పరిశ్రమలను స్థాపించేందుకు మహిళలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకు మారి పిలుపునిచ్చారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రస్తుతం ప్రభుత్వం ఎన్నో అవకాశాలను కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విటి అగ్రహారం టిటిడిసిలో జిల్లా సమాఖ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించేందుకు, వివిధ శాఖల సమన్వయంతో కన్వర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు. కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడంతోపాటు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలను కూడా అభివృద్ది చేసుకోవచ్చని సూచించారు. ఫలితాన్ని సాధించేవరకూ ప్రయత్నం చేయాలని అన్నారు. వివిధ రకాల పంటలను, ఉత్పత్తులను ప్రాసెస్ చేసి, ప్యాకింగ్ చేసి నేరుగా విక్రయించడం, వాటితో పచ్చళ్లు, ఇతర పదార్ధాలను తయారు చేయడం తదితర పరిశ్రమలను ఏర్పాటు చేయవచ్చని సూచించారు. మహిళలు దైర్యంగా ముందడుగు వేసి, ఎదగడానికి ప్రయత్నం చేయాలని కోరారు. అనవసర భయాలను విడనాడాలని, తామే మరికొందరికి ఉపాధిని కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రస్తుతం ప్రతీఒక్కరికి డిజిటల్ ఎడ్యుకేషన్ అవసరమని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనికోసం కేంద్రప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందని, త్వరలో దీనిని జిల్లాలో అమలు చేయనున్నామని చెప్పారు. సచివాలయ స్థాయిలో ఉచితంగా అమలు చేయనున్న ఈ కార్యక్రమానికి, వలంటీర్ల ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారికి సర్టిఫికేట్‌ను కూడా అందజేస్తామని చెప్పారు. అలాగే ప్రతీ మహిళా, ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో డిఆర్‌డిఏ, వైకెపి ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.అశోక్‌కుమార్, ఎపిడి సావిత్రి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సిహెచ్ వెంకటలక్ష్మి, మెప్మా పిడి సుధాకరరావు, ఇండస్ట్రీస్ జిఎం పాపారావు, ఐసిడిఎస్ పిడి శాంతకుమారి, మత్స్యశాఖ డిడి నిర్మలాకుమారి, ఉద్యానశాఖ డిడి శ్రీనివాసరావు, ఎపిఎంఐపి పిడి లక్ష్మీనారాయణ, పశు సంవర్థకశాఖ జెడి డాక్టర్ వైవి రమణ, ఇతర శాఖల అధికారులు, మండల సమాఖ్యల ప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా పిఎంఎఫ్ఎంఇ పథకం గురించి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎపి ఫుడ్‌ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మేనేజర్ మారుతి వివరించారు.