1
పదోతరగతి పరీక్షల్లో విజయనగరం జిల్లా విద్యార్థులు చరిత్ర సృష్టించారు. దాదాపు 62 శాతం మంది ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణులై రికార్డు తిరగరాశారు. ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ సత్తా చాటారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల విద్యార్థులు అద్వితీయ విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది విజయనగరం జిల్లాను రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలబెట్టడమే కాకుండా, వ్యక్తిగతంగా కూడా ఉత్తీర్ణతలో గతం కంటే మెరుగైన ఫలితాలను సొంతం చేసుకున్నారు. విజయనగరం అయ్యప్పనగర్‌లోని ఆదర్శపాఠశాల విద్యార్థి 590 మార్కులను సాధించి చరిత్ర సృష్టించారు. గణనీయమైన ఫలితాలను సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి, జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ జయశ్రీ అభినందనలు తెలిపారు.
ఎపిటిడబ్ల్యూఆర్ఇఐ సొసైటీ పాఠశాలలనుంచి మొత్తం 423 మంది పరీక్షలకు హాజరు కాగా, 95.74శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు శతశాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 93.75శాతం ఉత్తీర్ణులయ్యారు. ఎపిఆర్ఇఐ సొసైటీ పాఠశాలల నుంచి 663 మంది పరీక్షలకు హాజరు కాగా, 93.06 శాతం, ఎపి మోడల్ స్కూల్స్ నుంచి 1448 మంది పరీక్షలకు హాజరుకాగా, 92.75శాతం, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల నుంచి 6152 మంది పరీక్షలు రాయగా, 86.25 శాతం, కెజిబివిలనుంచి1295 మంది బాలికలు పరీక్షలు రాయగా, 83.01శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎంపిపి, జెడ్‌పిహెచ్ఎస్ పాఠశాలల నుంచి14,570 మంది పరీక్షలకు హాజరు కాగా, 71.45 శాతం, ఎపిఎస్‌డబ్ల్యూఆర్ఇఐ సొసైటీ పాఠశాలలనుంచి 755 మంది పరీక్షలకు హాజరు కాగా, 70.20 శాతం, మున్సిపల్ పాఠశాలల నుంచి 1257 మందికి గాను, 59.82 శాతం, రాష్ట్రప్రభుత్వ పాఠశాలల నుంచి 806 మందికి గానూ, 53.10 శాతం, ప్రయివేటు ఎయిడెడ్ పాఠశాలల నుంచి 287 మందికి గానూ, 49.83 శాతం, ప్రయివేటు పాఠశాలల నుంచి 6152 మందికి విద్యార్థులకు గానూ, 90.72శాతం ఉత్తీర్ణతను సాధించారు. జిల్లా మొత్తం మీద 524 పాఠశాలల నుంచి మొత్తం 29,365 మంది పదోతరగతి పరీక్షలు రాయగా, 77.50 శాతం ఉత్తీర్ణతతో 22,758 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో 18,158 మంది ప్రధమశ్రేణిలో(61.84 శాతం), 3,429 మంది ద్వితీయ శ్రేణిలో(11.68), 1171 మంది తృతీయ శ్రేణిలో (3.98శాతం) ఉత్తీర్ణులు కావడం విశేషం.
వివిధ ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల పరంగా చూస్తే, 576 కంటే ఎక్కువ మార్కులను 84 మంది, 551-575 మధ్య మార్కులను సాధించినది 447 మంది, 526-550 మధ్య మార్కులను సాధించినవారిలో 894 మంది, 500-525 మధ్య 1352 మంది విద్యార్థులు ఉండటం, పదోతరగతి ఫలితాల్లో గణనీయమైన పురోగతిగా చెప్పవచ్చు. 500కు పైబడి మార్కులను సాధించినవారిలో బాలురు కంటే బాలికలు రెట్టింపు ఉండటం విశేషం.
కెజిబివిల్లో రాష్ట్రంలోనే ప్రథమం
కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయాలు గత రికార్డును తిరగరాశాయి. మొత్తం 1296 మంది పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 83.18శాతంతో 1078 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలిచింది. అలాగే అత్యధిక మార్కులను సాధించిన విద్యార్థి కూడా మన జిల్లాకు చెందిన వారు కావడం గర్వకారణం. ఎల్‌కోట కెజిబివి విద్యార్థిని 580 మార్కులను సాధించింది. అదేవిధంగా 500-550 మధ్య మార్కులను 149 మంది సాధించారు. గజపతినగరం, గుమ్మలక్ష్మీపురం కెజిబివిలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశాలకు అనుగుణంగా, సూపర్ 60 పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి, అత్యుత్తమ ఫలితాలను సాధించారు. గణనీయ విజయాలను సొంతం చేసుకున్న కెజిబివి విద్యార్ధిణులను జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, సమగ్ర శిక్ష అదనపు పథక సంచాలకులు డాక్టర్ వి అప్పలస్వామినాయుడు అభినందించారు.