జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం క్రింద చేపట్టిన భూ సర్వే ద్వారా, వివిధ రకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి అన్నారు. చీపురుపల్లి మండలం రావివలస, మెరకముడిదాం మండలం భైరిపురం గ్రామాల్లో ఆమె శుక్రవారం పర్యటించారు. రీ సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఆయా మండలాల్లో ఇప్పటివరకు నిర్వహించిన భూముల రీసర్వే వివరాలను, తాశిల్దార్లు కలెక్టర్‌కు వివరించారు. ఇప్పటివరకు జరిగిన డ్రోన్ సర్వే, రికార్డుల్లో నమోదు తదితర అంశాలపై కలెక్టర్ ప్రశ్నించారు. రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే చేయడమే కాకుండా, ఎప్పటికప్పుడు రికార్డుల్లో వివరాలను నమోదు చేయాలని సూచించారు. రికార్డులు అత్యంత ఖచ్చితంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో చీపురుపల్లి తాశిల్దార్ ఎం.సురేష్, మెరకముడిదాం తాశిల్దార్ బి.రత్నాకర్, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ భవనాలను త్వరగా పూర్తిచేయాలి
గ్రామంలో చేపట్టిన ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. చీపురుపల్లి మండలం రావిలస గ్రామ సచివాలయాన్ని ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సిబ్బంది హాజరును, రికార్డులను తనిఖీ చేశారు. సఖి కార్యక్రమం, వివిధ ప్రభుత్వ పథకాల అమలు, గర్భిణులకు, పిల్లలకు రక్త పరీక్షలు, పోషకాహార పంపిణీ గురించి తెలుసుకున్నారు. సఖి గ్రూపు సభ్యులను మరింత చైతన్యవంతం చేయాలని సూచించారు. గృహనిర్మాణ కార్యక్రమంపై ఆరా తీశారు. ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి, ఉగాది నాటికి గృహ ప్రవేశాలకు సిద్దం చేయాలని సూచించారు. గ్రామంలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాల న్నారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం తదితర ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.