1
క్షేత్రస్థాయిలో రెవెన్యూ డివిజన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తాహాసిల్దార్లు, ఎంపీడీవో లు పర్యటించి ఇంటి నిర్మాణాలు పనులను వేగవంతం చేయాలని ఈ విషయంలో మరో మాటకు తావులేదని జిల్లా కలెక్టర్ కె. మాధవిలత స్పష్టం చేశారు. మంగళవారం క్షేత్రస్థాయి అధికారులతో ఓటిఎస్ , ఇళ్ల నిర్మాణాలు పై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత సమీక్షిస్తూ మండలాల్లో ఇళ్ల నిర్మాణాల వారం వారం లక్ష్యాలను వేగవంతం చేయాలన్నారు. తాసిల్దార్ లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వం ఇంటి నిర్మాణాలకు ఇస్తున్న ప్రాధాన్యతను చెప్పాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి , ప్రతి గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంటి నిర్మాణాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డివిజన్స్ అధికారులు వారి పరిధిలో గల ప్రతి మండలం లోని లేఅవుట్లలో తరచుగా తనిఖీలు చేపట్టాలన్నారు. కొవ్వూరు అర్బన్ ప్రాంతంలోని లేఅవుట్ ను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆర్డీవో మల్లిబాబు ను ఆదేశించారు. నిడదవోలు మునిసిపాలిటీ పరిధిలో 990 పైగా ఇల్లు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా 58పనులు ప్రారంభం అయి, మిగిలినవి కాకపోవడంపై ప్రశ్నించారు. మునిసిపల్ వార్డు సచివాలయం పరిధిలో కనీసం వారానికి 10 ఇల్లు ప్రారంభించాలని ఇందుకు సిబ్బందికి లక్ష్యాలను విధించాలన్నారు.
ప్రతి వారం 30 ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని సచివాలయం పరిధిలో 5 ఇళ్లు ప్రారంభించేలాగా తాహాసిల్దార్ లు, ఎంపీడీవోలు హౌసింగ్ అధికారులతో సమన్వయం చేస్తూ పని చేయాలన్నారు. జగనన్న లేఅవుట్లలో ఇంటి నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంట్, స్టీలు అందుబాటులో ఉంచుతున్నందున పనులు వేగవంతం చేయాలన్నారు. డిఆర్డిఎ, మెప్మా స్వయం సహాయక మహిళలకు ప్రభుత్వం అందించే రూ.15 వేలకు అదనంగా మరో రూ.35 రుణాన్ని మంజూరు చేసి, ఇంటిని నిర్మించేందుకు ముందస్తు చేయూత ను ఇస్తున్నామని, ఆ మొత్తంతో ఎటువంటి జాప్యం లేకుండా ఇళ్ల నిర్మాణ పనులు చేపట్ట గలుగుతామన్నారు. జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ, లబ్ధిదారులకు ఓటీఏస్ ద్వారా చేకూరే ప్రయోజనాలు వివరించి లక్ష్యాలను సాధించాలన్నారు. అదే విధంగా ఎంపిడివోలు, తహశీల్దార్లు, హౌసింగ్ ఆధికారులు సమన్వయం తో పనిచేస్తు లాక్ష్యాలను అధిగమించాలన్నారు. టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్,నగరపాలక సంస్థ కమీషనర్ కె. దినేష్ కుమార్, రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీఓ లు ఏ.చైత్రవర్షిని, ఎస్.మల్లిబబాబు, తాహసిల్దార్లు, ఎంపిడీవోలు తదితరులు. పాల్గొన్నారు.
గడపగడపకు సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ పీడిక రాజన్నదొర అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సాలూరు నియోజక వర్గం పాచిపెంట మండలం కందిరి వలస గ్రామంలో ఉప ముఖ్యమంత్రి గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అందుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. సమస్యలను కనుక్కున్నారు. ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందనీ, పేదల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు ఆదుకుంటుందని, పేదలందరికీ ఇల్లు అందించాలనే సంకల్పంతో రాష్ట్రంలో 25 లక్షల ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ గృహాలను నిర్మించుకోవాలని, సొంత ఇంటికి యజమాని కావాలని ఆయన కోరారు. ప్రతి ఇల్లు కనీసం రూ.15 లక్షలు విలువ చేస్తుందని ఆయన పేర్కొంటూ జగన్ ప్రభుత్వం పేదల పక్షపాతిగా ఉందని అన్నారు. మహిళలకు చేయూత, సున్నా వడ్డీ తదితర కార్యక్రమాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని, పిల్లలకు బాల అమృతం వంటి కార్యక్రమాలను అందిస్తూ పౌష్టికాహారానికి పెద్దపీట వేస్తుందని అన్నారు.
గర్భంలో ఉన్నప్పటి నుండే ఆరోగ్యంగా ఉండాలని సంకల్పంతో అనేక కార్యక్రమాలను అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పేదలు విద్యకు దూరం కాకూడదు అని అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలను ప్రవేశ పెట్టి ఎంత మంది పిల్లలు ఉన్న వారందరికీ ఈ కార్యక్రమాలను అందించడం జరుగుతుందని అన్నారు. ఉన్నత చదువులు చదివే వారికి విద్యా దీవెన క్రింద పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు వసతి కొరకు ఏడాదికి 20 వేల రూపాయల వరకు అందిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జగన్ పరిపాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. రైతు భరోసా మొత్తాలను సోమ వారం విడుదల చేసిన సంగతిని గుర్తు చేశారు. లబ్దిదారులతో ముఖాముఖీ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు, అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. కందిరివలసలో ఒక వ్యక్తి రూ.2.41 లక్షలు విద్యా దీవెన క్రింద అందిందని, తన కుమారుడిని బి.టెక్ చదిస్తున్నానని చెప్పడంతో ఉప ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేస్తూ పేదలకు మేలు చేయుటకు జగన్ మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని చెప్పారు.