శ్రీకాకుళం పట్టణంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద అంధవరపు వరహా నరసింహం ( వరం ) కాంస్య విగ్రహావిష్కరణ ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఇంటాక్ కన్వీనర్ మరియు సభ్యులు కె.వి.జె.రాధాప్రసాద్ వెల్లడించారు. స్థానిక వరం రెసిడెన్షిలో వరం కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంపై ఇంటాక్ కన్వీనర్ శనివారం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ శ్రీకాకుళం పురపాలక సంఘ సంస్కర్త, పట్టణ అభివృద్ధి ప్రణాళికల ఆవిష్కర్త, అనితర సాధ్యమైన చరిత్ర సృష్టికర్త అయిన కీ.శే.అంధవరపు వరహా నరసింహం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నవంబర్ 22న సాయంత్రం 04.00గం.లకు ఏడురోడ్ల కూడలిలో ఇంటాక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాంప్రదాయానికి మారుపేరు వరం అని, పదవి, రాజకీయాలతో నిమిత్తం లేకుండా నగర, వాణిజ్య, వ్యాపార రంగాల అభివృద్ధితో సిక్కోలును అభివృద్ధి బాట పట్టించిన మహోన్నత వ్యక్తి వరం అని కొనియాడారు. ప్రజాభిమానంతో 1981 నుండి 1992 వరకు మునిసిపల్ ఛైర్మన్ గా ఆ పదవికే వన్నెతెచ్చారని అన్నారు. ఆయన ఛైర్మన్ గా కొనసాగిన కాలంలో మునిసిపల్ సిబ్బంది కంటే ముందుగానే విధులకు హాజరుకావడం ఆయన పదవికి ఇచ్చిన గౌరవంగా చెప్పవచ్చని గుర్తుచేసారు. వరం పవర్ ప్రోజెక్టు రూపకర్త, శ్రీసత్యసాయి మందిరం నిర్మాణ కమిటీకీ శాస్వత అధ్యక్షులుగా, కళింగ కోమటి సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా, శ్రీకాకుళం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జిల్లా అధ్యక్షులుగా అన్ని రంగాలకు వన్నెతెచ్చిన వ్యక్తి వరం అని కొనియాడారు. అటువంటి గొప్పవ్యక్తి కాంస్య విగ్రహం ఏర్పాటుచేసేందుకు ఇంటాక్ ఆలోచన చేసిందని, విగ్రహా విష్కరణ కొరకు జిల్లా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారని, తద్వారా ఆదివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. కీ.శే. అంధవరపు వరహా నరసింహం ( వరం ) కాంస్య విగ్రహాన్ని దేశంలోనే పేరొందిన ప్రముఖ శిల్పి డి.రాజకుమార్ వుడయార్ ( తూ.గో.జిల్లా, కొత్తపేట ) తయారుచేసారని, నగరంలో ఇప్పటివరకు సిమెంట్ విగ్రహాలే ఉన్నాయని తొలి కాంస్య విగ్రహం ఇదే కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు సభా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ మరో ముఖ్యఅతిథిగా, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు, ఇంటాక్ ముఖ్యపోషకులు మరియు జిల్లా కలెక్టర్ జె.నివాస్ విశిష్ఠ అతిథులుగా హాజరుకానున్నారని చెప్పారు. శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కళింగ కోమటి కార్పొరేషన్ ఛైర్మన్ అంధవరపు సూరిబాబు గౌరవ అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. వరం రెసిడెన్షి అధినేత అంధవరపు సంతోష్ మాట్లాడుతూ నగరంలో తన తండ్రి కాంస్య విగ్రహావిష్కరణతో తమ కళ సాకారమవుతుందని చెప్పారు. విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కేవలం రెండు మాసాల్లో పూర్తిచేయడం సంతోషంగా ఉందని, ఇందుకు సహకరించిన ఇంటాక్ కన్వీనర్, ప్రజాప్రతినిధులు, అధికారులు, శ్రేయోభిలాషులు, వాణిజ్య, వ్యాపారవేత్తలు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేసారు. కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ పాత్రికేయుల సమావేశంలో ఇంటాక్ సహ కన్వీనర్ సురంగి మోహనరావు, నూక సన్యాసిరావు, ట్రెజరర్ నటుకుల మోహన్, అంధవరపు కుమార్, అంధవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సర్కారు బడులు కొత్తరూపు సంతరించుకున్నాయి. కార్పొరేట్ పాఠశాలలను తలదన్ని, ఆధునిక హంగులతో అలరారుతున్నాయి. చక్కని రంగులు, సరికొత్త వసతులు, అన్ని మౌలిక సదుపాయాలతో విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన నాడూ-నేడు కార్యక్రమం విద్యావ్యవస్థలో చరిత్రలో ఒక కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. విద్య, వైద్యం ప్రాధాన్యతాంశాలుగా రాష్ట్ర ప్రభుత్వం పలు విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దానిలో ఒకటి మనబడి నాడూ-నేడు. ప్రభుత్వ పాఠశాలల్లో సంపూర్ణ మార్పులను తీసుకువచ్చి, ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని వసతులను కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం క్రింద జిల్లా వ్యాప్తంగా 2,763 పాఠశాలలు రిజిష్టర్ కాగా, దీనిలో మొదటి దశ క్రింద 1060 పాఠశాలలను ఎంపిక చేసి, రూపురేఖలను మార్చివేసే అభివృద్ది పనులను ప్రారంభించారు. దీనిలో 1040 పాఠశాలలను రాష్ట్రప్రభుత్వ నిధులతో, 20 పాఠశాలలను నాబార్డు నిధులతో అభివృద్ది చేస్తున్నారు. జిల్లాలో నాడూ-నేడు తొలిదశ పనులకు ప్రభుత్వం ఏకంగా రూ.236.82కోట్లను కేటాయించింది. ఈ నిధులతో మొత్తం 8,077 పనులను మంజూరు చేశారు. వీటిలో 3968 పనులు మొదలు కాగా, 754 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పటవరకు దాదాపు రూ.120 కోట్లను ఖర్చు చేయడం ద్వారా విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని సంపాదించింది. చాలా పాఠశాలల్లో ఇప్పటికే పనులు పూర్తికాగా, మరికొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 ప్రభుత్వ శాఖలు ఈ పనులను నిర్వహిస్తున్నాయి.
ప్రస్తుత ప్రభుత్వం విద్యకు ఎనలేని ప్రాధాన్యతనిస్తోంది. కేవలం విద్యార్థులకోసమే అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యాకానుక తదితర ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. మరోవైపు సర్కారు బడుల్లో ఆంగ్లభాషాబోధను ప్రవేశపెట్టడానికి సిద్దమవ్వడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ మౌలిక వసతులను కల్పిస్తోంది. నాడూ-నేడు కార్యక్రమం క్రింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సంపూర్ణంగా మారిపోతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం, వాటికి నిరంతర నీటి సరఫరా, విద్యుత్ సదుపాయం, ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు, త్రాగునీటి సదుపాయం, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవసరమైన బల్లలు, కుర్చీలు, గోడలకు, తరగతి గదులకు రంగులు, సున్నం, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీషు లేబ్స్ ఏర్పాటు, అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణం, ఇతర అన్నిరకాల మరమ్మతు పనులు చేపట్టారు. ఎపిఇబ్ల్యూఐడిసి, సమగ్ర శిక్ష, గిరిజన సంక్షేమశాఖ, పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్ పబ్లిక్‌హెల్త్ మొదలగు ఆరు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో తల్లితండ్రుల కమిటీల పర్యవేక్షణలో ఈ పనులన్నీ జరుగుతున్నాయి. డిసెంబరు 31 నాటికి ఈ పనులన్నిటినీ పూర్తిచేయాలన్న కృతనిశ్చయంతో జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ జిల్లా అంతటా విస్తృతంగా పర్యటిస్తూ, నాడూ-నేడు పనులను పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలో జరుగుతున్న నాడు-నేడు పనుల వివరాలు ః -
తొలిదశకు ఎంపికైన పాఠశాలలు ః 1040
మంజూరు చేసిన పనులు ః 8077
అంచనా విలువ ః రూ.236.82 కోట్లు
విడుదల చేసిన రివాల్వింగ్ ఫండ్ ః రూ.126.65 కోట్లు
ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తం ః రూ. 119.38 కోట్లు
వివిధ ప్రభుత్వ శాఖలద్వారా జరుగుతున్న పనులు ః -
ఎపిఇబ్ల్యూఐడిసి ః 234
సమగ్ర శిక్ష ః 300
గిరిజన సంక్షేమశాఖ ః 236
పంచాయితీరాజ్ ః 168
ఆర్‌డబ్ల్యూఎస్ ః 56
మున్సిపల్,పబ్లిక్‌హెల్త్ ః 46
మొత్తం ః 1040 పాఠశాలలు
శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడిన తరగతులు (బి.సి), ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఇబిసి), ఎస్.సి, ఎస్.టి, మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్ధులకు రవాణా వాహనాలను సబ్సిడిపై అందించుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్, పౌరసరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్ శుక్రవారం జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బిసి, ఇబిసి, ఎస్.సి, ఎస్.టి, మైనార్టీ అభ్యర్ధులకు స్వయం ఉపాధి కల్పన నిమిత్తం రవాణా వాహనాలను సమకూర్చడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థ ద్వారా ప్రతి నెల పేద కుటుంబములకు పంపిణీ చేస్తున్న బియ్యం, ఇతర నిత్యవసర వస్తువులు ఇళ్ళ వద్దకే నేరుగా చేరవేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంతో అనుసంధానం చేసి లబ్దిదారులకు రవాణా వాహనాలను సబ్సిడీపై సరఫరా చేయడం జరుగుతుందని వివరించారు. లబ్దిదారుని వాటా 10 శాతం, రాయితీ 60 శాతం, మిగిలిన 30 శాతం మొత్తాన్ని బ్యాంకు ఋణము ద్వారా మంజూరు చేసి స్వయం ఉపాధికి బాటలు వేయుటకు ఉద్దేశించడం జరిందని పేర్కొన్నారు. రవాణా వాహనాలు మంజూరుకు అర్హత గల అభ్యర్థులు స్థానిక గ్రామ/వార్డు సచివాలయములో దరఖాస్తు చేయాలని వారు సూచించారు. నిర్ధేశిత దరఖాస్తును సంక్షేమ సహాయకుల నుండి ఉచితంగా పొందవచ్చని, పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ నుండి 27వ తేదీ వరకు సంక్షేమ సహాయకులకు సమర్పించాలని తెలిపారు. వాహనం యూనిట్ విలువ రూ.5,81,190/- కాగా 60 శాతం రాయితీగా రూ.3,48,714/- పోనూ, లబ్ధిదారుని వాటా 10 శాతం రూ.58,119/-, బ్యాంకు ఋణము - 30 శాతం రూ.1,74,357/-గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్దులకు డిశంబరు 4వ తేదీన సంబధిత మండల, మునిసిపాలిటి, మునిసిపల్ కార్పోరేషన్ లలో ఎంపిక కమిటి ఆధ్వర్యంలో స్క్రీనింగ్- మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుందని వారు చెప్పారు. దరఖాస్తు చేసిన అభ్యర్ధులు స్క్రీనింగుకు విధిగా హాజరు కావాలని స్పష్టం చేసారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ, డిఎఫ్ఓ సందీప్ కృపాకర్, ఎస్.సి కార్పొరేషన్ ఇడి కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వసభ్య సమావేశం ఈ నెల 25న నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కె.కుమార్ రాజ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసారు. నవంబర్ 25 ఉదయం 10.30గం.లకు సంయుక్త కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వసభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో 2020-21 సం.నకు నూతన పుస్తకాల కొనుగోలు, శాఖా గ్రంధాలయాలకు ఫర్నిచర్ కొనుగోలు, జిల్లా కేంద్ర గ్రంధాలయం, జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయాలకు కంప్యూటర్లు, ఎయిర్ కండీషనర్లు కొనుగోలు, జిల్లా కేంద్ర గ్రంధాలయం అదనపు భవన నిర్మాణం, జిల్లా కేంద్ర గ్రంధాలయం కాంపౌండ్ వాల్ మరియు ఆమదాలవలస శాఖా గ్రంధాలయం మరామ్మతులు తదితర అంశాలపై చర్చించి ప్రతిపాదనలు పంపుటకు సభ్యుల ఆమోదం తెలియజేయుట జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.
శ్రీకాకుళం జిల్లాలోని నిరుద్యోగులైన యస్.సి ( షెడ్యూల్డు కులాలు ) యువతకు మినీ ట్రక్కుల పంపిణీకోసం దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు కె.రామారావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసారు. రాష్ట్ర షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ జిల్లాకు 69 మినీ ట్రక్కులు ( నిత్యావసర వస్తువులు రవాణా నిమిత్తం ) పంపిణీచేయుటకు నిర్ధేశించిందని చెప్పారు. స్వయం ఉపాధి పథకం క్రింద శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులై 7వ తరగతి పాసై నిరుద్యోగులైన షెడ్యూల్డు కులాలకు చెందిన యువత ( వయస్సు 21 నుండి 45 ఏళ్లలోపు ఉండాలి )కు మినీ ట్రక్కులను పంపిణీచేయడం జరుగుతుందని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్ధులు దరఖాస్తుదారుని తెలుపు రేషన్ కార్డు, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు, విద్యార్హతలు, మీ-సేవా కుల ధృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు ఖాతా నెంబరుతో పాటు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత గ్రామ,వార్డు సచివాలయాలకు ఈ నెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం, పింఛను పొందుతున్న విశ్రాంత ఉద్యోగస్తులు, నాలుగు చక్రాల వాహనాలు కలిగినవారు, ఆదాయపన్ను చెల్లింపుదారులు, గత ఐదేళ్లలోపు ప్రభుత్వం నుండి లబ్ధిపొందిన వారు, ప్రభుత్వ రుణములు చెల్లించుటలో మొండి బకాయిదారులు, డిఫాల్డర్లు ఈ పథకానికి అనర్హులని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.
శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి నిర్వహించే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ డిపార్ట్ మెంటల్ టెస్టులకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. డిపార్ట్ మెంటల్ టెస్టుల నిర్వహణపై జిల్లా రెవిన్యూ అధికారి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని శుక్రవారం ఆయన ఛాంబరులో నిర్వహించారు. నవంబర్ 21 నుండి 29 వరకు జిల్లాలో జరగనున్న ఈ పరీక్షలు ( 27వ తేదీ మినహా ) ఉదయం 10.00గం.ల నుండి మధ్యాహ్నం 12.00గం.ల వరకు అలాగే మధ్యాహ్నం 03.00గం.ల నుండి సాయంత్రం 05.00గం.ల వరకు రెండు సెషన్లలో జరుగుతాయని తెలిపారు. రాజాంలోని జి.యం.ఆర్, టెక్కలిలోని ఐతమ్, ఎచ్చెర్లలోని శ్రీశివానీ, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ పరీక్షల నిర్వహణకు సంయుక్త కలెక్టర్, జిల్లా రెవిన్యూ అధికారి సమన్వయ అధికారులుగా, తహశీల్ధారు, ఉపతహశీల్ధారులు లైజన్ అధికారులుగా ఉంటారని చెప్పారు. కోవిడ్ దృష్ట్యా ప్రతీ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లుచేయడం జరిగిందని, ప్రతీ కేంద్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డి.ఆర్.ఓ స్పష్టం చేసారు. పరీక్షలు సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అసోసియేట్ సెక్రటరీ బి.సిహెచ్.ఎన్.కుమార్ రాజు, సెక్షన్ అధికారి డి.నాగభూషణం, ఉపతహశీల్ధారు సతీష్, కలెక్టర్ కార్యాలయంలోని వివిధ విభాగాల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో జలవనరుల ప్రాజెక్టుల క్రింద భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. రెవిన్యూ, భూసేకరణ యూనిట్ల అధికారులతో శుక్ర వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నివాస్ సమీక్షించారు. తోటపల్లి, మడ్డువలసతో సహా ఇతర ప్రాజెక్టుల క్రింద తక్కువ మొత్తంలో భూ సేకరణ పెండింగులో ఉన్నాయని వాటిపై దృష్టి సారించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో అంతే వేగంగా పనులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో పనిచేయాలని ఉద్బోదించారు. వివిధ ప్రాజెక్టుల క్రింద కాలువ పనులు పూర్తి కావడం వలన వేలాది ఎకరాలకు సాగు నీరు అందుతుందని, తద్వారా రైతాంగానికి ప్రయోజనం కలుగుతుందని, జిల్లా ఆర్ధిక స్ధితిగతులకు బాటలు వేయవచ్చని చెప్పారు. వ్యవసాయక జిల్లాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు జలయజ్ఞం పనులు పూర్తి చేసి లక్ష్యంగా ఉన్న ఆయకట్టుకు సాగు నీరు అందించడం వలన చిరస్ధాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు. కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టు అధికారుల సమీక్షలో భాగంగా అటవీ, రెవిన్యూ శాఖలు భూములను స్పష్టంగా గుర్తించాలని ఆయన ఆదేశించారు. అటవీ భూములు ఉంటే అందుకు ప్రతిఫలంగా ఇతర ప్రాంతంలో భూములు ఇచ్చేందుకు పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, డివిజనల్ అటవీ అధికారి సందీప్ కృపాకర్ గుండాల, రెవిన్యూ డివిజనల్ అధికారి ఈట్ల కిషోర్, డిప్యూటి కలెక్టర్లు బి.శాంతి, కాశీవిశ్వనాథ్, ఉద్యానవన సహాయ సంచాలకులు పి.ఎల్.ప్రసాద్, తోటపల్లి కార్యనిర్వాహక ఇంజనీరు రామచంద్రరావు, సర్వే సహాయ సంచాలకులు కె.ప్రభాకర్, అటవీ శాఖ రేంజ్ అధికారి గోపాల నాయుడు, అణు విద్యుత్ ప్రాజెక్టు అదనపు సి.ఇ బంగారయ్య శెట్టి, డిప్యూటి మేనేజర్ చంద్రశేఖర్, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రి, ఘోషా ఆసుపత్రిలో అదనపు వసతులను కల్పించేందుకు ఆసుపత్రి అభివృద్ది సంఘం ఆమోదించింది. సంఘ ఛైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ అధ్యక్షతన కలెక్టర్ ఛాంబర్‌లో అభివృద్ది సంఘ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో 29 అంశాలతో కూడిన అజెండాను సంఘం కన్వీనర్, జిల్లా కేంద్రాసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ కె.సీతారామరాజు సభ్యులకు వివరించగా, సభ్యులు ఆయా అంశాలపై చర్చించి ఆమోదించారు. ఘోషా ఆసుపత్రిలో అసంపూర్తిగా ఉన్న కేంటీన్ పనులను పూర్తిచేసి, రోగులకు అందుబాటులో తేవాలని నిర్ణయించారు. ఘోషాలో ఆరు వార్మర్లు, ఆపరేషన్ టేబుల్, వివిధ విభాగాలను 5 ఏసిలను, వివిధ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చడానికి, ఓటి కాంప్లెక్స్ మరమ్మతులకు అంగీకరించారు. జిల్లా కేంద్రాసుపత్రిలో డిఎన్‌బి, ఓటి విభాగాలను అభివృద్ది చేసేందుకు, ఇక్కడినుంచి ఆయుష్ విభాగాన్ని కొత్త భవనంలోకి పూర్తిగా తరలించేందుకు, కాంపౌండ్ వాల్ మరమ్మతుకు, కేజువాలిటీ ఫ్లోర్ మరమ్మతుకు, ఆసుపత్రిలో కుర్చీలు, బల్లలు, మంచాలకు రంగులు వేసేందుకు, కిచెన్‌షెడ్ మరమ్మతుకు, వివిధ విభాగాల్లో 4 ఏసిల ఏర్పాటుకు, ఫెన్సింగ్ ఏర్పాటుకు, స్టేషనరీ కొనుగోలుకు ఆమోదం తెలిపారు. జిల్లా ఆసుపత్రికి, ఘోషాసుపత్రికి కొత్తగా 5 ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్లు కావాలని కమిషనర్‌ను కోరడానికి అంగీకరించారు. అలాగే ఆసుపత్రికి కావాల్సిన మందులు, ల్యాబ్ పరికరాలు, సర్జికల్స్ సరఫరాకు కొత్తగా టెండర్లు పిలిచేందుకు సైతం సంఘ సభ్యులు ఆమోదం తెలిపారు. జిల్లా ఆసుపత్రికి ఒక అంబులెన్సును మంజూరు చేయాలని ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌ను కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, రామారావు తదితర సంఘ సభ్యులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
డ్రైవింగ్ శిక్షణతో ఉపాధి అవకాశాలు మెండుగా పొందవచ్చుసని డిప్యూటీ సి.టి.ఎం. వడ్డి సుందర్ తెలిపారు. శుక్రవారం ఆర్.టి.సి. డిపో ఆవరణలో ప్రజా రవాణాశాఖ ద్వారా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పొందిన అభ్యర్ధులకు సర్టిఫికేట్లు మంజూరు చేసారు. కార్యక్రమానికి డిప్యూటీ సి.టి.ఎం. వడ్డి సుధాకర్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు మంచి ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రజా రవాణా శాఖ హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు. ప్రజా రావాణా శాఖలో మంచి నిపుణులైన డ్రైవర్ల ద్వారా డ్రైవింగ్ పై శిక్షణ నివ్వడం జరిగిందన్నారు. డ్రైవింగ్ లో మెళుకువలు నేర్చుకోవడం ద్వారా కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నారు. ప్రస్తుతం డ్రైవర్లకు ఎక్కువ డిమాండ్ వుందన్నారు. పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లలో మంచి అవకాశాలున్నాయని అన్నారు. జలుమూరు మండలం, చల్లవాని పేట నుండి చల్లా ఆశ అనే మహిళ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ పొందడం చాలా సంతోషదాయకమన్నారు. ఆమెను పుష్పగుఛ్ఛంతో అభినందించారు. ఇదే స్ఫూర్తితో మహిళలు ముందుకు రావాలన్నారు. అనంతరం శిక్షణ పొందిన 16 మంది అభ్యర్ధులకు సర్టిఫికేటులు అందచేసారు. అనంతరం రెండవ బ్యాచ్ ను ప్రారంభించారు. శిక్షణలో మంచి మెలుకవలు చెప్పిన వర్మకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజరు జి.వరలక్ష్మి, 1,2 వ డిపో మేనేజర్లు వి.ప్రవీణ, టి.కవిత, మొటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివరాం గోపాల్ శిక్షణ పొందిన అభ్యర్ధులు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమల సర్వే పక్కాగా జరగాలని జిల్లా కలక్టర్ జె నివాస్ అన్నారు. జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి (డిఐపిసి) సమావేశం శుక్ర వారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ నివాస్ అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పరిశ్రమల సర్వే సమగ్రంగా జరగాలని అందుకు పక్కాగా కార్యాచరణ ప్రణాళికలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. వివరాలలో ఎటువంటి తప్పులు ఉండరాదని ఆయన స్ఫష్టం చేసారు. నమోదు అయిన పరిశ్రమలు, నమోదు కాని పరిశ్రమల వివరాలు సైతం సర్వేలో ఉండాలని ఆయన అన్నారు. మండల స్ధాయిలో ఎం.పి.డి.ఓ నేతృత్వంలో ఇంజనీరింగు సహాయకులతో సమావేశాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలలో యువతకు శిక్షణకు గల అవకాశాలు పూర్తి స్ధాయిలో పరిశీలించాలని కలెక్టర్ అన్నారు. శిక్షణకు చేరే అభ్యర్ధులకు భోజన, వసతి సౌకర్యాలు, స్టైపెండు వంటి అవకాశాలు పరిశీలించాలని అన్నారు. గ్రానైట్ సంఘాలతో సమావేశం నిర్వహించాలని ఆయన సూచించారు. జిల్లాలో 60 గ్రానైట్ కటింగు, పాలిషింగు యూనిట్లు ఉన్నందున అవకాశాలు పరిశీలించాలని చెప్పారు.
జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.గోపాల కృష్ణ మాట్లాడుతూ మైక్రో, స్మాల్ అండ్ మీడియం (ఎం.ఎస్.ఎం.ఇ) పరిశ్రమల పరిధిని కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చేసిందన్నారు. కోటి రూపాయల వరకు పెట్టుబడి దాటకుండా, రూ.5 కోట్ల టర్నోవర్ దాటని పరిశ్రమలను మైక్రో ఎంటర్ప్రైజెస్ గాను, 10 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి దాటకుండా, రూ.50 కోట్ల టర్నోవర్ దాటని పరిశ్రమలను స్మాల్ ఎంటర్ప్రైజెస్ గాను, 50 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి దాటకుండా, రూ.250 కోట్ల టర్నోవర్ దాటని పరిశ్రమలను మీడియం ఎంటర్ప్రైజెస్ గాను గుర్తించడం జరుగుతుందని వివరించారు. ఎం.ఎస్.ఎం.ఇ పరిశ్రమలు ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందుటకు, విపత్తు సమయంలో సహాయం పొందుటకు విధిగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ లో నమోదు కావాలని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ ప్యాకేజీ క్రింద 2020 ఫిబ్రవరి 29 నాటికి ఎం.ఎస్.ఎం.ఇ యూనిట్లకు రుణాలుగా ఉన్న మొత్తానికి 20 శాతం మేర అదనపు ఆర్ధిక సహాయాన్ని అందించుటకు, 12 నెలల పాటు మారటోరియం విధింపుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ ప్యాకేజీ క్రింద 5333 ఖాతాలు ఉండగా 4925 ఖాతాలకు రూ.75.71 కోట్లను జూరు చేసారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించుటకు జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేసిందని, తద్వారా జిల్లాలో జీడిపప్పు, గ్రానైట్ ను ఎగుమతులకు అవకాశాలు ఉన్నట్లు ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందని పేర్కొన్నారు. కమిటి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పనిచేస్తుందని ఆయన చెప్పారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం (పి.ఎం.ఇ.జి.పి) క్రింద జిల్లా పరిశ్రమల కేంద్రానికి 68 యూనిట్లను లక్ష్యంగా నిర్ధేశించగా 16 యూనిట్లను మంజూరు చేసి, ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
పరిశ్రమల స్ధాపనకు 277 దరఖాస్తులు అందగా నిబంధనలకు అనుగుణంగా ఉన్న 244 దరఖాస్తులను డిఐపిసి ఆమోదించింది. ఎం.ఎస్.ఎం.ఇ పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తున్న ఆర్ధిక సహాయానికి జిల్లాలో 721 క్లైమ్ లు రాగా అర్హత మేరకు 592 క్లైమ్ లకు అనుమతులు మంజూరు చేసారు. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలో యువతకు ఉపాధి కల్పించుటకు రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్ధ ద్వారా శిక్షణ కల్పించుటకు ప్రతిపాదించింది. 158 ఎం.ఎస్.ఎం.ఇలకు ప్రోత్సాహకాలుగా రూ. 6.53 కోట్లను ఆమోదించడం జరిగింది. ఇందులో పెట్టుబడి రాయితీగా 11 ఎం.ఎస్.ఎం.ఇలకు రూ.2.82 కోట్లు, వడ్డీ రీఇంబర్సుమెంటుగా 84 ఎం.ఎస్.ఎం.ఇలకు రూ.2.09 కోట్లు, విద్యుత్ ఛార్జీల రీఇంబర్సుమెంటుగా 60 యూనిట్లకు రూ.1.60 కోట్లు ఉన్నాయి. ఈ సమావేశంలో ఆసరా, సంక్షేమ జాయింట్ కలెక్టర్ ఆర్. శ్రీరాములు నాయుడు, కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజనీరు ఎస్.శంకర్ నాయక్, జిల్లా అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం, కర్మాగారాల డిప్యూటి ఛీప్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, కార్మిక శాఖ సహాయ కమీషనర్ సి.హెచ్.పురుషోత్తం, నైపుణ్య అభివృద్ధి సంస్ధ జిల్లా మేనేజర్ డా.గోవింద రావు, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు ఆర్.వి.వి.ప్రసాద్, మార్కెటింగు శాఖ సహాయ సంచాలకులు బి.శ్రీనివాస రావు, పరిశ్రమల శాఖ సహాయ సంచాలకులు వీర శేఖర్, ఎన్.ఏ.సి.ఎల్ ఉపాధ్యక్షులు సి.వి.రాజులు, పి.వి.ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు పి.వి.రామ్మోహన్, ఇతర పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
సురక్షిత ప్రయాణానికి వేగ నియంత్రణ ఒక్కటే మార్గమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. శుక్రవారం హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్పీడ్ డ్రైవింగ్, ఈవిటీజింగ్ కి వ్యతిరేకంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో జర్నలిస్టుల ప్రతినిధిగా శ్రీనుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో యువతకి వేగ నింయత్రణ, ట్రాఫిక్ రూల్స్, ఈవిటీజింగ్ పై అవగాహన కల్పించడానికి హర్ష ఫౌండేషన్ చక్కటి కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం అభినంద నీయమన్నారు. మంత్రులు, ముత్తంశెట్టి శ్రీనివాస్, కన్నబాబులు పాల్గొని యువతకు మంచి సందేశం ఇవ్వడం శుభపరిణామం అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న బైక్ ప్రమాదాలు, ఈవిటీజింగ్ వలన యువత పెడత్రోవ, ఆత్మహత్యలు చేసుకోకుండా ఈ అవగాహన ర్యాలీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బైక్ నడిపేవారు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులకు కూడా డ్రైవింగ్ లైసెన్సు వచ్చేంత వరకూ వారి పిల్లలకు బైక్ లు ఇవ్వకూడదన్నారు. ఈవిటీజింగ్ విషయంలో యువతను ముందు హెచ్చరించాల్సింది కూడా తల్లిదండ్రులేనని చెప్పిరు. అదే సమయంలో జర్నలిస్టులు కూడా వాహన వేగంలో నియంత్రణ పాటించాలని శ్రీనుబాబు కోరారు. కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీసత్యన్నారాయణ, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్, వాసుపల్లి గణేష్ కుమార్, ప్రభుత్వ విప్ బి.ముత్యాలనాయుడు తదితారులు పాల్గొన్నారు.
యువత బైకు ప్రయాణాల్లో తప్పనిసరిగా హెల్మెట్ ధారణన చేయడంతోపాటు, ఖచ్చితంగా వేగ నియంత్రణ అలవాటు చేసుకోవడం ద్వారా ప్రమాదాల నుంచి బయటపడొచ్చునని వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు బి.కాంతారావు అన్నారు. శుక్రవారం విశాఖలోని ఆర్కేబీచ్ కాళీ మాత టెంపుల్ నుంచి స్పీడ్ డ్రైవింగ్, ఈవిటీజింగ్ కి వ్యతిరేకంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని రుషికొండ వరకూ పాల్గొన్నామని చెప్పారు. ఈ సందర్బంగా ఆయన మీడియాత మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న బైక్ ప్రమాదాలు, ఈవిటీజింగ్ వలన యువత పెడత్రోవ, ఆత్మహత్యలు చేసుకోకుండా ఈ అవగాహన ర్యాలీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బైక్ నడిపేవారు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులకు కూడా డ్రైవింగ్ లైసెన్సు వచ్చేంత వరకూ వారి పిల్లలకు బైక్ లు ఇవ్వకూడదన్నారు. ఈవిటీజింగ్ విషయంలో యువతను ముందు హెచ్చరించాల్సింది కూడా తల్లిదండ్రులేనని చెప్పిరు. ఈ ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం ఆంధ్ర యూనివర్సిటీ ప్రెసిడెంట్ బి మోహన్, రాష్ట్ర కార్యదర్శులు బి జోగారావు, అర్ ప్రభాకర్ నాయుడు, ఎం సురేష్, విద్యార్థి నాయకులు సీహెచ్.క్రాంతికిరణ్, నమ్మి లక్ష్మణ్, రంజిత్,భరత్, కె ప్రసాద్,నవీన్ చైతన్య, నిషేక్,సురేష్,పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగస్థుల డెపార్ట్మెంటల్ పరీక్షలు ఈనెల 21 నుండి 29 వరకు (మే ,2020 నోటిఫికేషన్ ) జిల్లాలో 14 పరీక్షా కేంద్రాల్లో జరగనున్నాయని జిల్లా రెవెన్యూ అధికారి మురళి అన్నారు. శుక్రవారం తిరుపతిల ఆర్డీఓ కార్యాలయంలో డెపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వాహణపై ఎ. పి. ఎస్. ఎస్. సి. అసిస్టెంట్ సెక్రెటరీతో కలసి డిఆర్ఓ పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు , లైజన్ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. డి.ఆర్.ఓ. మురళి మాట్లాడుతూ ఎ. పి. పి. ఎస్. సి. డిపార్ట్మెంటల్ పరీక్షలు ఈ నెల తేది 21 నుండి 29 వరకు 27 వ తేదీ మినహా జిల్లాలో 14 కేంద్రాలలో జరగనున్నాయని సూచించారు. పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహణకు ముందు తరువాత కూడా సానిటేషన్ ప్రక్రియ జరిగేలా చూడాలని సూచించారు. అభ్యర్థులు తప్పనిసరి మాస్కు దరించాల్సి ఉంటుందని, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని సూచించారు. ఆన్ లైన్ ఎగ్జామ్ అయినందున విద్యుత్ కు అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ చూడాలని సూచించారు. ఎ. పి. ఎస్. ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి అన్ని పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. రెవెన్యూ పోలీస్ శాఖలు పరీక్షా కేంద్రాలవద్ద 144 సెక్షన్ అమలు చేయాల్సి ఉంటుందని సూచించారు. వైద్య శాఖ సిబ్బంది అభ్యర్థులను ధర్మల్ స్క్రీనింగ్ చేయాలని సూచించారు. ఎ. పి. ఎస్. ఎస్. సి. అసిస్టెంట్ సెక్రెటరీ మురళీమోహన్ మాట్లాడుతూ ప్రశాంత వాతారణంలో నిర్వహించేలా చూడాలని , అభ్యర్థులు అర్థగంట మునుపే పరీక్షా కేంద్రాలు చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నందు ఇచ్చిన నియమాలను పూర్తిగా చదువుకొని అర్థం చేసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వాహణ పూర్తిగా సి.సి. కెమరాల నిఘాలో జరుగుతుందని తెలిపారు. కోవిడ్ పాజిటివ్ వ్యక్తులకు సెంటర్లలో ప్రత్యేక గది ఏర్పాటు చేయనున్నామని సూచించారు. తిరుపతి ఆర్ డి ఓ కనకనరసా రెడ్డి పర్యవేక్షణలో ఈ పరీక్షల నిర్వహణ వుంటుందని తెలిపా రు. ఈ సమీక్షలో సి. సూపరింటెండెంట్ వాసుదేవన్, డి. ఏ .ఓ. తిరుపతి సురేష్ బాబు, ఎ పి పి ఎస్ సి సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస రావు, డి. టి. లు లోకనాథం , లక్ష్మీనారాయణ, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు , లైజన్ అధికారులు పాల్గొన్నారు.
గిరిజనులను సీజనల్ వ్యాధుల నుంచి రక్షించడానికే దోమతెరలను పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 2.76 లక్షల గిరిజన కుటుంబాలకు దోమతెరలను అందిస్తున్నామని వెల్లడించారు. గిరిజనుల్లో దోమతెరల వినియోగంపై అధికారులు అవగాహన పెంచి చైతన్యం కలిగించే కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. జియ్యమ్మవలస మండలం చిన్నమేరంగిలోని తన క్యాంపు కార్యాలయంలో డిప్యుటీ సిఎం శుక్రవారం గిరిజన కుటుంబాలకు దోమతెరలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, గాలిలో తేమ అధికంగా ఉండే వానాకాలం, శీతాకాలాల్లో పెరిగే దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా లాంటి ప్రాణాంతకమైన సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ వ్యాధుల బారినపడి అనేక మంది గిరిజనులు ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంటుందన్నారు. ఈ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవడానికి దోమతెరలు ఉపయోగపడతాయని చెప్పారు. దోమతెరలను ఉపయోగించడం వల్ల దోమల కాటు నుంచి కాపాడుకోచ్చునని, దాంతో వ్యాధుల బారినపడే అవకాశం కూడా తగ్గిపోతుందని వివరించారు. అయితే ప్రతి ఏటా గిరిజనులకు దోమతెరలను పంపిణీ చేస్తున్నా కొంత మందికి వాటి వినియోగంపై అవగాహన లేకపోవడంతో వాడకుండా బీరువాల్లో మూసిపెట్టుకుంటున్నారని, ఈ కారణంగానే అనేక కుటుంబాలు వ్యాధుల బారిన పడటం గిరిజన ప్రాంతాల్లో చాలా చోట్ల జరుగుతోందని తెలిపారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్న 2 లక్షల 70 వేల గిరిజన కుటుంబాలకు దోమతెరలను అందిస్తున్నామని చెప్పారు. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న4 సబ్ ప్లాన్ మండలాల పరిధిలో ఉన్న గిరిజన కుటుంబాలకు 1 లక్ష దోమతెరలను పంపిణీ చేస్తున్నామని పుష్ప శ్రీవాణి వెల్లడించారు. గిరిజనుల్లో దోమతెరల వినియోగంపై అవగాహన లేకపోవడంతో పాటుగా దోమల మందు విషయంలోనూ అపోహలు ఉన్నాయని, ఈ కారణంగా కొన్ని చోట్ల దోమల నివారణకు ఉపయోగించే మందులను స్ప్రే చేయడాన్ని కూడా అడ్డుకుంటున్నారని వాపోయారు. ఐటీడీఏ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దోమతెరల వినియోగం, దోమల మందు పిచికారీ విషయంలో గిరిజనుల్లో అవగాహన పెంచి వారిలో చైతన్యం తీసుకొచ్చే విధంగా వినూత్నమైన రీతిలో కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. గిరిజన కుటుంబాలు తమకు అందించిన దోమతెరలను బీరువాలో దాచిపెట్టకుండా, సద్వినియోగం చేసుకోవాలని తద్వారా సీజనల్ వ్యాధుల బారి నుంచి తమను తాము కాపాడుకోవాలని పుష్ప శ్రీవాణి హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి తులసి, డిప్యుటీ డీఎం అండ్ హెచ్ఓ రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.