శ్రీకాకుళం జిల్లాలోని యువతను చైతన్యపరచి అన్ని రంగాల్లో ముందుండేలా చర్యలు చేపట్టాలని ఆసరా, సంక్షేమం సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు వెల్లడించారు. యువత కార్యక్రమాల నిర్వహణపై నెహ్రూ యువక కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం జిల్లా నీటి యాజమాన్య సంస్థ డి.ఎల్.ఆర్.సి సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జె.సి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు రిజిష్టర్ కాబడిన స్వచ్చంధ సంస్థలు, అసోసియేషన్లు చురుకుగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులను కోరారు. ప్రతీ స్వచ్చంధ సంస్థ మరియు అసోసియేషన్ ప్రతీ నెలా ఏదో ఒక శాఖతో సమన్వయం చేసుకుంటూ యువతను ప్రోత్సహించే కార్యక్రమాలను చేపట్టేలా చూడాలని సూచించారు. అలాగే ప్రతీ కళాశాల, పాఠశాలలో యన్.సి.సిలు, యన్.ఎస్.ఎస్ లు ఉంటాయని వాటి సహకారంతో గ్రామస్థాయిలో యువతను చైతన్యపరచాలని అన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మరియు నెహ్రూ యువక కేంద్రం జిల్లా యూత్ కోఆర్టినేటర్ సమన్వయంతో నెలలో యువతకు సంబంధించిన రెండు కార్యక్రమాలను చేపట్టాలని, అందులో ఒకటి గ్రామీణ ప్రాంతం కాగా , రెండవది పట్టణ ప్రాంతాల్లో నిర్వహించాలని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములను చేయాలని, అదేవిధంగా ప్రతీ నెలా ఒక శాఖకు సంబంధించిన కార్యక్రమం ఉండేవిధంగా ప్రణాళికలు సిద్దం చేసుకొని ముందుకుసాగాలన్నారు. తద్వారా యువతలో మార్పు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలను యువత సద్వినియోగం చేసుకునేలా చూడాలని, తద్వారా వచ్చిన మార్పు మిగిలిన యువతకు ఆదర్శంగా నిలిచేలా ఉండాలని జె.సి పేర్కొన్నారు. ముందుగా ఇందులో భాగస్వాములైన శాఖాధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు తీసుకున్న ఆయన భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలను నెహ్రూ యువక కేంద్రం చేపట్టి యువతలో మార్పును తీసుకువస్తుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేసారు. యువత కోసం ఏర్పాటు చేసే కార్యక్రమాలకు సంబంధించిన నిధులను యన్.వై.కె సమకూర్చుకుంటుందని జె.సి స్పష్టం చేసారు. నెహ్రూ యువక కేంద్రం చేపట్టే కార్యక్రమాలతో యువతలో మార్పుతో పాటు నూతన ఉత్తేజం, అవగాహన వంటివి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లాలో కొత్తగా నమోదుచేసుకునే స్వచ్చంధ సంస్థలకు రిజిస్ట్రేషన్ ఫీజులను ఇచ్చేందుకు ముందుకు వచ్చిన బెజ్జిపురం యూత్ క్లబ్ సంచాలకులు యం.ప్రసాదరావును అభినందించిన ఆయన స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సహకారంతో యువత అభివృద్ధి చెందే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో ముఖ్యప్రణాళిక అధికారి యం.మోహనరావు, నెహ్రూ యువక కేంద్రం జిల్లా యూత్ కో ఆర్డినేటర్ జి.మహేశ్వరరావు, సెట్ శ్రీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి.శ్రీనివాసరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసకుమార్, జిల్లా పర్యాటక అధికారి యన్.నారాయణరావు, ఉప విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, ఐతమ్ కళాశాల డీన్ ఆచార్య డి.విష్ణుమూర్తి, ఏ.పి.స్కిల్ డెవలప్ మెంట్ నోడల్ అధికారి యన్.గోవిందరావు, యన్.సి.సి కో ఆర్డినేటర్ కెప్టన్ వంగ మహేశ్, యన్.ఎస్.ఎస్ నోడల్ అధికారి డా. కె.ఉదయకిరణ్, బెజ్జిపురం యూత్ క్లబ్ సంచాలకులు యం.ప్రసాదరావు, పి.వి.యస్.రామ్మోహన్ ఫౌండర్ పి.వి.యస్.రామ్మోహన్, డా.అప్పారావు, ఇతర అధికారులు , కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కరోనాలాంటి క్లిష్ట సమయంలో చేతి వృత్తుల కళాకారులను ఆదుకోవాల్సిన అవసరమెంతైనా ఉందని విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ కొనియాడారు. వైజాగపటం చాంబర్ ఆఫ్ కామర్స్ మహిళా విభాగం ఆధ్వర్యంలో విశాఖ సిరిపురంలోని వాల్తేర్ క్లబ్‌లో ఏటికొప్పాక లక్కబొమ్మలతో పలు చేతి వృత్తి కళా ఖండాల ప్రదర్శనను ఎంపీ శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఇలాంటి మంచి కార్యక్రమం చేపడుతున్న వాల్తేరు క్లబ్ కృషి ప్రశంసనీయమన్నారు. మహిళా వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ యడవల్లి హేమ మాట్లాడుతూ, కళాకారులు వారి సృజనాత్మకత, కృషికి గొప్ప గుర్తింపు పొందాలని వారికి చేయూత నిచ్చేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ పండుగ సీజన్లో ప్రియమైనవారికి బహుమతిగా ఇవ్వడానికి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, తద్వారా కళాకారులకు ఆర్ధిక తోడ్పాటు అందించినవారవుతారన్నారు. చేతివృత్తి కళాకారులకు ఈ రకంగా తోడ్పాటు అందించటంపై వాల్తేరు క్లబ్ ప్రెసిడెంట్ ఫణీంద్రబాబు సంతోషం వ్యక్తంచేసారు. ఆర్ట్స్ & క్రాప్ట్సులను ప్రోత్సహించటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో బ్రాండింగ్, మార్కెటింగ్, భాగస్వామి అందరికీ సమగ్రమైన, స్ధిరమైన ఆర్ధిక వృద్ధిని, ఉపాధిని ప్రోత్సహించనున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ విశాఖపట్నం జిల్లా ఆఫీసర్ టి.చాముండేశ్వర రావు సహకారంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగలిగామని నిర్వాహకులు తెలిపారు. మహిళా వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ హేమ యడవల్లి, వాల్తేర్ క్లబ్ ప్రెసిడెంట్ పణీంద్ర బాబు, విసిసిఐ అధ్యక్షుడు వీరమోహన్, గౌరవ కార్యదర్శి సంధ్య గోడే, వైస్ ప్రెసిడెంట్ జీజా వల్సరాజ్, ఇతర కమిటీ సభ్యుల తదితరులు పాల్గొన్నారు.
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ జోన్ – 2 పరిధిలో ఖాళీగా ఉన్న దుకాణములు, మార్కెట్లు నకు సంబందించి వేలంపాటు నిర్వహించనున్నట్లు రెండవ జోనల్ కమిషనర్ ఎస్. శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు. జోన్ – 2 కార్యాలయంలో తేది.27-10-2020న ఉదయం 11.00గంటలకు వేలంపాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్లకు సంబందించి నెహ్రూ బజార్ రోడ్డు ప్రక్కన ఆశీలు వసూలు చేయుటకు(63 దుకాణములు మినహాయించి), శ్రీ నగర్ మార్కెట్, జగ్గారావు బ్రిడ్జ్ మార్కెట్, వాల్తేరు వారాంతపు సంతలకు మరియు దుకాణములకు సంబందించి పాండురంగాపురం షాపింగ్ కాంప్లెక్స్ లో షాప్ నెంబర్లు 1, 3, 4, 6, 12 & 15, షాప్ నెంబర్లు 2, 7(ఎస్.సి. కోటా), షాప్ నెంబర్లు 8(ఎస్.టి.కోటా), డైమండ్ పార్కు షాపింగ్ కాంప్లెక్స్ లో షాప్ నెంబరు. 2, శివాజీ పార్కు షాపింగ్ కాంప్లెక్స్ లో షాప్ నెంబర్లు 1, 2, 3 & 4, ఆశీల్ మెట్ట షాపింగ్ కాంప్లెక్స్ లో షాప్ నెంబరు 7 లను వేలంపాటు నిర్వహించబడునని తెలిపారు. కావున, ఆసక్తి గల వ్యక్తులు/ సంస్థలు సదరు బహిరంగ వేలం నందు పాల్గొనవలసినదిగా కోరడమైనది. పూర్తీ వివరములకు జోన్-2 కార్యాలయ పర్యవేక్షకుల వారిని పనివేళలలో సంప్రదించగలరని జోనల్ కమిషనర్ ఎస్. శ్రీనివాస రావు తెలిపారు.
దసరా, దీపావళి పండుగల సందర్భంగా కో- ఆప్టెక్స్ లో రాయితీ సంబరాలు ప్రారంభమయ్యాయని, సిక్కోలు ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని చేనేత కళాకారులను ఆదుకోవాలని జిల్లా పౌర సంబంధాల అధికారి యల్.రమేష్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక ఆర్.టి.సి.కాంప్లెక్స్ దరి అంబేద్కర్ కూడలి వద్ద నున్న దుకాణ సముదాయంలో కో-ఆప్టెక్స్ రెండవ షోరూమ్ శుక్రవారం ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి జిల్లా పౌర సంబంధాల అధికారి యల్.రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని వస్ర్త విక్రయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రతీ వస్త్ర కొనుగోలుపై 30% వరకు ప్రత్యేక రాయితీలను ఇస్తున్నట్లు తెలిపారు. నేత కళాకారులను ప్రోత్సహించే దిశగా ప్రతీ వస్త్రంపై చేనేత కళాకారుల ఫొటోలను ముద్రించి, నూతన వరవడికి శ్రీకారం చుట్టారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకు వాయిదాల పద్దతిలో వస్త్రాలను కొనుగోలు చేసేలా అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. అలాగే నెలకు రూ.300/-ల నుండి రూ.3,000/-ల వరకు 11 మాసాల పథకంలో చేరడం ద్వారా 53% వరకు లాభం పొందే అవకాశాన్ని కో-ఆప్టెక్స్ కల్పించిన సంగతిని ఆయన గుర్తుచేసారు. ఈ వస్త్రాలయంలో సిక్కోలు ప్రజలకు అవసరమైన కంచి,ఆరని, సేలం, కోయంబత్తూరు పట్టుచీరలతో పాటు ఆర్గానిక్ కాటన్ చీరలు, రెడిమేడ్ షర్టులు, లేటెస్ట్ దుప్పట్లు, బ్లాంకెట్స్, టవల్స్, లుంగీలు, పంచెలు మొదలగు సరికొత్త మోడల్స్ లలో లభ్యమయ్యేలా ఏర్పాట్లుచేయడం జరిగిందన్నారు. ఈ సదవకాశం దీపావళి పర్వదినం వరకు మాత్రమే లభ్యమవుతుందని, శ్రీకాకుళం ప్రజలు విరివిగా చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. వస్త్రాలపై లభించే ప్రత్యేక రాయితీ ప్రతీ కో-ఆప్టెక్స్ షోరూమ్ నందు లభించే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో షో రూమ్ సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
అన్ని రకాల వాహనాల్లో కొవిడ్ నిబందనలు తప్పనిసరిగా పాటించాలని ఉప రవాణా కమీషనర్ జిసిరాజరత్నం స్పష్టం చేశారు. విశాఖలోని మాదవధర ఆర్ టి ఎ కార్యాలయంలో ప్రైవేటు బస్సు, లారి, టాక్సీ, ఆటో అసోసియేషన్ ప్రతినిదులతో కోవిడ్ నివారణ చర్యలపై సమావేసం నిర్వహించారు. ఈ సందర్భంగా డిసి మాట్లాడుతూ, ప్రభుత్వం జారీచేసిన జి.ఒ.520, కోవిడ్ ఉత్తర్వులు-83 అనుసరించి రవాణా వాహనాల యజమానులు, అసోసియేషన్ ప్రతినిధులు తపనిసరిగా తమ డ్రైవర్ర్లుకు, సిబ్బందికి కోవిడ్ నివారణ చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. మాస్కు లేకుండా ఎటువంటి పరిస్తితులలో వాహనాలలోకి అనుమతించరాదని, లారి, టాక్సీ, బస్సు లలో కోవిండ్ నివారణ పై అవగాహన పోస్టర్స్ ప్రదర్శించాలన్నారు. వాహనాలల్లో సామజిక దూరం పాటించాలని ప్రయాణికులను కోరారు. ప్రయాణికులు చేతులను సానిటైజర్ తో శుభ్రపరుచుకోవాలన్నారు. వాహన దారులు తమ వాహనాలను సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం తో సానిటైజ చేసుకున్నతరువాతే బయటకు తీసుకురావాలన్నారు. సరుకు రవాణా వాహనాలో ప్రయాణీకులను ఎక్కించరాదని, ప్రయాణీకుల వాహనాలలో 50% మాత్రమే ఎక్కించాలన్నారు. కోవిడ్ లక్షణాలు కలిగిన ప్రయాణీకులు, సిబ్బంది లను ఎక్కించరాదని కోరారు. ప్రైవేటు బస్సు లలో 6 అడుగులు సామజిక దూరం, Q విధానం తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రయాణీకులకు ధర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని, మాస్కు, సానిటైజర్ లు లేకుండా బస్సులలో అనుమతించరాదన్నారు. అలాగే RTC బస్సు లలో పై నిబందనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓలు, ఆర్ సి హెచ్ శ్రీనివాస్, కె వి ప్రకాష్, rtc డిపో మేనేజర్ ఆర్ఎస్. తదితరులు పాల్గొన్నారు.
జివిఎంసీ పరిధిలోని డోర్ టు డోర్ తడి, పొడి వేరు చేసిన చెత్త సేకరణ ఖచ్చితంగా సేకరించాలని అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం, నగరంలోని 57వ వార్డు నరవ తదితర ప్రాంతాలలో పర్యటించి డోర్ టు డోర్ చెత్త సేకరణ, తడి-పొడి చెత్త అమలు తీరును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గెడ్డలు, కాలువలలో చెత్త వేయరాదని స్థానికులకు సూచించారు. అలా డ్రైనేజీల్లో చెత్తవేసేవారికి ఫైన్లు వేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా డ్రైనులు శుభ్రపరిచి వ్యర్ధాలను తరలించాలని సిబ్బందికి సూచించారు. వాణిజ్య సముదాయాలలో కలిగిన ట్విన్ బిన్స్ లో రోజూ వ్యర్ధాలను తరలించాలని శానిటరీ అధికారులకు ఆదేశించారు. కార్మికుల పనితీరును పరిశీలించి పలు సూచనలిచ్చారు. పలు దుకాణాలను సందర్శించి పర్యావరణానికి హాని కలిగించే సింగల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు, క్యారీ బ్యాగులు వాడరాదనీ హెచ్చరించారు. ఈ పర్యటనలో వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్, శానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
జివిఎంసీ పరిధిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో పూడికలను తొలగించి డ్రైనేజీలు మరమ్మత్తులు చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా 6వ జోన్ 70వ వార్డు లోని చిన్నముషిడివాడ, సుజాతనగర్ తదితర ప్రాంతాలలోని స్థానిక ఎమ్మెల్యే ఎ. అదీప్ రాజ్ తో కలసి క్షేత్రస్థాయి పరిశీలించారు. చిన్నముషిడివాడ ఉడా కోలనీలోని కాలువలను పరిశీలించి పూడికలను తీయించాలని, పాడైన డ్రైన్ లను మరమ్మత్తులు చేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. కాలువల వెంబడి పందులు సంచరించడం గమనించిన కమిషనర్ వాటిని నిర్మూలించాలని చీఫ్ మెడికల్ ఆఫీసరు డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ ని ఆదేశించారు. ఉడా కోలనీలో ప్రభుత్వ భూమిలో బిల్డింగు మెటీరియలైన ఇసుక, పిక్క తదితర వ్యాపారాలు చేస్తుండడం గమనించి వెంటనే వాటిని తొలగించాలన్నారు. అక్కడక్కడ అనధికారంగా వెలసిన రేకుల షెడ్లను తొలగించాలని, టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. సుజాత నగర్ లోని నాగమల్లి లే అవుట్, బాలాజీ రేసిడేన్షియల్ అపార్ట్ మెంట్ తదితర ప్రాంతాలలో వర్షాలవలన పలురోడ్లపైకి మట్టి బురద చేరి రహదారి ఇబ్బంది అవుతున్నందున రోడ్డుపై ఉన్న బురదను తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ పర్యటనలో పెందుర్తి శాసన సభ్యులు ఎ. అదీప్ రాజ్, పర్యవేక్షక ఇంజినీరు శివ ప్రసాద రాజ్, చీఫ్ మెడికల్ ఆఫీసరు డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ, జోనల్ కమిషనర్ బి. వి. రమణ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ భాస్కర్ బాబు, ఏ.ఎం.ఓ.హెచ్. లక్ష్మీ తులసి, కార్య నిర్వాహక ఇంజినీరు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి ప్రాంతంలో జూదంపై ఉక్కుపాదం మోపుతున్నామని జిల్లా ఎస్పీ ఎ.రమేష్ రెడ్డి అన్నారు. గురువారం ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా అందిన సమాచారం మేరకు ఎస్బీ డిఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో జూదం నిర్వహిస్తున్న శ్రీకాలహస్తి తొట్టంబేడు కాసారం ప్రాంతాలపై మెరుపు దాడులు చేసి రూ.4.40లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. చాలా మంది ప్రత్యేకంగా ఇళ్లు తీసుకొని అక్కడ జూదం నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుతుందన్నారు. అలాంటివారిని వెంటాడి మరీ పట్టుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో మూడు కార్లు, 12 ద్విచక్ర వాహనాలు, 17 సెల్ ఫోన్లు స్వాధీనంతోపాటు 17 మంది జూదరులను అరెస్టు చేసినట్టు ఎస్పీ వివరించారు. ప్రత్యేక పోలీస్ దళాలు జిల్లా అంతటా అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచామన్నారు. ఈ దాడుల్లో ఈస్ట్ సి.ఐ, తిరుచానూర్ సి.ఐ బ్రుందాలు పాల్గొన్నాయని వివరించారు.
కరోనా వైరస్ పట్ల స్వయం రక్షణ పాటించే విధంగా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని అధికారులను ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ఆదేశించారు. గురువారం మార్కాపురం పట్టణంలోని డ్వాక్రా బజార్ లో మార్కాపురం, ఎర్రగొండ పాలెం,గిద్దలూరు నియోజక వర్గాల సంబంధించిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, మహిళా సంక్షేమ శాఖ సూపర్ వైజర్లు , డి.ఆర్.డి.ఏ ఏరియా కో ఆర్డినేటర్ల కు కరోనా వైరస్ స్వయం రక్షపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ ను ఎదుర్కొవడానికి గ్రామ స్థాయిలో వ్యవస్థ ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నందువలన కరోనా వైరస్ కేసులు జిల్లాలో తగ్గాయన్నారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు గ్రామ స్థాయిలో నిర్వహించాలని ఆధికారులను ఆదేశించామన్నారు. అవసరమైన వారికీ వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్న కలెక్టర్ జిల్లాలో కరోనా వైరస్ సోక కుండా స్వీయరక్షణ చేసుకోవాలన్నారు. జిల్లాలో అన్ని గ్రామాల్లో కరోనా వైరస్ రక్షణ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆయన చెప్పారు. జిల్లాలో నవంబర్ 2తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించ నున్నామన్నారు. గ్రామాల్లో కరోనా వైరస్ ను నియంత్రణ కు గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది కృషి చేయాలని ఆయన చెప్పారు. గ్రామాల్లో గ్రామ ఐక్య సంఘాల సభ్యులు కరోనా వైరస్ నియంత్రణకు స్వయం రక్ష తీసుకునే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. జిల్లాలో ఉన్న 7లక్షల స్యయం సహాయ సంఘాలు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో కరోనా వైరస్ నుండి జిల్లా ప్రజలను కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్2 టి.ఎస్.చేతన్,వైద్య విధాన పరిషత్ కో ఆర్డినటర్ ఉషా, మహిళా శిశు సంక్షేమ శాఖ పి.డి లక్ష్మీదేవి, డి.ఆర్.డి.ఎ పి.డి ఎ. ఏలీషా,జిల్లా పరిషత్ ఎ. ఓ వెంకటేశ్వరరావు, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.శేషి రెడ్డి, ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.
దసరా, దీపావళి పండుగల సందర్భంగా అక్టోబర్ 22 నుండి నవంబర్ 21 వరకు ఆప్కో ఎగ్జిబిషన్ మరియు విక్రయాలను చేపడుతున్నట్లు సంస్థ డివిజనల్ మార్కెటింగ్ ఆఫీసర్ బి.ఉమాశంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసారు. స్థానిక ఆర్.టి.సి.కాంప్లెక్స్ దగ్గరలోని బి.ఆర్.అంబేద్కర్ సెంటర్ వద్ద గల చేనేత బజార్ షాపింగ్ కాంప్లెక్స్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆప్కో చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలను గురువారం ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు. పండుగల సీజన్ కావడంతో ఎంపిక చేసిన వస్త్రాలపై ఒకటి కొంటే రెండు ఉచితం బంపర్ ఆఫర్ గాను, ఒకటి కొంటే ఒకటి ఉచితం మెగా ఆఫర్ గాను, అన్ని రకాల వస్త్రాలపై 30% ప్రత్యేక తగ్గింపు ధరలతో వస్త్రాలు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పేరుగాంచిన ధర్మవరం, మాధవరం, వెంకటగిరి, మంగళగిరి, బందరు, గుంటూరు, రాజమండ్రి, ఉప్పాడ పట్టు, కాటన్ చీరలు, ధోవతులు, దుప్పట్లు, లుంగీలు, రుమాళ్లు, షర్టింగ్ క్లాత్, డ్రెస్ మెటీరియల్స్ తో పాటు అన్నిరకాల వస్త్రాలను ఈ ప్రదర్శనలో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. 30 రోజులు పాటు నిర్వహించే ఈ ప్రదర్శనకు జిల్లా ప్రజలు హాజరై, చేనేత వస్త్రాలను విరివిగా కొనుగోలు చేసి, నేత కార్మికుల ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశాఖలోని శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి, ఆదిశక్తినాగదేవతలకు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మీడియాతో మాట్లాడుతూ,అమ్మలగన్న అమ్మ శ్రీ కనకమహాలక్ష్మి, ఆదిశక్తి నగదేవతలు అమ్మవార్ల క్రుపతో కరోనా వైరస్ పూర్తిగా నియంత్రణ జరగి ఎలాంటి కష్టాలు లేకుండా జర్నలిస్టులు కుటుంభాలు వర్ధిల్లాలని ప్రార్ధించినట్టు చెప్పారు. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్కింగ్ జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రభుత్వం గుర్తించే చేయాలని అమ్మవారిని కోరినట్టు కూడా గంట్ల చెప్పారు. కరోనా వైరస్ నుంచి విముక్తి కలిగి జర్నలిస్టుల కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. కరోనా వైరస్ గతంలో పోల్చుకుంటే ఇపుడు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా సూచనల మేరకు జర్నలిస్టులు ప్రెస్ మీట్లు, అధికారిక కార్యక్రమాలకు కవరేజికి వెళ్లే సమయంలో సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు తప్పని సరిగా ధరించాలన్నారు. వీలైనంత వరకూ హేండ్ గ్లౌజ్ లు వేసుకోవాలన్నారు. అలా వీలు కాని పక్షంలో నాణ్యమైన శానిటైజర్లును వినియోగించాలన్నారు. జర్నలిస్టులు ప్రభుత్వం నిర్ధేశించిన జాగ్రత్తలతోమాత్రమే విధులకు హాజరు కావాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమ మే ధ్యేయంగా తాను అహర్నిసలు పనిచేస్తున్నట్టు గంట్లశ్రానుబాబు వివరించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గలేదని, పైగా కొత్తకేసులు పెరుగుతున్నాయని కలెక్టర్ జె నివాస్ అన్నారు. కోవిడ్ వ్యాప్తి నివారణ అవగాహన కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో రెండవ దశ వ్యాప్తి ప్రారంభమైందని అన్నారు. రవాణా రంగం ప్రాధాన్యత కలిగిన రంగమని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తి ప్రమాదకర పరిస్థితిలో ఉన్న సమయంలో ముందుకు వచ్చి సేవలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తగ్గుముఖం పట్టిందని ప్రజలు అలసత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. వర్షా కాలం, చలికాలంలో వైరస్ వ్యాప్తి, శ్వాస సంభందించిన సమస్యలు ఎక్కువగా వస్తాయని గమనించాలని చెప్పారు. కోవిడ్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో వ్యాప్తి ప్రారంభం అయిందని గుర్తించాలని అన్నారు. వాహనాలను శానిటేషన్ చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా తగ్గలేదు, జాగ్రత్తలు పాటించాలని అన్నారు. మాస్కె కవచం అన్నారు. నో మాస్కు - నో ఎంట్రీ నినాదం పాటించాలని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని అన్నారు. భౌతిక దూరం పాటించాలని, చేతులు సబ్బుతో గాని, శానీటైజరుతో గాని తరచూ శుభ్రపరచుకోవాలని అన్నారు. చేతులలో ముఖాన్ని తాకారాదని ఆయన స్పష్టం చేశారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని ఎక్కించారాదని ఆయన స్పష్టం చేశారు. ఏ వ్యక్తి తోను ఎక్కువ సమయం మాట్లాడరాదని అన్నారు. ఆ వ్యక్తి పాజిటివ్ అయితే వైరస్ సోకుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేరళలో అధిక కేసులు వస్తున్నాయని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించని ప్రయాణీకులను ఆటోలు, టెక్సీ లలో ఎక్కించారాదని చెప్పారు. వాక్సిన్ వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలని పిలుపునిచ్చారు. కోవిడ్ అవగాహనలో భాగంగా అన్ని వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి సరాసరిన 30 మందికి అంటించగలరని చెప్పారు. ఎక్కడా రద్దీ లేకుండా చూడాలని అన్నారు. భౌతిక దూరం పాటించక పోవడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందని తెలిపారు.
పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ అన్ లాక్ 6లో సడలింపులు ఇవ్వడం జరిగిందన్నారు. కోవిడ్ సమయంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారాని పేర్కొన్నారు. కోవిడ్ ఇంకా తగ్గలేదని, ఎక్కువ మంది ప్రయాణీకులను ఎక్కించారాదని ఆయన స్పష్టం చేసారు. మీకు వైరస్ వస్తే కుటుంబ సభ్యులకు వస్తుందని గుర్తించాలని కోరారు. ఎక్కువ మందిని ఎక్కించి అధికంగా డబ్బులు సంపాదించే ఆలోచన చేయవచ్చు, కానీ కుటుంబ సభ్యులకు వైరస్ సోకితే అయ్యే ఆసుపత్రి ఖర్చులను గమనించాలని సూచించారు. మీ ఆరోగ్యం దృష్ట్యా మీరే పోలీసు అన్నారు. నియంత్రణ చేసుకోవాలని పిలుపునిచ్చారు. రవాణా శాఖ ఉప కమీషనర్ డా.వి.సుందర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ వ్యాప్తి నివారణకు అనేక చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఆటో చోదకులు జాగ్రత్తలు చేపట్టడం వలన కోవిడ్ భారీన పడలేదని పేర్కొన్నారు. తగ్గుముఖం పట్టిందని అనుకుంటున్నామని, అయితే ఇప్పుడే అసలు ఆట మొదలైందని గమనించాలని కోరారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు పాటించని వారి వాహనాలను సీజ్ చేస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో డిఎస్పీ సి.హెచ్.జి.వి.ప్రసాద్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు వేణుగోపాల్, పి.శివరాం గోపాల్, ఆటో, టేక్సీ తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
రైస్ కార్డు పొందేందుకు అర్హత ఉన్న లబ్దిదారుల కుటుంబాలన్నీ వై.యస్.ఆర్. బీమా పథకానికి అర్హులని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వై.యస్.ఆర్. బీమా పథకంను ఆయన ప్రారంభించారు. ఈ పథకం కుటుంబాన్ని పోషించే పెద్దకు అకస్మాత్తుగా ఏదైనా జరిగితే అతని మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఆపత్కాలంలో ఆర్థిక భరోసానిస్తుందని, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన బియ్యపు కార్డులు కలిగియున్న కోట్లాది కుటుంబ సభ్యుల భద్రతకు ధీమా ఇస్తుందన్నారు. కుటుంబ జీవన భద్రతే పరమావధిగా వారిని సకాలంలో ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడమైనదని చెప్పారు. ఈ పథకం బియ్యం కార్డు పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలన్నీ అర్హులని, 18 సంవత్సరాలు నుండి 70 సంవత్సరాల వయస్సు కలిగి కుటుంబాన్నీ పోషించే వారు ఈ పథకానికి అర్హులని, గ్రామ/వార్డు సచివాలయ వాలంటీర్లు డోర్ టు డోర్ సర్వే ద్వారా అత్యంత పారదర్శకంగా లబ్దిదారుల గుర్తింపు జరుగుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా 18-50 సంవత్సరాల వయస్సు గల లబ్దిదారుడు సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.5 లక్షలు బీమా పరిహారంను ప్రభుత్వం చెల్లిస్తుందని, 18-50 సంవ.ల వయస్సు గల లబ్దిదారుడు ప్రమాదవశాత్తు పూర్తి అంగ వైకల్యం పొందితే రూ.5 లక్షలు బీమా పరిహారం అందుతుందని, 51-70 సంవత్సరాల వయస్సు గల లబ్ధిదారుడు ప్రమాద వశాత్తు మరణిస్తే నామినీకి రూ.3 లక్షలు, శాశ్వత అంగవైకల్యం పొందితే లబ్దిదారుడికి రూ.3 లక్షలు పరిహారం అందుతుందన్నారు. 18-70 సం.ల వయస్సు గల లబ్ధిదారుడు ప్రమాద వశాత్తు పాక్షిక శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ.1.50 లక్షలు బీమా పరిహారం అందుతుందని పేర్కొన్నారు. వ్యక్తి మరణించిన వెంటనే తక్షణ అవసరాలకు పది వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. వ్యక్తి మరణించిన వెంటనే బీమా కార్డును సచివాలయంలో చూపిస్తే పది వేల రూపాయలు అందజేస్తారన్నారు. ఈ పథకం కింద జిల్లాలో 11,36,535 మంది అర్హత గల రైస్ కార్డు లబ్దిదారులుండగా ఇంత వరకు 9,65,223 మంది వై.యస్.ఆర్. పథకం కింద నమోదు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ తో పాటు, జివియంసి కమీషనర్ జి. సృజన, శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్, కరణం ధర్మశ్రీ, అన్నంరెడ్డి అదీప్ రాజ్, జిల్లా జాయింట్ కలెక్టర్-3 గోవిందరావు, డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్టు డైరక్టర్ విశ్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
మహావిశాఖ పరిధిలోని వ్యాపార వాణిజ్య సంస్థ యాజమాన్యాలు కోవిడ్ నియమావళిని తప్పనిసరిగా పాటించాల్సిందేనని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన స్పష్టం చేశారు. బుదవారం జివిఎంసి సమావేశ మందిరంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్, షాప్ కీపర్స్, మర్చంట్ అసోసియేషన్లు, చలన చిత్ర థియేటర్ యజమాన్యాలు, వివిధ వ్యాపార, వాణిజ్య సంఘాల సభ్యుల తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కోవిడ్ నిబంధనలు తూ.చ. తప్పకుండా వ్యాపారాలు చేయాలని, మాస్కులు, శానిటైజర్స్ ఉపయోగించాలని, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ థియేటర్ మరియు మాల్స్ లలో గేట్ వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేయాలని కోవిడ్ లక్షణాలు ఉంటే లోనికి అనుమతించకూడదని సూచించారు, చిన్న పిల్లలు, గర్బిణీ స్త్రీలు, వృద్ధులకు ప్రవేశంనకు అనుమతిలేదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారము పెద్ద పెద్ద మాల్స్, థియేటర్లలో 50శాతం కంటే ఎక్కువగా లోనికి అనుమతి ఇవ్వకూడదన్నారు. డిస్ప్లే బోర్డులు, “నో మాస్క్ – నో ఎంట్రీ” బోర్డులు, ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించి ప్రజలకు మీవంతు అవగాహన కల్పించాలన్నారు. డస్ట్ బిన్స్, బాత్రూములను శుభ్రంగా ఉండే విధంగా చూడాలని, వీలైనంత వరకు స్కేనర్ వాటర్ ట్యాప్ లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం చెప్పిన విధానం ప్రకారం కోవిడ్ మరల రెండో దశ మొదలైందని తగు జాగ్రత్తలు పాటింఛి వ్యాపారాలు చేసుకోవాలన్నారు. మా సిబ్బంది తనిఖీ నిమిత్తం వచ్చినప్పుడు, మీరు వారికి సహకరించాలన్నారు.
జాయింట్ కలక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ, ప్రతీ థియేటర్, మాల్స్, కిరాణా షాపులు, మెడికల్ షాపుల వద్ద “నో మాస్క్ – నో ఎంట్రీ” బోర్డులు, ఫ్లెక్షీలు, బ్యానర్లు, డిస్ప్లే బోర్డులు పెట్టాలన్నారు. థియేటర్స్ లో టికెట్స్ చేతికి ఇవ్వకుండా ఆన్లైన్ మెసేజ్ ద్వారా లోపలకి పంపే విధంగా చూడాలని సాధ్యమైనంతవరకు ఫుడ్ కౌంటర్ల వద్ద రద్దీ లేకుండా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఆశాజ్యోతి, డా. వి. సన్యాసి రావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశమునకు హాజరైన వివిధ వ్యాపార వాణిజ్య ప్రతినిధులకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. అనంతరం, వివిద వ్యాపార ప్రతినిధులు, సంస్థలలో కోవిడ్ పై అవలంబిస్తున్న పద్దతులను వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఆశా జ్యోతి, డా. వి. సన్యాసి రావు, సి.ఎం.ఓ.హెచ్.డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, డి.సి.(ఆర్) ఫణిరాం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి, షాపింగ్ మాల్స్ ప్రతినిదులు, మర్చంట్ అసోసియేషన్ సభ్యులు, సినిమా థియేటర్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.