1 ENS Live Breaking News

వరదల తాకిడికి శుద్ధగెడ్డపై వంతెనే మార్గం..

శుద్ధగడ్డ వాగు రహదారిపై వంతెన లేక ఎప్పుడు వర్షాలు వచ్చినా పొంగి పొర్లుతూ రాకపోకలకు ఇబ్బందిగా మారుతోందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే  పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్, జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చారు. గత 3 రోజుల నుంచి అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కారణంగా వాగులోని వరద నీరు రహదారిని నిర్బంధించింది. వాగు పరిశీలన నిమిత్తం బుధవారం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, ఆర్డీవో ఎస్.మల్లిబాబు, ఆర్&బి ఎస్ఈ విజయ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా ఆర్&బి అధికారులను వంతెన నిర్మాణానికి తయారు చేసిన ప్రతిపాదనలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ మాట్లాడుతూ, ఈ వాగు ప్రవాహం 20 రోజుల వరకూ వుంటుందని, ప్రతీ సంవత్సరం వర్షాలు కురిసినపుడు వరద నీటితో రహదారి నిర్బంధం అవుతుందన్నారు. ఈ వంతెన నిర్మాణం త్వరగా మంజూరు చేసి ప్రజల సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ను కోరారు. ఈ వంతెన నిర్మాణానికి అంచనా వ్యయం రూ. 3 కోట్లు అవుతుందని ప్రతిపాదనలు పెట్టామని కలెక్టర్ కు ఆర్&బి ఎస్ఈ తెలిపారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యేతో కలిసి చిన్నింపేట జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న నీటి కాలువను పరిశీలించడానికి వెళ్లారు. ఈ బృందం కార్యక్రమంలో తహసీల్దార్ పి.గోపాలకృష్ణ, ఎంపీడీవోశ్రీలలిత, ఆర్&బి డిఇ ప్రకాశరావు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

శుద్ధగెడ్డ

2020-10-14 20:49:24

అధికారులూ అప్రమత్తంగా ఉండాలి..

అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, భారీ వర్షాలు వలన వచ్చే వరదలకు సంబంధించి దెబ్బతిన్న పంటలు, చెరువులకు గండ్లు, విద్యుత్ సరఫరా ,రోడ్డు మరమ్మతులు తదితర పనులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. వీటికి సంబంధించిన నష్టాల ను అంచనా వేసి నివేదికలను వేగవంతంగా పంపాలన్నారు. ఇళ్ల డ్యామేజీ, ప్రాణ నష్టాల వివరాలను  తెలియజేయడం తో పాటు బాధితులకు తక్షణమే పరిహారం అందజేయాలన్నారు.  సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని డయేరియా లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున శానిటేషన్ మీద ప్రత్యేక ధ్యాస పెట్టాలన్నారు. త్రాగునీరు కలుషితం కాకుండా క్లోరినేషన్ చేయడం, అవసరమైన  మందులను అన్ని పీహెచ్సీలలో అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిందన్నారు.46 మండలాల్లో 22 మండలాలు భారీ వర్షాలకు గురయ్యాయని, మిగిలిన మండలాల్లో పాక్షికంగా వర్షాలు పడ్డాయని అన్నారు. జిల్లాలో ఐదుగురు మృతి చెందారని తెలిపారు. వరి,ఉద్యాన పంటలకు సంబంధించి అంత ఎక్కువ నష్టం జరగలేదన్నారు.  జీవీఎంసీ పరిధిలో ఒక రూఫ్ కూలి పోయిన ఘటనలో  ఇద్దరు మృతిచెందారని,సంబంధిత కుటుంబీకులకుపరిహారాన్ని అందజేయడం జరిగిందన్నారు.  తొమ్మిది ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని వారికి ఈ రోజు సాయంత్రం నష్ట పరిహారాన్ని అందజేయడం జరుగతుందని తెలిపారు. జిల్లా లో  కొన్ని చోట్ల పాక్షికంగా రోడ్లు దెబ్బ తిన్నాయనీ సిబ్బంది పనులను చేపడుతున్నారని తెలిపారు.

కలెక్టరేట్

2020-10-14 20:39:17

కులమతాల బేధం లేకుండా నడుచుకోవాలి..

విజయనగరం జిల్లాలోని అని వర్గాల ప్రజలూ కులమత, వర్గ భేదం లేకుండా సోదరభావంతో మెలగాలని అప్పుడే శాంతి నెలకొంటుందని.. దాని ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అన్నారు. ఎస్సీ,ఎస్టీ సెల్ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ డి.డి. సునీల్ రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ దళితుల, గిరిజనుల హక్కులకు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. గిరిజనుల, దళితుల హక్కులను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. ఎలాంటి సమస్యా ఉన్న విజిలెన్స్ కమిటీ దృష్టికి తీసుకురావాలని కమిటీ సభ్యులను ఉద్దేశించి అన్నారు. దళితులకు సంబంధించి ఏ ఫిర్యాదు వచ్చినా నిమిషాల వ్యవధిలో పరిష్కారం చూపాలని జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. పలు గ్రామాల్లో దళితులకు చెందిన శ్మశానవాటికలు అన్యాక్రాంతం అయ్యాయని కమిటీ సభ్యులు చెప్పగా త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత విభాగ అధికారులకు కలెక్టర్ సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల వివక్షత నుంచి.. పేదరికం నుంచి విముక్తి పొందాలంటే చదువు ఒక్కటే మార్గమని దీనిపై భావి తరాలకు ఉపదేశించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై నా ఉందన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో అందరూ నడవాలని అప్పుడే సమాజంలో ఆశించిన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు, నాయకులు మృదు స్వభావులని కాబట్టే మిగతా జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో   ఎస్సీ,ఎస్టీలపై జరిగే దాడులు తక్కువుగా నమోదవుతున్నాయన్నారు. ఒకరిపట్ల ఒకరు మానవీయ దృక్పథంతో నడుచుకుంటే సమాజంలో ఘర్షణలే జరగవని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయని వాటిని నివారించేందుకు జిల్లా యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించినా.. దళితులపై దాడులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని ఘాటుగా అన్నారు. వేపాడ మండలం నల్లబిల్లి గ్రామంలో అసైన్డ్ అయిన వారికి 48 గంటల్లోగా పట్టాలు అందజేసే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో మానభంగానికి గురైన 51 మంది బాధితులకు శాశ్వత ఉపాధి చూపాలని సంబంధిత విభాగ అధికారులకు సూచించారు. అలాగే ఎస్సీ,ఎస్టీ కేసుల బాధితులకు నష్టపరిహారం త్వరితగతిన అందించాలని చెప్పారు. నూతనంగా నియమితులైన విజిలెన్స్ కమిటీ సభ్యులను ఉద్దేశిస్తూ.. మీరంతా సమాజం పట్ల బాధ్యతతో మెలగాలని.. సమస్యను పెద్దది చేసేందుకు కాకుండా పరిష్కరించేందుకు కృషి చేయాలని.. నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని హితవు పలికారు. జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసేటప్పుడు తాజా కుల ధృవీకరణ పత్రాలు లేకపోయినా.. పాత పత్రాలు ఆధారంగా కేసు నమోదు చేయవచ్చని చెప్పారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులను నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసి పరిష్కరిస్తామని బాధితులకు సత్వరమే న్యాయం జరిగే చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దాడులను నివారించేందుకు 24గంటలు పాటు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని.. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందనలో భాదితులు ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు. డి.ఆర్. వో. గణపతిరావు,  జెసి.జె.వెంకటరావు, సాంఘిక సంక్షేమ శాఖ డి.డి. సునీల్ రాజ్ కుమారు, డ్వామా పీడీ నాగేశ్వరరావు పలు అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడి జగన్నాథం, డి.ఆర్.డి. ఎ. పీడీ సుబ్బారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయలక్ష్మి, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ సెల్ డీఎస్పీ మోహనరావు, వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి, పశుసంవర్ధక శాఖ జేడీ ఏవీ నరసింహులు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ స్వచ్చంధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు. చివరిగా రైతు భరోసా కేంద్రాల నిర్వహణపై శిక్షణకు సంబంధించిన ప్రత్యేక బుక్ లెట్ ను పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతులమీదుగా ఆవిష్కరించారు. 

కలెక్టరేట్

2020-10-14 20:35:01

వరద బాధితులకు ప్రభుత్వం అండ..

వరదలలో  నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం మంత్రి ముంపునకు గురయిన ప్రాంతాలను రాంబిల్లి మండలం లో రజాల అగ్రహారం,వెల్చూరు, మర్రిపాలెం, కట్టు బోలు, పెద కలవలపల్లి గ్రామాలు, యలమంచిలి మండలం లో కట్టుపాలెం, తెరువుపాలెం గ్రామాలను సందర్శించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ముంపునకు గురయిన 7 గ్రామాల ప్రజలను ఆదుకుంటామని, వారికి పునరావాసం కల్పిస్తామని తెలిపారు. పంట నష్టంపై  అధికారులు నివేదికలు సమర్పించిన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పొలాల ముంపునకు  శారదానదిపై నిర్మించిన వంతెన  ఒక కారణమని చెబుతున్నారని,  నేవీ అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.  గండి పూడ్చివేతకు పనులను వెంటనే చేపట్టవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులను అదేశించామన్నారు. భవిష్యత్తులో యిటువంటి యిబ్బందులు రాకుండా శాశ్వత ప్రాతిపదికన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  పార్లమెంటు సభ్యులు  బి.వి.సత్యవతి, శాసనసభ్యులు యు.వి. రమణమూర్తిరాజు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

యలమంచిలి

2020-10-14 20:25:29

నూతన పారిశ్రామిక వేత్తలకు అశకాశం..

విజ‌య‌న‌గ‌రం ‌జిల్లాలో పరిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చే ఔత్సాహిక పెట్టుబ‌డి దారుల‌కు ఏయే డాక్యు‌మెంట్లు స‌మ‌ర్పించాలో తెలియ‌జేసి, వాటిని స‌మ‌ర్పించేందుకు త‌గిన స‌మ‌యం ఇచ్చి అవి గ‌డువులోగా స‌మ‌ర్పించ‌ని ప‌క్షంలోనే తిర‌స్క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. ప‌రిశ్ర‌మ‌ల కోసం ద‌ర‌ఖాస్తు చేసిన వారికి ఏయే ప‌త్రాలు స‌మ‌ర్పించాలో ముందుగానే సంబంధిత శాఖ‌ల అధికారులు అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్రోత్సాహ‌క‌ర వాతావ‌ర‌ణ ఏర్ప‌ర‌చాలంటే అధికారులంతా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు ప‌ట్ల‌, పెట్టుబ‌డిదారుల ప‌ట్ల సానుకూల వైఖ‌రి క‌లిగి వుండాల‌ని సూచించారు. జిల్లా ప‌రిశ్ర‌మ‌ల ప్రోత్సాహ‌క మండ‌లి స‌మావేశం క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌య ఆడిటోరియంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ కోట ప్ర‌సాద‌రావు మాట్లాడుతూ దీనిని ప‌రిశ్ర‌మ‌లు, ఎగుమ‌తుల ప్రోత్సాహ‌క మండ‌లి స‌మావేశంగా మార్పు చేసిన‌ట్లు ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసిన‌ట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఏక‌గ‌వాక్ష విధానంలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు వ‌చ్చిన 192 ద‌ర‌ఖాస్తుల్లో 172 ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆమోదం ఇవ్వ‌డం జ‌రిగింద‌ని, 15 ద‌ర‌ఖాస్తులు వివిధ శాఖ‌ల వ‌ద్ద పెండింగులో ఉన్నాయ‌ని, మ‌రో ఐదు ద‌ర‌ఖాస్తుల‌ను ప‌లు శాఖ‌లు తిర‌స్క‌రించాయ‌ని జి.ఎం. వివ‌రించారు.  దీనిపై జిల్లా క‌లెక్ట‌ర్ సమీక్షిస్తూ ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో వుంచిన వి.ఎం.ఆర్‌.డి.ఏ., కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి, తూనిక‌లు, కొల‌త‌ల శాఖ‌ల నుండి వివ‌ర‌ణ కోరారు. ఏయే కార‌ణాల వ‌ల్ల ద‌ర‌ఖాస్తుల‌ను తిర‌స్క‌రించార‌న్న అంశాన్ని తెలుసుకున్నారు. 78 పారిశ్రామిక సంస్థ‌ల నుండి రాయితీలు మంజూరుకోసం ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌న్నఅంశాన్ని ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం జి.ఎం. వివ‌రించ‌గా అర్హ‌త ఉన్న సంస్థ‌ల‌న్నింటికీ మంజూరు చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకొన్న ప‌లువురు ఔత్సాహికుల‌తో క‌లెక్ట‌ర్ ఫోనులో మాట్లాడించి ఏ కార‌ణంతో వారు పూర్తిస్థాయిలో ద‌ర‌ఖాస్తులు అంద‌జేయ‌లేక‌పోయారో తెలుసుకున్నారు. స‌మ‌గ్ర పారిశ్రామిక స‌ర్వే నిర్వ‌హ‌ణ‌కు మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ల స‌హ‌కారం తీసుకోవాల‌ని ప‌రిశ్ర‌మ‌ల శాఖ అధికారుల‌ను ఆదేశించారు. జాయింట్ క‌లెక్ట‌ర్(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స‌ర్వే నిర్వ‌హించాల‌ని సూచించారు. పారిశ్రామిక భ‌ద్ర‌త, ప్ర‌మాణాల‌ విష‌యంలో ఎలాంటి రాజీ వుండ‌రాద‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టంచేశారు. జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న రాయితీల మంజూరుపై కూడా క‌లెక్ట‌ర్ స‌మీక్షించారు.  పారిశ్రామిక భ‌ద్ర‌త‌పై ఆయా ప‌రిశ్ర‌మ‌ల త‌నిఖీకి జిల్లా క‌లెక్ట‌ర్ ఏర్పాటు చేసిన ఉన్న‌త‌స్థాయి క‌మిటీ జిల్లాలోని 45 భ‌ద్ర‌తాప‌రంగా ప్రమాద‌క‌ర‌ ప‌రిశ్ర‌మ‌ల‌ను త‌నిఖీ చేసింద‌ని ప‌రిశ్ర‌మ‌ల కేంద్రం జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ వివ‌రించారు. వీటిలో 12 ప‌రిశ్ర‌మలు త‌మ సంస్థ‌ల్లో పాటిస్తున్న భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌పై నివేదిక‌లు అంద‌జేశాయ‌న్నారు. ఈ స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు, ఆర్‌.డి.ఓ. భ‌వానీ శంక‌ర్‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ అధికారులు పాపారావు, ర‌మ‌ణ‌, వివిధ శాఖ‌ల ప్ర‌భుత్వ అధికారులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-10-14 19:47:34

సకాలంలో సరుకులు అందించాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో రేష‌న్‌కార్డు దారుల‌కు సకాలంలో నిత్యావ‌స‌ర స‌రుకులు స‌ర‌ఫ‌రా చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డా.జి.సి.కిషోర్ కుమార్ పౌర‌స‌ర‌ఫ‌రాల అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. న‌గ‌రంలోని దాస‌న్న‌పేట రింగురోడ్డు ప్రాంతంలో ఉన్న పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ నిత్యావ‌స‌రాల గిడ్డంగి(మండ‌ల్ లెవ‌ల్ స్టాకు పాయింట్‌-1) ను జె.సి. బుధ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. గిడ్డంగిలో రేష‌న్‌కార్డుల ద్వారా స‌ర‌ఫ‌రా కోసం ఉద్దేశించి నిల్వ చేసిన కందిప‌ప్పు, శ‌న‌గ‌లు, పంచ‌దార, బియ్యం త‌దిత‌ర నిల్వ‌ల‌ను ప‌రిశీలించారు. రికార్డుల్లో పేర్కొన్న మేర‌కు నిల్వ‌లు ఉన్న‌దీ లేనిదీ తనిఖీ చేశారు. ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ యోజ‌న‌, రాష్ట్ర ప్ర‌జాపంపిణీ ప‌థ‌కంలో రేష‌న్‌కార్డుల‌పై స‌ర‌ఫ‌రా చేయాల్సిన స‌రుకులు కేటాయించిన మేర‌కు ఆయా రేష‌న్ డిపోల‌కు సకాలంలో చేరుతున్న‌దీ లేనిదీ  తెలుసుకున్నారు. జాయింట్ క‌లెక్ట‌ర్‌కు గిడ్డంగిలో నిల్వ ఉన్న నిత్యావ‌స‌రాల‌పై పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ స‌హాయ మేనేజ‌ర్ (టెక్నిక‌ల్) మీనాకుమారి, ఎం.ఎల్‌.ఎస్‌.పాయింట్‌-1 ఇన్‌చార్జి శ్రీ‌నివాస‌రావు త‌దిత‌రులు వివ‌రించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో అకౌంట్స్ ఏ.ఎం. రాజు కూడా ఉన్నారు.

Dasannapeta

2020-10-14 19:42:00

ఆద‌ర్శంగా ఎస్‌.బి.ఐ.విజ‌య‌వ‌నం..

విజ‌య‌న‌గ‌రం, సిటీలోని ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, సంస్థ‌ల్లో ప‌చ్చ‌ద‌నం పెంచేందుకు కంటోన్మెంట్ లోని ఎస్‌.బి.ఐ. ప్రాంతీయ బిజినెస్ ఆఫీసులోని  విజ‌య‌వ‌నం పార్కును ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. ఇక్క‌డి ఎస్‌బిఐ విజ‌య‌వ‌నం పార్కును క‌లెక్ట‌ర్ బుధ‌వారం ఉద‌యం సంద‌ర్శించి కోనాకార్ప‌స్ మొక్క‌లు నాటారు. జిల్లా క‌లెక్ట‌ర్ తో పాటు భార‌తీయ స్టేట్ బ్యాంకు అధికారులు, న‌గ‌రానికి చెందిన హ‌రిత విజ‌య‌న‌గ‌రం స‌భ్యులంతా క‌ల‌సి బ్రాంచి ఆవ‌ర‌ణ‌లో దాదాపు 88 మొక్క‌లు నాటారు. మొక్క‌లు నాట‌డంతోపాటు వాటిని పెంచేందుకు, ఆవ‌ర‌ణ‌ను అందంగా, ఆహ్లాద‌క‌రంగా తీర్చిదిద్ద‌డంలో కృషిచేసిన‌ బ్యాంకు అధికారుల‌ను క‌లెక్ట‌ర్ అభినందించారు. విజ‌య‌న‌గ‌రం చ‌రిత్ర‌, సంస్కృతిని తెలిపే విధంగా ఇక్క‌డి పార్కులో ఏర్పాటుచేసిన చిత్రాల‌ను క‌లెక్ట‌ర్ ప‌రిశీలించి క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో కూడా ఇదే త‌ర‌హాలో జిల్లా చారిత్ర‌క ప్రాధాన్య‌త‌ను చాటిచెప్పే చిత్రాల ఏర్పాటులో స‌హ‌క‌రించాల‌ని బ్యాంకు అధికారుల‌ను కోరారు. గ‌త ఏడాది ఇదే క్యాంప‌స్‌ను సంద‌ర్శించిన నాడు ఉన్న ప‌రిస్థితికి నేటి ప‌రిస్థితికి ఎంతో తేడా వుంద‌ని పేర్కొంటూ ఆరోజు నాటిన మొక్క‌ల‌న్నీ చెట్లుగా రూపొంద‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తంచేశారు. జిల్లా క‌లెక్ట‌ర్ తో పాటు ఎస్‌.బి.ఐ. ప్రాంతీయ మేనేజ‌ర్ రామ్మోహ‌న‌రావు, చీఫ్ మేనేజ‌ర్ మూర్తి, దొర‌, గుప్తా, మ‌ల్లికార్జున‌, హ‌రిత విజ‌య‌న‌గ‌రం బృందంలోని పోలీసు శిక్ష‌ణ క‌ళాశాల వైస్ ప్రిన్సిపాల్ మెహెర్‌బాబా, సామాజిక అట‌వీ అధికారి జాన‌కిరాం, కోఆర్డినేట‌ర్ రామ్మోహ‌న్‌, డా.వెంక‌టేశ్వ‌ర‌రావు, మునిసిప‌ల్ ఇంజ‌నీర్ దిలీప్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఎస్బీఐ వనం

2020-10-14 19:38:35

గ్రామాల్లో చెత్త నుంచి సంపదపై ద్రుష్టిపెట్టాలి..

గ్రామాల్లో చెత్త సేకరణతో కంపోస్టు తయారీ పై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త అన్నారు అధికారులను ఆదేశించారు.  . బుధవారం సాయంత్రం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఇ.ఓ.పి.ఆర్.డి.లతో, సెక్రటరీలతో   జెసి (డి) వీరబ్రహం తో కలసి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికీ కొన్నిచోట్ల చెత్త నుండి సంపద సేకరణ  షెడ్ల నిర్వహణ జరగ లేదని వారం లోపు అన్ని షెడ్లు నిర్వహణ జరగాలని తరచూ పర్యటనలు చేపడతామని , అలాగే కోవిడ్ కాంటాక్ట్ ట్రెసింగ్ ల పై కూడా ఆలస్యంలేకుండా గుర్తించాలని జిల్లాలో 1330 మంది అన్ని గ్రేడ్ల సెక్రటరీలు వున్నారని ఇంతమంది వున్నా ఎస్.డబ్ల్యూ.పి.సి.షెడ్ల నిర్వహణ పూర్తి స్థాయిలోకి తీసుకురావడం లేదని మరో వారంలోపు ఎక్కడా ఖాళీ షెడ్లు కనిపించరాదని , అలా లేకుంటే చర్యలు తప్పవని అన్నారు. ఇప్పటికే కొన్ని మడలాలలో కంపోస్ట్ అమ్మకాలు జరిపి ఆదాయాన్ని తెస్తున్నారని అన్నారు. ఇ ఒ పి ఆర్ డి లు కోవిడ్ కాంటాక్ట్ , లక్షణాలు వున్న వారి గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారని గతమాసంలో బాగా నిర్వహించారని మరణాల రేటు తగ్గిందని అన్నారు. ప్రైమరీ కాంటాక్ట్ వారి నుండి కనీసం సెకండరీ 10 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పంచాయితీల్లో హౌస్ టాక్స్ కలెక్షన్స్ పై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో తిరుపతి నుండి డి.ఎల్.పి.ఓ.లు రూపారాణి, రూపేంద్రనాధ్ రెడ్డి పాల్గొనగా , చిత్తూరు జిల్లా కేంద్రం నుండి జిల్లా పరిషత్ సి ఇ ఓ ప్రభాకర రెడ్డి, మనం మన పరిశుభ్రత జిల్లా కోయార్ది నేటర్  షణ్ముగ రామ్ , మండల కేంద్రాల నుండి ఇ.ఓ.పి.ఆర్.డి.లు, పంచాయితీ సెక్రటరీలు పాల్గొన్నారు. 

కలెక్టరేట్

2020-10-14 19:36:49

రుణాల ప్రక్రియ సత్వరం పూర్తికావాలి..

పేదల ఆర్థిక పరిస్తితి మెరుగు కోసం జగనన్నతోడు రూ.10వేలు రుణ మంజూరు పథకాన్ని ముఖ్యమంత్రి ఈ నెల 28 న ప్రారంభించనున్నారని జిల్లాలో ఇప్పటి వరకు 32 వేల  ధరఖాస్తులు అందాయని బ్యాంకర్లు టార్గెట్ తో పనిలేకుండా మంజూరు చేయాలని ఎస్.ఎల్.బి.సి.కూడా నిర్ణయించిందని ఆలస్యంలేకుండా అర్హతగల వారికి మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్  డా.ఎన్.భరత్ గుప్త బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బ్యాంకర్లతో జెసి (డి) వీరబ్రహం , ఇంచార్జ్ జెసి (ఆసరా) రాజశేఖర్ లతో కలసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే బ్యాంకర్లకు జగనన్నతోడు ధరఖాస్తులు అందినా మంజూరులో ఆలస్య చేయడం సమాజసం కాదని , కరోనా పరిస్థితులు, మానవతా దృక్పధం ఆలోచించి మంజూరు  చేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసున్న పథకమని,  ఈ రుణం కేవలం బిపిఎల్ కుటుంబాలకనే విషయం గుర్తించాలని  అన్నారు. జిల్లాలో  ఈ నెల 20 నాటికి 35 వేల మంది వరకు అర్హత వచ్చే అవకాశంవుందని, ఋణ మంజూరు విషయంలో  బ్యాంకులకు టార్గెట్ తో పని లేదని ఎన్ని వచ్చినా మంజూరు చేయవచ్చవని సూచించారు. బ్యాంకింగ్ రంగం దేశ ఆర్థిక వ్యవస్థ మార్చగలిగే శక్తి వుందని గ్రహించాలని అన్నారు. వీధి వ్యాపారస్తుల కోసం పి.ఎం. స్వానిధి గరిష్టంగా రూ. 10000/-వరకు రుణం మంజూరుపై దృష్టి సారించాలని అన్నారు. బ్యాంక్  సిబ్బంది తక్కువ వున్న చోట సచివాల డిజిటల్ అసిస్టెంట్స్ ను డాటా ఎంట్రీకి ఉపయోగించుకుని ఈ నెల 20 నాటికి మంజూరు పూర్తి చేయాలని అన్నారు.  ఈ సమీక్షలో  పిడీలు మెప్మా జ్యోతి, డిఆర్ డి ఎ తులసి ,ఎల్.డి.ఎం. గణపతి, ఇండియన్ బ్యాంక్ ఎజిఎమ్ శ్రీనివాస్ , ఎస్.బి.ఐ., ఐ ఓ బి , ఆంధ్రా బ్యాంక్ , కెనరా బ్యాంక్ , సప్తగిరి గ్రామీణ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. 

కలెక్టరేట్

2020-10-14 19:32:30

ఎల్సీడీ సర్వే 14రోజుల్లో పూర్తి..

జాతీయ కుష్టు నివారణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 1 నుండి 14 వరకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ఇంటింటి సర్వే చేపట్టామని జిల్లాలో 1400 మంది అనుమానితులను గుర్తించించడం జరిగిందని సహాయ డి  ఎం అండ్ హెచ్ ఓ డా.అరుణ సులోచనాదేవి తెలిపారు. జాతీయ కుష్టు   వ్యాధి నిర్మూలన కార్యక్రమం  ముగింపు సమావేశం బుధవారం స్థానిక  పూర్ హోమ్ వద్ద గల  లేప్రసీ కాలనీ లో ఘనంగా నిర్వహించి ఐ ఎం ఏ ప్రతినిధుల సాయం తో లెప్రసీ కాలనీ వాసులకు మెడికల్ కిట్లు,  సానిటైజర్లు  పంపిణీ చేశారు.  డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో జరిగిన కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఇంటింటి సర్వే పూర్తి అయిందని, ఉన్నతాధికారులు   ప్రసంశించారని తెలిపారు. ఇప్పుడు గుర్తించిన 1400  మంది అనుమానితులు మాత్రమేనని , మరో 15 రోజుల్లో వీరికి పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తామని, ఇందులో చర్మ వ్యాధులు  కూడా ఉండవచ్చని తెలిపారు. పూర్తి పరీక్షల నిర్వాహణతో కుష్టు నిర్థారణ అవుతుందని ఇందులో అలాంటి కేసులు బయట పడితే  త్వరగా చికిత్స అందించి అంగవైకల్యం నివారణ చేయవచ్చని తెలిపారు. ఇందులో బాగస్వాములు అయిన వైద్య సిబ్బంది, ఎం పి డి ఓ లకు ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఐ ఎం ఏ ప్రతినిధులు కృష్ణ ప్రశాంతి , డా.అర్చన శర్మ, డా.రవిబాబు, డా. శ్రీహరి, డా. యుగంధర్  తదితరులు పాల్గొన్నారు.  

Tirupati

2020-10-14 19:30:58

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ లు

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనంతపురం కలెక్టరేట్ లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బంది కలిగినా ప్రాణహాని జరిగినా.. ఆపదలో ఉన్నా , ఏ సమస్య వచ్చినా వెంటనే కంట్రోల్ రూమ్ లోని 08554 - 220009, 8500292992 అనే నెంబర్లకు కాల్ చేయవచ్చన్నారు. ఫోన్ చేసిన వెంటనే స్పందించి డిజాస్టర్ రెస్పాన్స్ టీం ను సంబంధిత ప్రాంతానికి పంపి రక్షణ చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో     ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు, విద్యుత్ తీగల కింద, విద్యుత్ స్తంభాల పక్కన ఉండకుండా దూరంగా ఉండాలన్నారు. వర్షం పడే సమయంలో చెట్లపై పిడుగు పడే అవకాశాలు ఉన్నందున చెట్ల కింద ఉండరాదన్నారు. అలాగే పశువులు ఆరుబయట తిరిగేటపుడు కూడా  సురక్షితంగా వుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండేలా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. 

కలెక్టరేట్

2020-10-14 19:27:19

త్వరలోనే సాధారణ వైద్యసేవలు..

అనంతపురం జిల్లాలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి , ఆర్డీటీ ఆస్పత్రులలో  నాన్ కోవిడ్ కేసులకు వైద్య సేవలందించేందుకు దశలవారీగా చర్యలు తీసుకుంటున్నామని  జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలియజేశారు. బుధవారం కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇంతకుముందు కోవిడ్ 19 నేపథ్యంలో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రులను పూర్తి స్థాయిలో కోవిడ్ ఆస్పత్రులుగా మార్చడం జరిగిందన్నారు.  ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గిన నేపథ్యంలో  ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఆర్డీటీ ఆస్పత్రులలో నాన్ కోవిడ్ కేసులకు  వైద్య సేవలందించేందుకు దశల వారీగా   చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల పరిధిలో కేసుల వివరాలు స్టడీ చేసి, పరిస్థితులను బట్టి సాధారణ వైద్యసేవలు అందుబాటులోకి తెస్తామన్నారు.

కలెక్టరేట్

2020-10-14 19:25:49

ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు..

ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు.   బుధవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృధ్ధి సలహా సంఘం తొలి  సమావేశం చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆధ్వర్యంలో జరిగింది.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ, కరోనా నేపధ్యంలో వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ తో సహా ప్రతీ ఒక్కరూ మంచి సేవలందించారని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగిందని, ఇది అభినందనీయమని అన్నారు.  ఇదే స్ఫూర్తితో నాన్-కోవిడ్ పేషెంట్లకూ వైద్యం అందించాలని తెలిపారు. నిరుపేదలతో పాటు మధ్యతరగతి ప్రజలు సైతం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలకు రావాలన్నారు.   అనంతరం కో-చైర్మన్, శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అట్టడుగు వర్గాల ప్రజలపై ప్రత్యేక శ్రధ్ధ వహిస్తున్నారని తెలిపారు.  మన జిల్లాలో మన కలెక్టర్ జె.నివాస్ కోవిడ్ సమయంలో అత్యంత శ్రధ్ధతో పని చేసి విజయవంతంగా కోవిడ్ ను ఎదుర్కోవడం  అభినందనీయమన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి సేవలను అందించడం జరుగుతున్నదని, ఆసుపత్రిని మరింతగా అభవృధ్ధి పరచవలసిన ఆవశ్యకత వుందన్నారు. ఇందుకు  ఆసుపత్రి అభివృధ్ధి కమిటీ తగు సూచనలు, సలహాలను అందించడం జరుగుతుందని తెలిపారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్యులు, మంచి సౌకర్యాలు, చక్కటి ఎక్విప్ మెంటు వుంటాయని తెలిపారు.  ప్రైవేటు ఆసుపత్రుల కంటె ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం సురక్షితమని, జిల్లావాసులు  ప్రభుత్వ ఆసుపత్రులను వుపయోగించుకోవాలని కోరారు. డెలివరీలతో పాటు ఆసుపత్రిలో లేప్రోస్కోప్, ఆర్థో, ఇ.ఎన్.టి, ఎండోస్కోప్,  గైనిక్ కు సంబంధించిన అనేక సర్జరీలను విజయవంతంగా నిర్వహించడం జరుగుతున్నదని ప్రజలు సద్వినియోగ పరచుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో  హెల్ప్ డెస్క్ ద్వారా  పేషెంట్లను గైడ్ చేయాలన్నారు.          ఎం.వి.పద్మావతి మాట్లాడుతూ  జిల్లా నలుమూలల నుండి నిరుపేద ప్రజానీకం వైద్య సేవలకోసం ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతుందని, వారికి ఏ, ఏ విభాగాలలో ఏ ఏ సేవలు అందుతాయి వంటి వివరాలు తెలపడానికి సిబ్బందిని అందుబాటులో వుంచాలన్నారు. పారిశుధ్ధ్యంపై ప్రత్యేక శ్రధ్ధ వహించాలని, ఆసుపత్రిని పరిశుభ్రంగా నిర్వహించాలని తెలిపారు. ఆసుపత్రి నిధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఆసుపత్రికి ప్రత్యేక నీటి సదుపాయాన్ని కలుగచేయాలని, ఇందుకు సంబంధించి రెండు ట్యాంకులు ఏర్పాటు చేయాలని తెలిపారు. కెప్టెన్ జగదీష్ మాట్లాడుతూ ఆసుపత్రికి పేషెంట్లతో పాటు వచ్చిన వారికి ఎకామడేషన్ సదుపాయం కలుగచేయాలన్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన  సేఫ్టీ, సెక్యూరిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని, పాము కాటు మందులు (ఎంటీ వీనమ్ డోస్ లు ) అందుబాటులో వుంచాలని సూచించారు.  లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను ప్రజలకు విస్తృతంగా తెలియచేయాలన్నారు.  సానిటేషన్ పై పర్యవేక్షణ చేసి, మంచి వాతావరణాన్ని కలుగచేయాలన్నారు. పేషెంట్లతో మంచి స్నేహపూర్వకంగా మెలగాలని, అవసరమైన వారికి ట్రైసైకిళ్ళను ఇవ్వాలని, తాను ఒత ట్రైసైకిల్ ను డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించారు.  ఈ సమావేశంలో సభ్యులు వి.విజయ కుమార్, ఎల్.హేమ సుందర రావు, మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డా.ఎ.కృష్ణవేణి, రిమ్స్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, ఎ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి. ఇ.ఇ. బి.ఎన్.ప్రసాద్, డి.సి.హెచ్.ఎస్. బి.సూర్యారావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.కె.సి.నాయక్, డా.అరవింద్,   ఎం,హెచ్.ఓ. వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-10-14 19:13:55

నిలకడగా బహుదా నీటిమట్టం..

శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు, వరదల వలన అపాయకర పరిస్ధితి లేదని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ వంశధారలో 40 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నందున మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసామన్నారు. నాగావళి నదిలో 40 వేల క్యూసెక్కులు, మడ్డువలస రిజర్వాయర్ నుండి 23 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని అన్నారు. వీటి పరిధిలో ఎక్కడా నీరు నిలిచిన పరిస్థితి లేదన్నారు. బహుదా నదిలో 28 వేల క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తోందని, 40 వేల క్యూసెక్కుల నీరు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామన్నారు. 55 వేల క్యూసెక్కుల నీరు వస్తే హైవైపై  రాకపోకలకు అంతరాయం కలగవచ్చని చెప్పారు.  దీనిపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని ఆయన వివరించారు. ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో 19 వందల హెక్టార్లలో పంట నీట మునిగిందని, అయితే వరద నీరు తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో నీరు తగ్గిన తరువాత నష్టం పరిస్ధితి తెలుస్తుందని చెప్పారు. వంద ఎకరాల్లో ఉద్యానవన పంటలు కొంత నష్టపోయినట్లు తెలుస్తుందని, 18 ఇళ్ళు, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి రహదారులు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. వీటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. మెలియాపుట్టి మండలం గోకర్ణపురంకు చెందిన ఎవ్వారి శ్రీనివాసరావు వరద కారణంగా మరణించారని ఆయన తెలిపారు.

కలెక్టరేట్

2020-10-14 15:05:49