పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన యావత్ సామాగ్రిని సిద్దం చేసామని, శిక్షణా కార్యక్రమాలతో అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి తెలియజేశారు. సోమవారం సాయంత్రం రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది ప్రిన్సిపల్ సెక్రటరీ, కమీషనర్, రాష్ట్ర ఎన్నికల కమీషన్ కార్యదర్శులు ఉమ్మడిగా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణకు జిల్లాల్లో చేపట్టిన చర్యలను సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి పాల్గొంటూ ఎన్నికల నిర్వహణకు తగిన సంఖ్యలో బ్యాలెట్ బాక్సులు, వివిధ ఫారమ్ లు, సీళ్లు, చెరగని ఇంకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బ్యాలెట్ పత్రాల పరిశీలన నిర్వహించి, అదనంగా అవసరమైన వాటి ముద్రణ చేపడతామని తెలియజేశారు. రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయని, కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఫిర్యాధుల పరిశీలన, ఎన్నికల సమాచార సేవలు నిర్వహిస్తున్నామన్నారు. కోవిడ్-19 పరమైన అన్ని జాగ్రత్తలు, రక్షణ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు అవసరమైన ధర్మల్ స్కానర్లు సేకరిస్తున్నామన్నారు. పోలవరం ప్రోజెక్ట్ ముంపు గ్రామాల నుండి పునరావాస కాలనీలకు తరలి వెళ్లిన ఓటర్లు, తమ పూర్వ గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకుందుకు వీలుగా రవాణా ఏర్పాటు చేసేందుకు అనుమతి జారీ చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) కీర్తి చేకూరి, డిపిఓ నాగేశ్వరనాయక్, జడ్ పి సిఈఓ ఎన్ వి వి సత్యన్నారాయణ, డిప్యూటీ సీఈఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే మహా నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాస్ అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. సోవారం దివంగత ద్రోణంరాజు శ్రీనివాస్ 60వ జయంతిని పురస్కరించుకొని ఆయన తనయుడు శ్రీవాస్తవ జిల్లా పరిషత్ కూడలి అంకోసా హల్ లో మెగా రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ, భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోయే మంచి మనసున్న వ్యక్తి ద్రోణంరాజు శ్రీనివాస్ అని కొనియాడారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ అందరినీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించే ద్రోణంరాజు శ్రీనివాస్ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. శ్రీవాస్తవ మాట్లాడుతూ తన తండ్రి షష్టిపూర్తి మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని భావించామని, అయితే ఆయన అకాల మరణం దుఃఖాన్ని మిగిలించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది ఆయన జయంతి రోజున సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నది తమ ఆకాంక్షగా చెప్పారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తైనాల విజయకుమార్ వైసిపి నాయకులు పక్కి దివాకర్, రవిరెడ్డి, ఉడారవి, బాణాల శ్రీనివాస్, చరణ్ , వంకాయలో తాతాజీ, కు౦టు ముచ్చు తాతారావు,మాజీ కార్పొరేటర్ సాయిలక్ష్మి ,హేమలత దాడి సత్యనారాయణ, కొండ రాజీవ్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికలు సునిశితమైనందున ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించాలని, సమస్యాత్మక ప్రాంతాలు కలిగిన జిల్లాల్లో శ్రీకాకుళం కూడా ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి , కమీషనర్ ఎం.గిరిజాశంకర్ తో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతీ అంశం సునిశితమైందని, కావున పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు ఎన్నికల ప్రవర్తన నియమాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఓటర్ల జాబితా , బ్యాలెట్ బాక్సులు ( అదనపు బాక్సులతో సహా ), బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పోలింగ్ మెటీరియల్ ను సరఫరా చేసేందుకు అవసరమైన నాలుగు చక్రాల వాహనాలను సిద్దం చేసుకోవాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కౌంటింగ్ సమయంలో ఓట్లు ప్రాతిపదికన అవసరమైన కౌంటింగ్ టేబుళ్లను సిద్ధం చేసుకోవాలని, రిటర్నింగ్ అధికారి కొరకు ప్రత్యేకంగా ఒక టేబుల్ ను ఉంచాలని చెప్పారు. ఇందుకు ప్రత్యేకంగా గదిని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలని, ప్రతీ పోలింగ్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రాలలో అవసరమైన లైటింగును ఏర్పాటుచేసుకోవాలని, ఏజెంట్లకు అనుమతిని ఇవ్వాలని చెప్పారు. 5వేల నుండి 10వేల ఓటర్లు కలిగిన ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని, అలాగే కౌంటింగ్ రాత్రి 10గం.ల వరకు జరిగే అవకాశం ఉన్నందున అధిక సంఖ్యలో పోలీసులు, అధికారులను ఏర్పాటుచేసి అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఎన్నికలు పద్ధతి ప్రకారం, ఎన్నికల సరళి మేరకు పోలీసుల సహకారంతో సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ జిల్లాలో బ్యాలెట్ బాక్సులను పరిశీలించి సిద్ధం చేయడం జరిగిందన్నారు. స్టేజ్ -1 మరియు 2లకు సంబంధించి ఆర్.ఓలను నియమించడం జరిగిందని, స్టేజ్ -2 ఆర్.ఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు చెప్పారు. పి.ఓలు, ఓ.పి.ఓలకు రెండు దశలలో మండలస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని చెప్పారు. ఓటర్ల జాబితా పరిశీలించడం జరిగిందని, ప్రతీ గ్రామ పంచాయతీలో సంబంధిత ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తునట్లు చెప్పారు. మోడల్ బ్యాలెట్ పేపర్లను కూడా పరిశీలించడం జరిగిందని, ఆ మేరకు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మండల, గ్రామస్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలుచేస్తున్నామని వివరించారు.కోవిడ్ మెటీరియల్ కూడా సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు రూట్ అధికారులను కూడా ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ వీడియో సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు, సహాయ కలెక్టర్ యం.నవీన్, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని పంచాయతీ ఎన్నికల మొదటి దశ (స్టేజ్ -1) రిటర్నింగు అధికారుల శిక్షణకు హాజరు కాని అధికారులకు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ షోకాజ్ నోటీసు జారీ చేసారు. ఈ మేరకు సోమ వారం షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ మూడు రోజులలో సంజాయిషీ సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికల నియమ నిబంధనలు, సిసిఏ నిబంధనల క్రింద క్రమ శిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించాలని ఆయా ఉపాధ్యాయులకు తెలిసినప్పటికి నిర్లక్ష్య ధోరణి అవలంభించి స్టేజ్ – 1 రిటర్నింగు అధికారులు, సహాయ రిటర్నింగు అధికాల శిక్షణా తరగతులకు హాజరు కాలేదని ఆయన అన్నారు. షోకాజ్ నోటీసులు జారీ చేసిన వారిలో రిటర్నింగు అధికారులుగా నియమితులైన మందస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రేడ్ – 2 ప్రధానోపాధ్యాయులు ఎం.భాస్కర రావు, ఇచ్ఛాపురం సబ్ రిజిస్ట్రార్ వెలమల తులసీదాస్, సహాయ రిటర్నింగు అధికారులు భామిని మండలం మనుమకొండ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు జి.భాస్కర రావు, చిన్నబగ్గ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కె.ఆనంద్, రాజాం మండలం కంచరాం ఎస్.సి కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మరిచర్ల గంగారావు ఉన్నారు.
సమాజ ప్రగతిలో జర్నలిస్టుల పాత్ర అత్యంత ప్రసంశనీయమని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఎ.పి. బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విశాఖలోని వైశాఖి జలఉద్యాన వనంలో విశాఖ జిల్లా జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వాసుపల్లి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విశాఖ జిల్లా జర్నలిస్టులు ప్రగతి సాదకులు అని కొనియాడారు. తాను ఈ స్థాయికి ఎదిగానంటే అందులో జర్నలిస్టుల పాత్ర కూడా ఉందన్నారు. వారి సంక్షేమానికి ప్రభుత్వపరంగా, తాను వ్యక్తిగతంగా కూడా కృషిచేస్తానన్నారు. కార్యక్రమానికి గౌరవ అతిధిగా హాజరైన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఎ.పి. వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాలలో అత్యంత బలమైన యూనియన్ గా నిలిచామన్నారు. కేవలం తాము చేపట్టి కార్యక్రమాలను మాత్రమే కొనిసాగిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. జర్నలిస్టులను కోవిడ్ వారియర్స్ గా గుర్తించాలని ప్రధానమంత్రి మోడి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలికి వినతిపత్రాలు నివేదించామన్నారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు పూర్తి స్థాయిలో మంజూరు చేయాలని, ఇండ్ల స్థలాలు తక్షణమే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. 2021లో విశాఖ జిల్లాకు సంబంధించి 800 మంది జర్నలిస్టులకు సభ్యుత్వం జారి చేయడం జరుగుతుందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఫెడరేషన్ అర్బన్ అధ్యక్షులు పి. నారాయణ మాట్లాడుతూ అందరి సహాకారంతో ఫెడరేషన్‌ను పూర్తి స్థాయిలో బలో పేతం చేస్తున్నామన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. వారం రోజులు పాటు అర్బన్, రూరల్ లో సభుత్వ నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతుందన్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి, శ్రీనుబాబు చేతులు మీదగా పలువురు జర్నలిస్టులకు సభుత్వం నమోదు కార్డులు అందజేసారు. అనంతరం జర్నలిస్టులు వాసుపల్లికి ముందస్తుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సాత్కారించారు.
కార్యక్రమంలో ఫెడరేషన్ అర్భన్ కార్యదర్శి ఎస్. అనురాధ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి. రవికుమార్, బ్రాడ్ కాస్ట్ విశాఖ జిల్లా అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, ఉపాధ్యక్షలు బి. శివప్రసాద్, ఎ.సాంబశివరావు, కె. మురళీకృష్ణ, రాష్ట్ర సభ్యులు జి. శ్రీనివాసరావు, సినియర్ నాయకులు పి.ఎ.ఎన్. పాత్రుడు, చింత ప్రభాకారరావు, జి. రాంబాబు, వై.రామకృష్ణ, ఎన్.రామకృష్ణ, ఇజ్రాయల్, బొప్పన రమేష్, అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.
ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. సోమవారం వాసుపల్లి జన్మదినోత్సవ వేడుకలు వైఎస్సార్సీపీ కార్యకర్తల కుటుంబంలో అట్టహాసంగా జరిగాయి. 29 వార్డులో వైస్సార్సీపీ స్టేట్ యూత్ సెక్రటరీ మాన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో ఎమ్మెల్యే భారీ కేక్ ను కట్ చేశారు. అనంతరం నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైఎస్సార్ అంటే ప్రజల్లో చెరగని ముద్రవుందని, ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ సారధ్యంలో పనిచేస్తూ, ప్రజాసేకు తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. దానికోసం ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సీఎం వైఎస్ జగన్ బాటలోనే నడుస్తానని అన్నారు. తనను నమ్ముకున్న ఎవరికీ అన్యాయం జరగకుంగా నియోజవర్గం అభివ్రుద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని కార్యకర్తలకు నాయకులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి కార్యకర్తలు, అభిమానులు గజమాలతో సత్కరించారు. వైస్సార్సీపీ సీనియర్ నాయకులు జాన్ వెస్లీ, వార్డ్ ప్రెసిడెంట్, కార్పోరేటర్ అభ్యర్థి, బీసీ డైరెక్టర్లు, వార్డు సీనియర్ నాయకులు, వార్డు బూత్ ప్రెసిడెంట్ లు, వార్డు అనుబంధ సంఘ ప్రెసిడెంట్ లు తదితరులు పాల్గొన్నారు.
ప్రయివేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఫీజుల వసూలులో ప్రత్యేక విధానం తీసుకొస్తామని.. ఇక నుంచి ఏకరూప ఫీజుల విధానం అమల్లోకి తీసుకొస్తామని పాఠశాల విద్యా నియంత్రణ మరియు పరిశీలన కమిషన్ సభ్యులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా కమిషన్ సభ్యులు ప్రొ. వి. నారాయణ రెడ్డి, సి.ఎ.వి. ప్రసాదు సోమవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. విజయనగరం రూరల్ పరిధిలోని మల్లిచర్ల జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. మనబడి నాడు-నేడు పనులను, అక్కడ కల్పించిన ఇతర వసతులను పరిశీలించారు. అనంతరం డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాఠశాల, జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు, వసతుల కల్పనకు, విద్యలో నాణ్యత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దానిలో భాగంగానే కమిషన్ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. 13 జిల్లాల్లో ఉన్న జూనియర్ కళాశాలలు, పాఠశాలలను దశల వారీగా తనిఖీ చేస్తామని చెప్పారు. విజయనగరం జిల్లాలో విద్యా పథకాల అమలు బేషుగ్గా ఉందని పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన, మనబడి నాడు-నేడు, అమ్మ ఒడి, మధ్యాహ్న భోజన పథకాల అమలు తీరు బాగుందని, జిల్లా అధికారులు తీసుకున్న నిర్ణయాలు ప్రశంసనీయమని కితాబిచ్చారు.
విద్యా వ్యవస్థ రూపు మార్చేందుకు సంస్కరణలు
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రూపు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు చేపట్టిందని, మరిన్ని మార్పులు తీసుకొచ్చి సరికొత్త విద్యావిధానం అందుబాటులోకి తీసుకురానుందని పేర్కొన్నారు. ఇప్పటికే జగనన్న విద్యాదీవెన, అమ్మ ఒడి, మనబడి నాడు-నేడుతో మార్పు మొదలయిందన్నారు. రూ.27వేల కోట్లతో పాఠశాలల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందని గుర్తు చేశారు. త్వరలోనే ఏక రూప ఫీజుల విధానం అమల్లోకి తీసుకొస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులుగా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయివేటు, ఆన్ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఒకటే ఫీజు విధానం అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో, జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల కమిటీ ఉండేలా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని వివరించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేయాలని, నైపుణ్యతలు మెరుగుపరుచుకోవాలని ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు సూచించారు.
ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక పోర్టల్, టోల్ ఫ్రీ నెంబర్
ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కమిషన్ సభ్యులు వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఉండే సమస్యలపై నేరుగా టోల్ ఫ్రీ నెంబర్ ; 9150381111 లేదా apsermc@apschooledu.in మెయిల్‌ని సంప్రందించి ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల నిమిత్తం https://apsermc.ap.gov.in చిరునామాతో ప్రత్యేక పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రయివేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కోవిడ్ నేపథ్యంలో 30 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని, కాని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలోనే ప్రతి జిల్లాలోని ప్రయివేటు పాఠశాలల్లో, జూనియర్ కళశాలల్లో టోల్ ఫ్రీ నెంబర్ అందరికీ తెలిసిలే పోస్టర్లు అంటిస్తామని, నోటిస్ బోర్డుల్లో డిసప్లే చేస్తామని చెప్పారు. అయితే అన్ని పనులూ ప్రభుత్వమే చేయలేదని తల్లిదండ్రలు కూడా ప్రయివేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అందే విద్యపై, వసతులపై ప్రశ్నించాలని కమిషన్ సభ్యులు సూచించారు. ఫీజులు, వసతుల కల్పనపై పేరెంట్స్ కమిటీలు ఆరా తీయాలని, అందరిలో చైతన్యం వచ్చినప్పుడే ఫీజుల విధానంలో నియంత్రణ తీసుకురాగలమని కమిషన్ సభ్యులు అభిప్రాయపడ్డారు. యూనిఫారాలు, ప్రత్యేక పుస్తకాలు, ఐఐటీ పేర్లతో ప్రయివేటు పఠశాలలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని విలేకరులు అడగ్గా ప్రతి సమస్యకూ త్వరలోనే పరిష్కారం చూపిస్తామని సభ్యులు పేర్కొన్నారు.
సమావేశంలో డీఈవో జి.నాగమణి, డిప్యూటీ డీఈవో ప్రేమ్‌కుమార్, విద్యాశాఖ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఎమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసే విధంగా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ పని చేస్తుందని కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు కీర్తీ చేకూరి (అభివృధ్ధి), జి.రాజకుమారి (సంక్షేమం)లతో కలిసి కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని స్పందన హాలులో ఏర్పాటు చేసిన స్ధానిక సంస్ధల ఎన్నికల కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పరిశీలించారు. కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన టీముల ద్వారా ఎన్నికల్లో పోటీ చేసే వారు ఏమైనా సందేహాలు ఉంటే తెలుసుకునే విధంగా ప్రత్యెక విభాగం పని చెస్తుందన్నారు. వీటి కోసం కంట్రోల్ రూమ్ లో 8106149123, 8106121345 నంబర్లకు సంప్రదించే విధంగా ఏర్పాట్లు వున్నాయన్నారు. ఎన్నికల్లో రోజు వారీగా జరుగుతున్న సమాచారాన్ని మండలాల వారీగా సేకరించే విధంగా రిపోర్ట్స్ కన్సాలిడేషన్ టీం పని చేస్తుందన్నారు. ఎన్నికల్లో అభ్యర్ధులు చేస్తున్నఖర్చులను గుర్తించడానికి ఎక్స్ పెన్డీచర్ మోనిటరింగ్ సెల్ పని చేస్తుందన్నారు. అదే విధంగా గ్రామస్ధాయిలో పంచాయతీలకు పోటీ చేసే అభ్యర్ధులు తమకు కావలసిన నోడ్యూ సర్టిఫికేట్ పర్యవేక్షించడానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ వంటి అంశాలను పరిష్కరించే విధంగా హెల్ప్ డెస్క్ ను సంప్రదించే విధంగా ఏర్పాట్లు ఉన్నాయన్నారు. కోవిడ్ కు సంబంధించిన సమాచారంపై కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాట్లు వున్నాయన్నారు. వీటికి సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షిస్తుండడమే కాకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ను మెప్మా ప్రోజెక్ట్ డైరెక్టర్ కె.శ్రీరమణి పర్యవేక్షిస్తారని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా విభాగాలను సందర్శించి అక్కడ జరుగుతున్న విధానాన్ని నేరుగా తెలుసుకొని తగిన సలహాలు, సూచనలు చేశారు.
రాజ్యాంగబధ్ధంగా ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ డా.ఎన్.రమేష్ కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమీషనరు ఎన్.రమేష్ కుమార్ మాట్లాడారు. పంచాయితీ ఎన్నికల ప్రక్రియ పరిశీలస నిమిత్తం జిల్లాలలో పర్యటనలో భాగంగా సోమవారం శ్రీకాకుళం పర్యటనకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ రాజ్యాంగ నిర్దేశానుసారం ఏర్పడినదని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు పునాది అని, ఎన్నికల కమీషన్ స్వీయ నియంత్ర పాటిస్తుందని తెలిపారు. నిబంధనల పరిమితికి, పరిధికి లోబడి బాధ్యతలు నిర్వహించడం జరుగుతుందన్నారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం, గౌరవం వున్నాయని న్యాయ వ్యవస్థపై విశ్వాసంతోను, విధేయతతోను పనిచేస్తున్నట్లు చెప్పారు.అన్ని వ్యవస్ధలు రాజ్యంగం సూచించిన మేరకు పని చేయడం వలన మంచి వ్యవస్ధ ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఎన్నికలు స్వేఛ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగాలని, సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఆర్టికల్ 73, 74 ద్వారా పంచాయతీలకు నిధులు, విధులను నిర్దేశించడం జరిగిందన్నారు.బాధ్యతాయుతమైన నాయకత్వం రావాలని కోరారు. ఆరోగ్యకరమైన పోటీతో , పారదర్శకమైన ఎన్నికల ద్వారా పటిష్టవంతమైన సమాజ నిర్మాణం సాధ్యపడుతుందని తెలిపారు. త్వరలోనే నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, యాప్ ను రూపొందించనున్నామని , ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. మీడియా ద్వారా బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ రూపొందుతుందని తెలిపారు. మంచి చెడులను మీడియా విశ్లేషణ చేస్తుందని తద్వారా సమాజానికి మంచి సందేశం వెళుతుందని పేర్కొన్నారు. ఏకగ్రీవ ఎన్నికలపై మాట్లాడుతూ అన్ని వర్గాలు సమైఖ్యంగా కలసి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మంచిదేనని అన్నారు. అసామాన్యంగా ఏకగ్రీవాలు జరగడం మంచిది కాదని హితవు పలికారు. రాజ్యాంగ బద్ధంగా, నైతికంగా అటువంటి ఎన్నికలు చెల్లుబాటు కాదని స్పష్టం చేసారు. గతంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరుగా బాధ్యతలు నిర్వహించడం జరిగిందని, జిల్లాపై అభిమానం వుందని చెప్పారు. జిల్లాలో ప్రతిభావంతులైన అధికారులున్నారని ఇది చాలా సంతోషదాయకమని అన్నారు. ఎన్నికల నిర్వహణ పట్ల చాలా సంతృప్తిగా వుందన్నారు.మానవ వనరుల లభ్యత దృష్ట్యా పనిభారం ఉద్యోగులపై కొంత ఉండవచ్చని అయితే ఆకుంఠితదీక్షతో ప్రభుత్వ ఉద్యోగులు విధుల నిర్వహణ చేయడం శుభసూచకమన్నారు. తద్వారా ఎటువంటి విపత్కర పరిస్ధితులను అయినా చక్కగా ఎదుర్కోవడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో వంశధార, నాగావళి వరదలు, ఇతర విపత్కర పరిస్ధితుల్లో ఉద్యోగుల పనితీరు ప్రశంసనీయమని అన్నారు.
జిల్లా కలెక్టర్ జె.నివాస్ జిల్లా పంచాయితీ ఎన్నికల నిర్వహణ పట్ల వివరించారు. జిల్లాలో నాలుగు విడతలలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఆదివారంతో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని తెలిపారు. పోలింగు సిబ్బందికి శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని, ఎం.సి.సి. టీమ్ నియమించామని, చెక్ పోస్టుల వద్ద నిఘా ఏర్పాటు చేసామని తెలిపారు. కలెక్టరేట్ లోను కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్లను ఏర్పాటు చేసామని తెలిపారు. బ్యాలట్ బాక్సులు, ఎన్నికల మెటీరియల్ సిధ్ధం చేయడం జరిగిందని కలెక్టర్ ఎన్నికల కమీషనర్ కు వివరించారు.జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించుటకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రత్యేక అధికారి అదనపు పోలీసు డైరక్టర్ జనరల్ సంజయ్, డి.ఐ.జి. ఎల్.కె.వి.రంగారావు, జిల్లా పోలీసు సూపరెంటెండెంటు అమిత్ బర్దార్, సంయుక్త కలెక్టర్లు సుమీత్ కుమార్, డా.కె.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో పంచాయితీ సమరం రేపటి నుంచి ఆరంభం కానుంది. 415 గ్రామ పంచాయితీల ఎన్నికకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. వెనువెంటనే జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమవుతోంది. దీనికి అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. మొత్తం 117 క్లష్టర్లలో నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ఫేజ్-2 ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని పార్వతీపురం డివిజన్‌లో ఈ నెల 13న గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, కురుపాం అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 15 మండలాలకు చెందిన 415 గ్రామ పంచాయితీల్లోని సర్పంచ్ పదవులకు, వార్డులకు ఈ విడత ఎన్నికలు జరుగుతాయి. ఈ గ్రామాల్లో మంగళవారం నుంచీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రతీ నాలుగైదు పంచాయితీలకు కలిపి క్లష్టర్ల వారీగా, మొత్తం 117 క్లష్టర్లలో నామినేషన్లను స్టేజ్-1 రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారు. తొలిదశ ఎన్నిక జరిగే ప్రాంతాన్ని 67 జోన్లుగా, 121 రూట్‌లుగా విభజించారు. స్టేజ్ 1 లో మొత్తం 147 మంది ఆర్ఓలు, 147 మంది ఏఆర్ఓలు, స్టేజ్ 2లో 4,299 పిఓలు, 5,109 మంది ఓపిఓలు ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఇప్పటికే రెండు విడతలుగా శిక్షణ పొందారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు 172 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. అలాగే ఇలాంటి ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియతోపాటు, ప్రచారం, ఓటింగ్ మొదలగు వివిధ దశలను 74 మంది వీడియో గ్రాఫర్లద్వారా వీడియో రికార్డింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
2వ తేదీ నుంచి ప్రతిరోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటలు వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. 5వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. అభ్యర్థులు అప్పీల్ చేసుకొనేందుకు 6వ తేదీ సాయంత్రం 5 గంటలు వరకు గడువుంది. అప్పిలేట్ అధికారి వారి అప్పీళ్లను 7వ తేదీన పరిశీలిస్తారు. 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటలు వరకూ నామినేషన్లను ఉపసంహరించుకొనే అవకాశం ఉంది. ఆ తరువాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ 15 మండలాల్లో 3,908 పోలింగ్ కేంద్రాల ద్వారా 13వ తేదీ ఉదయం 6.30 నుంచి 3.30 గంటలు వరకూ ఎన్నిక జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి, విజేతను ప్రకటిస్తారు. అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. ఈ 415 పంచాయితీల్లో మొత్తం 6,19,834 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 3,06,633 మంది కాగా, మహిళా ఓటర్లు 3,13,164 మంది, 37 మంది ఇతరులు ఉన్నారు.
రాష్ట్రంలో మరో సరికొత్త పథకం అమల్లోకి వచ్చింది.. ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలోని ఇతర జిల్లాలకంటే ముందుగా, విజయనగరం జిల్లాలో సోమవారం లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఇటీవలే కొత్తగా పంపిణీ చేసిన రేషన్ సరఫరా వాహనాల ద్వారా, రేషన్ సరుకులను లబ్దిదారుల ఇంటివద్దకే అందించే వినూతన్న పథకానికి అధికారులు శ్రీకారం చుట్టారు. విజయనగరం పట్టణం, 41వ వార్డు అంబేద్కర్ కాలనీలోని 4వ నెంబరు రేషన్ డిపో పరిధిలో, సోమవారం ఉదయం 5.15 గంటలకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్‌కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిగిలిన ఇతర జిల్లాలకంటే ముందుగా, ఉదయాన్నే పంపిణీకి శ్రీకారం చుట్టారు. బియ్యం, పంచదార, కందిపప్పును లబ్దిదారులకు అందజేశారు. రేషన్ కార్డుదారు కోటిపల్లి ఉమ కు తొలిసారిగా సరుకులను అందించారు. ఇకనుంచీ సరుకుల కోసం కార్డుదారులు రేషన్ డిపోలవద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు. ప్రతీనెలా వారి ఇంటివద్దకే సరుకులు చేరనున్నాయి. ఐదు మున్సిపాల్టీల పరిధిలోని 151 రేషన్ డిపోల పరిధిలో మొత్తం 79 వాహనాల ద్వారా సరుకుల పంపిణీ జరుగుతోంది. తొలిరోజు సుమారు 6,160 మంది లబ్దిదారులకు నిత్యావసర సరుకులను అందించనున్నారు. ఈ పథకాన్ని అమలు చేయడం పట్ల లబ్దిదారులనుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా సరఫరా అధికారి పాపారావు, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, తాశీల్దార్ ప్రభాకర్, డిటిలు, ఇతర సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
ఇంటింటికీ రేషన్ పంపిణీ పథకాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మున్సిపల్ ప్రాంతాల్లో సోమవారం నుంచీ అమలు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలోనే ఇతర జిల్లాల కంటే ముందుగా ఉదయం 5 గంటలకే ఈ పథకాన్ని ప్రారంభించడం ద్వారా రికార్డు సృష్టించామన్నారు. విజయనగరం కార్పొరేషన్‌తోపాటు బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాల్టీలు, నెల్లిమర్ల నగర పంచాయితీ పరిధిలోని లబ్దిదారులకు రేషన్ సరుకులను, వారి ఇంటివద్దకే అందించడం జరుగుతుందని తెలిపారు.
ఇంటింటికీ రేషన్ సరఫరా పథకాన్ని అమలు చేయడం పట్ల లబ్దిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇకనుంచీ రేషన్ షాపులవద్ద క్యూల్లో గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేకుండా పోయిందని, పథకం తొలి లబ్దిదారులు కోటిపల్లి ఉమ దంపతులు అన్నారు. ఇచ్చిన సరుకుల పట్ల, తూకం పట్లా, సరుకుల నాణ్యతపట్లా వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ సంక్షేమం కోసం ఇటువంటి సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డికి, ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ బద్ధమైన విధి అని, నియమ, నిబంధనల మేరకు పారదర్శకంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ వి.వినయ్ చంద్ సృష్టం చేశారు. సోమవారం నాడు స్థానిక విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనా లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై తహసీల్దార్లు, ఎంపిడివో లు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల లో ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా క్యాలెండర్ ప్రకారం పనిచేయాలని, ఏ మాత్రం అలసత్వం వహించినా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని తెలియ జేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎప్పటికపుడు రిపోర్టులు పంపించాలన్నారు. ఎన్నికల మ్యానువల్స్, హ్యాండ్ బుక్ లను, క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, అప్పుడే క్షేత్ర స్థాయిలో తలెత్తే పరిస్థితులను అధిగమించ గలుగుతారని వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి వివక్ష చూపరాదని తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు వారికి కేటాయించిన ప్రాంతంలో అందుబాటులో ఉండి, కింది స్థాయి సిబ్బందికి మార్గదర్శనం చేయాలని అన్నారు. రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులకు రెండు సార్లు శిక్షణ ఇవ్వాలని కోరారు. పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించాలని తెలిపారు. పోలింగ్ బృందాలకు ఎన్నికల మెటీరియల్ పంపిణీ సందర్భంగా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. పోలింగ్ అనంతరం తక్షణమే కౌంటింగ్ చేయడానికి ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగార్జున సాగర్ నియమ, నిబంధనలను క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాల్ రెడ్డి, పి.అరుణ్ బాబు, ఆర్.గోవింద రావు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎస్.వెంకటేశ్వర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్.మౌర్య, డిఆర్ఓ ఎ.ప్రసాద్, ఆర్డీవో లు సీతారామారావు, శివజ్యోతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నిజాయితీ, ఖచ్చితత్వం, పారదర్శకతతో ఎ న్నికల పోలింగ్ ప్రక్రియ, ఫలితాల వెల్లడి చేపట్టాలని క్రిష్ణాజిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు. స్ధానిక ఇరిగేషన్ కార్యాలయ రైతుశిక్షణా కేంద్రంలో సోమవారం కృష్ణాజిల్లా ఎ న్నికల పరిశీలకులు టి.యస్. బాలాజీరావు, జాయింట్ కలెక్టర్లతో కలిసి విజయవాడ డివిజన్ పరిధిలోని స్టేజ్-2 ఆఫీసర్ల శిక్షణా కార్యక్రమంలో కలెక్టరు పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ మాట్లాడుతూ స్టేజ్-2 ఆఫీసర్లు ఎ న్నికల రిటర్నింగ్ అధికారులుగా ఎ న్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితా ప్రకటించిన తర్వాత గురుతరమైన బాధ్యతను చేపట్ట ఉండాల్సి ఉందన్నారు. 4వ తేదీ సాయంత్రం ఎ న్నికల పోటీలో నిలిచే అభ్యర్ధులను ప్రకటించిన సమయం నుండి ఫలితాల ప్రకటన వరకు రాష్ట్ర ఎ న్నికల కమిషన్, ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలను ఖచ్చితత్వంగా పాటించాల్సి ఉందన్నారు. ఎ టువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా విధులను చేపట్టాలని, ఎ న్నికల విధులకు గైర్హాజరు అయితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టరు స్పష్టంచేశారు. ఇప్పటివరకు చేపట్టిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరిగిందని, ఇందుకు అధికారులను, సిబ్బందిని కలెక్టరు అభినందించారు. కృష్ణాజిల్లా ఎ న్నికల పరిశీలకులు యల్.యస్. బాలాజీరావు మాట్లాడుతూ రాష్ట్ర ఎ న్నికల సంఘంకు కళ్లు, చెవులుగా ఎ న్నికల పరిశీలకులు బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. రాష్ట్ర ఎ న్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచ తప్పకుండా క్షేత్రస్ధాయిలో విధులు నిర్వర్తించాలన్నారు. ఈవిషయంలో మార్గదర్శకాలను “ రోబో టిక్ ” గా నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. ఇబ్బందులు కలిగించే అంశాలు ఏమైనా ఉత్పన్నం అయితే వాటిని నివృత్తి చేసుకోవాలన్నారు. ఎ న్నికల ప్రక్రియలో ఎ టువంటి సందేహాలు ఉన్నా ఉన్నతాధికారులను సంప్రదించి ఖచ్చితంతోకూడి ఎ న్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎ న్నికల ప్రక్రియ సరళిని పరిశీలించడం జరుగుతుందని ఆయన తెలిపారు. జాయింట్ కలెక్టరు (అభివృద్ది) యల్. శివశంకర్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎ న్నికల ప్రక్రియ సజావుగా జరిగేలాగా సూచనలు చేయడం జరిగిందన్నారు. ఓటర్లు కనీసం రెండుమీటర్ల దూరాన్ని పోలింగ్ సమయంలో క్యూలైన్లలో పాటించాల్సి ఉందన్నారు. ఎ న్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి గ్లౌజ్‌లు, శానిటైజర్లు, మాస్క్‌లను అందిస్తున్నామన్నారు. ఓటర్లకు శానిటైజ్ చేసేందుకు ప్రత్యేకంగా ఒక సహాయకుడిని నియమించుకోవాలన్నారు. సంబంధిత పోలింగ్ కేంద్రం బియల్ఓ వారి పరిధిలోని కరోనాపాజిటివ్ ఉన్న వ్యక్తులను ముందస్తుగానే గుర్తించాల్సి ఉంటుందన్నారు. వారికి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు ఓటింగ్ అవకాశం కల్పిస్తామన్నారు. వారికి ప్రత్యేకంగా పిపిఇ కిట్‌లు కూడా పంపిణి చేస్తామన్నారు. జాయింట్ కలెక్టరు (సంక్షేమం) కె. మోహనరావు మాట్లాడుతూ ఈరోజు నిర్వహించిన స్టేజ్-2 అధికారుల శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నామినేషన్ ప్రక్రియ నుండి బ్యాలెట్ పేపర్లలో అభ్యర్ధులకు గుర్తులు కేటాయింపు, ఓటింగ్ నిర్వహించే రోజున, అంతకుముందు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికలను వివరించడం జరిగింది. జడ్‌పి సిఇఓ సూర్యప్రకాష్ మాట్లాడుతు గ్రామపంచాయతి ఎ న్నికల ఓటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు స్టేజ్-2 అధికారులు నిబద్ధతతోకూడి విధులను నిర్వహించాలని ఎ టువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేస్తామన్నారు. ఈసమావేశంలో జాయింట్ కలెక్టరు (రెవెన్యూ) కె. మాధవిలత, డిపిఓ ఐ.సాయిబాబా, డివిజినల్ పంచాయతి అధికారి చంద్రశేఖర్ లు, తదితరులు పాల్గొన్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండువిడతలుగా విజయవాడ డివిజన్ పరిధిలోని 234 గ్రామపంచాయతీలలో నియమించిన స్టేజ్-2 అధికారులు ఈశిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. సమావేశంలో స్టేజ్-2 అధికారులు అడిగిన సందేహాలను కలెక్టరు, తదితరులు నివృత్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షులు టి.వీరభద్రస్వామి సోమవారం తెలిపారు. రాగోలులోని జెమ్స్ ఆసుపత్రి వారి సౌజన్యంతో వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గుండె, కిడ్నీ, కంటికి సంబంధించిన వ్యాధులకు జెమ్స్ ఆసుపత్రిలోని వైద్య నిపుణులుచే వైద్య పరీక్షలను ఈ శబిరంలో నిర్వహిస్తారని తెలిపారు. కిన్నెర థియేటర్ ఎదురుగా వున్న జెమ్స్ అర్బన్ హెల్త్ సెంటర్ లో ఉదయం 9 గం.ల నుండి మధ్యాహ్నం 1.00 గం. వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, కార్డియాలజీ స్పెషలిస్టు డా.నాగ చైతన్య, ఆప్తమాలజిస్టు అండ్ రెటీనా స్పెషలిస్టు డా.దినేష్ కుమార్, యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ డా.భానుమూర్తి లు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రభుత్వ ఈ.హెచ్.ఎస్.పథకం ద్వారా అర్హులైన వారికి శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయడం జరుగుతుందని, కంటి శుక్లాలకు ఆధునిక పధ్ధతిలో ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఉచిత రవాణా మరియు భోజన సౌకర్యాలను జెమ్స్ ఆసుపత్రి వారు ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు, వినియోగించుకోవలసినదిగా విశ్రాంత ఉద్యోగుల జిల్లా ప్రెసిడెంటు టి.వీరభద్రస్వామి మరియు సెక్రటరీ పి.నరసింహమూర్తి కోరారు.