేశించారు. గతంలో డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి అందించిన ఇళ్ళకు, జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం. పధకం క్రింద ఇచ్చిన ఇళ్ళకు రిపేర్లు చేయించాలని, అందుకు ఒక్కొక్క ఇంటికి రూ.10 వేలు పభుత్వం మంజూరు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల స్థలాల్లో మురికివాడలు ఉన్నట్లయితే ఆయా సంస్థలతో చర్చలు జరిపి వారికి ప్రత్యామ్నాయం ఏర్పాటు
చేయవలసినదని రాజ్యసభ సభ్యులు కమిషనర్ ను ఆదేశించారు. జివిఎంసిలో ఉన్న ప్రతి జోన్ లో వెయ్యి మందికి సరిపోయేటట్లు ఒక కన్వెన్షన్ సెంటర్ ను కట్టించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఒక కన్వెన్షన్ సెంటర్ కు రూ.5 కోట్లు ఖర్చు అవుతుందని, మొత్తంగా 8 కన్వెన్షన్ సెంటర్లకు రూ. 40 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందుకు ఎం.పి. లేడ్స్ నుండి తమవంతు నిధులను అందిస్తానని, అవసరమైతే సి.ఎస్.ఆర్. నిధులను కూడా ఏర్పటు చేసుకోవాలని కమిషనర్ కు సూచించారు. జివిఎంసి కి సంబంధించిన వాణిజ్య సముదాయాలు, కళ్యాణ మండపాలు, దుకాణాల యొక్క లీజుల వివరాలతో కూడిన నివేదికను తదుపరి సమీక్షలో సమర్పించవలసినదిగా కమిషనర్ ను ఆదేశించారు.
అనంతరం, టూరిజం, సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖా మాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా బీచ్ లు, గ్రీన్ బెల్టులు విశాఖ నగర నివాసితులకు మౌళిక సదుపాయాలు కల్పించే విధంగా అభివృద్ధి చేయాలన్నారు. జివిఎంసికి సంబంధించి వాణిజ్య సముదాయాలు, దుకాణాల కు సంబంధించి రెవెన్యూ వసూలు పరిశీలించి రెవెన్యూ పెంచాలన్నారు. నగరంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ కు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు నిర్ణీత సమయంలో పూర్తి చేసి ఒక మంచి నివాసిత విశాఖగా రూపొందించాలన్నారు. జివిఎంసి 98 వార్డులలో మురికివాడలు గుర్తించడమైనదని, అక్కడ నివాసితులకు జరిగిన ఎన్నికలలో ఇళ్ళ పట్టాలను ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అందుకు సంబందించిన చర్యలు త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ కు సూచించారు. భీమిలి నియోజక వర్గంలో మొక్కలు నాటాలని, పార్కులు ఏర్పాటు చేయాలని, కావలసిన మౌళిక సదుపాయాలను కల్పిస్తూ అభివృద్ధి పనులను చేపట్టాలని కమిషనర్ కు మంత్రి సూచించారు.
అనంతరం లోక్ సభ సభ్యులు ఎం.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న ఫుట్ పాత్ లకు ఎక్కువ స్థలం కేటాయించడం వల్ల వాహనాలు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని, ఇకపై చేపట్టబోయే రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఫుట్ పాత్ ల వెడల్పును తగ్గించి, రోడ్లు యొక్క వెడల్పును పెంచాలని కమిషనర్ కు సూచించారు. లేఔట్ లో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి వాటికి పన్ను విధించినట్లయితే జివిఎంసి కి ఆర్థిక లాభం చేకూరుతుందని కమిషనర్ కి సూచించారు. అనంతరం అనకాపల్లి లోక్ సభ సభ్యులు డాక్టర్ బి. వి.సత్యవతి మాట్లాడుతూ అనకాపల్లిలోని డ్రైనేజీ నీరు పంట పొలాల్లో కలుస్తుందని, వాటికోసం కల్వర్ట్ లను కట్టించాలని కమిషనర్ కు సూచించారు. అనకాపల్లిలో శాంతి పార్కు, అన్నమయ్య పార్కు మరమ్మతులు చేసి సుందరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ కు సూచించారు.
అనంతరం నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ పారిశుద్ధ్య సిబ్బంది తక్కువగా ఉన్నందున పారిశుద్ధ్య పనులను పూర్తి స్థాయిలో జరగడం లేదని అందుకు కావలసిన సిబ్బందిని పొరుగు సేవల ద్వారా నియమించుకోవాలని కోరారు. సచివాలయ సిబ్బంది విధులు సక్రమంగా జరిగేటట్లు జోనల్ కమిషనర్లు పర్యవేక్షణ జరపాలన్నారు. హనుమంతవాక జంక్షన్ నుండి అడవివరం వరకు బి.ఆర్.టి.ఎస్. రోడ్డులలో మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ కు మేయర్ సూచించారు. అనంతరం పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు అదీప్ రాజ్ మాట్లాడుతూ, పెందుర్తి నియోజకవర్గం లో ఆక్రమణలు అధికంగా ఉన్నాయని, వాటిని అదుపు చేసే చర్యలు చేపట్టాలని కమిషనర్ కు సూచించారు. నియోజకవర్గంలోని పలు వార్డులలో సమస్యలు పరిష్కరించాలన్నారు. పెందుర్తి బి.ఆర్.టి.ఎస్ రోడ్డు పూర్తి చేయాలని కమిషనర్ కు సూచించారు.
అనంతరం డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ మాట్లాడుతూ, వార్డులలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని, చేపట్టబోయే “థీం పార్కులు” అన్ని సదుపాయాలతో అభివృద్ధి చేయాలని, ఆక్రమణలను, అనధికార కట్టడాలను అదుపు చేసే చర్యలు చేపట్టాలని కమిషనర్ కు సూచించారు.
అనంతరం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, జివిఎంసినకు సంబంధించి జరుగుతున్న, జరగబోయే పలు అభివృద్ధి పనులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రజా ప్రతినిధులకు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పలు అభివృద్ధి పనులను రూ.2921.57 కోట్లతో జరుగుతున్నాయని, అందులో 61 స్మార్ట్ సిటీ ప్రాజెక్టు లు, ఏ.డి.బి. ఆర్థిక నిధులతో నాలుగు వాటర్ సప్లై మరియు ఇతర పనులు, “అమృత” పథకంలో భాగంగా మూడు వాటర్ సప్లై, మరియు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులు, ఏ. పి.యు.ఐ.ఎం.ఎల్. లో భాగంగా స్మార్ట్ సిటీ నిధులతో రెండు సివరేజ్ ప్రాజెక్టు పనులు, వేస్ట్ ఎనర్జీ పనులు జరుగుతున్నాయని ప్రజా ప్రతినిధులకు వివరించారు.
కొత్తగా ప్రతిపాదించిన ప్రాజెక్టు పనులు రూ.5,174కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించడం అయినదని, అందులో పరిశ్రమలకు 100ఎం.ఎల్.డి డి-శాలినేషన్ ప్లాంట్, ఏలేరు నుండి జివిఎంసికి 12 టిఎంసిల నీటిని తీసుకొచ్చేటందుకు, ముడసర్లోవ లో “థీం పార్కు” ను అభివృద్ధి చేయుటకు, మరియు రిక్రెయేషన్ జోన్ అభివృద్ధి చేయుటకు.. గాజువాక, సత్యం జంక్షన్, హనుమంతువాక జంక్షన్, కార్ షెడ్ జంక్షన్ల వద్ద నాలుగు“ఫ్లై ఓవర్” లు నిర్మించుటకు, జివిఎంసి పరిధిలో 25 “థీం పార్కు”లు ఏర్పాటు చేయుటకు, 14 వాటరు బాడీస్ అభివృద్ధి చేయుటకు, పలు రోడ్లు అభివృద్ధి చేయుటకు, 15వ ఫైనాన్స్ కమిషన్ కింద పలు రోడ్లు, జంక్షన్ లు అభివృద్ధి చేయుటకు, 8 కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్, కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయుటకు ప్రణాళికలు సిద్ధంచేశామని ప్రతి ప్రజాప్రతినిధులకు కమిషనర్ వివరించారు. స్మశాన వాటికలు అభివృద్ధి చేస్తామని ఎలక్ట్రికల్ క్రిమిటోరియం ఒకటి ఏర్పాటు చేయడమైనదని, మరో మూడు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలో ఐదు కోట్ల రూపాయలతో రెండు లక్షల మొక్కలు నాటుతామని కమిషనర్ తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో ప్రధాన ఇంజనీరు రామకృష్ణ రాజు, అదనపు కమిషనర్లు పి. ఆషా జ్యోతి, డా. వి. సన్యాసిరావు, పర్యవేక్షక ఇంజనీర్లు వినయ్ కుమార్, వేణుగోపాల్, కె.వి.ఎన్.రవి, శివప్రసాద్ రాజు, శ్యామ్సన్ రాజు, రాజారావు, గణేష్ బాబు, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జెడి(అమృత్) విజయ భారతి, యుసిడి(పి.డి.) వై. శ్రీనివాసరావు, ఉద్యానవన శాఖ సహాయక సంచాలకులు ఎం.దామోదర రావు, డి.సి.ఆర్. పి.నల్లనయ్య, అందరు జోనల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.