సీపీఎం పుట్టుక పీడిత ప్రజల కోసమని జిల్లా కార్యదర్శి కె.లోకనాధం అన్నారు. శనివారం భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ శత వార్షికోత్పవాల సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పతాకావిష్కరణలు సదర్భంగా జగదాంబ సిపిఎం జిల్లా కార్యాలయం వద్ద సిపిఎం సీనియర్ నాయకులు వై.రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా లోకనాధం మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాడి 100 ఏళ్ళు పూర్తి అయ్యిందని నాటి నుండి నేటి వరకు దేశ స్వాతంత్య్రం కోసం, ప్రజల కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించిందని, కుల, మత, ప్రాంతీయ విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. కార్మిక, కర్షక హక్కుల పరిరక్షణ కోసం నేటికీ క్రుషి చేస్తుందని, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపి లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన చరిత్ర కమ్యూనిస్టు ఉద్యమానికి ఉందన్నారు. నాడు స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్ వాళ్ళకు ఎదురొడ్డి నిలిచిందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎలాంటి పాత్ర బిజెపికి లేదు. కాని నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశానికి పట్టుకొమ్మలైన ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతుందని, రాష్ట్రాలకు ఉన్న హక్కులను పూర్తిగా కాలరాస్తుందన్నారు. రాజ్యాంగ హక్కులను పూర్తిగా తుంగలోకి తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. కుల, మత రాజకీయాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తుందన్నారు. నాడు, నేడు ఎన్నడూ ప్రజల తరపున నికరంగా పోరాడేది ఎర్రజెండా ఒక్కటేనన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు బి.జగన్, జిల్లా, నగర నాయకులు సభ్యులు జి.నాయనబాబు, వి.వి.శ్రీనివాసరావు, ఎం.సుబ్బారావు, జివిఎన్ చలపతి, అప్పలరాజు, సూర్యడు, విహెచ్.దాసు తదితరులు పాల్గొన్నారు.
కోవిడ్ నిబంధనలను అమలు చేస్తూనే, సంప్రదాయాల ప్రకారం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలను నిర్వహిస్తామని సిరిమాను ఉత్సవాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులు, స్థానిక హుకుంపేట వాసులతో తన కార్యాలయంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. సిరిమానుతోపాటుగా, పాలధార, బెస్తవారి వల, ఏనుగు రథం, అంజలి రథం తదితర ఘట్టాలు, సంప్రదాయ వేడుకల్లో పాల్గొనే భక్తుల సంఖ్యపై ఆరా తీశారు. ఈ రధాలవద్ద ఉండే భక్తులను కనీస సంఖ్యకు పరిమితం చేయాలని కోరారు. పాల్గొనే ప్రతీఒక్కరికీ ముందుగానే కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. వీటికి 20 లోపు వారిని, 60 ఏళ్లు పైబడిన వారినీ ఎట్టిపరిస్థితిలోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. పాల్గొనే వారందరి పేర్లను, ఆధార్ కార్డులను ముందుగానే అందించాలని, వాందరికీ త్వరలో రెండుమూడు రోజుల్లో కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. ప్రతీఒక్కరూ మాస్కులను ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. కౌంటర్లవద్ద రద్దీని తగ్గించేందుకు దర్శనాలకు ఆన్‌లైన్ టిక్కెట్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆర్‌డిఓ తెలిపారు. విజయనగరం డిఎస్‌పి వీరాంజనేయరెడ్డి మాట్లాడుతూ భక్తుల మనోభావాలను తాము గౌరవిస్తామని, అయితే ఉత్సవాలకు వచ్చే ప్రతీ భక్తుడూ కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఒకేచోట వేలాదిమంది చేరితో, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కోవిడ్ మళ్లీ విజృంభించే అవకాశం ఉందని అన్నారు. ఇదే జరిగితే జిల్లా యంత్రాంగానికి చెడ్డపేరు వస్తుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని, ప్రతీఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, తప్పనిసరి పరిస్థితిలో పలు రకాల నిబంధనలను పెడుతున్నామని, వాటిని సహృదయంతో అర్ధం చేసుకోవాలని డిఎస్‌పి కోరారు. ఈ సమావేశంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఇఓ సుబ్రమణ్యం, ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు, తాశీల్దార్ ప్రభాకర్, దేవస్థానం సిబ్బంది, హుకుంపేట వాసులు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లాలో కోవిడ్-19 పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి. అరుణ్ బాబు, ఎఎంసి ప్రిన్సిపల్, డిఎంహెచ్ఓ లతో జిల్లాలో కోవిడ్-19 పరీక్షల నిర్వహణపై విఎంఆర్డిఏ లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐ.ఇ.సి. యాక్టివిటీలను అధికంగా పెంచాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతంలో మరింత దృష్టి సారిస్తూ కోవిడ్ కేసులు అధికంగా ఉన్న మండలాలల్లో ఈ విషయంపై శ్రద్ద వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐవిఆర్ఎస్ ప్రజాభిప్రాయంను పరిశీలిస్తూ లోపాలను సరిచేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎంఎంసి ప్రిన్సిపల్ పి.వి. సూధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పి.ఎస్. సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవలు మరింత వేగవంతం చేయాల్సి ఉందని జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రజలు అందించే దరఖాస్తుల పరిష్కారం నిర్ణీత గడువులోపే జరగాల్సి ఉందన్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు వారు నివసించే గ్రామంలోనే సత్వర, మెరుగైన సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ ఉద్దేశ్యాన్ని నెరవేర్చే దిశగా సచివాలయ ఉద్యోగులు కృషిచేయాలన్నారు. గంట్యాడ మండలం రామవరంలోని గ్రామ సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ జె.వెంకటరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ సచివాలయంలో సిబ్బంది హాజరును పరిశీలించి ఉద్యోగి వారీగా ఏవిధులు నిర్వహిస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని, ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకొనే విధానాన్ని సూచిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేసినదీ లేనిదీ పరిశీలించారు. ఇప్పటివరకు సచివాలయానికి వచ్చిన ఇ.రిక్వెస్టులు, వాటిలో పరిష్కారం చేసిన వివరాలను తెలుసుకున్నారు. గ్రామంలో సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. సచివాలయ నిర్వహణపై ఆరా తీశారు. విజయనగరం రూరల్ మండలం చెల్లూరు గ్రామ సచివాలయాన్ని కూడా జె.సి. వెంకటరావు శుక్రవారం తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు, సంక్షేమ పథకాలపై సమాచారం, ముఖ్యమైన ఫోన్ నెంబర్లు డిస్ ప్లే తదితర అంశాలను ప్రదర్శిస్తూ ఏర్పాటు చేసిన సమాచారాన్ని పరిశీలించారు.
విజయనగరం జిల్లాలో: వక్ప్ బోర్డుకి సంబంధించిన భూములను, ఇతర ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని సంయుక్త కలక్టరు (ఆసరా) జె. వెంకటరావు అన్నారు. శుక్రవారం ఆయన చాంబరులో జిల్లా స్ధాయి వక్ప్ పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వక్ప్ భూములను సర్వే చేసి అన్యాక్రాంతమైన భూములు పరిరక్షించడానికి రెవిన్యూ, మున్సిపల్ కమిషనర్లు, సర్వే శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. వక్ఫ్ ఆస్తులు 22 (ఎ) (1) (సి) జాబితాలో ఉన్న వాటిని వేరొకరి పేరున బదిలీ చేయరాదని జిల్లా రిజిస్ట్రార్ కు సూచించారు. అదేవిధంగా ఆ భూములకు మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ నుండి ఎటువంటి ఫ్లాన్ అనుమతులు ఇవ్వరాదన్నారు. వక్ప్ భూములలో ఆదాయం వచ్చే కార్యక్రమాలకు, భూములను అభివృద్ధి చేసి వాణిజ్యపరంగా వినియోగించాలని అన్నారు. బకాయిపడ్డ నిధులను వెంటనే వసూలు చెయ్యాలని, వక్ప్ బోర్డు ఎన్నికలు నిర్వహించాలన్నారు. అన్యాక్రాంతం యైన వాటిల్లో ఎక్కువగా శ్మశానాలు ఉన్నాయని, వక్ప్ ఆస్తులు పరిరక్షణకు ఆన్యాక్రాంతం చేసిన వారికి నోటీసులు జారీచెయ్యాలని, పరిరక్షణ కోసం బోర్డులను ఏర్పాటు చెయ్యాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎం. గణపతిరావు, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి ఎం. అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, జిల్లా రిజిస్ట్రార్ బాలకృష్ణ, వక్ప్ ఇన్స్పెక్టర్ సిద్దిఖి, పోలీస్, ఆర్ అండ్ బి, రెవిన్యూ, దేవాదాయ తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలులో అర్హులందరికీ పరిహారం అందించేలా చూడాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శుక్రవారం సీబీఆర్ కింద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు విషయమై తాడిమర్రి మండలం మర్రిమాకుల పల్లి ఎస్ఈ కాలనీని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పరిహారం విషయమై ప్రజలతో మాట్లాడి వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీబీఆర్ కింద ముంపునకు గురవుతున్న గ్రామాలలో ఎవరైనా అర్హులైన వారు ఉంటే వారందరికీ పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముంపునకు గురవుతున్న గ్రామాలలో అర్హులైన వారికి అన్యాయం జరగకుండా చూస్తామని, తప్పకుండా అర్హులైన వారికి పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని, అర్హులైన వారు ఎవరూ మిస్ కావడానికి వీలు లేదన్నారు. సీబీఆర్ కింద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు పూర్తి అవుతుండడంతో రిజర్వాయర్ లో వెంటనే 10 టీఎంసీల నీటి నిల్వకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, పలువురు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
కిసాన్ రైల్ ట్రస్టుకు రూ.30,000/-చొప్పున రూ.90,000/- విలువ గల మూడు చెక్కులను విరాళాల రూపంలో అనంతపురం, హిందూపురం ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్ మరియు అనంత ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి లు అందచేశారు.. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో కిసాన్ రైల్ ట్రస్టుకు అనంతపురం, హిందూపురం ఎంపీలు మరియు అనంతపురం ఎమ్మెల్యే విరాళాలను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు కిసాన్ రైల్ ట్రస్టుకు విరాళాలు అందించిన ఎంపీలు, ఎమ్మెల్యేకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. వీరి బాటలో ఇతర ప్రజాప్రతినిధులు, దాతలు ముందుకు వచ్చి విరివిగా విరాళాలు అందివ్వాలని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా ఉద్యాన ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర అందించాలనే ఉద్దేశ్యం తో పాటు అనంత రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్రం నుంచి కిసాన్ రైల్ ప్రవేశ పెడితే బాగుంటుందని భావించి భారత ప్రధానికి, సంబందిత కేంద్రమంత్రులకు లేఖలు రాయడం జరిగిందన్నారు. వాటి ఫలితంగా మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో అనంతపురం నుంచి ఢిల్లీలోని ఆజాద్ పూర్ మార్కెట్ కు అనంత ఉద్యాన ఉత్పత్తులను తరలించేందుకు రెండవ కిసాన్ రైల్ ను సెప్టెంబర్ 9వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు వీడియో లింక్ ద్వారా ప్రారంభించారన్నారు. కిసాన్ రైల్ ద్వారా ఉద్యాన ఉత్పత్తుల రవాణా ఛార్జీలను సగానికి తగ్గించి రైతులను ఆదుకోవాలని, రైతుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర వ్యవసాయ, రైల్వే శాఖల మంత్రులను కోరడం జరిగిందన్నారు..ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ రైలు ద్వారా ఢిల్లీ మార్కెట్ కు తరలించే ఉద్యాన ఉత్పత్తుల రవాణా ఛార్జీలలో 50 శాతం ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ ద్వారా చెల్లించేందుకు అంగీకరించిందన్నారు. రైతుల వాటాగా చెల్లించాల్సిన 50 శాతం రవాణా ఛార్జీలను కూడా చెల్లించలేని సన్న, చిన్నకారు రైతులను ఆదుకునేందుకు గాను కిసాన్ రైల్ ట్రస్టును ఏర్పాటు చేసి, జిల్లా కలెక్టర్ మరియు హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ పేరిట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అనంతపురం ఏబీకే రోడ్డు బ్రాంచ్ నందు జాయింట్ అకౌంట్ ను గురువారం నాడు ప్రారంభించామన్నారు. కిసాన్ రైల్ ట్రస్టు ద్వారా చిన్న, సన్న కారు రైతులను ఆదుకునేందుకు ఆసక్తిగల దాతలు ముందుకు వచ్చి విరివిగా తమ విరాళాలను కిసాన్ రైల్ ట్రస్టు ఖాతా నెంబర్:91129820396 ( IFSC :APGB 0001070, Branch code:1070) కు జమ చేయాలన్నారు.
ఈ సందర్భంగా అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ, అనంతపురం నుంచి న్యూఢిల్లీ కి తరలించే ఉద్యాన ఉత్పత్తులకు సంబంధించి ఒక టన్నుకు రవాణా ఛార్జీల ద్వారా 5136/- రూపాయలను రైల్వే వారు వసూలు చేస్తున్నారని, అందులో రవాణా ఛార్జీలలో 50 శాతం ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ చెల్లిస్తోందన్నారు. మిగిలిన సగం రూ.2568/-ల మొత్తాన్ని రైతులు చెల్లించాల్సి ఉందన్నారు. ముందస్తుగా సగం రవాణా ఛార్జీలను కూడా చెల్లించలేని ఉద్యాన రైతుల కోసం దాదాపు 50 మందితో 15 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయదలచామన్నారు. అందులో భాగంగా తాను, హిందూపురం ఎంపీ, అనంతపురం ఎమ్మెల్యే 30 వేల రూపాయల చొప్పున విరాళాలను జిల్లా కలెక్టర్ కు అందజేశామన్నారు.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ, జిల్లాలోని ఉద్యాన ఉత్పత్తులు పండించే రైతులు కిసాన్ రైలు ద్వారా తమ ఉత్పత్తులను ఢిల్లీ మార్కెట్ కి తరలించేందుకు చెల్లించే రవాణా ఛార్జీలలో 50 శాతం తగ్గించాలని ఇదివరకే కోరారన్నారు. ఈ అంశాన్ని జిల్లాలోని ప్రజాప్రతినిధులు ద్వారా కేంద్రానికి విన్నవించి రవాణా చార్జీలలో 50 శాతం తగ్గించేలా కృషి చేయడం జరిగిందన్నారు.
అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ, జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధి అని, దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని రైతులు ఉద్యాన పంటలు పండిస్తున్నారన్నారు. అయితే రైతాంగం పండించే పంటలకు గిట్టుబాటు ధర లేక, సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేక నష్టపోవడం జరుగుతోందన్నారు. టమోటా సీజన్లో సరైన ధర లేక రోడ్లపై పారేసేవారన్నారు. రైతాంగానికి మేలు చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం, అనంత, హిందూపురం ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కిసాన్ రైల్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి రవాణా చార్జీలు 50 శాతానికి తగ్గించాలని కేంద్రాన్ని కోరడం జరిగిందన్నారు. జిల్లా ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి ముందుగా రవాణా ఛార్జీలు చెల్లించలేని రైతులకు మేలు చేసేందుకు కిసాన్ రైల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్, హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ పేరిట జాయింట్ అకౌంట్ ప్రారంభించి అందులో 15 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆ ట్రస్ట్ నుండి రైతుల తరపున రవాణా ఛార్జీలు చెల్లించి, వారి పంట అమ్ముడు పోయాక తిరిగి వారి నుండి ఆ మొత్తాన్ని ట్రస్టుకు జమ చేయడం ద్వారా జిల్లా రైతాంగానికి మేలు చేసే చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్ భాషా, అనంతపురం జిల్లా డెవలప్మెంట్ కో ఆర్డినేషన్ అండ్ మానిటరీ కమిటీ మెంబర్ సి. అశ్వర్థ నాయక్, మాజీ జడ్పిటిసీ వెన్నెపూస రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జీవిఎంసీ పరిధిలోగల మింది, వెంకటాపురం, చిన్నముషిడివాడ ప్రాంతాలలో ఇంజినీరింగు పనులను సత్వరమే పూర్తిచేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో కలసి జరుగుతున్న పలు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలనచేసారు. ఈ సందర్భంగా రూ.16.82లక్షలు అంచనా వ్యయంతో మింది పంప్ హౌస్ కు ఆనుకొని ఉన్న కాళికానగర్ వద్ద మంచినీటి పైపులైను మార్పును ఇంజినీరింగు అధికారులు తయారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం, పెందుర్తి నందు 70వ వార్డు శారదాపీఠం వద్ద రహదారి వెడల్పు పనులు, ఎలక్ట్రికల్ పోల్స్ షిఫ్టింగ్ పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. 66వ వార్డు వెంకటాపురం ప్రజల విన్నపము మేరకు ఎల్.జి. పాలిమేర్స్ వెనుకవైపు నుండి బైపాస్ రోడ్డు ప్రతిపాదనను పరిశీలించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్లు శ్రీధర్, రమణ, పర్యవేక్షక ఇంజినీరు శివప్రసాద రాజు, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు మురళీ కృష్ణ, ఇతర ఇంజినీరింగు అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు..
వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి తొలి సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి, స్పీకర్ తమ్మినేని సీతారాంలు విచ్చాసారు. ఈ సందర్భంగా ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతు బాంధవుడు అని, వారిని ఆదుకోవడం కోసమే సలహా మండలిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా మన జిల్లా వ్యవసాయాధారిత జిల్లా అని ప్రధాన వృత్తి వ్యవసామేనని అన్నారు. ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, వ్యవసాయ, సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యత నిస్తున్నదన్నారు. వ్యవసాయ అభివృధ్ధికి విన్నూత మార్పులు తేవడం జరిగిందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా సాంకేతిక సలహాలను అందిండం జరుగుతున్నదన్నారు. వ్యవసాయానికి అదును పదును వుండాలన్నారు. సకాలంలో సాగునీరు అందించాలని, నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని అన్నారు. ప్రస్తుతం వ్యనసాయానికి అవసరమైన సమయంలో కూలీల కొరత వుందన్నారు. దీనిని అధిగమించ వలసిన ఆవశ్యకతను పునరాలోచించాలన్నారు. చెరకు పంట విస్తీర్ణతను పెంచాలన్నారు. చెరకు, అరటి పంటల నష్టాలను అధిగమించడానికి ఇన్సూరెన్సు స్కీమ్ వుందన్నారు. సలహా మండలి ద్వారా అధికారులు, వ్యవసాయదారులకు మంచి సలహాలను అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా రూపొందించాలన్నారు. శాస్త్ర సాంకేతికతను సామాన్యులకు అందించాలన్నారు. మేలైన వ్యవసాయానికి మంచిరోజులు వచ్చాయన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ, అనేక సవాళ్ళ మధ్య వ్యవసాయం చేయడం జరుగుతున్నదన్నారు. వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు ఒక శుభ సూచికమన్నారు. ముఖ్యమంత్రి అభినందనీయులని అన్నారు. జిల్లా స్థాయిలోని నిర్ణయాలను మండల స్థాయికి తీసుకు వెళ్ళాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా జవాబుదారీతనంతో వ్యవసాయం చేయడం జరుగుతుందన్నారు. సలహా మండలి ద్వారా వ్యవసాయంలోని లోటు పాట్లు, అవసరాలు , సలహాలను రైతుల నుండి తెలుసుకుని ప్రభుత్వానికి తెలియచేయడం జరుగుతుందన్నారు. రైతులు సంఘటిత శక్తిగా మారే అవకాశం వుందన్నారు. మార్కెటింగ్ సదుపాయం వంటి అంశాలపై నిర్ణయాత్మకమైన వ్యూహాలను రూపొందించుకుని సమస్యల పరిష్కార దిశగా ముందుకు సాగాలన్నారు. ఇరిగేషన్, ఎగ్రికల్చర్, అనుబంధ శాఖలు సంయుక్తంగా పని చేసి మంచి సలహాలను అందించాలని, వ్యవసాయ రంగాన్ని అభివృధ్ధి చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, వ్యవసాయంపై ప్రత్యేక శ్రధ్ధ వహిస్తున్నారన్నారు. దాని ఫలితంగానే వ్యవసాయ సలహామండలి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వానికి, రైతాంగానికి వారధిగా సలహామండలి పనిచేస్తుందన్నారు. జిల్లాలో ఈ-క్రాప్ నమోదు శతశాతం పూర్తి చేయడం జరిగిందని, వివరాలను సచివాలయాలలో వుంచడం జరిగిందని తెలిపారు. అనంతరం రైతు మిషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు గొండు రఘు రాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతు బాంధవుడని, నష్టాల ఊబి నుండి లాభాల బాట వైపు తీసుకొని రావడమే లక్ష్యంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేసి మార్కెటింగ్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రికే చెల్లిందన్నారు. డిమాండు మేరకు పంటలను వేసుకోవాలన్నారు. తక్కువ నీటితో పంటలు పండించుకునే సలహాలను అందించాలన్నారు. భవిష్యత్తులో లాభం గడించే పంటలపై అంచనాలు వేసుకోవాలని, రైతులకు పంటమార్పిడిపై అవగాహన పెంపొందించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతు శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తున్నారని తెలిపారు. రెతుల కష్టాలను తొలగించడానికి ఎనలేని కృషి చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయ వ్యవస్ధకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసారని తెలిపారు. రైతు వద్దకే విత్తనాలను, ఎరువులను అందించడం జరుగుతున్నదన్నారు. రబీలో మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించడం జరిగిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో మంచి దిగుబడి సాధించాలి. గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, దువ్వాడ శ్రీనవాస్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్, సివిల్ సప్లయిస్ డిఎం శ్రీనివాసరావు, వంశధార ఎస్.ఇ తిరుమల రావు, జలవనరుల శాఖ ఎస్ ఈ ఎస్ వి రమణ, డుమా పి.డి. కూర్మారావు, ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహన్ రావు, సెరికల్చర్, హార్టికల్చర్, ఏనిమల్ హస్బెండ్రీ అధికారులు, సుగర్ ఫ్యాక్టరీ ఎ.జిఎం. నియోజకవర్గ సభ్యులు ఆర్.వెంకటేశ్వరరావు, శ్రీహరిరావు, జి,అప్పలనాయుడు, కె.సంజీవరావు, జి.లక్ష్మణరావు, జి.కళావతి, కె.సూర్యనారాయణ, నరేంద్ర నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శుక్రవారం బుక్కరాయసముద్రం మండలం సిద్దారాంపురం గ్రామం వద్ద శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పొలాలను పరిశీలించి రైతులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు కోసం తమ పొలాలను అప్పగించామని, మాకు మరోచోట యూనివర్సిటీకి సంబంధించి 76.55 ఎకరాల పొలాలను ఇచ్చారని, ఆ భూములకు పాసుపుస్తకాలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సమస్య పరిష్కరించేందుకోసం ఇక్కడికి వచ్చామన్నారు. పొలాలను సాగు చేసుకుంటున్న రైతులందరికీ అన్యాయం జరగకుండా చూస్తామని, నెల రోజుల్లో సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గుణభూషణ్ రెడ్డి, తహసీల్దార్ మహబూబ్ బాషా, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సైంటిస్ట్ అండ్ హెడ్ శ్రీనివాస నాయక్, రైతులు పాల్గొన్నారు.
రైతుబజారు నిర్వహణలో అలక్ష్యం వహిస్తున్న ఎస్టేట్ అధికారిపై జాయింటు కలెక్టరు ఎం. వేణుగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతు బజారు నిర్వహణపై పలు పిర్యాదులు వస్తున్న నేపధ్యంలో ఎం.వి.పి. రైతుబజారును శుక్రవారం ఉదయం ఆయన ఆకస్మిక తనిఖీ చేసారు. రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసున్నారు. వారి సమస్యల పరిష్కారానికి సత్యరమేచర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతుబజారు రికార్డులను, కూరగాయల ధరలను తనిఖీ చేసారు. రైతుబజారును తనిఖీచేసి పారిశుద్యంనిర్వహణపై అసంతృప్తి వ్యక్తంచేసారు. రైతుబజారును శుభ్రంగా ఉంచాలని, పారిశుధ్యం విషయంలో నిర్లక్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్టేట్ అధికారిని హెచ్చరించారు. రైతు బజారులో జరుగుచున్న అభివృద్ది పనులను తొందరగా పూర్తిచేయాలని మార్కెటింగుశాఖ, అసిస్టెంటు డైరెక్టరును ఆదేశించారు. రైతుల వసతిగృహం నిర్వహణ, పారిశుధ్యం అద్వాన్నంగా కలవని, ఇలా ఉంటే రైతులు ఎక్కడ ఉంటారని వెంటనే శుభ్రం చేసి అందుబాటులోనికి తేవాలన్నారు. పార్కింగు నిర్వహణ తీరుపై సమీక్షిస్తూ కొత్త కాంట్రాక్టరుకు అప్పగించేవరకు పార్కింగు క్రమబద్దీకరణపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ప్రస్తుతం రైతుబజారులో 256 మందిరైతులు ఉన్నారని, 178 షాపులు ఉన్నాయని ఎస్టేట్ అదికారి తెలుపగా రైతు బజారు అభివృద్దికి నివేదిక రూపొందించాలన్నారు. రైతుబజారు నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సమస్యలురాకుండా చూసుకోవాలని మార్కెటింగు శాఖ సహాయ సంచాలకులకు ఆదేశాలు జారీచేసారు.
అనంతపురం జిల్లాలో గడచిన 24 గంటల్లో కరోనా వల్ల ఒక్క మరణం కూడా సంభవించలేదని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 24 గంటల సమయంలో కరోనా వల్ల ఒక్క మరణం కూడా జరగలేదన్నారు. ఇంతకుముందు కరోనా మరణాలు సంభవించినా, చాలా రోజుల అనంతరం జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు మరణాల సంఖ్య జీరో కావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో కరోనా వ్యాప్తి కూడా తగ్గిందన్నారు. కోవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తుండగా, పాజిటివ్ వచ్చిన వారు త్వరగా కోలుకుని ఇళ్లకు చేరుతున్నారని, ఆ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు కరోనా మరణాలు ఒక్కటి కూడా సంభవించలేదని తెలిపారు.
కిసాన్ రైల్ ట్రస్టుకు విరివిగా విరాళాలు అందించాలని జిల్లాలోని రైతు సానుభూతిపరులు, దాతలకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని ఉద్యాన ఉత్పత్తులను కిసాన్ రైల్ ద్వారా అనంత నుండి ఢిల్లీలోని ఆజాద్ పూర్ మార్కెట్ కు తరలిస్తున్న విషయం విధితమే. ఇందుకు సంబంధించి రవాణా ఛార్జీలను ముందస్తుగా రైల్వే కు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులు తమ ఉద్యాన ఉత్పత్తులను కిసాన్ రైలు ద్వారా ఢిల్లీకి పంపేందుకు ముందస్తుగా రవాణా ఛార్జీలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. అనంతపురం నుంచి న్యూఢిల్లీ కి తరలించే ఉద్యాన ఉత్పత్తులకు సంబంధించి ఒక టన్నుకు రవాణా ఛార్జీల ద్వారా 5136/- రూపాయలను రైల్వే వారు వసూలు చేస్తున్నారని, అందులో రవాణా ఛార్జీలలో 50 శాతం ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ చెల్లిస్తోందన్నారు. మిగిలిన సగం రూ.2568/-ల మొత్తాన్ని రైతులు చెల్లించాల్సి ఉందన్నారు. 50 శాతం రవాణా ఛార్జీలను కూడా చెల్లించలేని సన్న, చిన్నకారు రైతులను ఆదుకునేందుకు గాను కిసాన్ రైల్ ట్రస్టును ఏర్పాటు చేసి, జిల్లా కలెక్టర్ మరియు హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ పేరిట ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అనంతపురం ఏబీకే రోడ్డు బ్రాంచ్ నందు జాయింట్ అకౌంట్ ను గురువారం ప్రారంభించామని పై ప్రకటన లో తెలిపారు. రైలు ట్రస్టు ద్వారా చిన్న, సన్న కారు రైతులను ఆదుకునేందుకు ఆసక్తిగల దాతలు, రైతుల పట్ల సానుభూతి చూపే దాతలు ముందుకు వచ్చి విరివిగా తమ విరాళాలను కిసాన్ రైల్ ట్రస్టు ఖాతా నెంబర్:91229820396 ( IFSC :APGB 0001070, Branch code:1070) కు జమ చేయాలన్నారు. కిసాన్ రైల్ ట్రస్టుకు దాతలు అందించిన విరాళాల మొత్తం నుండి సన్న, చిన్నకారు రైతుల తరపున రవాణా ఛార్జీలను ముందుగా రైల్వే వారికి చెల్లించి, మార్కెట్లో రైతుల ఉత్పత్తులు అమ్ముడైన తర్వాత రైతుల తరఫున చెల్లించిన మొత్తాలను తిరిగి కిసాన్ రైతు ట్రస్టుకు జమ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
నూతన సాగు పద్ధతులను అవలంభించి మహిళా రైతులు వ్యవసాయంలో మరింత మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. అనంతపురం రూరల్ పరిధిలోని కురుగుంట గ్రామం వద్దనున్న మనభూమి ఉమ్మడి వ్యవసాయ క్షేత్రం లో మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలంతా ఒక గ్రూపుగా ఏర్పడి వ్యవసాయంలో వివిధ పంటలను సాగు చేయడం చాలా గొప్ప విషయమని, మహిళలంతా సంఘటితంగా వ్యవసాయం చేయడం వల్ల వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. దీని ద్వారా జీవనాధారం పొందేందుకు అవకాశం ఉంటుందని, మనభూమి ఉమ్మడి వ్యవసాయ క్షేత్రంలో ఇలాగే చిరు ధాన్యాలు, ఆకు కూరలు, వివిధ పంటల సాగు చేస్తూ విరివిగా ఆదాయం పొందుతూ మరింత అభివృద్ధి చెందాలన్నారు. మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా మహిళా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు మహిళా రైతులను జిల్లా కలెక్టర్ సన్మానించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ మనభూమి ఉమ్మడి వ్యవసాయ క్షేత్రంలో సాగుచేస్తున్న సొరకాయ, బీరకాయ, బెండ, వేరుశనగ తదితర పంటలను పరిశీలించి, ఆయా పంటల సాగు విధానంలో పాటిస్తున్న పద్ధతులను మహిళా రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఎంత మంది పనిచేస్తున్నారు, ఇక్కడ సాగు చేస్తున్న పంటల వల్ల ఎంత ఆదాయం వస్తుంది అనే వివరాలను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో రెడ్స్ సంస్థ అధ్యక్షురాలు భానుజ, వ్యవసాయ శాఖ ఏ డిఏ విద్యావతి, ఏడీ ఏ వెంకటరాముడు, వ్యవసాయ అధికారి వెంకటేశ్వర ప్రసాద్, సైంటిస్టులు రాధాకుమారి, రాధిక, ఏ ఈ ఓ ప్రసాద్, మహిళా రైతులు, రెడ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.