బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ డి.మురళీధర రెడ్డి తెలిపారు. వాయుగుండం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈదురు గాలులు వీస్తాయని ఆయన తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఆయన కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతోపాటు అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసామని చెప్పారు. తీరప్రాంత మండలాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసారు. ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ తో విజెఎఫ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం సోమవారం ఉదయం 11గంటలకు నిర్వహిస్తున్నట్టు విజెఎఫ్ అధ్యక్ష, కార్యదర్శిలు గంట్లశ్రీనుబాబు, ఎస్.దుర్గారావులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ప్రెస్ అకాడమీ రాష్ట్ర పర్యటనలో భాగంగా విశాఖ వస్తున్నారన్నారు. జర్నలిస్టుల సౌకర్యార్ధం మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని డాబాగార్డెన్స్ విజెఎఫ్ లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం జర్నలిస్టుల కోసం చేపట్టే కార్యక్రమాలు, పరిష్కారం కాని సమస్యల విషయాలను నేరుగా అకాడమీ చైర్మన్ ద్రుష్టికి తీసుకురావడానికి అవకాశం వుంటుందనే కారణంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. విశాఖలోని అన్ని మీడియా సంస్థల జర్నలిస్టులు ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి హాజరు కావాల్సింది విజెఎఫ్ కమిటీ కోరింది. దానికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్టు వివరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆది వారం తెలిపారు. వాయుగుండం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈదురు గాలులు వీస్తాయని ఆయన తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఆయన కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 08942 240557 ఏర్పాటు చేయడంతోపాటు అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసామని చెప్పారు. తీరప్రాంత మండలాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసారు. ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.
శ్రీకాకుళం పట్టణంలో విధించిన లాక్ డౌన్ నిబంధనలకు సడలింపు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఇప్పటి వరకు వ్యాపార కార్యకలాపాలు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నామని, సోమ వారం నుండి దానిని రాత్రి 9 గంటల వరకు నిర్వహించుకొనుటకు సడలింపులు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు ఆది వారం ఒక ప్రకటన విడుదల చేసారు. అదేవిధంగా శ్రీకాకుళం పట్టణంలో అమలు చేస్తున్న ఆది వారం సంపూర్ణ లాక్ డౌన్ సైతం ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోను, పట్టణంలోను కోవిడ్ కేసులు అత్యధికంగా ఉన్న సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ విధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టాయని ఆయన చెప్పారు. అయితే ప్రజలు అన్ని సురక్షిత చర్యలు తీసుకుని బయటకు రావాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ కు ప్రజలు మంచి సహాయ సహకారాలు అందించారని తద్వారా కేసులలో తగ్గుముఖం వచ్చిందని అన్నారు. జిల్లా నుండి సమూలంగా వైరస్ నిర్మూలన జరగాలనే సంకల్పంతో ఉన్నామని అందుకు ప్రజలు సహకరించి అవసరం అనుకుంటేనే బయటకు రావాలని హితవు పలికారు. బయటకు వచ్చే వారు మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను సబ్బుతోగాని, శానిటైజర్ తో గాని తరచూ శుభ్రపరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దుకాణదారులు కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని ఆయన ఆదేశించారు. ఎక్కడా ఎక్కువ మంది గుమిగూడ వద్దని, ఆది వారం రోజున మాంసాహార దుకాణాల వద్ద రద్దీ లేకుండా ఎవరికి వారు స్వీయనియంత్రణ పాటించాలని కోరారు. కరోనా వైరస్ నివారణ ప్రతి ఒక్కరి నినాదం కావాలని, బాధ్యతతో మెలిగి ఆరోగ్యాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ విపత్తు కరోనా సమయంలో తమకు తోచిన సహాయం చేసిన ప్రతీఒక్కరూ దేవుడితో సమానమని హాసం క్లబ్ నేతలు ఎంవీ అప్పారావు అన్నారు. ఆదివారం రాజమండ్రిలోని ముస్లిం సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కరోనా సమయంలో తనవంతు బాధ్యతగా సేవలు అందించిన ప్రముఖ నఖ చిత్రకారుడు, సేవకుడు రవి పరసను ఘనంగా సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం సన్మాన గ్రహీత రవి పరస మాట్లాడుతూ, ఎవరికోసమో కాకుండా..మనస్సు కు సంతోషాన్నిచ్చి, పలువురి ఉపయోగించే ఏపనైనా మనసుకి ఎంతో శ్వాంతన కలుగజేస్తుందన్నారు. తనకున్నదానిలో కరోనా సమయంలో సహాయం చేసే అవకాశం దక్కినందుకు ఎంతో సంతోషంగా వుందన్నారు. ఇలాంటి సన్మాన కార్యక్రమాలు పేరుకు కాకుండా రానున్న రోజుల్లో సేవలు మరింతగా చేసేలా బాధ్యతను పెంచుతాయని అన్నారు. తనను, తన సేవలను గుర్తించి ఈ సత్కారాన్ని చేసినందుకు ఆయన హాసం క్లబ్ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. 25 మంది ప్రైవేటు స్కూలు టీచర్లకు చేసిన సహాయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. కార్యక్రమంలో సురేఖ, డివి.హనుమంతురావు, మోహ్మద్ ఖాదర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
బంగాళాఖాతంలో అల్ప పీడనం వలన రేపు ఉదయం నుండి భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ సూచనల దృష్ట్యా జిల్లాలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 5.30 గంటల నుండి తీవ్రత పెరగవచ్చన్న వాతావరణ శాఖ సూచనలను మేరకు ఆర్డీవో, ఇరిగేషన్, వ్యవసాయం, మత్య్స శాఖ, రహదారులు మరియు భవనముల శాఖ, తదితర శాఖల అధికారులతో ఆదివారం ఉదయం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులైన రైవాడ, తాండవ జలాశయాలు, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కోణాం, పెద్దేరు జలాశయాలను ఎప్పటికప్పుడు పరిశీలన చేసి జలాశయాలకు దిగువనున్న గ్రామస్తులను అప్రమత్తత చేసి నీటిని విడుదల చేయాలన్నారు. మండలాల్లోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పరిశీలించాలని ఎస్.ఇ. ఇరిగేషన్ ను ఆదేశించారు. తహసిల్థార్లంతా మండల కేంద్రాల్లోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డిఓలను ఆదేశించారు. తీర ప్రాంత మండలాల్లోని తహసిల్థార్లు, అధికారులు, సిబ్బంది అప్రమత్తతో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డివిజనల్ అధికారులు అప్రమత్తతో ఉండాలన్నారు. ఆర్డిఓల కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్లను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. మత్య్సకారులెవరూ సముద్రంలోకి వేటకు వెల్లకుండా నిషేధించాలని జె.డి. ఫిషరీష్ ను ఆదేశించారు. వేటకు వెళ్లి సముద్రంలో వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పంట నష్టాలను పరిశీలించి నివేదికలను అందజేయాలని వ్యవసాయ శాఖ జె.డి., ఉద్యాన వన శాఖ ఎ.డి.లను ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ సహాయకులు నుండి జె.డి. వరకు అప్రమత్తతతో ఉండాలన్నారు. నష్టాలను త్వరితగతిన ఎన్యూమరేట్ చేసి తక్షణమే నివేధిక అందజేయాలని ఆదేశించారు. ఖరీఫ్ పంటలో నష్టపోయిన అన్ని వివరాలను అందజేయాలన్నారు. రహదారులలో ఎక్కడైనా చెట్లు కూలి రవాణాకు అంతరాయం కలిగితే తక్షణమే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ విషయంపై ప్రజలు భయబ్రాంతులకు గురికాకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ 0891–2590102, 0891-2590100 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ టెలి కాన్పరెన్స్ లో జివియంసి కమీషనర్ డా.జి. సృజన, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎస్. వెంకటేశ్వర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, పాడేరు సబ్ కలెక్టర్ శివజ్యోతి, విశాఖపట్నం, అనకాపల్లి ఆర్డిఓలు పెంచల కిషోర్, సీతారామారావు, వ్యవసాయ శాఖ జెడి లీలావతి, జె.డి. ఫిషరీష్, ఇరిగేషన్ ఎస్.ఇ, ఎపిఎంఐపి పిడి, సిపిఓ, తదితర అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా జరిపారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నాయకత్వంలో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నాయన్నారు. పెద్దన్నగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధి విశేష కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు అంజూరు శ్రీనివాసులు, బాలకృష్ణయ్య, సిరాజ్ భాష, వడ్ల తంగం బాలాజీ రెడ్డి, సునీత సింగ్ పగడాల రాజు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతీ సోమవారం నిర్వహించే డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి నగర వాసులు 0877-2227208 కాల్ చేయాలని కమిషనర్ గిరిష సూచిస్తున్నారు. ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తనతో మాట్లాడి చెప్పవచ్చునని తెలియజేశారు. అదేవిధంగా ఈ-స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలు ఆన్ లైన్ ద్వారా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకూ eస్పందన ద్వారా అర్జీలు ఆన్ లైనులో పెట్టుకోవచ్చున్నారు. అర్జీలు పెట్టేవారు సమస్య ఏ ప్రభుత్వ శాఖకు చెందినదో సదరు దరఖాస్తుపై తెలియజేయాలన్నారు. కరోనా నేపథ్యంలో దరఖాస్తలను ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తున్నామన్న కమిషనర్ ప్రజల సౌకర్యార్ధం ప్రభుత్వ పరధిలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు తమ సమస్యలు నగరపాలక సంస్థకు విన్నవించుకోవాలని కమిషనర్ కోరారు.
విజయనగరం జిల్లాలో మనబడి నాడూ-నేడు పనులను ఈనెల 20 వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ ఆదేశించారు. పూర్తి చేయించాల్సిన బాధ్యత మండల ప్రత్యేకాధికారులదేనని స్పష్టం చేశారు. నాడూ-నేడు పనులపై మండలాలవారీగా, పనుల వారీగా ఆయన ఆన్‌లైన్ ద్వారా ఆదివారం సమీక్షించారు. ఆయా మండలాలోని పనుల పురోగతిని వెళ్లడించారు. నాడూ-నేడు పనులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతిస్తోందని చెప్పారు. పాఠశాలలు పునః ప్రారంభానికి సిద్దమవుతున్న తరుణంలో, ఎట్టి పరిస్థితిలోనూ పనులను ఈ నెల 20 నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేకాధికారులు నిరంతరం మండలాల్లో పర్యటిస్తూ, పనులపై సంబంధిత హెడ్‌మాస్టర్లు, ఇంజనీర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎంఇఓలు తదితర అధికారులతో సమీక్షా సమావేశాలను నిర్వహించాలని సూచించారు. అలాగే బాగా తక్కువ పురోగతి ఉన్న పనులను క్షేత్రస్థాయిలో నేరుగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అలాగే పనులు ప్రగతినివేదికను ఎప్పటికప్పుడు సర్వశిక్షా అభియాన్ అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌కు అందజేయాలన్నారు.
నాడూ నేడు కార్యక్రమం క్రింద త్రాగునీటికి సంబంధించి తొలివిడతగా మొత్తం 1040 పనులు ప్రతిపాదించగా, 957 పనులు మంజూరు చేయడం జరిగిందని, వీటిలో 953 పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రహరీగోడల నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ ప్రాంతంలో 1040 పనులు ప్రతిపాదించగా, వీటిలో 39 పనులను మంజూరు చేసి, పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. మరమ్మతులకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 1040 పనులు ప్రతిపాదించగా, వీటిలో 1026 పనులను మంజూరు చేశామని, 1025 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే 1040 పాఠశాలలకు విద్యుదీకరణ, విద్యుత్ మరమ్మతు పనులను ప్రతిపాదించగా, 1039 పనులను ఆమోదించామని, 1036చోట్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు. 1040 పాఠశాలలకు మరుగుదొడ్ల నిర్మాణం, మరమ్మతులకు ప్రతిపాదించగా, 947 పనులు మంజూరు చేశామని, వీటిలో 815చోట్ల పనులు వివిధ స్థాయిలో ఉన్నాయన్నారు. ఇప్పటికీ ప్రారంభంకానిచోట తక్షణమే పనులను ప్రారంభించాలని, అన్నిటినీ ఈ నెల 20వ తేదీలోగా పూర్తిచేసేలా యుద్దప్రాతిపదికన పనులను నిర్వహించాలని కలెక్టర్ హరి జవహర్‌లాల్ స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్రా ముద్దుబిడ్డ, రాజకీయ దురంధరుడు దివంగత గుడివాడ గురునాధరావని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్లశ్రీనుబాబు కొనియాడారు. ఆదివారం గుడివాడ గరునాధరావు జయంతి సందర్భంగా అనాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్, ఇంటక్ నేత మంత్రి రాజశేఖర్ తో కలిసి గుడివాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంట్ల మీడియాతో మాట్లాడుతూ, తనకు పరిచియమైన ప్రతీ వ్యక్తిని పేరుపెట్టి మరీ పిలిచి ఆప్యాయతను చూపే ఒకేఒక్క నాయకుడు గుడివాడ గురునాధరావని కొనియాడారు. ఎంపీగా ఎన్నో సంస్కరణలు చేసి, ఉత్తరాంధ్రాకి మేలు చేసిన మహాను భావుడని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లోనే నేడు అనకాపల్లి ఎమ్మెల్యేగా గుడివాడ అమర్నాద్ కూడా ప్రజల మనిషిగా సేవలు చేయడం అభినందనీయమని అన్నారు. గుడివాడ కుటుంబం మొత్తం ప్రజాసేవకే అంకితమైన కుటుంబంగా చరిత్రకెక్కారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అమర్నాధ్ శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారని అన్నారు గంట్ల. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆర్దికంగా బాగా చితికిపోయిన కప్పరాడకు చెందిన భర్త చనిపోయి ఇబ్బందుల్లో ఉన్న శ్రీదేవి అనే మహిళకు మాజీ కార్పొరేటర్ సాయిపూజ ఫౌండేషన్ వ్యవస్థాపకులు టిడిపినేత వానపల్లి రవికుమార్ శనివారం రైస్ బ్యాగ్ అందజేశారు. శ్రీదేవి రైల్వే కాలనీ, జి. హెచ్ స్కూల్ పూర్వ విద్యార్థి. తనకు, తన కుమారుడికి ఆరోగ్యం బాగాలేదని శ్రీదేవి తెలియజేసిన మేరకు రవికుమార్ మానవతాదృక్పదంతో స్పందించి ఈ సహాయం చేశారు. అంతేకాకుండా ప్రతీ నెలా ఈమెకు నిత్యావసర సరుకులు ఇస్తామని భరోసాఇచ్చారు. ఈ సేవకార్యక్రమం చేయడటం పట్ల జి. హెచ్. స్కూల్ పూర్వ విద్యార్థులు రవికుమార్ కు ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివోహం మురళి, వార్డు కార్యదర్శి సారిపల్లి మహేష్,కృష్ణ,శ్రీను,రైల్వే న్యూ కాలనీ లో ఉన్న ప్రభుత్వ పాఠా శాల పూర్వ విద్యార్థులు బూర్లె రమేష్, డి. హరనాథ్, డి. ఉదయ్ కుమార్, ఆది తదితరులు పాల్గొన్నారు.
క్రిష్ణాజిల్లా ఘంటసాల మండలం, పూషడం హరిజనవాడలో ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని దాత డాక్టర్ దాస్, మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేసిన వైఎస్సార్ వారి గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారన్నారు. తండ్రికి మించిన తనయుడిగా సీఎం జగన్ మరో రెండుఅడుగులు ముందుకేసి మహిళలు ఆర్థికాభివృద్దే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. జగన్ పాలనలో 50శాతం మహిళలకు కేటాయించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించిన ఘనత దేశానికే ఆదర్శమన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో టీడీపీ నేతలను ప్రశ్నించాలని ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన ప్రతిఒక్కరికి మంత్రి, ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం గ్రామంలో 4 సిసి రోడ్లు, చెరువుకు రివిట్ మెంట్ కు ఏర్పాటుకు హామీ ఇవ్వడంతో పాటు మాజేరు మల్లాయి చిట్టూరు వయా పూషడం రోడ్లు నిర్మాణం కు నిధులు మంజూరు చేసారని త్వరలో పనులకు ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు వేమూరి వెంకట్రావు, నేతలు మాడెం నాగరాజు, చికినం బాలాజీ, గిరీష్, ఈఓ బి.అర్జునరావు, డిటి మల్లేశ్వరరావు, కోటేశ్వరరావు, పార్టీ నేతలు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో ఎంపీ ల్యాండ్స్ కింద చేపట్టిన అన్ని రకాల పనులను అక్టోబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎంపీ ల్యాండ్స్ కింద చేపట్టిన పనుల పురోగతి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 16వ, 17 వ లోక్ సభ కు చెందిన ఎంపీ ల్యాండ్స్ కింద అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో, రాజ్యసభ ఎంపీ ల్యాండ్స్ కింద చేపట్టిన వివిధ రకాల పనులపై సమీక్ష నిర్వహించి, అక్టోబర్ నెలాఖరులోపు సిసిరోడ్డు, తాగునీటి సరఫరా పథకాలు, స్మశానవాటికల ప్రహరీ గోడల నిర్మాణం తదితర అన్ని రకాల పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు మొదలు కాని పనులకు సంబంధించి నిధులు వచ్చే అవకాశం లేనందున వాటిని ప్రారంభించరాదన్నారు. పురోగతిలో ఉన్న పనులు మాత్రం ఈ నెలాఖరులోపు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆయా పనులను నాణ్యతగా చేపట్టాలని, ఎటువంటి ఆలస్యం చేయకుండా పనులు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా పనులకు సంబంధించి ఎటువంటి భూమి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించి పనులు పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ల్యాండ్స్ కింద ఎక్కడెక్కడ పనులు పెండింగ్లో ఉన్నాయి, అసెంబ్లీ నియోజక వర్గం వారీగా ఎన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి, ఆయా పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈసమావేశంలో జాయింట్ కలెక్టర్ ( ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, సిపిఓ ప్రేమచంద్ర, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, ఏపిడబ్ల్యూఐడిసి ఈ ఈ శివకుమార్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు.