శ్రీకాకుళం జిల్లాలో దసరా నవరాత్రి మండపాలకు అనుమతులు లేవని జిల్లా కలెక్టర్ జె నివాస్ స్పష్టం చేసారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ తో కలసి మీడియాతో మాట్లాడుతూ కరోనా దృష్ట్యా వినాయక చవితికి మండపాలకు అనుమతులు ఇవ్వలేదని, అదేవిధంగా దసరా నవరాత్రుల మండపాలకు కూడా అనుమతులు ఇవ్వడం లేదన్నారు. కరోనా వైరస్ నివారణకు జిల్లాలో అనేక చర్యలు తీసుకున్నామని తద్వారా ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందని కలెక్టర్ అన్నారు. అయితే కేరళ వంటి రాష్ట్రాల్లో రెండవ దశ ప్రారంభమై దేశంలోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్న పరిస్ధితిని గమనిస్తున్నామని ఆయన పేర్కొంటూ అటువంటి పరిస్ధితి జిల్లాలో తలెత్తకుండా ప్రజలు సహకరించాలని కోరారు. కరోనా ఇంకా పూర్తిగా నిర్మూలన కాలేదని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఆయన అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిలోనే ఉందని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని చెప్పారు. మాస్కు లేకుండా బయటకు రావద్దని హితవు పలికారు. కరోనా భారీన పడకుండా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రపరచుకోవాలని పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు వెంటనే పరీక్షలు నిర్వహించుకొనుటకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దసరా సందర్భంగా ఆలయాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనానికి అనుమతిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ప్రజలు తమ కుటుంబాల సంక్షేమం, ఆరోగ్యం దృష్ట్యా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఈఅయ్యప్ప స్వామి విగ్రహం 40 సంవత్సరాలదే : సారవకోట మండలం కోదఅడ్డపనస గ్రామం వద్ద బయల్పడిన అయ్యప్ప స్వామి విగ్రహం 40 సంవత్సరాల క్రితం ప్రతిష్టించినదేనని పురావస్తు శాఖ అధికారులు తెలియజేసారని జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. భక్తులు తండోపతండాలుగా వెళుతున్నారని, కరోనా ప్రభావాన్ని గమనించాలని కోరారు. విగ్రహం పురాతనమైనది కాదని గమనించాలని చెప్పారు. ఆ ప్రదేశం అభివృద్ధిపై ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు మండపాలకు తావులేదన్నారు. ఆలయ కమిటీలు ఎక్కడా రద్దీ లేకుండా చూడాలని, రద్దీ ఎక్కువ అవుతున్నప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు..
వర్షాలు, వరదలకు నష్టపోయన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ అన్నారు. బుధ వారం రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి వరదలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పాల్గొన్న ఉప ముఖ్య మంత్రి మీడియాతో మాట్లాడుతూ వర్షాలు, వరదలపట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలు వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసామని ఆయన పేర్కొన్నారు. తద్వారా అధిక నష్టం సంభవించలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సును నిర్వహించి వరదల పరిస్ధితిని సమీక్షించారని పేర్కొంటూ నివేదికలను త్వరితగతిన సమర్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. వరదలలో దురదృష్టవశాత్తు రాష్ట్రంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారని, అందులో శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ ఇబ్బందులకు గురికారదనే ఉద్దేశ్యంతో అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని ముఖ్య మంత్రి ఆదేశించారని ఆయన చెప్పారు. వరదల అనంతరం ఎక్కడా పారిశుధ్య సమస్య, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఉప ముఖ్య మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ, ఆర్ అండ్ బి రహదారులు కొన్ని దెబ్బతిన్నాయని, వాటిని తక్షణం పునరుద్దరణకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగిందని క్రిష్ణదాస్ చెప్పారు. పంటల నష్టంపై రెండు, మూడు రోజుల్లో పూర్తి స్దాయి నివేదికలు సమర్పంచాలని ఆదేశించినట్లు తెలిపారు. వరద నీటిని భవిష్యత్తు అవసరాలకు వినియోగించే విధంగా చెరువులు నింపుటకు గల అవకాశాలను పరిశీలించాలని ముఖ్య మంత్రి సూచనల చేసారని తెలిపారు. కాగా.. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి కరోనా వైరస్ నుండి రక్షణ పొందాలని ఉప ముఖ్య మంత్రి క్రిష్ణదాస్ పిలుపునిచ్చారు. మాస్కు వైరస్ కు రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని అన్నారు. మాస్కు లేకుండా బయటకు వెళ్ళరాదని ఆయన విజ్ఞప్తి చేసారు. కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా వైరస్ రెండవ దశ ప్రారంభం అయినట్లు వచ్చిన వార్తల పట్ల ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ ప్రజలకు మాస్కు సందేశాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కు ధరించాలని కోరారు..
రైతులు మద్యవర్తుల బారిన పడకుండా మద్ధతు ధర కల్పించేందుకు ఇకపై అన్ని రైతు భరోసా కేంద్రాలు రైతు సేవ కేంద్రాలుగా పనిచేయనున్నాయని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు విషయమై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ( పి.ఎ.సి.యస్ ) సి.ఇ.ఓలు, కంప్యూటర్ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమం బుధవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జె.సి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 248 ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రారంభం కానున్నాయని, ఈ ఏడాది నుండి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు ప్రతీ రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉందని, రైతు నమోదు కార్యక్రమం గ్రామ అగ్రికల్చరల్ అసిస్టెంట్ ( వి.ఎ.ఎ ) మాత్రమే రైతు భరోసా కేంద్రం వద్ద నమోదు చేయాలని తేల్చిచెప్పారు. ఇందుకు ఇ-పంట రిజిస్ట్రేషన్ ఇన్ ప్రొక్యూర్ మెంట్ సాఫ్ట్ వేర్ లో నమోదు చేయాల్సి ఉంటుందని జె.సి స్పష్టం చేసారు. రైతులకు మద్ధతు ధర, ఎఫ్.ఏ. క్యు. ప్రమాణములు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ రైతులకు అందించే విషయమై గ్రామాల్లో గ్రామ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. రైతుల అవగాహన కొరకు మద్ధతు ధర, నాణ్యత ప్రమాణములు, రైతు నమోదుకు కావలసిన పత్రాల వివరాల బ్యానర్లను ప్రతీ రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయాల వద్ద ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రిజిష్టర్ అయిన పిదప రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు ఇచ్చిన షెడ్యూలు ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని వివరించారు. శిక్షణకు హాజరైన ప్రతీ ఒక్కరూ ఆర్.బి.కెల ద్వారా ధాన్యం కొనుగోలుపై పూర్తి అవగాహన చేసుకోవాలని, బుధవారం నుండి ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులు శనివారం వరకు కొనసాగుతాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన సాంకేతిక పరమైన సందేహాలను నివృత్తి చేసుకోవాలని, మీరు అందించే సేవలు వలన జిల్లాలో ఏ ఒక్క రైతు నష్టపోరాదనే విషయాన్ని గుర్తెరగాలని జె.సి స్పష్టం చేసారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు, పౌర సరఫరాల అధికారి , పి.ఏ.సి.ఎస్ సి.ఇ.ఓలు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలకు రోడ్లేకాకుండా రైల్వే వంతెనలు, రల్వేస్టేషన్లు జలయమం అయ్యాయి. బుదవారం తుని రైల్వే వంతెన పై నుంచి వరదనీరు పొంగి పొర్లింది. దీంతో ఈ ప్రాంతంలోకి ఎవరినీ వెళ్లకుండా కట్టడి చేశారు. శంఖవరం మండలంలో పెద్దగెడ్డలో ఒక ద్విచక్రవాహనం కొట్టుకుపోయింది. ఆ సమయంలో రైతులు గమనించి బండిపై కొట్టుకుపోతున్నవారికి కాపాడారు. వాహనం అక్కడి బురదలో ఇరుక్కుపోయింది. రెండు రోజుల పాటు, నాలుగు కాలనీలు జలమయం అయి వున్నాయి. ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు. ఇక కాకినాడ, సామర్లకోట, అన్నవరం రైల్వే స్టేషన్లు అన్నీ జలమయం అయ్యాయి. వంతెలన మీద నుంచి వరదనీరు పారడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. ముఖ్యంగా విద్యుత్ లైన్ల ప్రాంతాల్లో ఎవరినీ వెళ్లనీయకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ శత వార్షికోత్పవాల సందర్భంగా ఈనెల 17న పార్టీ శాఖలున్న అన్ని ప్రాంతాల్లోను, మండల కేంద్రాల్లోను జెండా ఆవిష్కరణలు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి కె.లోకనాధం పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ 1920లో తాష్కెంట్ నగరంలో ఏర్పడినదని, నాటి నుంచి నేటి వరకు దేశ స్వాతంత్య్రం కోసం, ప్రజల కోసం పోరాడిందని తెలిపారు. సామ్రాజ్యవాదం, దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించిందని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతీయ విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా అలుపెరగని పోరు సల్పుతోందని, భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం నిరంతరం ఉద్యమాలు చేస్తోందని తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమంలో ఆటుపోట్లను, అతివాద, మితవాద విచ్ఛిన్నకర ధోరణులను తట్టుకుని నికరంగా నిలబడి కష్టజీవుల తరపున పోరాడుతోందని తెలిపారు. కార్మిక, కర్షక హక్కుల పరిరక్షణ కోసం నేటికీ కృషి చేస్తోందని, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపి లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన చరిత్ర కమ్యూనిస్టు ఉద్యమానికి ఉందని గుర్తు చేశారు. నేడు దేశంలో కుల, మత, ప్రాంతీయ, విచ్ఛిన్న శక్తులు చెలరేగుతున్నాయని, ఈ నేపథ్యంలో ఆ శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాలని, 17న జెండా ఆవిష్కరణలు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లోకనాధం కోరారు.
కిసాన్ రైలు ద్వారా అనంతపురం నుంచి న్యూఢిల్లీకి తరలించే ఉద్యాన ఉత్పత్తుల రవాణా చార్జీలను సగానికి తగ్గించినట్లు అనంతపురం ఎంపీ తలారి రంగయ్య స్పష్టం చేశారు. కిసాన్ రైలులో ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు సంబంధించి చార్జీలు అధికంగా ఉన్నాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ఎంపీలందరూ సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖల దృష్టికి తీసుకు వచ్చిన నేపథ్యంలో, కేంద్రం రవాణా చార్జీలను సగానికి తగ్గించినట్లు ఆయన తెలిపారు. మంగళవారం సాయంత్రం ఉద్యానవన శాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి లతో కలిసి కిసాన్ రైల్ ద్వారా తరలించే అనంత ఉద్యాన ఉత్పత్తులకు రవాణా ఛార్జీల తగ్గించిన విషయమై ఆయన పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ కిసాన్ రైలు ద్వారా అనంతపురం నుంచి న్యూఢిల్లీ కి తరలించే ఉద్యాన ఉత్పత్తులకు సంబంధించి ఒక టన్నుకు రవాణా చార్జీల ద్వారా 5136/- రూపాయలను రైల్వే వారు వసూలు చేస్తున్నారని సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లగా, అందులో రవాణా చార్జీలను 50 శాతం తగ్గించారన్నారు. ఇందుకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ తరఫున 6 నెలల వరకు రవాణా చార్జీల మొత్తాన్ని రైల్వేశాఖకు డిపాజిట్ చేస్తుందని తెలిపారు. దీంతో రైల్వేశాఖ మిగిలిన సగం రూ.2568/-ల మొత్తాన్ని మాత్రమే రైతుల నుంచి వసూలు చేస్తూ ఉద్యాన ఉత్పత్తులను ఢిల్లీకి తరలించడం జరుగుతుందన్నారు.
సెప్టెంబర్ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్రం మంత్రులతో కలిసి వర్చ్యువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఫ్లాగ్ ఆఫ్ చేసి కిసాన్ రైల్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. మొదటి కిసాన్ రైల్ ద్వారా 323 మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులను 14 వ్యాగిన్లలో పంపడం జరిగిందన్నారు. రెండోవిడత కిసాన్ రైల్ ద్వారా 240 మెట్రిక్ టన్నులను 12 వ్యాగిన్లలో పంపడం జరిగిందన్నారు. దేశీయ మార్కెట్లో అనంత ఉద్యానపంటలకు మంచి గిరాకీ ఉందన్నారు. ఇంతకు ముందు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండేదికాదని, ప్రస్తుతం కిసాన్ రైలు ద్వారా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తోందని, కిసాన్ రైల్ కు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. పక్క జిల్లాల నుంచి రైతులు వచ్చి ఇక్కడి నుంచి పంట ఉత్పత్తులను ఢిల్లీ కి పంపుతున్నారన్నారు. అనంతరం హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ, అనంతపురం జిల్లా కరువు జిల్లాగా ఉన్నదని, రాష్ట్రంలోని పార్లమెంటు సభ్యులు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి జిల్లా కిసాన్ రైలు తీసుకురావడం జరిగిందన్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడు మార్కెట్లో ఉన్న పరిస్థితులను కళ్లారా చూసి అక్కడి ఎమ్మెల్యే, ఎంపీలను కలిసి మాట్లాడడం జరిగిందన్నారు. హిందూపురం నుంచి వెళ్ళడానికి కిసాన్ ఉడాన్ పేరుతో ఫైట్స్ తీసుకు రావడానికి చర్యలు చేపడుతున్నామన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు విడతల్లో అనంత ఉద్యాన ఉత్పత్తులను కిసాన్ రైలు ద్వారా ఢిల్లీ మార్కెట్ కు పంపించడం జరిగిందన్నారు. జిల్లా రైతులు నాణ్యమైన ఉద్యానవన పంటలను పండిస్తున్నారన్నారు. కిసాన్ రైలు ప్రారంభించడంతో అనంతపురం ఉద్యాన ఉత్పత్తుల ద్వారా జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. భవిష్యత్తులో ఇక్కడి పంట ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకుని రావడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. కిసాన్ రైలును అనంతపురం నుంచి న్యూఢిల్లీ పంపడంలో రైల్వే అధికారులను ఒప్పించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అనంతపురం జిల్లా పార్లమెంటు సభ్యులు కృషి మరువలేనిదని తెలిపారు. రైతులందరూ కిసాన్ రైలు సద్వినియోగం చేసుకోగలిగితే భవిష్యత్తులో అనంతపురం నుంచి టైం టేబుల్ ప్రకారం రైలు నడిపించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం స్థానిక శాసన సభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లాలో అనంతపురం ఒకటి, ప్రస్తుతం ఎక్కువగా హార్టికల్చర్ ద్వారా పంటలను సాగు చేస్తున్నారన్నారు. అప్పటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కూడా ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని, ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో, జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు అందరి సహకారంతో, జిల్లా నుంచి న్యూఢిల్లీకి కిసాన్ రైలు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏ డి సి సి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, ఉద్యానవన శాఖ డిడి పద్మలత, ఉద్యానవన శాఖ అధికారి సతీష్, తదితరులు పాల్గొన్నారు..
విశాఖలోని ప్లానిటోరియం ప్రాజెక్ట్ కి సంబందించిన DPR తయారీ బాధ్యతలు NCSM అనుబంధ సంస్థ అయిన నేషనల్ కౌన్సెల్ అఫ్ సైన్స్ మ్యూజియం, మినిస్ట్రీ అఫ్ కల్చర్, గవర్నమెంట్ అఫ్ ఇండియా , కోల్కతా వారికీ అప్పగించినట్టు వీఎంఆర్డీఏ కమిషనర్ పి.కోటేశ్వర్రావు తెలియజేశారు. వీఎంఆర్డిఏ ప్రతిపాదిత ప్రాజెక్ట్ ప్లానిటోరియం మ్యూజియం ఫై క్రియేటివ్ మ్యూజియమ్స్ డైరెక్టర్ ఎం . డి సుబ్రతా సేన్ , అధికారులతో సహా కైలాసగిరి ను సందర్శించి సమీక్షించిన మెట్రోపాలిటన్ కమీషనర్ అదనపు కమిషనర్ మనజిర్ జీలని సామూన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం లో డిజైన్ , సీటింగ్ , డ్రోమ్ స్ట్రక్చర్ , ఇతర సాంకేతిక అంశాలపై మరియు DPR తయారీకి కావలసిన అంశాలను సవివరముగా చర్చించారు. డిసెంబర్ నెలాఖరులోగా DPR సిద్ధం చెయ్యాలని క్రియేటివ్ మ్యూసియం డిజైన్నేర్స్ కమిషనర్ కోరారు. ఈ సమీక్ష లో కెలకత్తా సైన్స్ మ్యూసియం (Ex) క్యూరేటర్ డా . జీలని , చీఫ్ ఇంజనీర్ కె రామ్ మోహన్ రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భవాని శంకర్, ఎలక్ట్రికల్ ఈ . ఈ సోమ శేఖర్, ఉమా శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఆన్లాక్ ప్రక్రియ కరోనాను అరికట్టేందుకు దోహదపడుతోందని ఉత్తరాంధర జిల్లాల కోవిడ్ నోడల్ అధికారి , ఎఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వి. సుధాకర్ అన్నారు."జన్ ఆందోళ న్ కరోనా అప్ప్రొప్రైట బిహేవియర్ " పై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన రీఙనల్ ఔట్ రీచ్ బ్యూరో, ఆకాశవాణి వార్త విభాగం సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాతీయ వెబ్‌నార్‌లో సుధాకర్ మాట్లాడారు. "జన ఆందోళలన్ కరోనా అప్రోప్రేట్ బిహేవియర్, పేరిట మోడి ప్రభుత్వం సూచించిన మూడు రక్షణ కవచాల సూత్రాలు అందరూ పాటించాలని చెప్పారు. మానసిక ఆరోగ్య సంరక్షణను ఆ సూత్రాలు పెంచుతాయని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుందని అన్నారు. సంస్థ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డి. మురళి మోహన్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అవగాహన కార్యక్రమం ఏంతో ప్రాధాన్యతను సంతరించుకుందని అన్నారు. కరోనా కారణంగా 6 నెలల గా ఎదుర్కున్న అనుభవాలను పొందుపరుచుకోవాలని తెలిపారు. "మాస్క్ ధరించడం అంటే గౌరవ సూచిక అని, తమని రక్షిస్తుందని, 6 అడుగుల సామాజిక దూరం, సబ్బుతో 20 సెకన్లు చేతులు కడుక్కోవడం, శుభ్రత పాటించడం కరోనా ను ఎదుర్కొవడానికి ఒక బృహత్తర ప్రణాళిక అని అభివర్ణించారు. విశాఖపట్నం ప్రభుత్వ మానసిక సంరక్షణ ఆసుపత్రి సూపెరెండెంట్ సైకియాట్రిస్ట్, డాక్టర్ రాధ రాణి, మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన మూడు రక్షణ సూత్రాలు, మానసిక స్థితిని మెరుగుపరుచు కోవడానికి ముఖ్యమని చెప్పారు. కుటుంబం, స్నేహితులు, బంధువుల మద్దతు, కరోనా నేపధ్యం లో పలు సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయని అన్నారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి వ్యాయామం, నిద్ర, యోగా, ధ్యానం మరియు అభిరుచుల ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. శ్రీనివాస్ మహేష్, బి. తారకా ప్రసాద్, ఎఫ్. పి. ఓ, నెల్లూరు, ఐ& బి అధికారులు వెబ్‌నార్‌లో పాల్గొన్నారు.
వర్షాలు తగ్గిన తర్వాత పంట నష్టాల ఎన్యూమరేషన్ ప్రారంభమవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. మంగళవారం సర్క్యూట్ హౌస్ లో జిల్లా ప్రజా ప్రతినిధుల సమస్వయ సమావేశం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆగష్టు , సెప్టెంబరు నెలలో వర్షాలు ఎక్కువగా ఉన్నాయని, ఏలూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలో పంట నష్టాలు జరిగాయి, వర్షాలు తగ్గిన వెంటనే పంట నష్టాలకు సంబంధించి ఎన్యూమరేషన్ ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. వేరు శనగ రైతులకు సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. అంతకు ముందు సర్క్యూట్ హౌస్ లో వివిధ సమస్యలుపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్య సభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి, పార్లమెంట్ సభ్యులు ఎం.వి.వి. సత్యనారాయణ బి.వి. సత్యవతి, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, డి.వి.జి. కాళిదాసు రంగారావు, నగర పోలీసు కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా, జిల్లా ఎస్.పి. బి. కృష్ణారావు, శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్, కన్నబాబురాజు, వాసుపల్లి గణేష్ కుమార్, అదీప్ రాజ్, కరణం ధర్మశీ, గొల్ల బాబూరావు, భాగ్యలక్ష్మి, ఫాల్గుణ, మాజీ శాసన సభ్యులు మళ్ల విజయ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు
అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న క్రాంతి హాస్పిటల్ నుంచి తాడిపత్రి రోడ్డు వరకు నిర్మిస్తున్న ఎన్టీఆర్ మార్గ్ రహదారి పనులను వేగవంతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మంగళవారం గుత్తి రోడ్ లోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఎన్టీఆర్ మార్గ్ రహదారి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో ని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నున్న క్రాంతి హాస్పిటల్ నుంచి గుత్తి రోడ్డు, భారత్ పెట్రోల్ బంక్, భవాని రోడ్డు మీదుగా తాడిపత్రి రోడ్డు వరకు ఎన్టీఆర్ మార్గ్ రహదారి పనులను చేపడుతున్నామని, పనులను వేగవంతం చేయాలన్నారు. రహదారి నిర్మాణ పనులకు సంబంధించి భూసేకరణ పనులను పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మార్గ్ రహదారి నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు ఎంత మేరకు పనులు చేపట్టారు అనే వివరాలను కలెక్టర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పివివి ఎస్ మూర్తి, డి ఈ సుధారాణి, ఏ ఈ నాగజ్యోతి, తహశీల్దార్ లక్ష్మీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని భావించారని, రాష్ట్రంలో రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖా మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. మంగళవారం ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో సబ్సిడీ పప్పుశనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు. తన 3648 కిలోమీటర్ల పాదయాత్ర లో రైతులు, మహిళలు, యువతీ యువకులు కలిసి జగన్ వద్ద బాధలు తెలపగా, వారిని ఆదుకునేందుకు, వారి సంక్షేమం కోసం జనరంజక, ప్రజారంజక పాలనను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం అందిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల అప్పులు ఉన్నా వాటిని తట్టుకుని ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు మడమ తిప్పని వ్యక్తిగా సీఎం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, అధికారం చేపట్టిన వెంటనే పింఛన్ ను పెంచారన్నారు. ప్రజాసంక్షేమం కోసం వైయస్సార్ రైతు భరోసా, వైయస్సార్ వాహన మిత్ర, జగనన్న గోరుముద్ద, వైయస్సార్ కంటి వెలుగు, వైయస్సార్ విద్యా కానుక, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల కోసం వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, డ్వాక్రా మహిళలకు ఉన్న అప్పులు మాఫీ చేయడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అధికారంలోకి వచ్చిన ఒకటిన్నర సంవత్సరం కాలంలోనే 50 వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేశారన్నారు. పేదల కుటుంబాల్లో సంతోషం చూడాలని, అవినీతికి తావులేకుండా వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ను పెట్టామని, సచివాలయాల ద్వారా పది రోజుల్లోనే రేషన్ కార్డు, పెన్షన్ ని అందిస్తున్నామని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది మహిళలకు ఇంటి పట్టాలను ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రైతుల సంక్షేమం కోసమే జగనన్న ఆరాటపడుతున్నారని, వారు కష్టపడకుండా నష్టపోకుండా వారిని సంతోష పెట్టాలని అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టారన్నారు. జిల్లాలో 850 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, వాటి ద్వారా మట్టి నమూనాల సేకరణ, అగ్రి ల్యాబ్స్, శీతల గిడ్డంగుల ఏర్పాటు, ఎలాంటి కష్టం లేకుండా ఇంటివద్దకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించే కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేయాలని, సిరులు పండించాలని దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హంద్రీనీవా కాల్వను పూర్తిచేసి కృష్ణా జలాలను జిల్లాకు తీసుకు వచ్చారన్నారు. ఇంతకుముందు 200 మంది రైతులు జిల్లాలో, రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా వారిని ముఖ్యమంత్రి పరామర్శించారని, వారి కుటుంబాలకు భరోసానిచ్చారన్నారు. తమ ప్రభుత్వం రైతులకు చేదోడువాదోడుగా ఉంటుందన్నారు. శనగ పంట ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇతర పంటలైన పొద్దుతిరుగుడు, ధనియాలు, పెసలు, మిర్చి, మొక్కజొన్న, జొన్న లాంటి పంటలు సాగు చేయాలన్నారు. సబ్సిడీ పప్పు శనగ విత్తనాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ జిల్లాలో 26 మండలాల్లో 212 రైతు భరోసా కేంద్రాల ద్వారా బయోమెట్రిక్ విధానంలో 68, 900 హెక్టార్లలో సాగు చేసే విధంగా 52 వేల క్వింటాళ్ళ పప్పుశనగ విత్తనాలను 30 శాతం రాయితీపై రిజిస్ట్రేషన్ మరియు డబ్బులు చెల్లించిన రైతులకు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. పప్పు శనగ విత్తన పంపిణీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎక్కువగా రైతులు పప్పు శనగ పంటను సాగు చేసి నష్టపోరాదని, ఇతర పంటలు సాగు చేయడం వల్ల లాభదాయకంగా ఉంటుందని, పప్పుశనగ పంట కన్నా ఇతర పంటలైన జొన్న, సజ్జ, మినుములు, కుసుమ, పొద్దుతిరుగుడు తదితర పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. హంద్రీనీవా ఫేజ్ - 1 కింద ఆయకట్టు పరిధిలో భూసేకరణ కార్యక్రమం 2-3 నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. హంద్రీ-నీవా కాలువలో 3,800 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా, 12 మీటర్ల నుంచి 19 -21 మీటర్లకు కాలువ వెడల్పును పెంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఉరవకొండ ప్రాంతంలోని రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. రైతులు బాగుపడాలని వారి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ పెంచారని, మద్ధతు ధర అందించేందుకు కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారని, సీఎం అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలల కాలంలోనే 3,100 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి పంటలకు మద్ధతు ధర కల్పించి మొక్కజొన్న, ఇతర పంటలను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేశారన్నారు. రైతుల కోసం రైతు భరోసా కింద 13, 500 రూపాయలను అందిస్తూ వారికి ప్రభుత్వం అండగా నిలిచిందని, 20 - 30 వేల ఎకరాల్లో వర్షాల వల్ల పంటలు దెబ్బతినగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉచిత ఇన్సూరెన్స్ ను అమలు చేస్తున్నారని, పంట నిల్వ కోసం రైతు గోడౌన్ లు కడుతున్నారని, ప్రతి సచివాలయం కింద వ్యవసాయ అసిస్టెంట్లను ఏర్పాటు చేశారని, రాబోయే కాలంలో ప్రతి ఒక్క రైతుకు నష్టపోకుండా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఉరవకొండ ప్రాంతంలో పప్పు శనగ పంట అత్యధికంగా పండిస్తారని, ఒకే పంటను అత్యధికంగా వేయడం వల్ల నష్టపోకుండా ప్రభుత్వం పంట మార్పిడి చేపట్టి జొన్న, పొద్దుతిరుగుడు, మిర్చి లాంటి పంటలు సాగుచేసేలా ప్రచారం చేపడుతోందని, ఇతర పంటలకు అవసరమైన ధరలు, వచ్చే లాభాలు, పంటలు ఎలా సాగు చేయాలి అనేది ప్రజలకు తెలియజేయాలన్నారు.
ఈ సందర్భంగా రైతులకు సబ్సిడీ పప్పుశనగ విత్తనాలను మంత్రి, కలెక్టర్ లు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డి, డిఎస్పి ఉమా మహేశ్వర్ రెడ్డి, ఎడి ఏ పద్మజ, వ్యవసాయ అధికారి శశికళ, పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.
కరోనా మహమ్మారిని నియంత్రించడంలో వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, ఇతర అధికారులతోపాటుగా పాత్రికేయులు కూడా అమూల్యమైన సేవలను అందించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ ప్రశంసించారు. ఐఆర్‌పిడబ్ల్యూఏ (ఇంటిగ్రేటెడ్ రూరల్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్), జిల్లా సమాచార, పౌర సంబంధాలశాఖ సంయుక్తంగా కోవిడ్-19 వారియర్స్‌కు కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా సన్మానించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ మాట్లాడుతూ విజయనగరం జిల్లాను సుమారు 48 రోజులపాటు గ్రీన్‌జోన్‌లో ఉంచినందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కరోనా విజృంభన కారణంగా మనకంటే పెద్ద దేశాలు, అభివృద్ది చెందిన దేశాలు అల్లాడిపోగా, మన దేశం, మన రాష్ట్రం సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయని చెప్పారు. ముఖ్యంగా కరోనాను కట్టడి చేయడంలో వైద్యులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బందితో పాటు పాత్రికేయులు కూడా గణనీయమైన సేవలను అందించారని అన్నారు. వ్యాధి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న సమయంలో కూడా వీరంతా ప్రాణాలకు తెగించి, ధైర్యంగా విధులను నిర్వహించారని కొనియాడారు. పాత్రికేయుల త్యాగాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి గుర్తించారని, కరోనా వల్ల మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారని వెళ్లడించారు. కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ, అలసత్వం పనికిరాదని అన్నారు. వేక్సిన్ వచ్చేవరకూ ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు కోవిడ్ వారియర్స్ కృషి చేయాలని శ్రీనాధ్ కోరారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ సమిష్టిగా కృషి చేయడం ద్వారా జిల్లాలో కరోనాను గణనీయంగా కట్టడి చేయగలిగామని అన్నారు. మొదట్లో 48 రోజులపాటు జిల్లాను గ్రీన్‌జోన్‌గా ఉంచడమే కాకుండా, వ్యాధి ప్రవేశించిన తరువాత కూడా, దాని వ్యాప్తిని అడ్డుకొనేందుకు మూడంచెల వ్యూహం, 7 స్టెప్స్ స్ట్రాటజీ, 10 కమాండ్‌మెంట్స్‌ను అమలుచేసి, దానిని సమర్థవంతంగా నిరోధించామని తెలిపారు. దీనివల్లే రాష్ట్రంలో అతితక్కువ కేసులు, అతి తక్కువ మరణాలతో విజయనగరం జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. అయినప్పటికీ కొందరిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా పాజిటివ్ రేటు 3శాతానికి తగ్గిపోయిందని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వేక్సిన్ వచ్చేవరకూ ప్రతీఒక్కరూ తప్పనిసరిగా మాస్కును ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని, చేతులను తరచూ శానిటైజర్ తో సుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కేసుల సంఖ్య తక్కువగానే నమోదవుతున్నప్పటకీ, ఈ నెలాఖరునాటికి రోజువారీ సగటు కేసుల సంఖ్య వంద కంటే తక్కువకు తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కరోనాపై పోరులో పాత్రికేయులు కూడా ఎంతో కీలక పాత్ర వహించారని కలెక్టర్ ప్రశంసించారు.
జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు డి.రమేష్ మాట్లాడుతూ కరోనా నియంత్రణలో ఇతర ప్రభుత్వ విభాగాలతోపాటు పాత్రికేయులు చేసిన కృషిని సైతం గుర్తించడం అభినందనీయమన్నారు. చాలామంది పాత్రికేయులు కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలో కూడా ఎంతో ధైర్యంగా విధులను నిర్వహించారని కొనియాడారు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్‌ను పరిచయం చేశారు. ఫొరమ్ ఫర్ బెటర్ విజయనగరం ప్రతినిధి డాక్టర్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ కోవిడ్ పట్ల అలసత్వాన్ని చూపవద్దని కోరారు. మాస్కును ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడంతోపాటుగా, వీలైనంతవరకూ మౌనంగా ఉండాలని సూచించారు. కోవిడ్ వారియర్స్‌గా గుర్తించిన డాక్టర్లు, నర్సులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బందితోపాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను దుశ్వాలువలతో, జ్ఞాపికలతో సన్మానించారు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌ను జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ, ఎపి వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తదితర సంఘాలు శాలువలతో, బొకేలతో సత్కరించాయి. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, నెహ్రూయువ కేంద్రం జిల్లా కో-ఆర్డినేటర్ విక్రమాధిత్య, ఐఆర్‌పిడబ్ల్యూఏ డైరెక్టర్ పికె ప్రకాశరావు, కేసలి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కేసలి అప్పారావు, సమాచార, పౌర సంబంధాలశాఖ విశ్రాంత డిప్యుటీ డైరెక్టర్ త్యాగరాజు, డివిజనల్ పిఆర్ఓలు ఎస్.జానకమ్మ, బాలమాన్‌సింగ్, వ్యాఖ్యాతగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్ ప్రవేశ పరీక్షకు తొలిరోజు 80.85 శాతం హాజరు నమోదయ్యింది. ఉదయం పరీక్ష కేంద్రాలను ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తనిఖీ చేశారు. మంగళవారం లైఫ్ సైన్సెస్, స్టాటస్టిక్స్, బిఎఫ్‌ఏ, జియాలజీ, ఇంగ్లీషు, ఎకనామిక్స్ కోర్సులకు పరీక్షలు జరిగాయి. మెత్తం 5196 మంది దరఖాస్తు చేసుకోగా 4201 మంది పరీక్షకు హాజరయ్యారు. దీనితో తొలిరోజు పరీక్షకు 80.85 శాతం హాజరు నమోదయ్యింది. పరీక్షలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ,రాజమండ్రి, ఏలూరు, విజయవాడ గుంటూరు నగరాల్లో నిర్వహించినట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఏ నాయుడు తెలిపారు. బుధవారం కెమికల్ సైన్స్, తెలుగు, ఫిజికల్ సైన్స్, ఎంకాం కోర్సులకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షల నిర్వహణను అసోసియేట్ డైరెక్టర్లు ఆచార్య ఎస్.బి పడాల్, డాక్టర్ సి.వి నాయుడులు పర్యవేక్షించారు.
శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని రాష్ట్ర శాసన సభాతి తమ్మినేని సీతారాం తెలిపారు. మంగళవారం ఆర్.అండ్.బి. అతిథి గృహంలో స్పీకర్ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, బుధవారం కూడా భారీ వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు కలెక్టర్లను, ఎస్.పి.లను, క్షేత్రస్థాయి శాఖాధికారులను, తహశీల్దారులను అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు. వర్షాల కారణంగా పంటలు, ఇళ్ళు, పశువులకు నష్టం వాటిల్లినట్లయితే, వాటిని క్షుణ్ణంగా అంచనా వేయవలసినదిగా ముఖ్యమంత్రి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. రెవిన్యూ, ఇరిగేషన్, వ్యవసాయం, హౌసింగ్ తదితర శాఖలవారీగా నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందన్నారు. సముద్రతీర ప్రాంత ప్రజలను, మత్స్యకారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి, వారిని అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని తెలిపారు. పలాస, టెక్కలి రణస్థలం, లావేరు ప్రాంతాలలో తుఫాను నష్టం ఎక్కువగా వుంటుందన్నారు. వంశధార, నాగావళి, బహుద నదులలో వరద ఉధృతి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. సహాయక చర్యలను తక్షణమే చేపట్టడం జరుగుతుందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో వుండాలని ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంధవరపు సూరిబాబు పాల్గొన్నారు.