వర్ధమాన హీరో, నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఉదయం 8 గంటల నుండి కడప పట్టణ అక్కినేని అభిమానులు ప్రేమ్ నగర్ చందు. వెంకటేష్. నాగార్జున. శ్రీరామ్, బబ్లూ, అక్కినేని అభిమానులు కలిసి కడప పట్టణం లోని పాత బస్టాండ్ ఓల్డ్ రిమ్స్. Rtc బస్టాండ్ 7 రోడ్లు పుర వీధుల్లో ఉన్న యాచకులకు ఆహార పదార్థాలు కలిగి ఉన్న ప్యాకెట్లు పంపిణీ చేశారు. అక్కినేని పేరిట సేవలు కొనసాగిస్తున్నట్లు అక్కినేని అభిమానులు తెలిపారు. కడపజిల్లా అక్కినేని అభిమానుల సంఘము ప్రెసిడెంట్ నల్లం రవిశంకర్ సూచనలతో అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ అభిమాన హీరో పుట్టిన రోజున సేవా కార్యక్రమాలు చేయాలని భావించామన్నారు. అందులోభాగంగా ఈ ఆహార పంపిణీని చేపట్టినట్టు తెలియజేశారు. ప్రతీఏడాది తమ హీరో పుట్టిన రోజును పురష్కరించుకొని సేవాకార్యక్రమాలు కొనసాగిస్తామని వివరించారు.
కీ.శే.అంధవరపు వరహా నరసింహం ఆశయాలను వారి కుటుంబసభ్యులు కొనసాగించాలని, వరం ఆశయసాధనకు కృషిచేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఏడు రోడ్ల కూడలి వద్ద ఇంటాక్ ఆధ్వర్యంలో జరిగిన వరం కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ వరం విభిన్నమైన శైలి కలిగిన వ్యక్తిగా అభివర్ణించారు. పదవులతోనే పేరు రాదని, ప్రజల అవసరాలను తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించడమే కాకుండా, అన్ని రంగాలలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న వ్యక్తి వరం అని, అందుకే ఈ అరుదైన గౌరవం ఆయనకు లభిస్తుందని చెప్పారు. ఎంత డబ్బులు ఉన్నప్పటికీ వాటితో ప్రజలకు మంచి సేవా కార్యక్రమాలు చేసే ధృక్పధం కొంతమందికే ఉంటుందని, ఆ ధాతృత్వం కలిగిన వ్యక్తి వరం అని కొనియాడారు. వరంతో తన కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉందని, చల్లా లక్ష్మీనారాయణ కాలం నుండి వారితో, వారి కుటుంబంతో అనుంబంధం ఉందని గుర్తుచేసారు. అటువంటి వ్యక్తి మన మధ్య భౌతికంగా లేనప్పటికీ విగ్రహ రూపంలో సజీవంగా ఉంచిన శిల్పిని అభినందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకశైలిలో రాజకీయాలు చేస్తున్నారని, ఆయన ఆశయ సాధనలో వరం కుటుంబసభ్యులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మంచి సహాయం, సేవా కార్యక్రమాలు చేయడంలో వరం ముందుండే వారని, ఆయన ఆశయాలను వారి సంతానం కొనసాగించాలని చెప్పారు. వరం పేరుతో ట్రస్టు ఏర్పాటుచేస్తామని వారి కుమారులు, కుమార్తె తెలిపారని, ఆ ట్రస్టుతో వరం ఆశయసాధనకు కృషిచేయాలని కోరారు. ఇందుకు ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే కుటుంబంలోని వ్యక్తిగా తనను ఎప్పుడైనా కలవవచ్చని, వరం కుటుంబసభ్యులకు పూర్తి అండదండగా ఉంటామని ఉపముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం వరం విగ్రహ రూపకర్త డా.డి.రాజ్ కుమార్ వుడయార్ ను దుశ్శాలువ, పుష్పగుచ్ఛం, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.
విశిష్ఠ అతిథి రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణానికే ఒక వరం లాంటివారు అంధవరపు నరసింహం అని కొనియాడారు. భౌతికంగా మనమధ్య లేనప్పటికీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర నుండి తరలివచ్చిన ప్రజానీకం సజీవంగానే మన మధ్య ఉన్నారని తెలియజేస్తుందని అన్నారు. ప్రతీ ఒక్కరికీ జనన మరణాలు తప్పవని, అయితే మరణిస్తూ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచినవారు కొందరే ఉంటారని, అటువంటి వారిలో వరం ఒకరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అన్నారు. వరం రాజకీయాల్లో కొనసాగిన కాలంలో అందిరితో మంచి తత్సంబంధాలు కలిగి ఉండేవారని, ఆయన ఇచ్చిన సూచనలతో పనిచేసిన వారు ఎందరో ఉన్నారని గుర్తుచేసారు. మంచి వ్యక్తిగా, రాజకీయ దురంధురడిగా, వ్యాపారవేత్తగా, స్నేహితుడుగా, ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకుడిగా ఇలా ఎన్నో వైవిధ్యమైన లక్షణాలు కలిగిన వ్యక్తి వరం అని పేర్కొన్నారు. చరిత్రకు నిజమైన తార్కాణం వరం అని, శారీరకంగా మన మధ్య లేనప్పటికీ శ్రీకాకుళం చరిత్ర ఉన్నంతవరకు వరం ఒకడిగా ఉంటారని తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా వెళ్లేవాడని, నాయకుడికి ఆ లక్షణాలు ఉండాలని అన్నారు. పనులు చేయించుకునే సమయంలో అందరిని ఒప్పించి పనులు జరుపుకునేవాడని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ కె.రోశయ్యతో మంచి సంబంధాలు కలిగి ఉండేవారని, ఎందరో ముఖ్యమంత్రులకు ఆతిధ్యమిచ్చిన వ్యక్తి వరం అని గుర్తుచేసారు. వరం ఆశీర్వచనాలు మనందరికీ ఎపుడూ ఉంటాయని , వారి ఆశయ సాధనకు వారి కుమారులు కృషిచేయాలని ఆకాంక్షించారు.
శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణానికి అనేక సేవలు అందించిన వ్యక్తిగా వరం ఎపుడూ గుర్తుంటారని అన్నారు. పట్టణంలో ఏదైనా కార్యక్రమం ప్రారంభించాలంటే అది వరంతోనే ప్రారంభం అయ్యేదని గుర్తుచేసారు. చల్లా లక్ష్మీనారాయణ సూచనలతో మునిసిపల్ ఛైర్మన్ గా పదవిని స్వీకరించారని, నాటి నుండి తిరుగులేని నేతగా ఎదగారని కొనియాడారు. వరం విలక్షణమైన వ్యక్తి అని, అందుకే ఇంతమంది అభిమానులు ఉన్నారని తెలిపారు. ఏదైనా పనిజరగాలంటే ఆ పని జరిగేంత వరకు వదలిపెట్టేవాడు కాదని, మంచి నాయకుడికి ఆ లక్షణాలు తప్పనిసరి అని అన్నారు. వరం తయారుచేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారని, వారిలో కొందరు తమకు సన్నిహితంగా ఉన్న సంగతిని గుర్తుచేసారు. కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ పట్టణం కోసం కలిసి పనిచేసేవాళ్లమని, అలాగే వరం లేనప్పటికి వారి కుటుంబసభ్యులకు తమ సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయని తెలిపారు. పట్టణం నడిబొడ్డున డా. వై.యస్.రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర వరం విగ్రహాన్ని ఏర్పాటుచేయడం ప్రాధాన్యత సంతరించుకుందని, ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా ఏర్పాటుచేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వరం కుటుంబ సభ్యులు ప్రసాద్, సంతోష్, పైడి జయంతి, అంధవరపు సూరిబాబు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ వైశ్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పట్నాల శ్రీనివాసరావు, డి.సి.సి.బి ఛైర్మన్ పాలవలస విక్రాంత్, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ మెంటాడ వెంకట పద్మావతి, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ ఎచ్చెర్ల సూర్యనారాయణ, విశ్రాంత సంయుక్త కలెక్టర్ పి.రజనీకాంతారావు, ప్రముఖ పాత్రికేయులు నల్లి ధర్మారావు, చల్లా అలివేలు మంగ, రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి.జగన్మోహనరావు, మత్స్యకార సంక్షేమ సంఘం ఛైర్మన్ మహాలక్షీ, కళింగ వైశ్య సంక్షేమ సంఘం విశాఖపట్నం, విజయనగరం అధ్యక్షులు శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, ఇంటాక్ కన్వీనర్ కె.వి.జె.రాధాప్రసాద్, సహ కన్వీనర్ సురంగి మోహనరావు, ట్రెజరర్ నటుకుల మోహన్, మండవిల్లి రవి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో కరోనా నుంచి కోలుకోవడంతో 39 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ లు, కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు ఆదివారం 39 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా నియంత్రణలో భాగంగా ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులను తప్పనిసరిగా ధరించాలన్నారు. ఇప్పటి వరకూ అందించిన సహకారమే కరోనా వైరస్ కి వ్యాక్సిన్ వచ్చేంత వరకూ అందించాలని ఆయన కోరారు. ప్రస్తుతం కరోనా రెండవ దశ ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు ప్రతీఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. నాణ్యమైన సానిటైజర్లు వినియోగించాలనీ, సానిటైజర్లు లేనివారు ఏ సబ్బుతోనైనా తరచుగా 20 సెకెండ్లపాటు పరిశుభ్రం చేసుకోవాలన్నారు. పౌష్టికాహరం, బలవర్ధక ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు. ఎవరికైనా అనుమానం వున్నా, కరనా లక్షణాలున్నా తక్షణమే పీహెచ్సీల్లో కరోనా పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.
విశాఖ సిటీ పోలీస్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. మత్తు వద్దు-చదువే ముద్దు పేరిట సిటీ కమిషనర్ ఒక ఏవీని తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. విద్యార్ధులు చదువుకునే సమయంలో మత్తుకి ఏవిధంగా బానిసలవుతున్నారనే విషయాన్ని కొన్ని సినిమాల్లోని క్లిప్పింగులు తీసుకొని ఈ ఏవిని రూపొందించారు. అదే సమయంలో మత్తు పదార్ధాలు, డ్రగ్స్, గంజాయి లాంటివి కళాశాలలు, నగరంలో ఎక్కడ అమ్మకాలు జరిపినా పోలీసులకు సమాచారం అందించాలంటూ ఆ వీడియోలో కోరారు. విద్యార్ధుల తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపడం ద్వారా వారికి ప్రేమను పంచడంతోపాటు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారని కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఏవి విశాఖలోని అన్ని వాట్సప్ గ్రూపుల్లోనూ చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా ఈ వీడియోలో బాలక్రిష్ణ డైలాగులు యువతను విశేషంగా ఆకట్టుకునేలా వివిధ సినిమాల్లోని క్లిప్పింగులతో ఈ ఏవీని రూపొందించడం విశేషం..
విశాఖజిల్లా వ్యాప్తంగా 50 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టిశ్రీనివాసరావు తెలియజేశారు. ఆదివారం భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం మండలంలో ఆదివారం నాడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులు 17 శాతం తేమతో ఉన్న ధాన్యాన్ని కేంద్రానికి తీసుకొని వచ్చి మద్దతు ధర గ్రేడ్ వన్ 1888 రూపాయలు, సాధారణ రకం 1868 రూపాయలు క్వింటాలుకు పొందాలని పేర్కొన్నారు. వైయస్సార్ భీమా ద్వారా రైతులు తుఫాన్ , వరదల వల్ల ఎంత నష్ట పోతే ..అంత పూర్తిగా నష్ట పరిహారాన్ని అతి తక్కువ కాలంలో అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని అన్నారు. సున్నావడ్డీ పంట రుణాలకు సంబంధించి 927 మంది రైతులకు రూ. 16 లక్షలకు పైగా చెక్కులను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. వై యస్ ఆర్ జలకళ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయనున్నట్లు, 'వైఎస్‌ఆర్ జలకళ' కోసం ప్రభుత్వం రూ.2,340 కోట్లు కేటాయించిందన్నారు. అనంతరం వెంకటాపురం లో వైఎస్సార్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ద్వారా వరల్డ్ బ్యాంక్ నిధులతో రూ. 45 లక్షలతో , మహారాజు పేట జంక్షన్ నుంచి రెవిడి సబ్ స్టేషన్ వరకు 33 కెవి ఇంటర్ లింకింగ్ లైన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జి యన్ఎస్ లీలావతి, ఇతర అధికారులు, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కొవింద్ తిరుమల, తిరుపతి పర్యటన సందర్బంగా 24వ తేదిన ట్రాఫిక్ మళ్లింపు ప్రక్రియ చేపట్టినట్టు తిరుపతి అర్బన్ ఎస్పీ తెలియజేశారు.
* తేదీ 24.11.2020 ఉదయం 10:00 గంటల నుంచి 11-45 గంటల వరకు మరల 3.00 గంటల నుండి 4.00 గంటల వరుకు బస్టాండ్ నుంచి తిరుమల వైపు , ఇతర ప్రదేశములకు పోవు బస్సులను వి.వి.ఐ.పి దారి కాకుండా వేరే దారిలో మళ్లిస్తున్నాం..
* ఉదయం 9 గంటలు నుంచి సాయంత్రం 4 గంటలు వరకు కడప, శ్రీకాలహస్తి, నెల్లూరు, విజయవాడ, నగిరి, పుత్తూర్. చెన్నై నుంచి వచ్చి, పోయే వాహనములను పాత రేణిగుంట, కరకంబాడి రొడ్లగుండా తిరుపతిలోకి , బయటకు అనుమతిస్తాం.
* మదనపల్లి, పీలేరు, వేలూరు, చిత్తూర్ నుండి వచ్చు మరియు పోవు వాహనములను చెర్లోపల్లి క్రాస్, జూపార్క్, గరుడ సర్కిల్ మరియు లీలా మహల్ మీదుగా తిరుపతి బస్స్టాండ్ లోనికి , బయటకు అనుమతిస్తారు.
* చంద్రగిరి, రంగంపేట, చెర్లోపల్లే, శ్రీనివాసమంగాపురము నుండి వచ్చు షేర్ ఆటొలు చెర్లోపల్లి క్రాస్, జూపార్క్, గరుడ సర్కిల్ మరియు లీలా మహల్ మీదుగా తిరుపతి పట్టణము లోనికి మరియు బయటకు అనుమతిస్తారు.
* తదుపరి ఉదయం నుంచి పర్యటన ముగింపు వరకు రాష్ట్రపతిపర్యటన చేయు మార్గము అనగా రామానుజ పల్లి కూడలి నుంచి అలిపిరి వరకు ఇరువైపుల గల దుకాణాదారులు దుకాణాల ముందు ఏవరినీ ఉంచారాదు, ఎటువంటి వాహనాలను అనుమతించరు
* వి.ఐ.పి ప్రయాణించు మార్గము ఇరువైపుల ఫుట్ పాత్, రోడ్డు ఇరువైపుల ఎలాంటి వాహనాలు, వస్తువులు ఇతరములు ఏది ఉంచరాదు.
* అత్యవసర వాహనములు అనగా అంబులెన్సు, అగ్నిమాపక వాహనములకు మళ్లింపులు నుంచి మినహాయింపు ఇచ్చామని తెలియజేశారు.
ఒకటీ..రెండు కాదు..ఏకంగా 66 మందికి తన హయాంలో కారుణ్య నియమాకాలు చేశారు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్. సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెందితే, వారి కుటుంబాలు రోడ్డున పడకూడదని, ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని, వెంటనే ఆయా కుటుంబాలను ఆదుకోవాలన్న సమున్నత లక్ష్యంతో, కారుణ్య నియామకాలను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ, జిల్లాలో సరికొత్త ఒరఒడికి శ్రీకారం చుట్టారు. సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే, ఆ ఉద్యోగం కోసం ఏళ్లతరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. ఒక్కోసారి ఆయా కుటుంబ సభ్యులకు ఉద్యోగాల కోసం ఏకంగా రెండుమూడేళ్లు ఎదురు చూడాల్సి వచ్చేది. అయితే డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎప్పటికప్పుడు ఏర్పడుతున్న ఖాళీలను, దాదాపు ప్రతీనెలా ఖాలీలను భర్తీ చేస్తున్నారు. ఒక్కోసారి ఒకేనెలలో రెండుసార్లు కారుణ్య నియామకాలు చేపట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. ముందుగా అభ్యర్ధులకు కౌన్సిలింగ్ నిర్వహించడం, వారి అర్హతలు, ఆసక్తిని బట్టి కేవలం గంటలోనే నియామక పత్రాలు అందిస్తూ ఒక కొత్త ఒరఒడికి శ్రీకారం చుట్టారు. 2018లో డాక్టర్ హరి జవహర్‌లాల్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచి ఇప్పటివరకు మొత్తం 66 మందికి కారుణ్య నియామకాలు జరిగాయి. వీటిలో 2018లో 21 మందికి, 2019లో 23 మందికి, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 22 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ మొత్తం 66 మందిలో 48 మందిని జూనియర్ అసిస్టెంట్లుగా, 8 మందిని విఆర్ఓలుగా, 10 మందిని ఆఫీస్ సబార్డినేట్స్‌గా వారివారి అర్హతలను బట్టి నియమించారు. రెవెన్యూ, కార్మికశాఖ, సబ్ జైల్స్, రిజిష్ట్రేషన్ శాఖ, పంచాయితీశాఖ, ఆడిట్ విభాగం, ఇంటర్‌మీడియట్ ఎడ్యుకేషన్, జిల్లా ఖజానా, వ్యవసాయ మార్కెటింగ్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, విద్యాశాఖ, ఇంటలిజెన్స్, ఉద్యానశాఖ, సహకార శాఖ, మత్స్యశాఖ, తూనికలు కొలతల శాఖ, అటవీశాఖ తదితర ప్రభుత్వ విభాగాల్లో రోస్టర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు నిర్వహించారు. ఎప్పటికప్పుడు వీటిపై సమీక్షిస్తూ, దరఖాస్తులు వచ్చిన వెంటనే, వాటి భర్తీకి ఆదేశాలు ఇచ్చారు.
కుటుంబాలు రోడ్డున పడకూడదు.. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్
సర్వీసులో ఉన్న ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే, ఆ కుటుంబాలు రోడ్డున పడకూదన్న మానవతా దృక్ఫథంతో, వారి వారసులకు వెంటవెంటనే కారుణ్య నియామకాలు చేస్తున్నాం. ఎంత త్వరగా మనం ఉద్యోగం ఇవ్వగలిగితే, అంత త్వరగా ఆ కుటుంబం ఆర్థికంగా కోలుకొనే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారి వారసులకు కౌన్సిలింగ్ నిర్వహించి, వారి అర్హత, ఆసక్తిని బట్టి శాఖలను కేటాయించడం జరుగుతోంది. ఖాళీలపై వారంవారం సమీక్షి చేయడంతోపాటుగా, కౌన్సిలింగ్ చేసిన గంటలోనే జాయినింగ్ ఆర్డర్లను అందజేసి కొత్త ఒరఒడికి శ్రీకారం చుట్టాం.
కర్నూలు జిల్లా తుంగభద్ర పుష్కరాల్లో స్నానాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. స్నానాలకు, పిండ ప్రధానాలకు వచ్చేవారిని ఆరోగ్యసిబ్బం ధర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాత లోనికి అనుమతించారు. దీంతో అత్యధిక శాతం ప్రజలు పుష్కర ఘాట్ ల వద్దకు వచ్చి స్నానాలు ఆచరించి, పరమపదించిన వారికి ప్రత్యేకంగా పిండ ప్రధానాలు చేసుకున్నారు. అదే సమయంలో ఎవరినీ తుంగభద్ర నదిలోని లోతు ప్రదేశాలకు వెళ్లకుండా గజ ఈతగాళ్లను, మున్సిపల్ శానిటేషన్ సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతీరోజూ సాయంత్రం నదీ హరతి కూడా ఇస్తున్నారు. ప్రజలకు ఎక్కడాల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరుగుదొడ్లును కూడా ఏర్పాటు చేశారు. పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు ఉచితంగా వైద్యసేవలు కూడా చేపడుతున్నారు.
పోస్కో బూన్ ఆర్ బ్యాన్ (పోస్కో వరమా? శాపమా?) అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని సెంటూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య జిఎస్‌ఎన్ రాజు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆచార్య రాజు మాట్లాడుతూ, ఈ పుస్తకాన్ని స్టీల్‌ప్లాంట్ నిర్మాణం నుంచి అనుభవం గడించిన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరగసింగరావు ఈ పుస్తకాన్ని రచించిండం, దానిని సిఐటియు విశాఖ నగర కమిటీ ముద్రించడం అభినందనీయమన్నారు. నవంబర్ 26న దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె సందర్భంగా ఈ పుస్తకం విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను దక్షిణ కొరియాకు చెందిన ‘పోస్కో’ కంపెనీతో జాయింట్ వెంచర్‌గా తేది.23-8-2020న ఒప్పందం చేసింది. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ 5 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయడానికి విశాఖ స్టీల్‌ప్లాంట్ స్థలం కేటాయించింది. దీని పెట్టుబడి రూ. 30వేల కోట్లలో విశాఖ స్టీల్‌ప్లాంట్ కనీసం రూ.10వేల కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఇప్పటికే రూ.3వేల కోట్ల నష్టాలో వున్న విశాఖ స్టీల్‌ను పూర్తిగా అప్పులపాలు చేసి పోస్కోకు కట్టబెట్టాలని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ పరిశ్రమలకు సొంత ఇనుప ఖనిజం గనులున్నాయి. ప్రైవేట్‌కు అప్పగించడం కోసమే గతంలో కాంగ్రెస్ గాని నేడు బిజెపి గాని క్యాప్టివ్ మైన్స్‌ను కేటాయించలేదు. దీనివల్ల ప్రతి సంవత్సరం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ. 2వేల కోట్లు అదనంగా ఖర్చవుతున్నది. విశాఖ స్టీల్‌ప్లాంట్ నష్టం రావడానికి ఇదే ప్రధానమైన కారణం. తేది.5-4-2018న స్టీల్‌ప్లాంట్ గనుల కోసం సిఐటియు వైజాగ్ స్టీల్ మార్చ్ నిర్వహించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ 32 మంది ప్రాణాల బలిదానంతో పోరాడి సాధించుకున్న భారీ ప్రభుత్వరంగ పరిశ్రమ. సముద్రతీరంనున్న అత్యంత నాణ్యమైన స్టీల్ ఉత్పత్తి పరిశ్రమ ఇది అన్నారు. ప్లాంటు ప్రారంభంలో రూ.5వేల కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు సమకూర్చింది. కాని విశాఖ స్టీల్‌ప్లాంట్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.40,303 కోట్లు పన్నులు, డివిడెండ్లు చెల్లించింది. సొంత నిధులతో 1.2 మిలియన్ టన్నుల నుంచి 7.3 మిలియన్ టన్నుల సామర్ధ్యానికి విస్తరించింది. రాష్ట్రంలోనే 30వేల మంది ప్రత్యక్ష్యంగాను, లక్ష మంది పరోక్షంగాను ఉపాధి పొందిన ఏకైక భారీ పరిశ్రమ విశాఖ స్టీల్. అలాంటి సంస్థ పోస్కో వలన ప్రైవేటు పరం కావడంపై మంచి విషయాలను తెలియజేస్తూ పుస్తకాన్ని తీసుకురావడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమంలో.. కెఎం కుమార మంగళం, ఎన్.జ్యోతీశ్వరరావు, ఆర్కేఎన్వీకుమార్, ఎం.జగ్గునాయుడు తదితరులు పాల్గొన్నారు..
అనంతపురం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి,రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖామాత్యులు శంకుస్థాపనలు చేయనున్న కార్యక్రమాలకు సంబంధించిన పనులను పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ ,జాయింట్ కలెక్టర్ డా.ఏ. సిరి లతో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ గారిచే ఈ నెల 23వ తేదీన శంకుస్థాపనలు చేయనున్న ప్రదేశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 30 పడకల స్థాయి నుండి 50 పడకల స్థాయికి పెంచనున్న స్థలాన్ని పరిశీలించి శంకుస్థాపన ఏర్పాట్లపై అధికారులకు పలుసూచనలు జారీ చేశారు.అనంతరం స్థానిక కుమ్మర వీధిలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించే పనులు,అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా కళ్యాణ దుర్గం నియోజక వర్గంలోని ఐదు మండలాలకు ఇంటింటికి త్రాగునీరు అందించే కార్యక్రమాల శంకుస్థాపన పనులపై సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు జారీచేశారు.ఈ పనులన్నీ ఆదివారం సాయంత్రం లోపు పూర్తి చేయాలన్నారు.అనంతరం బహిరంగ సమావేశం నిర్వహించే ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ రామ్మోహన్,ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ హరేరామ్ నాయక్,డిఎంహెచ్ఓ డా.కామేశ్వరరావు, డిసిహెచ్ఎస్ డా.రమేష్ నాధ్,పీఆర్ ఎస్ఈ మహేశ్వరయ్య,పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనాధ్ రెడ్డి,ఈఈ సతీష్ చంద్ర ,డీఈఈ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మాస్కులు లేకుండా వినియోగ దారులను, సిబ్బందిని అనుమతిస్తే హోటల్స్ మూయిస్తామని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు హెచ్చరించారు. ఆయన క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా శనివారం ఐదవ జోన్ లోని 60, 63, 64 వార్డులలోని ఆటోనగర్, సాయిరాం నగర్, కణితి రోడ్డు, అప్పన్నపాలెం, హై స్కూల్ రోడ్డు తదితర ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక హోటల్స్ లను సందర్శించి మాస్కులు లేకుండా ఉన్న హోటల్ సిబ్బంది మరియు వినియోగదారులను గమనించి ఆయా హోటల్స్ లకు ఫైన్లు వేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఆ ప్రాంత ప్రజలతో మాట్లాడుతూ, జివిఎంసి సిబ్బందికి తడి-పొడి చెత్తను వేరుచేసి ఇవ్వాలనిసూచించారు.తడి-పొడి చెత్త వేరు వేరుగా ఇస్తున్నారా? డోర్ టు డోర్ చెత్త కలక్షన్ చేస్తునారా ? అని స్వయంగా స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులు కాలువల నుండి చెత్తను తొలగించడం, యు.జి.డి. బ్లాకులను శుభ్రపరచడం మొదలైన పనులను పరిశీలించారు. తడి-పొడి చెత్తను వేరు వేరుగా తీసుకోవాలని పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. పారిశుద్ధ్యంపై అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మాస్కులు, గ్లౌజులు ధరించని కార్మీకులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిబ్బంది తప్పనిసరిగా గ్లౌజులు, మాస్కులు ధరించాలన్నారు. వార్డు శానిటరీ కార్యదర్శులను ప్రశ్నిస్తూ, సీజనల్ వ్యాదులపై ప్రతీ రోజూ తనిఖీ చేస్తున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు. రోజుకు నిర్దేశించిన విధంగా ఇళ్లను సందర్శించి ప్రజలకు విష జ్వరాలపై అవగాహన కలిగించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఆయా వార్డు శానిటరీ ఇన్ స్పెక్టర్లు, వార్డు శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గోన్నారు.
అనంతపురం జిల్లాలో కరోనా నుంచి కోలుకోవడంతో 97 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ లు, కోవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ బాధితులు శనివారం 77 మంది కరోనా నుంచి కోలుకోగా, డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా నియంత్రణలో భాగంగా ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులను తప్పనిసరిగా ధరించాలన్నారు. ఇప్పటి వరకూ అందించిన సహకారమే కరోనా వైరస్ కి వ్యాక్సిన్ వచ్చేంత వరకూ అందించాలని ఆయన కోరారు. ప్రస్తుతం కరోనా రెండవ దశ ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు ప్రతీఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. నాణ్యమైన సానిటైజర్లు వినియోగించాలనీ, సానిటైజర్లు లేనివారు ఏ సబ్బుతోనైనా తరచుగా 20 సెకెండ్లపాటు పరిశుభ్రం చేసుకోవాలన్నారు. పౌష్టికాహరం, బలవర్ధక ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు. ఎవరికైనా అనుమానం వున్నా, కరనా లక్షణాలున్నా తక్షణమే పీహెచ్సీల్లో కరోనా పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ఈ నెల 24 న జిల్లా పర్యటన సంధర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త సూచించారు. శనివారం మద్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఇంటలిజెన్స్ ఐ జి శశిధర్ రెడ్డి, అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కలసి పర్యటన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ వివరిస్తూ గౌ. భారత రాష్ట్రపతి పర్యటన సంధర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ప్రజాప్రతినిధులు స్వాగతం పలకనున్నారని విమానాశ్రయంలో ఏర్పాట్లను జెసి (సంక్షేమం) రాజశేఖర్, ఎ. పి. డి. సురేష్, సి. ఎస్. ఓ. రాజశేఖర రెడ్డి, డిప్యూటీ కమాండెంట్ శుక్ల కలసి సమన్వయం చేసుకోవాలని సూచించారు. తిరుపతి ఆర్డీఓ కనకనరసా రెడ్డి భారత రాష్ట్రపతి పర్యటన పూర్తి సమన్వయ అధికారిగా వ్యవహరించాలని తెలిపారు. ఆర్ అండ్ బి , పంచాయితీరాజ్ రోడ్డు మరమ్మత్తులు, పరిసరాలపై దృష్టి పెట్టాలని అన్నారు. వైద్య శాఖ రాష్ట్రపతి పర్యటనలో విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి తప్పనిసరి కోవిడ్ పరీక్షలు (రాపిడ్) టెస్టులు నిర్వహించాలని సూచించారు. అనంతరం విమానాశ్రయం నుండి రాష్ట్రపతి పర్యటించనున్న ప్రదేశాలను ముందస్తు వాహనశ్రేణి ద్వారా రోడ్డు మార్గం పరిశీలిస్తూ, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్, శ్రీవారి ఆలయం వద్ద పరిశీలించారు. ఈ సమీక్ష, పర్యటనలో టి.టి.డి సి.వి. అండ్ ఎస్. ఓ. గోపినాథ్ జెట్టి, ఆర్డీఓ కనకనరసారెడ్డి, ఎస్. బి. డి ఎస్. బి. గంగయ్య, రాష్ట్రపతి పర్యటన విధులు కేటాయించిన అధికారులు, విమానాశ్రయ అధికారులు శ్యామ్ , సెక్యూరిటీ అధికారులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలోని ప్రతీ మున్సిపాల్టీలో ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశించారు. దీనిని నిర్మూలించినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందని ఆయన స్పష్టం చేశారు. మోనటరింగ్ ఆన్‌లైన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌పై అన్ని మున్సిపాల్టీల కమిషనర్లతో కలెక్టర్ ఛాంబర్‌లో శనివారం సమావేశం జరిగింది. ఆయా మున్సిపాల్టీల్లో చెత్త నిర్వహణ పద్దతులు, దీనికి తీసుకున్న చర్యలపై అంశాలవారీగా చర్చించారు. తమతమ మున్సిపాల్టీల్లో అవలంబిస్తున్న విధానాలను, తీసుకున్న చర్యలను కమిషనర్లు వివరించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతికి తీరని హాని చేసే ప్లాస్టిక్ ను నిర్మూలించడంపై ప్రతీఒక్కరూ దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్లాస్టిక్ నియంత్రణకు తీసుకున్న చర్యలపై బొబ్బిలి మినహా మిగిలిన మున్సిపాల్టీలపై కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముందుగా ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఆ తరువాత ప్లాస్టిక్‌ను విక్రయించేవారిపైనా, వినియోగించే వారిపైనా చర్యలు మొదలు పెట్టాలని సూచించారు. అన్ని మున్సిపాల్టీల్లో డిబ్రిస్ ను ఇష్టానుసారం ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయని అన్నారు. దీనిని అరికట్టేందుకు ఒక పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేయాలని చెప్పారు. దీనికోసం డిసెంబరు 1 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, ఆ నెలంతా ఎక్కడికక్కడ పేరుకుపోయిన డెబ్రిస్‌ను తొలగించి, దీనికోసం ఒక నిర్ణీత ప్రదేశాన్ని కేటాయించాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. నిబంధనలకు వ్యతిరేకంగా డెబ్రిస్ వేసేవారికి జనవరి నుంచి జరిమానాలు విధించడంతోపాటు, దానిని తరలించేందుకు అయ్యే వ్యయాన్ని సైతం వారివద్దనుంచే రాబట్టాలని చెప్పారు. సచివాలయాల్లో ఎంతో సామర్ధ్యమున్న సిబ్బంది మనకు అందుబాటులో ఉన్నారని, వారి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. సమాచారం త్వరగా అందించేందుకు, పనుల పర్యవేక్షణకు వీలుగా మున్సిపాల్టీల్లోని సచివాలయ సిబ్బందికి వాకీటాకీ హేండ్‌సెట్లు ఇవ్వాలని ఆదేశించారు. మొక్కలను నాటే కార్యక్రమం విజయనగరం కార్పొరేషన్ మినహా, మిగిలిన మున్సిపాల్టీల్లో ఆశించిన స్థాయిలో జరగలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. పచ్చదనాన్ని పెంచడానికి, చెరువుల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దీనికోసం ప్రతీ మున్సిపాల్టీలో ఒక ప్లాంటేషన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపాల్టీల్లో నాడూ-నేడు పనులను వేగవంతం చేయాలని, ప్రతీచోట కనీసం ఒక పాఠశాలను నమూనా పాఠశాలగా ఎంపికచేసి, డిసెంబరు నాటికి అన్ని వసతులతో సిద్దం చేయాలని ఆదేశించారు. ఎక్కడబడితే అక్కడ ఇష్టానుసారం ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడాన్ని నివారించాలన్నారు. ముఖ్యప్రదేశాల్లో వివిధ ప్రాంతాలను తెలుపుతూ డైరెక్షన్ బోర్డులను ఏర్పాటు చేయాలని, ప్రతీ ఒక్క అధికారీ సృజనాత్మకతతో ఆలోచించి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు, సాలూరు కమిషనర్ ఎం.రమణమూర్తి, పార్వతీపురం కమిషనర్ కె.కనకమహాలక్ష్మి, నెల్లిమర్ల నగర పంచాయితీ కమిషనర్ అప్పలనాయయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జేసీ ఆర్.వెంకటరావు (ఆసరా) అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ భీమా, వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు పథకాల పురోగతిపై జేసీ వెంకటరావు, డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్ట్ డైరెక్టర్ తో కలిసి బ్యాంకుల ప్రతినిధులతో, వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు వివిధ పథకాల్లో చేరిన లబ్ధిదారుల వివరాలను, ఎంపిక ప్రక్రియలో చోటుచేసుకుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా వైఎస్సార్ భీమలో లబ్ధిదారులను చేర్చే ప్రక్రియపై చర్చించారు. జిల్లాలో మొత్తం 6,97,161 మంది రైస్ కార్డ్ లబ్ధిదారులు ఉండగా.. ఇప్పటి వరకు 5,92,908 మంది మాత్రమే చేరి ఉన్నారని జేసీ వెల్లడించారు. మిగతా వారిని త్వరితగతిన సర్వే చేసి చేర్చాలని మెప్మ, డి.ఆర్.డి.ఎ సిబ్బందిని ఆదేశించారు. 18 సం"రాలు కన్న తక్కువ వయస్సు, 70 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్నవాళ్ల వివరాలు ప్రత్యేకంగా సేకరించాలని సూచించారు. వైఎస్సార్ భీమా, చేయూత, జగనన్న తోడు పథక ఫలాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరాలంటే ప్రతీ ఒక్కరికీ ఖాతా తెరవాలని చెప్పారు. ఖాతాలు తెరిచే విషయంలో ప్రభుత్వ సిబ్బందికి బ్యాంకు అధికారులు, సిబ్బంది సహకరించాలని కోరారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది బ్యాంకుల ప్రతినిధులతో సమన్వయంగా వ్యవహరిస్తూ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. సోమవారం నాటికల్లా ప్రతి లబ్ధిదారుకీ బ్యాంక్ ఖాతా తెరవాలని, సంబంధిత సమస్యలు ఉంటే పరిష్కరించి నివేదికలు అందజేయాలని సూచించారు. ఖాతాల తెరిచే నిమిత్తం బ్యాంకులకు పంపిన పెండింగ్ లిస్టును పరిష్కరించాలని చెప్పారు. అనంతరం వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు పథకాల అమలుపై సమీక్షించి, తగిన సలహాలు సూచనలు అందజేశారు.
కార్యక్రమంలో డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్ట్ డైరెక్టర్ సుబ్బారావు, మేప్మా పి.డి. సుగుణ ఖర్ రావు, పశుసంవర్ధక శాఖ జె.డి. నరసింహులు, ఎల్.డి.ఎం. శ్రీనివాసరావు, డి.ఎల్.డి.ఒ.లు రాజ్ కుమార్, రామచంద్రరావు, ఎస్బిఐ, ఐ ఓ బి, ఏపీజివీబీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్రా బ్యాంకు, కెనరా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకుల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.