శ్రీకాకుళంజిల్లాలో మెగా వర్చువల్ లోక్ అదాలత్ ను నవంబరు 7వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్ధ ,జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్ధ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కోర్టులో మంగళ వారం వివరాలు అందించారు. నవంబరు 9వ తేదీన న్యాయ సేవాధికార దినోత్సవం సందర్భంగా మెగా వర్చువల్ లోక్ అదాలత్ ను 7వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మెగా వర్చువల్ లోక్ అదాలత్ ను భారీ ఎత్తున జిల్లాలో నిర్వహించుటకు ప్రణాళికలు సిద్ధం చేసామని ఆయన వివరించారు. కక్షిదారులు, న్యాయవాదులు, ఇతర సంబంధిత శాఖలు, వ్యక్తులు మెగా వర్చువల్ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి సహకరించాలని, అధిక సంఖ్యలో కేసులు పరిష్కారం కావడానికి న్యాయాధికాలకు తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేసారు.
విద్యార్థి దశలోనే ప్రతీ ఒక్కరు చట్టాలపై అవగాహనా పెంచుకోవాలని లోక్ అదాలత్ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే.కే.వి.బులి కృష్ణ అన్నారు. మంగళవారం న్యాయ సేవల సాధికార సంస్థ ఆధ్వర్యంలో విశాఖ రామకృష్ణా, శ్రీ రామకృష్ణా పాఠశాలల విద్యార్థులతో ఆన్లైన్లో నిర్వహించిన ప్రత్యేక న్యాయ అవగాహన సదస్సులో అయన మాట్లాడారు. విద్యార్థులకు న్యాయమూర్తి ,రాజ్యాంగం, ప్రాధమిక న్యాయశాస్త్రాలపై అవగాహనా కల్పించారు. న్యాయమూర్తితోపాటు లోక్ అదాలత్ సభ్యురాలు సీనియర్ న్యాయవాది బి.పద్మజారాణి విద్యార్థుల హక్కుల గురించి వివరించారు. కన్స్యూమర్ కోర్ట్ న్యాయాయవాది యు.యెన్ రావు గారు విద్యార్థులకు కన్స్యూమర్ కోర్ట్ విధి విధానాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణా, శ్రీ రామకృష్ణా పాఠశాలల అధినేత ఎ. కృష్ణారెడ్డి గారు, ప్రిన్సిపాల్ జి.వి.రవీంద్రుడు, వైస్ ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాస రావు, సోషల్ స్టడీస్ టీచర్ .ఐ.థామస్ , విద్యార్థులు పాల్గొన్నారు.
నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశాఖలోని శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి మహా లక్ష్మీ హోమం, శ్రీ చక్ర నవావర్చన, మహా పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మీడియాతో మాట్లాడుతూ,అమ్మలగన్న అమ్మ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి క్రుపతో కరోనా వైరస్ పూర్తిగా నియంత్రణ జరగాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్కింగ్ జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రభుత్వం గుర్తించే చేయాలని అమ్మవారిని కోరినట్టు చెప్పారు. కరోనా వైరస్ నుంచి విముక్తి కలిగి జర్నలిస్టు కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. కరోనా వైరస్ గతంలో పోల్చుకుంటే ఇపుడు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా సూచనల మేరకు జర్నలిస్టులు ప్రెస్ మీట్లు, అధికారిక కార్యక్రమాలకు కవరేజికి వెళ్లే సమయంలో సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు తప్పని సరిగా ధరించాలన్నారు. వీలైనంత వరకూ హేండ్ గ్లౌజ్ లు వేసుకోవాలన్నారు. అలా వీలు కాని పక్షంలో నాణ్యమైన శానిటైజర్లును వినియోగించాలన్నారు. జర్నలిస్టులు ప్రభుత్వం నిర్ధేశించిన జాగ్రత్తలతోమాత్రమే విధులకు హాజరు కావాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమ మే ధ్యేయంగా తాను అహర్నిసలు పనిచేస్తున్నట్టు గంట్ల వివరించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
అక్టోబరు 31వ తేదీ నాటికి వరదల్లో సంభవించిన నష్టాల వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. మానవత్వంతో ప్రతి అంశాన్ని గమనించాలని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన ఆదేశించారు. నష్టపోయిన వారి జాబితాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలని అన్నారు. తద్వారా జాబితాలో తప్పిన వారిని చేర్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నవంబరు 15 నాటికి నష్టపరిహారం అందించుటకు చర్యలు చేపడతామని అన్నారు. నష్టపరిహారం అందించడం వలన రైతులకు రబీ పంటలకు ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. కోవిడ్ రికవరీ రేట్ లో దేశంలోనే ప్రధమ స్థానంలో ఉన్నామని చెప్పారు. కోవిడ్ తగ్గుముఖం పడుతుందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కోవిడ్ వచ్చి వెళ్లిన తర్వాత గుండె, శ్వాస తదితర సమస్యలు తలెత్తుతున్నట్లు సర్వేలు చెపుతున్నాయని, దీనిని గమనించి తగిన విశ్రాంతి అవసరమని తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కోవిడ్ సమస్యలు ఉన్నవారు 104 నంబరుకు ఫోన్ చేయవచ్చని అన్నారు. ప్రతి ఆరోగ్య శ్రీ ఆసుపత్రిలో 15 రోజుల్లో హెల్ప్ డెస్క్ విధిగా ఉండాలని ఆయన స్పష్టం చేసారు. అచ్చట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, జేసీ పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. ఆరోగ్య మిత్ర లంచం అడిగితే ఉన్నత అధికారులకు తెలియజేయుటకు ఫోన్ నంబరు ఏర్పాటు చేయాలని అన్నారు. నవంబరు 2 నుండి బడులు తెరుస్తున్నామని, కోవిడ్ కు సంభందించిన అవగాహన పిల్లలకు కల్పించాలని ఆయన చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ ఏర్పాట్లు, మధ్యాహ్నం వరకు మాత్రమే బడులు ఉంటాయని చెప్పారు. పాఠశాలల్లో పిల్లల సంఖ్య ఆధారంగా ప్రత్యామ్నాయ దినాల్లో వివిధ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. ఎక్కడా నీరు నిలువ ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉపాధి హామీ క్రింద మెటీరియల్ కాంపోనెంట్ పనులు వేగవంతం కావాలని ఆదేశించారు. సీసీ రోడ్లు, కాలువల పైన దృష్టి సారించాలని ఆదేశించారు. నాడు నేడు పనులు వేగవంతం కావాలని ఆయన ఆదేశించారు. నవంబరు 6న జగనన్న తోడు పథకం ప్రారంభోత్సవం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు వలన నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జె నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్లు డా.కె.శ్రీనివాసులు, సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, డీఆర్డీఏ పిడి బి.నగేష్, గృహ నిర్మాణ సంస్థ పిడి టి.వేణుగోపాల్, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, సిపిఓ ఎం.మోహన రావు, మెప్మా పిడి ఎం.కిరణ్ కుమార్, డిఇఓ కె.చంద్రకళ, అదనపు డిఎంహెచ్ఓ డా.బి.జగన్నాథ రావు, ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, జలవనరులు, ఇపిడిసిఎల్, పంచాయతీ రాజ్ పర్యవేక్షక ఇంజినీర్లు డోల తిరుమల రావు, ఎన్. రమేష్, ఎస్.రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.
వై.యస్.ఆర్ ఆరోగ్య శ్రీని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆరోగ్యశ్రీ కేలండర్ ను జిల్లా కలెక్టర్ జె నివాస్ తో పాటు జిల్లా అధికారులంతా మంగళవారం కలెక్టరేట్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెలక్టర్ మాట్లాడుతూ, కేలండర్లో ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు, వాటి ఫోన్ నంబర్లు, ఆరోగ్య మిత్రల ఫోన్ నంబర్లు, లభించే స్పెషాలిటీ సేవల వివరాలు పొందుపరచడం జరిగిందన్నారు. వై. యస్.ఆర్ ఆరోగ్య శ్రీ ట్రస్టు ప్రచురించిన ఈ కేలండర్లను జిల్లాలో గల అన్ని సచివాలయాలకు ప్రజలకు సమాచారం అందించేందుకు పంపిణీ చేస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పై గ్రామసచివాలయాల ద్వారా సిబ్బంది, వాలంటీర్లుకు ప్రజలు అవగాహన కల్పించాలన్నారు. అత్యవసర సమయంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూసే బాధ్యత సచివాలయ సిబ్బందిపైనే ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్లు డా.కె.శ్రీనివాసులు, సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, ఆరోగ్య శ్రీ జిల్లా మేనేజర్ రవి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖలోని సాగర్‌నగర్-ఎండాడ పెట్రోల్ బంక్ వరకూ రోడ్డు నిత్యం ప్రజలు నడిచేదని ఈ రోడ్డును వేయకుండా జివిఎంసి అధికారులు, ఇంజినీర్లు అక్కడ గల ప్రభుత్వ చెరువులోంచి ముందుగా ప్రైవేట్ లే అవుట్‌కు రూ.42లక్షలు అక్కడ వెచ్చించడం నిబంధనలకు విరుద్దమని సిపిఎం నగర కార్యదర్శి గంగారావ్ ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సాగర్ నగర్- ఎండాడ ప్రజలు నడిచే దారిని వేసేందుకు 20 రోజులుగా మట్టిపోస్తున్నారే తప్ప తారు రోడ్డు వేయడం లేదన్నారు. అదే ప్రైవేట్ లే అవుట్ కోసం ఒక్క రాత్రికి రాత్రే అందమైన రోడ్డును జివిఎంసి వేయడం ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. ప్రైవేటు లేవుట్ లకోసం చూపించే శ్రద్ధ ప్రజాపయోగ పనులకు చేపట్టం లేదన్నారు. ప్రైవేట్ లే అవుట్ల కోసం జివిఎంసి ఇంజినీర్లు రోడ్డు వేయించే క్రమంలో లాంచాలకు పాల్పడే ప్రైవేటు వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చుతున్నారన్నారు. అంతేగాక ప్రభుత్వ చెరువు గర్భం ఎకరా 62 సెంట్ల భూమిని కూడా ఆక్రమించినా రెవెన్యూ ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధికి లబ్ధిచేకూర్చడం కోసమే చూస్తున్నారన్నారు. ఇటీవల ఈ ప్రాంతాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు సిహెచ్ నరసింగరావు, గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శి డాక్టర్ బి.గంగారావు ఆ రోడ్డుపై పరిశీలనకు వెళ్లగా స్థానికులు పలు ఫిర్యాదు చేశారనే విషయాన్ని గుర్తుచేశారు. తక్షణమే ప్రభుత్వం ఆ రోడ్డుకు మంజూరు చేసిన నిధులను నిలుపుదల చేసి, ప్రతిపాదించిన ఇంజినీర్లపై చర్య తీసుకుని, ఆక్రమణకు గురైన చెరువును రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు గంగారావ్..
ఆంధ్రవిశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్, సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆఈట్ పరీక్షల ఫలితాలను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సోమవారం విడుదల చేశారు. పరీక్షలు జరిగిన మూడు రోజుల్లో ఫలితాలు సిద్దం చేయడం పట్ల వీసీ హర్షం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడికి సమర్ధవంతంగా కృషిచేసిన ప్రవేశాల సంచాలకుల కార్యాలయం అధికారులను వీసీ ప్రసాద రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, ఇంచార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి.వి రవీంధ్రనాథ్ బాబు, ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఏ నాయుడు, అసోసియేట్ డైరెక్టర్లు ఆచార్య ఎస్.బి పడాల్, డాక్టర్ సి.వి నాయుడు, సెట్ సభ్యులు డి.బి వెంకటాద్రి, డాక్టర్ ఎస్.పాల్ డగ్లస్, డాక్టర్ పి.వి లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎన్.సాలమన్ బెన్నీ తదితరులు పాల్గొన్నారు. ఆసెట్ ప్రవేశ పరీక్షకు 17568 మంది దరఖాస్తు చేయగా, 14732 మంది హాజరయ్యారు. ఆఈట్ పరీక్షకు 1909 మంది దరఖాస్తు చేయగా 1259 మంది హాజరయ్యారన్నారు. కెమికల్ సైన్స్ విభాగంలో 93 మార్కులతో కోనాల అర్షిత భవ్య ఆసెట్‌లో టాపర్‌గా నిలచారు. ఆఈట్‌లో 80 మార్కులతో కె.శ్రీ క్రిష్ణ వెంకట సుబ్బారావు ప్రధములుగా నిలచారన్నారు. పరీక్షల ఫలితాలు ఏయూ ప్రవేశాల సంచాలకుల వెబ్‌సైట్ www.audoa.in లో పొందుపరిచారు. ఫలితాలు విడుదల అనంతరం వీపీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ త్వరలో కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేసి వెల్లడిస్తామన్నారు. డిగ్రీ పరీక్షల ఫలితాలు సైతం రికార్డు సమయంలో కేవలం 20 రోజుల్లో అందించే దిశగా అధికారులు పనిచేస్తున్నారన్నారు.
విశాఖజిల్లాలో భూ ఆక్రమణలపై సిట్ దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసేందుకు దర్యాప్తు బృందానికి సమాచారం అందజేయాలని సిట్ బృందం అధ్యక్షులు విజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సర్క్యూట్ హౌస్ లో సోమవారం జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ఇతర అధికారులతో ఆయన సమీక్షించారు. కరోనా నేపథ్యంలో సిట్ దర్యాప్తు కొనసాగలేదని దర్యాప్తును తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. దర్యాప్తు బృందం సభ్యులు వై.వి.అనూరాధ, రిటైర్డ్ జడ్జి టి. భాస్కరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, విశాఖపట్నం ఆర్డీవో పెంచల కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలోని అంగన్వాడీ పోస్టుల నియామకం కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. అంగన్వాడీ పోస్టుల నియామకానికి సంబంధించి, అంగన్వాడీ కేంద్రాల వారీగా రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉండగా, ఐసిడిఎస్ ప్రాజెక్టుల వారీగా రిజర్వేషను నిర్ణయిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.. ప్రజా ప్రతినిధుల నుండి కూడా ఈ అంశంలో విజ్ఞప్తులు వచ్చాయన్నారు.. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని, ఇంతకుముందు విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల వారీగా రోస్టర్ ప్రకారం రిజర్వేషన్లను నిర్ణయించి, రెండు, మూడు రోజుల్లో తదుపరి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అమలు జరిగేలా అంగన్వాడీ పోస్టుల నియామకాన్ని చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు..
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బిసీల్లో అన్ని కేటగిరీలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేయడంతోపాటు, వాటన్నింటికీ చైర్మన్లు నియమించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికే దక్కుతుందని మంత్రి తానేటి వనిత కొనియాడారు. ఈ సందర్భంగా సోమవారం ఏలూరు మహాత్మా జ్యోతిరావు పూలే, దివంగత డా.వై యెస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో బిసి ల అభివృద్ధి కి బాటలు వేసింది సీఎం జగన్ ఒక్కే అన్నారు. గత ప్రభుత్వాలు బీసీ లకు ఇచ్చిన హామీలను మరిచారని ఈ సందర్భంగ మంత్రి గుర్తుచేశారు. బీసీ కులాలను వోట్ బ్యాంకుగా వాడుకున్నారు తప్ప ఆ వర్గాల వారికి ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చలేదు మండిపడ్డారు. తరువాత కార్పొరేషన్ ఛైర్మన్ లు నలుగురు మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కారుమురి నాగేశ్వరరావు, జి.శ్రీనివాస్ నాయుడు,ఉన్నమట్ల ఎలిజా ,వుప్పాల వాసుబాబు , కోటారు అబ్బాయి చౌదరి , తలారి వెంకటరావు గర్బ్,డి.సీసీబీ చైర్మన్ కౌరు శ్రీనివాస్, శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ గుబ్బల తమ్మయ్య ,సూర్య బలిజ కార్పొరేషన్ కి శెట్టి ఆనంతలక్ష్మి ,అత్యంత వెనకబడిన కార్పొరేషన్ ఛైర్మన్ పేండ్ర వీరన్న, అతిరసుల కార్పొరేషన్ చైర్మన్ ఇళ్ల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులకు ఉపయుక్తంగా నిలచే విధంగా స్కిల్ ఐఓ యాప్‌ను తీర్చిదిద్దడం హర్షణీయమని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం తన కార్యాలయంలో ఆయన యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో పోటీ పరీక్షలకు సమాయత్తం అయ్యే విధంగా యాప్ రూపకల్పన చేయడం మంచి పరిణామమన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం ఎక్కడనుంచయినా సులభంగా ఈ యాప్‌ను వినియోగించవచ్చునన్నారు. విద్యార్థి నిరంతరం తన ప్రతిభను మెరుగు పరచుకోవడానికి, పోటీ తత్వానికి అనుగుణంగా తన నైపుణ్యాలను వృద్ది చేసుకోవడానికి ఈ యాప్ ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. బ్రైన్ ఓ విజన్ సంస్థ సిఓఈ గణేష్ నాగ్ దొడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సమర్ధ సేవలు అందించే ఉద్దేశంతో ఈ యాప్‌ను తమ సంస్థ రూపకల్పన చేసిందన్నారు. యాప్‌ను 9 భాషల్లో 40వేలకుపైగా టెస్ట్‌లు అందుబాటులో ఉంచామన్నారు. ఈ యాప్ సహాయంతో విద్యార్థులు నిత్యం తమ ప్రతిభను, ప్రగతిని మెరుగు పరచుకోవడం సాధ్యపడుతుందన్నారు.
విశాఖపట్నం పోర్ట్ సెక్రటరీ గా టి.వేణుగోపాల్ సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సెక్రటరీ గా సేవలు అందించిన సి.హరిచంద్రన్ తాజాగా కాండ్లా పోర్ట్ కి బదిలీ అయ్యారు. ఉద్యోగ బాధ్యత లు స్వీకరించిన వేణుగోపాల్ ను జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి .వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు, పోర్ట్ మాజీ సలహాదారు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి అసోసియేషన్ ల నేతలు ఘనంగా సత్కరించారు. అనంతరం గత సెక్రటరీ హరిచంద్రన్ కు అందరు ఘనంగా వీడ్కోలు పలికారు. అందరి సహకారం తో పోర్ట్ అభివృద్ధి కి తాము శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. భవిష్యత్తు లో పోర్ట్ చైర్మన్ కె.రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో పోర్ట్ మరింతగా పురోగతి సాదిస్తుందని వీరు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో పోర్ట్ క్యాజువల్ కార్మికుల సంఘం ప్రతి నిధులు వర్మ, గోపి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.