జివిఎంసి వార్డు సచివాలయ వార్డు కార్యదర్శులు నిబద్దతతో పనిచేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన స్పష్టం చేసారు. శుక్రవారం VMRDA ఎరీనా చిల్డ్రన్ థియేటర్ లో వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సచివాలయ వ్యవస్థను ముందుకు తీసుకు వెళ్ళాలని, ప్రతి ఒక్కరూ హజరు పట్టిక, మూమెంట్ రిజిస్టర్, డైరీ రాయాలన్నారు. మీపై చాలా బాధ్యతలు ఉన్నాయని క్రమశిక్షణతో పని చేయాలని, విధులలో అలసత్వం పనికిరాదని హితవు పలికారు. ప్రతి వార్డులో మొత్తం 1200 వరకు ఇళ్ళు ఉంటాయని, అందులో ఎన్ని నివాస గ్రహాలు, సెమీ నివాస గృహాలు, వాణిజ్య గృహాలు ఉన్నాయో తెలుసుకొని వాటిపై మీకు పూర్తీ అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి రోజు వార్డును తనిఖీ చేసి ఎవ్వరైన కొత్తగా ఇళ్ళు నిర్మిస్తున్నారా? వాటికి ప్లాన్ ఉన్నాదా? అని తెలుసుకోవాలన్నారు. ప్లానింగ్ సంబందించిన డాటాపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. అక్రమ నిర్మాణములను గుర్తించి వాటిని నిలువరించాలన్నారు. జివిఎంసి పరిధిలో చాలా వరకు అన్ని జోన్లలో BPS, LRS అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయని వాటిని 3రోజులలో క్లియర్ చేయాలని కార్యదర్శులను హెచ్చరించారు. ఈ రోజు సాయంత్రంలోగా కనీసం ఒకటి లేక రెండు LRSను అప్లోడ్ చేయాలని లేని యెడల క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ 15 రోజులకు ఒక సారి ప్లానింగ్ కార్యదర్శులు రివ్యూ మీటింగు పెట్టమని సి.సి.పి. ని ఆదేశించారు. ఇప్పటి నుండే కష్టపడి పనిచేస్తే పైకి ఎదగడానికి మంచి అవకాసం ఉంటుందన్నారు. అనంతరం చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత మాట్లాడుతూ, మీకు రెండు సార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగినదని, ఇంకా మీకు పూర్తిగా అవగాహన రాలేదని, ఇకపై అలా జరిగితే మీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరు, ఫీల్డుకు వెళ్లి వివరాలు నమోదు చేయాలన్నారు. అనంతరం, వివిధ అంశంలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కార్యదర్శులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లతతో పాటూ, ఏ.సి.పి.లు, టి.పి.ఎస్.లు, టి.పి.ఓ.లు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా ఐ.టి.డి.ఎ యేతర పరిధిలో ప్రస్తుతము 26 అంగన్వాడీ కార్యకర్తలు, 164 అంగన్వాడీ హెల్పర్లు మరియు 26 మిని అంగన్వాడీ కార్యకర్తlల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సదరు పోస్టులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన భర్తీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. సదరు దరఖాస్తులు తే. 14.10.2020 దీ నుంచి 20-10-2020 వరకులోగా సంబంధిత శిశు అభివృద్ధి పధకపు అధికారీ ఐ.సి.డి.యస్ ప్రోజెక్టు కార్యాలయమునకు నేరుగా గానీ/రిజిస్టర్ పోస్టు ద్వారా గానీ అందజేయవలెను. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడతాయని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుతో పాటు వారి యొక్క కులము, నివాసము మొదలగు దృవ పత్రముల నకళ్ళు గెజిటడ్ అధికారిచే అటిస్టేషన్ చేయించి జతపరచాలని అధికారులు సూచిస్తున్నారు. అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడీ హెల్పరు మరియు మిని అంగన్వాడీ కార్యకర్త పోస్టు కొరకు దరఖాస్తు చేయు అభ్యర్ధులు ఆ గ్రామ స్థానిక వివాహిత అయి ఉండి తే.01.07.2020 దీ నాటికి 21-35 సం,,ల లోపు వయస్సు కలిగి యుండవలెను. అభ్యర్ధులు 10 వ తరగతి ఉత్తీర్ణులై యుండవలెను. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సంబంధిత ఖాళీలకు కేటాయించిన కేటగిరీ చెందిన అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను. వికలాంగులకు కేటాయించిన ఖాళీలకు వినికిడి లోపము గల అభ్యర్ధులు హియరింగ్ ఎయిడ్ తో వినగలిగి సంభాషించగలిగి యుండవలెను. శారీరక వికలాంగులు పిల్లల సంరక్షణ చేపట్టగలిగి, పూర్వ ప్రాధమిక విద్య నేర్పించగలిగి యుండవలెను. దృష్టి లోపము గల అభ్యర్ధులు యితరుల సహాయ సహకారము లేకుండా విధులు నిర్వర్తించగలిగి యుండవలెనని అధికారులు సూచిస్తున్నారు.
మట్టిలో మాణిక్యాలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్దతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆనందపురం మండలం గిడిజాల జిల్లాపరిషత్ పాఠశాలలో జరిగిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని రూ.1350/- విలువ చేసే 1) 3 జతల ఏకరూప దుస్తులు 2) స్కూలు బ్యాగు 3) ఒక జత బూట్లు మరియు 2 జతల సాక్సులు 4) స్కూలు బెల్టు 5) నోటు పుస్తకాలు 6) పాఠ్యపుస్తకాలు గల కిట్లను పంపిణీచేసారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ పేదవారు చదువుకోవాలన్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని ముఖ్యమంత్రి ఆచరణలో అమలుచేస్తూ, రాష్ట్రంలో ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో శత శాతం బాలబాలికలు పాఠశాలలకు హాజరై గుణాత్మక విద్యను అభ్యసించాలని, మెరుగైన ఫలితాలను సాధించాలనే లక్ష్యంతో జగనన్న విద్యా కానుక కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈరోజు వరకు జిల్లాలో 43 మండలాలలో 4064 పాఠశాలలలో 2,03,200 మందికి విద్యాకానుక కిట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. నాడు-నేడు కార్యక్రమం క్రింద పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆడపిల్లలకు సాధికారత రావాలంటే చదువు ద్వారానే సాధ్యమని తద్వారా తమకాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా ఎదుగుతారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను ఇంటివద్దకే తీసుకువెళ్లామన్నారు. అగనంపూడి- బోగాపురం మెట్రోరైల్ ప్రోజెక్టు ద్వారా విశాఖనగరం అభివృద్ది చెందుతుందన్నారు.
జిల్లా కలక్టరు వి. వినయ్ చంద్ మాట్లాడుతూ ఎవరూ ఆర్థిక ఇబ్బందులతో చదువు మద్యలో మానివేయకూడదని ప్రభుత్వం విద్యార్థులకు అనేక పధకాలు ప్రవేశ పెట్టిందని తెలిపారు. జగనన్న విద్యాకానుక వలన విద్యార్థుల ఆత్మ విశ్వాసం పెరుగుతందని తెలిపారు. ముఖ్యమంత్రి వారి ఆదేశాలమేరకు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో జిల్లాలో గల పాఠశాలలు, హస్టల్స్, ఆశ్రమ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మొదటి విడతగా 30 శాతం అనగా 1100 పాఠశాలలను సుమారు 360 కోట్ల రూపాయలతో మౌళిక వసతులు కల్పించడం జరిగిందని, మంచినీరు, కరెంటు, టాయిలెట్స్, కాంపౌండు వాల్ మొదలైన 9రకాల అవసరాలకు ప్రాధాన్యమిచ్చి పనులు పూర్తిచేయడం జరిగిందని తెలిపారు. 2023 సంవత్సరానికి జిల్లాలో మొత్తం పాఠశాలలకు నాడు-నేడు కార్యక్రమంద్వారా మౌళిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. అదే విధంగా త్వరలో అంగన్వాడి సెంటర్లను ప్రి ప్రైమరీ స్కూలుగా మార్పుచేసి 3-6 సంవత్సరాల పిల్లలకు విద్యనందించనున్నట్లు తెలిపారు. అందుకుగాను అంగన్వాడి సెంటరు నిర్మాణానికి అయ్యే ఖర్చును 10 లక్షలరూపాయల నుండి 15 లక్షలకు పెంచి మంజూరు చేయడమైనదని తెలిపారు. విద్యార్థుల శరీర పెరుగుదలకు అవసరమైన పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో గోరుముద్ద పధకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అవసరమైన మెనూ మార్చి అందించడం జరిగిందని తెలిపారు. జగనన్న వసతి విద్యాదీవెన పధకం ద్వారా ఉన్నత చదువులను ప్రభుత్వం ప్రోత్సహస్తున్నదన్నారు. అనేక ఉన్నత విద్యా సంస్థలను విశాఖజిల్లాలో నెలకొల్పడం జరిగిందని తెలిపారు.
జాయింటు కలక్టరు అరుణ్ బాబు మట్లాడుతూ నాడు-నేడు పనులను నాణ్యతలో రాజీపడకుండా చేపట్టడం జరిగిందని తెలిపారు. నాడు-నేడు పనులు పూర్తయిన పాఠశాలలలో చేరుటకు విద్యార్థులు పోటీపడుతున్నారని, సీట్లకొరత ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి, సమగ్ర శిక్ష అదనపు పదక సంచాలకులు బి. మల్లిఖార్జునరెడ్డి, ఉప విద్యాశాఖాధికారి ప్రేమ్ కుమార్, ప్రధానోపాద్యాయులు ఇ.పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ చేయూత పథకం అమలులో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి, పసుగాణభివృద్ధి, పంచాయతీరాజ్ తదితర శాఖలతో భాగస్వా మ్యం అయ్యేందుకు విశాఖ డెయిరీ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో శుక్రవారం సంయుక్త కలెక్టరు జె.వెంకటరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఒప్పందం జరిగింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా జిల్లాలను వివిధ విభాగాలతో కలిసి పని చేయడానికి విశాఖ డెయిరీ అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. వైఎస్సార్ పథకంలో భాగంగా రైతులకు హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి గేదెలను, ఆవులను తీసుకొచ్చేందుకు విశాఖ డెయిరీ యాజమాన్యం తోడ్పాటు అందిస్తుందని ఆ సంస్థ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు డెయిరి తరపున సమావేశంలో పాల్గొన్న చీఫ్ ఆపరేటింగ్ అధికారి డా. కె.వి.ప్రసాద్ వివరాలు వెల్లడించారు. వైఎస్సార్ పథకం అమలులో మా సంస్థ తరఫున తగిన సేవలు అందిస్తామని.. అవసరమైతే రైతులకు ఆర్థిక సాయం అందజేస్తామని పేర్కొన్నారు. హర్యానా, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి గేదెలు, ఆవులు కొని తెచ్చుకొనే రైతులకు సంస్థ తరఫున అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. రైతుకు ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు, అక్కడ ఉండేందుకు వసతి, రవాణా ఖర్చులు ఇస్తామని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో మేలుజాతి పశువులను కొనేందుకు.. అక్కడ నుంచి తీసుకొచ్చేందుకు సహకారం అందిస్తామన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పెంచుకొనే పశువులకు తొలి నెల ముందస్తు లోన్ పై ఆర్థిక సాయం, పశుదానా, వైద్య సదుపాయం కల్పిస్తామని డెయిరి చీఫ్ ఆపరేటింగ్ అధికారి ప్రకటించారు. ఈ సందర్భంగా జెసి జె.వెంకటరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుబ్బారావు పలు అంశాలపై విశాఖ డెయిరీ అధికారుల నుంచి స్పష్టత రాబట్టారు. రైతులకు అందిచే అదనపు సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెయిరీ పాల కేంద్రాల్లో పలు పోసే రైతులకు గిట్టుబాటు ధర అందించాలని కోరారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకం తీసుకొచ్చిందని దీనిలో భాగంగా ఏడాదికి ఒక్కొక్కరికి ,రూ.75,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని జిల్లా గ్రామీణాభివృద్ధి పీ డీ సుబ్బారావు చెప్పారు. ఈ పథకం ఫలవంతం అయ్యేందుకు డెయిరీ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జెసి వెంకటరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేప్మా పీడీ సుగుణఖర్ రావు, పశుగణభివృద్ది శాఖ పీ డీ ఏ వీ నరసింహులు, విశాఖ డెయిరీ డైరెక్టర్ కాటమయ్య, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని గిరిజనులకు భరోసా కల్పించడంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చరిత్ర స్రుష్టించారని అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి అన్నారు. రాజఒమ్మంగిలో మండలంలో సుమారు 1700 మందికి ROFR కొండపోడు భూములకు మంజూరైన పట్టాల్లో శుక్రవారం 460 మంది లబ్ధిదారులకు హక్కుదారుల పాసు పుస్తకాలు(పట్టాలు)ను డిసిసిబి చైర్మన్ అనంత బాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల నుండి పట్టాలు కోసం ఎదురు చూస్తున్న కొండపొడు చేసుకొంటున్న గిరిజనులకు మన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పెద్ద ఎత్తున కొండపోడు చేసుకొంటున్న గిరిజనులకు పట్టాలు మంజూరు చేశారన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. అలాంటి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు తోడుడుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూమికి సంబంధించి భూసేకరణ ప్రక్రియను నిర్దేశించిన గడువు లోవు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్లో HLC,HNSS,PABR,NATIONAL HIGHWAYS, RAILWAYS,APIIC తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పురోగతిపై ఆర్డీవోలు, ఇంజనీర్లు, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్లతో కలెక్టర్ సమీక్షించారు.. తొలుత హెచ్ ఎల్ సీ కి సంబంధించి స్టేజ్1 PABR స్టోరేజ్ సామర్థ్యం పెంపుకు అవసరమైన భూసేకరణపై ఎస్ ఈ రాజశేఖర్, ఎస్డీసీ వర ప్రసాద్ లతో సమీక్షించారు. ఇందుకు సంబంధించి అవసరమైన 1442 ఎకరాలకు నవంబర్ ఏడవ తేదీ లోపు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇవ్వాలని గడువు విధించారు.అలాగే ఫిబ్రవరి 10 వ తేదీ లోపు అవార్డ్ పాస్ చేయాలని ఆదేశించారు. అక్టోబర్ నెలాఖరు లోపు సర్వే పూర్తి చేయాలని, సర్వే సమయంలోనే జాయింట్ ఇన్స్పెక్షన్, పెగ్ మార్కింగ్ లాంటి ప్రక్రియలను కూడా పూర్తి చేయాలని సర్వే శాఖ ఎడి, ఎస్ ఈ, ఎస్ డి సీ లను ఆదేశించారు. అలాగే పెండింగ్ లో ఉన్న 84 కోర్ట్ కేసులు త్వరితగతిన పూర్తి అయ్యి, తీర్పు వచ్చేలా కౌంటర్ ఫైల్ చేయడం తదితర చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే PABR స్టేజి 2 కు సంబంధించి ప్యాకేజ్ 32 లో ఈ నెల 20 లోపు,ప్యాకేజ్ 42 లో ఈ నెలాఖరు లోపు ప్రిలిమినరీ నోటిఫికేషన్ పూర్తి చేయాలన్నారు. జాజికొండ వాగుకు సంబంధించి పెండింగ్ లో ఉన్న1300 ఎకరాల్లో 500 ఎకరాలకు అక్టోబర్ 10, 500 ఎకరాలకు నవంబర్ 15,మరో 300 ఎకరాలకు నవంబర్ 30 లోపు భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. HNSS ఫేస్ 1, 2 లకు సంబంధించి 1040 ఎకరాల పట్టా భూమి భూసేకరణ ప్రక్రియను డిసెంబర్ నెలాఖరు లోపు పూర్తి చేయాలని ఎస్ డీసీ రవీంద్ర ను ఆదేశించారు. అలాగే 801 ఎకరాల డీ కేటీ భూముల సేకరణ ను నవంబర్ 12 లోపు పూర్తి చేసి రైతులకు పరిహారం చెల్లించాలని ఆదేశించారు. 447 మంది జీడిపల్లి రిజర్వాయర్ నిర్వాసితులకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ స్కీం వర్తింపుకు వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. రైల్వే, ఏపీఐఐసీ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖకు సంబంధించిన నిర్మాణాలకు హిందూపురం,తాడిపత్రి, గుంతకల్, కదిరి పట్టణాల్లో ఈ నెల 20 లోపు భూమిని స్వాధీనం చేయాలని సంబంధిత ఆర్డీవోలను ఆదేశించారు. ఈ నెల 28 వ తేదీన భూసేకరణ పురోగతిపై సమీక్షిస్తామని, అంతలోపు నిర్దేశించిన విధంగా పురోగతి చూపించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ &,రైతు భరోసా) నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ నిషా0తి, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ప్రజల ఇలవేలుపు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని సంప్రదాయాల ప్రకారమే నిర్వహించాలని జిల్లా యంత్రాంగం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని, అన్ని నిబంధనలను పాటించాలని, భక్తుల రాకపోకలను నియంత్రించాలని భావిస్తున్నారు. దీనిపై ఒకటిరెండు రోజుల్లో విధివిధానాలు పూర్తిగా ఖరారు కానున్నాయి. విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహణపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ అధ్యక్షతన, రాష్ట్ర పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగింది. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, పాత్రికేయులు పండుగ నిర్వహణపై తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అమ్మవారి పండుగను సంప్రదాయాలకు అనుగుణంగానే నిర్వహించాలని అధికశాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే కోవిడ్ మహమ్మారి ప్రమాదం ఇప్పటికీ పొంచి ఉందని, లక్షలాది మంది భక్తులు ఒకేచోట చేరితో, ఈ వ్యాధి మరింతగా విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధి గనుక రెండోసారి విజ్ఞంభిస్తే అదుపుచేయడం చాలా కష్టమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అమ్మవారి పండుగకు భక్తుల రాకపోకలను పూర్తిగా నియంత్రించాలని ఎక్కువమంది కోరారు. దీనికోసం పండుగ రెండు రోజులూ బస్సులను, ఆటోలను నిషేదించాలని, పట్టణంలో లాక్‌డౌన్ విధించాలని, దర్శనాలు, ఘటాలను రద్దు చేయాలని, లైవ్ టెలీకాస్ట్ ద్వారా అమ్మవారి సిరిమాను సంబరాన్ని ప్రసారం చేయాలని, భౌతిక దూరాన్ని పాటించేలా చేయాలని, తప్పనిసరిగా మాస్కులను ధరించేలా నిబంధనలను విధించాలని తదితర సూచనలు చేశారు. ఇటీవల జరిగిన పూరి జగన్నాధస్వామి రథయాత్ర, తిరుపతి బ్రహ్మోత్సవాలు తదతర పండుగలను ఉదహరిస్తూ, భక్తులకు అనుమతి లేకుండానే, వీటిని సంప్రదాయాలప్రకారం నిర్వహించిన విషయాన్ని పలువురు గుర్తు చేశారు.
ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ వరుసగా మూడో ఏడాది కూడా అమ్మవారి ఉత్సవాలను నిర్వహించే అవకాశం రావడం తన అధృష్టమని పేర్కొన్నారు. భక్తుల రక్షణను దృష్టిలో పెట్టుకొని, వారి భద్రత కోసం అన్నిరకాల జాగ్రత్తలను తీసుకొని, ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. అందరి సలహాలు, సూచలను అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి ఉత్సవాన్ని సంప్రదాయాలకు తగ్గట్టుగా, రాష్ట్రస్థాయి పండుగగా, ఘనంగా నిర్వహించాలని కోరారు. అయితే అమ్మవారి పండుగ అంటే లక్షలాదిమంది తరలి వస్తారని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తుల రాకపోకలపై నియంత్రణ విధించాల్సిన అవసరం ఉందన్నారు. దర్శనాల సమయంలో గానీ, జాతర సందర్భంలో గానీ భక్తుల ఏమాత్రం ఇబ్బంది పడకుండా చర్యలను చేపట్టాల్సి ఉందన్నారు. విజయనగరం ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు అవకాశం ఇవ్వవద్దని సూచించారు. జిల్లా యంత్రాంగం కృషి ఫలితంగా గతంలో జిల్లా 48 రోజులపాటు గ్రీన్‌జోన్‌లో నిలిచిందని, ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుటపడుతున్న తరుణంలో, లక్షలాది మంది భక్తులను ఉత్సవాలకు అనుమతిస్తే పరిస్థితి మళ్లీ దిగజారిపోయే ప్రమాదం ఉందని సూచించారు.
జిల్లా ఎస్‌పి బి.రాజకుమారి మాట్లాడుతూ గత ఏడెనిమిది నెలలుగా జిల్లాను కరోనా మహమ్మారి వణికించిందని, ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుట పడుతోందని చెప్పారు. కరోనా మమ్మారికి ఇప్పటికీ తగిన మందు లేదని, దీనికి నివారణ ఒక్కటే మనముందున్న ఏకైక మార్గమని స్పష్టం చేశారు. అయితే ప్రజల మనోభావాలను సైతం మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, అందువల్ల ఉత్సవాలను మాత్రం సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. కానీ భక్తుల రాకపోకలపై పూర్తిగా నియంత్రణ విధించి, లైవ్ టెలికాస్ట్ ద్వారా ఉత్సవాలను ప్రసారం చేసి, ఇళ్లవద్దనుంచే వారంతా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఉత్సవాల నిర్వహణలో పాల్గొనేవారికి కూడా కోవిడ్ టెస్టులు చేయాలని, పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలని ఎస్పీ సూచించారు.
చివరిగా మంత్రి బొత్స సత్యనారాయణ తన అభిప్రాయాన్ని వెళ్లడించారు. పైడితల్లి అమ్మవారి పండుగ లక్షలాదిమంది మనోభావాలతో ముడిపడి ఉన్న పండుగ అని, వారి మనోభావాలు దెబ్బతినకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. సిరిమానోత్సవం నిర్వహణపై అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయించడం జరుగుతుందన్నారు. అయితే ఉత్సవాలను సంప్రదాయాలకు అనుగుణంగా, ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భక్తుల రాకపోకలపై నియంత్రణ తప్పదని స్పష్టం చేశారు. మనల్ని మనం కాపాడుకుందాం....అన్న నినాదంతో ముందుకు వెళ్తామని, ఉత్సవాలపై ప్రజలకు ఇప్పటినుంచే అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఘటాలను పూర్తిగా నిషేదించడం సరికాదని, రోజుకు రెండు మూడు వార్డుల చొప్పున, పోలీసుల ఆధ్వర్యంలో అనుమతిస్తే బాగుంటుందని సూచించారు. దసరారోజు ఆదివారం, అమ్మవారి పండుగ రోజులైన సోమ, మంగళవారాల్లో అమ్మవారి దర్శనాలను పూర్తిగా నియంత్రించాలన్నారు. తొలేళ్లు రోజు రాత్రి జనం రాకపోకలను నియంత్రించేందుకు, ఆరోజు సాయంత్రం 7 గంటలు తరువాత, మంగళవారం పూర్తిగా పట్టణంలోని షాపులను మూసివేయాలని సూచించారు.
పులివేషాలు, విచిత్ర వేషాలను నిషేదించాలన్నారు. ఉల్లంఘించినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే జనం గూమిగూడే అవకాశం ఉండటంతో, సంస్కృతి ప్రదర్శనలకు సైతం అనుమతించకూడదని సూచించారు. ప్రతీవార్డుకు ఒకటినుంచి రెండు ఎల్ఇడి స్క్రీన్‌లను ఏర్పాటు చేసి, అమ్మవారి పూజలను, సిరిమానోత్సవాన్ని లైవ్ టెలికాస్ట్ చేయాలని చెప్పారు. అదేవిధంగా ఆలయంవద్ద రద్దీని నియంత్రించేందుకు ఒకసారి అమ్మవారిని దర్శించుకొనే వారు రెండోసారి రావద్దని భక్తులను కోరాలన్నారు. సిరిమానోత్సవం రోజువరకూ వేచిఉండకుండా, శనివారం నుంచే అమ్మవారిని భక్తులు దర్శించుకొనేవిధంగా, వారిని చైతన్య పరచాలని కోరారు. భక్తుల సెంటిమెంట్ దెబ్బతినకుండా అమ్మవారి పండుగను నిర్వహించాలని, ఇదే సమయంలో కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. ఒకటిరెండు రోజుల్లో అమ్మవారి పండుగకు సంబంధించి అందరి అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని, తగిన విధివిధానాలను ఖరారు చేసి, ప్రజలకు వెళ్లడించాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్, వైకాపా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జి.సి. కిశోర్‌కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భవానిశంకర్ , పైడితల్లి ఆలయ ఇఓ సుబ్రమణ్యం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పైడిమాంబ ఉత్సవాల నిర్వహణపై విజయనగరం డిఎస్‌పి వీరాంజనేయరెడ్డి, పాత్రికేయులు శ్రీనివాసరావు, జి.కోటేశ్వర్రావు, బూరాడ శ్రీనివాసరావు, బాలకృష్ణ, వైకాపా నాయకులు డోల మన్మధకుమార్, ఆశపు వేణు, కె.రామకృష్ణ, నాఊరు విజయనగరం ఎన్‌జిఓ ప్రతినిధి విశాల, సాయిప్రసాద్, స్పార్క్ ప్రతినిధి భవానీ పద్మనాభం, జనసేన నుంచి జె.రామకృష్ణ, రాజేష్, లోక్‌సత్తా నుంచి టి.రాజారావు, బిసి సంక్షేమ సంఘ నాయకులు ముద్దాడ మధు, బిఎస్‌పి నుంచి పి.వెంకటరమణ, బిజెపి నుంచి గ్రంధి కృష్ణమూర్తి, క్రెడాయ్ తరపున సుభాష్‌చంద్రబోస్, ఫోరమ్ ఫర్ బెటర్ విజయనగరం ప్రతినిధి డాక్టర్ వెంకటేశ్వర్రావు, చైల్డ్ రైట్స్ ఫోరమ్ అధ్యక్షులు ఎస్.అచ్చిరెడ్డి, పైడిమాంబ దీక్షా పీఠం అద్యక్షులు ఆర్.ఎస్.పాత్రో తదితరులు తమ అభిప్రాయాలను వెళ్లడించారు.
నెహ్రూ యువ కేంద్రం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో యువత భాగస్వామ్యం కావాలని జాయింట్ కలెక్టర్ డా. ఏ.సిరి ( గ్రామ, వార్డు సచివాలయ లు మరియు అభివృద్ధి) పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక జెడ్పీ కార్యాలయంలో యువజన సంఘాల అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అడ్వైజరీ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నెహ్రు యువ కేంద్రం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేయాలని, ఇందులో ముఖ్యంగా యువత భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ వై కె ద్వారా యువతకు వివిధ రకాల వృత్తి విద్య పై శిక్షణ ఇవ్వాలన్నారు. అలాగే ఆరోగ్య, మానసిక ఉల్లాసం కొరకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పచ్చదనం పరిశుభ్రత, నీటి ఉపయోగం తదితర కార్యక్రమాలను నెహ్రూ యువ కేంద్రం ద్వారా చేపట్టాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాల నిర్వహణ ,జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు యువతను మరియు యువజన సంఘాలను అనేక రకాల కార్యక్రమాల ద్వారా ప్రోత్సహించే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. కాలేజీ స్థాయిలో ఉండే విద్యార్థులు కూడా నెహ్రూ యువ కేంద్రం ద్వారా చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా దృష్టిని సారించాలన్నారు. ముఖ్యంగా యువత మొక్కలు నాటడం తో పాటు వాటి సంరక్షణ కోసం కృషిచేయాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యం మరియు ప్లాస్టిక్ వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కోవిడ్-19 కు సంబంధించి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజల్లో మాస్కులు, శానిటైజర్ వాడకం పై తెలియజేయాలని, ప్లాస్మా దానం యొక్క విశిష్టత మరియు అవసరం గురించి ప్రజలకు చైతన్యం కలిగించాలన్నారు. కోవిడ్ సమయంలో యువత అందరూ కలిసికట్టుగా పనిచేసి సమైక్య అభివృద్ధి సాధించాలన్నారు. అనంతరం 2020- 21 ఆర్థిక సంవత్సరం లో నెహ్రూ యువ కేంద్రం ద్వారా చేపట్టిన కార్యక్రమాల గురించి సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజన అధికారి సందీప్ కుమార్, డి డి ఓ శ్రీనివాసులు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. నాగలింగారెడ్డి, ప్రకృతి వైద్య సంస్థ ప్రతినిధి మహేష్ బాబు, పలువురు ఎన్ వై కె వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి శిశువు వయస్సుకు తగ్గ బరువు ఉండే విధంగా వచ్చే ఏడాది మార్చి నెల 31 తేదీ' లోపల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవనము నందు జిల్లా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తక్కువ బరువుతో పిల్లలు జన్మించుట వలన పౌష్టికాహారలోపంతో మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారన్నారు. పౌష్టిక ఆహారాన్ని లోపాన్ని నియంత్రించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో పెరుగుదల మందగించిన, రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలను, వయస్సుకు తగిన ఎత్తు, ఎత్తుకు తగిన బరువు లేని పిల్లలను గుర్తించాలన్నారు. అందుకు క్షేత్రస్థాయిలో ఐసిడిఎస్ సిబ్బంది కృషి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో వివిధ సంక్షేమ పథకాల అమలుపై పిల్లల తల్లిదండ్రులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.త్వరలో గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో అన్ని శాఖల సమన్వయంతో ఐసిడిఎస్ శాఖ చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి టీంలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 0 - 6 వయసు కలిగిన పిల్లలను, బరువు తగ్గిన పిల్లలను గుర్తించాలని పేర్కొన్నారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని, మంగళవారం లోపు తనకు నివేదిక అందజేయాలని ఐసిడిఎస్ పిడి ని ఆదేశించారు. బరువు తక్కువ కలిగిన పిల్లలను గుర్తించిన, సక్రంగా రికార్డులు నిర్వహించిన సికే పల్లి, ధర్మవరం, గుత్తి, కంబదూరు, ఉరవకొండ, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం సీడీపీఓలను జిల్లా కలెక్టర్ అభినందించారు. వారానికి రెండు సార్లు సంబంధిత సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేయాలని, రికార్డులు సక్రమంగా నిర్వహించేవిధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.సంబంధిత అధికారులతో గ్రామాలలో శానిటేషన్ పైన ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు ఉన్నాయో, లేదో క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో 872 అంగన్వాడీ కేంద్రాలకు స్థల సేకరణ కార్యక్రమం పనులు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణం పనులపై ప్రతిరోజు నివేదికలు అందజేయాలని సూచించారు. బాల సంజీవని, గోరుముద్ద కార్యక్రమం, వైయస్ఆర్ సంపూర్ణ పోషక ఆహార పథకాలపై జిల్లాలో అమలుచేస్తున్న తీరుపై సమీక్షించారు. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించవలసిన బాధ్యత ఐసిడిఎస్ సిబ్బందిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) సిరి, ఐసిడిఎస్ పి డి చిన్మయ దేవి, డి సి పి వో సుబ్రహ్మణ్యం జిల్లాలోని సి డి పి ఓ లు, సూపర్వైజర్లు,నోడల్ ఆఫీసర్ వనజ, అక్కమ్మ, తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో వర్చువల్ లోక్ అదాలత్ ను ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ నోడల్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. వర్చువల్ లోక్ అదాలత్ ను బ్లూ జీన్స్ యాప్ లేదా వాట్సాప్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వర్చువల్ లోక్ అదాలత్ ను 17వ తేదీ ఉదయం 10.30 గంటల నుండి జిల్లా కోర్టు ఆవరణ నుండి నిర్వహించడం జరుగుతుందని, ఈ లోక్ అదాలత్ లో సివిల్ కేసులు, చెక్ బౌన్సు కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, మోటారు ఏక్సిడెంటు కేసులు (వాహన ప్రమాద కేసులు), విడాకులు మినహా ఫ్యామిలి డిస్యూట్స్ (విడాకులు మినహా మిగిలిన కుటుంబ కలహాల కేసులు), లేబర్ అండ్ ఎంప్లాయిమెంటు కేసులు (కార్మిక, యాజమాన్య కేసులు), కాంపౌండబుల్ క్రిమినల్ కేసుల (రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు) పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శుక్ర వారం ఒక ప్రకటన జారీ చేస్తూ సంబంధిత శాఖలు తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాల సమ్మతితో కేసులు పరిష్కారానికి చక్కటి అవకాశమని ఆయన అన్నారు. సంబంధిత కేసులకు సంబంధించిన కక్షిదారులు పరిష్కారానికి వాట్సప్, మెయిల్ ద్వారా సమాచారాన్ని అందించవచ్చని చెప్పారు. జిల్లాలో ఇతర కోర్టులలోనూ వర్చువల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ళ నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయ తలపెట్టిన గృహనిర్మాణ పథకం అమలులో నాణ్యత, తదితర అంశాలను పాటిచడంలో తీసుకోవలసిన చర్యలపై గృహనిర్మాణ సంస్ధ ఇంజినీర్లకు శిక్షణ ఇప్పించడానికి తిరుపతి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ.ఐ.టీ)తో గృహనిర్మాణ శాఖ అవగహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. ఇందులో భాగంగా గృహ నిర్మాణ సంస్ధ ఇంజనీర్లకు, గ్రామ సచివాలయ ఇంజనీరింగు సహాయకులకు నాలుగు రోజుల ఇంటర్నెట్ ఆధారిత శిక్షణా తరగతులు గురువారం ప్రారంభం అయ్యాయి. శిక్షణకు హాజరైన ఇంజనీర్లను ఉద్దేశించి అజయ్ జైన్ మాట్లాడుతూ పేదలందరికీ నాణ్యమైన గృహాలు కట్టాలని ముఖ్యమంత్రి, నిర్ణయించారని, గృహనిర్మాణానికి నాణ్యమైన ఇనుము, సిమ్మెంటు ఇతర ముడిపదార్ధాలు సరఫరా చేయడం జరిగిందన్నారు. గృహ నిర్మాణంలో ఆధునిక పద్ధతులు, విధిగా పాటించాల్సిన అంశాలపై ఇంజినీర్లు శిక్షణ పొందాలని ఆయన సూచించారు. కాలుష్య రహితంగా పూర్తి భద్రతా ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలని అయన సూచించారు. శిక్షణ తరగతులు నిరంతరం కొనసాగుతాయని, ఇంజినీర్ల బృందాలను తిరుపతి ఐ.ఐ.టికి పంపిస్తామని, అక్కడ ఉన్న ల్యాబులు ఇతర కట్టడాల వివరాలపై ఇంజినీర్లు అవగాహన పెంచుకోవచ్చని అని అయన వివరించారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి.యస్.నవీన్ కుమార్ మాట్లాడుతూ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కూడా ఈ శిక్షణ తరగతులలో పాల్గొంటున్నారని, వారికి కూడా ఈ శిక్షణ ఉపయోగపడుతుందని, నాణ్యతపరమైన విషయంలో సందేహాలు ఉంటే శిక్షణా తరగతులలో నివృత్తి చేసుకోవాలని ఆయన కోరారు. తిరుపతి ఐ.ఐ.టీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్.సత్యనారాయణ ప్రసంగిస్తూ సివిల్, పర్యావరణ విభాగాలకు చెందిన సీనియర్ ప్రొఫెసర్లు ఈ శిక్షణ తరగతులలో పాల్గొని వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారని, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గృహనిర్మాణ సంస్థ చీఫ్ ఇంజనీర్ సి.హెచ్.మల్లికార్జున రావు మాట్లాడుతూ వివిధ స్థాయిలకు చెందిన 11 వందల మందికి పైగా ఇంజినీర్లు ఈ శిక్షణలో పాల్గొంటున్నారని, నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలపై అవగహన పెంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నుండి ఇంటర్నెట్ ద్వారా గృహ నిర్మాణ సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ టి.వేణుగోపాల్, కార్యనిర్వాహక ఇంజనీర్లు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు, సహాయ ఇంజనీర్లు, గ్రామ సచివాలయ ఇంజనీరింగు సహాయకులు తదితరులు పాల్గొన్నారు.
సచివాలయ వ్యవస్థ అందిస్తున్న సేవలు ప్రజలకు మరింత దగ్గర కావాలని, వాలింటీర్ల ద్వారా సంక్షేమం ఫలాలు గడపకే అందించి పారదర్శకత చాటలని జిల్లా సంయుక్త కలెక్టర్ (అభివృధ్ధి) వీరబ్రహ్మం సూచించారు. శుక్రవారం రేణిగుంట మండలంలోని కరకంబాడి 1, రేణిగుంట 1, గురవారాజుపల్లె గ్రామసచివాలయాలను ఆకస్మికంగా సందర్శించి పలు సూచనలు చేశారు. కరకంబాడి 1 సచివాలయం సందర్శించిన జెసి సిబ్బందితో సమావేశమై ప్రజాసమస్యల పరిష్కారంలో వ్యవసాయ, రెవెన్యూ, వైద్య, ఆరోగ్యం, రేషన్ కార్డులు తదితర సేవలపై అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్యం సేవల తెలుకునే సమయంలో ఎ.ఎన్.ఎం రోహిణి గైర్హాజరును గమనించి క్రమ శిక్షణా చర్యలకు డి ఎం అండ్ హెచ్ ఓ ను పోన్ ద్వారా ఆదేశించారు. సచివాలయ వ్యవస్థ ఏడాది పూర్తి చేసుకున్నది, ఎందరో అభినందనలు అందుకున్న మీరు పారదర్శకతతో పనిచేయాలని, పథకాలకు అర్హులైన వారికి అందేలా చూడాలని సూచించారు. రేణిగుంట 1 సచివాలయ సందర్శనలో సచివాలయం వద్ద సచివాలయ సేవల వివరాలు, కాల్ సెంటర్ లు , టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా పోలీసు పూర్ణిమ సమాధానాలకు ఆమెను అభినందించారు. గురవరాజు పల్లె సచివాలయం సందర్శించి రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి మనం – మన పరిశుబ్రతలో భాగంగా ఇంటింటా ఫీజులు రూ.3000/- సేకరించినందుకు వాలింటీర్ ఇందుమతిని , పింఛన్ల పంపిణీ అర్థ రాత్రి నుండే చేపట్టడం పై వాలింటీర్ ఇందు ను , నరేగా పనులలో అవగాహన కల్పించి పనుల కల్పించినదుకు వాలింటీర్ కుసుమకు సంయుక్త కలెక్టర్ అభినంధనలు తెలిపారు. సచివాలయాల పర్యటనలో సందర్శకుల రిజిస్టర్లో సంతృప్తిగా వుందని జెసి సంతకాలు చేశారు. సంయుక్త కలెక్టర్ (డి) పర్యటనలో రేణిగుంట ఎంపీడీఓ ఆదిశేషా రెడ్డి, ఇ ఓ పి ఆర్ డి నీలకంటారెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలింటర్లు పాల్గొన్నారు.
విశాఖ వైద్య ఆరోగ్య శాఖ జిల్లా శిక్షణ టీమ్స్ ప్రాజెక్ట్ అధికారిగా (పీఓడీటీటీ) డాక్టర్ ఎం. శంకర్ రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈ పోస్ట్ లో వున్న డాక్టర్ సూర్యనారాయణ ఇటీవల డీఎం హెచ్ఓ గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ ఖాళీ అయిన స్థానంలోకి డాక్టర్ శంకర్ రావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే అయన బాధ్యతలు చేపట్టారు. విజయనగరం జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిగా, నెల్లూరు పీఓడీటీటీ గా, కేజీహెచ్ సీఎస్ ఆర్ఎంఓ గా, అరకు సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గా, జివీఎంసి జోన్ 3 హెల్త్ ఆఫీసర్ గా పనిచేసారు. ఈ సందర్బంగా డాక్టర్ శంకర్ రావు మాటాడుతూ వైద్య సిబ్బందికి వృత్తిపరంగా మంచి నైపుణ్యం పెంచేలా శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తి తో సేవలను అందిస్థానన్నారు.
రెడ్ క్రాస్ సంస్ద ద్వారా జిల్లా ప్రజలందరికీ అవసరమైన సేవలు అందేలా కృషి చేయడం జరుగుతోందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ తెలిపారు. నెహ్రు యువ కేంద్ర ఆవరణలో రూ.86 లక్షల వ్యయంతో నిర్మించిన రెడ్ క్రాస్ భవనాన్ని శుక్రవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రెడ్ క్రాస్ భవనం నుండి సేవలు అందించేందుకు అవసరమైన ఎక్విప్ మెంట్ ను కూడా వెంటనే ఏర్పాటు చేసుకోవాలని కలక్టర్ కు సూచించారు. అందుకు అవసరమైన ఎక్విప్ మెంట్ వివరాలు, నిధుల సమీకరణ కోసం ప్రతిపాదనలను పంపాలని కలక్టర్ కు తెలిపారు. ఇందుకు అవసరమైన నిధులను సిఎస్ఆర్ కింద సమకూర్చుకొనుటకు గల అవకాశాలను కూడా ప్రతిపాదించాలన్నారు. పూర్తిస్ధాయిలో సేవలు అందించేందుకు సిద్ధం చెయ్యాలన్నారు. అనంతరం భవన ఆవరణలో మంత్రి, పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, స్ధానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి, జిల్లా కలక్టరు డా. ఎం. హరి జవహర్ లాల్, జిల్లా సూపరింటెండెంట్ బి. రాజకుమారితో కలిసి మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్ద జిల్లా శాఖ చైర్మన్ కె.ఆర్.డి. ప్రసాదరావు, సెక్రటరీ కె. సత్యం, సంయుక్త కలక్టరు (ఆసరా) జె. వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, నెహ్రు యువ కేంద్ర కోఆర్డినేటర్ విక్రమాదిత్య, రెడ్ క్రాస్ సంస్ద సభ్యులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ వెల్నేస్ కేంద్రాలు, అంగన్వాడి కేంద్రాలకు సంబంధించిన భవన నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ ఆదేశించారు. ఆ మేరకు నియోజక వర్గాల ప్రత్యేకాధికారులకు ఆదేశాలు జారీచేసారు. జిల్లాలో 664 గ్రామ సచివాలయాలు, 628 రైతు భరోసా కేంద్రాలు, 509 వెల్నెస్ కేంద్రాలు, 804 అంగన్వాడి కేంద్రాలను నిర్మించేందుకు లక్ష్యంగా నిర్ణయించామని అయితే ఇప్పటికీ గ్రౌండ్ కాకుండా అనేక భవనాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ పనులను పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, గిరిజన సంక్షేమ శాఖల ఇంజినీరింగ్ అధికారుల ద్వారా చేపట్టడం జరుగుతోందని ఆయా ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించుకొని పనులు వచ్చే మార్చి 31లోగా అన్ని గ్రౌండ్ అయ్యేలా చూడాలని ప్రత్యేకాధికారులను ఆదేశించారు. అందుకోసం స్ధానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ వేగంగా పనులు జరిగేలా చూడాలన్నారు. భూసంబంధిత సమస్యల కోసం స్ధానిక తహశీల్ధార్లతో చర్చించుకోవాలని సూచించారు. నియోజక వర్గ ప్రత్యేకాధికారులు పనుల పురోగతిపై ప్రతి శనివారం నివేదికను నిర్ధేశించిన ప్రొఫార్మాలో అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో గల తొమ్మిది నియోజక వర్గాలలో 74 గ్రామ సచివాలయ భవనాలు, 225 రైతు భరోసా కేంద్రాల భవనాలు, 231 వెల్నెస్ భవనాలు మొత్తం 529 భవనాల గ్రౌండ్ కాలేదని, వీటిని త్వరితగతిన గ్రౌండింగ్ చెయ్యాలన్నారు.